నాకు మా బావ అంటే చాలా ఇష్టం. మేనరికం పెళ్లి మంచిదికాదని తెలిసినా ఈ పెళ్లిని అవాయిడ్ చేయలేను. పెళ్లికి ముందే జెనెటికల్ కౌన్సెలింగ్ తీసుకుంటే నాకేమైనా హెల్ప్ అవుతుందా?
– ఎన్‌కేఎస్, గుంటూరు
మేనరికం పెళ్లి అనుకుంటే.. పెళ్లికి ముందే ఫ్యామిలీ అండ్ కపుల్ జెనిటిక్ కౌన్సెలింగ్ తీసుకోవడం చాలా అవసరం. దీనిని ప్రీకన్‌సెప్షనల్ జెనెటిక్ కౌన్సెలింగ్ అంటారు. మేనరికం పెళ్లిళ్లలో తరతరాలుగా అంటే తాతముత్తాతల నుంచి వస్తున్న సేమ్ జీన్స్‌తో కొన్ని జన్యుపరమైన లోపాలతో పిల్లలు పుట్టే రిస్క్ లేకపోలేదు. రక్తసంబంధీకుల మధ్య పెళ్లిళ్లు జరిగినప్పుడు కొన్ని రెసెసివ్ జెనెటిక్ వ్యాధులను చూస్తాం. మేనరికం పెళ్లిళ్లలో కాగ్నీషియల్ డిసీజెస్ అంటే పుట్టుకతో వచ్చే లోపాలు రెండు.. మూడు రెట్లు ఎక్కువ.
మీరు కౌన్సెలింగ్ వెళ్లినప్పుడు మీ ఇద్దరి ఫ్యామిలీ ట్రీలో వంశపారంపర్యమైన జబ్బులు, డిజార్డర్స్ ఏవైనా ఉన్నాయా అని మీ మీ కుటుంబాల ఆరోగ్య చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. జన్యుపరమైన వ్యాధి ఉన్న కుటుంబసభ్యుల వ్యాధి నిర్ధారణ, ఆ జన్యువుకి సంబంధించి ఎలాంటి మ్యుటేషన్ ఉంది వగైరా వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అది క్యారియర్‌గా కపుల్‌కీ ఉన్నట్టయితే అది పిల్లలకు వచ్చే రిస్క్ ఎంత ఉందో చెప్తారు క్యారియర్ టెస్టింగ్‌లో.. భవిష్యత్‌లో గర్భస్థ శిశువుకి చేసే శాంప్లింగ్ ద్వారా ఆ వ్యాధి బిడ్డకు వస్తుందా లేదా అని కూడా తెలిపే డిటెక్షన్ టెస్ట్స్ ఉంటాయి.
పుట్టే పిల్లలకు అవకరాలు ఉండే రిస్క్ ఎక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ మూడవ నెల, అయిదవ నెలలో వైద్యపరీక్షలతో కనిపెట్టి గర్భస్రావం చేయించుకోమని సూచిస్తాం. అందుకే బేసిక్ టెస్ట్స్‌కి హాజరవడం చాలా అవసరం. సాధారణంగా మేనరికం పెళ్లిళ్లలో బెటా తలసీమియా, సిస్టిక్ ఫైబ్రోసిస్, సికిల్ సెల్ అనీమియా వంటివి ఎక్కువ. వీటిని పెళ్లిచేసుకునే జంటకు చేసే మామూలు రక్తపరీక్షతో కూడా కనిపెట్టి రిస్క్‌ను అంచనావేయొచ్చు. జన్యుపరమైన వ్యాధులకు చికిత్స లేదు.. నివారణ మాత్రమే చేయగలం.
డా. భావన కాసు
గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment