Chakri
-
చక్రి అన్న మరణంపై ఇప్పటికీ అనుమానం.. పోస్ట్‌మార్టమ్ చేయనివ్వలేదు
సంగీతమే ప్రాణంగా బతికిన వ్యక్తి చక్రి. పూరీ జగన్నాధ్ బచ్చి సినిమాతో సంగీత దర్శకుడిగా కెరీర్ ఆరంభించిన ఆయన దాదాపు 85 సినిమాలకు పని చేశారు. సింహా సినిమాకు గానూ నంది అవార్డు అందుకున్నారు. మాస్ మహారాజ రవితేజకు క్లాస్‌తో పాటు మాస్ సంగీతాన్ని అందించారు. రవితేజ చేసిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, ఇడియట్, కృష్ణ, భగీరథ, నేనింతే, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమాలకు చక్రియే సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. శివమణి, దేవదాసు, దేశముదురు, ఢీ వంటి ఎన్నో చిత్రాలు విజయవంతం కావడంలో పాలు పంచుకున్నారు. ఊబకాయ సమస్యతో బాధపడిన చక్రి 2014 డిసెంబర్ 15న నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. చక్రి సోదరుడు మహతి నారాయణ్ సైతం ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా రాణిస్తున్నాడు. తాజాగా ఆయన చక్రి మరణం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. 'మ్యూజిక్ ఫీల్డ్‌లోకి రావద్దనుకున్నాను. కానీ చక్రి అన్నయ్య.. నెక్స్ట్ జెనరేషన్‌కు నా వారసులు ఉండొద్దా? అనేవాడు. తన ఇన్ఫ్లూయెన్స్ నా మీద పడకూడదనేవాడు. చివరకు ఆయన వెళ్లిపోయి నన్ను వారసుడిని చేస్తాడనుకోలేదు. అలాంటి వారసత్వం ఇచ్చినప్పుడు నేను ఎంతో కష్టపడాలి. ఇంకా చాలా సాధించాలి. అన్నయ్య మరణం మా జీవితంలో తీరని లోటు. అమ్మ ఇప్పటికీ ఆ విషాదం నుంచి కోలుకోవడం లేదు. తను పూర్తిగా ఆ బాధతోనే కాలం గడుపుతోంది. ఇంట్లో టీవీ పెట్టాలన్నా భయమేస్తోంది. అన్నయ్య పాటలొస్తే తను ఏడుస్తూనే ఉంటుంది. టీవీ పెట్టకపోతే అన్నయ్య గొంతు వినబడట్లేదు అని బాధపడుతుంది. తను ఇంకెప్పటికీ కోలుకోలేదు. ఒకవైపు మానసిక క్షోభ, మరోవైపు ఆర్థిక కష్టాలతో బతుకు వెళ్లదీస్తున్నాం. అన్నయ్య మరణించిన సమయానికి మేము ఇంట్లో లేము. వదినతో జరిగిన కొన్ని గొడవల వల్ల వేరే ఇంట్లో ఉన్నాం. ఆరోజు రాత్రి అన్నయ్య మా దగ్గరకు వచ్చి తన ఇంటికి వెళ్లిపోయాడు. తెల్లారేసరికి చనిపోయాడన్న వార్త వచ్చింది. కానీ అన్నయ్య మరణంపై నాకిప్పటికీ అనుమానం ఉంది. ఆయనది సహజ మరణమే అయితే పోస్ట్‌మార్టమ్ చేయించడానికి ఎందుకు భయపడ్డారు? రాత్రి మా ఇంటికి వచ్చినప్పుడు అమ్మ విషం పెట్టి చంపింది అని పోలీసులకు ఫిర్యాదు చేశారు.. గుండెల్లో పెట్టుకున్న కొడుకును కన్నతల్లి విషం పెట్టి చంపుతుందా? మా దురదృష్టవశాత్తూ ఆయన ఎలా చనిపోయారని మేము నిరూపించలేకపోయాం. అక్కడ నేను ఫెయిలయ్యాను. ఆయన చనిపోయాక తన స్టూడియో నాకు వచ్చేసిందని ప్రచారం నడిచింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. చెప్పాలంటే ఎవరో కావాలని స్టూడియో బయట సోఫాలు తగలబెట్టి ఆ నేరం నాపై మోపారు. తీరా స్టూడియోకు వెళ్లి చూస్తే అందులో ఉన్న సామాను, అవార్డులంతా ఎత్తుకెళ్లారు. అన్నయ్య గుర్తులు ఏవీ లేకుండా పోయాయి' అని చెప్తూ కంటతడి పెట్టుకున్నాడు. మహిత్ నారాయణ విషయానికి వస్తే.. లవ్యూ బంగారం, నేనో రకం, రామప్ప, పరారీ, రెడ్డిగారి ఇంట్లో రౌడీయిజం వంటి పలు సినిమాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. -
అన్నయ్య భార్య ఆస్తులు అమ్ముకొని వెళ్లిపోయింది: చక్రి సోదరుడు
దివంగత సంగీత దర్శకుడు చక్రి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, సత్యం, శివమణి, దేశముదురు సహా పలు సినిమాలకు సంగీతం అందించి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే 2014లో గుండెపోటుతో కన్నుమూశారు. ఇక చక్రి మరణించిన తర్వాత కుటుంబంలో ఆస్తి పరమైన ఇబ్బందులో తలెత్తి అది మీడియా వరకు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా చక్రి సోదరుడు మహిత్ నారాయణ ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ.. ''చక్రి అన్నయ్య ఉన్నప్పుడు మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ ఆయన చనిపోయాక ఆస్తి గొడవలు వచ్చాయి. ఓవైపు అన్నయ్య లేడనే బాధకి తోడు ఈ గొడవలతో ప్రతిరోజు నరకం అనుభవించాము. అన్నయ్య ఆస్తుల్లో కొన్నింటిని ఆమె భార్య అమ్మేసుకొని అమెరికా వెళ్లిపోయింది. అక్కడే ఇంకో పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అయ్యింది. ఆమెతో మాకెలాంటి సంబంధాలు లేవు. మరికొన్ని ఆస్తులు కోర్టు కేసులో ఉన్నాయి'' అంటూ మహిత్ పేర్కొన్నాడు. తాజాగా ఆయన ‘పరారీ’ అనే సినిమాకు సంగీతం అందించారు. -
అయ్యో పాపం ‘చక్రి’ సోదరుడు.. సదరం కోసం ఎన్ని తిప్పలో..
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి సోదరుడు మాధవరావు అలియాస్ మహిత్ నారాయణ్ సదరం సర్టిఫికెట్ కోసం రెండేళ్లుగా తిప్పలు పడుతున్నాడు. లాక్‌డౌన్‌తో పాత స్లాట్ రద్దు కాగా.. కొత్త స్లాట్ బుక్ కాకపోవడంతో పడరాని పాట్లుపడుతున్నాడు. సర్కారు ఆసుపత్రిలో నిర్వహించే సదరం క్యాంప్‌లతో పాటు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని సోమవారం విలేకరుల ఎదుట గోడు వెళ్లబోసుకున్నాడు. ఇదీ పరిస్థితి.. మహబూబాబాద్ జిల్లా కంభాలపల్లి గ్రామానికి చెందిన జిల్లా మాధవరావు ఉన్నత విద్యాభాసం కోసం నగరానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు. ప్రస్తుతం ఆయన బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్నాడు. పుట్టుకతోనే వైకల్యానికి గురైన ఆయన వీల్‌చైర్‌పై దైనందిన కార్యకలాపాలు పూర్తి చేసుకుంటాడు. అయితే తనసోదరుడి వద్ద నేర్చుకున్న సంగీతంతో కొత్తగా మ్యూజిక్ స్టూడియో పెట్టుకునేందుకు వికలాంగుల కోటా కింద బ్యాంకు రుణం కావాలని కొద్దిరోజుల క్రితం ఆయన నగరంలోని ఓ బ్యాంకును ఆశ్రయించగా, సదరం సర్టిఫికెట్ తప్పని సరిగా ఉండాలని అధికారులు సూచించారు. వివిధ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. సర్టిఫికెట్ కోసం రెండేళ్లుగా ఇబ్బందులు పడుతున్నానని, ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆయన వేడుకుంటున్నారు. చదవండి👉 R Madhavan: నా తండ్రి గుర్తింపుతో బతకాలని లేదు: మాధవన్ కొడుకు వేదాంత్ -
‘మహర్షి’లో బాలనటుడు మనోడే!
జంగారెడ్డిగూడెం: భవిష్యత్తులో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలనేది నా కోరిక అని ‘మహర్షి’ చిత్రంలోని బాల నటుడు చక్రి తెలిపాడు. మహేష్‌బాబు నటించిన ‘మహర్షి’ చిత్రంలో బాల నటుడిగా నటించిన 9 సంవత్సరాల చక్రి గురువారం చిత్రం విడుదల సందర్భంగా స్థానిక లక్ష్మీ థియేటర్‌కు వచ్చాడు. చిత్రం చూసేందుకు వచ్చిన చక్రి కొద్ది సేపు విలేకరులతో ముచ్చటించాడు. తానిప్పటి వరకు 37 చిత్రాల్లో బాల నటుడిగా నటించినట్లు చెప్పాడు. మిర్చి, కృష్ణం వందే జగద్గురుం, ద్వారక, గుంటూరోడు, స్పీడున్నోడు, నేనొక్కడినే, బ్రహ్మోత్సవం, మనం, రోజులు మారాయి వంటి విజయవంతమైన చిత్రాల్లో చక్రి నటించాడు. మహర్షి చిత్రంలో మహేష్‌బాబుతో ఓ సన్నివేశంలో చక్రి మహర్షి చిత్రంలో హీరో మహేష్‌బాబుకు సపోర్ట్‌గా ఉండే బాలనటుడిగా నటించాడు. ఈ చిత్రంలో చక్రి మూగవాని పాత్ర. తాను తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో నిజాం పేట శ్రద్ధ స్కూల్లో 3వ తరగతి చదువుతున్నట్లు చెప్పాడు. తన అన్న విష్ణు చరణ్ 8వ తరగతి చదువుతున్నాడని, తమ్ముడు కృష్ణ చరణ్ యూకేజీ చదువుతున్నట్లు తెలిపాడు. విశేషమేమిటంటే విష్ణు చరణ్, కృష్ణ చరణ్‌లు బాలనటులే. విష్ణుచరణ్ 20 చిత్రాల్లో నటిం చాడని, కృష్ణచరణ్ రెండు చిత్రాల్లో నటించి నట్లు చెప్పాడు. జంగారెడ్డిగూడెంలోని ఉప్పలమెట్టపై తన అత్త, మామయ్యలు లక్ష్మి, ప్రశాంత్‌లు ఉంటున్నారని అక్కడికి వచ్చిన ట్లు తెలిపాడు. తన తండ్రి సతీష్ నాయుడు హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఫొటో స్టూడియో ఏర్పాటు చేసుకుని స్టిల్ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నారని, తన తల్లి ధనశ్రీ గృహిణి అని తెలిపాడు. తన తండ్రి సొంత ఊరు తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేటకాగా, తల్లిది ద్వారకాతిరుమల అని వివరించాడు. -
మైండ్ గేమ్
‘‘ఈ రోజుల్లో సినిమాలు ఒకసారి రిలీజ్ కావడమే కష్టంగా ఉంది. అలాంటిది ‘సూపర్ స్కెచ్’ చిత్రాన్ని రీ–రిలీజ్ చేస్తున్నాం. సినిమాపై మాకు ఉన్న నమ్మకమే ఇందుకు కారణం’’ అన్నారు నటుడు ఇంద్ర. నర్సింగ్, ఇంద్ర, సమీర్ దత్తా, కార్తీక్, చక్రి, మాగంటి ముఖ్య పాత్రల్లో రవి చావలి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సూపర్ స్కెచ్’ సినిమాని ఇవాళ రీ–రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించిన ఇంద్ర మాట్లాడుతూ– ‘‘నేను కరాటే ప్రొఫెషనల్‌ని. వారియర్ కరాటే ఇంటర్న్షనల్ ఫౌండేషన్ ద్వారా కరాటే శిక్షణ ఇస్తున్నాం. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చా. మొదట్లో ఇబ్బందులు పడ్డా. ‘సై, సైనికుడు, ధృవ, శ్రీమన్నారాయణ’ వంటి సినిమాల్లో నటించాను. సోలో హీరోగా ‘పుత్రుడు, కుర్ కురే’ సినిమాలు చేశా. ‘సూపర్ స్కెచ్’ సినిమాలో విలన్‌గా నటించాను. మైండ్ గేమ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఈ సినిమా నటుడిగా పూర్తి సంతృప్తినిచ్చింది. ప్రస్తుతం ‘సైరా’ సినిమాలో ఓ పాత్ర చేస్తున్నా’’ అన్నారు. -
హత్యకు స్కెచ్
‘సామాన్యుడు, శ్రీమన్నారాయణ’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రవి చావలి దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన చిత్రం ‘సూపర్ స్కెచ్’. హత్య నేపథ్యంలో నడిచే ఈ థ్రిల్లర్ స్టోరీలో నర్సింగ్, ఇంద్ర, సమీర్ దత్త, కార్తీక్, చక్రి మాగంటి, అనిక, సుభాంగీ, సోఫియా (లండన్) కీలక పాత్రలు చేశారు. ఎరోస్ సినిమాస్ సమర్పణలో బలరామ్ మక్కల నిర్మించిన ఈ చిత్రం ఎడిటింగ్ జరుపుకుంటోంది. రవి చావలి మాట్లాడుతూ– ‘‘ఒక పోలీసాఫీసర్, ఓ ఫారిన్ అమ్మాయి, నలుగురు క్రిమినల్స్ మధ్య జరిగే కథ ఇది. పోలీసును ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన క్రిమినల్స్ పాత్రల నేపథ్యంలో తెరకెక్కించాం. పోలీస్ అధికారిగా నర్సింగ్ నటన ఈ సినిమాకి హైలైట్. శ్రీహరిగారికి ప్రత్యామ్నాయం అన్నట్టు చేశాడు. ఉత్కంఠభరితంగా సాగేలా టైట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ, బాపట్ల సూర్యలంక బీచ్, వికారాబాద్ ఫారెస్ట్‌లో 50 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశాం. ఫిబ్రవరి నెలాఖరున లేదా మార్చిలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాణం: యూ అండ్ ఐ క్రియేషన్స్, ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమీ, కెమెరా: సురేంద్ర రెడ్డి, సంగీతం: కార్తీక్ కొడకండ్ల. -
సెంటిమెంట్ ఫాలో అవుతున్న గోపిచంద్
మాస్ హీరోగా మంచి ఇమేజ్ సంపాదించుకున్న గోపిచంద్, ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోతున్నాడు. మాస్ యాక్షన్ సినిమాలతో పాటు స్టైలిష్ ఎంటర్టైనర్లు కూడా నిరాశపరచటంతో గోపిచంద్ నెక్ట్స్ సినిమా విషయంలో సెంటిమెంట్ నే నమ్ముకుంటున్నాడు. చక్రి అనే కొత్త దర్శకుడితో ఓ సినిమాకు రెడీ అవుతున్నాడు గోపిచంద్. ఈ సినిమాకు ‘పంతం’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. గతంలో గోపిచంద్ హీరోగా తెరకెక్కిన యజ్ఞం, రణం, లక్ష్యం, లౌఖ్యం, శౌర్యం సినిమాలు మంచి విజయాలు సాధించాయి. అంతేకాదు గోపిచంద్ ప్రతినాయక పాత్రలో నటించిన జయం, వర్షం సినిమాలు కూడా ఆకట్టుకున్నాయి. అందుకే తన కొత్త సినిమాకు కూడా అదే తరహా టైటిల్ ను నిర్ణయించాడు గోపిచంద్. పంతం సినిమాలో గోపిచంద్‌కు జోడిగా మెహరీన్ నటించనుంది. -
అల్లు హీరో సినిమాకు లైన్ క్లియర్
శ్రీరస్తు శుభమస్తు సినిమాతో తొలి విజయాన్ని అందుకున్న అల్లు వారబ్బాయి శిరీష్, త్వరలో ఒక్క క్షణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేం విఐ ఆనంద్ దర్శకత్వంలో చక్రి నిర్మిస్తున్న ఈసినిమాపై కొద్ది రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కొరియన్ సినిమా ప్యారలల్ లైఫ్ ఇన్సిపిరేషన్ తో ఈ సినిమా రూపొందిందన్న ప్రచారం జరిగింది. అయితే అదే సమయంలో ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో ప్యారలల్ లైఫ్ సినిమాకు అఫీషియల్ రీమేక్ గా ‘2 మేమిద్దరం’ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలు ఒక్క రోజు తేడాతో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. దీంతో ఈ రెండు చిత్రయూనిట్ ల మధ్య వివాదం నడుస్తోందన్న ప్రచారం జరుగింది. అయితే ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ తమ మధ్య ఎలాంటి ఇష్యూ లేదని క్లారిటీ ఇచ్చారు నిర్మాత అనిల్ సుంకర. తాజాగా ఈ వివాదంపై సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘ఒక్క క్షణం టీం విఐ ఆనంద్, చక్రి లతో మాట్లాడాను. అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఒక్క క్షణం కథా కథనాలు విన్న తరువాత ఆ సినిమా పెద్ద విజయం సాధిస్తుందనిపిస్తోంది. హీరో అల్లు శిరీష్, దర్శకుడు విఐ ఆనంద్, నిర్మాత చక్రిలకు నా శుభాకాంక్షలు’. అంటూ ట్వీట్ చేశారు. Had a pleasant chat with Vi Anand &Chakri of Okka Kshanam. All the concerns are sorted out &cleared. After knowing the entire content of d film, i am sure that its gonna be a big hit.Advanced congrats to @AlluSirish @directorvianand nd Chakri. Looking farward 2 working with dem. — Anil Sunkara (@AnilSunkara1) 19 December 2017 -
మెహరీన్ ఖాతాలో మరో ఆఫర్
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన అందాల భామ మెహరీన్. తొలి సినిమాతోనే నటించిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మెహరీన్ తరువాత షార్ట్ గ్యాప్ తీసుకుంది. తరువాత రీ ఎంట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’ సినిమాలతో వరుస విజయాలు సాధించటంతో ఈ అమ్మడికి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో యమా బిజీగా ఉన్న ఈ బ్యూటీని మరో క్రేజీ ఆఫర్ వరించింది. మాస్ హీరో గోపిచంద్ హీరోగా రూపొందనున్న కొత్త సినిమాలో మెహరీన్ ను హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో ఉన్నారు. చక్రి దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రాధమోహన్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం గోపిచంద్ ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ‘ఆక్సిజన్’ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో గోపిచంద్ సరసన అను ఇమ్మాన్యూల్, రాశీఖన్నాలు హీరోయిన్లుగా నటించారు. -
కథ రెడీ
మాస్ మహరాజ్ రవితేజ నూతన దర్శకుడు చక్రి తెరకెక్కించనున్న ఓ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన కథ ఫైనలైజ్ అయిన నేపథ్యంలో డైలాగ్స్ సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ చాలా స్టయిలిష్‌గా కనిపించనున్నారు. గత కొన్నాళ్లుగా లుక్ విషయంలో ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జూలైలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. -
ఏడు నెలల తర్వాత మేకప్ వేసుకుంటున్నాడు
ఒకప్పుడు ఏడాదికి మూడు సినిమాలు చేసిన మాస్ మహరాజ్ రవితేజ, ఇప్పుడు స్పీడు తగ్గించేశాడు. కుర్ర హీరోల నుంచి భారీ పోటీ ఉండటంతో పాటు, వరుస ఫ్లాప్‌లు ఇబ్బంది పెట్టడంతో ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. గత డిసెంబర్లో బెంగాల్ టైగర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన రవితేజ, ఆ తరువాత ఇంత వరకు సినిమా ప్రారంభించలేదు. ఈ మధ్యలో దిల్‌రాజు నిర్మాణంలో ఎవడో ఒకడు సినిమా చేయాల్సి ఉన్నా, అది క్యాన్సిల్ అయ్యింది. దీంతో మరో సినిమా అంగీకరించకుండా తన లుక్ మార్చుకునేందుకు టైమ్ తీసుకున్నాడు. గత సినిమాల్లో బాగా సన్నగా కనిపించటం, ఫేస్‌లో ఏజ్ బాగా తెలుస్తుండటంతో గెటప్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. జిమ్‌లో కసరత్తులు చేసి కాస్త బరువు పెరగటంతో పాటు నిపుణుల సూచనలతో గ్లామర్ కూడా ఇంప్రూవ్ చేసే పనిలో ఉన్నాడు. రాబిన్ హుడ్ అనే టైటిల్‌తో రవితేజ చేయనున్న సినిమా జూన్ రెండో వారంలో పట్టాలెక్కనుంది. చక్రీ అనే కొత్త దర్శకుణ్ని పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా, రవితేజ కెరీర్‌కు మరోసారి బ్రేక్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. -
రెండోరోజు బైఠాయించిన చక్రి తల్లి, సోదరుడు
సోమాజిగూడ: దివంగత సినీ సంగీత దర్శకుడు చక్రికి చెందిన ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి మంగళవారం ధర్నాకు దిగిన చక్రి తల్లి విద్యావతి, సోదరుడు మహత్ రెండో రోజా బుధవారం కూడా తమ నిరసన కొనసాగించారు. సోమాజిగూడలోని వరుణ్ సర్గం అపార్ట్‌వెంట్ ముందు ఉన్న ఫుట్‌పాత్‌పై బైఠాయించారు. వారు మాట్లాడుతూ తమ నివాసంలో అక్రమంగా ఉంటున్న మాధవి ఇల్లు ఖాళీ చేసేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో అపార్ట్మెంట్ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఇరువర్గాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. మహత్ మాట్లాడుతూ తాము ఆరోపిస్తున్నట్లుగా తమ ఇంట్లో ఉంటున్న మాధవి అబద్దాలు చెబుతోందని, తమకు అద్దె చెల్లిస్తున్నట్లు ఆధారాలు చూపమంటే చూపకుండా వేధిస్తుందని ఆరోపించారు. అమెరికాలో ఉంటున్న చక్రి సతీమణి శ్రావణి వస్తేనే ఇల్లు ఖాళీ చేస్తాననని ఆమె మధ్యవర్తులతో చెప్పినట్లు తెలిసిందని, ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. -
చక్రి ఆస్తిపైన తప్ప చక్రి పైన వాళ్లెవరికీ ప్రేమ లేదు
శ్రావణి (యు.ఎస్.నుంచి) అందరం కలిసి ఉన్నప్పుడు మా ఆడపడుచుల్ని, మా అత్తగారిని నేను చాలా ప్రేమగా చూశాను. మాతో ఉండేందుకు వాళ్లంగీకరించలేదు. కనీసం సెటిల్ చేసుకుందామన్నా వాళ్లెప్పుడూ సిద్ధంగా లేరు. ‘మొత్తం ఆస్తంతా మాకే వస్తుంది. మా లాయర్ చాలా గట్టివాడు’ అన్నారు. సరిగ్గా పదిహేను రోజుల్లో కోర్టు జడ్జిమెంట్ ఉండగా వీళ్లకి హఠాత్తుగా ఈ ఇల్లెందుకు గుర్తొచ్చింది? ఇల్లు వాళ్ల పొసిషన్లో ఉంటే లీగల్‌గా లబ్ధి జరుగుతుంది వాళ్ల అడ్వొకేట్ చెప్పినట్టున్నారు. ఇంటిపై లోన్ మొత్తం నేనే తీరుస్తున్నాను. వాళ్లు కడుతున్నామని చెపుతున్నది ఒట్టి అబద్దం. వాళ్ల బిల్లుల్లో డేట్స్ చూడండి. మీకే అర్థం అవుతుంది. చక్రి ఆస్తి మీద తప్ప చక్రి మీద వాళ్లెవ్వరికీ ప్రేమ లేదు. చక్రికి ఉన్న అప్పులతో వాళ్లకి పనిలేదు. కానీ ఆస్తులు మొత్తం వాళ్లకే కావాలంటారు. ఇప్పటికే చాలా అప్పులు తీర్చుకుంటూ వస్తున్నాను. ఇంకా తీర్చాల్సినవి చాలా ఉన్నాయి. నేను అమెరికాలోనే ఉన్నా మా నాన్నతో మాట్లాడమని పదే పదే చెప్పాను. కానీ వాళ్లకి ఆస్తి మొత్తం తమకే రావాలని ఉంది. నా గురించి వాళ్లు ఆలోచించడం లేదు. నిజానికి నేనిప్పుడు చక్రిని కోల్పోయి రోడ్డున పడ్డాను. అలాగని వాళ్లు ఇల్లు లేకుండా ఉండాలని నేను కోరుకోవడం లేదు. వాళ్లు అదే ఇల్లు కావాలని అడుగుతున్నారు. ఇప్పటికైనా నా భర్తపేరు బజారుకీడ్చకుండా మా నాన్నతో మాట్లాడమని నేను కోరుతున్నాను. -
నిలువ నీడ కోసం..
అపశ్రుతి దొర్లేటప్పుడు తెలీదు. దొర్లాక తెలుస్తుంది! చక్రి బతికి ఉండగా అదొక శ్రావ్యమైన కుటుంబ రాగం. ఇప్పుడది... అపశ్రుతులు ధ్వనిస్తున్న అనురాగం! చక్రిని ఆయన ఫ్యామిలీ ఎంతగానో ప్రేమించింది. శ్రావణి కూడా ఆయన్ని ప్రేమించే పెళ్లి చేసుకుంది. చివరికి ఆయన చితి కూడా... ఆ ప్రేమజ్వాలల్లోనే భగభగమని ఆహుతి అయింది! జగమంత కుటుంబానికి సంగీతం అందించిన చక్రి... తన కుటుంబానికి ఏమీ ఇవ్వకుండా వెళ్లి ఉంటాడా? ఇచ్చి ఉంటే.. వారసులెవరు? ఆయన ప్రేమకు నామినీలెవరు? ‘‘నా బిడ్డ బంగారం, నా ఫోన్లో కూడా చక్రి పేరుండదు. నేను ముద్దుగా పిలుచుకునే బంగారు కొండ అనే ఫీడ్ చేసుకున్నాను. ఇంటినిండా ఎప్పుడూ జనం ఉండాలి. ఉన్నదాంట్లో నలుగురికీ పెట్టాలి. ఇదే నమ్మాడు చక్రి, కానీ ఇప్పుడు ఆ నిండు మనిషి దూరమై రోడ్డున పడ్డాం’’... అని కళ్లలోంచి నీళ్లు ఉబికి వస్తుంటే ఆవేదనగా చెప్పారు చక్రి తల్లి విద్యావతి. ‘జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది’ అంటూ తెలుగు ప్రేక్షకుల మదిని మీటిన మ్యూజిక్ డెరైక్టర్ చక్రి తల్లి ఇప్పుడు గడపదాటి బయటికి వచ్చి, జీవన పోరాటానికి సిద్ధమయ్యారు. తన కొడుకు పేరున ఉన్న సోమాజిగూడా ఇంట్లో తనకింత చోటు కావాలని డిమాండ్ చేస్తున్నారు. తోటబావిని అమ్మి తన భర్తా, కొడుకూ సోమాజిగూడ రాజ్‌భవన్ దగ్గరలోని వరుణ్ స్వర్గం విల్లాలో ఈ ఇల్లు కొన్నారని, ఇల్లు చక్రిపేరుమీదే ఉన్నా నామినీగా తన పేరే ఉందని విద్యావతి చెబుతున్నారు. పెన్షన్ తప్ప మరో ఆధారం లేదు ‘‘ఈ ఇంటిపై మాకు హక్కుంది. మాకు తలదాచుకునేందుకు మరో ఇల్లు లేదు. మా కోడలే నా బిడ్డ కొన్న కార్లు ఆడీ, ఎక్స్యువి కార్లు రెండూ ఆమ్మేసుకుంది. ఇప్పుడు అమెరికాలో హాయిగా ఉంది. కానీ నాకు నా భర్త పెన్షన్ తప్ప మరో ఆధారం లేదు. ఈ ఇంటిని అద్దెకిచ్చి అగ్రిమెంటు రాయించుకున్నది కూడా మేమే. దీనిపై నెలకి పాతిక వేల రూపాయల లోన్ బకాయి తీరుస్తోంది కూడా మేమే. కానీ ఈ ఇంటిపై వచ్చే 28 వేల రూపాయల అద్దె మాత్రం మాకు చేరడం లేదు. ఇల్లు ఇప్పటికిప్పుడు ఇచ్చేయమని మేం అడగడం లేదు. కనీసం ఇంట్లో ఉండే అవకాశమివ్వమంటున్నాం. ఆస్తి గొడవ కోర్టులో ఉంది కాబట్టి ఈ ఇల్లు మీకివ్వనంటోంది నా కోడలు శ్రావణి. మరి తిరుపతిలో ఉన్న స్థలాన్ని కేసు కోర్టులో ఉండగానే 45 లక్షలకి ఎలా అమ్ముకోగలిగింది’ అని చక్రి తల్లి ప్రశ్నిస్తోంది. అప్పుడు కూడా వెళ్లగొట్టింది ‘‘నవంబర్ 27న శ్రావణి మమ్మల్ని ఇంట్లోంచి బయటకు పంపించి వేసింది. చక్రే మళ్లీ మమ్మల్ని మా ఇంట్లో దింపేసాడు. తరువాత నవంబరు 30 న ‘‘నా కుటుంబాన్ని దూరం చేసుకోవడం నాకు సిగ్గు చేటు’’ అంటూ చక్రి వాట్సాప్‌లో పెట్టాడు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు నా బిడ్డకి నా కుటుంబం పట్ల ఉన్న ప్రేమని. నా కోడలు ఆస్తి కోసమే ఇదంతా చేసింది. డిసెంబర్ 15, 2014 తెల్లవారి 5 గంటలకు చక్రి చనిపోయాడని శ్రావణి అందరికీ చెప్పింది. కానీ మాకు 7 గంటల వరకు సమాచారమే లేదు. ఈ రెండు గంటలు ఎందుకు చెప్పలేదో మాకిప్పుడు అనుమానంగా ఉంది. నేనేం కోరుకోవడం లేదు ‘‘నా చిన్న కొడుకు మహిత్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్. వాడి దగ్గరే ఉంటున్నా. మహిత్ కదల్లేడు, నిలబడలేడు. నడవలేడు. మహిత్ కూడా మ్యూజిక్ డెరైక్టర్ గా చేస్తున్నా వచ్చేది చాలా తక్కువ. యూసఫ్‌గూడలో అద్దెకు ఉంటున్నాం. నెల రోజుల్నుంచి మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమని అడుగుతున్నారు. ఇప్పుడు ఖాళీ చేసాం. సోమాజిగూడ ఇంటి దగ్గరే దీక్ష చేస్తున్నాం. మాకు న్యాయం జరిగే వరకు మేం ఆందోళన ఆపేది లేదు’’ అంటున్నారు చక్రి తల్లి. అయితే దీనిపై యూ.ఎస్.లో ఉన్న చక్రి భార్య శ్రావణి పూర్తి భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా... ఈ పరిణామాలేవీ కోమల హృదయుడైన ఒక సంగీతకర్త ఆత్మకు శాంతిని చేకూర్చేవి కావు. - అత్తలూరి అరుణ, ప్రిన్సిపల్ కరస్పాండెంట్, సాక్షి ఫొటోలు: లావణ్యకుమార్ శ్రావణికే పూర్తి హక్కు భర్త ఆస్తిపై భార్యకి హక్కుంటుంది. ఇక్కడ కూడా శ్రావణికే సంపూర్ణాధికారం ఉంటుంది. అయితే తల్లికి కూడా డిపెండెంట్ షేర్ ఉంటుంది. ఈ కేసులో చక్రి తమ్ముడు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కనుక మానవతా దృక్పథంతో చక్రి భార్య శ్రావణి ఆలోచించి ఏదైనా కావాలంటే ఇవ్వొచ్చు. కానీ తమ్ముడికి చక్రి ఆస్తిపై ఎటువంటి అధికారం ఉండదు. - కొండారెడ్డి, హైకోర్టు అడ్వకేట్ తల్లికీ వాటా ఉండాలి శ్రావణి, చక్రిలది కులాం తర వివాహం. ఈ కులాల అంతరం కూడా కుటుంబ సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. మానవ సంబంధాల్లో కొరవడుతోన్న ప్రేమకి కులం కూడా కారణమవుతుందని అర్థం చేసుకోవాలి. కోడలు శ్రావణితో పాటు ఏ ఆధారం లేని తల్లికి కూడా కొడుకు ఆస్తిలో వాటా ఉండాలి. - సజయ, సామాజిక కార్యకర్త -
చక్రి కుటుంబంలో కొనసాగుతున్న వివాదాలు
టాలీవుడ్లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఓ వెలుగు వెలిగిన సంగీత దర్శకుడు చక్రి చనిపోయి ఏడాదిన్నర గడిచినా ఇప్పటికీ ఆయన కుటుంబం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా చక్రి తల్లి విద్యావతి, ఆయన సోదరుడు దీక్షకు దిగిటం మరోసారి సంచలనంగా మారింది. కొంత కాలంగా తమ సోమాజిగూడ లోని వరుణ్ సర్గం విల్లా ఫ్లాట్‌లో రెంట్‌కు ఉంటున్నమాధవి అనే మహిళ ఖాళీ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తుందంటూ వారు దీక్షకు దిగారు. ప్రస్తుతం ఆ ఫ్లాట్ పై ఉన్న లోన్ డబ్బులు కూడా తామే కడుతున్నట్టుగా చెపుతున్న చక్రి సోదరుడు, మాధవి 8 నెలలుగా అద్దె ఇవ్వటం లేదన్నారు. -
చక్రి లేకపోవడం బాధగా ఉంది : వైవీయస్ చౌదరి
‘‘రేయ్ చిత్రం మాస్‌ని బాగా ఆకట్టుకుంటోంది. పరీక్షల సమయం కావడం వల్ల యూత్ తక్కువగా వస్తున్నారు. వాళ్లు కూడా బాగా వస్తే, వసూళ్లు ఇంకా బాగుంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వస్తే, గతంలో వైవీయస్ చౌదరి తీసిన ‘దేవదాసు’ స్థాయి విజయం సాధిస్తుంది’’ అని దర్శక, నిర్మాత, నటుడు ఆర్. నారాయణమూర్తి అన్నారు. సాయిధరమ్ తేజ్, శ్రద్ధాదాస్‌లతో స్వీయ దర్శకత్వంలో వైవీయస్ రూపొందించిన ‘రేయ్’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. చక్రి స్వరాలందించిన ఈ చిత్రం ఆడియో ప్లాటినమ్ డిస్క్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుక చక్రిగారిదనీ, ఆయన లేని లోటు స్పష్టంగా తెలుస్తోందనీ సాయిధరమ్ తేజ్ అన్నారు. వైవీయస్ మాట్లాడుతూ, ‘‘చక్రి మన మధ్య లేకపోవడం బాధగా ఉంది. చిత్రవిజయానికి పాటలెంతో దోహదపడ్డాయి. ‘పవనిజం’ పాటను ఈ శుక్రవారం గుడ్ ఫ్రైడే నుండి జత చేస్తున్నాం. అప్పట్లో ‘దేవదాసు’ స్లోగా పికప్ అయ్యి, మంచి విజయం సాధించింది. ‘రేయ్’ కూడా అంతే’’ అన్నారు. దర్శకుడు సాగర్, రచయిత శ్రీధర్ సీపాన తదితరులు పాల్గొన్నారు. -
మ్యూజికల్ హిట్ ఖాయం : శ్రీకాంత్
‘‘ఈ చిత్రానికి చక్రి మంచి పాటలు స్వరపరిచారు. ఆయన లేకపోవడం దురదృష్టం. పాటలన్నీ బాగా కుదిరాయి. ఈ చిత్రం మంచి మ్యూజికల్ హిట్ కావడం ఖాయం’’ అని శ్రీకాంత్ అన్నారు. శ్రీకాంత్, సోనియామాన్ జంటగా రూపొందిన చిత్రం ‘ఢీ అంటే ఢీ’. ఈ నెలాఖరున విడుదల కానున్న ఈ చిత్రం టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. దర్శక, నిర్మాత మాట్లాడుతూ - ‘‘చిత్రబృందం అందించిన సహకారం కారణంగా సినిమా బాగా వచ్చింది. శ్రీకాంత్, బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో ఛోటా భీమ్ పాత్రలో పదేళ్ల బాలుడిలా బ్రహ్మానందం నటన బాగా అలరిస్తుంది’’ అని మాటల రచయిత రాజేంద్రకుమార్ తెలిపారు. ఇందులో నాలుగు పాటలు రాశాననీ, విద్యా వ్యవస్థను విశ్లేషిస్తూ రాసిన పాట చాలా బాగుంటుందనీ పాటల రచయిత చంద్రబోస్ చెప్పారు. -
స్నేహానికి విలువనిచ్చే వ్యక్తి చక్రి
మొయినాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని అంజనాదేవి గార్డెన్లో మంగళవారం ‘చక్రి ఫ్రెండ్‌షిప్‌డే’ను ఘనంగా నిర్వహించారు. చక్రి స్నేహితులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరై చక్రికి నివాళులర్పించారు. ఎంతో బిజీగా ఉండే చక్రి, ప్రతి ఏడాది ఫిబ్రవరి 10న స్నేహితులతో కలిసి ఫ్రెండ్‌షిప్‌డేను నిర్వహించేవారని ఈ సందర్భంగా ఆయన స్నేహితులు చెప్పారు. ఆయన మరణించిన తర్వాత తాము అదే ఆనవాయితీని కొనసాగిస్తూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చక్రి సతీమణి శ్రావణి, సినీ నిర్మాత వెంకట్, పాటల రచయిత కందికొండ, గాయకులు వేణు, రమణ, ప్రవీణ్, చక్రి ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మధు తదితరులు పాల్గొన్నారు. చక్రి కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తా: చెవిరెడ్డి చక్రి స్నేహానికి విలువిచ్చేవాడని, ఆయనతో తనకు విడదీయలేని అనుబంధం ఉందని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే హైదరాబాద్‌లో చక్రి కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తానన్నారు. చక్రికి స్నేహితులంటే ప్రాణమని ఆయన సతీమణి శ్రావణి తెలిపారు. గత కొన్నేళ్లుగా ఫిబ్రవరి 10న స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. -
మీడియానే నన్ను కాపాడాలి: చక్రి సోదరుడు
హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు, దివంగత చక్రి కుటుంబ సభ్యుల మధ్య వివాదం కొనసాగుతోంది. సినీ పాటల రచయిత కందికొండ, తన వదిన శ్రావణి తనను కెరీర్లో ఎదగనీయకుండా చేస్తున్నారిని చక్రి సోదరుడు నారాయణ ఆరోపించారు. తనను మీడియానే కాపాడాలని నారాయణ విజ్ణప్తి చేశారు. చక్రి మరణం తర్వాత అతని కుటుంబ సభ్యులు, భార్య ఒకరిపై మరొకరు కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. ఆస్తి పంపకాల విషయంలో గొడవలు తలెత్తాయి. -
ఆస్తిని చేజిక్కించుకునేందుకే కుట్రలు
అత్తింటివారిపై చక్రి సతీమణి శ్రావణి ఆరోపణ హైదరాబాద్ : తనను రోడ్డు పాలుచేసి తన భర్త సంపాదించిన ఆస్తినంతా కొల్లగొట్టాలనే పథకం ప్రకారం తన అత్తింటివారు తనపై విషం చిమ్ముతున్నారని ప్రముఖ సంగీత దర్శకుడు, దివంగత చక్రి సతీమణి శ్రావణి ఆరోపించారు. తన భర్త మరణధ్రువీకరణ పత్రం రశీదును తీసుకునేందుకు పంజాగుట్ట శ్మశానవాటికకు శనివారం వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. భర్త మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న తనను అత్త విద్యావతి, ఆడపడుచు కృష్ణప్రియ, మరిది మహిత్‌లు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. చక్రి మరణంపై తొలుత అనుమానం వ్యక్తం చేసింది తానేననీ ఇప్పటికీ దానికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. చక్రి సంపాదన మీదే కుటుంబీకులు ఆధారపడేవారనీ ఆయన ఉన్నప్పుడు పెద్దమొత్తంలో ఖర్చులు చేసి ఆడపడుచు బిడ్డలను చదివించేవారనీ ఇప్పుడు వాటిని భరించే శక్తిలేక వారు కొత్త కుట్రలు చేస్తున్నారని వెల్లడించారు. తమకు సోమాజిగూడలో ఒకప్లాట్, మొయినాబాద్‌లో 1000 గజాల ఖాళీ స్థలం, ఘట్కేసర్ వద్ద 666 గజాల మరోప్లాట్, తిరుపతిలో కూడా ఓ ఖాళీ స్థలం ఉన్నాయనీ వాటిపైన అత్తింటివారు కన్నేశారని తెలిపారు. చక్రి,తాను సరోగసి విధానంలో బిడ్డను పొందాలనుకున్నామని అది నెరవేరకుండానే ఆయన ఈ లోకాన్ని విడిచారన్నారు. తనకు అండగా చక్రి స్నేహితులు నిలుచున్నారనీ వారి సాయంతో సమస్యలను అధిగమించగలనని చెప్పారు.అత్తింటి వారు చేసిన ఒత్తిళ్లకు మనోవేదనకు గురై చక్రి ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. త్వరలో చక్రిపేరిట ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి వర్ధమాన గాయనీ,గాయకులను ప్రోత్సహిస్తానన్నారు. ఓ స్టూడియో కూడా ఏర్పాటు చేసే యోచన కూడా తనకుందన్నారు. చక్రి డెత్ సర్టిఫికెట్ రశీదును తీసుకున్న శ్రావణి చక్రి మరణానికి సంబంధించి ధ్రువీకరణ పత్రం రశీదును పంజగుట్ట హిందూ శ్మశాన వాటిక పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు పాలడుగు అనిల్‌కుమార్ శనివారం చక్రి సతీమణి శ్రావణికి అందజేశారు. గత నెల 16వ తేదీన చక్రి బావ నాగేశ్వరరావు ఇదే శ్మశాన వాటిక నుంచి రశీదును తీసుకెళ్లిన సంగతి విదితమే. అతను దాన్ని శ్రావణికి ఇవ్వకుండా అతని దగ్గరే అట్టి పెట్టుకున్నారని అందుకే బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, జీహెచ్ఎంసీ ఏఎంహెచ్‌వో సూచనల మేరకు ఆ రశీదును రద్దుచేసి కొత్తగా మరో రశీదును శ్రావణికి జారీ చేసినట్లు పంజగుట్ట హిందూ శ్మశాన వాటిక పరిరక్షణ కమిటీ అధ్యక్షుడుఅనిల్కుమార్ తెలిపారు. తాము ఇప్పుడిస్తున్న రశీదు మాత్రమే చక్రి డెత్ సర్టిఫికెట్ తీసుకోవడానికి చెల్లుబాటు అవుతుందని ఆయన తెలిపారు. -
నా భర్త అంత్యక్రియల రశీదు ఇప్పించండి
ఏసీపీని ఆశ్రయించిన చక్రి భార్య శ్రావణి బంజారాహిల్స్: తన భర్త చక్రి మరణ ధ్రువీకరణ పత్రం కోసం పంజగుట్ట హిందూ శ్మశాన వాటిక నుంచి డూప్లికేటు రశీదు ఇప్పించాలని కోరుతూ చక్రి భార్య శ్రావణి కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. తనకు ఇస్తానని చక్రి బావ నాగేశ్వర్రావు ఒరిజినల్ రశీదును పంజగుట్ట శ్మశాన వాటిక నుంచి తీసుకు వెళ్లారని... ఇంత వరకు తనకు ఇవ్వలేదని ఆరోపించారు. ఈ రశీదు నిర్ణీత గడువు మంగళవారంతో ముగుస్తుందని ఆ తర్వాత అది పని చేయదని తక్షణం పరిష్కారంగా తనకు డూప్లికేట్ రశీదు ఇప్పిస్తే జీహెచ్ఎంసీ నుంచి డెత్ సర్టిఫికెట్ తీసుకుంటానని తెలిపారు. అయితే నిబంధనలు ఎలా ఉంటాయని పంజగుట్ట హిందూశ్మశాన వాటిక పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు పాలడుగు అనిల్‌కుమార్‌ను ఏసీపీ పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక్కసారి ఒరిజినల్ రశీదు తీసుకున్న తర్వాత నెల రోజుల్లోపల డూప్లికేట్ ఇవ్వడం కుదరదని, గడువు ముగిసిన తర్వాత మరొకటి ఇస్తామని ఆయన వివరించారు. శ్రావణికి ఇస్తామని చెప్పి నాగేశ్వర్రావు అనే వ్యక్తి తమ వద్ద నుంచి చక్రి మృతి చెందిన మూడు రోజులకే వచ్చి రశీదు తీసుకున్నారని పోలీసులకు స్పష్టంచేశారు. ఈ సందర్భంగా తనకు చక్రి అంత్యక్రియలకు సంబంధించి రశీదు ఇవ్వాలంటూ శ్రావణి పోలీసుల సమక్షంలో శ్మశాన వాటిక అధ్యక్షుడు అనిల్‌కుమార్‌కు వినతి పత్రం ఇచ్చారు. శ్రావణితో పాటు పోలీస్ స్టేషన్‌కు ఆమె తండ్రి మధుసూదన్‌రావు కూడా వచ్చారు. -
విషాదం వివాదం
-
చక్రి మృతిపై ముదురుతున్న వివాదం
‘విషం’ చిమ్ముకుంటున్న చక్రి కుటుంబసభ్యులు విచారణ ఎలా జరపాలో తెలియక తలలు పట్టుకుంటున్న పోలీసులు సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రి మృతిపై నెలకొన్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. చక్రి కుటుంబసభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయిస్తున్నారు. తాజాగా తన కోడలు శ్రావణి, ఆమె తల్లిదండ్రులు సురేఖ, మధుసూదన్‌రావు, సోదరుడు భరద్వాజ్ కలిసి విష ప్రయోగం చేసి తన కొడుకును చంపేశారని ఆరోపిస్తూ చక్రి తల్లి విద్యావతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం శ్రావణి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తన భర్త మరణం విష ప్రయోగం వల్లే జరిగిందని, అత్త విద్యావతితో పాటు ఆడపడుచులు వారి భర్తలు, మరిది మహిత్ కారకులంటూ తొమ్మిది మందిపై ఆరోపణలు చేశారు. ఈ మేరకు చక్రి కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసు నమోదైంది. ఇది జరిగి 24 గంటలు గడవకముందే చక్రి తల్లి... శ్రావణిపై ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేయడం కలకలం రే పింది. మృతి చెందిన రోజు కోడలు శ్రావణి ఫోన్ చేసి చక్రిని తానే చంపానని చెప్పిందని చక్రి తల్లి విద్యావతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. చక్రి మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని విద్యావతితోపాటు చక్రి తమ్ముడు మహిత్ కోరారు. తనపై కేసు లేకుండా చేసుకోవడానికి ముందస్తుగా తమను నేరస్తులుగా చిత్రీకరించేందుకు పోలీస్ స్టేషన్ లో శ్రావణి ఫిర్యాదు చేసిందని వారు వెల్లడించారు. దర్యాప్తు కష్టమేనంటున్న పోలీసులు చక్రి మరణంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో విచారణ ఎలా చేయాలో తెలియక జూబ్లీహిల్స్ పోలీసులు తల పట్టుకుంటున్నారు. చక్రి మృతి చెంది నేటికి 29 రోజులు గడిచాయి. ఇప్పటి వరకూ అతని మరణంపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు కలగలేదు. చక్రిపై నిజంగా విష ప్రయోగం జరిగిందా లేక ఆస్తుల పంపకంలో తలెత్తిన వివాదాలతో పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ చక్రి మరణం సహజమా లేక హత్యా అనే విషయం తేల్చేందుకు ఇప్పుడు పోలీసుల వద్ద ఎలాంటి ఆయుధం లేదు. అతని బౌతికకాయానికి పంజాగుట్ట శ్మశాన వాటికలో గత నెల 15న దహన సంస్కారాలు కూడా జరిగాయి. వాస్తవానికి చక్రి మృతదేహానికి పోస్టుమార్టం జరగలేదు. ఖననం చేసినా మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించే అవకాశం ఉండేది. మరోపక్క చక్రి చనిపోయిన సమయంలో ఆయన్ని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు అతన్ని పరీక్షించి ఆసుపత్రికి రాకముందే చనిపోయాడని ధ్రువీకరించారు. కనీసం అక్కడ చికిత్స చేసినా రిపోర్టుల ద్వారా విష ప్రయోగం జరిగిందా లేదా అనేది తెలిసేది. ఇప్పుడా అవకాశం కూడా లేదు. దీంతో ఈ కేసు దర్యాప్తు కష్టమేనని పోలీసులు భావిస్తున్నారు. -
'చక్రిని అతని భార్యే చంపేసింది'
-
'సంగీత దర్శకుడు చక్రిని భార్యే చంపేసింది'
హైదరాబాద్: సంగీత దర్శకుడు చక్రి మృతి.. కుటుంబ సభ్యుల వివాదం కొత్త మలుపు తిరిగింది. చక్రిని భార్య శ్రావణియే డబ్బుల కోసం చంపిందని ఆయన తల్లి విద్యావతి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చక్రిని తానే చంపానంటూ శ్రావణి తమకు ఫోన్ చేసి చెప్పిందని విద్యావతి ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రావణి కాల్ డేటాను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుందని విద్యావతి పోలీసులను కోరారు. చక్రి మృతదేహానికి పోస్టు మార్టం చేయకుండా శ్రావణి అడ్డుకుందని ఆమె ఆరోపించారు. తాము శ్రావణిని ఎప్పుడూ వేధించలేదని చెప్పారు. చక్రి మరణం తర్వాత శ్రావణి వింతగా ప్రవర్తిస్తోందని తెలిపారు. చక్రి అనుమానస్పద మృతిపై విచారణ చేయాలని విద్యావతి పోలీసులను కోరారు. పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని సినీ పెద్దలు బెదరించారని చెప్పారు. చక్రి మరణించడానికి 20 రోజుల ముందు ఇంట్లో గొడవలు జరిగినట్టు విద్యావతి చెప్పారు. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని శ్రావణి తమను బెదిరిందించిందని తెలిపారు. తాము ఇంటిని వదిలి వెళ్లకపోతే చక్రిని చంపేస్తానంటూ శ్రావణి హెచ్చరించిందని ఆమె చెప్పారు. ఇంట్లో గొడవ జరగడంతో చక్రి మరణించడానికి ముందే ఇంట్లో నుంచి బయటకు వచ్చామని విద్యావతి తెలిపారు. శ్రావణి కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని విద్యావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలావుండగా, చక్రి మృతిపై అనేక అనుమానాలున్నాయని ఆయనపై విష ప్రయోగం జరిగిందని, సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని చక్రి సతీమణి శ్రావణి జూబ్లీహిల్స్ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. గత నెల 15న తన భర్త మృతికి ఆయన కుటుంబ సభ్యులే కారణమని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనను వేధిస్తున్న అత్త, ఆడపడుచులు, వారి భర్తలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. కాగా శ్రావణి తప్పుడు ఆరోపణలు చేస్తోందని చక్రి కుటుంబ సభ్యులు ఖండించారు. -
'విష ప్రయోగం వల్లే చక్రి మరణం'
అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన సతీమణి శ్రావణి భర్త కుటుంబీకులే కారణమని ఆరోపణ హైదరాబాద్ : తన భర్త, ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మృతిపై అనేక అనుమానాలున్నాయని ఆయనపై విష ప్రయోగం జరిగిందని దీనిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని చక్రి సతీమణి జిల్లా శ్రావణి జూబ్లీహిల్స్ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. గత నెల 15న తన భర్త మృతికి ఆయన కుటుంబ సభ్యులు కారణమని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనను వేధిస్తున్న అత్త, ఆడపడుచులు, వారి భర్తలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. శ్రావణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చక్రి తల్లి విద్యావతి, సోదరుడు మహిత్, ఆడపడుచులు వాణిదేవి, కృష్ణప్రియ, వారి భర్తలు కె. లక్ష్మణ్‌రావు, వి.నాగేశ్వర్‌రావులతో పాటు వారి సన్నిహితులు కె.ఆదర్శిని, గాలి గిరి, గాలి ప్రత్యూష తదితర 9 మందిపై ఐపీసీ సెక్షన్ 498ఏ, 506, రెడ్‌విత్ 34 కింద కేసులు నమోదు చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. తన భర్తపై గత నెల 14వ తేదీ రాత్రి విషప్రయోగం జరిగిందంటూ శ్రావ ణి తన ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశారు. చక్రి వ్యక్తిగత బ్యాగుతో పాటు ఆఫీస్ తాళాలు, మెడలో గొలుసులు, రెండు సెల్ఫోన్లు, ఏటీఎం కార్డు, చెక్‌బుక్ అన్నీ తన అత్త విద్యావతి, ఆడపడుచు కృష్ణప్రియ తమ గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. భర్తకు చెందిన ఆడి కారు కూడా వారి వద్దే ఉందని పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉందని భర్త మరణంపై విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. పంజాగుట్ట శ్మశాన వాటిక నుంచి చక్రి మరణ ధ్రువీకరణ పత్రం తీసుకోకుండా అడ్డుకుంటున్నారని, హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. డెత్‌సర్టిఫికెట్ ఇవ్వాలంటూ సినీ పెద్దలు దాసరి నారాయణ రావు చెప్పినా ఇంత వరకు ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆస్తులను లాక్కోవడానికి యత్నిస్తున్నారని, ఒంటరిని చేసి ఇంట్లో నుంచి వెళ్లగొట్టేలా ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఎస్సై మహేందర్‌రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
...ఏకాకి జీవితం నాది!
కనులకు కలలే కాదు... అవి కల్లలైపోతే పెట్టేందుకు కన్నీళ్లనూ ఇచ్చాడు దేవుడు. ఆ నిజాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేని వయసు శ్రావణిది. అందుకే భర్త చక్రితో తన జీవితం గురించి, తామిద్దరి భవిష్యత్తు గురించి అందమైన కలలు కంటూ ఉంది. కానీ అంతలోనే ఆమె కలలు కల్లలైపోయాయి. కన్నుమూసి తెరిచేలోగా కన్నీళ్లు వరదలా ఆమె జీవితాన్ని ముంచేశాయి. ప్రాణంగా ప్రేమించే భర్త మరణంతో కన్నీరు మున్నీరవుతోన్న శ్రావణిని కదిలించడం భావ్యం కాకపోయినా... ‘సాక్షి’ ఆమెను కలిసింది. చక్రితో ఆమె అనుబంధాన్ని, హఠాత్పరిణామం తర్వాత ఆమె ఆవేదనను ఇలా అక్షరరూపంలో పాఠకుల ముందు ఉంచుతోంది. చక్రి లేకపోవడం... అవును! ఒక్కసారిగా అంతా శూన్యమైపోయినట్టుగా ఉంది. ప్రతిక్షణం చక్రే గుర్తొస్తున్నాడు. ఒక్కోసారి తను చనిపోలేదేమో, ఏదైనా ఊరు వెళ్లాడేమో అనిపిస్తోంది. (కన్నీళ్లు జాలువారుతుండగా) కానీ... అది నిజం కాదన్న విషయం జ్ఞాపకం వస్తుంటే నేను మాత్రం ఇంకా బతికున్నానా అనిపిస్తోంది. సంతోషంగా సాగిపోయే జీవితంలో ఒక్కసారిగా తుపాను రేగింది! అసలా రోజు ఏం జరిగింది? ముందురోజు సాయంత్రం వరకూ చక్రి ఇంటిలోనే ఉన్నారు. మా నాన్న, తమ్ముడు వస్తే కబుర్లు చెప్పారు. సాయంత్రం బయటకు వెళ్లి, రాత్రి ఎప్పటికో వచ్చారు. ‘నువ్వు పడుకో, నేను బట్టలు మార్చుకుని వస్తాను’ అంటే నేను పడుకుండిపోయాను. కాసేపు టీవీ చూసి, రెండున్నర ప్రాంతంలో వచ్చి పడుకున్నారు. అంతే... ఆ తర్వాత... ఆయన ఇక లేరు అన్న విషయాన్ని మీరెలా గుర్తించారు? తెల్లవారుజామున నేను ట్యాబ్లెట్ వేసుకోవడానికని లేచాను. ఆయన గురక పెడతారు. కానీ అప్పుడు గురక శబ్దం వినిపించడం లేదు. దాంతో అనుమానం వచ్చి ఆయనవైపు చూశాను. అప్పటికే ఒంటి రంగు మారిపోయింది. ముఖం నీలిరంగులోకి వచ్చేసింది. పిలిచినా పలకలేదు. తట్టినా లేవలేదు. ఒళ్లంతా చల్లబడిపోయింది. ఊపిరి తీసుకోవడం లేదు. నా మనసు కీడు శంకించింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాను. (కన్నీళ్లతో) నా చక్రి అప్పటికే నన్ను విడిచి వెళ్లిపోయారు. ఆ వార్త నన్ను పిచ్చిదాన్ని చేసేసింది. ఒక్కసారిగా ఏర్పడ్డ వెలితి... భరించడం చాలా కష్టం కదా?! మామూలు కష్టం కాదు. ఇద్దరికీ సరిపడక అనుక్షణం పోట్లాడుకునే భార్యాభర్తలు కూడా ఒకరికేమైనా అయితే ఇంకొకరు తల్లడిల్లిపోతారు. అలాంటిది... తన ప్రాణం కంటే మిన్నగా నన్ను ప్రేమించి, అనుక్షణం నేనే ప్రపంచంగా మెలిగిన నా భర్త పోతే నాకెలా ఉంటుంది! తనకి అసలు ఏమీ తెలియదు. చిన్నపిల్లాడితో సమానం. స్నానానికి వెళ్తే టవల్ ఇవ్వాలి. స్నానం చేసి వస్తే బట్టలు తీసివ్వాలి. ఏ ప్యాంటు మీదికి ఏ చొక్కా వేసుకోవాలో కూడా నేనే చెప్పాలి. ప్రతిక్షణం శ్రావణీ శ్రావణీ అంటూ కలవరించేవారు. పొద్దున్న లేవగానే నా ముఖమే చూడాలి. నేను వెళ్లి ఎదురుగా నిలబడేవరకూ కళ్లు కూడా తెరిచేవారు కాదు. ఇక ఏ పరీక్షలు రాయడానికో మా పుట్టింటికి వెళ్తే ఎన్ని ఫోన్లు చేసేవారో! నాకు నిద్రపట్టడం లేదు శ్రావణీ అంటూ రాత్రంతా ఫోన్ చేస్తూనే ఉండేవారు. అలాంటిది నన్ను ఒంటరిగా వదిలేసి ఎప్పటికీ లేవనంత గాఢనిద్రలోకి ఎలా వెళ్లిపోయారో ఏమో! ఆయన అనారోగ్యమే ఆయన ప్రాణాలు తీసిందన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి మీరు ఆయనను ఎప్పుడూ హెచ్చరించలేదా? చాలాసార్లు చెప్పాను. మొదట్లో చూద్దాంలే అనేవారు. కానీ రానురాను ఒబేసిటీతో చాలా ఇబ్బంది పడేవారు. అసలు 2010లోనే బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవాలని అనుకున్నారు. అంతా సిద్ధం చేసుకున్నాక ఎవరో ఆయనతో ఆ ఆపరేషన్ రిస్క్ అని చెప్పారు. దాంతో వెనకడుగు వేశారు. అయినప్పటికీ గత కొంతకాలంగా తన ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ పెట్టారు. వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సర్జరీ చేయించుకోవడానికి కూడా రెడీ అయిపోయారు. కానీ కొంతకాలం ఆగమని కార్డియాలజిస్ట్ చెప్పడంతో వాయిదా వేశారు. అసలు ఈ వారంలో డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. ఈలోపే జరగరాని ఘోరం జరిగిపోయింది. ఆయన డిప్రెషన్లో కూడా ఉన్నారని... నిజమే. కొంతకాలంగా కెరీర్ ఏం బాలేదు. ఆర్థిక సమస్యలు పెరిగిపోయాయి. మొన్ననే డిసెంబర్ 31న ఒక షో చేసే అవకాశం వచ్చింది. ఆ రోజు నా దగ్గరకు వచ్చి... ‘ఈ సమయంలో మనకి ఈ షో అవకాశం రావడం ఎంత అదృష్టమో తెలుసారా, మన దగ్గర అస్సలు డబ్బులు లేవు, మొత్తం అయిపోయాయి, లక్కీగా ఇప్పుడిది వచ్చింది’ అన్నారు ఎంతో సంతోషంగా. కానీ ఉన్నట్టుండి ఆ షో క్యాన్సిలయ్యింది. దాంతో దిగాలు పడిపోయారు. దానికితోడు ఓ సినిమా అవకాశం కూడా వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. ఇవన్నీ కలిసి ఆయనను డిప్రెషన్‌కి గురి చేశాయి. చాలా సినిమాలు చేశారు కదా... ఆర్థికంగా అంత ఎలా చితికిపోయారు? చాలామంది అనుకుంటారు, బోలెడన్ని సినిమాలు చేశాడు కదా చాలా సంపాదించి ఉంటాడు అని. కానీ చక్రి పెద్దగా వెనకేసిందేమీ లేదు. బ్యాంకు బ్యాలెన్సులూ, ఆస్తులూ లేవు. ఉన్నదల్లా ఒక్క ఇల్లే. సంపాదించినదాన్ని కుటుంబం కోసం ఖర్చు పెట్టేవారు. దానధర్మాలు చేసేసేవారు. ఆస్తులు లేవంటున్నారు... కానీ మీ కుటుంబంలో ఆస్తుల గురించి కలహాలు రేగాయి కదా? దయచేసి ఆ విషయం ఇక వదిలేయండి. చక్రి ఇక లేడని తెలియగానే నా మెదడు బ్లాంక్ అయిపోయింది. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎవరో సహజ మరణమేనా అంటూ ఆరా తీశారు. అది తట్టుకోలేకపోయాను. దాంతో కాస్త ఆవేశపడ్డాను. మరికొన్ని పరిస్థితుల వల్ల కూడా కుటుంబ సభ్యుల మధ్య కమ్యునికేషన్ గ్యాప్ వచ్చి అపార్థాలు తలెత్తాయి. తర్వాత అందరం కూర్చుని మాట్లాడుకున్నాం. ఏ సమస్యలూ లేకుండా చేసుకున్నాం. చక్రి ఉన్నా లేకపోయినా మేమంతా ఒకే కుటుంబం. ఒక్కటి మాత్రం నిజం. చక్రికి వాళ్ల అమ్మన్నా, తమ్ముడు మహిత్ అన్నా ప్రాణం. వాళ్లని మాత్రం నేను జీవితాంతం నా సొంత తల్లి, తమ్ముడిలాగే చూసుకుంటాను. అందులో సందేహం లేదు. సరే వదిలేయండి. ఈ క్షణం కళ్లు మూసుకుని చక్రి గురించి ఆలోచిస్తే... మీకేం గుర్తుకొస్తోంది? తనతో గడిపిన ప్రతి క్షణమూ మనసులో మెదులుతోంది. మా ఇద్దరి ప్రేమ ఎలాంటిదో చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు. వేణ్నీళ్లతో స్నానం చేసినప్పుడు బాత్రూమ్ అద్దం మీద ఆవిరి పడుతుంది కదా! దానిమీద ఐలవ్యూ అని రాయడం ఇద్దరికీ అలవాటు. నేను స్నానం చేసి వచ్చేటప్పుడు ‘ఐలవ్యూ నాన్నా’ అని రాసేదాన్ని. తను చేసి వచ్చేటప్పుడు ‘ఐలవ్యూ శ్రావణీ’ అని రాసేవారు. ఎప్పుడైనా ఎవరైనా మర్చిపోతే ఎందుకు రాయలేదు అని సరదాగా పోట్లాటకు దిగేవాళ్లం. అంత పిచ్చి ఒకరంటే ఒకరికి. నేనెప్పుడూ ఆయనకి సర్ప్రైజ్ గిఫ్టులిస్తూ ఉండేదాన్ని. వాటిని చూసి చిన్నపిల్లాడిలా సంబరపడిపోయేవారు. ఓసారి బ్రాండెడ్ వాచ్మీద ఆయన ఫొటో ఫిక్స్ చేయించి ప్రెజెంట్ చేశాను. దాన్ని ప్రాణంగా చూసుకునేవారు. అందరూ భలే ఉందని అంటుంటే మురిసిపోయేవారు. చాలామంది సెలెబ్రిటీలు తమ భార్యలను కూడా ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. చక్రి మిమ్మల్ని ఎప్పుడూ రమ్మనలేదా? లేదు. నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం. అందుకే నేను బొతిక్ పెట్టుకుంటానని అడిగితే సరే అన్నారు. కొన్నాళ్లు దాన్ని నడిపిన తర్వాత అడిగాను... మీరు పని చేసే ఏదైనా సినిమాకి గానీ, ఒక్క పాటకైనా గానీ కాస్ట్యూమ్స్ డిజైన్ చేసే చాన్స్ ఇవ్వమని. కానీ ఆయన ఒప్పుకోలేదు. ‘ఈ ఫీల్డ్‌లో మనగలగడం అంత ఈజీ కాదు. వద్దు’ అన్నారు. తర్వాత నేనిక ఆ ప్రసక్తి తీసుకురాలేదు. అదనే కాదు... ఆయన ఏది చెప్పినా బాగా ఆలోచించి, నా మంచి కోసమే చెప్తారని నాకు తెలుసు. అందుకే దేనికీ వాదించేదాన్ని కాదు. అయినా కళ్లలో పెట్టుకునే చూసుకునే ఆయన ఉండగా వేరే వాటి గురించి బెంగ ఎందుకులే అనుకునేదాన్ని. కానీ ఇప్పుడాయన లేరు కదా..? అవును. లేరు. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు. ఇలాంటి రోజొకటి వస్తుందని ఎన్నడూ ఊహించింది లేదు. కనీసం ఆయన జ్ఞాపకంగా ఓ బిడ్డ ఉన్నా బాగుండేది. దేవుడు ఆ అదృష్టం కూడా లేకుండా చేశాడు. మీరిద్దరూ పిల్లల గురించి ఆలోచించలేదా? ఆలోచించడం కాదు... తపించాం. తనకి పిల్లలంటే చాలా ఇష్టం. కానీ కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల ఐవీఎఫ్‌ని ఎంచుకోవాల్సి వచ్చింది. అయితే ఆ ప్రాసెస్ చాలా బాధాకరంగా ఉండేది. అది ఆయన తట్టుకోలేకపోయారు. పిల్లలంటే తనకున్న ఇష్టాన్ని కూడా పక్కన పెట్టి... ‘నువ్వలా కష్టపడితే నేను చూడలేను శ్రావణీ, ఎవరినైనా తెచ్చి పెంచుకుందాంలే’ అన్నారు. కానీ నాకది ఇష్టం లేకపోయింది. సరొగసీకి కూడా నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే నా చక్రి రక్తం పంచుకున్న బిడ్డకు నేను స్వయంగా జన్మనివ్వాలి. అందులో ఉండే ఆనందమే వేరు. అందుకే మళ్లీ చికిత్స తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. డిసెంబర్ పద్నాలుగున డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. కానీ ఆరోజు ఆదివారం కావడంతో తర్వాతి రోజు వెళ్దామనుకున్నాను. కానీ వెళ్లాల్సిన అవసరం లేకపోయింది. చక్రి ఆ రోజు ఉదయమే నన్ను విడిచిపెట్టి వెళ్లిపోయారు. మరి ఇప్పుడు భవిష్యత్తు గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఆలోచించడానికి ఇంకా ఏం మిగిలిందని! నా ప్రాణానికి ప్రాణమైన చక్రియే వెళ్లిపోయిన తర్వాత నాకింకా భవిష్యత్తు ఎక్కడిది? నాకీ జీవితం మీద పెద్ద ఆసక్తి లేదు. బతకాలన్న కోరిక అంతకన్నా లేదు. నా వరకూ నాకు చక్రి లేని జీవితం అసలు జీవితమే కాదు. కానీ నేను బతికి తీరాలి. చక్రి ఒక స్టూడియో పెట్టాలనుకున్నారు. ‘సీ స్టూడియోస్’ అనే పేరుని రిజిస్టర్ కూడా చేయించారు. కానీ తన కల నెరవేరకుండానే కన్నుమూశారు. ఆ కలను నేను నెరవేరుస్తాను. అయితే అది ఇప్పుడే సాధ్యం కాకపోవచ్చు. కానీ ఎప్పటికైనా చేసి తీరతాను. ప్రేమించడం తనని చూసే నేర్చుకోవాలి! చక్రితో ప్రతిక్షణం ఎంతో ఆనందంగా ఉండేది. భార్యని ఎలా ప్రేమించాలో ఎవరైనా తనని చూసే నేర్చుకోవాలి. నేను ప్యూర్ వెజిటేరియన్‌ని. ఆ విషయాన్ని తను ఏ క్షణం మర్చిపోయేవారు కాదు. తనకెంత ఇష్టమైనా నన్ను నాన్‌వెజ్ వండమని ఎప్పుడూ అడగలేదు. తినమనీ బలవంతపెట్టలేదు. నాకోసం తనే వెజ్ని ఇష్టంగా తినేవారు. తనకసలు కోపమన్నదే రాదు. నాకు మాత్రం చాలా త్వరగా వచ్చేస్తుంది. ఏదైనా చిన్న తేడా వచ్చినా వెంటనే కోప్పడిపోతాను. అప్పుడు కూడా ఆయన ఒక్క మాట అనేవారు కాదు. నవ్వేవారు. కూల్‌గా నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేసేవారు. అంత నిబ్బరంగా ఎలా ఉండేవారో అర్థమయ్యేది కాదు నాకు. -
కావాలనే ఇబ్బందులు సృష్టిస్తున్నారు: చక్రి తమ్ముడు
-
వేధింపులపై స్పందించలేను: చక్రి భార్య
-
మళ్లీ కూయవే గువ్వా!
ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి అకాల మరణంతో సంగీతాభిమానులు మూగపోయారు. చక్రి తన సంగీతంతో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కంబాలపల్లిలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన 40 ఏళ్ల చక్రి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి తదితర సినిమాలను తన సంగీతంతోనే హిట్ అయ్యేలా చేశారు. ఓ మగువా నీతో స్నేహం కోసం పాట ద్వారా సత్యం సినిమాలో ప్రేమికులు మరువలేని గీతం అందించారు. ఇక గోపి- గోపిక - గోదావరి చిత్రంలో నువ్వక్కడుంటే నేనిక్కడుం టే ప్రాణం విలవిల అనే పాటను, విడిపోయిన ప్రేమికులు ఎప్పుడు విన్నా కన్నీరు పెట్టేంత గాఢానుభూతితో స్వరపర్చారు. ఇక చక్రం సినిమాలోని జగమంత కుటుంబం నాది పాట సాహిత్య, సంగీతాల మేలుకలయిగా జీవితాన్ని తాత్వీకరించిన గొప్ప గీతం. దాదాపు వంద సినిమాలకు సంగీతం అందించి లోకం వీడిపోయిన చక్రిని తల్చుకుంటూ మళ్లీ కూయవే గువ్వా అంటూ సినిమా ప్రపంచం రోదిస్తోంది. నాలుగు దశాబ్దాలు దాటక ముందే కనుమరుగైన చక్రికి అభిమానాంజలి. - కొలిపాక శ్రీనివాస్ బెల్లంపల్లి, ఆదిలాబాద్ జిల్లా -
పొన్నూరు అల్లుడు చక్రి!
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రి మృతితో పొన్నూరు కంట తడిపెట్టింది. పక్కనే ఉన్న నిడుబ్రోలు గ్రామానికి చెందిన శ్రావణిని చక్రి వివాహమాడినప్పటికీ ఆయనను అంతా పొన్నూరు అల్లుడు అని పిలుస్తుంటారు. శ్రావణి చిన్నతనంలోనే కుటుంబం అంతా భద్రాచలం వెళ్లి స్థిరపడిపోయారు. పొన్నూరు రూరల్: హైదరాబాద్‌లో సోమవారం ఉదయం కన్నుమూసిన ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రి పొన్నూరు అల్లుడని స్థానికులు పిలుస్తారు. ఆయన భార్య శ్రావణి సొంతూరైన నిడుబ్రోలు గ్రామం పొన్నూరు పక్కనే ఉండటం, చక్రి తరచూ పొన్నూరు రావటం, మండలంలోని నండూరు గ్రామంలో పలుసార్లు కచేరీలు చేయటమే ఇందుకు కారణం. శ్రావణి, తల్లిదండ్రులు అన్నంరాజు మధుసూదనరావు, సురేఖ తొలుత నిడుబ్రోలులోని నేతాజీనగర్‌లో నివాసం ఉండేవారు. శ్రావణి చిన్నతనంలోనే వారంతా భద్రాచలం వెళ్ళిపోయారు. చక్రి మరణవార్త విన్న శ్రావణి నాయనమ్మ రాధాంబ హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారు. ఇంత హడావుడిలోనూ దుఖాన్ని దిగమింగుకుంటూ ఆమె సాక్షితో మాట్లాడారు. ‘పెద్దలంటే చక్రికి ఎంతో గౌరవం. అయన లేరని నేను భావించడం లేదు. చక్రి ప్రతి పాటలోనూ వేణువై అందరి నోళ్లలో నర్తిస్తూనే ఉంటారు’ అని అంటూ కన్నీరు మున్నీరయ్యూరు. గుప్తదానాలు చేసేవారు.. ‘అల్లుడూ అని నేను పిలిస్తే మామగారూ అంటూ అప్యాయంగా స్పందించే చక్రి గొంతు మరోసారి వినలేనా?’ అని సినీ మాటల రచయిత కృష్ణేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పొన్నూరు నేతాజీనగర్‌లో ఉన్న ఆయన చక్రి మరణవార్త విన్న వెంటనే హైదరాబాద్ బయలుదేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘గోపి గోపిక గోదావరి’ చిత్రం నుంచి చక్రితో పరిచయం ఏర్పడిందని చెప్పారు. స్నేహానికి మారుపేరైన చక్రి ఎందరికో గుప్తదానాలు చేశారని వెల్లడించారు. అనేకమంది సంగీత కళాకారులకు సినిమా రంగంలో స్థానం కల్పించిన వ్యక్తి అని కొనియాడారు. కొత్త రచయితలను పరిచయం చేయడమే కాకుండా వారు ఉండేందుకు సౌకర్యం కల్పించేవారని చెప్పారు. -
నీ మరణం సినీ జగత్తుకు తీరనిలోటు..
-
అధిక బరువు... ప్రాణానికి ముప్పు!
ఓ సంగీత కోకిల మూగబోయింది. చక్రి ఓ సెలబ్రిటీగా మనకు కనిపించే ఉదాహరణ. కానీ ఎందరెందరో తమ తమ కెరియర్లలో నిలకడగా విజయాలు సాధిస్తూ ఉండే ఉంటారు. వారిలో కొందరు చక్రిలా స్థూలకాయంతో బాధపడుతూ ఉంటారు. చక్రికి వచ్చిన పరిస్థితి వారికి రాకుండా ఉండటం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియపరిచేందుకే ఈ ప్రత్యేక కథనం. చాలా హిట్ సినిమాల సంగీత దర్శకుడు చక్రి. నలభై ఏళ్లకే ఆయనకు నూరేళ్లు నిండాయి. అకస్మాత్తుగాగుండెపోటుతో చనిపోయారు. కానీ... అందరూ చెప్పుకుంటున్నట్లు మరణానికి కారణం గుండెపోటే అయినా ఆ గుండెపోటును ప్రేరేపించింది మాత్రం ఆయన స్థూలకాయమే. నలభై ఏళ్లకే ఎన్నెన్నో సూపర్‌హిట్ సినిమాలకు సంగీత దర్శకత్వం చేసి ఇప్పటికీ కెరియర్లో సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారంటే... జీవించి ఉంటే మరెన్ని ఆణిముత్యాలను అందించేవారో. కానీ అకస్మాత్తుగా ఆ సంగీతఝరి ఆగిపోయింది. భారతీయులలో స్థూలకాయం... భారతీయుల్లో బీఎమ్ఐ విలువ 25 - ఆపైన ఉంటే స్వల్ప స్థూలకాయం ఉన్నట్లే. ఒకవేళ బీఎమ్ఐ విలువ 30 - ఆపైన ఉంటే అధిక స్థూలకాయం ఉన్నట్టుగా పరిగణించాలి. భారతీయుల్లో స్థూలకాయాన్ని నిర్ధారణ చేయడానికి బీఎమ్ఐతో పాటు నడుము చుట్టుకొలత, నడుమూ-హిప్ చుట్టుకొలతల నిష్పత్తి మొదలైన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటారు. నడుము చుట్టుకొలత మహిళల్లో 80 సెం.మీ. కంటే ఎక్కువగానూ, పురుషుల్లో 90 సెం.మీ. కంటే ఎక్కువగా ఉంటే స్థూలకాయం సమస్య ఉన్నట్లు. ఇక నడుం-హిప్ చుట్టుకొలతల నిష్పత్తి మహిళల్లో 0.8 కంటే ఎక్కువగానూ, పురుషుల్లో 0.9 కంటే ఎక్కువగానూ ఉంటే స్థూలకాయ సమస్య ఉన్నట్లుగా పరిగణించాలి. బరువు పెరగకుండా ఉండటానికి మార్గాలు అధిక బరువు (బీఎమ్ఐ 23 - 24.99) ఉన్నవారు, స్వల్ప స్థూలకాయం (బీఎమ్ఐ 25 - 29.99) ఉన్నవారు రోజూ క్రమం తప్పకుండా కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవడం (బ్రిస్క్ వాకింగ్), ఆహారంలో కొవ్వు పాళ్లు తగ్గించుకోవడం, క్రమం తప్పకుండా వేళకు తినడం, తక్కువ మోతాదుల్లో తినడం, చిరుతిండ్లకు, కూల్‌డ్రింక్స్‌కు, ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలితో బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇది అధిక బరువు ఉన్నవారికే గాక... అందరికీ ఆరోగ్యాన్నిచ్చే ప్రక్రియ. అయితే ఒకవేళ బీఎమ్ఐ 30 - ఆపైన ఉంటే డైటింగ్, వ్యాయామం వంటి మామూలు మార్గాలు పనిచేయవు. స్థూలకాయం కాస్మటిక్ సమస్య కాదు.. అది ప్రమాదకరం చాలామంది అనుకుంటున్నట్లుగా స్థూలకాయం కాస్మటిక్ సమస్య కాదు. ఎన్నో ప్రాణాంతకమైన వ్యాధులకు అది మూలకారణం. ఉదాహరణకు డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు, కీళ్లనొప్పులు, నిద్రలో ఊపిరి సరిగా అందకుండా చేసే స్లీప్ ఆప్నియా, డిప్రెషన్ వంటి దాదాపు 65 రకాల వ్యాధులకు అదే అంతర్గత (అండర్లైయింగ్) కారణం. సాధారణ ప్రజలతో పోలిస్తే స్థూలకాయుల్లో ఆయుఃప్రమాణం 5 నుంచి 20 ఏళ్లు తగ్గిపోయే అవకాశం ఉంది. ప్రాణానికి ముప్పు వచ్చే అవకాశాలు 50 శాతం నుంచి 100 శాతం వరకు ఉంటాయి. సంగీత దర్శకుడు చక్రి విషయంలో జరిగిందిదే. కొందరు స్థూలకాయంతో ఆరోగ్య సమస్యలు ఏమొస్తాయిలే అనీ, ఒక వయసు తర్వాత పొట్ట రావడం మామూలే అని అనుకుంటారు. నిజానికి ఒళ్లంతా కొవ్వు పేరుకుపోవడం ద్వారా లావెక్కిపోయి వచ్చే స్థూలకాయం కంటే పొట్టచుట్టూ కొవ్వు పేరుకునిపోవడమే అత్యంత ప్రమాదకరం. పొట్టచుట్టూ కొవ్వు పేరుకుని పోవడాన్ని సెంట్రల్ ఒబేసిటీ అంటారు. మన పొట్ట చుట్టూ అనేక పొరలు ఉంటాయి. సెంట్రల్ ఒబేసిటీలో చర్మం కిందనే కాకుండా, కండరాల లోపలివైపు, జీర్ణాశయం, పేగుల చుట్టు కూడా కొవ్వు పేరుకొనిపోతుంది. డయాబెటిస్, హైబీపీ, రక్తలో కొవ్వు శాతం పెరగడం (హైపర్‌లిపిడిమియా) వంటి సమస్యలు వచ్చే అవకాశం... సాధారణ స్థూలకాయం కంటే సెంట్రల్ ఒబేసిటీలో చాలా ఎక్కువ. కాబట్టి పొట్ట పెరుగుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్‌ను సంప్రదించాలి. ఒక వ్యక్తి స్థూలకాయుడా... కాదా అని నిర్ణయించడం ఎలా? సాధారణంగా ఒక వ్యక్తి స్థూలకాయుడా, కాదా అని నిర్ధారణ చేయడానికి ‘బాడీ మాస్ ఇండెక్స్’ (బీఎమ్ఐ) అనే ప్రమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ఉంటారు. దీన్ని కొలిచే పద్ధతి ఇలా ఉంటుంది. ఒక వ్యక్తి బరువును కిలోగ్రాములలో కొలవాలి. ఆ విలువను అతడి ఎత్తు స్క్వేర్తో భాగించాలి. స్క్వేర్ అంటే అదే సంఖ్యను మళ్లీ అదే సంఖ్యతో గుణించడం. ఈ ఎత్తు విలువను మీటర్లలో తీసుకోవాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి బరువు 120 కిలోలు. అతడి ఎత్తు 1.7 మీటర్లు. అప్పుడు అతడి బీఎమ్ఐ విలువ ఎంత అంటే... 120 / 1.7 ్ఠ 1.7 = 41.52 కి.గ్రా/మీ2. ఇప్పుడు ఈ విలువను బీఎమ్ఐ పట్టికతో సరిపోల్చుకుని మీరు ఏ స్థూలకాయ స్థాయిలో ఉన్నారో నిర్ణయించుకోవచ్చు. బీఎమ్ఐ లెక్కించి మీ స్థూలకాయ స్థాయి ఏమిటో తెలుసుకోవాలంటే ఈ పట్టికలోని విలువలను ప్రమాణంగా తీసుకోండి. స్థూలకాయ స్థాయి భారతీయుల బీఎమ్ఐ విదేశీయుల బీఎమ్ఐ సాధారణ బరువు 18.50 - 22.99 18.50 - 24.99 అధిక బరువు 23.00 - 24.99 25.00 - 29.99 స్వల్ప స్థూలకాయం 25.00 - 29.99 30.00 - 34.99 అధిక స్థూలకాయం 30 - ఆపైన 35.00 - 39.99 వ్యాధిగ్రస్థ స్థూలకాయం - 40.00 -49.99 సూపర్ స్థూలకాయం - 50.00 - 59.99 సూపర్ సూపర్ స్థూలకాయం - 60.00 - ఆపైన బీఎమ్ఐ ఆధారంగా నిర్ధారణ చేసే స్థూలకాయ వర్గాలు విదేశీయులతో పోల్చి చూస్తే, భారతీయులలో కాస్త తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే విదేశీయులతో పోల్చి చూస్తే మనకు శరీరంలో కొవ్వు శాతం ఎక్కువ, కండరాల పరిమాణం తక్కువ. అందువల్ల మనం తక్కువ స్థూలకాయ స్థాయిలో ఉన్నప్పటికీ వైద్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. సెట్‌పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజ్ అంటే ఏమిటి? ఒక వ్యక్తి శరీరంలో ఎంత కొవ్వు నిలువ ఉండాలనే అంశాన్ని (సెట్‌పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజ్) అనేక హార్మోన్లు నిర్ణయిస్తాయి. ఇందులో జీర్ణవ్యవస్థలో తయారయ్యే హార్మోన్లయిన గ్రెలిన్, జీఎల్పీ-1 అనేవి ప్రధానమైనవి. ఈ సెట్ పాయింట్ అనేది మన మనసు అధీనంలో ఉండదు. గ్రెలిన్ జీర్ణాశయం పైభాగంలో తయారవుతుంది. ఇది ఆకలిని పెంచుతుంది. ‘జీఎల్పీ-1’ అనే హార్మోన్ చిన్న పేగు చివరిభాగంలో తయారవుతుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. కొంతమంది తక్కువగా తింటున్నప్పటికీ లావుగా ఉంటారు. ఇంకొంతమంది ఎక్కువగా తింటున్నప్పటికీ సన్నగానే ఉంటారు. దీనికి కారణం... లావుగా ఉన్నవారిలో కొవ్వు సెట్‌పాయింట్ ఎక్కువగానూ, సన్నగా ఉన్నవారిలో కొవ్వు సెట్‌పాయింట్ తక్కువగానూ ఉంటుందన్నమాట. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో కొవ్వు సెట్‌పాయింట్ పెరుగుతుంది. ఇది ఒకసారి పెరిగితే మళ్లీ తగ్గదు. బీఎమ్ఐ 30 - ఆపైన ఉంటే... బీఎమ్ఐ 30 - ఆపైన ఉంటే (అంటే అధిక స్థూలకాయానికి చేరితే) కేవలం డైటింగ్, వ్యాయామం వంటి ప్రక్రియల ద్వారా శాశ్వతంగా బరువు తగ్గించుకోవడం సాధ్యం కాదు. ఇలాంటి వారిలో నూటికి నలుగురు మాత్రమే డైటింగ్, వ్యాయామాలతో బరువు తగ్గించుకోగలరు. ఎందుకంటే కొవ్వు సెట్ పాయింట్ పెరిగిపోయింది కాబట్టి. బీఎమ్ఐ 30 - ఆపైన ఉన్న వ్యక్తి డైటింగ్, వ్యాయామాలను మొదలుపెట్టిన వెంటనే ‘కొవ్వు సెట్ పాయింట్’ను నియంత్రించే హార్మోన్లు శరీరంలో ప్రతికూల మార్పులను తీసుకొస్తాయి. ఆకలిని పెంచే గ్రెలిన్ స్రావాలు పెరుగుతాయి కాబట్టి ఆకలి పెరుగుతుంది. ఆకలిని తగ్గించే జీఎల్పీ-1 తగ్గుతుంది. జీవక్రియలు మందగిస్తాయి. కాబట్టి బీఎమ్ఐ 30 - ఆపైన ఉన్నవారు డైటింగ్, వ్యాయామం కారణంగా మొదట కొంచెం బరువు తగ్గినప్పటికీ హార్మోన్ల ప్రభావం వల్ల ఆర్నెల్ల నుంచి ఐదేళ్ల వ్యవధిలో కోల్పోయిన బరువు మళ్లీ పెరుగుతారు. మరి పరిష్కారం ఏమిటి...? డైటింగ్, వ్యాయామం కొవ్వు సెట్పాయింట్ని మార్చలేవు. అందువల్ల బీఎమ్ఐ 30 - ఆపైన ఉన్నవారిలో... అంటే అధిక, వ్యాధిగ్రస్త, సూపర్, సూపర్సూపర్ స్థూలకాయం ఉన్నవారిలో డైటింగ్, వ్యాయమాలు శాశ్వతంగా బరువు తగ్గించలేవు. ఇలాంటి వారిలో బరువును నియంత్రించడానికి ఔషధాల పాత్ర కూడా చాలా పరిమితమే. ఒకవేళ వాటిని వాడినా... ఆపివేయగానే మళ్లీ బరువు పెరిగిపోతుంది. కాబట్టి శాశ్వతంగా బరువు తగ్గడానికీ, స్థూలకాయంతో వచ్చే అనర్థాలైన గుండెపోటు, డయాబెటిస్, అధికరక్తపోటు వంటి వాటిని తగ్గించుకుని, ఆయుఃప్రమాణాన్ని పెంచుకోడానికి అనువైన మార్గం ఒక్క బేరియాట్రిక్ సర్జరీ మాత్రమే. అయితే బేరియాట్రిక్ సర్జరీలను అందరికీ చేయరు. భారతీయులలో బీఎమ్ఐ 30 - ఆపైన ఉండి, షుగర్ లాంటి జబ్బులు ఉంటే వారికి బేరియాట్రిక్ సర్జరీ చేస్తారు. ఒకవేళ షుగర్ లాంటి జబ్బులేమీ లేకపోయినా బీఎమ్ఐ 35 - ఆ పైన ఉన్నవారు బేరియాట్రిక్ సర్జరీకి అర్హులవుతారు. బేరియాట్రిక్ సర్జరీలో రకాలు... బేరియాట్రిక్ సర్జరీలలో స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ, గ్యాస్ట్రిక్ బైపాస్, డియోడినల్ స్విచ్ వంటి అనేక ప్రక్రియలు ఉన్నాయి. వీటిని లాపరోస్కోపిక్ ప్రక్రియలో చేస్తారు. స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ : ఈ ప్రక్రియలో జీర్ణాశయంలోని 80 శాతాన్ని తొలగిస్తారు. మిగిలిన సంచి పరిమాణం 60-120 మి.లీ. కావడంతో, ఏ కొంచెం తిన్నా కడుపు నిండిపోతుంది. గ్యాస్ట్రిక్ బైపాస్: ఈ ప్రక్రియలో జీర్ణాశయం పైభాగాన్ని కత్తిరించి ఒక చిన్న సంచిలా తయారు చేస్తారు. చిన్నపేగు మధ్యభాగాన్ని కత్తిరించి దాన్ని నేరుగా ఈ సంచికి కలుపుతారు. ఈ శస్త్ర చికిత్సలో జీర్ణమయ్యే ఆహారం చిన్న పేగుల్లోని మొదటి భాగమైన ‘డియోడినమ్’లోకి కాకుండా నేరుగా చిన్నపేగు మధ్యభాగంలోకి ప్రవేశిస్తుంది. దాంతో జీర్ణమయ్యే ఆహారం పేగుల్లోకి ఇంకడం తగ్గి పోతుంది. డియోడినల్ స్విచ్: ఈ ప్రక్రియలో తొలుత స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ చేసి, చిన్న పేగు మొదటి భాగమైన డియోడినమ్ను కత్తిరించి, నేరుగా చిన్నపేగు చివరి భాగానికి కలుపుతారు. బేరియాట్రిక్ సర్జరీ వల్ల ఇతర ప్రయోజనాలు బేరియాట్రిక్ సర్జరీలు చేయించుకున్న వారిలో బరువు తగ్గడమే కాకుండా డయాబెటిస్ (షుగర్), హైబీపీ వంటి సమస్యలూ నయమయ్యే అవకాశం ఉంది. డయాబెటిస్‌ను నయం చేయడానికి మరికొన్ని ఆధునిక బేరియాట్రిక్ సర్జరీలు అందుబాటులోకి వచ్చాయి. అవి...మినీ గ్యాస్ట్రిక్ బైపాస్: ఇందులో జీర్ణాశయం పైభాగాన్ని ఒక పొడుగాటి సంచిలా కత్తిరించి, దానిని నేరుగా చిన్న పేగు మధ్య భాగానికి కలుపుతారు. ఫలితంగా ఆహారం... జీర్ణాశయం, చిన్న పేగు పైభాగాలను బైపాస్ చేసుకొని చిన్నపేగు మధ్యభాగంలోకి చేరుతుంది. ఈ ప్రక్రియలో ఐరన్, క్యాల్షియం వంటి ఖనిజ లవణాల లోపాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ విత్ లూప్ డియోడినో-జిజినల్ బైపాస్ : ఈ ప్రక్రియలో తొలుత స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ చేసి, చిన్న పేగు మొదటి భాగమైన డియోడినమ్ను కత్తిరించి, నేరుగా చిన్నపేగు మధ్యబాగానికి కలుపుతారు. ఇందులో ఖనిజ-లవణాల లోపాలు రావడం చాలా అరుదు. స్థూలకాయం లేకపోయినా మధుమేహం ఉన్నవారికి... స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ విత్ డియోడినో - ఇలియల్ ఇంటర్-పొజిషన్: ఇందులో స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ చేసి, డియోడినమ్ మొదటి భాగాన్ని కత్తిరిస్తారు. దీన్నీ, చిన్నపేగు మధ్య భాగాన్నీ కలుపుతూ జీఎల్పీ-1 తయారు చేసే ఇలియల్ సెగ్మెంట్‌ను అతికిస్తారు. బీఎమ్ఐతో సంబంధం లేకుండానే మధుమేహం సమస్యతో బాధపడేవారికి ఇది మంచి చికిత్స. చివరగా: స్థూలకాయంతో బాధపడేవారు అకస్మాత్తుగా గుండెపోటుతోనో లేదా హైబీపీ వంటి ఇతరత్రా సమస్యలతో చనిపోతే అది మరణానికి తక్షణ కారణం కావచ్చు. కానీ ఆ కారణానికి దారితీసిన పరిస్థితులు మాత్రం స్థూలకాయంతో వచ్చిన అనర్థాలే. అందుకే మీ బీఎమ్‌ఐని పరీక్షించుకుని, అవసరమైతే డైటింగ్, వ్యాయామాలు చేసి బరువు నియంత్రించుకోండి. ఒకవేళ మీ బరువు అధిక స్థూలకాయం కంటే ఎక్కువగా ఉంటే బేరియాట్రిక్ నిపుణులను సంప్రదించి వారి సలహాలు తీసుకోండి. సంగీత దర్శకుడు చక్రి విషాద ఉదంతంతోనూ మనలో చాలామంది అప్రమత్తమై మన జీవన ఆయుఃప్రమాణాన్ని పెంచుకోవచ్చు. డాక్టర్ వి. అమర్ మినిమల్ యాక్సిస్ మెటబాలిక్ అండ్ బేరియాట్రిక్ సర్జన్, సిటిజన్స్ హాస్పిటల్, శేరిలింగంపల్లి, హైదరాబాద్ -
మళ్లి కూయవా గువ్వా!
► జగమంత కుటుంబం తనది! చక్రిదీ, నాదీ చిరకాల స్నేహం. సినిమాల్లోకి రావడాని కన్నా ముందే మా ఇద్దరికీ స్నేహం ఏర్పడింది. హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రాంతంలో ఒక రికార్డింగ్ స్టూడియో ఉండేది. అక్కడ మా ఇద్దరికీ తొలి పరిచయమైంది. అతను గీత రచయితగా ఉన్నప్పుడు పాటలు రాసేవాడు. మా ఇద్దరి సినిమా కెరీర్లు కూడా దాదాపు ఒకటే సమయంలో మొదలయ్యాయి. పూర్తిస్థాయి సంగీత దర్శకుడిగా చక్రికి తొలి అవకాశం వచ్చిన రోజు కూడా నాకు బాగా గుర్తే. ముందుగా నాకు ‘చిత్రం’ (2000) సినిమాతో అవకాశం వచ్చింది. ఆ సినిమా విడుదలైనప్పుడు దిల్సుఖ్ నగర్‌లోని గంగా థియేటర్లో మేమందరం వెళ్ళి, ‘చిత్రం’ షో చూస్తున్నాం. ఇంతలో, చక్రికి ఫోన్ వచ్చింది. పూరి జగన్నాథ్ ‘బాచి’ (2000) సినిమాకు ఛాన్స్ వచ్చింది. అంతే! ‘జగనన్న నుంచి ఫోన్ వచ్చింది. నాకు సినిమా ఛాన్స్ వచ్చింది. వెళ్ళి కలవాలి’ అంటూ సినిమా సగంలోనే వెళ్ళాడు. అలా అతని సినీ సంగీత ప్రస్థానం మొదలైంది. తెలుగు సినీ సంగీతంలో మా ఇద్దరి కెరీర్లూ సమాంతరంగా సాగాయి. పోటాపోటీగా సినిమాలు చేశాం. అయితే, ఒకరి అవకాశాలను మరొకరు చేజిక్కించుకోవడం లాంటి అవాంఛనీయ ధోరణి ఎప్పుడూ లేదు. ఎప్పటికప్పుడు మంచి సంగీతంతో, మంచి పాటలతో ఆకట్టుకోవాలని ప్రయత్నించేవాళ్ళం. పైగా, మా ఇద్దరికీ వ్యక్తిగతంగా, భావోద్వేగపరంగా చాలా మంచి అనుబంధం ఉండేది. నన్ను అన్నయ్యగా భావిస్తే, తను నాకు తమ్ముడనుకొనేవాణ్ణి. పైగా, 2000 ప్రాంతంలో మా ఇద్దరి లక్ష్యం ఒకటే - సినీ సంగీత పరిశ్రమను పూర్తిస్థాయిలో హైదరాబాద్‌లో స్థిరపడేలా చేయాలని! అందుకోసం వీలైనంత కృషి చేశాం. ఇక్కడ వీలైనంత ఎక్కువమంది గాయనీ గాయకులనూ, సంగీత కళాకారులనూ పరిచయం చేశాం. స్థానికులకు అవకాశాలిచ్చాం. పైగా, రవివర్మ, కౌసల్య, ఉష లాంటి చాలా మంది యువ గాయనీ గాయకులు మా ఇద్దరి సంగీతంలో రెగ్యులర్‌గా పాటలు పాడేవారు. సంగీతం అందించాలంటూ తన దగ్గరకు వచ్చినవాళ్ళను అతను ఎప్పుడూ నొప్పించేవాడు కాదు. ‘నాకు పని వచ్చింది. అది బాగా చేయాలి’ అన్నదే అతని దృష్టి అంతా! అందుకే, సినిమాలతో నిత్యం బిజీగా ఉండేవాడు. అచిరకాలంలోనే 90 పైచిలుకు సినిమాలు పూర్తి చేయగలిగాడు. సంగీతపరంగా చక్రి బాణీల్లో అరబిక్ సంగీత స్పర్శ, సంగీత దర్శకుడు ఏ.ఆర్. రహమాన్ ప్రభావం ఉండేది. అందుకనే, అతను అంత మాస్ బాణీలు, బీట్ పాటలు ఇచ్చేవాడు. అదే సమయంలో చక్కటి శ్రావ్యమైన పాటలూ కూర్చాడు. ‘ఔను! వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు!’ చిత్రంలో అతను కూర్చిన మెలొడీ పాటలు ఆల్‌టైమ్ హిట్. కెరీర్లో జోరు కాస్తంత తగ్గినప్పుడల్లా మళ్ళీ ఒక సూపర్‌హిట్ సినిమా ఆల్బమ్‌తో ముందుకు దూసుకొచ్చేవాడు. చక్రి చాలా బోళామనిషి. గోరంత పొగిడినా, కొండంత సంతోషించే మనిషి. ఎప్పుడూ ఎవరి గురించీ చెడు మాట్లాడేవాడు కాదు. చక్రిలో అది నాకు బాగా నచ్చేది. చక్రి ఎన్నో పాటలు కూర్చినా, ఈ క్షణంలో చక్రి పాట అంటే నాకు గుర్తొస్తున్నది మాత్రం - ‘చక్రం’ చిత్రంలోని సిరివెన్నెల సీతారామశాస్త్రి రచన ‘జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది!’ దానికి కారణం లేకపోలేదు. చక్రికి ఎప్పుడూ చుట్టూరా జనం ఉండాలి... ఎంతమంది వచ్చినా, అందరికీ భోజనం పెట్టాలి. అదీ అతని స్నేహశీలత. ఇవాళ అంతమంది స్నేహితుల్ని సంపాదించుకొని, అందరినీ వదిలేసి హఠాత్తుగా వెళ్ళిపోయాడు. చక్రి సినీ, వ్యక్తిగత జీవితం నుంచి అందరం నేర్చుకోవాల్సింది కూడా ఒకటుంది. ఎంత పని ఉన్నా... చేయండి. కానీ, దాని కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టకండి. వేళకు తిండి తినండి. వేళాపాళా లేకుండా తినడం, అర్ధరాత్రి దాకా పనిచేసి, తెల్లవారు జామున ఎప్పుడో నాలుగింటికి తినడం లాంటి పనులు చేయకండి. ఆ జాగ్రత్తలు పాటించి ఉంటే, నలభై ఏళ్ళూ నిండీ నిండకుండానే చక్రి మనకు దూరమయ్యేవాడు కాదు. చక్రి మా ఇంట్లో సభ్యుడి లాంటివాడు. ఆ సభ్యుడు ఇవాళ లేడు. అది తీరని బాధ! - ఆర్.పి. పట్నాయక్ (సినీ సంగీత దర్శకుడు, చక్రికి చిరకాల స్నేహితుడు) -
ఇలాగొచ్చి అలా వెళ్లిపోయావా!
► ఒరేయ్ బిడ్డా...! ► నీకు గుర్తుందో లేదో కానీ నాకు మాత్రం బాగా గుర్తుంది. ► నేను హైదరాబాద్ కమలాపురి కాలనీలోని హుస్సేన్‌గారి అపార్ట్మెంట్లో ఉండేవాణ్ణి. ► ఆ ఎదురుగానే నిర్మాత జయకృష్ణ గారి సినిమా ఆఫీసు. ► నేను బయటికొస్తుంటే నువ్వు గేటు దగ్గర తగిలి, పరిచయం చేసుకున్నావ్. ► అప్పుడింత లావు లేవు... కొంచెం సన్నగా ఉన్నావ్ ► అగ్గగ్గలాడుతూ ‘నాకో ఛాన్సివ్వండి’ అనడిగావ్. ఇది జరిగిన నెలరోజుల తర్వాత- ‘ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమా పని మొదలైంది. మామూలుగా నా సినిమాలకు ఇళయరాజాగారే మ్యూజిక్కు. ఇదేమో చిన్న సినిమా. బడ్జెట్ సహకరించదు. హైదరాబాద్‌లో ఎవరున్నారా అని ఎంక్వైరీ చేస్తుంటే, ‘మళ్లి కూయవే గువ్వా’ పాట విన్నా. ఆ పాట నువ్వు చేసిందే! ‘ఇట్లు శ్రావణి - సుబ్రహ్మణ్యం’ సినిమాలోది. దాని డెరైక్టర్ పూరి జగన్నాథ్ గారిని నీ గురించి అడిగితే, ‘‘తక్కిన వాళ్లకంటే భిన్నంగా అతనిలో ఏదో ఉందండీ’’ అని చెప్పారు. దాంతో నిర్మాతకు నీ పేరే రికమండ్ చేశా.ఆ వేళ ఉదయం తొమ్మిదింటికి కంపోజింగ్ మొదలెట్టాలి. తొమ్మిదిన్నరైంది. నువ్వింకా రాలేదు. ‘మేస్ట్రో’ ఇళయరాజాతో చాలా సినిమాలలో పని చేసిన నాకు నువ్వెలా సింక్ అవుతావోనన్న బెంగ ఉంది. సాయంత్రం నాలుగు వరకూ చూసినా నువ్వు రాలేదు. నాకు భలే కోపం వచ్చేసింది. ‘‘అబ్బే... ఇతనితో కష్టం’’ అనేసుకుని కారెక్కిబోతుంటే నువ్వొచ్చావ్. షార్టు, బనీను వేసుకుని జాగింగ్‌కు వెళ్తున్నట్టుగా వచ్చావ్. ‘గుడీవినింగ్ సార్’ అని నువ్వు చెబితే, నేను కోప్పడి వెళ్ళిపోబోయాను. నువ్వు తెగ బతిమిలాడావ్. నాకు అప్పటికప్పుడు‘వెన్నెల్లో హాయ్‌హాయ్’ పాట వినిపిస్తే అక్కడికక్కడే చతికిలపడిపోయా. నీ మీద కోపమంతా పోయింది. నువ్వేదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా కూడా నేను పట్టించుకోలేదు. అప్పట్నుంచి నువ్వు నన్నొదల్లేదు. నేను నిన్నొదల్లేదు. ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ పాటలు ఎంత హిట్టయ్యాయో చెప్పక్కర్లేదు. ఆ తర్వాత నేను తీసిన ‘దొంగ రాముడు అండ్ పార్టీ’, ‘కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా’, ‘గోపి-గోపిక-గోదావరి’, ‘తను మొన్నే వెళ్లిపోయింది’ సినిమాలకు నువ్వే మ్యూజిక్కిచ్చావ్. అన్నీ మంచి మంచి పాటలే. ‘వెన్నెల్లో హాయ్ హాయ్’, ‘నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల’ పాటలైతే రింగ్టోన్లుగా, కాలర్ ట్యూన్లుగా మార్మోగిపోయాయి కదా! నాకు లాంగ్ డ్రైవ్లిష్టం. నువ్వే నీ కారులో ఎక్కడెక్కడికో తిప్పేవాడివి. ఇద్దరం కలిసి రకరకాల తిండి తినేవాళ్లం. ఓసారి మీ ఊరు కంబాలపల్లి తీసుకెళ్లావ్. నువ్వొస్తున్నావని తెలిసి ఎంతమంది జనమో! ఎవరికి వాళ్లు నిన్ను పలకరించేవాళ్లే. ఇదంతా మ్యూజిక్ డెరైక్టర్‌గా నీ ఫాలోయింగ్ అనుకున్నా. కాదు... ఓ వ్యక్తిగా నీ ఫాలోయింగ్ అని తర్వాత తెలిసింది. మామూలుగా ఆగస్టు తొలి ఆదివార మో ఎప్పుడో ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటారు. కానీ నువ్వేమో ఫిబ్రవరి 10న ఓ ఫ్రెండ్షిప్ డే క్రియేట్ చేసుకున్నావ్. ఆ రోజు నువ్వు చేసే హంగామా అంతా ఇంతా కాదు. మహబూబాబాద్, వరంగల్, కంబాలపల్లి.... ఇలా రకరకాల ఊళ్ళ నుంచి నీ ఫ్రెండ్సంతా వచ్చేస్తారు. ఇక హైదరాబాద్ గ్యాంగ్ ఎలాగూ ఉంటారు. మార్నింగ్ ఎనిమిదింటికి మొదలెడితే నెక్ట్స్డే మార్నింగ్ వరకూ పండగే పండగ. చాలామంది సింగర్స్ నీ పాటలు పాడుతుంటే సంబరపడిపోయేవాడివి. మంచి ఫుడ్ పెట్టేవాడివి. ►నీ బర్త్‌డే రోజు కూడా అంతే... సందడి చేసేవాడివి. ► ఇలాంటివి ఏంటేంటో... అద్భుతాలు చేసేసేవాడివి. ► అన్నదానాలు, రక్తదానాలు కూడా చేసేవాడివి. ఓ రోజు నిన్ను జెల్ల కొట్టాను. ‘గట్టిగా కొట్టకండి’ అన్నావు నువ్వు. ‘ఏం... దేనికి’ అని నేను రెట్టిస్తే, ‘‘నేనొక వ్యవస్థను. నా మీద ఎంతో మంది ఆధారపడి ఉన్నారు’’ అంటూ నువ్వు నీ ట్రస్ట్ గురించి, నువ్వు చేసే సేవా కార్యక్రమాల గురించి చెప్పుకొస్తే చాలా అబ్బురపడిపోయాన్నేను. అప్పట్లో మనం ఎన్నోసార్లు కలుసుకునేవాళ్లం. ఎందుకో ఈ మధ్య నేను బిజీ అయిపోయి నిన్ను కలవడమే తగ్గిపోయింది. సరిగ్గా క్రితం వారమే అనుకుంటా కదా... నిన్ను కలిసింది. అప్పుడు నువ్వో మాటన్నావ్. ‘‘నెక్ట్స్ సినిమా ఓ అద్భుతం చేద్దాం’’ అని బలంగా చెప్పావు. నా లైఫ్‌లో చాలా చాలా అద్భుతమైన వ్యక్తుల్ని కలిశాను. నేను జీవితంలో డబ్బేమీ సంపాదించుకోలేదు. కానీ, అద్భుతమైన వ్యక్తుల సాంగత్యాన్ని సంపాదించుకున్నా. ఆ అద్భుతమైన వ్యక్తుల్లో నువ్వొకడివి. ఎవ్వరికీ సాయమే తప్ప హాని చేయని ఓ మరపురాని మనిషివి నువ్వు. అందరూ నువ్వీ భూమ్మీద నుంచి వెళ్లిపోయావంటున్నారు. నాకైతే నమ్మశక్యంగా లేదు. ఏ కంబాలపల్లో వెళ్లావనుకుంటున్నాను. అయినా నీకెందుకంత తొందర. ఇలాగొచ్చి మరీ... అలా వెళ్లిపోయావ్! నమ్మలేకపోతున్నా బిడ్డా! నీ వంశీ -
పుష్కరాలకు... పాట చేద్దామనుకున్నాం!
చక్రి మరణం నాకు ఏ మాత్రం నమ్మశక్యంగా లేదు. అతను నాకు ఎంత ఆత్మీయుడంటే, గీత రచయితగా ఇవాళ నేను ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారణమే అతను. చక్రి కెరీర్లో అతని సంగీత దర్శకత్వంలో అత్యధిక పాటలు రాసిన రచయితను నేనే. అలాగే, గీతరచయితగా నా కెరీర్లో నా పాటలకు అత్యధికంగా సంగీతం అందించిన మ్యూజిక్ డెరైక్టర్ చక్రి. ‘ఇట్లు... శ్రావణి - సుబ్రహ్మణ్యం’తో మొదలైన మా కాంబినేషన్ ఇప్పటి దాకా ఆగకుండా సాగుతోంది. వ్యక్తిగతానికి వస్తే, చక్రితో గడిపిన క్షణాలు, జరిగిన సంగతులు అన్నీ ఇన్నీ కావు. నేను కారు కొనుక్కోవడానికి కారణం - చక్రి. గీత రచయితగా తొలి రోజుల్లో నేను టూవీలర్ మీద తిరిగేవాణ్ణి. ఒకసారి హైదరాబాద్‌లో జోరున వర్షం. తడిసిపోయిన నేను గణపతి కాంప్లెక్స్ దగ్గర చెట్టు కింద నిలుచున్నా. అయినా వర్షం ధాటికి తడిసిపోతున్నా. ఆ సమయంలో అటు నుంచి తన ‘మ్యాటిజ్’ కారులో వెళుతున్న చక్రి బండి ఆపి, నన్నూ కారులో రమ్మన్నాడు. నా టూవీలర్ అక్కడ వదిలేసి వెళ్ళడం ఇష్టం లేక, వద్దన్నాను. ఆ తరువాత నేను కలిసిన వెంటనే చక్రి, ‘నువ్విక కారు కొనుక్కోవాలి’ అంటూ బలవంతపెట్టాడు. అలాగే, పాట రాసినందుకు నాకివ్వాల్సిన పారితోషికం డబ్బులు తన దగ్గరే దాచి ఉంచి, కారు కొనుక్కోవడానికి తగినంత పోగయ్యాక ఇచ్చాడు. అలా నేను నా మొదటి కారు కొన్నది చక్రి వల్లే! అలాగే, నా డ్రెస్సింగ్ స్టైల్ మార్చింది కూడా చక్రే! స్టైల్స్ అంటే ఎలా ఉండాలి, ఏమిటనేది తనే నాకు చెప్పాడు. నన్ను ప్రత్యేకంగా సికింద్రాబాద్‌లోని ‘స్టైల్ జోన్’కు తీసుకువెళ్ళి, అన్నీ కొనిపెట్టాడు. అదీ అతనిలోని స్నేహశీలత. చక్రిలోని గొప్ప గుణం ఏమిటంటే, తాను ఎదుగుతూ పక్కవాళ్ళను కూడా ఎదగనిచ్చే వ్యక్తి. పక్కవాళ్ళ ఎదుగుదలను చూసి అమితంగా సంతోషించే వ్యక్తి. నా రచనలు అతనికి ఎంత ఇష్టమంటే, కెరీర్ తొలి రోజుల్లో ప్రతి పాటకూ రచయితగా నన్నే రికమెండ్ చేసేవాడు. కానీ, ఇతరులకు అది తప్పుగా అనిపిస్తుందేమోనని ఒక దశకు వెళ్ళాక నేనే వద్దన్నాను. నాకు నేనుగా ఎదగాలనుకుంటున్నా అన్నా. అతను నా మాటను అపార్థం చేసుకోలేదు. నా మనసులోని భావం గ్రహించాడు. చివరకు దర్శక, నిర్మాతలు వచ్చి, పాటలు నాతోనే రాయించమని అడిగినప్పుడు, ‘వాళ్ళే నిన్ను కోరుకొనే స్థితికి ఎదిగావు’ అంటూ ఆనందించాడు. అలాంటి వ్యక్తులు ఇవాళ అరుదు. గమ్మత్తేమిటంటే, గోదావరి తీరం నుంచి వచ్చిన నేను గోదావరి నది మీద రాసిన కవిత అంటే చక్రికి మహా ఇష్టం. అసలు ఆ కవితే మమ్మల్ని తొలిరోజుల్లో బాగా సన్నిహితం చేసి, కలిపింది. వచ్చే ఏడాదిలో గోదావరి పుష్కరాలు వస్తున్నాయనీ, ఏదైనా మంచి పాట చేద్దామనీ ఇటీవలే నాతో అన్నాడు. అందుకు సిద్ధమవుతున్నాం. రేపో, ఎల్లుండో ఆ పని మీద కలవాల్సింది. ఇంతలోనే అనుకోని ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది. సినీ పరిశ్రమకనే కాదు... నాకు వ్యక్తిగతంగా కూడా చక్రి లేని లోటు ఎన్నడూ తీరనిదే! - భాస్కరభట్ల సినీ గీత రచయిత - చక్రికి సన్నిహితుడు -
శోకసంద్రంలో జగమంత కుటుంబం
అనురాగబంధం... సంగీత సాగరంలో ‘జగమంత కుటుంబాన్ని’ ఓలలాడించిన మ్యూజిక్ డెరైక్టర్ గిల్ల చక్రధర్ (చక్రీ) ఇక లేరు అనే నిజాన్ని జిల్లా ప్రజానీకం జీర్ణించుకోలేకపోతోంది. పొరుగున వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామంలో జన్మించిన చక్రీతో జిల్లాలో పలువురికి స్నేహబాంధవ్యాలున్నాయి. దాదాపు 15 ఏళ్లపాటు తన పాటలతో ఉర్రూతలూగించిన చక్రీ మరణంతో జిల్లాలోని ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు. స్వరాల చక్రవర్తి : మానుకోట నుంచి ఎదిగిన సంగీత వృక్షం వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కంబాలపల్లిలో జన్మించిన చక్రి ఉత్తమ సంగీత దర్శకునిగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఆయన ఎంత ఎదిగినా జన్మస్థలాన్ని మాత్రం మరువలేదు. ఈ ప్రాంతంలోని కళాకారులకు తోడ్పాటు అందించారు. చిన్న కార్యక్రమాలకు కూడా హాజరయ్యేవారు. ఆయన మరణ వార్త విని స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. శోకసంద్రంలో జగమంత కుటుంబం చక్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న జిల్లా వాసులు ఖమ్మం స్పోర్ట్స్/కల్చరల్ : ఖమ్మంలోని తరుణిహాట్లో 2008లో జరిగిన స్తంభాద్రి సంబరాల్లో చక్రి పాల్గొని తన గాత్రంతో ప్రేక్షకులను ఉర్రుతలూగించారు. 2009లో స్నేహితుల ఆధ్వర్యంలో పెవిలియన్ గ్రౌండ్లో మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 2010లో మమత మెడికల్ కాలేజిలో జరిగిన కల్చరల్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 2012 డిసెంబర్ 9న మున్నూరుకాపు వనభోజనాల్లో పాల్గొని సందడి చేశారు. 2013 నవంబర్‌లో జరిగిన మధిరోత్సవాల్లో పాల్గొన్నారు. ఇటీవల కూడా నగరంలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి ఆయన హజరయ్యారు. స్నేహానికి ప్రాణం ఇచ్చేవాడు చిన్నప్పటి నుంచి చక్రి స్నేహితులకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవాడని ఆయన చిన్ననాటి స్నేహితుడు గాయత్రి డిగ్రీకళాశాల తెలుగు లెక్చరర్ మృదులాకర్ రవీందర్ చెప్పారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10న ఫ్రెండిషిప్డే రోజున స్నేహితులమంతా ఎక్కడున్న ప్రత్యేక చొరవ తీసుకుని ప్రతి ఒక్కరినీ సరాదాగా గడిపేవాడని గుర్తుచేసుకున్నారు. అంతమంచి స్నేహితుడు ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రవీందర్‌తో పాటు న్యూవిజన్ పాఠశాలలో తెలుగు టీచర్‌గా పనిచేస్తున్న పద్మ, శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో మ్యాథ్స్ లెక్చరర్‌గా పనిచేసున్న రాంసుధాకర్ చక్రితో కలిసి చదువుకున్నారు. అందరికీ ఆప్తుడు బయ్యారం: సినీసంగీత దర్శకుడు చక్రికి బయ్యారంతో ఎనలేని బంధం ఉంది. ఖమ్మం-వరంగల్ జిల్లాల సరిహద్దులోని మహబూబాబాద్ మండలం కంబాలపల్లి చక్రి స్వగ్రామం కావటంతో ఆయన స్నేహితులు బయ్యారంలోనూ ఉన్నారు. మండలంలోని కొత్తపేటకు చెందిన టైలర్ వడ్లపూడి రాజా దగ్గర అనేక సంవత్సరాల పాటు చక్రి దుస్తులు కుట్టించుకునే వారు. 2010 వ సంవ త్సరంలో రాజా గంధంపల్లిలో నిర్మించిన వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించేందుకు వచ్చిన చక్రి ఆ సమయంలో తనను కలిసిన పదిమంది వృద్ధులకు తన సొంత ఖర్చులతో వాటర్క్యాన్లను ఉచితంగా అందజేశారు. -
సంగీత ఝురి చక్రి హఠాన్మరణం
కంబాలపల్లిలో విషాదం తెలంగాణ స్వరముత్యం.. ఓరుగల్లు కీర్తి కెరటం.. కోట్లాది హృదయూల ఆత్మబంధువు శ్వాస ఆగింది..! చివరి నిమిషం వరకు సంగీత మాధుర్యంతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన స్వరఝురి అలసిపోరుుంది.. పాటల పల్లకి ‘చితి’కింది.. ఉద్దండుల పాటలకు స్వరాలందించిన బాణి మౌన ముద్ర వహించింది.. స్నేహశీలి నేలకొరిగాడు.. అగ్రనాయకులు, యువ హీరోలను అగ్రపథాన నిలిపిన కంఠం మూగబోరుుంది.. మాస్, క్లాస్‌ను తన మెలోడీతో ఉత్తేజ పరిచిన గొంతుక ఆగింది.. చిత్రసీమ చింతించింది.. ఓరుగల్లు ఘొల్లుమంది.. మహబూబూబాద్ బోరుమంది.. కంబాలపల్లి కన్నీళ్లు పెట్టింది.. మహబూబాబాద్ ముద్దుబిడ్డ చక్రి(జిల్లా చక్రధర్) జగమంత కుటుంబాన్ని వదిలి నింగికెగిశాడు.. దీంతో స్నేహితులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, సంగీత ప్రియులను శోకసంద్రంలో మునిగిపోయారు.. స్వరాల చక్రం మూగబోరుునా.. నీ గానామృతం చిరస్థారుుగా ప్రజల గుండెల్లో నిలిచిపోతుందని బరువెక్కిన హృదయూలతో నేస్తానికి సెలవు పలికారు.. ఆకాశాన చంద్రుడిగా.. సాగరాన సూర్యుడిగా ఈ గడ్డకు మళ్లీరా.. అంటూ నివాళులర్పించారు. - మహబూబాబాద్/హన్మకొండ కల్చరల్ మానుకోట నుంచి ఎదిగిన సంగీత వృక్షం వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కంబాలపల్లిలో జన్మించిన చక్రి ఉత్తమ సంగీత దర్శకునిగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఆయన ఎంత ఎదిగినా జన్మస్థలాన్ని మాత్రం మరువలేదు. ఈ ప్రాంతంలోని కళాకారులకు తోడ్పాటు అందించారు. చిన్న కార్యక్రమాలకు కూడా హాజరయ్యేవారు. ఆయన మరణ వార్త విని స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
సంగీత దర్శకుడు చక్రి హఠాన్మరణం
* గుండెపోటుతో కన్నుమూత * నిర్ఘాంతపోయిన అభిమానులు * శోకసంద్రంలో చిత్రసీమ * తరలివచ్చిన అభిమానులు * చక్రి భౌతిక కాయానికి ప్రముఖుల నివాళి * ముగిసిన అంత్యక్రియలు * ఇప్పటివరకు 99 చిత్రాలకు పనిచేసిన చక్రి సాక్షి, హైదరాబాద్, వరంగల్: ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు చక్రి(40) సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో గుండెపోటుతో మృతిచెందారు. అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చి.. అనతికాలంలోనే ఉన్నతస్థాయికి ఎదిగిన చక్రి హఠాన్మరణంతో సినీ పరిశ్రమ, అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. చక్రి ఇప్పటి వరకు 99 చిత్రాలకు సంగీతం అందించారు. సత్యం, కబడ్డీ కబడ్డీ, పెదబాబు, చక్రం, దేవదాసు, కృష్ణ, మస్కా, సింహా, జై బోలో తెలంగాణ, ఢీ, దేనికైనా రెడీ వంటి ప్రజాదరణ పొందిన చిత్రాలకు ఆయన పనిచేశారు. దాసరి నారాయణరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘ఎర్రబస్సు’ ఆయన ఆఖరి సినిమా. హీరో బాలకృష్ణతో 100వ చిత్రం చేయాలనుకున్నారు. కానీ ఇంతలోనే చక్రి ఈ లోకాన్ని వీడారు. యువ సంగీత దర్శకుడి హఠాన్మరణంతో తెలుగు చలనచిత్ర సీమ నిర్ఘాంతపోయింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో చక్రి మరణ వార్త తెలుసుకుని సినీ రంగానికి చెందిన పలువురు హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలివచ్చారు. తర్వాత కొద్దిసేపటికి చక్రి భౌతికకాయాన్ని ప్రజలు, ప్రముఖుల సందర్శనార్థం ఫిల్మ్ చాంబర్ ప్రాంగణానికి తరలించారు. చక్రి మృతదేహాన్ని చూసిన సన్నిహితులు, సినీ ప్రముఖులు కన్నీరుమున్నీరయ్యారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తమను పరిశ్రమకు పరిచయం చేసిన విషయాన్ని గుర్తు చేసుకొని పలువురు గాయకులు కన్నీటిపర్యంతమయ్యారు. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో భౌతిక కాయాన్ని జర్నలిస్టుకాలనీలోని ఆయన నివాసానికి తరలించారు. అక్కడ వైదిక కర్మల అనంతరం సాయంత్రం ఐదు గంటలకు అంతిమయాత్ర మొదలైంది. పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. అప్పటికే అక్కడకు భారీ సంఖ్యలో అభిమానులు, సంగీత కళాకారులు తరలివచ్చారు. శ్రేయోభిలాషులు, బంధువులు అశ్రు నయనాలతో చక్రికి తుది వీడ్కోలు పలికారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, డెరైక్టర్ ఎన్. శంకర్, విమలక్క తదితరులు శ్మశానవాటిక వద్దకు చేరుకుని చక్రి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న సమయంలో చక్రి భార్య శ్రావణి స్పృహతప్పి కుప్పకూలిపోయారు. చక్రి మృతికి సంతాపంగా చిత్ర పరిశ్రమలో సోమవారం నాటి షూటింగ్‌లన్నీ వాయిదాపడ్డాయి. 14 ఏళ్ల సినీ ప్రస్థానం.. చక్రి సొంత ఊరు వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కంబాలపల్లి. ఆయన 1974 జూన్ 15న జన్మించారు. తల్లి విద్యావతి, తండ్రి వెంకటనారాయణ. చక్రి పూర్తి పేరు జిల్లా చక్రధర్. ప్రాథమిక విద్యాభ్యాసం కంబాలపల్లిలోనే సాగింది. మహబూబాబాద్‌లో పదో తరగతి, ఇంటర్ పూర్తి చేశారు. హన్మకొండలో డిగ్రీ చదివారు. డిగ్రీ రోజుల్లోనే సంగీత విద్వాంసురాలు విజయలక్ష్మి వద్ద వయొలీన్ నేర్చుకున్నారు. సంగీత విద్వాంసులు ఆచార్య వి.తిరుపతయ్య వద్ద కర్ణాటక సంగీతాన్ని నేర్చుకున్నారు. చక్రికి పాటలు రాయడం కంటే పాటలు పాడటం అంటేనే ఎక్కువ ఇష్టం. తెలంగాణలో ఒకప్పుడు ఊర్రూతలూగించిన శంకర్, సారంగపాణి ఆర్కెస్ట్రా ఎక్కడ జరిగినా చక్రి అక్కడికి వెళ్లేవారు. ఇళయరాజా పాటల వింటూ ఆ స్థాయి సంగీత దర్శకుడిని కావాలని కలలు కనేవారు. చక్రి తన 18వ ఏట మొదటి పాటకు ట్యూన్ చేశారు. జాతీయవాద భావజాలంతో రాసిన ‘‘ఒకే జాతి మనదిరా... ఒకే బాట మనదిరా..’’ అనే దేశభక్తి గీతానికి అందరి ప్రశంసలు దక్కాయి. భారత వికాస పరిషత్ పోటీలలో చక్రి పాడిన పాటలు ఊర్రూతలూగించాయి. తన మిత్రుల ప్రోత్సాహంతో మహబూబాబాద్‌లో సాహితి కళాభారతి సంస్థను చక్రి స్థాపించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో తన ఆర్కెస్ట్రా బృందంతో ప్రదర్శనలు ఇచ్చేవారు. ఈ క్రమంలోనే 1995లో హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఓ హాస్టల్లో పనిచేశారు. నెలకు రూ. 1300 జీతానికి మార్కెటింగ్ ఉద్యోగం చేశారు. తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటూనే.. మిత్రులు కందికొండ, లక్ష్మణ్‌లతో కలసి ‘పండు వెన్నెల’ అనే అల్బమ్‌ను రూపొందించారు. మెగాస్టార్ చిరంజీవిని కాన్సెప్ట్‌గా తీసుకుని ‘చిరునవ్వుతో చిరుకానుక’ పేరిట పాటలను ట్యూన్ చేసి క్యాసెట్ రూపొందించారు. ఇవి బాగా ప్రజాదరణ పొందాయి. ఆదిత్య ఆడియో కంపెనీవారు సినీ దర్శకుడు పూరి జగన్నాథ్‌కు చక్రి పాటలను పరిచయం చేశారు. ఆ విధంగా పూరి అవకాశమివ్వడంతో 2000 సంవత్సరంలో ‘బాచి’ చిత్రంతో సంగీత దర్శకుడిగా చక్రి ఆరంగేట్రం చేశారు. 14 ఏళ్ల సినీ ప్రస్థానంలో అనేక విజయవంతమైన చిత్రాలకు పని చేశారు. ప్రతిష్టాత్మక అవార్డులను ఎన్నింటినో పొందారు. ఉత్తమ నేపథ్య గాయకుడిగానూ అవార్డు పొందారు. ఎందరో కొత్తతరం గాయనీగాయకులను చిత్రసీమకు పరిచయం చేశారు. చక్రి చారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించేవారు. ఆయన అకాల మరణంతో సంగీత లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. చక్రి మరణంతో దిగ్భ్రాంతి చెందా: సీఎం కేసీఆర్ ‘ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రి మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా. చిన్న వయసులోనే ఎన్నో విజయాలు సాధించిన చక్రి మరణం తెలంగాణ రాష్ట్రానికి, సినిమా పరిశ్రమకు తీరని లోటు. మధురమైన సంగీతంతో ఎన్నో అవార్డులు పొందిన చక్రి అకాల మరణం దురదృష్టకరం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’. సంగీత ప్రపంచం మూగబోయింది చక్రి ఆకస్మికంగా మృతిచెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా. ఆయన మృతితో సంగీత ప్రపంచం మూగబోయింది. కుటుంబ సభ్యులకు సానుభూతి par తెలియజేస్తున్నా. - కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వైఎస్సార్ సీపీ నేత జగన్ సంతాపం ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రి ఆకస్మిక మృతికి దిగ్భ్రాంతికి గురయ్యా. ఆయన మృతికి సంతాపం. చక్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. సీఎల్పీ నేత జానారెడ్డి సంతాపం ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచే సింది. తన ప్రతిభా పాటవాలతో చిన్న వయస్సులోనే చక్రి అగ్ర సంగీత దర్శకుల జాబితాలో చేరారు. గాయకులకు స్ఫూర్తి దాయకుడు యువ సంగీతదర్శకులకు, వర్ధమాన గాయకులకు చక్రి స్ఫూర్తి దాయకులు. అనేక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే కాకుండా తనవంతు సహాయాన్ని కూడా అందించేవారు. - కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కలసి పని చేశాం చక్రి నాకు ఆత్మీయులు. స్వదేశీ జాగరణ మంచ్‌లో నాతో కలసి అనేక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. వారి మరణం తెలుగు చిత్ర పరిశ్రమ, సంగీత ప్రపంచానికి తీరని లోటు. చక్రి ఆత్మకు శాంతి par చేకూరాలి. - మురళీధరరావు, బీజేపీ నేత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సంతాపం ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రి మృతికి సంతాపం. చక్రి నివాసాన్ని సందర్శించిన చెవిరెడ్డి ఆయన మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. చక్రి తనకు ఎంతో ఆప్తుడు. ఆయన మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. కళారంగానికి తీరని లోటు సుప్రసిద్ధ సినీ సంగీత దర్శకుడు, గాయకుడు చక్రి అకాల మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. చిన్నవయసులోనే సంగీత దర్శికుడిగా పేరొందిన చక్రి మరణం సినీ, కళా రంగాలకు తీరని లోటు. చక్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. - సీపీఐ నేతలు కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి -
చెరగని ‘చక్రి’ జ్ఞాపకాలు
మెతుకుసీమతో ప్రత్యేక అనుబంధం గుర్తుచేసుకుంటున్న జిల్లావాసులు సంగారెడ్డి క్రైం: ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి హఠాన్మరణం జిల్లా వాసులను తీవ్రంగా కలచివేసింది. ఆయన మరణవార్త విని జిల్లాలోని సంగీత ప్రియులు, వివిధ సంఘాల నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లాతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, చక్రి ప్రజా సేవలో ముం దుండే వారనీ, జిల్లాతో ఆయన ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. పటాన్చెరు మండలం అమీన్పూర్ ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు జిన్నారంలో ఎస్సీ,ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు దుస్తులు, షూ పంపిణీ చేసిన సంగతి గుర్తు చేసుకున్నారు. సినిమాల్లో బీజీగా ఉన్నప్పటికీ స్థానిక ఫొటోగ్రాఫర్ల కోరిక మేరకు సంగారెడ్డిలో 2012 ఆగస్టు 19న జరిగిన ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవంలో చక్రి పాల్గొన్న విషయా న్ని పలువురు గుర్తు చేసుకున్నారు. జహీరాబాద్‌లో నిర్వహించిన పలు సామాజిక కార్యక్రమాల్లో కూడా చక్రి పాల్గొన్నారని గుర్తు చేశారు. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఓ చిన్న సామాజిక కార్యక్రమానికి ఆహ్వానించినా తప్పకుండా పాల్గొనేవారని చక్రి సామాజిక సేవను కొనియాడారు. చక్రి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ఫొటోగ్రాఫర్ల, వీడియోగ్రాఫర్ల సంఘం అధ్యక్షుడు జగన్, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.విజయరావు, సామాజిక సమ్రత రాష్ట్ర కార్యదర్శి పి.దుర్గాప్రసాద్, తెలంగాణ క్రిష్టియన్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.విల్సన్‌లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆగిన సంగీత చక్రం పిన్నవయసులోనే తెలుగు సినీసంగీత సామ్రాజ్యంలో తనదైన ముద్రవేసిన ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి సోమవారం కన్నుమూశారు. ఆయన మృతి చిత్రపరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. సంగీత ‘చక్రం’ ఆగిపోయిందంటూ పలువురు సినీ ప్రముఖులు కంటతడిపెట్టారు. ఉదయం అపోలో ఆస్పత్రి నుంచి చక్రి పార్థివ దేహాన్ని ఫిలించాంబర్‌కు తరలించారు. పలువురు సినీ ప్రముఖులు, సంగీత దర్శకులు, గాయకులు, ఆయన అభిమానులు అక్కడికి చేరుకొని నివాళులు అర్పించారు. సాయంత్రం చక్రి అంత్యక్రియలు పంజగుట్ట హిందూ శ్మశానవాటికలో ముగిశాయి. -
చక్రి'కి సినీ ప్రముఖుల నివాళి
-
వెక్కి వెక్కి ఏడ్చిన ఉదయభాను!.
-
వెక్కి వెక్కి ఏడ్చిన ఉదయభాను!
ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మరణవార్త విని.. యాంకర్, నటి ఉదయభాను వెక్కి వెక్కి ఏడ్చేశారు. చక్రి ఈమధ్య కాలంలో చాలా లావుగా అయిపోయారని.. అయినా కూడా ఆయనకు రకరకాలుగా డ్రస్సులు వేసుకోవడం ఆయనకు ఇష్టమని చెప్పారు. నాలుగు అడుగులు వేసినా బాగా ఆయాపడుతున్నారని, అది చూసి కొంతమంది ఆయన ఉన్నంతసేపు ఊరుకుని.. వెళ్లగానే వెనకాల రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారని ఉదయభాను ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత లావుగా ఉంటే ఆరోగ్యం ఏమయిపోతుంది.. హ్యాపీగా, హెల్దీగా ఉండాలని ఆయనకు చెప్పేదాన్నంటూ.. కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు చూస్తే ఉన్నట్టుండి ఇలాంటి పరిస్థితి ఎదురైందని, ఆయన మీద చాలామంది విమర్శలుచేశారని.. కానీ, అంత మంచి హృదయం ఉన్నవాళ్లు మళ్లీ దొరకడం కష్టమని ఉదయభాను చెప్పారు. ఆయన లేని బాధను తాను మాటల్లో చెప్పలేనని, మనస్ఫూర్తిగా ' చక్రీ.. వియ్ మిస్ యు' అని మాత్రమే అనగలనని ఉదయభాను తెలిపారు. -
అన్నయ్యకు హాస్పటల్ అంటే భయం..
హైదరాబాద్ : డాక్టర్లు, హాస్పటల్ అంటే భయంతోనే చక్రి హాస్పటల్‌కు వెళ్లలేదని నటి హేమ అన్నారు. ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలని తాను చాలాసార్లు అన్నయ్యకు చెప్పేదాన్ని అని,... ఇదే విషయాన్ని వదిన (శ్రావణి)తో చాలాసార్లు అన్నట్లు ఆమె తెలిపారు. ఇటీవల ఎర్రబస్సు ఆడియోలో కలిసినప్పుడు అన్నయ్యను హాస్పటల్ కి తీసుకు వెళుతున్నానని, సర్జరీ చేయిద్దామనుకుంటున్నట్లు... ఇకనుంచి గ్లామర్ గా కనిపిస్తారంటూ వదిన చెప్పిందని హేమ తెలిపారు. చక్రి మరణవార్తను తాను నమ్మలేదని...ఈ విషయాన్ని సుమారు పదిమందికి ఫోన్ చేసి మరి నిర్ధారణ చేసుకున్నట్లు హేమ చెప్పారు. వైద్య పరీక్షలు చేయించుకోవాలని చక్రి కుటుంబ సభ్యులు చెప్పినా... రేపు వెళదామంటూ చెప్పారని ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకోవటం దురదృష్టకరమన్నారు. ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవటం చాలా అవసరమని హేమ అన్నారు. నిజానికి సినీ రంగంలోకి అడుగుపెట్టిన తొలి నాళ్లలో చక్రి ఓమాదిరిగా వుండేవాడు. అయితే ఆ తర్వాత ఆహార అలవాట్లలో మార్పు, సినీ పరిశ్రమలో తీరికలేని పనులు అతని శరీరంపై తీవ్ర ప్రభావం చూపించాయి. దానికి తోడు చక్రికి మంచి భోజనప్రియుడనే పేరుంది. అది కూడా తోడవడంతో తక్కువ కాలంలో బాగా లావయిపోయాడు. లైపోసెక్షన్ లాంటి చికిత్స చేయించుకోవాలని భావించినా ఎందుకో భయపడ్డాడని అతని సన్నిహితులు చెప్తుంటారు. చనిపోవడానికి కొన్ని గంటల ముందు కూడా అర్ధరాత్రి వరకు రికార్డింగ్ పనుల్లో అతను బిజీగా వున్నట్లు తెలుస్తోంది. రికార్డింగ్ పూర్తయిన తర్వాత బాగా పొద్దుపోయిన సమయంలో ఇంటికి వచ్చి నిద్రపోయారు. అయితే నిద్రలోనే తీవ్రమైన గుండెపోటుకు గురై..తుది శ్వాస విడిచినట్టు డాక్టర్లు చెప్తున్నారు. -
చక్రి వాయిస్ ఇష్టం..ఐ మిస్ హిమ్
హైదరాబాద్ : ఇంత చిన్న వయసులోనే చక్రి మృతి చెందటం సంగీత ప్రపంచానికి తీరని లోటు అని దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు అన్నారు. ఆయన సోమవారం చక్రి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం దాసరి మీడియాతో మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ఎర్రబస్సు చిత్రానికి చక్రి సంగీతం అందించాడని, నిజంగా ఇన్నిరోజులు అతన్ని ఎందుకు మిస్ అయ్యానా అని అనుకున్నట్లు చెప్పారు. భవిష్యత్‌లో అతనితో మరిన్ని సినిమాలు చేయవచ్చు అని అనుకున్నానని.. అయితే హఠాత్తుగా చక్రి జీవితం ఇలా ముగిసిపోతుందని అనుకోలేదన్నారు. చక్రి తనను తండ్రిగా భావించేవాడని, చివరి రోజుల్లో చాలా దగ్గరగా కలిసి ఉన్నామని దాసరి అన్నారు. చక్రీ వాయిస్ అంటే తనకు చాలా ఇష్టమని.. చక్రి వాయిస్ వినిపించడయ్యా అని అనేవాడినని..స్నేహపాత్రుడు...అందరికి కావలసినవాడు అని ...ఐ మిస్ హిమ్ అని దాసరి ఆవేదన వ్యక్తం చేశారు. -
స్వర 'చక్రి'కి ప్రముఖుల నివాళి
-
చక్రి కావాలంటూ.. కన్నీరు మున్నీరు
-
చక్రి కావాలంటూ.. కన్నీరు మున్నీరు
హైదరాబాద్ : చక్రి హఠాన్మరణాన్ని అతడి భార్య శ్రావణి జీర్ణించుకోలేకపోతోంది. ఆమెను ఓదార్చడం ఎవ్వరి తరమూ కావట్లేదు. చక్రి కావాలంటూ ఆమె హృదయ విదారకంగా ఏడుస్తుండడం .. అందరి గుండెలను బరువెక్కిస్తోంది. శ్రావణి కుటుంబ సభ్యులు ...ఆమెను సముదాయిస్తున్నారు. చక్రి, శ్రావణి ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక చక్రి సోదరుడు కన్నీటిపర్యంతం అయ్యారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా విషాదంలో మునిగిపోయారు. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కూడా చక్రి మరణవార్తను తట్టుకోలేకపోయారు. చక్రి అంత్యక్రియల గురించి ఆర్పీ విలేకర్లతో మాట్లాడుతూ చక్రి గురించి ఇంకేం మాట్లాడాలంటూ... ఒక్కసారిగా భోరున విలపించారు. సంగీత స్వరం మూగపోయిన వేళ.. చక్రి స్వగ్రామం కంబాలపల్లి వాసుల గొంతు కూడా మూగబోయింది. సంగీత ప్రపంచంలో తన కంటూ ఓ ముద్ర వేసుకున్న చక్రి తిరిగి రాని లోకాలకు పోయారన్న వార్త తెలుసుకున్న కంబాలపల్లి వాసులు కన్నీరుమున్నీరు అయ్యారు. -
చక్రి అభిమానిని...:బాలయ్య
హైదరాబాద్ : సంగీత దర్శకుడు చక్రి హఠన్మరణం నమ్మశక్యం కావటం లేదని ప్రముఖ నటుడు బాలకృష్ణ అన్నారు. గుండెపోటుతో మృతి చెందిన చక్రి భౌతికకాయన్ని ...బాలయ్య సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ చక్రి తన తమ్ముడు లాంటివాడని... అతను తన తమ్ముడులాంటివాడన్నారు. ఇటీవలే హుదూద్ తుఫాను బాధితుల సహాయార్థం ఏర్పాటు చేసిన 'మేము సైతం' కార్యక్రమంలో తాము కలిశామని,... త్వరలో తన సినిమాకు మళ్లీ సంగీతం అందించాలని అడిగినట్లు చెప్పారు. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదని.. బాలకృష్ణ అన్నారు. చక్రి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా బాలకృష్ణ నటించిన 'సింహ' చిత్రానికి చక్రి సంగీతం అందించారు. ఆ సినిమాకు ఆయనకు నంది అవార్డు వచ్చింది. -
ఇట్లు శ్రావణీ....చక్రీ...
-
సాయంత్రం పంజాగుట్ట శ్మశాన వాటికలో చక్రి అంత్యక్రియలు
హైదరాబాద్: సినీ సంగీత దర్శకుడు చక్రి అంత్యక్రియలు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు పంజాగుట్ట శ్మశాన వాటికలో జరగనున్నాయి. తొలుత ఆయన మృతదేహాన్ని ఇంటికి తరలించి అక్కడ్నుంచి ఫిల్మ్ చాంబర్ కు తీసుకువెళ్తారు. అనంతరం పంజాగుట్ట శ్మశాన వాటికలో చక్రి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సోమవారం చక్రి (40) గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయనకు అపోలో ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 1974 జూన్ 15న చక్రి వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కంభాలపల్లిలో జన్మించారు. ప్రముఖ దర్శకుడు పూరిజగన్నాధ్ దర్శకత్వం వహించిన 'బాచీ' సినిమాతో..... టాలీవుడ్‌కి సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న తమిళ అమ్మాయి, సత్యం, ఢీ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న చక్రి ఆకస్మిక మృతిపట్ల సినీ పరిశ్రమ తీవ్ర ద్రిగ్భాంతికి గురైంది. -
ఇట్లు శ్రావణీ....చక్రీ...
'కమ్మని ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే!' అభిమానిగా ఆమె... ఫోన్లో శ్రావ్యంగా ఆలపించింది. 'నీ జత లేక... పిచ్చిది కాదా... మనసంతా...'అంటూ ఆ అబ్బాయి మనసులోనే చిందేశాడు. 'మైనే ప్యార్ కియా' సినిమా పాటలతో పాటు వాటికి తన హృదయాన్నీ జతగా చేర్చి భద్రంగా ఆమెకు కానుకగా అందించాడు. * ఆ అబ్బాయి సంగీత దర్శకుడు చక్రి. *ఆ అమ్మాయి అతని అభిమాని శ్రావణి. ప్రేమపావురాలై ఒకరికోసం ఒకరు అన్నట్టుగా ఏడేళ్ల క్రితం ఒక్కటైన ఈ జంట హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కాపురం పెట్టారు. ఇట్లు మా కాపురం, మేము... అంటూ చెప్పిన చక్రి , శ్రావణిల దాంపత్య విశేషాలే బెటర్‌హాఫ్. 'సాక్షి' ప్రత్యేకం... అభిమానం పెంచిన ప్రేమ... మాది కొత్తగూడెం. నాన్న గోదావరిఖనిలో ఉద్యోగి. బి.టెక్ చేస్తున్నప్పుడు నాన్న సహోద్యోగి కూతురి పెళ్లికి మ్యూజిక్ డెరైక్టర్ చక్రి వస్తున్నారని తెలిసింది. అప్పటికే నేను ఆయన వీరాభిమానిని. ఈయన పాటలు, ఫొటోల కలెక్షన్ నా దగ్గర చాలా ఉండేది. ఈయన్ని కలవడానికే కాలేజీ ఎగ్గొట్టి మరీ ఆ పెళ్లికి వెళ్లాను. అక్కడ ఈయన్ని చూశాక ఎలాగైనా పాట పాడించాలనుకున్నాను. రిక్వెస్ట్ చేశాక ఒప్పుకు న్నారు. అక్కడే ఫోన్ నెంబర్ అడిగి తీసుకున్నాను. ఈయనతో మాట్లాడుతుంటే టైమే తెలిసేది కాదు. ఈయనకి కోపమనేదే రాదని, కుటుంబాన్ని ప్రేమించే గుణం ఎక్కువగా ఉందని, సామాజిక సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారని తెలుసుకున్నాను. ఆ గుణమే నన్ను అమితంగా ఆకట్టుకుంది. ముందుగా నేనే ప్రపోజ్ చేశాను. నా ప్రేమ విషయం ఇంట్లో కనిపెట్టి, పెళ్లిసంబంధాలు చూడటం మొదలుపెట్టారు. నాకు భయమేసి వెంటనే మా తాతయ్యకు చెప్పేశాను. అమ్మనాన్నలు నా ప్రేమను ఒప్పుకోలేదు, కాని తాతయ్య అర్థం చేసుకున్నారు. మా పెళ్లి (2006 మే 14) తాతయ్యే దగ్గరుండి జరిపించి, ‘ఉన్నది ఒక్క ఆడపిల్ల, తన ఇష్టప్రకారమే చేయడం మంచిది' అని అమ్మనాన్నలను ఒప్పించారు. మా నాన్న ఈయనతో ఏం చెప్పాలన్నా 'నాన్నా..' అని సంబో ధిస్తారు. అంత ఎఫెక్షన్గా ఉంటారు మామా అల్లుళ్లు. అందించిన భరోసా! మేం బ్రాహ్మణులం. పెద్దవాళ్లే మడివంటలు చేసేవారు. చదువుకుంటున్నానని నన్ను వంట దగ్గరకు రానిచ్చేవారు కాదు. ఆ విషయం ఈయనకి ముందే చెప్పాను. పెళ్లయి ఇంటికి వచ్చాక 'శ్రావణికి వంటరాదు. వంటమనిషిని పెట్టుకుందాం. అందరినీ వదిలి నాకోసం వచ్చింది. మనమే తనని సంతోషం గా ఉండేలా చూసుకోవాలి' అని అందరికీ చెప్పారు. వారూ 'అన్నీ తనే నేర్చుకుంటుందిలే' అని నా భయాన్ని పోగొట్టారు. అలా ఈయన సపోర్ట్ వల్లే బి.టెక్ మధ్యలోనే ఆగిపోకుండా పూర్తి చేయగలి గాను. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం ఉండటం వల్ల బిజినెస్ పరంగానూ ఉపయోగపడుతుందని ఇప్పుడు ఎం.బి.ఏ చేస్తున్నాను. ఇంట్లో రోజూ నాన్‌వెజ్ వండినా మా అమ్మనాన్నలు వస్తే మాత్రం ఆ వంట జోలికే వెళ్లరు. పుట్టిల్లు, అత్తిల్లు... ఇరువైపులా గౌరవమర్యాదలు ఉంటేనే దంపతుల మధ్య బంధం బలపడుతుందని నమ్ముతాను. నన్ను నేను మార్చుకున్నాను ఈయన రోజూ పదహారు గంటలు పనిచేస్తారు. నేనే ఈయన పనికి తగ్గట్టు నా తిండి, నిద్ర సమయాలు మార్చుకున్నాను.'పెళ్లి తర్వాత జీవితం గురించి కలలు కనడం సహజమే, కాని వాస్తవంలో వేరుగా ఉంటాయని, ఎప్పుడంటే అప్పుడు సినిమాలు, షికార్లు కుదరదు' అని ఈయన ముందే చెప్పారు. ఆ మాటలకు తగ్గట్టు నడుచుకుంటున్నాను. నచ్చచెబుతారు కొన్ని వెబ్సైట్లలో మా ఇద్దరి గురించి 'డైవర్స్ వరకు వెళ్లిపోయారు' అని రాసినవి చూసినప్పుడు చాలా బాధ కలు గుతుంది. రూమర్స్ రాసే వారి మీద యాక్షన్ తీసుకోమని గొడవ చేస్తా ను. కాని ఈయన మాత్రం 'టైమ్ వేస్ట్, మెల్లమెల్లగా వారే తెలు సుకుంటారులే!' అని నచ్చచెబుతుంటారు. ఈయన పరిచయం చేసిన లేడీ సింగర్స్ అందరూ నాకు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. వారి శారీ డిజైనింగ్ కూడా నేనే చేస్తుంటాను. ఈయన చేసిన శ్రీమన్నారా యణ సినిమాలో ఒక పాటకి అతి బలవంతం మీద కోరస్ పాడాను. మా ఇద్దరికీ ఇళయరాజా, ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అంటే చాలా ఇష్టం. అభిమాని పిలిచే... మా మ్యూజిక్ గ్రూప్‌లో సౌండ్ ఇంజనీర్ పెళ్లి అయితే వెళ్లాను. అక్కడ స్వాగతం పలికే అమ్మాయిల టీమ్‌కి శ్రావణి లీడర్. తను నా సంగీతానికి పెద్ద ఫ్యాన్ అని, పాట పాడమని కోరింది. ముందు బ్రేక్ ఫాస్ట్ అని, తర్వాత భోజనాలు అని పాట పాడకుండా టైమ్ పాస్ చేశాం. నా దష్టి అంతా సెంటరా ఫ అట్రాక్షన్‌గా ఉన్న ఈమె మీదే పడింది. భోజనాలయ్యాక తపినిసరై ఒక పాట పాడాను. తర్వాత ఒక పాట నుంచి మరో పాట వరుసగా పాడుతూ.. కచేరీ అయిపోయింది. అక్కడే ఈవిడ క్లాసికల్ డ్యాన్సర్ అని తెలిసింది. 'మా కాలేజీ యానివర్సరీకి తపికుండా రండి' అని రిక్వెస్ట్ చేశారు ఈమె, ఈమె మిత్రబందం. 'మీ కాలేజీలో కల్చరల్ ఫెస్ట్ ఏర్పాటు చేయండి, వస్తాం' అని ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం. అలా మామూలు నుంచి సొంత విషయాలు మాట్లాడుకునేంతగా మా స్నేహం పెరిగింది. నాకన్నా ఏడేళ్ల వయసు తేడా ఉన్నా ఈవిడ మాటల్లో పరిణతి, సినిమా రంగం పట్ల తనకున్న సదుద్దేశం నన్ను ఆకట్టుకున్నాయి. అలా స్నేహం ప్రేమగా మారింది. బాధ్యత పంచుకునే అమ్మాయి... నన్ను ప్రేమిస్తున్నానని ఈవిడ చెప్పినప్పుడు మూడంతస్తుల బిల్డింగ్ పైన ఉన్నాను. ఆ మాట విన గానే అక్కడ నుంచి దూకేయాలన్నంత ఆనందం కలి గింది. అభిమాని అంటే ఆటోగ్రాఫ్, ఫోటోగ్రాఫ్‌ల వరకే ఉంటారు. కాని నా సంగీతాన్ని అభిమానించడం తో పాటు, నా భావాలనూ ప్రేమించే అమ్మాయి దొరకడం అదష్టంగా భావించాను. 'డబ్బున్న అమ్మాయిని చేసుకోవచ్చు కదా! మధ్యతరగతి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు' అని చాలామంది అడిగారు. నేను కోరుకున్నది డబ్బు కాదు. మంచి మనసుండి నేనంటే ఇష్టపడే అమ్మాయి నా భార్యగా వచ్చి, ఇంట్లో అందరితో బాగుండాలనుకున్నాను. ఆ లక్షణాలు శ్రావణిలో చూశాను. ప్రేమకు కులమతాలు అడ్డంకి కావు. కాని పెళ్లికి అడ్డుపడుతుంటాయి. అందుకే శ్రావణిని ముందుగానే మా ఇంటికి పిలిపించి, పరిస్థితులు తెలియజేశాను. తనూ అర్థం చేసుకుంది. గతాన్ని తలచుకోవడానికే ఇష్టపడను... మాకు ఇంకా పిల్లలు లేరు. ప్రస్తుతానికి ఒకరికి ఒకరం అన్నట్టుగా ఉన్నాం. 'తను రాకముందు జీవితం గురుతైనా లేదని.. తను కలిసి ఉన్న ఆ క్షణం నను వీడిపోదని..' ఈ పాట నా జీవితానికి చాలా దగ్గరగా ఉందనిపిస్తోంది. శ్రావణి అడుగుపెట్టాకే నా జీవితంలోకి ఆనందం వచ్చింది. వస్తుందనుకున్న అవకాశం రాకపోయినా, బాగా హిట్ అవుతుందనుకున్న మూవీ ఫెయిల్ అయినా 'ఎంత కష్టపడ్డారో కదా!' అని తను రెండుమూడు రోజుల వరకు బాధ పడిపోతుంది. ఇండస్ట్రీలో ఆ ఒడిదొడుకులు మామూలే అని చెబుతుంటాను. అయితే నా గురించి ఈవిడ అలా ఫీలవడం నచ్చుతుంది. పెళ్లయ్యాకే మ్యూజిక్ డెరైక్టర్‌గా నాకు నంది అవార్డు లభించింది. బరువు తగ్గడానికి జాగ్రత్తలు... నేను రోజులో ఎక్కువ సమయం కూర్చొనే పనిచేస్తాను. పైగా సరైన సమయంలో తిండి, నిద్ర, వ్యాయామం ఉండవు. దీంతో బరువు బాగా పెరిగాను. ఇంట్లో ఉన్నంతసేపూ మొలకెత్తిన గింజలు, తేనె, నిమ్మరసం.. అంటూ నా డైట్ గురించి శ్రావణి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. కాని బయటకు వెళ్లాక, పనిలో పడిపోతే నేనే అన్నీ మర్చిపోతాను. ముఖ్యంగా విదేశాలకు వెళితే నెలలో కొన్నిరోజుల పాటు తిండి, నిద్ర విషయంలో నియమాలు ఉండవు. దీంతో బరువు తగ్గడం లేదు. నేను లావు అయ్యానని ఈవిడ బరువు పెరగడానికి ట్రై చేస్తోంది. 'బంగారుకొండ మరుమల్లెదండ మనసైన అండ నువ్వేరా.. కనుపాప నిండా నీ రూపు నిండ.. నా బ్రతుకుపండా రావేరా..' పాటను చక్రి ఇష్టంగా కంపోజ్ చేశారు. ఆ పాటను అంతే ఇష్టంగా ఆలపిస్తూ ఉంటారు శ్రావణి. అభిమానాన్నే కాదు, అప్పుడ ప్పుడు కోపాన్నీ పాటలతోనే చూపిస్తానని శ్రావణి... ఆ కోపాన్ని క్షణాల్లో కూల్ చేస్తానని చక్రి... పోటీపడి వివరిస్తుంటే.. ఒకరి కొకరు నిజంగానే కొండంత మురిపెం అనిపించారు. కాగా గుండెపోటుత చక్రి సోమవారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి, ఫొటోలు: శివ మల్లాల -
సంగీత 'చక్ర'ధరుడు ఇకలేరు
-
సినీ సంగీత 'చక్ర'ధరుడు
తెలుగు చలనచిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చాక ఇక్కడ కెరీర్‌ను ప్రారంభించి, అచిరకాలంలోనే అగ్రస్థాయికి చేరిన తొలి సినీ సంగీత దర్శకుడిగాచక్రిని చెప్పుకోవచ్చు. 2000 ప్రాంతంలో తెలుగు చిత్రసీమలోకి పొంగిపొర్లి వచ్చిన కొత్తనీరులో ఆయన భాగం. జాగ్రత్తగా గమనిస్తే, దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోగా రవితేజ, సంగీత దర్శకుడు చక్రి, రచయిత భాస్కరభట్ల తదితరుల కెరీర్ దాదాపు ఏకకాలంలో కలసి ఉన్నత శిఖరాల వైపు సాగినట్లు కనిపిస్తుంది. * ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన జిల్లా చక్రధర్ సినీరంగంలో ‘చక్రి’గా తనకంటూ పేరు, స్థానం సంపాదించుకోవడానికి ముందు ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నారు. వరంగల్ దగ్గరి స్వస్థలం నుంచి ఉద్యోగార్థం హైదరాబాద్ వచ్చిన ఆయన తొలిరోజుల్లో అమీర్‌పేట ప్రాంతంలో చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేశారు. * సంగీతం మీద ఆసక్తితో కాలేజీ రోజుల్లోనే సాంస్కృతిక ఉత్సవాల్లో ఒక దేశభక్తి గీతానికి చక్రి బాణీ కట్టారు. ఆ తరువాత తనలాగే సంగీతం పట్ల ఆసక్తి ఉన్న మిత్రులను కలుపుకొని, ఒక ఆర్కెస్ట్రా బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తొలి రోజుల్లో కొన్ని క్యాసెట్లు కూడా రూపొందించి, విడుదల చేశారు. చివరకు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'బాచి' (2000) చిత్రంతో తెలుగు తెరకు సంగీత దర్శకుడిగా చక్రి పరిచయమయ్యారు. * ఒక దశలో సినిమా అవకాశం కోసం అమితంగా కష్టపడ్డ ఆయన ఆ తరువాత ఏకంగా ఒకే ఏడాది 18 సినిమాలకు సంగీతం అందించిన మ్యూజిక్ డెరైక్టర్‌గా అరుదైన ఘనత సాధించారు. 1980లలో ప్రముఖ సంగీత దర్శకుడు స్వర్గీయ చక్రవర్తి తరువాత మళ్ళీ సంఖ్యాపరంగా ఆ ఘనత అందుకున్నది చక్రి కావడం, ఇద్దరికీ పేరులో సారూప్యత ఉండడం యాదృచ్ఛికమే అయినా, గమ్మత్తై వాస్తవం. * ఒక దశలో అగ్ర హీరోల భారీ బడ్జెట్ చిత్రాల నుంచి చిన్న హీరోల లో బడ్జెట్ చిత్రాల దాకా ఎటు చూసినా చక్రి హవానే కొనసాగింది. తరువాత ఆ జోరు కొంత తగ్గినా, చక్రికంటూ ఒక వర్గం సినిమాలు ఉండేవి. దర్శక - నిర్మాతలు ఉండేవారు. * ఇప్పటికి దాదాపు 80కి పైగా చిత్రాలకు చక్రి సంగీతం అందించినట్లు ఒక లెక్క. ఆ చిత్రాల్లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోని 'ఇట్లు... శ్రావణి సుబ్రహ్మణ్యం', 'శివమణి', 'అమ్మ - నాన్న - ఓ తమిళ అమ్మాయి', 'ఇడియట్', 'దేశముదురు', కృష్ణవంశీ దర్శకత్వంలోని 'చక్రం', వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వంలోని 'దేవదాసు', శ్రీను వైట్ల 'ఢీ' లాంటి పలు విజయాలు ఉన్నాయి. * చక్రి సినీ సంగీతంలోని ఒక విశేషం ఏమిటంటే - ఒక పక్క ఎంత మెలొడీ పాటలు ఆయన అందించారో, అంతే స్థాయిలో బీట్ పాటలు, ఆధునిక తరానికి నచ్చే ట్రెండీ బాణీలు కూడా అందించడం. 'నాకు వ్యక్తిగతంగా శ్రావ్యగీతాలంటే ఇష్టమైనా, దర్శక - నిర్మాతలు కోరిన విధంగా బీట్ పాటలు ఇస్తుంటా' అని ఆయనే చెప్పారు. సుమారు 80కి పైగా చిత్రాలకు సంగీతం అందించిన చక్రి పాటల్లో అనేక హిట్లున్నాయి. 'నువ్వక్కడుండి నేనిక్కడుంటే ప్రాణం విలవిల...' లాంటి ఆల్‌టైమ్ హిట్లు ఆయన పాటలే. అలాగే, 'జగమంత కుటుంబం నాది...'('చక్రం' చిత్రంలోని సీతారామశాస్త్రి రచన) లాంటి తాత్త్విక గీతాలున్నాయి. మాస్, బీట్ పాటలకైతే లెక్కే లేదు. * సినీ సంగీత రంగంలోకి ప్రవేశించడానికి తాను పడ్డ కష్టాలను చక్రి చివరి దాకా మర్చిపోలేదు. అందుకే, అందరితో స్నేహపూర్వకంగా మెలుగుతూ వచ్చిన ఆయన కౌసల్య లాంటి పలువురు వర్ధమాన గాయనీ గాయకులకు పదే పదే అవకాశాలిచ్చి, ప్రోత్సహించారు. స్వతహాగా తనలో ఉన్న గాయకుడి కోణాన్ని కూడా వీలైనప్పుడల్లా వెలికితీసేవారు. తారస్థాయిలో పాడాల్సిన పాటలను సైతం అలవోకగా పాడడం చక్రిలోని విశిష్టత. * ఇటీవల దాసరి దర్శకత్వంలో విడుదలైన 151వ చిత్రం 'ఎర్రబస్సు'కు సంగీతం అందించింది చక్రే! చక్రి సంగీతం అందించగా వై.వి.ఎస్. చౌదరి దర్శక - నిర్మాతగా, సాయిధరమ్ తేజ్ నటించిన తొలి చిత్రం 'రేయ్' లాంటివి కొన్ని ఇంకా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. * తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన ఈ సంగీతకారుడు ఆ మధ్య 'జై బోలో తెలంగాణ' చిత్రానికి సంగీతం అందించి, పుట్టినగడ్డ ఋణం తీర్చుకొనే ప్రయత్నం చేశారు. రానున్న గోదావరి పుష్కరాలకు ఒక ప్రత్యేక గీతాన్ని కూర్చాలని రచయిత భాస్కరభట్లతో చర్చిస్తున్నారు. ఆ కోరిక నెరవేరకుండానే హఠాత్తుగా కనుమరుగయ్యారు. ఇప్పుడు ఆయన లేరు... ఆయన పాటలే తీపిగుర్తులుగా మిగిలాయి. చక్రికి 'సాక్షి' తరఫున నివాళులర్పిస్తున్నాం. - రెంటాల -
చక్రి మృతికి స్థూలకాయమే కారణమా?
నలభై ఏళ్ళ చిన్న వయసులోనే సంగీత దర్శకుడు చక్రి కన్నుమూయడానికి కారణం ఏమిటి? వ్యక్తిగతంగా అందరితో స్నేహంగా వ్యవహరించే చక్రి తన ఆరోగ్యం మీద తగినంత శ్రద్ధ పెట్టలేదా? సినీ వర్గాలు ఆ మాటే అంటున్నాయి. సినీ రంగానికి వచ్చిన తొలిరోజుల్లో పాతికేళ్ళ పైచిలుకు వయసులో ఆయన ముద్దుగా, బొద్దుగా ఉండేవారు. అయితే, క్రమంగా ఆహార విహారాల్లోని మార్పు, సినీ రంగంలో తీరిక లేని పనితో వేళాపాళా లేని జీవనవిధానం కొంత దెబ్బతీశాయని చెప్పవచ్చు. క్రమంగా అది స్థూలకాయానికి దారి తీసింది. భోజన ప్రియత్వం కూడా అందుకు తోడైంది. హిందీ చిత్రసీమలోని బప్పీలహరి లాగా చక్రి కూడా లావుగా తయారైనా, తనదైన ప్రత్యేక శైలి దుస్తులు, చేతికి లావాటి బంగారు గొలుసులతో వినూత్నంగా కనిపించేవారు. క్రమంగా ఆయన రూపంతో పాటు, ముఖం రంగులో కూడా కొంత మార్పు వస్తూ వచ్చింది. అయితే, అన్ని విధాలుగా తాను ఆరోగ్యంగా ఉన్నానంటూ చక్రి ఎప్పుడూ ఉత్సాహంగా చెప్పేవారు. లైపోసక్షన్ లాంటివి చేయించుకోవాలనుకున్నా, దుష్ఫలితాలు ఉంటాయేమోనని చక్రి బాధపడ్డారు. అయితే, శరీరంలో కొవ్వు పదార్థాలు ఎక్కువ కావడం చివరకు ఆయనకు ప్రాణాంతకంగా పరిణమించినట్లు కనిపిస్తోంది. చనిపోవడానికి కొద్ది గంటల ముందు ఆదివారం కూడా అర్ధరాత్రి దాటే వరకు చక్రి తన రికార్డింగ్ పనుల్లో బిజీగా గడిపినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. అర్ధరాత్రి దాటాక హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్ట్ కాలనీలో ఇంటికి తిరిగొచ్చిన ఆయన నిద్ర పోయారు. ఆ నిద్రలోనే తీవ్రమైన గుండెపోటుకు గురై ఆయన కన్నుమూసినట్లు వైద్యులు చెబుతున్నారు. బరువు తగ్గించుకోవాలని గతంలో పలువురు సన్నిహితులు సలహా ఇచ్చినా, చివరకు అది చక్రికి ప్రాణాంతకంగా పరిణమించిందని భావించవచ్చు. -
ఆ గాయకులకు.. చక్రినే అండ
హైదరాబాద్ : శ్రోతలకు మంచి సంగీతాన్ని ఇవ్వడమేకాదు...ఎంతో మంది మంచి గాయకులను చక్రి తెలుగు చిత్ర పరిశ్రమకు అందించారు. కౌసల్య, సింహ, రఘు కుంచే, రవి వర్మ లాంటి గాయకులకు చక్రీయే అండా దండ. చక్రి ఇచ్చిన ప్రోత్సాహంతోనే వీరంతా టాలీవుడ్లో నిలదొక్కుకోగలిగారు. అంతే కాదు...కొత్తవారిని పరిచయడం చేయడంలో చక్రి ఎప్పుడూ ముందుంటారు. చక్రీ మృతి పట్ల గాయకుడు సింహ మాట్లాడుతూ తనకు గాయకుడిగా జీవితాన్ని ఇచ్చింది చక్రి అన్నారు. గత పదేళ్లగా ఆయన సంగీతం అందించిన ప్రతి సినిమాలోనూ ఓ పాట పాడేందుకు అవకాశం ఇచ్చారని.. ఆయన సంగీతం అందించిన చివరి చిత్రం ఎర్రబస్సు వరకూ తనకు పాడే అవకాశం ఇచ్చారని సింహ గుర్తు చేసుకున్నారు. చక్రితో అనుబంధం మరవలేనిదని, స్నేహానికి ఆయన మారుపేరు అన్నారు. వర్ధమాన గాయనీ, గాయకులకు చక్రి ఉన్నారనే భరోసా ఉండేదని, ప్రతిపాట ఆయన ప్రేమగా చేసేవారని సింహ అన్నారు. అలాంటి వ్యక్తిని మళ్లీ చూడలేమని...ఇంకా చూడలేమని సింహ పేర్కొన్నారు. చక్రి మరణం సంగీత ప్రపంచానికి తీర్చలేని లోటుగా అభివర్ణించారు. ఇక చక్రి, కౌసల్య కాంబినేషన్లో వచ్చిన సాంగ్స్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్‌గా నిలిచిపోతాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన అతి తక్కువ మంది సంగీతదర్శకుల్లో చక్రి ఒకరు. చిన్నవయస్సులోనే సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేసి... మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. దర్శకుడు ఎన్. శంకర్ , జగపతిబాబు కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం జైబోలో తెలంగాణ సినిమాకి చక్రికే సంగీతమందించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ప్రధానంశంగా తెరకెక్కిన ఈ సినిమాలో...చక్రి సమకూర్చిన పాటలు హైలెట్‌గా నిలిచాయి. -
చక్రికి ఇష్టమైన పాట ఇదే...
హైదరాబాద్ : సంగీత దర్శకుడిగానే కాదు...గాయకుడిగా కూడా టాలీవుడ్లో చక్రికి ప్రత్యేకమైన స్థానం ఉంది. దాదాపు 50పాటలకు పైగా చక్రి పాడారు. ఇడియట్లో 'చూపులతో గుచ్చిగుచ్చి చంపకే', అమ్మ నాన్న తమిళ అమ్మాయి సినిమాలో 'నీవే నీవే నేనంటా'.... సత్యం సినిమాలో 'ఓ మగువ నీ స్నేహం కోసం ఎంతో ట్రై చేశా'...నేనింతే చిత్రంలో 'కృష్ణ నగరే మామ', గోపి గోపికా గోదావరి సినిమాలోని 'నువ్వెక్కడుండి నేనక్కడుంటే ప్రాణం విలవిల' అనే పాటలు ఎప్పటికీ నిలిచిపోతాయి. మెలోడి, ఫాస్ట్ బీట్, డ్యూయెట్ అనే తేడా లేకుండా.... అన్ని రకాల పాటలు పాడి సంగీత ప్రియుల అభిమానాన్ని చక్రి సొంతం చేసుకున్నారు. రీసెంట్గా తమన్, రవితేజ కాంబినేషన్లో వచ్చిన పవర్ సినిమాలో కూడా ఓ హుషారైన పాటను పాడారు. ఇక ఎన్నో పాటలకు సంగీతం అందించిన చక్రికి ఏ పాట అంటే ఇష్టమో తెలుసా ? ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం చిత్రంలో 'మల్లికూయవే' పాట అంటే ఇష్టం. అలాగే చక్రం సినిమాలోని 'ఒకే ఒక మాట..మదిలోనే దాగుంది మౌనంగా' అనే పాట చాలా ఇష్టమని గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. పల్లవి : మల్లి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా తుళ్ళి పాడవే పువ్వా గుండెలో సవ్వడి నువ్వా మల్లి కూయవే గువ్వా.. మోగిన అందెల మువ్వా తుళ్ళి పాడవే పువ్వా గుండెలో సవ్వడి నువ్వా విధివరమే నీవేగా నీవేగా... కలనిజమై పూచేగా పూచేగా... జిలిబిలి పలుకుల నువ్వా దివిలో తారా జువ్వా జిలిబిలి పలుకుల నువ్వా దివిలో తారా జువ్వా... జువ్వా... జువ్వా... మల్లి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా తుళ్ళి పాడవే పువ్వా గుండెలో సవ్వడి నువ్వా చరణం : 1 సిరిసిరి మువ్వలా చిరుసడివించే స్మృతి పదమున నీ గానమే సిరిసిరి మువ్వలా చిరుసడివించే స్మృతి పదమున నీ గానమే పొంగిపారె ఏటిలో తొంగి తొంగి చూస్తె తోచెను ప్రియ నీ రూపమే సోకేటి పవనం నువు మురిపించే గగనం కోనేటి కమలం లోలో నీ అరళం కలత నిదురలో కలలాగ జారిపోకె జవరాల నీలి సంద్రమున అలలాగ హృదయలోగిలో నువ్వా... నువ్వా... నువ్వా... మల్లి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా తుళ్ళి పాడవే పువ్వా గుండెలో సవ్వడి నువ్వా చరణం : 2 తీయనైన ఊసుతో ప్రియ విరహముతో కృంగెను ఎద నీ కోసమే తీయనైన ఊసుతో ప్రియ విరహముతో కృంగెను ఎద నీ కోసమే సాగిపోయె దారిలో వేసే ప్రతి అడుగులా తగిలెను నీ మృద పాదమె ఎగిసేటి కెరటం చేరేలే తీరం చీకటిలో పయనం నువ్వేలే అరుణం వలపు వరదలో నదిలాగ తడిపిపో జడివానలా మంచుతెరలలో తడిలాగ నయన చిత్తడిలో నువ్వా... నువ్వా... నువ్వా... మల్లి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా తుళ్ళి పాడవే పువ్వా గుండెలో సవ్వడి నువ్వా మల్లి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా తుళ్ళి పాడవే పువ్వా గుండెలో సవ్వడి నువ్వా విధివరమే నీవేగా నీవేగా... కలనిజమై పూచేగా పూచేగా... జిలిబిలి పలుకుల నువ్వా దివిలో తారా జువ్వా జిలిబిలి పలుకుల నువ్వా దివిలో తారా జువ్వా... జువ్వా... జువ్వా... మల్లి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా తుళ్ళి పాడవే పువ్వా గుండెలో సవ్వడి నువ్వా -
వారిద్దరికీ మినహా...మిగత హీరోలకు మ్యూజిక్
-
వారికి మినహా...మిగతా హీరోలకు మ్యూజిక్!
హైదరాబాద్ : సంగీతంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న చక్రి...... ఇప్పటివరకు దాదాపు 85 చిత్రాలకు పైగా సంగీత దర్శకత్వం వహించారు చక్రి. బాలకృష్ణ, నాగార్జున లాంటి అగ్రహీరోలతో పాటు ఎన్టీఆర్, అల్లు అర్జున్, నితిన్, తరుణ్, సుమంత్ లాంటి యువహీరోలకు కూడా సంగీతమందించారు. అగ్ర హీరోల్లో వెంకటేష్, చిరంజీవి, పవన్ కల్యాణ్ లకు మినహా దాదాపు అందరి స్టార్లకు సంగీతాన్ని అందించిన ఘనత చక్రికే దక్కింది. నాగార్జున, పూరి జగన్నాధ్ కాంబినేషన్లో వచ్చిన శివమణి పెద్ద మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. బాలకృష్ణ, బోయపాటి, చక్రి కాంబినేషన్లో వచ్చిన సింహా చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల ప్రభంజనం సృష్టించింది. బాలకృష్ణ, రవి చావలి కాంబినేషన్లో వచ్చిన శ్రీమన్నారాయణకి కూడా చక్రినే సంగీతమందించారు. సింహా చిత్రానికి ఆయన ప్రతిష్టాత్మక నంది అవార్డును అందుకున్నారు. అలాగే సత్యం చిత్రానికి ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన 'ఎర్రబస్సు' చిత్రానికి చక్రి చివరిగా సంగీతం అందించారు. -
తీవ్ర విషాదంలో టాలీవుడ్..
హైదరాబాద్ : సంగీత దర్శకుడు చక్రి మృతితో టాలీవుడ్ చిత్రపరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చక్రి ఇక లేడన్న చేదు నిజాన్ని ఆయన సన్నిహితులు, చిత్ర పరిశ్రమ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓ మంచి వ్యక్తిని కోల్పోయామని తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముుఖులు సంతాపం తెలిపారు. చక్రి మృతి పట్ల 'మా' అసోసియేషన్ సంతాపం ప్రకటించింది. మరోవైపు చక్రి మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు ...అపోలో ఆస్పత్రికి చేరుకుంటున్నారు. పలువురు గాయనీ గాయకులు చక్రి భౌతికకాయన్ని సందర్శించి నివాళులు అర్పించారు. -
చక్రి మృతి పట్ల కేసీఆర్ దిగ్ర్భాంతి
హైదరాబాద్ : ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నో విజయాలు సాధించిన తెలంగాణ బిడ్డ చిన్న వయసులో మరణించడం బాధాకరమని అన్నారు. చక్రి కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. చక్రి మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యలు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
నమ్మబుద్ధి కావటం లేదు....
హైదరాబాద్ : సంగీత దర్శకుడు చక్రి మరణవార్తను నమ్మబుద్ధి కావటం లేదని దర్శకుడు ఎన్.శంకర్ అన్నారు. ఆయన మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు అన్నారు. మారుమూల ప్రాంతం నుంచి స్వయంకృషితో పైకి వచ్చిన వ్యక్తి చక్రి అని శంకర్ అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి సంగీతాన్ని అందించారని ఆయన పేర్కొన్నారు. తన జీవితంలో ఇంత షాక్‌ను... ఎప్పుడూ ఫీల్ అవలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు సంగీతంతో పాటు చక్రి మరోవైపు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారని శంకర్ తెలిపారు. స్నేహానికి ప్రాణం ఇచ్చేవారని, స్నేహితులను ఎంతగానో ప్రేమించేవారని చెప్పారు. 'జై భోలో తెలంగాణ' చిత్రానికి చక్రి అందించిన సంగీతం ఎంతో ఆదరణ పొందిందని శంకర్ తెలిపారు. -
సంగీత దర్శకుడు చక్రి గుండెపోటుతో మృతి
-
సంగీత దర్శకుడు చక్రి గుండెపోటుతో మృతి
టాలీవుడ్ చిత్ర పరిశ్రమను మరో విషాదం వెంటాడింది. సంగీత దర్శకుడు చక్రి (40) గుండెపోటుతో మృతి చెందాడు. ఆయనకు అపోలో ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. చక్రి పూర్తి పేరు చక్రధర్ గిల్లా. 1974 జూన్ 15న వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కంభాలపల్లిలో జన్మించారు. ప్రముఖ దర్శకుడు పూరిజగన్నాధ్ దర్శకత్వం వహించిన 'బాచీ' సినిమాతో..... టాలీవుడ్‌కి సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న తమిళ అమ్మాయి, సత్యం, ఢీ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మ్యూజిక్‌లో తనకంటై ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న చక్రి...... ఇప్పటివరకు దాదాపు 85 చిత్రాలకుపైగా సంగీతదర్శకత్వం వహించారు చక్రి. బాలకృష్ణ, నాగార్జున లాంటి అగ్రహీరోలతో పాటు ఎన్టీఆర్, అల్లు అర్జున్, నితిన్, తరుణ్, సుమంత్ లాంటి యువ హీరోలకు కూడా సంగీతమందించారు. వెంకటేష్, చిరంజీవి మినహా దాదాపు అందరి స్టార్లకు సంగీతాన్ని అందించిన ఘనత చక్రికే దక్కింది. స్టార్ హీరో రవితేజ సినిమాలకు ఎక్కువగా మ్యూజిక్ అందించారు చక్రి. పూరి జగన్నాథ్, చక్రి, రవితేజలది టాలీవుడ్లో హిట్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న తమిళ అమ్మాయి చిత్రాలు..... టాలీవుడ్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. -
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి : అతడు: సీతాకోకచిలుక ... సోయగాల చినుక ముద్దు ముద్దుగున్నవే నువ్వు ఓసి కన్నెగోపిక తుళ్లి తుళ్లి పడక కొంగు ముడివేసుకో నువ్వు ఆమె: కొనికా కెమెరాలో బందీలే అవుదామా కొల్లేటి సరసుల్లో స్నానాలే చేద్దామా బృం: జింగిచక హ జింగి జింగిచక (4) ॥ చరణం : 1 అ: ఓ రెక్కలు తొడిగి రివ్వున ఎగిరి నింగిని చూసేద్దామా జాబిలమ్మను చేరి జోల పాడేద్దామా ఆ: చేపలనడిగి మొప్పలు తెచ్చి ఈతలు కొట్టేదాము సాగరాలే దాటి సాటి లేరందాము అ: మొదటి చూపుకే అలలా పుట్టుకొచ్చు ఈ ప్రేమ ఆ: చివరి వరకు ఊపిరిగా తోడు ఉండదా ప్రేమ అ: ఓ... పంచెవన్నెల చిలక రెక్కపై పచ్చతోరణం ప్రేమ ఆ: తామరాకుపై నీటిబొట్టులా తళుకుమంటది ప్రేమ ॥ చరణం : 2 అ: ఓ వానజల్లులో దోసిలి పట్టి గజగజ వణికేద్దామా పడవల బొమ్మలు చేసి చిటుకున వదిలేద్దామా ఆ: చిరుతల వేగం అరువుకు అడిగి గబగబ ఉరికేద్దాము ఊరులన్నీ తిరిగి జోరు చూపిద్దాము అ: రెండు గుండెల నడుమ రాయబారమీ ప్రేమ ఆ: నిండుకుండలా ఎపుడూ తొణికిపోదు ఈ ప్రేమ అ: ఓ... కోనసీమలో కొబ్బరాకులా ముద్దుగుంటది ప్రేమ ఆ: అరకు లోయలో చిలిపిగాలిలా కమ్ముకుంటది ప్రేమ ॥ చిత్రం : ఔను...వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (2002) రచన : భాస్కరభట్ల రవికుమార్ సంగీతం : చక్రి, గానం : చక్రి, కౌసల్య, బృందం -
ఒకే నెలలో ఆరు ఆడియో ఫంక్షన్లు
2014 జనవరి నెల... సంగీత దర్శకుడు చక్రికి జీవితాంతం గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఈ నెలలో ఆయన స్వరాలందించిన ఆరు సినిమాల పాటల వేడుకలు జరగబోతున్నాయి. ఈ నెల రెండో వారంలో పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ‘రేయ్’ విడుదల కాబోతోంది. ‘దేవదాసు’ తర్వాత వైవీయస్ చౌదరితో చక్రి పనిచేస్తున్న చిత్రమిది. ఇందులో సాయిధరమ్‌తేజ్ హీరో. దీనికన్నా ముందు 6న ‘తను మొన్నే వెళ్లిపోయింది’ పాటల ఆవిష్కరణ జరగనుంది. వంశీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇళయరాజా తర్వాత వంశీ చిత్రాలకు ఎక్కువ పనిచేసిన సంగీత దర్శకుడు చక్రీనే. వీరిద్దరి కలయికలో ఎన్నో మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. శ్రీకాంత్-తరుణ్ కాంబినేషన్లో రూపొందిన ‘వేట’ ఆడియో ఫంక్షన్ 8న, నట్టికుమార్ నిర్మించిన ‘యుద్ధం’ పాటల వేడుక 11న జరగనున్నాయి. శ్రీకాంత్ హీరోగా చేసిన ‘వీడికి దూకుడెక్కువ’ పాటలు కూడా అదే వారంలో విడుదల కానున్నాయి. రవిబాబు దర్శకత్వంలో ‘అల్లరి’ నరేష్ నటిస్తోన్న క్రేజీ ఫిల్మ్ ‘లడ్డుబాబు’ పాటలు కూడా ఈ నెలలోనే శ్రోతల్ని అలరించబోతున్నాయి. ఈ విషయమై చక్రి మాట్లాడుతూ -‘‘నా లక్కీ నంబర్ 6. ఒక్క నెలలోనే నా ఆరు సినిమాల ఆడియో ఫంక్షన్లు జరగడం చాలా ఆనందంగా ఉంది. నా కెరీర్లో ఎప్పుడూ ఇలా జరగలేదు. అందుకే ఈ జనవరిని ఎప్పటికీ మరిచిపోలేను. 2014లో శ్రోతల్ని మరింత అలరించే విధంగా మంచి మ్యూజిక్ ఇస్తాను’’ అన్నారు. -
గీత స్మరణం
తఝంతా తకిట తదుంతా తకిట తఝంత తరుంత తఝంత తఝంత దిత్తాంకిటతక తరికిట తకతోం కిటతకతాంకిటతక తరికిటతకతోం తత్తాంకిటతకతోం రిసనిప సనిపమ రిపమరి మపనిస మపనిస మపనిసా... శ్రీకృష్ణరాయా అభివందనం! మా కృష్ణరాయా అభివందనం! నినిసాస సాస నిని రీరి రీరి నిని సాస సాస సస సరినిస పనిపమరీ మమపాప పాప మమ నీని నీని మమ పాప పాప మప మపా రిమ సరినీ శ్రీకృష్ణరాయా అభివందనం! మా కృష్ణరాయా అభివందనం! శృంగార కవిరాజబమీ ప్రాంగణం సంగీత సాహిత్య సమరాంగణం! తెలుగింట వెలుగొందు సిరితోరణం! నీ కీర్తి చంద్రికలకభివందనం !! ఝం ఝం తరికిటతోం తఝం తరికిటతోం (2) నాప్రాణమే ఈ నర్తనం! నీ శౌర్యమే సంకీర్తనం! మనసారా మీ దాసిని నీ చరణ సహవాసిని నీ మమతకు నీ సమతకు అభివందనం! అభివందనం! శ్రీకృష్ణరాయా అభివందనం! మా దేవరాయా అభివందనం! తద్ధీం తకధిమి ఝణు తకధిమి తద్ధీం తకధిమి ఝణు తకధిమి తద్ధీం తకధిమి ఝణు తకధిమి తద్ధీం తకధిమి ఝణు తకధిమి తజోం తజోం తజోం తజోం పాప సాస నీని పాప మమ రిరి రీరి రీని పాపమామ రిరి సస రీరిసాస రీరి మామ పమరిరి రిసనిప సనిపమ నిపమరి మపనిస మపనిస మపనిసా... చిత్రం : దేవరాయ (2012) రచన : డా॥వెనిగళ్ల రాంబాబు సంగీతం : చక్రి గానం : మాళవిక, బృందం నిర్వహణ: నాగేశ్ -
గీత స్మరణం
ఏమి ఈ భాగ్యమో నేస్తమా... స ప ద ప సనిసా... ఏమి ఈ భాగ్యమో నేస్తమా నేనే నిండగా ఆ ఎండే పండగా ఈ వేసవే కోమలం శీతలం ఆ చల్లని చంద్రుని మండలం ఈ మందిరం సుందరం అందలం ఆ అంబరం సంబరం సంగమం ఏమి ఈ భాగ్యమో నేస్తమా... గానం : కౌసల్య ------------------------ ఆమె: ఎన్నెన్నో వర్ణాలు... అన్నింట్లో అందాలు ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు ఒక టైతే మిగిలేది తెలుపేనండీ నలుపేమో నాకిష్టం మీ మనసు మీ ఇష్టం నాకోసం మీ ఇష్టం వదలొద్దండీ మీ మది తొందర చేసే బాటను వీడక మీరు సాగిపోండిక ఇదే ఇదే నా మాటగా పదే పదే నా పాటగా ఎన్నెన్నో వర్ణాలు... అతడు: నేనంటూ ప్రత్యేకం నాదంటూ ఓ లోకం పడలేను ఏ జోక్యం అంతేనండీ బాగుంది మీ టేస్టూ నాకెంతో నచ్చేట్టు మనసెంతో మెచ్చేట్టు మీ మీదొట్టు అందుకే నే దిగివచ్చా వంచని నా తలవంచా స్నేహ భావమా అందుకె నే దిగివచ్చా వంచని నా తలవంచా స్నేహ భావమా కలా నిజం నీకోసమే అనుక్షణం ఉల్లాసమే ॥ గానం : ఎస్.పి.బాలు, కౌసల్య ఆమె: పొగడమాకు అతిగా చేసెయ్యమాకు పొగడపూల లతగా రాసినావు చాలా ఆ రాతలంత నేను ఎదిగిపోలా నువ్వనే వచ్చింది నా నోట చనువుగ పిలుపులో తడబాటు ఆ మాట పలుకగ తెలుసుకుంటే పొరబాటు అతడు: నువ్వు అంటూ పిలుపు నాకెంతో నువ్వు దగ్గరైన తలపు పరిచయాల మలుపు దాచేసుకున్న మాటలన్నీ తెలుపు చిగురులే వేసేను ఈ కొమ్మ హొయలుగ పూవులై పూసేను ఈ జాబు చదవగ ఊహలేవో ఉదయించే ॥ గానం : ఎస్.పి.బాలు, కౌసల్య ------------------------ చిత్రం : ఔను.. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (2002) రచన : సాయి శ్రీహర్ష, సంగీతం : చక్రి -
నిర్మాత పరుచూరి ప్రసాద్‌పై కేసు నమోదు
హైదరాబాద్: బుల్లితెర నటి పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలపై నిర్మాత పరుచూరి ప్రసాద్‌పై బంజారాహిల్స్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. బేగంపేటకు చెందిన బి.మాధవి (36) బుల్లితెర నటి. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదివారం రాత్రి గం.10 సమయంలో ఆమె మరికొందరితో కలిసి సంగీత దర్శకుడు చక్రి నివాసానికి విందు నిమిత్తం వెళ్లారు. ఇదే కార్యక్రమానికి వచ్చిన పరుచూరి ప్రసాద్ రాత్రి 12 గంటల సమయంలో మాధవితో అనుచితంగా ప్రవర్తించారు. దీంతో తన ఇంట్లో గలభా చేయవద్దంటూ వారిని చక్రి బయటకు పంపేశారు. అక్కడ నుంచి బయటకు వచ్చిన మాధవి, ప్రసాద్‌లు రోడ్డుపైనా ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలోనే ప్రసాద్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని మాధవి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు. -
సంగీత దర్శకుడు చక్రిపై నిర్భయ కేసు
-
సంగీత దర్శకుడు చక్రిపై నిర్భయ కేసు
సినీ సంగీత దర్శకుడు చక్రి వివాదంలో చిక్కుకున్నారు. చక్రి తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ బేగంపేటకు చెందిన మాధవి అనే యువతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చక్రి ఇంట్లో ఆదివారం రాత్రి జరిగిన ఫ్రెండ్ షిప్ డే వేడుకల సందర్భంగా తన పట్ల ఆయన అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. చక్రితో పాటు నిర్మాత పరుచూరి ప్రసాద్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఇడియట్ సినిమాతో పాపులరయిన చక్రి పెద్ద సంగీత దర్శకుడిగా ఎదిగారు. పలు హిట్ సినిమాలకు ఆయన సంగీతం అందించారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, శివమణి, దేవదాసు, చక్రం, సింహా తదితర సినిమాలకు చక్రి అందించిన పాటలను శ్రోతలను ఆకట్టుకున్నాయి. సినిమా వాళ్ల ఆకతాయి చేష్టలు ఇటీవల కాలంలో పెరిగాయి. మొన్నటి మొన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడని ఓ యువతి జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అటు చిరంజీవి కుమారుడు హీరో రామ్‌చరణ్ నడిరోడ్డుపై ఓ వ్యక్తిపై చేయిచేసుకోవడంతో వివాదం చెలరేగిన సంగతి విదితమే.