శోకసంద్రంలో జగమంత కుటుంబం
అనురాగబంధం...
సంగీత సాగరంలో ‘జగమంత కుటుంబాన్ని’ ఓలలాడించిన మ్యూజిక్ డెరైక్టర్ గిల్ల చక్రధర్ (చక్రీ) ఇక లేరు అనే నిజాన్ని జిల్లా ప్రజానీకం జీర్ణించుకోలేకపోతోంది. పొరుగున వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామంలో జన్మించిన చక్రీతో జిల్లాలో పలువురికి స్నేహబాంధవ్యాలున్నాయి. దాదాపు 15 ఏళ్లపాటు తన పాటలతో ఉర్రూతలూగించిన చక్రీ మరణంతో జిల్లాలోని ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు.
స్వరాల చక్రవర్తి : మానుకోట నుంచి ఎదిగిన సంగీత వృక్షం
వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కంబాలపల్లిలో జన్మించిన చక్రి ఉత్తమ సంగీత దర్శకునిగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఆయన ఎంత ఎదిగినా జన్మస్థలాన్ని మాత్రం మరువలేదు. ఈ ప్రాంతంలోని కళాకారులకు తోడ్పాటు అందించారు. చిన్న కార్యక్రమాలకు కూడా హాజరయ్యేవారు. ఆయన మరణ వార్త విని స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.
శోకసంద్రంలో జగమంత కుటుంబం
చక్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న జిల్లా వాసులు
ఖమ్మం స్పోర్ట్స్/కల్చరల్ : ఖమ్మంలోని తరుణిహాట్‌లో 2008లో జరిగిన స్తంభాద్రి సంబరాల్లో చక్రి పాల్గొని తన గాత్రంతో ప్రేక్షకులను ఉర్రుతలూగించారు. 2009లో స్నేహితుల ఆధ్వర్యంలో పెవిలియన్ గ్రౌండ్‌లో మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 2010లో మమత మెడికల్ కాలేజిలో జరిగిన కల్చరల్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 2012 డిసెంబర్ 9న మున్నూరుకాపు వనభోజనాల్లో పాల్గొని సందడి చేశారు. 2013 నవంబర్‌లో జరిగిన మధిరోత్సవాల్లో పాల్గొన్నారు. ఇటీవల కూడా నగరంలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి ఆయన హజరయ్యారు.
స్నేహానికి ప్రాణం ఇచ్చేవాడు
చిన్నప్పటి నుంచి చక్రి స్నేహితులకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవాడని ఆయన చిన్ననాటి స్నేహితుడు గాయత్రి డిగ్రీకళాశాల తెలుగు లెక్చరర్ మృదులాకర్ రవీందర్ చెప్పారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10న ఫ్రెండిషిప్‌డే రోజున స్నేహితులమంతా ఎక్కడున్న ప్రత్యేక చొరవ తీసుకుని ప్రతి ఒక్కరినీ సరాదాగా గడిపేవాడని గుర్తుచేసుకున్నారు. అంతమంచి స్నేహితుడు ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రవీందర్‌తో పాటు న్యూవిజన్ పాఠశాలలో తెలుగు టీచర్‌గా పనిచేస్తున్న పద్మ, శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో మ్యాథ్స్ లెక్చరర్‌గా పనిచేసున్న రాంసుధాకర్ చక్రితో కలిసి చదువుకున్నారు.
అందరికీ ఆప్తుడు
బయ్యారం: సినీసంగీత దర్శకుడు చక్రికి బయ్యారంతో ఎనలేని బంధం ఉంది. ఖమ్మం-వరంగల్ జిల్లాల సరిహద్దులోని మహబూబాబాద్ మండలం కంబాలపల్లి చక్రి స్వగ్రామం కావటంతో ఆయన స్నేహితులు బయ్యారంలోనూ ఉన్నారు. మండలంలోని కొత్తపేటకు చెందిన టైలర్ వడ్లపూడి రాజా దగ్గర అనేక సంవత్సరాల పాటు చక్రి దుస్తులు కుట్టించుకునే వారు. 2010 వ సంవ త్సరంలో రాజా గంధంపల్లిలో నిర్మించిన వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించేందుకు వచ్చిన చక్రి ఆ సమయంలో తనను కలిసిన పదిమంది వృద్ధులకు తన సొంత ఖర్చులతో వాటర్‌క్యాన్లను ఉచితంగా అందజేశారు.