ఇట్లు శ్రావణీ....చక్రీ...
'కమ్మని ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే!' అభిమానిగా ఆమె... ఫోన్‌లో శ్రావ్యంగా ఆలపించింది. 'నీ జత లేక... పిచ్చిది కాదా... మనసంతా...'అంటూ ఆ అబ్బాయి మనసులోనే చిందేశాడు. 'మైనే ప్యార్ కియా' సినిమా పాటలతో పాటు వాటికి తన హృదయాన్నీ జతగా చేర్చి భద్రంగా ఆమెకు కానుకగా అందించాడు.
* ఆ అబ్బాయి సంగీత దర్శకుడు చక్రి.
*ఆ అమ్మాయి అతని అభిమాని శ్రావణి.
ప్రేమపావురాలై ఒకరికోసం ఒకరు అన్నట్టుగా ఏడేళ్ల క్రితం ఒక్కటైన ఈ జంట హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కాపురం పెట్టారు. ఇట్లు మా కాపురం, మేము... అంటూ చెప్పిన చక్రి , శ్రావణిల దాంపత్య విశేషాలే బెటర్‌హాఫ్. 'సాక్షి' ప్రత్యేకం...
అభిమానం పెంచిన ప్రేమ...
మాది కొత్తగూడెం. నాన్న గోదావరిఖనిలో ఉద్యోగి. బి.టెక్ చేస్తున్నప్పుడు నాన్న సహోద్యోగి కూతురి పెళ్లికి మ్యూజిక్ డెరైక్టర్ చక్రి వస్తున్నారని తెలిసింది. అప్పటికే నేను ఆయన వీరాభిమానిని. ఈయన పాటలు, ఫొటోల కలెక్షన్ నా దగ్గర చాలా ఉండేది.
ఈయన్ని కలవడానికే కాలేజీ ఎగ్గొట్టి మరీ ఆ పెళ్లికి వెళ్లాను. అక్కడ ఈయన్ని చూశాక ఎలాగైనా పాట పాడించాలనుకున్నాను. రిక్వెస్ట్ చేశాక ఒప్పుకు న్నారు. అక్కడే ఫోన్ నెంబర్ అడిగి తీసుకున్నాను. ఈయనతో మాట్లాడుతుంటే టైమే తెలిసేది కాదు. ఈయనకి కోపమనేదే రాదని, కుటుంబాన్ని ప్రేమించే గుణం ఎక్కువగా ఉందని, సామాజిక సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారని తెలుసుకున్నాను.
ఆ గుణమే నన్ను అమితంగా ఆకట్టుకుంది. ముందుగా నేనే ప్రపోజ్ చేశాను. నా ప్రేమ విషయం ఇంట్లో కనిపెట్టి, పెళ్లిసంబంధాలు చూడటం మొదలుపెట్టారు. నాకు భయమేసి వెంటనే మా తాతయ్యకు చెప్పేశాను. అమ్మనాన్నలు నా ప్రేమను ఒప్పుకోలేదు, కాని తాతయ్య అర్థం చేసుకున్నారు. మా పెళ్లి (2006 మే 14) తాతయ్యే దగ్గరుండి జరిపించి, ‘ఉన్నది ఒక్క ఆడపిల్ల, తన ఇష్టప్రకారమే చేయడం మంచిది' అని అమ్మనాన్నలను ఒప్పించారు. మా నాన్న ఈయనతో ఏం చెప్పాలన్నా 'నాన్నా..' అని సంబో ధిస్తారు. అంత ఎఫెక్షన్‌గా ఉంటారు మామా అల్లుళ్లు.
అందించిన భరోసా!
మేం బ్రాహ్మణులం. పెద్దవాళ్లే మడివంటలు చేసేవారు. చదువుకుంటున్నానని నన్ను వంట దగ్గరకు రానిచ్చేవారు కాదు. ఆ విషయం ఈయనకి ముందే చెప్పాను. పెళ్లయి ఇంటికి వచ్చాక 'శ్రావణికి వంటరాదు. వంటమనిషిని పెట్టుకుందాం. అందరినీ వదిలి నాకోసం వచ్చింది. మనమే తనని సంతోషం గా ఉండేలా చూసుకోవాలి' అని అందరికీ చెప్పారు. వారూ 'అన్నీ తనే నేర్చుకుంటుందిలే' అని
నా భయాన్ని పోగొట్టారు.
అలా ఈయన సపోర్ట్ వల్లే బి.టెక్ మధ్యలోనే ఆగిపోకుండా పూర్తి చేయగలి గాను. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం ఉండటం వల్ల బిజినెస్ పరంగానూ ఉపయోగపడుతుందని ఇప్పుడు ఎం.బి.ఏ చేస్తున్నాను. ఇంట్లో రోజూ నాన్‌వెజ్ వండినా మా అమ్మనాన్నలు వస్తే మాత్రం ఆ వంట జోలికే వెళ్లరు. పుట్టిల్లు, అత్తిల్లు... ఇరువైపులా గౌరవమర్యాదలు ఉంటేనే దంపతుల మధ్య బంధం బలపడుతుందని నమ్ముతాను.
నన్ను నేను మార్చుకున్నాను
ఈయన రోజూ పదహారు గంటలు పనిచేస్తారు. నేనే ఈయన పనికి తగ్గట్టు నా తిండి, నిద్ర సమయాలు మార్చుకున్నాను.'పెళ్లి తర్వాత జీవితం గురించి కలలు కనడం సహజమే, కాని వాస్తవంలో వేరుగా ఉంటాయని, ఎప్పుడంటే అప్పుడు సినిమాలు, షికార్లు కుదరదు' అని ఈయన ముందే చెప్పారు. ఆ మాటలకు తగ్గట్టు నడుచుకుంటున్నాను.
నచ్చచెబుతారు
కొన్ని వెబ్‌సైట్‌లలో మా ఇద్దరి గురించి 'డైవర్స్ వరకు వెళ్లిపోయారు' అని రాసినవి చూసినప్పుడు చాలా బాధ కలు
గుతుంది. రూమర్స్ రాసే వారి మీద యాక్షన్ తీసుకోమని గొడవ చేస్తా ను. కాని ఈయన మాత్రం 'టైమ్ వేస్ట్, మెల్లమెల్లగా వారే తెలు
సుకుంటారులే!' అని నచ్చచెబుతుంటారు. ఈయన పరిచయం చేసిన లేడీ సింగర్స్ అందరూ నాకు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. వారి శారీ డిజైనింగ్ కూడా నేనే చేస్తుంటాను. ఈయన చేసిన శ్రీమన్నారా యణ సినిమాలో ఒక పాటకి అతి బలవంతం మీద కోరస్ పాడాను. మా ఇద్దరికీ ఇళయరాజా, ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అంటే చాలా ఇష్టం.
అభిమాని పిలిచే...
మా మ్యూజిక్ గ్రూప్‌లో సౌండ్ ఇంజనీర్ పెళ్లి అయితే వెళ్లాను. అక్కడ స్వాగతం పలికే అమ్మాయిల టీమ్‌కి శ్రావణి లీడర్. తను నా సంగీతానికి పెద్ద ఫ్యాన్ అని, పాట పాడమని కోరింది. ముందు బ్రేక్ ఫాస్ట్ అని, తర్వాత భోజనాలు అని పాట పాడకుండా టైమ్ పాస్ చేశాం. నా దష్టి అంతా సెంటరా ఫ అట్రాక్షన్‌గా ఉన్న ఈమె మీదే పడింది.
భోజనాలయ్యాక తపినిసరై ఒక పాట పాడాను. తర్వాత ఒక పాట నుంచి మరో పాట వరుసగా పాడుతూ.. కచేరీ అయిపోయింది. అక్కడే ఈవిడ క్లాసికల్ డ్యాన్సర్ అని తెలిసింది. 'మా కాలేజీ యానివర్సరీకి తపికుండా రండి' అని రిక్వెస్ట్ చేశారు ఈమె, ఈమె మిత్రబందం. 'మీ కాలేజీలో కల్చరల్ ఫెస్ట్ ఏర్పాటు చేయండి, వస్తాం' అని ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం. అలా మామూలు నుంచి సొంత విషయాలు మాట్లాడుకునేంతగా మా స్నేహం పెరిగింది. నాకన్నా ఏడేళ్ల వయసు తేడా ఉన్నా ఈవిడ మాటల్లో పరిణతి, సినిమా రంగం పట్ల తనకున్న సదుద్దేశం నన్ను ఆకట్టుకున్నాయి. అలా స్నేహం ప్రేమగా మారింది.
బాధ్యత పంచుకునే అమ్మాయి...
నన్ను ప్రేమిస్తున్నానని ఈవిడ చెప్పినప్పుడు మూడంతస్తుల బిల్డింగ్ పైన ఉన్నాను. ఆ మాట విన గానే అక్కడ నుంచి దూకేయాలన్నంత ఆనందం కలి గింది. అభిమాని అంటే ఆటోగ్రాఫ్, ఫోటోగ్రాఫ్‌ల వరకే ఉంటారు. కాని నా సంగీతాన్ని అభిమానించడం
తో పాటు, నా భావాలనూ ప్రేమించే అమ్మాయి దొరకడం అదష్టంగా భావించాను. 'డబ్బున్న అమ్మాయిని చేసుకోవచ్చు కదా! మధ్యతరగతి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు' అని చాలామంది అడిగారు.
నేను కోరుకున్నది డబ్బు కాదు. మంచి మనసుండి నేనంటే ఇష్టపడే అమ్మాయి నా భార్యగా వచ్చి, ఇంట్లో అందరితో బాగుండాలనుకున్నాను. ఆ లక్షణాలు శ్రావణిలో చూశాను. ప్రేమకు కులమతాలు అడ్డంకి కావు. కాని పెళ్లికి అడ్డుపడుతుంటాయి. అందుకే శ్రావణిని ముందుగానే మా ఇంటికి పిలిపించి, పరిస్థితులు తెలియజేశాను. తనూ అర్థం చేసుకుంది.
గతాన్ని తలచుకోవడానికే ఇష్టపడను...
మాకు ఇంకా పిల్లలు లేరు. ప్రస్తుతానికి ఒకరికి ఒకరం అన్నట్టుగా ఉన్నాం. 'తను రాకముందు జీవితం గురుతైనా లేదని.. తను కలిసి ఉన్న ఆ క్షణం నను వీడిపోదని..' ఈ పాట నా జీవితానికి చాలా దగ్గరగా ఉందనిపిస్తోంది. శ్రావణి అడుగుపెట్టాకే నా జీవితంలోకి ఆనందం వచ్చింది. వస్తుందనుకున్న అవకాశం రాకపోయినా, బాగా హిట్ అవుతుందనుకున్న మూవీ ఫెయిల్ అయినా 'ఎంత కష్టపడ్డారో
కదా!' అని తను రెండుమూడు రోజుల వరకు బాధ పడిపోతుంది. ఇండస్ట్రీలో ఆ ఒడిదొడుకులు మామూలే అని చెబుతుంటాను. అయితే నా గురించి ఈవిడ అలా ఫీలవడం నచ్చుతుంది. పెళ్లయ్యాకే మ్యూజిక్ డెరైక్టర్‌గా నాకు నంది అవార్డు లభించింది.
బరువు తగ్గడానికి జాగ్రత్తలు...
నేను రోజులో ఎక్కువ సమయం కూర్చొనే పనిచేస్తాను. పైగా సరైన సమయంలో తిండి, నిద్ర, వ్యాయామం ఉండవు. దీంతో బరువు బాగా పెరిగాను. ఇంట్లో ఉన్నంతసేపూ మొలకెత్తిన గింజలు, తేనె, నిమ్మరసం.. అంటూ నా డైట్ గురించి శ్రావణి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. కాని బయటకు వెళ్లాక, పనిలో పడిపోతే నేనే అన్నీ మర్చిపోతాను. ముఖ్యంగా విదేశాలకు వెళితే నెలలో కొన్నిరోజుల పాటు తిండి, నిద్ర విషయంలో నియమాలు ఉండవు. దీంతో బరువు తగ్గడం లేదు. నేను లావు అయ్యానని ఈవిడ బరువు పెరగడానికి ట్రై చేస్తోంది.
'బంగారుకొండ మరుమల్లెదండ మనసైన అండ నువ్వేరా.. కనుపాప నిండా నీ రూపు నిండ.. నా బ్రతుకుపండా రావేరా..'
పాటను చక్రి ఇష్టంగా కంపోజ్ చేశారు. ఆ పాటను అంతే ఇష్టంగా ఆలపిస్తూ ఉంటారు శ్రావణి. అభిమానాన్నే కాదు, అప్పుడ
ప్పుడు కోపాన్నీ పాటలతోనే చూపిస్తానని శ్రావణి... ఆ కోపాన్ని క్షణాల్లో కూల్ చేస్తానని చక్రి... పోటీపడి వివరిస్తుంటే.. ఒకరి
కొకరు నిజంగానే కొండంత మురిపెం అనిపించారు. కాగా గుండెపోటుత చక్రి సోమవారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే.
- నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి, ఫొటోలు: శివ మల్లాల