నెలసరి ముందు బాగా తలనొప్పా! పీఎంఎస్‌ అంటే ఏంటో తెలుసా? | Take Precautions If Premenstrual Syndrome Is A Problem Gynaecologist Suggestions | Sakshi
Sakshi News home page

నెలసరి ముందు బాగా తలనొప్పా? కారణం ఇదేనేమో జాగ్రత్త!

Published Mon, May 20 2024 2:20 PM | Last Updated on Mon, May 20 2024 2:23 PM

Take Precautions If Premenstrual Syndrome Is A Problem Gynaecologist Suggestions

నా వయసు 25 ఏళ్లు. ఇటీవల నాకు నెలసరి ముందు బాగా కడుపునొప్పి, తలనొప్పి వస్తున్నాయి. భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోతున్నాను. జాబ్‌లో కూడా ఏ పనిమీదా కాన్సన్‌ట్రేట్‌ చేయలేకపోతున్నాను. నాకేమైనా సమస్య ఉందంటారా? – రాజీవ, బనగానపల్లి

మీరు ఎదుర్కొంటున్న సమస్యను ‘ప్రీ మెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌’ (పీఎంఎస్‌) అంటారు. ప్రతి వందమందిలో ఇద్దరికి మీలో ఉన్నంత తీవ్రంగా ఈ సమస్య ఉంటుంది. దీని లక్షణాలు దినచర్యను ప్రభావితం చేసేంతగా ఉంటాయి. చాలామందిలో నెలసరి మొదలవడానికి రెండువారాల ముందు నుంచి శారీరక, మానసిక మార్పులు కనిపిస్తాయి. బరువు పెరగడం, మానసికంగా బలహీనం కావడం, తలనొప్పి, చిరాకు, కోపం, నిద్రలేమి, నీరసం ఉంటాయి.

పీఎంఎస్‌కి సరైన కారణం తెలియదు. హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తుందనుకుంటాము. మీలో కలిగే మార్పులన్నీ కాగితంపై రాసుకోవాలి. దీనిని మెన్‌స్ట్రువల్‌ డైరీ అంటారు. ఇలా రెండు మూడు నెలలు మెన్‌స్ట్రువల్‌ డైరీ రాశాక, సమస్యకు కారణాలు కొంతవరకు తెలుస్తాయి.

ముఖ్యంగా జీవనశైలిలో మార్పులు– అంటే, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, నెలసరికి రెండు మూడు వారాల ముందు నుంచి టీ, కాఫీలు తగ్గించడం, జంక్‌ఫుడ్‌ మానేయడం వంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, కొంతవరకు ఫలితం ఉంటుంది. యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా మానసిక స్థైర్యం పెరగడమే కాకుండా, పీఎంఎస్‌ లక్షణాల తీవ్రత తగ్గుతుంది.

అలాగే, డాక్టర్‌ పర్యవేక్షణలో కొన్ని మందులు కూడా వాడాల్సి ఉంటుంది. విటమిన్‌–డి, విటమిన్‌–ఇ లాంటి సప్లిమెంట్లు ఉపయోగపడతాయి. పైమార్పులు, సప్లిమెంట్లతో ఫలితం కనిపించకపోతే, డాక్టర్ల పర్యవేక్షణలో అవసరమైన మందులు తీసుకోవలసి ఉంటుంది. అత్యంత అరుదుగా శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది.

డా. భావన కాసు, గైనకాలజిస్ట్‌ అండ్‌ అబ్‌స్టెట్రీషియన్‌, హైదారాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement