సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మహిళల్లో ఊబకాయం పెరిగిపోతోంది. పురుషుల్లో కన్నా మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉందని ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడైంది. నాలుగవ జాతీయ కుటుంబ సర్వేతో పోలిస్తే అయిదవ సర్వేలో మహిళల్లో ఈ సమస్య పెరిగింది. నాలుగవ సర్వేలో 33.2 శాతం మహిళల్లోనే ఉండగా ఆ తర్వాతి సర్వేకు వచ్చేసరికి ఇది 36.3 శాతానికి పెరిగింది. అయితే.. అదే సమయంలో పురుషుల్లో మాత్రం ఈ తీవ్రత 33.5 శాతం నుంచి 31.3 శాతానికి తగ్గింది.
చదవండి: ఇలా చేస్తే.. ఎంత వయసొచ్చినా యంగ్‌గా..
పట్టణాల్లోనే ఊబకాయులు ఎక్కువ
నిజానికి వయస్సు, ఎత్తు ఆధారంగా ప్రతీ మనిషి ఎంత బరువు ఉండాలన్నది నిర్దేశిస్తారు. ఇలా నిర్దేశిత బరువు కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఊబకాయంగా గుర్తిస్తారు. ప్రధానంగా.. గ్రామీణ ప్రాంతాల్లో కన్నా పట్టణ ప్రాంతాల్లోని మహిళలు, పురుషుల్లోనే ఎక్కువ ఊబకాయం ఉన్నట్లు ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. పట్టణ మహిళల్లో 44.4 శాతం, గ్రామీణ మహిళల్లో 32.6 శాతం ఊబకాయ సమస్య ఉంది. అదే పురషుల విషయానికొస్తే.. పట్టణాల్లో 37.7 శాతం, పల్లెల్లో 28.0 శాతంగా ఉంది. ఒక్క కృష్ణా, విశాఖపట్నం జిల్లాలు మినహా మిగిలిన అన్ని చోట్ల గతం కన్నా మహిళల్లో ఊబకాయ సమస్య పెరిగినట్లు సర్వే పేర్కొంది.
చదవండి: బరువు తగ్గాలనుకుంటున్నారా.. కొబ్బరి ప్రయత్నించండి!
అవగాహన లేకపోవడమే..
వ్యాయామంపై చాలామంది మహిళలకు అవగాహన తక్కువ. దీంతో పాటు బిడ్డలను కన్నాక వారిలో శారీరక మార్పులు చోటు చేసుకుంటాయి. హార్మోన్ల లోపాలు వంటివి సమస్యలుగా మారతాయి. ఇలాంటి సమయంలో వారి శరీరంలో మార్పువచ్చి బరువు పెరుగుతుంటారు. దీన్ని అధిగమించాలంటే శారీరక వ్యాయామం చేయాల్సిందే. కొత్త తరం అమ్మాయిలు, మహిళలు వ్యాయామంపై అవగాహనతో ఉంటున్నారు.
– డా. విద్యాసాగర్, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్, కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీ
Comments
Please login to add a commentAdd a comment