చెరగని ‘చక్రి’ జ్ఞాపకాలు
మెతుకుసీమతో ప్రత్యేక అనుబంధం
గుర్తుచేసుకుంటున్న జిల్లావాసులు
సంగారెడ్డి క్రైం: ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి హఠాన్మరణం జిల్లా వాసులను తీవ్రంగా కలచివేసింది. ఆయన మరణవార్త విని జిల్లాలోని సంగీత ప్రియులు, వివిధ సంఘాల నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లాతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, చక్రి ప్రజా సేవలో ముం దుండే వారనీ, జిల్లాతో ఆయన ప్రత్యేక అనుబంధం ఉందన్నారు.
పటాన్‌చెరు మండలం అమీన్‌పూర్ ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు జిన్నారంలో ఎస్సీ,ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు దుస్తులు, షూ పంపిణీ చేసిన సంగతి గుర్తు చేసుకున్నారు. సినిమాల్లో బీజీగా ఉన్నప్పటికీ స్థానిక ఫొటోగ్రాఫర్ల కోరిక మేరకు సంగారెడ్డిలో 2012 ఆగస్టు 19న జరిగిన ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవంలో చక్రి పాల్గొన్న విషయా న్ని పలువురు గుర్తు చేసుకున్నారు. జహీరాబాద్‌లో నిర్వహించిన పలు సామాజిక కార్యక్రమాల్లో కూడా చక్రి పాల్గొన్నారని గుర్తు చేశారు.
ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఓ చిన్న సామాజిక కార్యక్రమానికి ఆహ్వానించినా తప్పకుండా పాల్గొనేవారని చక్రి సామాజిక సేవను కొనియాడారు. చక్రి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ఫొటోగ్రాఫర్ల, వీడియోగ్రాఫర్ల సంఘం అధ్యక్షుడు జగన్, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.విజయరావు, సామాజిక సమ్రత రాష్ట్ర కార్యదర్శి పి.దుర్గాప్రసాద్, తెలంగాణ క్రిష్టియన్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.విల్సన్‌లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆగిన సంగీత చక్రం
పిన్నవయసులోనే తెలుగు సినీసంగీత సామ్రాజ్యంలో తనదైన ముద్రవేసిన ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి సోమవారం కన్నుమూశారు. ఆయన మృతి చిత్రపరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. సంగీత ‘చక్రం’ ఆగిపోయిందంటూ పలువురు సినీ ప్రముఖులు కంటతడిపెట్టారు. ఉదయం అపోలో ఆస్పత్రి నుంచి చక్రి పార్థివ దేహాన్ని ఫిలించాంబర్‌కు తరలించారు. పలువురు సినీ ప్రముఖులు, సంగీత దర్శకులు, గాయకులు, ఆయన అభిమానులు అక్కడికి చేరుకొని నివాళులు అర్పించారు. సాయంత్రం చక్రి అంత్యక్రియలు పంజగుట్ట హిందూ శ్మశానవాటికలో ముగిశాయి.