* గుండెపోటుతో కన్నుమూత
* నిర్ఘాంతపోయిన అభిమానులు
* శోకసంద్రంలో చిత్రసీమ
* తరలివచ్చిన అభిమానులు
* చక్రి భౌతిక కాయానికి ప్రముఖుల నివాళి
* ముగిసిన అంత్యక్రియలు
* ఇప్పటివరకు 99 చిత్రాలకు పనిచేసిన చక్రి
సాక్షి, హైదరాబాద్, వరంగల్: ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు చక్రి(40) సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో గుండెపోటుతో మృతిచెందారు. అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చి.. అనతికాలంలోనే ఉన్నతస్థాయికి ఎదిగిన చక్రి హఠాన్మరణంతో సినీ పరిశ్రమ, అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. చక్రి ఇప్పటి వరకు 99 చిత్రాలకు సంగీతం అందించారు. సత్యం, కబడ్డీ కబడ్డీ, పెదబాబు, చక్రం, దేవదాసు, కృష్ణ, మస్కా, సింహా, జై బోలో తెలంగాణ, ఢీ, దేనికైనా రెడీ వంటి ప్రజాదరణ పొందిన చిత్రాలకు ఆయన పనిచేశారు. దాసరి నారాయణరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘ఎర్రబస్సు’ ఆయన ఆఖరి సినిమా.
హీరో బాలకృష్ణతో 100వ చిత్రం చేయాలనుకున్నారు. కానీ ఇంతలోనే చక్రి ఈ లోకాన్ని వీడారు. యువ సంగీత దర్శకుడి హఠాన్మరణంతో తెలుగు చలనచిత్ర సీమ నిర్ఘాంతపోయింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో చక్రి మరణ వార్త తెలుసుకుని సినీ రంగానికి చెందిన పలువురు హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలివచ్చారు. తర్వాత కొద్దిసేపటికి చక్రి భౌతికకాయాన్ని ప్రజలు, ప్రముఖుల సందర్శనార్థం ఫిల్మ్ చాంబర్ ప్రాంగణానికి తరలించారు. చక్రి మృతదేహాన్ని చూసిన సన్నిహితులు, సినీ ప్రముఖులు కన్నీరుమున్నీరయ్యారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తమను పరిశ్రమకు పరిచయం చేసిన విషయాన్ని గుర్తు చేసుకొని పలువురు గాయకులు కన్నీటిపర్యంతమయ్యారు.
మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో భౌతిక కాయాన్ని జర్నలిస్టుకాలనీలోని ఆయన నివాసానికి తరలించారు. అక్కడ వైదిక కర్మల అనంతరం సాయంత్రం ఐదు గంటలకు అంతిమయాత్ర మొదలైంది. పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. అప్పటికే అక్కడకు భారీ సంఖ్యలో అభిమానులు, సంగీత కళాకారులు తరలివచ్చారు. శ్రేయోభిలాషులు, బంధువులు అశ్రు నయనాలతో చక్రికి తుది వీడ్కోలు పలికారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, డెరైక్టర్ ఎన్. శంకర్, విమలక్క తదితరులు శ్మశానవాటిక వద్దకు చేరుకుని చక్రి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న సమయంలో చక్రి భార్య శ్రావణి స్పృహతప్పి కుప్పకూలిపోయారు. చక్రి మృతికి సంతాపంగా చిత్ర పరిశ్రమలో సోమవారం నాటి షూటింగ్‌లన్నీ వాయిదాపడ్డాయి.
14 ఏళ్ల సినీ ప్రస్థానం..
చక్రి సొంత ఊరు వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కంబాలపల్లి. ఆయన 1974 జూన్ 15న జన్మించారు. తల్లి విద్యావతి, తండ్రి వెంకటనారాయణ. చక్రి పూర్తి పేరు జిల్లా చక్రధర్. ప్రాథమిక విద్యాభ్యాసం కంబాలపల్లిలోనే సాగింది. మహబూబాబాద్‌లో పదో తరగతి, ఇంటర్ పూర్తి చేశారు. హన్మకొండలో డిగ్రీ చదివారు. డిగ్రీ రోజుల్లోనే సంగీత విద్వాంసురాలు విజయలక్ష్మి వద్ద వయొలీన్ నేర్చుకున్నారు. సంగీత విద్వాంసులు ఆచార్య వి.తిరుపతయ్య వద్ద కర్ణాటక సంగీతాన్ని నేర్చుకున్నారు.
చక్రికి పాటలు రాయడం కంటే పాటలు పాడటం అంటేనే ఎక్కువ ఇష్టం. తెలంగాణలో ఒకప్పుడు ఊర్రూతలూగించిన శంకర్, సారంగపాణి ఆర్కెస్ట్రా ఎక్కడ జరిగినా చక్రి అక్కడికి వెళ్లేవారు. ఇళయరాజా పాటల వింటూ ఆ స్థాయి సంగీత దర్శకుడిని కావాలని కలలు కనేవారు. చక్రి తన 18వ ఏట మొదటి పాటకు ట్యూన్ చేశారు. జాతీయవాద భావజాలంతో రాసిన ‘‘ఒకే జాతి మనదిరా... ఒకే బాట మనదిరా..’’ అనే దేశభక్తి గీతానికి అందరి ప్రశంసలు దక్కాయి. భారత వికాస పరిషత్ పోటీలలో చక్రి పాడిన పాటలు ఊర్రూతలూగించాయి.
తన మిత్రుల ప్రోత్సాహంతో మహబూబాబాద్‌లో సాహితి కళాభారతి సంస్థను చక్రి స్థాపించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో తన ఆర్కెస్ట్రా బృందంతో ప్రదర్శనలు ఇచ్చేవారు. ఈ క్రమంలోనే 1995లో హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఓ హాస్టల్‌లో పనిచేశారు. నెలకు రూ. 1300 జీతానికి మార్కెటింగ్ ఉద్యోగం చేశారు. తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటూనే.. మిత్రులు కందికొండ, లక్ష్మణ్‌లతో కలసి ‘పండు వెన్నెల’ అనే అల్బమ్‌ను రూపొందించారు.
మెగాస్టార్ చిరంజీవిని కాన్సెప్ట్‌గా తీసుకుని ‘చిరునవ్వుతో చిరుకానుక’ పేరిట పాటలను ట్యూన్ చేసి క్యాసెట్ రూపొందించారు. ఇవి బాగా ప్రజాదరణ పొందాయి. ఆదిత్య ఆడియో కంపెనీవారు సినీ దర్శకుడు పూరి జగన్నాథ్‌కు చక్రి పాటలను పరిచయం చేశారు. ఆ విధంగా పూరి అవకాశమివ్వడంతో 2000 సంవత్సరంలో ‘బాచి’ చిత్రంతో సంగీత దర్శకుడిగా చక్రి ఆరంగేట్రం చేశారు. 14 ఏళ్ల సినీ ప్రస్థానంలో అనేక విజయవంతమైన చిత్రాలకు పని చేశారు. ప్రతిష్టాత్మక అవార్డులను ఎన్నింటినో పొందారు. ఉత్తమ నేపథ్య గాయకుడిగానూ అవార్డు పొందారు. ఎందరో కొత్తతరం గాయనీగాయకులను చిత్రసీమకు పరిచయం చేశారు. చక్రి చారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించేవారు. ఆయన అకాల మరణంతో సంగీత లోకం శోకసంద్రంలో మునిగిపోయింది.
చక్రి మరణంతో దిగ్భ్రాంతి చెందా: సీఎం కేసీఆర్
‘ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రి మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా. చిన్న వయసులోనే ఎన్నో విజయాలు సాధించిన చక్రి మరణం తెలంగాణ రాష్ట్రానికి, సినిమా పరిశ్రమకు తీరని లోటు. మధురమైన సంగీతంతో ఎన్నో అవార్డులు పొందిన చక్రి అకాల మరణం దురదృష్టకరం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’.
సంగీత ప్రపంచం మూగబోయింది
చక్రి ఆకస్మికంగా మృతిచెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా. ఆయన మృతితో సంగీత ప్రపంచం మూగబోయింది. కుటుంబ సభ్యులకు సానుభూతి par తెలియజేస్తున్నా.
- కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ
వైఎస్సార్ సీపీ నేత జగన్ సంతాపం
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రి ఆకస్మిక మృతికి దిగ్భ్రాంతికి గురయ్యా. ఆయన మృతికి సంతాపం. చక్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.
సీఎల్పీ నేత జానారెడ్డి సంతాపం
ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచే సింది. తన ప్రతిభా పాటవాలతో చిన్న వయస్సులోనే చక్రి అగ్ర సంగీత దర్శకుల జాబితాలో చేరారు.
గాయకులకు స్ఫూర్తి దాయకుడు
యువ సంగీతదర్శకులకు, వర్ధమాన గాయకులకు చక్రి స్ఫూర్తి దాయకులు. అనేక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే కాకుండా తనవంతు సహాయాన్ని కూడా అందించేవారు.
- కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
కలసి పని చేశాం
చక్రి నాకు ఆత్మీయులు. స్వదేశీ జాగరణ మంచ్‌లో నాతో కలసి అనేక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. వారి మరణం తెలుగు చిత్ర పరిశ్రమ, సంగీత ప్రపంచానికి తీరని లోటు. చక్రి ఆత్మకు శాంతి par చేకూరాలి.
- మురళీధరరావు, బీజేపీ నేత
ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సంతాపం
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రి మృతికి సంతాపం. చక్రి నివాసాన్ని సందర్శించిన చెవిరెడ్డి ఆయన మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. చక్రి తనకు ఎంతో ఆప్తుడు. ఆయన మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు.
కళారంగానికి తీరని లోటు
సుప్రసిద్ధ సినీ సంగీత దర్శకుడు, గాయకుడు చక్రి అకాల మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. చిన్నవయసులోనే సంగీత దర్శికుడిగా పేరొందిన చక్రి మరణం సినీ, కళా రంగాలకు తీరని లోటు. చక్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.
- సీపీఐ నేతలు కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి
సంగీత దర్శకుడు చక్రి హఠాన్మరణం
Published Tue, Dec 16 2014 1:13 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
Advertisement