పురుషుల డీఎన్‌ఏలోనే ఇంటిపని లేదట!
ఏమైనా మన పెద్దోళ్ల కామన్‌సెన్స్ ముందు కేంబ్రిడ్జిలు, మసాచుసెట్స్‌లు ఏం పనికిరావండీ. మన వాళ్లు దశాబ్దాలు, శతాబ్దాల క్రితం నోటి మాట మీద చెప్పేసిన విషయాలను వీరు పరిశోధనలు చేసి, నానా అవస్థలు పడి కనుక్కొంటున్నారు. చివరకు రెండింటి రిజల్టు ఒకటే! ఇంతకూ సంగతేంటో చూడండి!
హోం క్లీనింగ్ ఏజెన్సీ హౌస్‌కీప్.కామ్ మొత్తం మగాళ్లపై జరిపిన అభిప్రాయసేకరణలో మగాళ్లకు ఇంటినిసర్దడంపై ఏ మాత్రం ఆసక్తి లేని విషయాన్ని కనుగొంది.
‘ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి’ ఇది పెద్దలు చెప్పిన సామెత. ఇందులో ఎంతో అర్థముంది. ఒక ఇల్లు శుభ్రంగా, ఆహ్లాదంగా ఉందంటే... ఆ ఇంట్లో ఇల్లాలు చాలా తెలివైనది, మంచిది, పని తెలిసిన వ్యక్తి అన్నది పెద్దవాళ్ల అంతర్భావన. అంతేకాదు, ఇల్లు అంత బాగా ఉందంటే... ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఆడోళ్ల క్రియేటివిటే కానీ మగపుంగములకు అలవికానిదనేది అందులోని మరో నిగూఢార్థం. ఇది ఎంతకాలం క్రితం చెప్పారో కూడా అంతుపట్టనంత పాత సామెత. పాపం తెలుగులో ఉన్న ఈ సామెత తెలియక కేంబ్రిడ్జి యూనివర్సిటీ వారు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కొత్తగా తెలుసుకుని, తామే ఈ విషయాన్ని కనిపెట్టినట్టు బిల్డప్పిస్తున్నారు. ఇంతకీ వారేం చెబుతున్నారో వినండి.
హోం క్లీనింగ్ ఏజెన్సీ హౌస్‌కీప్.కాం మొత్తం మగాళ్లపై జరిపిన అభిప్రాయ సేకరణలో మగాళ్లకు ఇంటిని సర్దడంపై ఏ మాత్రం ఆసక్తి లేని విషయాన్ని కనుగొంది. ఈ విషయంలో ఆడవారికి ఐదు రెట్ల ఆసక్తి, నాలుగు రెట్ల ఓపిక ఉంటుందట. 2013 ఏడాదిలో సంవత్సరానికి ఇంటి పనులకు మీరు ఎంత సమయం కేటాయించరని అడిగిన పోల్‌లో ఆడవాళ్లు 17 గంటలు కేటాయించామని చెబితే, మగవాళ్లు ఆరు గంటలు కేటాయించినట్లు చెప్పారట. ఇది సగటు లెక్క. అస్సలు కేటాయించని వారు కూడా ఉన్నారట పురుషుల్లో.
ఇక ఇదే విషయాన్ని కేంబ్రిడ్జి యూనివర్సిటీ కూడా చెబుతూ ఇంకాస్త వివరంగా కారణాలు కూడా వెల్లడించింది. చిందరవందరగా ఉన్న ఇంట్లో పురుషులు వాటిని పట్టించుకోకుండా నిద్ర పోగలరు కానీ స్త్రీలు మాత్రం అలసటలో ఉన్నా కూడా ఇల్లు అలా ఉంటే వారికి ఏమీ తోచదు. అందుకే ఓపిక చేసుకుని మరీ సర్దడానికి ట్రై చేస్తారని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం సోషియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ బ్రెండన్ బుచెల్ వివరించారు.
పూర్వీకుల తరాల నుంచి చూస్తే పురుషులు బయటకు వేటకు వెళితే స్త్రీలు ఇంటి పనులు చక్కబెట్టేవారు. కొన్ని వేల తరాలు అలా జరిగేటప్పటికి అది డీఎన్‌ఏలో స్థిరపడింది. అయితే, ఇది మళ్లీ మారుతూ వస్తోంది. ఇప్పటికే కొంతమందిలో మార్పు కనిపిస్తోంది. చిన్నప్పటి నుంచి అబ్బాయిలు పెట్టుకున్నన్ని బయటి వ్యాపకాలు, ఆటలు అమ్మాయిలకు లేకపోవడం వల్ల వారు ఇంట్లో ఎక్కువ ఉండట జరుగుతుంది. దీంతో సహజంగా వారు ఎక్కువ సమయం ఇంటిలో అనుకోకుండానే పాలుపంచుకోవాల్సి వస్తుంది. అయితే, మరో వందేళ్లకు పురుషులకూ ఇంటి పనులపై ఆసక్తి పెరగొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
దీంతో పాటు బీఎంసీ ఫిజియాలజీ సైంటిఫిక్ జర్నల్ కూడా అటూఇటూగా ఈ విషయాన్నే ప్రచురించింది. స్త్రీలు ఉన్నంత ఆర్గనైజ్‌డ్‌గా పురుషులు ఉండలేరని పేర్కొంది. అంతేకాదు అబ్బాయిలు పనిలో స్లో అట. కొందరు స్త్రీలు-పురుషులను తీసుకుని మార్చిమార్చి పనులు అప్పగించినపుడు వెంటనే పురుషులు పనిని అందుకోలేకపోయేవారట. 2012లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయమే ప్రకటించిన మరో జర్నల్‌లో పురుషులు పనిలో పాలుపంచుకున్న కుటుంబాల్లో సంతోషం, అన్యోన్యత ఎక్కువ కనిపించినట్లు ప్రొఫెసర్ స్కాట్ చెప్పుకువచ్చారు.