'సంగీత దర్శకుడు చక్రిని భార్యే చంపేసింది'
హైదరాబాద్: సంగీత దర్శకుడు చక్రి మృతి.. కుటుంబ సభ్యుల వివాదం కొత్త మలుపు తిరిగింది. చక్రిని భార్య శ్రావణియే డబ్బుల కోసం చంపిందని ఆయన తల్లి విద్యావతి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చక్రిని తానే చంపానంటూ శ్రావణి తమకు ఫోన్ చేసి చెప్పిందని విద్యావతి ఫిర్యాదులో పేర్కొన్నారు.
శ్రావణి కాల్ డేటాను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుందని విద్యావతి పోలీసులను కోరారు. చక్రి మృతదేహానికి పోస్టు మార్టం చేయకుండా శ్రావణి అడ్డుకుందని ఆమె ఆరోపించారు. తాము శ్రావణిని ఎప్పుడూ వేధించలేదని చెప్పారు. చక్రి మరణం తర్వాత శ్రావణి వింతగా ప్రవర్తిస్తోందని తెలిపారు. చక్రి అనుమానస్పద మృతిపై విచారణ చేయాలని విద్యావతి పోలీసులను కోరారు. పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని సినీ పెద్దలు బెదరించారని చెప్పారు.
చక్రి మరణించడానికి 20 రోజుల ముందు ఇంట్లో గొడవలు జరిగినట్టు విద్యావతి చెప్పారు. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని శ్రావణి తమను బెదిరిందించిందని తెలిపారు. తాము ఇంటిని వదిలి వెళ్లకపోతే చక్రిని చంపేస్తానంటూ శ్రావణి హెచ్చరించిందని ఆమె చెప్పారు. ఇంట్లో గొడవ జరగడంతో చక్రి మరణించడానికి ముందే ఇంట్లో నుంచి బయటకు వచ్చామని విద్యావతి తెలిపారు. శ్రావణి కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని విద్యావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదిలావుండగా, చక్రి మృతిపై అనేక అనుమానాలున్నాయని ఆయనపై విష ప్రయోగం జరిగిందని, సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని చక్రి సతీమణి శ్రావణి జూబ్లీహిల్స్ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. గత నెల 15న తన భర్త మృతికి ఆయన కుటుంబ సభ్యులే కారణమని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనను వేధిస్తున్న అత్త, ఆడపడుచులు, వారి భర్తలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. కాగా శ్రావణి తప్పుడు ఆరోపణలు చేస్తోందని చక్రి కుటుంబ సభ్యులు ఖండించారు.