సంగీత దర్శకుడు చక్రి గుండెపోటుతో మృతి
టాలీవుడ్ చిత్ర పరిశ్రమను మరో విషాదం వెంటాడింది. సంగీత దర్శకుడు చక్రి (40) గుండెపోటుతో మృతి చెందాడు. ఆయనకు అపోలో ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. చక్రి పూర్తి పేరు చక్రధర్ గిల్లా. 1974 జూన్ 15న వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కంభాలపల్లిలో జన్మించారు. ప్రముఖ దర్శకుడు పూరిజగన్నాధ్ దర్శకత్వం వహించిన 'బాచీ' సినిమాతో..... టాలీవుడ్‌కి సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న తమిళ అమ్మాయి, సత్యం, ఢీ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
మ్యూజిక్‌లో తనకంటై ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న చక్రి...... ఇప్పటివరకు దాదాపు 85 చిత్రాలకుపైగా సంగీతదర్శకత్వం వహించారు చక్రి. బాలకృష్ణ, నాగార్జున లాంటి అగ్రహీరోలతో పాటు ఎన్టీఆర్, అల్లు అర్జున్, నితిన్, తరుణ్, సుమంత్ లాంటి యువ హీరోలకు కూడా సంగీతమందించారు. వెంకటేష్, చిరంజీవి మినహా దాదాపు అందరి స్టార్లకు సంగీతాన్ని అందించిన ఘనత చక్రికే దక్కింది.
స్టార్ హీరో రవితేజ సినిమాలకు ఎక్కువగా మ్యూజిక్ అందించారు చక్రి. పూరి జగన్నాథ్, చక్రి, రవితేజలది టాలీవుడ్‌లో హిట్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న తమిళ అమ్మాయి చిత్రాలు..... టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి.