కొందరు ఎంత తిన్నా శరీరానికి కొవ్వు పట్టదు. జీరో సైజ్‌లోనే కనిపిస్తుంటారు. మరికొందరికేమో కొంచెం తిన్నా లావెక్కిపోతారు. ఈ రోజుల్లో బరువు పెరగడం అనేది అన్ని వయసుల వారికి పెద్ద సమస్యలా మారింది. బరువు అదుపులో ఉంచుకునేందుకు గంటల తరబడి జిమ్‌లో వర్కవుట్స్ చేసినా, డైట్ కంట్రోల్ చేసినా ఏ మాత్రం రిజల్ట్ ఉండటం లేదు.
''నాకు 24 ఏళ్లు. నా హైట్ 5.2. బరువు 92 కిలోలు ఉన్నాను. యోగా, రెగ్యులర్‌గా జిమ్‌కి వెళుతున్నా, డైటింగ్ కూడా చేస్తున్నా. అయినా బరువు తగ్గడం లేదు. బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవచ్చా? భవిష్యత్‌లో ప్రెగ్నెన్సీ మీద ఏమైనా ప్రభావం ఉంటుందా?''
మీ వయసు 24 కాబట్టి డైటింగ్, ఎక్సర్‌సైజెస్ కొంతవరకు బరువు తగ్గడానికి దోహద పడతాయి. మీరు చెప్పిన మీ ఎత్తు, బరువు వివరాలను బట్టి మీ బీఎమ్‌ఐ (బాడీ మాస్ ఇండెక్స్) 40 పైనే వస్తుంది. అంటే అధిక బరువు ఉన్నారని అర్థం. మార్బిడ్ ఒబేసిటీ అంటాం. బేరియాట్రిక్ సర్జరీ అనేది ఫస్ట్ ఆప్షన్‌గా తీసుకోకండి. ప్రొఫెషనల్ జిమ్ ఇన్‌స్ట్రక్టర్, డైట్ కౌన్సెలర్‌ని కలవండి. ఒకసారి హార్మోన్స్, థైరాయిడ్, సుగర్ టెస్ట్‌లు చేసుకోండి. జీవన శైలిని మార్చుకోవడం ద్వారా బరువు తగ్గించుకునే వీలు ఉంటుంది. బీఎమ్‌ఐ 40 దాటిన వారికి బేరియాట్రిక్ సర్జరీని సూచిస్తాం.
బీఎమ్‌ఐ 35 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ప్రెగ్నెన్సీకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయినా స్పెషలిస్ట్‌ని సంప్రదించిన తరువాతే మీకు ఏది సరిపోతుందో అంచనా వేస్తాను. మామూలుగా బేరియాట్రిక్ సర్జరీ అయిన 12– 18 నెలల తరువాత మాత్రమే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ స్టార్ట్ చెయ్యాలి. ఎందుకంటే బరువు తగ్గే క్రమంలో మొదట్లో పోషకాల లోపం తలెత్తుతుంది. వాటిని మల్టీ విటమిన్స్‌తో కవర్ చేసి అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చెయ్యాలి.
ప్రెగ్నెన్సీ సమయంలో చాలా జాగ్రత్తగా డైట్‌ని సూచించాల్సి ఉంటుంది. బీపీ, సుగర్ సమస్యలు తలెత్తకుండా టెస్ట్ చెయ్యాలి. బేరియాట్రిక్ సర్జరీ తరువాత ప్రెగ్నెన్సీలో చాలా వరకు ఏ సమస్యలూ ఉండకపోవచ్చు. కానీ కొన్ని కేసెస్‌లో తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం, నెలలు నిండకుండానే ప్రసవమవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే ఒబేసిటీతో ఉన్నప్పటి రిస్క్ కంటే ఈ రిస్క్ చాన్సెస్ చాలా తక్కువ. కాబట్టి మంచి స్పెషలిస్ట్‌ని కలిసిన తరువాత అన్ని విషయాలు అసెస్ చేసుకుని అప్పుడు బేరియాట్రిక్ సర్జన్‌ని కలిస్తే మంచిది.
-డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment