అధిక బరువు... ప్రాణానికి ముప్పు! | Life-threatening higher weight | Sakshi
Sakshi News home page

అధిక బరువు... ప్రాణానికి ముప్పు!

Published Tue, Dec 16 2014 5:06 PM | Last Updated on Sat, Sep 2 2017 6:13 PM

అధిక  బరువు...  ప్రాణానికి  ముప్పు!

అధిక బరువు... ప్రాణానికి ముప్పు!

ఓ సంగీత కోకిల మూగబోయింది. చక్రి ఓ సెలబ్రిటీగా

మనకు కనిపించే ఉదాహరణ. కానీ ఎందరెందరో తమ తమ కెరియర్లలో నిలకడగా  విజయాలు సాధిస్తూ ఉండే ఉంటారు. వారిలో కొందరు చక్రిలా స్థూలకాయంతో బాధపడుతూ ఉంటారు. చక్రికి వచ్చిన పరిస్థితి వారికి రాకుండా ఉండటం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను  తెలియపరిచేందుకే ఈ ప్రత్యేక కథనం.


చాలా హిట్ సినిమాల సంగీత దర్శకుడు చక్రి. నలభై ఏళ్లకే ఆయనకు నూరేళ్లు నిండాయి. అకస్మాత్తుగాగుండెపోటుతో చనిపోయారు. కానీ... అందరూ చెప్పుకుంటున్నట్లు మరణానికి కారణం గుండెపోటే అయినా ఆ గుండెపోటును  ప్రేరేపించింది మాత్రం ఆయన స్థూలకాయమే. నలభై ఏళ్లకే ఎన్నెన్నో సూపర్‌హిట్ సినిమాలకు సంగీత దర్శకత్వం చేసి ఇప్పటికీ కెరియర్‌లో సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారంటే... జీవించి ఉంటే మరెన్ని ఆణిముత్యాలను అందించేవారో. కానీ అకస్మాత్తుగా ఆ సంగీతఝరి ఆగిపోయింది.



భారతీయులలో స్థూలకాయం...

భారతీయుల్లో బీఎమ్‌ఐ విలువ 25 - ఆపైన ఉంటే స్వల్ప స్థూలకాయం ఉన్నట్లే. ఒకవేళ బీఎమ్‌ఐ విలువ 30 - ఆపైన ఉంటే అధిక స్థూలకాయం ఉన్నట్టుగా పరిగణించాలి. భారతీయుల్లో స్థూలకాయాన్ని నిర్ధారణ చేయడానికి బీఎమ్‌ఐతో పాటు నడుము చుట్టుకొలత, నడుమూ-హిప్ చుట్టుకొలతల నిష్పత్తి మొదలైన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటారు. నడుము చుట్టుకొలత మహిళల్లో 80 సెం.మీ. కంటే ఎక్కువగానూ, పురుషుల్లో 90 సెం.మీ. కంటే ఎక్కువగా ఉంటే స్థూలకాయం సమస్య ఉన్నట్లు. ఇక నడుం-హిప్ చుట్టుకొలతల నిష్పత్తి మహిళల్లో 0.8 కంటే ఎక్కువగానూ, పురుషుల్లో 0.9 కంటే ఎక్కువగానూ ఉంటే స్థూలకాయ సమస్య ఉన్నట్లుగా పరిగణించాలి.
 
బరువు పెరగకుండా ఉండటానికి మార్గాలు

అధిక బరువు (బీఎమ్‌ఐ 23 - 24.99) ఉన్నవారు, స్వల్ప స్థూలకాయం (బీఎమ్‌ఐ 25 - 29.99) ఉన్నవారు రోజూ క్రమం తప్పకుండా కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవడం (బ్రిస్క్ వాకింగ్), ఆహారంలో కొవ్వు పాళ్లు తగ్గించుకోవడం, క్రమం తప్పకుండా వేళకు తినడం, తక్కువ మోతాదుల్లో తినడం, చిరుతిండ్లకు, కూల్‌డ్రింక్స్‌కు, ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలితో బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇది అధిక బరువు ఉన్నవారికే గాక... అందరికీ ఆరోగ్యాన్నిచ్చే ప్రక్రియ. అయితే ఒకవేళ బీఎమ్‌ఐ 30 - ఆపైన ఉంటే డైటింగ్, వ్యాయామం వంటి మామూలు మార్గాలు పనిచేయవు.  
 
 
స్థూలకాయం కాస్మటిక్ సమస్య కాదు.. అది ప్రమాదకరం

చాలామంది అనుకుంటున్నట్లుగా స్థూలకాయం కాస్మటిక్ సమస్య కాదు. ఎన్నో ప్రాణాంతకమైన వ్యాధులకు అది మూలకారణం. ఉదాహరణకు డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు, కీళ్లనొప్పులు, నిద్రలో ఊపిరి సరిగా అందకుండా చేసే స్లీప్ ఆప్నియా, డిప్రెషన్ వంటి దాదాపు 65 రకాల వ్యాధులకు అదే అంతర్గత (అండర్‌లైయింగ్) కారణం. సాధారణ ప్రజలతో పోలిస్తే స్థూలకాయుల్లో ఆయుఃప్రమాణం 5 నుంచి 20 ఏళ్లు తగ్గిపోయే అవకాశం ఉంది. ప్రాణానికి ముప్పు వచ్చే అవకాశాలు 50 శాతం నుంచి 100 శాతం వరకు ఉంటాయి. సంగీత దర్శకుడు చక్రి విషయంలో జరిగిందిదే.
 
కొందరు స్థూలకాయంతో ఆరోగ్య సమస్యలు ఏమొస్తాయిలే అనీ, ఒక వయసు తర్వాత పొట్ట రావడం మామూలే అని అనుకుంటారు. నిజానికి ఒళ్లంతా కొవ్వు పేరుకుపోవడం ద్వారా లావెక్కిపోయి వచ్చే స్థూలకాయం కంటే పొట్టచుట్టూ కొవ్వు పేరుకునిపోవడమే అత్యంత ప్రమాదకరం. పొట్టచుట్టూ కొవ్వు పేరుకుని పోవడాన్ని సెంట్రల్ ఒబేసిటీ అంటారు. మన పొట్ట చుట్టూ అనేక పొరలు ఉంటాయి. సెంట్రల్ ఒబేసిటీలో చర్మం కిందనే కాకుండా, కండరాల లోపలివైపు, జీర్ణాశయం, పేగుల చుట్టు కూడా కొవ్వు పేరుకొనిపోతుంది. డయాబెటిస్, హైబీపీ, రక్తలో కొవ్వు శాతం పెరగడం (హైపర్‌లిపిడిమియా) వంటి సమస్యలు వచ్చే అవకాశం... సాధారణ స్థూలకాయం కంటే సెంట్రల్ ఒబేసిటీలో చాలా ఎక్కువ. కాబట్టి పొట్ట పెరుగుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్‌ను సంప్రదించాలి.
 

 
 
ఒక వ్యక్తి స్థూలకాయుడా... కాదా అని నిర్ణయించడం ఎలా?

 సాధారణంగా ఒక వ్యక్తి స్థూలకాయుడా, కాదా అని నిర్ధారణ చేయడానికి ‘బాడీ మాస్ ఇండెక్స్’ (బీఎమ్‌ఐ) అనే ప్రమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ఉంటారు. దీన్ని కొలిచే పద్ధతి ఇలా ఉంటుంది. ఒక వ్యక్తి బరువును కిలోగ్రాములలో కొలవాలి. ఆ విలువను అతడి ఎత్తు స్క్వేర్‌తో భాగించాలి. స్క్వేర్ అంటే అదే సంఖ్యను మళ్లీ అదే సంఖ్యతో గుణించడం. ఈ ఎత్తు విలువను మీటర్లలో తీసుకోవాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి బరువు 120 కిలోలు. అతడి ఎత్తు 1.7 మీటర్లు. అప్పుడు అతడి బీఎమ్‌ఐ విలువ ఎంత అంటే...  120 / 1.7  ్ఠ 1.7 = 41.52 కి.గ్రా/మీ2. ఇప్పుడు ఈ విలువను బీఎమ్‌ఐ పట్టికతో సరిపోల్చుకుని మీరు ఏ స్థూలకాయ స్థాయిలో ఉన్నారో నిర్ణయించుకోవచ్చు.

బీఎమ్‌ఐ లెక్కించి మీ స్థూలకాయ స్థాయి ఏమిటో తెలుసుకోవాలంటే ఈ పట్టికలోని విలువలను ప్రమాణంగా తీసుకోండి.
 స్థూలకాయ స్థాయి    భారతీయుల బీఎమ్‌ఐ    విదేశీయుల బీఎమ్‌ఐ
 
సాధారణ బరువు    18.50 - 22.99    18.50 - 24.99
అధిక బరువు     23.00 - 24.99    25.00 - 29.99
స్వల్ప స్థూలకాయం    25.00 - 29.99    30.00 - 34.99
అధిక స్థూలకాయం    30 - ఆపైన     35.00 - 39.99
వ్యాధిగ్రస్థ స్థూలకాయం    -    40.00 -49.99
సూపర్ స్థూలకాయం    -    50.00 - 59.99
సూపర్ సూపర్ స్థూలకాయం    -    60.00 - ఆపైన
 
బీఎమ్‌ఐ ఆధారంగా నిర్ధారణ చేసే స్థూలకాయ వర్గాలు విదేశీయులతో పోల్చి చూస్తే, భారతీయులలో కాస్త తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే విదేశీయులతో పోల్చి చూస్తే మనకు శరీరంలో కొవ్వు శాతం ఎక్కువ, కండరాల పరిమాణం తక్కువ. అందువల్ల మనం తక్కువ స్థూలకాయ స్థాయిలో ఉన్నప్పటికీ వైద్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.
 
సెట్‌పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజ్ అంటే ఏమిటి?
 
ఒక వ్యక్తి శరీరంలో ఎంత కొవ్వు నిలువ ఉండాలనే అంశాన్ని (సెట్‌పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజ్) అనేక హార్మోన్లు నిర్ణయిస్తాయి. ఇందులో జీర్ణవ్యవస్థలో తయారయ్యే హార్మోన్లయిన గ్రెలిన్, జీఎల్‌పీ-1 అనేవి ప్రధానమైనవి. ఈ సెట్ పాయింట్ అనేది మన మనసు అధీనంలో ఉండదు. గ్రెలిన్ జీర్ణాశయం పైభాగంలో తయారవుతుంది. ఇది ఆకలిని పెంచుతుంది. ‘జీఎల్‌పీ-1’ అనే హార్మోన్ చిన్న పేగు చివరిభాగంలో తయారవుతుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది.

కొంతమంది తక్కువగా తింటున్నప్పటికీ లావుగా ఉంటారు. ఇంకొంతమంది ఎక్కువగా తింటున్నప్పటికీ సన్నగానే ఉంటారు. దీనికి కారణం... లావుగా ఉన్నవారిలో కొవ్వు సెట్‌పాయింట్ ఎక్కువగానూ, సన్నగా ఉన్నవారిలో కొవ్వు సెట్‌పాయింట్ తక్కువగానూ ఉంటుందన్నమాట. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో కొవ్వు సెట్‌పాయింట్ పెరుగుతుంది. ఇది ఒకసారి పెరిగితే మళ్లీ తగ్గదు.
 
బీఎమ్‌ఐ 30 - ఆపైన ఉంటే...
 
బీఎమ్‌ఐ 30 - ఆపైన ఉంటే (అంటే అధిక స్థూలకాయానికి చేరితే) కేవలం డైటింగ్, వ్యాయామం వంటి ప్రక్రియల ద్వారా శాశ్వతంగా బరువు తగ్గించుకోవడం సాధ్యం కాదు. ఇలాంటి వారిలో నూటికి నలుగురు మాత్రమే డైటింగ్, వ్యాయామాలతో బరువు తగ్గించుకోగలరు. ఎందుకంటే కొవ్వు సెట్ పాయింట్ పెరిగిపోయింది కాబట్టి.  బీఎమ్‌ఐ 30 - ఆపైన ఉన్న వ్యక్తి డైటింగ్, వ్యాయామాలను మొదలుపెట్టిన వెంటనే ‘కొవ్వు సెట్ పాయింట్’ను నియంత్రించే హార్మోన్లు శరీరంలో ప్రతికూల మార్పులను తీసుకొస్తాయి. ఆకలిని పెంచే గ్రెలిన్ స్రావాలు పెరుగుతాయి కాబట్టి ఆకలి పెరుగుతుంది. ఆకలిని తగ్గించే జీఎల్‌పీ-1 తగ్గుతుంది. జీవక్రియలు మందగిస్తాయి. కాబట్టి బీఎమ్‌ఐ 30 - ఆపైన ఉన్నవారు డైటింగ్, వ్యాయామం కారణంగా మొదట కొంచెం బరువు తగ్గినప్పటికీ హార్మోన్ల ప్రభావం వల్ల ఆర్నెల్ల నుంచి ఐదేళ్ల వ్యవధిలో కోల్పోయిన బరువు మళ్లీ పెరుగుతారు.
 
మరి పరిష్కారం ఏమిటి...?
 
డైటింగ్, వ్యాయామం కొవ్వు సెట్‌పాయింట్‌ని మార్చలేవు. అందువల్ల బీఎమ్‌ఐ 30 - ఆపైన ఉన్నవారిలో... అంటే అధిక, వ్యాధిగ్రస్త, సూపర్, సూపర్‌సూపర్ స్థూలకాయం ఉన్నవారిలో డైటింగ్, వ్యాయమాలు శాశ్వతంగా బరువు తగ్గించలేవు. ఇలాంటి వారిలో బరువును నియంత్రించడానికి ఔషధాల పాత్ర కూడా చాలా పరిమితమే. ఒకవేళ వాటిని వాడినా... ఆపివేయగానే మళ్లీ బరువు పెరిగిపోతుంది. కాబట్టి శాశ్వతంగా బరువు తగ్గడానికీ, స్థూలకాయంతో వచ్చే అనర్థాలైన గుండెపోటు, డయాబెటిస్, అధికరక్తపోటు వంటి వాటిని తగ్గించుకుని, ఆయుఃప్రమాణాన్ని పెంచుకోడానికి అనువైన మార్గం ఒక్క బేరియాట్రిక్ సర్జరీ మాత్రమే. అయితే బేరియాట్రిక్ సర్జరీలను అందరికీ చేయరు. భారతీయులలో బీఎమ్‌ఐ 30 - ఆపైన ఉండి, షుగర్ లాంటి జబ్బులు ఉంటే వారికి బేరియాట్రిక్ సర్జరీ చేస్తారు. ఒకవేళ షుగర్ లాంటి జబ్బులేమీ లేకపోయినా బీఎమ్‌ఐ 35 - ఆ పైన ఉన్నవారు బేరియాట్రిక్ సర్జరీకి అర్హులవుతారు.
 
బేరియాట్రిక్ సర్జరీలో రకాలు...
 
బేరియాట్రిక్ సర్జరీలలో స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ, గ్యాస్ట్రిక్ బైపాస్, డియోడినల్ స్విచ్ వంటి అనేక ప్రక్రియలు ఉన్నాయి. వీటిని లాపరోస్కోపిక్ ప్రక్రియలో చేస్తారు.

స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ : ఈ ప్రక్రియలో జీర్ణాశయంలోని 80 శాతాన్ని తొలగిస్తారు. మిగిలిన సంచి పరిమాణం 60-120 మి.లీ. కావడంతో, ఏ కొంచెం తిన్నా కడుపు నిండిపోతుంది.
 
గ్యాస్ట్రిక్ బైపాస్: ఈ ప్రక్రియలో జీర్ణాశయం పైభాగాన్ని కత్తిరించి ఒక చిన్న సంచిలా తయారు చేస్తారు. చిన్నపేగు మధ్యభాగాన్ని కత్తిరించి దాన్ని నేరుగా  ఈ సంచికి కలుపుతారు. ఈ శస్త్ర చికిత్సలో జీర్ణమయ్యే ఆహారం చిన్న పేగుల్లోని మొదటి భాగమైన ‘డియోడినమ్’లోకి కాకుండా నేరుగా చిన్నపేగు మధ్యభాగంలోకి ప్రవేశిస్తుంది. దాంతో జీర్ణమయ్యే ఆహారం పేగుల్లోకి ఇంకడం తగ్గి పోతుంది.
 
డియోడినల్ స్విచ్: ఈ ప్రక్రియలో తొలుత స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ చేసి, చిన్న పేగు మొదటి భాగమైన డియోడినమ్‌ను కత్తిరించి, నేరుగా చిన్నపేగు చివరి భాగానికి  కలుపుతారు.
 
 
బేరియాట్రిక్ సర్జరీ వల్ల ఇతర ప్రయోజనాలు
 
బేరియాట్రిక్ సర్జరీలు చేయించుకున్న వారిలో బరువు తగ్గడమే కాకుండా డయాబెటిస్ (షుగర్), హైబీపీ వంటి సమస్యలూ నయమయ్యే అవకాశం ఉంది. డయాబెటిస్‌ను నయం చేయడానికి మరికొన్ని ఆధునిక బేరియాట్రిక్ సర్జరీలు అందుబాటులోకి వచ్చాయి. అవి...మినీ గ్యాస్ట్రిక్ బైపాస్: ఇందులో జీర్ణాశయం పైభాగాన్ని ఒక పొడుగాటి సంచిలా కత్తిరించి, దానిని నేరుగా చిన్న పేగు మధ్య భాగానికి కలుపుతారు. ఫలితంగా ఆహారం...  జీర్ణాశయం, చిన్న పేగు పైభాగాలను బైపాస్ చేసుకొని చిన్నపేగు మధ్యభాగంలోకి చేరుతుంది. ఈ ప్రక్రియలో ఐరన్, క్యాల్షియం వంటి ఖనిజ లవణాల లోపాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

 స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ విత్ లూప్ డియోడినో-జిజినల్ బైపాస్ : ఈ ప్రక్రియలో తొలుత స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ చేసి, చిన్న పేగు మొదటి భాగమైన డియోడినమ్‌ను కత్తిరించి, నేరుగా చిన్నపేగు మధ్యబాగానికి కలుపుతారు. ఇందులో  ఖనిజ-లవణాల లోపాలు రావడం చాలా అరుదు.
 
స్థూలకాయం లేకపోయినా మధుమేహం ఉన్నవారికి...

 
 స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ విత్ డియోడినో - ఇలియల్ ఇంటర్-పొజిషన్: ఇందులో స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ చేసి, డియోడినమ్ మొదటి భాగాన్ని కత్తిరిస్తారు. దీన్నీ, చిన్నపేగు మధ్య భాగాన్నీ కలుపుతూ జీఎల్‌పీ-1 తయారు చేసే ఇలియల్ సెగ్మెంట్‌ను అతికిస్తారు.  బీఎమ్‌ఐతో సంబంధం లేకుండానే మధుమేహం సమస్యతో బాధపడేవారికి ఇది మంచి చికిత్స.
 
చివరగా: స్థూలకాయంతో బాధపడేవారు అకస్మాత్తుగా గుండెపోటుతోనో లేదా హైబీపీ వంటి ఇతరత్రా సమస్యలతో చనిపోతే అది మరణానికి తక్షణ కారణం కావచ్చు. కానీ ఆ కారణానికి దారితీసిన పరిస్థితులు మాత్రం స్థూలకాయంతో వచ్చిన అనర్థాలే. అందుకే మీ బీఎమ్‌ఐని పరీక్షించుకుని, అవసరమైతే డైటింగ్, వ్యాయామాలు చేసి బరువు నియంత్రించుకోండి. ఒకవేళ మీ బరువు అధిక స్థూలకాయం కంటే ఎక్కువగా ఉంటే బేరియాట్రిక్ నిపుణులను సంప్రదించి వారి సలహాలు తీసుకోండి. సంగీత దర్శకుడు  చక్రి విషాద ఉదంతంతోనూ మనలో చాలామంది అప్రమత్తమై మన జీవన ఆయుఃప్రమాణాన్ని పెంచుకోవచ్చు.

 డాక్టర్ వి. అమర్
 మినిమల్ యాక్సిస్ మెటబాలిక్ అండ్ బేరియాట్రిక్ సర్జన్,
 సిటిజన్స్ హాస్పిటల్,
 శేరిలింగంపల్లి, హైదరాబాద్
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement