Headache
-
భరించలేని తలనొప్పా..నివారించండి ఇలా..!
కొంతమందికి తలనొప్పి తరచు వేధిస్తు ఉంటుంది. ఓ పట్టాన తగ్గదు. ఎందుకు వస్తుందో తెలియదు సడెన్‌గా వచ్చి ఏ పని చెయ్యనివ్వకుండా ఇబ్బంది పెడుతుంటుంది. దీన్ని నివారించాలంటే కొద్దిపాటి చిట్కాలు ఫాలో అయితే చాలని చెబుతున్నారు నిపుణులు. అందుకోసం ఏం చేయాలో వారి మాటల్లోనే సవివరంగా చూద్దాం..!.కంప్యూటర్‌పై పనిచేసేవారు కంటిపై ఒత్తిడి పడకుండా యాంటీ గ్లేర్ గ్లాసెస్ ధరించవచ్చు. అలాగే ప్రతి గంట తర్వాత కంప్యూటర్ తెరపై నుంచి చూపు తప్పించి కాసేపు రిలాక్స్ అవాలి కంప్యూటర్‌పై పని చేసేవారు అదేపనిగా కనురెప్ప కొట్టకుండా చూడటం సరికాదు ∙కుట్లు, అల్లికలు వంటివి చేసేవారు, అత్యంత సూక్ష్మమైన సంక్లిష్టమైన (ఇంట్రికేట్) డిజైన్లు అల్లే సమయంలో అదేపనిగా పనిచేయకుండా తరచూ బ్రేక్ తీసుకుంటుండటం మంచిది తమకు సరిపడని పదార్థాలు తీసుకోవడం ఆపేయాలి ∙ఘాటైన వాసనలకు దూరంగా ఉండాలి. సరిపడని పెర్ఫ్యూమ్స్ను వాడటం సరికాదు కాఫీ, చాకొలెట్స్, కెఫిన్ ఎక్కువగా పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు. కెఫిన్ మోతాదులు ఎక్కువగా ఉండే కొన్ని రకాల శీతలపానియాలకు దూరంగా ఉండాలి ఫలానా అలవాటు తలనొప్పిని దూరం చేస్తుందనే అ΄ోహతో (ఉదాహరణకు టీ, కాఫీ తాగడం వంటివి) పరిమితికి మించి తీసకోవడం సరికాదు రణగొణ శబ్దాలకు ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. పరిసరాలు ప్రశాంతంగా ఉండటం వల్ల తలనొప్పులు రాకుండా నివారించవచ్చురోజూ కనీసం ఎనిమిది గంటల పాటు కంటినిండా నిద్రపోవాలి. కొన్నిసార్లు నిద్ర మరీ ఎక్కువైనా తలనొప్పి వస్తుంది. కాబట్టి తమ సౌకర్యం మేరకు నిద్రపోవడం మంచిది. ఒకవేళ ఈ సూచనల తర్వాత కూడా తలనొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించాలి. (చదవండి: గాంధీ జయంతి 2024: భార్య నుంచి వ్యతిరేకత ఎదురైనా.. బాపూజీ తగ్గలేదు!) -
బ్రెయిన్‌కు ట్యూమర్ ముప్పు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇటీవల కాలంలో బ్రెయిన్ ట్యూమర్ బాధితులు పెరుగుతున్నారు. విజయవాడలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ప్రతి నెలా 40 మంది వరకూ బ్రెయిన్ ట్యూమర్ బాధితులు వస్తున్నారు. తీవ్రమైన తలనొప్పితో వచ్చిన బాధితులకు వైద్యులు బ్రెయిన్ స్కాన్ చేసి వ్యాధిని నిర్ధారించి, అవసరమైన చికిత్సలు, శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. ఒకప్పుడు ఎక్కువగా 50 ఏళ్లు పైబడిన వారిలో బ్రెయిన్ ట్యూమర్లు వచ్చేవని, ఇప్పుడు 15 ఏళ్ల చిన్నారులు, 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు వారిలోనూ బ్రెయిన్ ట్యూమర్స్ చూస్తున్నామని వైద్యులు పేర్కొంటున్నారు. బ్రెయిన్ ట్యూమర్స్ రావడానికి అనేక కారణాలు ఉంటాయని, చిన్న పిల్లల్లో జన్యుపరమైన లోపాలే కారణంగా వివరిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాధికి అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొంటున్నారు. నాలుగు దశల్లో వ్యాధి బ్రెయిన్ ట్యూమర్‌కు నాలుగు దశలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. మొదటి దశలో తలనొప్పి, వాంతులు, తలతిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండోదశలో తీవ్రమైన తలనొప్పి, అకారణంగా వాంతులు, తలతిరగడం ఎక్కువగా ఉంటాయి. మూడో దశలో బ్రెయిన్లోని ట్యూమర్ ఇతర అవయవాలకు వ్యాప్తి చెందుతుంది. ఊపిరితిత్తులు, వెన్నుపూసలకు విస్తరిస్తుంది. లక్షణాలు కూడా తీవ్రంగా ఉంటాయి. నాలుగోదశలో ట్యూమర్ కణాలు శరీరంలోని రక్తంలో కలిసి అంతా వ్యాప్తి చెందుతుంది. ఈ దశలో రోగి మరింత క్షీణిస్తాడు.నిర్ధారణ ఇలా.. తలనొప్పితో వచ్చిన రోగికి సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్లు చేయడం ద్వారా బ్రెయిన్ ట్యూమర్‌ను నిర్ధారిస్తారు. ఒకప్పుడు బ్రెయిన్ ట్యూమర్‌ను నాలుగో దశ వచ్చే వరకూ గుర్తించే వారు కాదు. వ్యాధి నిర్ధారణ కాకముందే మరణించినవారు కూడా ఉన్నారు. ఇప్పుడు అత్యాధునిక డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులోకి రావడంతో తొలిదశలోనే గుర్తించగలుగుతున్నారు. ప్రస్తుతం ఎంఆర్ఐ, సీటీ స్కాన్ సౌకర్యాలు, విస్తృతంగా స్కానింగ్ పరికరాలు అందుబాటులోకి రావ డంతో తొలిదశలో గుర్తించగలుగుతున్నారు. చికిత్సలు ఇలా.. బ్రెయిన్ ట్యూమర్ దశ బట్టి చికిత్సలు అందిస్తారు. కొందరికి మందులు ఇస్తూ ట్యూమర్‌ను తగ్గిస్తారు. మరికొందరికి శస్త్ర చికిత్స ద్వారా ట్యూమర్‌ను తొలగిస్తారు. రేడియేషన్ థెరపీ, శస్త్ర చికిత్స తర్వాత కీమోథెరపీ వంటి చికిత్సలు అందిస్తారు. ప్రస్తుతం ఆధునిక చికిత్సలు, అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో బ్రెయిన్ ట్యూమర్ రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయి. కారణాలు ఇవీ.. జన్యుపరమైన లోపాలు. తీసుకునే ఆహారం. రేడియేషన్ ప్రభావం. పొగ, మద్యం తాగడం. తీవ్రతను బట్టి వైద్యం నెలలో 20 నుంచి 30 మంది వరకూ బ్రెయిన్ ట్యూమర్ రోగులు వస్తున్నారు. ఎక్కువగా రెండో దశలోనే వస్తున్నారు. వారి పరిస్థితిని అంచనా వేసి మందులు ఇవ్వడమా, శస్త్ర చికిత్స చేయడమా అన్నది నిర్ధారిస్తాం. తీవ్రమైన తలనొప్పితో వచ్చిన వారికి సీటీ, ఎంఆర్ఐ స్కాన్ చేయడంతో ట్యూమర్‌ను నిర్ధారిస్తున్నాం. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో స్కానింగ్‌లు అందుబాటులోకి రావడంతో వ్యాధిని త్వరగా గుర్తించగలుగుతున్నాం. – డాక్టర్ గొల్ల రామకృష్ణ, న్యూరోసర్జన్, విజయవాడకచ్చితమైన నిర్ధారణ బ్రెయిన్ ట్యూమర్లను కాంట్రాస్ట్ సీటీతో కచ్చితమైన నిర్ధారణ చేస్తాం. బ్రెయిన్లో ఏదైనా గడ్డ ఉంటే అది ట్యూమరా, ఇంకేమైనానా అని తెలుసుకోవచ్చు. ఏ ప్రాంతంలో ట్యూమర్ ఉంది అనేది చెప్పవచ్చు. ఒకప్పుడు నాలుగో దశలో వ్యాధిని గుర్తించేవారు. ఇప్పుడు అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ సరీ్వసెస్ అందుబాటులోకి రావడంతో మొదటి, రెండో దశలోనే గుర్తించగలుగుతున్నాం. లక్షణాలను బట్టి స్కాన్ చేసి వ్యాధిని నిర్ధారణ చేయొచ్చు. – డాక్టర్ ఎన్.దీప్తిలత, రేడియాలజిస్ట్, విజయవాడ -
నెలసరి ముందు బాగా తలనొప్పా! పీఎంఎస్ అంటే ఏంటో తెలుసా?
నా వయసు 25 ఏళ్లు. ఇటీవల నాకు నెలసరి ముందు బాగా కడుపునొప్పి, తలనొప్పి వస్తున్నాయి. భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోతున్నాను. జాబ్‌లో కూడా ఏ పనిమీదా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. నాకేమైనా సమస్య ఉందంటారా? – రాజీవ, బనగానపల్లిమీరు ఎదుర్కొంటున్న సమస్యను ‘ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్’ (పీఎంఎస్) అంటారు. ప్రతి వందమందిలో ఇద్దరికి మీలో ఉన్నంత తీవ్రంగా ఈ సమస్య ఉంటుంది. దీని లక్షణాలు దినచర్యను ప్రభావితం చేసేంతగా ఉంటాయి. చాలామందిలో నెలసరి మొదలవడానికి రెండువారాల ముందు నుంచి శారీరక, మానసిక మార్పులు కనిపిస్తాయి. బరువు పెరగడం, మానసికంగా బలహీనం కావడం, తలనొప్పి, చిరాకు, కోపం, నిద్రలేమి, నీరసం ఉంటాయి.పీఎంఎస్‌కి సరైన కారణం తెలియదు. హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తుందనుకుంటాము. మీలో కలిగే మార్పులన్నీ కాగితంపై రాసుకోవాలి. దీనిని మెన్స్ట్రువల్ డైరీ అంటారు. ఇలా రెండు మూడు నెలలు మెన్స్ట్రువల్ డైరీ రాశాక, సమస్యకు కారణాలు కొంతవరకు తెలుస్తాయి.ముఖ్యంగా జీవనశైలిలో మార్పులు– అంటే, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, నెలసరికి రెండు మూడు వారాల ముందు నుంచి టీ, కాఫీలు తగ్గించడం, జంక్‌ఫుడ్ మానేయడం వంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, కొంతవరకు ఫలితం ఉంటుంది. యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా మానసిక స్థైర్యం పెరగడమే కాకుండా, పీఎంఎస్ లక్షణాల తీవ్రత తగ్గుతుంది.అలాగే, డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని మందులు కూడా వాడాల్సి ఉంటుంది. విటమిన్–డి, విటమిన్–ఇ లాంటి సప్లిమెంట్లు ఉపయోగపడతాయి. పైమార్పులు, సప్లిమెంట్లతో ఫలితం కనిపించకపోతే, డాక్టర్ల పర్యవేక్షణలో అవసరమైన మందులు తీసుకోవలసి ఉంటుంది. అత్యంత అరుదుగా శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది.డా. భావన కాసు, గైనకాలజిస్ట్ అండ్ అబ్‌స్టెట్రీషియన్, హైదారాబాద్ -
సూసైడ్ హెడేక్: ఈ 'తలనొప్పి'తో అంత ఈజీ కాదు!
బీపీ వల్లనో లేదా నిద్ర సరిగా పట్టకపోవడం వల్లో కాస్త తల నొప్పిగా ఉంటుంది. కొంతమందకి బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి ఉన్న ఈ భయానక తలనొప్పిని అనుభవిస్తారు. తలలో కంతుల వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. కానీ అలాంటివి ఏమీ లేకుండా ఉత్తిపుణ్యానికి వచ్చే తలనొప్పి ఒకటి ఉంది. ఎంత భయంకరంగా ఉంటుందంటే..భరించలేక ప్రజలు కెవ్వుకెవ్వుమని అరుస్తూనే ఉంటారట. కొందరైతే ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటారని వైద్యుల చెబుతున్నారు. ఇలాంటి తలనొప్పి బారినే డారెన్ ఫ్రాంకిష్ అనే వ్యక్తి పడ్డాడు. దీంతో అతని జీవితం గందరగోళంగా మారిపోయింది. ఆఖరికి వైద్యులు సైతం దీనికి మందు లేదని జీవితాంత ఆ వ్యాధిని భరించాల్సిందేనని షాకింగ్ విషయాలు వెల్లడిస్తున్నారు. యూకేకి చెందిన డారెన్ ఫ్రాంకిష్ అనే వ్యక్తి 17 ఏళ్లుగా విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నాడు. ఈనొప్పిని తట్టుకోలేక ఆయన గట్టిగా అరవడం, తలను గోడకేసి బాదుకోవడం వంటివి చేసేవాడని తెలిపాడు. తలపై బేస్‌బాల్ బ్యాట్‌తో గట్టిగా కొడుతున్నట్లు, కత్తితో కంట్లో పొడుస్తున్నట్లు ఆ నొప్పి ఉంటుందని ఈ 53 ఏళ్ల డారెన్ చెబుతున్నారు. ఆయన ఒక హార్టికల్చర్ఇంజనీర్. ఆయన ప్రతీక్షణం ఈ తలనొప్పి మళ్లీ ఎప్పుడూ వస్తుందో అన్న భయంతో బతుకుతున్నాడు. ఈ తలనొప్పి ఎప్పుడైన రావచ్చొనే సంగతి నాకు తెలుసు గానీ, ఇలా భయంతో బతకడం మాత్రం నరకంగా ఉందని ఆవేదనగా చెప్పారు డారెన్. ఆ నొప్పి 15 నిమిషాల నుంచి మూడు గంటల పాటు ఉంటుందని చెప్పారు. ఇది మొదటగా తన తలకు ఎడమ కన్నుపై నుంచి ప్రారంభమై తర్వాత కన్ను నీరు కారడం మొదలవ్వుతుందని తెలిపారు. ఎవరో కంటిలోపల కత్తితో గుచ్చుతున్న భావన కలిగి, దిండుని పట్టుకుని తట్టుకోలేక అరుస్తుంటానని చెప్పుకొచ్చారు. ఈనొప్పి వచ్చినప్పుడూ తాను ఎవ్వరితోనూ మాట్లాడనని చెప్పుకొచ్చారు. ఇటీవల కాలంలో ఈ బాధ మరింత ఎక్కువయ్యిందని అన్నారు. ఈ తలనొప్పిని వైద్య పరిభాషలో 'క్లస్టర్ తలనొప్పి లేదా సూసైడ్ తలనొప్పి' అంటారు. దీని కారణంగా అనుభవించే మానసిక వేదన చనిపోవాలనిపిస్తుంది కాబట్టి ఆ వ్యాధికి ఆ పేరు వచ్చింది. క్లస్టర్ హెడేక్స్ అంటే.. క్లస్టర్ తలనొప్పులు అరుదైనవి. వెయ్యి మందిలో ఒకరిని ఈ నొప్పి వేధిస్తుంటుంది. యూకేలో 65 వేల మంది దీని బాధితులున్నట్లు అంచనా. తలనొప్పి కంటే ఇది చాలా తీవ్రమైనదని బ్రెయిన్ రీసెర్చ్ యూకే రీసెర్చి మేనేజర్ కేటీ మార్టిన్ అన్నారు. బాధితుడు డారెన్ వివరించినట్లుగా క్లస్టర్ అటాక్ వల్ల కలిగే నొప్పి భరించలేనిది. ఆ నొప్పిని తట్టుకోలేక ప్రజలు అరుస్తారు, గోడలకు తలను బాదుకుంటారు. బాధితులకు సమర్థవంతమైన ఉపశమనాన్ని అందించేందుకు కొత్త చికిత్సల కోసం అవసరమైన పరిశోధనల కోసం తాము నిధులు సమకూర్చుతున్నాం అని పరిశోధకుడు కేటీ మార్టిన్ చెబుతున్నారు. ఈ తలనొప్పి మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువగా కనిసిస్తుంది. బాధితులు 30 ఏళ్లు పైబడినవారై ఉంటారు. నొప్పి వచ్చే తీరు మాత్రం మారుతుంటుంది. ఒక్కోసారి కొన్ని రోజుల వ్యవధిలో ఒకసారి నొప్పి వస్తే, కొన్నిసార్లు ఒకే రోజులో పలుమార్లు ఈ నొప్పి వస్తుంది. అయితే నొప్పి వచ్చిన ప్రతీసారి 15 నిమిషాల నుంచి కొన్ని గంటల పాటు అది కొనసాగవచ్చు. నొప్పితో పలుమార్లు ఆసుపత్రికి వెళ్లాల్సి రావొచ్చు. ఇది ప్రజల జీవన శైలిని ప్రభావితం చేస్తుంది. నిరుద్యోగానికి దారి తీస్తుంది. దీనివల్ల డిప్రెషన్ వచ్చే ముప్పు మూడు రెట్లు పెరుగుతుంది. పైగా ఆత్మహత్య ఆలోచనలకు పురికొల్పుతున్నట్లు కూడా నివేదికలు వచ్చాయి. అయితే దీనికి చికిత్స లేదని చెబుతున్నారు. ఇక్కడ డారెన్ కూడా జీవితాంతం ఆ తలనొప్పిని భరించాల్సిందే అని తెలిపారు. వైద్యుల దీనికి మంచి చికిత్స కనిపెట్టే క్రమంలో ఆయనపై ఎన్నో రకాల ప్రయోగాలు చేశారు. ఆ నొప్పి ఉశమించేలా స్టెరాయిడ్స్, లిథియం సహా గుండె సంబంధిత మందులు, మూర్చకు ఇచ్చే మందులను సైతం వైద్యులు సూచించినట్లు డారెన్ చెబుతున్నాడు. అయితే అవేమి పనిచేయ లేదని అన్నాడు. చివరికి వైద్యులు తనకు ఇంజెక్షన్‌ని సిఫార్సు చేశారు. ఒక్కోసారి అది పనిచేస్తుంది. ఒక్కోక్కసారి అది కూడా పని చేయదని బాధగా చెబుతున్నాడు. అలాగే మత్తుమందులు నరాలను మొద్దుబారేలా చేయగా, స్టెరాయిడ్స్ ఒక ఏడాది వరకు తలనొప్పి రాకుండా ఆపగలదని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి కారణంగా డారెన్ వైవాహిక జీవితం కూడా దెబ్బతింది. ప్రస్తుతానికి వైద్యులు చికిత్సలో భాగంగా ఆయనకు తలలో ఒక నర్వ్ బ్లాక్‌ను ఇంజెక్ట్ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ వ్యాధి ఎందువల్ల వస్తుందనేందుకు కచ్చితమైన కారణాలు కూడా లేవు. ఇక్కడ డారెన్ వైద్యలు సరైన చికిత్సా విధానం కనుగొనేంత వరకు ఆయన ఈ తలనొప్పితో జీవించాల్సిందే. అయితే యూకేలో 65 వేల మంది దీని బాధితులున్నట్లు నివేదికలు చెబుతుండటం గమనార్హం. (చదవండి: కుకీస్ తింటున్నారా? ఐతే ఓ డ్యాన్సర్ ఇలానే తిని..) -
చూడటానికి స్టయిలిష్ తలపాగ..పెట్టుకుంటే క్షణాల్లో తలనొప్పి మాయం!
శారీరక, మానసిక శ్రమల్లో ఏది ఎక్కువైనా అలసటతో ముందు తలనొప్పి వస్తుంది చాలామందికి. దాంతో ముఖం వాడిపోతుంది. అలాంటి సమస్యలను దూరం చేస్తుంది చిత్రంలోని ఈ వార్మింగ్ ఎయిర్ మసాజర్. ఇది తలనొప్పిని దూరం చేసి.. మానసిక ప్రశాంతతను అందిస్తుంది. దాంతో ముఖంలో సరికొత్త గ్లో వస్తుంది. చూడటానికి ఈ డివైస్ ఓ ఫ్యాషన్ హెయిర్ క్యాప్‌లా స్టయిలిష్‌గా కనిపిస్తుంది. మెషిన్ మీద అందంగా పింక్ కలర్ క్లాత్‌తో ఉన్న ఎయిర్‌బ్యాగ్ అధునాతన తలపాగా మాదిరి ఆకట్టుకుంటుంది. దీన్ని తలకు బ్యాండ్ మాదిరి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది క్షణాల్లో రిలాక్స్ చేస్తుంది. ఈ డివైస్ రిమోట్పైన డ్యూయల్ హీటింగ్, మసాజింగ్ యాక్షన్ వంటి ఆప్షన్స్ ఉంటాయి. ఇందులోని పింక్ కలర్ ఎయిర్‌బ్యాగ్ థర్మోప్లాస్టిక్ పాలీయూరితేన్ మెటీరియల్‌తో రూపొందగా.. ఎయిర్ ట్యూబ్ సిలికాన్‌తో రూపొందింది. 10 నిమిషాల తర్వాత ఆటోమేటిక్‌గా ఇది ఆఫ్ అవుతుంది. 50 డిగ్రీల సెల్సియస్ (122 డిగ్రీల ఫారెన్ హీట్)తో ఇది మసాజ్‌ని అందిస్తుంది. దీన్ని వినియోగించడం చాలా సులభం. ఏ పని చేసుకుంటున్నా దీని రిమోట్‌ని ఏ జేబులోనో వేసుకుని.. లేదా ఎదురుగా ఉండే బల్ల మీద పెట్టుకుని.. సులభంగా తలకు ఈ డివైస్‌ని తగిలించుకుని రిలాక్స్ కావచ్చు. భలే ఉంది కదూ! ఇలాంటి మోడల్స్‌లో మరిన్ని ఆప్షన్స్‌తో మసాజర్స్ మార్కెట్లో అమ్ముడుపోతున్నాయి. అయితే ధరల విషయంలో వ్యత్యాసం ఉంటుంది. (చదవండి: ఈ డివైజైలో తక్కువ ఆయిల్తోనే బూరెలు, గారెలు వండేయొచ్చు!) -
బాధను భరించలేక.. యువతి విషాద నిర్ణయం!
సాక్షి, ఆదిలాబాద్: సారంగపూర్ మండలంలోని పొట్య గ్రామానికి చెందిన అలుగొండ వైష్ణవి(17) తలనొప్పి బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుందని సారంగాపూర్ ఎస్సై కృష్ణసాగర్రెడ్డి తెలిపారు. కొన్నేళ్లుగా సమస్యతో బాధపడుతోంది. చికిత్స చేయించుకున్నా నయం కాకపోవడం, ఖరీదైన చికిత్స చేయించుకునే స్థోమత లేకపోవడంతో శనివారం ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వైష్ణవి తండ్రి దత్తన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మెర్సీ ప్లీజ్!
‘‘విధి కన్నెర్ర చేసి కోలుకోని దెబ్బకొట్టినా.. మనిషి తట్టుకుని నిలబడ గలుగుతాడు. కానీ అక్కున చేర్చుకుని ఓదార్చాల్సిన సమాజం ఈసడింపులు, చీదరింపులతో అసహ్యంగా చూస్తే బతకాలన్న కోరిక చచ్చిపోతుంది. కోరిక లేని మనిషికి చావు తప్ప మరోమార్గం కనిపించదు, ఇదే నా జీవితంలో ప్రస్తుతం జరుగుతోంది. కనీసం నన్ను ప్రశాంతంగానైనా చావనివ్వండి ప్లీజ్’’ అని అడుగుతోంది డాక్టర్ పార్వతీ కుమారి. జార్ఖండ్‌లోని చిన్న నగరం ధన్‌బాద్. ఇక్కడే పుట్టింది పార్వతీ కుమారి. తాతయ్య, నాయనమ్మలు, ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్ల మధ్య ఆడుతూ పాడుతూ పెరిగింది. పదోతరగతి పాసై∙ఎంచక్కా కాలేజీకి వెళ్దామని అడ్మిషన్ తీసుకుంది. సరిగా అప్పుడే పార్వతికి విపరీతమైన తలనొప్పి వచ్చింది. ఇంటిచిట్కాలు పాటిస్తూ నొప్పిని తగ్గించుకోవడానికి ప్రయత్నించింది. కానీ తగ్గకపోగా రోజురోజుకి ఎక్కువవుతూ పోయింది. ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా ఫలితం కనిపించలేదు.. ఓరోజున ఉన్నట్టుండి కోమాలోకి వెళ్లిపోయింది పార్వతి. కళ్లు తెరిచింది కానీ.... స్పృహæలేకుండా జీవచ్ఛవంలా పడి ఉన్న పార్వతి... మూడు నెలల తరువాత కోమా నుంచి బయటకు వచ్చింది. కళ్లు తెరిచి చూసింది కానీ ఏమీ కనిపించడం లేదు. సీనియర్ కంటి డాక్టర్‌కు చూపించగా...‘‘వివిధ రకాల మందుల దుష్ప్రభావం వల్ల కంటిచూపు పోయింది’’ అని చెప్పారు. పార్వతికీ, ఆమె తల్లిదండ్రులకు ప్రపంచం తలకిందులైనట్లు అనిపించింది. ఇంట్లో పార్వతి తండ్రి ఒక్కడిదే సంపాదన. ఆమె చికిత్సకు చాలా ఖర్చవడంతో అప్పుల పాలయ్యారు. ‘‘కళ్లులేని అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? బతికుంటే తల్లిదండ్రులకు భారమే అని’’ ఇరుగు పొరుగు ఈసడింపుగా మాట్లాడేవారు. పీహెచ్డీ దాకా... అనేక భయాందోళనల మధ్య ఉన్న పార్వతి మూడేళ్లు గడిపేసింది. ఆ తరువాత డెహ్రాడూన్‌లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ విజువల్లీ హ్యాండీక్యాప్డ్’లో చేరింది. పదకొండో తరగతిలో అడ్మిషన్ తీసుకుని మొదటి మూడు నెలలు బ్రెయిలీ స్క్రిప్ట్‌ను నేర్చుకుంది. డెభ్బై రెండు శాతం మార్కులతో ఇంటర్మీడియట్ పాసైంది. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ కాలేజీలో బీఏ, దౌలత్‌రామ్ కాలేజీలో ఎమ్.ఏ. చేసింది. తరువాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీలో ఎమ్‌ఫిల్, పీహెచ్డీ పూర్తి చేసింది. ఇలా చకచకా చదివేసి జేఆర్‌ఎఫ్‌గా సెలక్ట్ అయ్యింది. ఒక పక్క చదువుతూనే మరోపక్క సాహిత్య సేవ కూడా చేసింది. పుంజుకునేలోపే... కుటుంబ సభ్యులు, కాలేజీ లెక్చరర్లు, తోటి విద్యార్థులు, స్నేహితుల సాయంతో చదివిన పార్వతికి ఓ ఈవినింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చింది. హమ్మయ్య ఇంతకాలానికి ఎవరి సాయం తీసుకోకుండా నా కాళ్లమీద నేను నిలబడ్డాను, ఇప్పుడు నేను కూడా నా కుటుంబ సభ్యులకు, ఇతరులకు సాయం చేయవచ్చు అనుకుని.. సంతోషంగా తన డ్యూటీ చేసుకునేది పార్వతి. కాలేజీలో కాంట్రాక్ట్ ప్రొఫెసర్లను పర్మినెంట్ చేసే సమయం వచ్చింది. తాను కూడా పర్మినెంట్ ఉద్యోగి అయిపోతుంది అనుకుంది పార్వతి. అయితే పర్మినెంట్ చేయడం మాట అటుంచి కనీసం కారణం కూడా చెప్పకుండా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించేశారు!! దీంతో మరోసారి తన జీవితం అంధకారమైనట్లనిపించింది. ‘‘వెలుగు కోసం వేచిచూస్తూ లైన్లో ఉన్న నన్ను మళ్లీ చీకటిలోకి ఈడ్చిపడేసారు. ఇక నాకు పోరాడే ఓపికలేదు. అందుకే కనీసం ప్రశాంతంగా చనిపోనివ్వండి’ అని ఈ దేశప్రజలు, సమాజాన్ని అడుగుతున్నాను.’’ అని తీవ్రమైన నిరాశతో పార్వతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రొఫెసర్‌గా తానేమిటో ఇప్పటికే నిరూపించుకుంది. తన కాళ్లమీద తాను నిలబడేలా చేసి ఆ కళ్లకు వెలుగు చూపిస్తే పోయేదేముంది? -
టాబ్లెట్స్ వేసుకున్నా తలనొప్పి తగ్గడం లేదా? అయితే ఇలా చేయండి
తలనొప్పి..ఈరోజుల్లో ప్రతి ఒక్కరిని సాధరణంగా వేధించే సమస్య ఇది. ఒత్తిడి సహా అనేక కారణాల వల్ల తలనొప్పి రావొచ్చు. కొన్నిసార్లు గంటల సమయం నుంచి రోజుల వరకు తలనొప్పి వేధిస్తుంటుంది. తల పగిలిపోయినట్లు అనిపించే ఈ బాధ నుంచి బయటపడేందుకు చాలామంది నొప్పి నివారణ బామ్‌లు, పెయిన్ కిల్లర్ మాత్రలు వేసుకుంటుంటారు. కానీ ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. సులభంగా, ఇంటి చిట్కాలతోనే తలనొప్పి నుంచి సత్వర ఉపశమనం పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం. నీటిని తగినంత తీసుకోకపోయినా తలనొప్పి వస్తుంటుంది. కాబట్టి రోజుకు 8-10 గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి పానీయాలను ఎక్కువగా తీసుకోవాలి. ఒక గ్లాసు వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే తలనొప్పి నుంచి రిలీఫ్ లభిస్తుంది. గోరు వెచ్చని ఆవుపాలు సైతం తలనొప్పి నివారణిగా పనిచేస్తుందట. బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు జీడిపప్పు, బాదం వంటి డైఫ్రూట్స్‌ను గుప్పెడు తింటే తలనొప్పి తగ్గుతుందట. మెగ్నీషియం లోపంతో కూడా తలనొప్పి వేధిస్తుంది. అందుకని మెగ్నీషియం సప్లిమెంట్స్ తీసుకోవాలి. మంచినీటిలో ధనియాలు, చక్కెర కలిపి తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. గంధం చెక్కను అరగదీసి నుదిటిపై రాయడం ద్వారా కూడా తలనొప్పిని తగ్గించుకోవచ్చు. నిత్యం క్రమం తప్పకుండా 8 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. దీంతో పాటు వేళకు భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అల్లం ఎన్నో రకాల ఆయుర్వేద గుణాలని కలిగి ఉంటుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు అల్లం టీని తాగడం వల్ల ఇన్స్టెంట్ రిలీఫ్ లభిస్తుంది. -
‘అమ్మా.. తలనొప్పి’ అంటూ కుప్పకూలింది
ఈరోజుల్లో చావు అనేది.. హఠాత్తుగా వచ్చి మనిషి ప్రాణాన్ని చుట్టేసుకుని వెళ్లిపోతోంది. కరోనా తర్వాత ఇలాంటి మరణాలు.. వయసుతో సంబంధం లేకుండా సంభవిస్తుండడంతో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. మరోవైపు ఈ మరణాల వెనుక కారణాల కోసమూ పరిశోధకుల అన్వేషణ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. యూఎస్ స్టేట్ జార్జియాలో ఓ టీనేజర్ మరణం.. సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. తలనొప్పితో బాధపడుతున్న ఆ టీనేజర్.. హఠాత్తుగా కుప్పకూలి ప్రాణం విడిచింది. ఈ మరణం వెనుక కారణాన్ని వైద్యులు తాజాగా వెల్లడించగా.. సోషల్ మీడియాలో ఆ పోస్ట్ వైరల్ అవుతోంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదనే కామెంట్లు చేస్తున్నారు చాలామంది. 13 ఏళ్ల ఆ చిన్నారి పేరు జూలియా చావెజ్. కొలంబియా కౌంటీలోని హర్లీం మిడిల్ స్కూల్లో చదువుతోంది. అయితే వారం రోజులుగా విపరీతమైన తలనొప్పి.. చెవినొప్పితో బాధపడింది. తల్లికి ఈ విషయం చెప్తే స్థానికంగా ఓ ఆస్పత్రికి తీసుకెళ్లిందామె. ఆ డాక్టర్ ఇన్ఫెక్షన్ సోకిందని చెప్పి యాంటీబయోటిక్స్ రాశాడు. అయితే గత ఆదివారం ఉదయం ఉన్నట్లుండి కుప్పకూలిందా అమ్మాయి. తల్లిదండ్రులు హుటాహుటిన ఓ పెద్దాసుపత్రికి తరలించగా.. లుకేమియా(రక్త క్యాన్సర్) కారణంగా మెదడు, ఊపిరితిత్తులు, కడుపు.. ఇలా ప్రతీ చోట రక్తస్రావం జరిగిందని షాక్ ఇచ్చారు. అప్పటికే పరిస్థితి చేజారిపోయిందని చెప్పారు. తల్లిదండ్రుల ఎదుటే నొప్పితో విలవిలలాడిన ఆమె.. మృత్యువు చేతిలో ఓడింది. ఆ చిన్నారికి అలాంటి స్థితి ఉందని ఆమె తల్లిదండ్రులకు తెలిసే మార్గం లేదని వైద్యులు చెప్పడం ఇక్కడ కొసమెరుపు. నిత్యం ఆడిపాడుతూ.. చదువుల్లో రాణిస్తూ.. మంచి మనసుతో అందరితో కలివిడిగా ఉండే ఆ చిన్నారి లేదన్న విషయాన్ని ఇంట్లోవాళ్లు, స్నేహితులు, టీచర్లు తట్టులేకపోతున్నారు. పుట్టినప్పటి నుంచి ఏనాడూ ఆస్పత్రి గడప తొక్కని ఆ చిన్నారి.. అర్ధాంతరంగా చిన్నవయసులోనే తనకు ఏం జబ్బు ఉందో కూడా తెలియకుండానే ప్రాణం విడిచింది. చావు చెప్పి రాదు. ఎప్పుడు ఎవరికి ఎలాంటి మరణం సంభవిస్తుందో తెలియడం లేదు. మన చేతుల్లో ఉండేది.. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడం మాత్రమే!. అందుకే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలంటున్నారు నిపుణులు. చిన్నచిన్న అనారోగ్యాలను పట్టించుకోకుండా ముందుకు పోతుంటారు చాలామంది. కానీ, ఒక్కోసారి దాని వెనుక విపరీతాలు ఉండొచ్చు. అందుకే ఎలాంటి సమస్య తలెత్తినా అప్రమత్తత అవసరం ఈరోజుల్లో. ఆరోగ్యంగా ఉండండి.. అయినవాళ్లతో సంతోషంగా గడపండి. -
Health Tips: తలనొప్పి.. ప్రధాన కారణాలు! ఇలా చేశారంటే..
తలనొప్పి, జ్వరం, జలుబు వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు / అతి సాధారణమైన శారీరక బాధలకు ఇంట్లోనే కొన్నిచిట్కాలున్నాయి. తలనొప్పి 1. తలనొప్పికి చాలా సర్వసాధారణమైన కారణం ఆకలి. మనకి ఆకలి వేసినప్పుడు మన శరీరంలోని రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. షుగర్ లెవల్స్ పెరిగినపుడు శరీరంలో నరాలు సంకోచించి మెదడుకు సిగ్నల్‌ను పంపడం వలన తలనొప్పి వస్తుంది. మెదడుకి కావాల్సిన ఆక్సిజన్ సరిగా అందకపోవచ్చు కూడా. అందుకే ఉదయం కాలి కడుపుతో ఉండరాదు. ఏదో ఒక్కటి తీసుకోవాలి. 2. సాధారణమైన తలనొప్పి చాలా రకాలుగా రావచ్చు. ఎక్కువ అలసిపోయినా, డీ హైడ్రేషన్‌కి గురైనా, జలుబు, జ్వరం సమయాల్లో, ఏదైనా అనవసర విషయాలు ఎక్కువగా ఆలోచిస్తున్నా, నిద్ర చాలకున్నా కూడా తలనొప్పి వస్తుంది. రోజువారీ జీవితంలో ఎక్కడ తేడా వచ్చిందో పసిగడితే సగం పరిష్కారం ఉంటుంది. ఆ కారణం తెలిస్తే లేదా ఊహించగలిగితే తలనొప్పి నుంచి బయటపడవచ్చు. డీ హైడ్రేషన్ అయితే ఎక్కువ నీళ్లు తాగడం, నిద్ర చాలకుంటే కాసేపు పడుకోవడం ఇలా. ఆ చిన్న చిన్న పనులతో మీ తలనొప్పి తగ్గించుకోవచ్చు. 3. మామూలుగా ఒక మనిషి సగటున రోజూ మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు కచ్చితంగా తీసుకోవాలి. అలా తీసుకోకపోవడం వల్ల జరిగే నష్టాలు గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటగా శరీరంలో నీటి శాతం తక్కువగా ఉన్నప్పుడు బాడీ డీహైడ్రేషన్ కు గురిఅవుతుంది. దాని వల్ల శరీరంలో వేడి శాతం పెరగడం, దాని వల్ల తలనొప్పి రావడం, నీరసంగా ఉండటం, తల తిరగడం, కిడ్నీలో రాళ్లు చేరడం జరుగుతుంది. కిడ్నీలో రాళ్లు వస్తే విపరీతమైన నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు తద్వారా నీరసం, అలాగే గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం, మలబద్ధకం వల్ల ఫైల్స్ ఇలా ఒకదానికొకటి తోడవుతాయి. ఇప్పుడు నీటిని ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. 1. ముందుగా జలుబు గురించి చూసుకుంటే మీరు కచ్చితంగా నెల రోజుల పాటు మరగబెట్టి చల్లార్చిన గోరువెచ్చని నీటిని తీసుకోండి. 2. ఉదయం లేవగానే రెండు గ్లాసులు నీటిని గోరువెచ్చగా వేడి చేసి బ్రష్ చేయక ముందే తాగాలి (2X200=400 ఎంఎల్ ) 3. ఏదైనా ఆహారం తీసుకునే ఒక అరగంట ముందు ఒక గ్లాసు వాటర్ తాగండి, అలాగే భోజనం సమయంలో మంచి నీళ్లను కేవలం గొంతు దిగడం కోసం మాత్రమే తాగండి, ఎక్కువగా తాగవద్దు. భోజనం సమయంలో వాటర్ ఎక్కువగా తాగడం వల్ల మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి విడుదలయ్యే యాసిడ్‌ను పలుచన చేస్తుంది. దానివల్ల ఆహారం జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. దానివల్ల గ్యాస్ ట్రబుల్ అల్సర్ వస్తూ ఉంటాయి. 4. మిగతా సమయంలో కచ్చితంగా 3, 4 లీటర్ల నీళ్లను తాగండి. గోరు వెచ్చని నీటిని తీసుకోవడం ఇంకా మంచిది, అలాగే మీరు చల్లటి నీళ్లను (ఫ్రిజ్ వాటర్‌ను) తీసుకోవడం వంద శాతం తగ్గించండి. వీటితో పాటు రోజుకి అరగంట ఏదైనా తేలికపాటి వ్యాయామాలు చేస్తూ ఉండాలి. అత్యవసరం అయితే మాత్రం మందులు వాడాలి. వైద్యుడి సలహా ఉత్తమం. సాధ్యమైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించడం మంచిది. తీవ్ర మైన ఇబ్బంది సమయంలో సొంత వైద్యం చేసుకోవద్దు. ఏదో ఒక మందు వేసుకొని ప్రాణం మీదకు తెచ్చుకోవద్దు. -డా. నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు చదవండి: Health Tips: పిల్లలు, వృద్ధులు ఖర్జూరాలు తరచుగా తింటే! Health Tips: బోడ కాకర తరచుగా తింటున్నారా? దీనిలోని లుటీన్ వల్ల.. -
Health Tips: సబ్జా గింజలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?
సబ్జా గింజల గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వేసవి రాగానే పొద్దున్నే కాసిని సబ్జా గింజలను చెంబెడు నీళ్లులో నానబెట్టుకుని, మధ్యాన్నం కాగానే, ఆ నీటిలో కాస్త పంచదార కలుపుకుని తాగడం ఇంచుమించు అందరికీ అనుభవమే. వేసవి ఎండలు ముదురుతున్నాయి కాబట్టి సబ్జాగింజలను, వాటి ఉపయోగాలనూ మరోసారి గుర్తు చేసుకుందాం. ►సబ్జాగింజలకు కాస్త తడి తగిలితే చాలు, దానిని పీల్చుకుని అవి ఉబ్బిపోతాయి. దీంతో వాటి బరువు పదింతలు పెరిగిపోతుంది.. అందుకే వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే త్వరగా కడుపునిండిన భావన కలుగుతుంది. దాంతో అప్రయత్నంగానే తక్కువ తింటాం. ►సబ్జా గింజల్లో ఔషధగుణాలెన్నో ఉన్నాయి. వాటితోపాటు శరీర ఉష్ణోగ్రతను తగ్గించి మల, మూత్ర సమస్యల్ని నివారించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ►వంటిమీద ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ గింజల్ని నూరి కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెతో కలిపి గాయాలు, పుండ్లపై రాసుకుంటే సరి, పుళ్లు తొందరగా తగ్గుతాయి. గాయాలు తొందరగా మానుతాయి. ►తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఈ గింజల్ని నీళ్లలో కలుపుకొని అవి ఉబ్బిన తర్వాత తాగి చూడండి, సమస్య తగ్గిపోవడమే కాదు.. మానసిక ప్రశాంతత కూడా మీ సొంతమవుతుంది. ►రక్తాన్ని శుద్ధి చేయడంలో, శరీరంలోని మలినాలను తొలగించడంలోనూ దీని తరువాతే ఏదైనా..! ►శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు గ్లాసుడు గోరువెచ్చని నీటిలో అల్లం రసం, తేనె, నానబెట్టిన సబ్జా గింజలనూ కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యసమస్యలు తగ్గుముఖం పట్టడంతోపాటు శ్వాస బాగా ఆడుతుంది. ►ఆటలు ఎక్కువగా ఆడటం వల్ల క్రీడాకారులకు శరీరంలో నీటిశాతం తగ్గి బాగా నీరసించిపోతారు. అలాంటప్పుడు రోజూ సబ్జా గింజలను తీసుకుంటే శరీరంలో తేమను పోనీయకుండా నిలిపి ఉంచుతాయి. ►గొంతులో మంట, ఆస్తమా, తీవ్రమైన జ్వరం, తలనొప్పి.. లాంటి సమస్యలతో బాధపడేటప్పుడు కాసిని సబ్జా గింజల్ని నీళ్లలో నానబెట్టి నేరుగా తినేస్తే సరి.. ఎలాంటి చిరాకునైనా ఇట్టే తగ్గిస్తాయి. ►వీటిలో ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్లు సాల్మన్ చేపల్లో కంటే ఎక్కువగా ఉంటాయి. ఈ ఒమేగా–3 ఆమ్లాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్, హృదయ సంబంధిత సమస్యలు రావు. ►బ్యాక్టీరియా సంబంధిత సమస్యలని నివారించే మంచి యాంటీబయోటిక్‌లా కూడా పనిచేస్తాయి ఈ గింజలు. ►మజ్జిగ, కొబ్బరినీళ్లు, ఇతర పండ్ల రసాలతో కలిపి కూడా ఈ గింజల్ని కలిపి తీసుకోవచ్చు. ►ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఈ గింజలను ఒక గ్లాసు నీటిలో వేసుకుని తాగితే మంచి ఫలితముంటుంది. మహిళలకు తప్పకుండా కావాల్సిన ఫోలేట్‌తో పాటు అందాన్ని ఇనుమడింపచేసే విటమిన్ ‘ఇ’ కూడా ఇందులో లభిస్తుంది.. కాసిని సబ్జా గింజలు తీసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టి ఇంతవరకూ తీసుకోనివారు ఇప్పటినుంచి సబ్జాగింజలను నానబెట్టి తాగడం అలవాటు చేసుకోవడం మంచిది కదా! -
తలనొప్పి వేధిస్తోందా?..నివారించవచ్చు ఇలా..
వెర్రి వేయి విధాలు అన్నట్లు తలనొప్పుల్లో 200కి పైగా రకాలున్నాయట. వీటిలో వెంటనే తగ్గిపోయే సాధారణ తలనొప్పులతోబాటు కొన్ని ప్రాణాంతకమైన తలనొప్పులూ ఉన్నాయి. తల, మెడ భాగాల్లోని తొమ్మిది సున్నితమైన ప్రాంతాలు లేదా తలలోని రక్త నాళాలు ఒత్తిడికి లోనుకావడం లేదా వాపు వల్ల తలనొప్పి వస్తుందని వైద్యులు చెబుతారు. అయితే, తరచు తలనొప్పి వస్తున్నట్లయితే దానిని నిర్లక్ష్యం చేయకూడదు. తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే.. తలనొప్పి ఎన్నో రకాల సమస్యలతో ముడిపడి ఉంటుంది కాబట్టి. ఏ తలనొప్పో ఎలా గుర్తించాలి..? ∙తలనొప్పి ఓ వైపు మాత్రమే ఉంటే అది ‘మైగ్రేన్’. ఎక్కువ ఎండలో నిల్చున్నా లేదా పెద్ద శబ్దం విన్నా ఈ తరహా తల నొప్పి ఎక్కువ అవుతుంది. ∙తల లోపల ఎక్కువ ఒత్తిడి అనిపించినా, తల చుట్టూ ఏదో చుట్టేసినట్టుగా అనిపించినా అది మానసిక ఒత్తిడి వల్ల వచ్చినట్టే. సహజంగా ఇది ప్రమాదకరమైన తలనొప్పి కాదని భావించవచ్చు. ∙నుదుటి వెనుక, కళ్ల మధ్య, కంటి దిగువన, తల వెనుక నొప్పి వస్తే అది సైనస్ తల నొప్పి. సాధారణంగా సైనస్ తల నొప్పులు దీర్ఘకాలంగా ఉంటాయి. ∙తలనొప్పితోపాటు కళ్లు ఎర్రబడడం, వాయడం, కళ్ల నుంచి నీళ్లు రావడం వంటివి జరిగితే అది ‘క్లస్టర్ తల నొప్పి’. ∙కొన్నిరకాల ఆహార పదార్థాలు తీసుకున్నా లేదా కొన్ని రకాల వాసనలు పీల్చినా తలనొప్పి వస్తే అది ‘అలెర్జీ తల నొప్పి’. ∙జెనెటిక్ కారణాలతోపాటు, పరిసరాలూ వాతావరణ పరిస్థితులూ కూడా తలనొప్పికి కారణం కావచ్చు. వయసు, జాతి, వర్గ, వర్ణ లింగ భేదం లేకుండా అందరినీ పట్టి పీడించే అతి సాధారణ సమస్య తలనొప్పి. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో దీనిబారిన పడకుండా వుండరు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం ప్రపంచ జనాభాలో సగం మంది కనీసం సంవత్సరానికొకసారయినా తలనొప్పితో బాధపడుతూ వుంటారంటే, తలనొప్పి ఎంత సాధారణ సమస్యో అర్థం అవుతుంది. అలాగని కేవలం సాధారణ సమస్యగా కూడా దీనిని తీసిపారేయడానికి వీలు లేదు. తలనొప్పికి సాధారణమైన, ప్రమాదంలేని కారణాలతోబాటు అసాధారణమైన, ప్రమాదకరమైన జబ్బులు కూడా కారణం కావచ్చు. తలనొప్పి రకరకాల కారణాల వల్ల వస్తుంది. ముందు కారణాలు తెలుసుకోవాలి. తర్వాత అది సాధారణ సమస్యా, అసాధారణ సమస్యా అన్నది నిర్ధారించుకుంటే, దాని నివారణోపాయాలు తెలుసుకోవచ్చు. తలనొప్పి గురించి, దానికి ఉపశమన చర్యల గురించి చెప్పుకుందాం... సాధారణ తలనొప్పుల నుంచి ఉపశమనం కోసం... ∙ఒక గ్లాసు వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే తలనొప్పి తగ్గుతుంది. ∙గోరు వెచ్చని ఆవుపాలు సైతం తలనొప్పి నివారణిగా పనిచేస్తుందట. ∙తలనొప్పిని తగ్గించడంలో యూకలిప్టస్ ఆయిల్ బాగా పనిచేస్తుంది. ∙కప్పు పాలలో కొద్దిగా రాతి ఉప్పును కలిపి ఆ పాలు తాగితే తలనొప్పి తగ్గుతుంది. ∙మంచి గంధపు చెక్క ఉంటే, దానిని సాన మీద అరగతీసి నుదుటి మీద పట్టు వేసుకుంటే కొద్దిసేపటిలోనే తలనొప్పి మాయమవుతుంది. గంధపు చెక్క, సాన లేకపోతే ఇంటిలో రెడీగా ఉన్న చందనం పొడిని పేస్టులా చేసుకుని నుదుటికి, కణతల మీద పట్టు వేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. ∙చిన్న అల్లం ముక్క, యాలకులు దంచి వేసిన టీ లేదా కొద్దిగా స్ట్రాంగ్ కాఫీని తాగడం ∙చిన్న అల్లం ముక్కను పై పొట్టు తీసి దానిని మెల్లగా నమిలినా తలనొప్పి తగ్గుతుంది. ∙డార్క్ చాకొలేట్ లేదా మామూలు చాకొలేట్ చప్పరించినా తలనొప్పి ఉపశమిస్తుంది. ∙వెలుతురు తక్కువగా... ఏకాంతంగా ఉండే గదిలో కాసేపు విశ్రాంతి తీసుకోవడం కూడా సత్ఫలితాలనిస్తుంది. ∙కొద్దిగా వెల్లుల్లిని తీసుకుని నీటితో కలిపి పేస్టులా చేయండి. ఆ మిశ్రమాన్ని ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే చాలు తలనొప్పి తగ్గుతుంది. ∙తలనొప్పిని తగ్గించడంలో కొబ్బరి నూనె చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని కాస్త మాడు మీద వేసుకుని మర్దనా చేసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ∙విటమిన్–ఇ, ఈ, బి 12, కాల్షియం ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. తలనొప్పిగా ఉన్నప్పుడు మసాలా ఫుడ్‌ను అస్సలు తీసుకోవద్దు. ∙మంచి నిద్ర, వ్యాయామం తలనొప్పిని దరిచేరకుండా చూడడంలో కీలకపాత్ర వహిస్తాయి. తలనొప్పి తెప్పించే ఆహారం... ∙కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల తల నొప్పి రావడమో లేదా తల నొప్పి ఎక్కువవడమో జరగొచ్చని అంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా.. కొంతమందికి ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్, చాక్లెట్స్, కెఫిన్, ఫ్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, ఐస్ క్రీమ్స్ వంటివి కొంత మందిలో తల నొప్పికి కారణమవుతుంటాయి. తలనొప్పి తగ్గించే ఆహారం... ∙జీడిపప్పు, పిస్తా, బాదం పప్పులు వంటివి పెయిన్ కిల్లర్స్‌గా పని చేస్తాయి. తల నొప్పిని తగ్గిస్తాయి. ∙మైగ్రేన్‌తో బాధపడేవారు క్రమం తప్పకుండా పుదీనా తీసుకుంటే మంచిది. అల్లంలో కూడా మైగ్రేన్ తల నొప్పిని తగ్గించే లక్షణం ఉంది.∙చెర్రీస్ తింటే తల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇది పనిభారం ఎక్కువ కావడం వల్ల వచ్చే తలనొప్పి విషయంలో బాగా పని చేస్తుంది. ∙కొన్నిసార్లు డీహైడ్రేషన్ వల్ల కూడా తల నొప్పులు వస్తాయి. అందుకే నీటి శాతం ఎక్కువగా ఉండే కీరా దోస వంటివి ఆహారంలో చేర్చుకుంటే మంచిది. ∙అరటి పండ్లు, కొద్ది మొత్తంలో కాఫీ, బ్రకోలీ, పాలకూర వంటివి తలనొప్పిని నివారిస్తాయి. కొన్ని రకాల ఆసనాల వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా తల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ∙ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే సంరక్షణగా క్యాప్ పెట్టుకుంటే మంచిది. ∙తల స్నానం చేసిన వెంటనే పూర్తిగా ఆరబెట్టకపోతే తల నొప్పి వచ్చే అవకాశాలెక్కువ. అందుకే స్నానం చేసిన తర్వాత కచ్చితంగా హెయిర్ డ్రైర్‌తో లేదా ఫ్యాన్ కింద కూర్చుని కురులను ఆరబెట్టుకోవాలి. ∙కంప్యూటర్ను చూస్తూ వర్క్ చేసే వారికి తరచూ తల నొప్పి వస్తుంటుంది. అందుకే మధ్య మధ్యలో పనికి విరామం ఇవ్వాలి. స్క్రీన్ బ్రైట్‌నెస్‌ని తక్కువగా పెట్టుకోవాలి. ∙కంటి నిండా నిద్ర లేకపోతే తల నొప్పి ఖాయం. అందుకే.. రోజుకు కనీసం 8 గంటల నిద్ర ఉండాలి. ఇతర సమస్యల వల్ల వచ్చే తలనొప్పి ∙నేత్ర వ్యాధుల వల్ల దృష్టి దోషాలూ, ట్యూమర్లూ, అక్యూట్ కంజెస్టివ్ గ్లాకోమా ∙చెవిలో గుల్లలూ, వాపులూ, చీముగడ్డలు ∙‘సైనసైటిస్ ‘లో వచ్చే ‘సైనస్ హెడేక్’ నుదురు దగ్గర,ముక్కు మొదట, దవడ ఎముకల దగ్గర నొప్పి అనిపిస్తుంది, ముందుకు వంగినా దగ్గినా తుమ్మినా ఎక్కువ అవుతుంది. ∙జీర్ణాశయ సమస్య లు, వాంతులు, విరేచనాలు, హై బీపీ. ∙బ్రెయిన్ ట్యూమర్, ఇతర కాన్సర్లలో తలనొప్పినే ప్రధాన లక్షణంగా గుర్తిస్తారు. ∙చిన్న పిల్లలలో అంటే 10–20 మధ్య వయసు వారిలో మెదడు లో చేరిన పురుగుల గుడ్లు తలనొప్పికీ, ఫిట్స్కీ కారణం కావచ్చు. ∙మెనింజైటిస్, ఎన్ సెఫలైటిస్ వీటిలో తీవ్రమైన తలనొప్పి వుంటుంది. -
ఎంతకీ తలనొప్పి తగ్గడం లేదా?
కొందరిలో తీవ్రమైన తలనొప్పి నెలల తరబడి కనిపిస్తుంది. మందులు వాడితే తగ్గుతుంది తాత్కాలికంగా.. ఆ తర్వాత మళ్లీ వేధిస్తుంటుంది. అసలు ఆ తలనొప్పి కి కారణాలేమిటో తెలుసుకుంటే చికిత్స చేయడం సులభం అవుతుంది. కంటిచూపు సమస్యలు, చెవి, దంతాల సమస్యలు లేనప్పుడు, మెదడు లో కంతులు, ఇతర వికారాల వంటి జబ్బుల గురించి ఆయా పరీక్షల ద్వారా నిర్ధారించుకోవాలి. ఒకవేళ అలాంటివి లేకపోతే కేవలం క్రియాపరమైన మార్పులే తలనొప్పికి కార ణాలవుతాయి. ఉదాహరణకు మైగ్రేన్, మానసిక ఒత్తిడి, అధిక రక్తపోటు మొదలైనవి. నిద్రమామూలుగా పట్టి, మళ్లీ నిద్రలేవగానే వస్తుంటే అది మానసిక ఉద్వేగం, ఆందోళనలవంటి వత్తిడులుగా భావించవచ్చు. బీపీ, షుగర్ వంటి వ్యాధులుంటే ముందు వాటిని నియంత్రణలో పెట్టుకోవాలి. మానసిక ఒత్తిడిలో లక్షణంగా కూడా తలనొప్పి రావచ్చు. వత్తిడికి కారణాలు: ఆర్థిక సంబంధిత, ఉద్యోగపరమైన, కుటుంబపరమైన, సామాజికపరమైన, అత్యాశతో కూడిన వాంఛలకు సంబంధించిన అంశాలుంటాయి. అప్పుడప్పుడు కొన్ని మందుల వల్ల కూడా వత్తిడి అధికమవుతుంది. వీటిని విశ్లేషించి, సహేతుకంగా దూరం చేసుకోవాలి. రోజూ విరేచనం సాఫీగా అయ్యేట్టు చూసుకోవాలి. పులుపు, ఉప్పు, కారం తక్కువగా ఉండే, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. తాజాఫలాలు, గ్రీన్ సలాడ్స్, మొలకెత్తిన దినుసులు తీసుకోవాలి. రోజూ రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనెతో తలకు మృదువుగా మర్దనా చేయాలి. నిపుణుల పర్యవేక్షణలో శరీరానికంతటికీ మసాజ్, ధారాచికిత్స తీసుకోవడం. తేలికపాటి వ్యాయామం, ప్రాణాయామం, ధ్యానం. శ్రావ్యమైన సంగీతం, పాటలు వినడం. లేనిపోని ఆలోచనలకు దూరంగా ఉండడం... ద్వారా తలనొప్పిని దూరం చేసుకోవచ్చు. -
సాధారణ ఆరోగ్య సమస్యలుగా పొరబడే క్యాన్సర్లు
నిరక్షరాస్యత, గ్రామీణ నేపథ్యం, ఆర్థిక పరిస్థితులు, అమాయకత్వం ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేయడానికి ఒక కారణమైతే... బిజీలైఫ్, అందుబాటులో ఉండే మెడికల్ షాప్‌లు, ఫోన్లలోనే డాక్టర్ సలహాలు, ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్, యాంటీబయాటిక్స్, పెయిన్‌కిల్లర్స్, ఇంటర్నెట్ సమాచారం అనారోగ్య లక్షణాలకు తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చినా... సమస్యను తీవ్రం చేసే అంశమని చెప్పవచ్చు. వేడి చేసిందనీ, పడని ఆహారం తీసుకున్నామనీ, ప్రయాణాల వల్ల అని, అలసట అని, ఎప్పుడో తగిలిన దెబ్బల చిహ్నాలంటూ భ్రమపడటం వల్ల అనీ, వయస్సు పైబడే కొద్దీ కనిపించే లక్షణాలే అంటూ సర్దుకుపోవడం వల్ల... ఇలా కారణాలేమైనప్పటికీ అవి క్యాన్సర్‌ను చాలా లేటు దశలో గుర్తించే పరిస్థితులే చాలా సందర్భాల్లో ఏర్పడుతుంటాయి. క్యాన్సర్ చికిత్స విధానాలన్నీ ఏ దశలో వ్యాధి కనుగొన్నామనే అంశం మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. తలనొప్పి : తలనొప్పి తరచూ అందరూ ఎదుర్కొనేదే. చికాకు, పనుల ఒత్తిడి, ఎండ, కొన్ని రకాల వాసనలు, ఆకలి వంటి కారణాలతో మైగ్రేన్ లేదా తలనొప్పి అప్పుడప్పుడు రావడం చాలా సహజమే. మందులు వాడినప్పటికీ తలనొప్పి రావడం, అలాగే ఉదయం లేవగానే తలభారం, తీవ్రమైన నొప్పి, వాంతులు కావడం, వికారం లాంటి లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్‌కు సంకేతం కావచ్చు. గొంతునొప్పి : చల్లటి పదార్థాలు, కొత్తప్రదేశం, తాగేనీరు మారాయి అందుకే గొంతు బొంగురు, నొప్పి అని బాధపడే వారిని చాలామందినే చూస్తుంటాం. వీటికి మందులు కోర్సుగా వాడాక కూడా ఆ సమస్య బాధిస్తుంటే మాత్రం డాక్టర్‌ను సంప్రదించి చెకప్స్ చేయించుకోవాలి. థైరాయిడ్ క్యాన్సర్, గొంతు సంబంధిత క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ లక్షణాలు తొలిదశలో ఇలాగే ఉంటాయి. దగ్గు, ఆయాసం : సిగరెట్టు తాగేవారు మాకు ఇలాంటి లక్షణాలు అలవాటే అనుకుంటారు. కానీ వీరికి లంగ్ క్యాన్సర్‌తో పాటు అనేక రకాల ఇతర క్యాన్సర్లు వచ్చే ముప్పు ఎక్కువ అని గ్రహించాలి. గొంతులో నస, ఆగని దగ్గు, కళ్లె/తెమడలో రక్తం, ఆయాసం వంటివి టీబీ లేదా లంగ్‌క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. కడుపు ఉబ్బరం, మంట : సరైన జీవనశైలి అలవరచుకుని నీరు, పీచు ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉన్నప్పటికీ, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వేధిస్తూ ఉంటే ఎండోస్కోపీ, స్కానింగ్ లాంటి పరీక్షలతో జీర్ణాశయానికి సంబంధించిన క్యాన్సర్లు, కాలేయం, పాంక్రియాస్, గాల్‌బ్లాడర్ క్యాన్సర్లను తొలిదశలోనే కనుగొనే అవకాశం ఉంది. మూత్రవ్యవస్థలో తేడాలు : మూత్రంలో రక్తం పడటం, ఆగి ఆగిరావడం, మంటగా ఉండటం మొదలైన లక్షణాలు కనిపించినప్పుడు తమకు వేడిచేసిందని భ్రమిస్తూ ఉంటారు. సాధారణంగా నీళ్లు తక్కువ తాగడం, ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్లు వంటి కారణాలవల్ల ఈ లక్షణాలు కనిపించవచ్చు. ఇవి మరీ తీవ్రంగా ఉండి చికిత్సలకు లొంగకపోతే యూరినరీ బ్లాడర్‌కు సంబంధించిన క్యాన్సర్ కావచ్చని అనుమానించాలి. 50 ఏళ్లపైబడిన పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు, క్యాన్సర్ లక్షణాలు ఈ విధంగానే ఉండవచ్చు. నెలసరిమధ్య రక్తస్రావం, పొట్టభారంగా ఉండటం, ఆకలి మందగించడం, స్త్రీల నెలసరి ముందు ఉండే సమస్యలుగా (పీఎమ్ఎస్)గా పొరబడవచ్చుగానీ కొన్నిసార్లు అవి ఒవేరియన్, యుటిరైన్ క్యాన్సర్లూ కావచ్చు. మలవిసర్జనలో తేడాలు : అజీర్తి, విరేచనాలు, మలంలో రక్తం వంటి లక్షణాలు ఆహారపు అలవాట్లు మారినప్పుడు పైల్స్, ఫిషర్, ఫిస్టులా వంటి సమస్యలున్నప్పుడు కనిపించవచ్చు. కానీ మలవిసర్జన సమయంలో ఎప్పుడూ రక్తం పడుతుంటే అవి కోలన్ క్యాన్సర్ లక్షణాలు కూడా కావచ్చు. సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ వంటి పరీక్షలతో సమస్య ఏమిటో తెలిసిపోతుంది. అసలు విషయాన్ని గమనించక రకరకాల ఆహార పదార్థాల వల్ల ఈ సమస్య తలెత్తోందంని ఇతర అంశాలకు దీన్ని ఆపాదించుకుంటాం. తీవ్రమైన అలసట, ఆకలి, బరువు తగ్గడం, వీడని జ్వరం ఇంకా ఆయా అవయవాలకు సంబంధించిన లక్షణాలు ఉన్నట్లయితే ‘గాలిసోకిందీ’, ‘దయ్యంపట్టిందీ’, ‘చేతబడి చేశారు’ అంటూ పూజలు, మంత్రాలు, విభూది, తాయెత్తులు, దిష్టితీయడాలు వంటి అనేక మూఢనమ్మకాల పాలబడకుండా ఉండాలి. ఇలాంటివి చేస్తూ ఉండే ఫలితం కనిపించకపోగా అసలు సమస్య బయటపడే సమయానికి చేయిదాటిపోయే ప్రమాదం ఉంది. క్యాన్సర్ ఇతర భాగాలకూ వ్యాపించి, చికిత్సకు లొంగకుండా తయారుకావచ్చు. ప్రతినెలా కనిపించే గడ్డలే అనీ, పాలగడ్డలనీ రొమ్ములో దీర్ఘకాలం పాటు కనిపించే కణుతులను అశ్రద్ధ చేస్తే కణితి ఇతర భాగాలకు పాకే ప్రమాదం పొంచిఉంటుంది. అలసట, చర్మం మీద ఊదారంగు మచ్చలు, తేలికగా కమిలిపోవడం వంటివి బ్లడ్‌క్యాన్సర్‌ను హెచ్చరించవచ్చు. గోళ్లలో మార్పులు, ముందుకు వంగి ఉండటం లివర్ / లంగ్ క్యాన్సర్లకు సూచన కావచ్చు. ఒత్తిడికి గురైనప్పుడు, వాతావరణం, ఆహారం మారినప్పుడు పైన పేర్కొన్న లక్షణాలు దాదాపుగా అందరూ ఎదుర్కొనేవే. అయితే తీవ్రంగా ఉన్నప్పుడు కూడా అవే కారణాలని భ్రమపడి ముందు వాడిన మందులనే మళ్లీ వాడుకుంటూ కాలయాపన చేస్తే సమస్యలను మనమే తీవ్ర చేసుకున్నవాళ్లమవుతాం. అందుకే చాలావరకు క్యాన్సర్ ముదిరాకే చికిత్సకు వస్తూ ఉంటారు. అదృష్టవశాత్తూ గత కొంతకాలంగా హెల్త్‌చెకప్స్ చేయించుకోవడం, అవగాహన పెంచుకోవడం శుభపరిణామంగా చెప్పవచ్చు. Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001 -
రోజూ ఆందోళన... నిద్ర పట్టడం లేదు
నా వయసు 32 ఏళ్లు. వృత్తిరీత్యా ఎప్పుడూ తీవ్రమైన ఒత్తిడిలో ఉంటాను. టార్గెట్లను సాధిస్తూ ఉండాలి. దాంతో నిత్యం తీవ్రమైన ఆందోళనతో ఉంటుంటాను. చాలా త్వరగా ఉద్వేగాలకు గురవుతుంటాను. ఎప్పుడూ ఏదో ఆలోచనలు. రాత్రి సరిగా నిద్ర సరిగా పట్టదు. నా సమస్యలకు తగిన చికిత్సను సూచించండి. – డి. జయదేవ్, హైదరాబాద్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు యాంగై్జటీ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లుగా అనిపిస్తోంది. మీరు చెప్పిన లక్షణాలైన తీవ్రమైన ఆందోళనలు, ఎడతెరిపి లేని ఆలోచనలు దీన్నే సూచిస్తున్నాయి. సాధారణంగా తీవ్రమైన ఒత్తిళ్లలో పనిచేసేవారిలో ఇది చాలా ఎక్కువ. మీరు ముందుగా ఒకసారి రక్తపరీక్షలు చేయించుకొని, రక్తంలో చక్కెరపాళ్లను పరీక్షించుకోండి. ఎందుకంటే మీ తరహా పనితీరు (సెడెంటరీ లైఫ్‌స్టైల్) ఉన్నవారిలో ఒత్తిడి వల్ల రక్తంలో చక్కెరల విడుదల ఎక్కువగా ఉంటుంది. దాంతో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలా మీకు తెలియకుండానే డయాబెటిస్ ఉంటే అది నరాలపై ప్రభావం చూపి, పెరిఫెరల్ నర్వ్స్, అటనామస్ నర్వ్స్ (స్వతంత్రనాడీ వ్యవస్థ)పై ప్రభావం చూపి ఇలా గాభరా, హైరానాపడేలా చేయడం చాలా సాధారణం. మీకు చికిత్స కంటే కూడా జీవనశైలిలో మార్పులు అవసరం. సమస్యతో అవగాహనతో, పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్లాలి. మీరు ఉదయమే నిద్రలేచి బ్రిస్క్ వాకింగ్ వంటి వ్యాయామాలు, యోగా, మెడిషటేషన్ చేయడం, వేళకు భోజనం తీసుకోవడం, వేళకు నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకునేందుకు ఆహ్లాదకరమైన వ్యాపకాలను అలవరచుకోవడం వంటి జీవనశైలి మార్పులతో మీ సమస్య చాలావరకు తగ్గుతుంది. పైన పేర్కొన్న పరీక్షలు చేయించాక ఫిజీషియన్‌ను కలవండి. ఒకవేళ మీకు తెలియకుండా షుగర్ వచ్చి ఉంటే డాక్టర్... ఆ సమస్యకు కూడా కలిపి చికిత్స సూచిస్తారు. ఒకవేళ మీకు షుగర్ లేకపోతే... మీరు చెప్పిన జీవనశైలి వల్ల త్వరగా డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉన్నందున... ఆ సమస్యను నివారించచడం కోసం జీవనశైలి మార్పులను తప్పక అనుసరిస్తూ, యాంగ్జటీని తగ్గించే మందులైన యాంగ్జియోలైటిక్స్ను డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి. ఎప్పుడూ ఆకలి, అతిగా మూత్ర విసర్జన... ఎందుకిలా? నా వయసు 39 ఏళ్లు. ఈమధ్య తరచూ ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తోంది. అతిగా దాహం వేస్తోంది. ఆకలి బాగా వేస్తుంది. బాగానే తింటున్నాను. అయినా చాలా నీరసంగా అనిపిస్తోంది. తరచూ ప్రైవేట్ పార్ట్స్ వద్ద ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. నేను చేస్తున్న పనిలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఈ లక్షణాలు చెబుతుంటే... నాకు షుగర్ వచ్చిందేమోనని నా ఫ్రెండ్స్ అంటున్నారు. నాకు ఎందుకిలా జరుగుతోంది? తగిన సలహా ఇవ్వండి. – ఎల్. శ్రీకాంత్, కాకినాడ ఉద్యోగరీత్యా మీరు ఒత్తిడికి గురవుతున్నట్లు చెప్పారు. ఇలా ఎక్కువ ఒత్తిడికి గురికావడం, శారీరక శ్రమ లేకపోవడం వంటివి డయాబెటిస్‌ను మరింత త్వరగా వచ్చేలా చేస్తాయి. మీరు చెబుతున్న లక్షణాలన్నీ డయాబెటిస్ లక్షణాలనే పోలి ఉన్నాయి. డయాబెటిస్ వల్ల రోగనిరోధక శక్తి తగ్గి, కొన్ని సందర్భాల్లో మీరు చెబుతున్నట్లుగానే ప్రైవేట్ పార్ట్స్‌లో ఇన్ఫెక్షన్స్ రావచ్చు. కాబట్టి ఒకసారి మీరు షుగర్‌కు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ షుగర్ పరీక్షలు, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, హెచ్‌బీ1ఏసీ వంటి పరీక్షలతో డయాబెటిస్‌ను నిర్ధారణ చేయవచ్చు. వీలైనంత త్వరగా మీరు దగ్గర్లోని ఫిజీషియన్‌ను సంప్రదించి, వారి సూచనలను అనుసరించండి. ఒంటి మీద గడ్డలు... ఎవరిని సంప్రదించాలి? నా వయస్సు 36 ఏళ్లు. నా చేతులు, ఛాతీ, పొట్ట మీద చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి. చాలా రోజుల నుంచి నా ఒంటిపైన ఇవి వస్తున్నాయి. ఒకసారి డాక్టర్‌కు చూపించాను. వాటి వల్ల ఎలాంటి హానీ ఉండదు అంటున్నారు. ఇందులో కొన్ని కాస్త నొప్పిగానూ, మరికొన్ని అంతగా నొప్పి లేకుండా ఉన్నాయి. ఇవి ఏమైనా క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందా? ఇంకా ఎవరికైనా చూపించాలా? – ఆర్. జయకృష్ణ, కొత్తగూడెం మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే మీకు ఉన్న గడ్డలు బహుశా కొవ్వు కణుతులు (లైపోమా)గానీ లేదా న్యూరోఫైబ్రోమాగాని అయి ఉండవచ్చు. మీ డాక్టర్‌కు చూపించి ఆయన సలహా తీసుకున్నారు కాబట్టి ఆందోళన పడకుండా నిశ్చింతగా ఉండండి. ఆయన పరీక్షించే చెప్పి ఉంటారు కాబట్టి వాటి వల్ల ఏలాంటి ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడదు. మీరు చెప్పినట్లుగా హానికరం కాని ఈ గడ్డలు బాగా పెద్దవైనా, నొప్పి ఉన్నా వైద్య నిపుణులను సంప్రదించి శస్త్రచికిత్స ద్వారా తొలగింపజేసుకోవడం ఒక మార్గం. ఒకవేళ ఇవి క్యాన్సర్‌కు సంబంధించిన గడ్డలేమో అనే మీ అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలనుకుంటే నీడిల్ బయాప్సీ చేయించుకుని నిశ్చింతగా ఉండండి. మీరు మొదట ఒకసారి మెడికల్ స్పెషలిస్ట్‌ను కలవండి. లేదా మీకు మరీ అంత అనుమానంగా ఉంటే ఒకసారి మెడికల్ ఆంకాలజిస్టును సంప్రదించండి. అగర్బత్తీ వాసన వస్తే చాలు తలనొప్పి! అగర్బత్తీల వాసన నా ముక్కుకు సోకగానే వెంటనే నాకు తలనొప్పి (డల్ హెడేక్) మొదలవుతోంది. ఆ తలనొప్పి చాలా అసౌకర్యంగా, ఇబ్బందిగా ఉంటుంది. పైగా ఇంట్లో దైవప్రార్థన కోసం అగర్బత్తీలు వెలిగిస్తారు కాబట్టి దానిని కాదనలేను. నేనే అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతుంటాను. అంతేకాదు... ఎవరైనా స్ప్రే కొట్టుకుని వస్తే వాళ్ల దగ్గరనుంచి ఆ వాసన రాగానే కడుపులో తిప్పడంతో పాటు మళ్లీ హెడేక్ మొదలువుతుంటుంది. దాంతో సాధ్యమైనంత త్వరగా అక్కడ్నుంచి దూరంగా వెళ్తుంటాను. ఆఫీస్‌లో చాలా ఇబ్బందిగా ఉంటోంది. నా సమస్యకు పరిష్కారం పరిష్కారం సూచించండి. – ఎమ్. సుందరి, విశాఖపట్నం మీరు చెప్పిన అంశాలను బట్టి మీరు ఒక రకం మైగ్రేన్‌తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. తలనొప్పిని ప్రేరేపించే అంశాల్లో అనేక రకాలు ఉంటాయి. ఇందులో అగరుబత్తీలు, పెర్ఫ్యూమ్స్ కూడా ఉంటాయి. కొందరిలో చాక్లెట్లు, స్వీట్స్ వల్ల కూడా తలనొప్పి రావచ్చు. మీరు న్యూరాలజిస్ట్‌ను సంప్రదించి, తలనొప్పి రాకుండానే ముందుగా తీసుకునే మందులు (ప్రొఫిలాక్సిస్) తీసుకోండి. మీకు తలనొప్పిని ప్రేరేపించే అంశాలేమిటో తెలుసు కాబట్టి వీలైనంత వరకు వాటిని దూరంగా ఉండండి. డాక్టర్ జి. నవోదయ కన్సల్టెంట్, జనరల్ మెడిసన్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
మైగ్రేన్ నయమవుతుందా?
నా వయసు 26 ఏళ్లు. నాకు కొంతకాలంగా తలలో ఒకవైపు విపరీతమైన తలనొప్పి వస్తోంది. ఆఫీసులో ఏపనీ చేయలేకపోతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే మైగ్రేన్ అన్నారు. హోమియో మందులతో ఇది తగ్గుతుందా? – ఆర్. జానకి, అమలాపురం పార్శ్వపు నొప్పి అని కూడా పిలిచే ఈ మైగ్రేన్ తలనొప్పిలో తలలో ఒకవైపు తీవ్రమైన నొప్పి వస్తుంది. సాధారణంగా ఇది మెడ వెనక ప్రారంభమై కంటివరకు వ్యాపిస్తుంది. యువకులతో పోలిస్తే యువతుల్లో ఇది ఎక్కువ. కారణాలు: తలలోని కొన్ని రకాల రసాయనాలు అధిక మోతాదులో విడుదల కావడం వల్ల పార్శ్వపు నొప్పి వస్తుందని తెలుస్తోంది. ఇక శారీరక, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, చాలాసేపు ఆకలితో ఉండటం, సమయానికి భోజనం చేయకపోవడం, సైనసైటిస్, అతి వెలుగు, గట్టి శబ్దాలు, ఘాటైన వాసనలు, పొగ, మద్యం వంటి అలవాట్లు, మహిళల్లో నెలసరి సమయాల్లో, మెనోపాజ్ సమయాల్లో స్త్రీలలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వంటివి ఈ సమస్యకు కారణాలుగా చెప్పవచ్చు. లక్షణాలు: పార్శ్వపు నొప్పిలో చాలారకాల లక్షణాలు కనిపిస్తాయి. వాటిని మూడురకాలుగా విభజించవచ్చు. 1 పార్శ్వపు నొప్పి వచ్చేముందు కనిపించే లక్షణాలు : ఇవి పార్శ్వపునొప్పి వచ్చే కొద్ది గంటలు లేదా నిమిషాల ముందు వస్తాయి. చికాకు, నీరసం, అలసట, నిరుత్సాహం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని రకాల తినుబండారాలు ఇష్టపడటం, వెలుతురు, శబ్దాలను తట్టుకోలేకపోవడం, కళ్లు మసకబారడం, కళ్లముందు మెరుపులు కనిపించడం జరగవచ్చు. వీటినే ‘ఆరా’ అంటారు. 2 పార్శ్వపునొప్పి సమయంలో కనిపించే లక్షణాలు: తీవ్రమైన తలనొప్పి, తలలో ఒకవైపు వస్తుంటుంది. ఇది 4 నుంచి 72 గంటల పాటు ఉండవచ్చు. 3 పార్శ్వపు నొప్పి వచ్చాక కనిపించే లక్షణాలు: చికాకు ఎక్కువగా ఉండటం, నీరసంగా ఉండటం, వికారం, వాంతులు విరేచనాలు కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స / నివారణ: కొన్ని అంశాలు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తాయి. మనకు ఏయే అంశాలు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తున్నాయో జాగ్రత్తగా గమనించి, వాటికి దూరంగా ఉండటం ద్వారా మైగ్రేన్‌ను నివారించవచ్చు. అలాగే కాన్స్టిట్యూషన్ పద్ధతిలో ఇచ్చే ఉన్నత ప్రమాణాలతో కూడిన హోమియో చికిత్స ద్వారా దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు. -
మీ పిల్లలకు తరుచూ తలనొప్పా.. జాగ్రత్త
జైపూర్ : మీ పిల్లలకు తరుచుగా తలనొప్పి వస్తోందా? అయితే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సంప్రదించడం మంచిది. మెదడులోని కణితుల వల్ల కూడా తరుచుగా తలనొప్పి వచ్చే అవకాశం ఉందని న్యూరోసర్జన్లు అంటున్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 2500 మంది పిల్లలు బ్రెయిన్ ట్యూమర్(మెదడులోని కణితులు)తో బాధపడుతున్నారని పేర్కొన్నారు. చిన్న పిల్లలు ఎక్కువగా మొబైల్ ఫోన్లను వాడటం వల్ల కూడా ట్యూమర్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. జైపూర్‌కు చెందిన ప్రముఖ న్యూరోసర్జన్ డా.కేకే.బన్సాల్ మాట్లాడుతూ.. జన్యు సంబంధ అంటువ్యాధుల కారణంగా చిన్న పిల్లలలో ట్యూమర్లు వస్తున్నాయని అన్నారు. పిల్లలు తల్లి కడుపులో ఉన్నపుడు.. ఆమె గర్భం ధరించిన మొదటి మూడు నెలల వరకు తీసుకున్న మందులు, కాన్పుకు మూడు నెలల ముందు తీసుకున్న మందుల ప్రభావం ఉంటుందన్నారు. ముఖ్యంగా రేడియేషన్ వల్ల కూడా జన్యు సంబంధ అంటువ్యాధులు వస్తాయన్నారు. గర్భిణిలు సెల్‌ఫోన్ వాడకాన్ని చాలా వరకు తగ్గించాలని సూచించారు. పిల్లలలో ఈ బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు పుట్టిన కొన్ని సంవత్సరాల తర్వాత కనబడతాయని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా పిల్లలలో ఈ వ్యాధి మరింత పెరిగిందని అన్నారు. ప్రస్తుతం ట్యూమర్లను తొలగించడానికి రెండు రకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. మామూలు ట్యూమర్లను సర్జరీ ద్వారా తొలగించవచ్చు. మరి కొన్ని ట్యూమర్లను గామా నైఫ్ థెరపీ పద్దతి ద్వారా తొలగించవచ్చు. -
కరోలినా.. చాలా డేంజర్ గురూ..
కరోలినా రాపర్.. ఎంతటివారినైనా ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించగల ఘనాపాటి.. ఎవరబ్బా ఈ కరోలినా అనుకుంటున్నారా.. మీరనకుంటున్నట్లు కరోలినా మనిషి కాదు.. ఒక మిరపకాయ. బ్యాడ్మింటన్‌లో ఆ కరోలినా మారిన్ రికార్డులు సృష్టిస్తే.. ఈ కరోలినా రాపర్ ప్రపంచంలోనే అతి ఘాటైన మిరపకాయగా గిన్నిస్ బుక్ రికార్డుకెక్కింది. స్పైసీ ఫుడ్ లవర్స్ పోటీ పెట్టుకుని మరీ వీటిని లాగించేస్తుంటారు. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అంటారు కదా. న్యూయార్క్‌కు చెందిన యువకుడి విషయంలోనూ ఇదే జరిగింది. పోటీలో భాగంగా ఒకే ఒక కరోలినా రాపర్‌ని తిన్నాడు 34 ఏళ్ల యువకుడు. అంతే ఒక్క నిమిషంలోనే తీవ్రమైన తలనొప్పితో కుప్పకూలాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు పోటీ నిర్వాహకులు. తలనొప్పితో పాటు మెడ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. క్రమంగా ధమనులు కూడా అస్తిరపడటంతో వైద్యులు అతడి మెదడును స్కాన్ చేశారు. మిరపకాయ తినడం వల్లే రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడినట్లు గుర్తించారు. ఐదువారాల పాటు చికిత్స పొందిన అనంతరం అతడి ఆరోగ్యం కుదుటపడింది. పోటీలో గెలవలేకపోయిన ఆ యువకుడు.. కరోలినా రాపర్ తిని ఆస్పత్రిపాలైన మొదటి వ్యక్తిగా రికార్డుకెక్కాడు. కారం ఎక్కువగా తింటే ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతాయని.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని బీఎంజే జర్నల్ తన నివేదికలో పేర్కొంది. ఒక్క కరోలినా రాపర్ 1.5 మిలియన్ల స్వావిల్లే హీట్ స్కేల్(ఘాటును కొలిచే ప్రమాణాలు) కలిగి ఉంటుందని పరిశోధనలో తేలింది. ఇంత ఘాటైన మిరపకాయల వలన రివర్సబుల్ సెరెబ్రల్ వాసొకన్సిట్రిక్షన్ సిండ్రోమ్ (తీవ్రమైన తలనొప్పి) అనే వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
ఏమిటీ తలనొప్పి!
ఒక్క తల కానీ, రావణాసురుడికి ఉన్నన్ని రాక్షస తలనొప్పులు. అన్నీ వివరించాలంటే... పుస్తకమే రాయాలి. అదో తలనొప్పి. అందుకే క్లుప్తంగా... సమగ్రంగా. ఎన్నిరకాల తలనొప్పులో అన్నిరకాల జాగ్రత్తలు. ఈ వ్యాసం చదివిన తర్వాత ఒక్క విషయాన్నైతే అడగరు.. ఏమిటీ తలనొప్పి? తల ఉన్న ప్రతివారికీ జీవితకాలంలోని ఏదో ఒక సమయంలో ఒకసారి తలనొప్పి రావడం తప్పనిసరి. ఇది ఎంతో బాధాకరం. వచ్చినప్పుడు ఏమీ చేయలేక చికాకు పడుతుంటాం. కాబట్టే ఏదైనా మామూలు సమస్య వచ్చినప్పుడు కూడా మనం ‘అబ్బా అదో తలనొప్పి’ అనే వ్యవహరిస్తుంటాం. ఇది రోగులకే కాదు, నయం చేయాలనుకున్న 70 శాతం మంది డాక్టర్లకు / న్యూరాలజిస్టులకు సైతం తలనొప్పే. సెరీనా విలియమ్స్ వంటి టెన్నిస్ హేమాహేమీల నుంచి సాధారణ వ్యక్తుల వరకు ఇది తరచూ ఇబ్బందులకు గురిచేస్తుంటుంది. మనకు అన్నీ ఒకేలా అనిపిస్తుంటాయి గానీ... ఇందులో ఒకటీ రెండూ కావు... దాదాపు 200పైగా తలనొప్పులు ఉంటాయి. ఇలాంటి అనేర రకాల తలనొప్పుల గురించి అవగాహన కోసం ఈ ప్రత్యేక కథనం. తలనొప్పుల తీరుతెన్నులు, వాటి నిర్ధారణ పద్ధతులు, చికిత్సలు, ఇతరత్రా అంశాల ఆధారంగా తలనొప్పులను రకరకాలుగా విభజించవచ్చు. అయితే తలనొప్పుల కారణాలు లేదా అవి ఉద్భవించే తీరుతెన్నులను బట్టి నిపుణులు వాటిని ప్రధానంగా మూడు రకాలుగా విభజిస్తారు. అవి... 1) ప్రైమరీ తలనొప్పులు... ఈ తరహా తలనొప్పులు నేరుగా తలలోనే ఉద్భవిస్తాయి. ఈ నొప్పులకు కారణం తలలోనే ఉంటుంది. 2) సెకండరీ తలనొప్పులు... ఈ తరహా తలనొప్పులు ఇంకేదో బయటి కారణంతో వస్తుంటాయి. అంటే... తలలో గడ్డలు ఏర్పడటం, తలకు గాయం కావడం లేదా పక్షవాతం వంటి కారణాల వల్ల ఈ తలనొప్పులు వస్తాయి. కాబట్టే వీటిని సెకండరీ తలనొప్పులుగా చెప్పవచ్చు. 3) క్రేనియల్ న్యూరాల్జియా లేదా ఫేషియల్ పెయిన్స్‌తో పాటు ఇతర తలనొప్పులు... (తల లోపల 12 నరాలు ఉంటాయి. వీటినే క్రేనియల్ నర్వ్స్ అంటారు. ఈ నరాలు ఏవైనా కారణాలతో ఉద్రిక్తతకు లోనైతే వచ్చే తలనొప్పులను ఇలా చెప్పవచ్చు. 1. ప్రైమరీ తలనొప్పులు మెదడులోని రసాయనాల్లో సమతౌల్యం లోపించడం వల్ల తలలోనే ఉద్భవించే తలనొప్పులివి. మైగ్రేన్ : తలనొప్పులన్నింటిలోనూ మైగ్రేన్ చాలా సాధారణమైనది. ఇది టీనేజ్ పిల్లల్లో ఎక్కువ. యువకుల్లో కంటే యువతుల్లో మరింత ఎక్కువ. ఈ తలనొప్పి చాలా సందర్భాల్లో తలకు ఒకే వైపు వస్తుంటుంది. కొన్నిసార్లు ఇరుపక్కలా వస్తుంటుంది. వచ్చినప్పుడు నాలుగు నుంచి 72 గంటల వరకు కూడా వేధిస్తుంది. తలనొప్పితో పాటు వికారం / వాంతులు; కాంతిని చూసినా, శబ్దాలు విన్నా తలనొప్పి పెరగడం లక్షణాలుంటాయి. కొంతమందిలో కళ్లకు చిత్రవిచిత్రమైన కాంతి వలయాలు, కాంతిపుంజాలు, మెరుపులూ (ఫ్లాషింగ్ లైట్స్) కనిపిస్తాయి. కారణాలివి: మైగ్రేన్‌కు చాలా కారణాలు ఉంటాయి. తీవ్రమైన యాంగై్జటీ, ఒత్తిడి, సరిపడని పదార్థాలు తినడం (ఉదాహరణకు చాక్లెటు, చీజ్, వెన్న, సోయా సాస్, కాఫీలోని కెఫిన్, ప్రాసెస్ చేసిన మాంసాహార పదార్థాలు, నిమ్మ జాతి పండ్లు వంటివి. ఇవి వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉండవచ్చు); తగినంత నిద్రలేకపోవడం, సమయానికి తినకుండా ఆకలితో ఉండటం, తీవ్రమైన శారీరక శ్రమ, వాతావరణంలో వచ్చే ఆకస్మిక మార్పులు, అగరుబత్తీలు, కొన్ని రసాయనాలతో చేసిన సెంట్ల నుంచి వచ్చే ఘాటైన వాసనలు, ఆల్కహాల్ (అందులోనూ ముఖ్యంగా రెడ్‌వైన్), చైనీస్ ఫుడ్ ఐటమ్స్, యువతుల్లో హార్మోన్ల మార్పులు, తలస్నానం చేస్తూనే తలకు బిగుతుగా ఉండే హెయిర్ బ్యాండ్ ధరించడం, ఎండకు ఒకేసారి ఎక్స్పోజ్ కావడం, మలబద్దకం వంటి అంశాలు మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించి బాధను తీవ్రతరం చేస్తాయి. ఇవే కాకుండా ఒక్కో వ్యక్తికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు కూడా మైగ్రేన్‌ను ట్రిగర్ చేయవచ్చు. అందుకే చాలా అంశాల్ని వాకబు చేసి డాక్టర్లు కారణాన్ని తెలుసుకుంటారు. దీని నిర్ధారణకు ఏ రకమైన నిర్దిష్టమైన పరీక్ష ఉండదు. తలనొప్పుల నిర్ధారణ కోసం చేసే అన్ని పరీక్షల్లోనూ ఏ లోపం కనిపించకపోవడంతో పాటు పై లక్షణాలతో తలనొప్పి అదే పనిగా మాటిమాటికీ వస్తుండటం వంటి లక్షణాల ఆధారంగా దీన్ని నిర్ధారణ చేస్తారు. మైగ్రేన్‌కు రెండు రకాల చికిత్స చేస్తారు. మొదట తీవ్రమైన తలనొప్పిని తక్షణం తగ్గించడానికి చేసే చికిత్స. ఆ తర్వాత అది మళ్లీ తిరగబెట్టకుండా ఉండటానికి చేసే దీర్ఘకాలిక చికిత్స. ఇందుకోసం మూడు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం వాడాల్సి ఉంటుంది. ఇక మైగ్రేన్‌కు మందులతో పాటు యోగా, ధ్యానం (మెడిటేషన్) వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా చాలావరకు ఉపయోగపడతాయి. ఈ మందులతో తగ్గని కొన్ని మైగ్రేన్లకు ఇటీవల బొటాక్స్ చికిత్స చేస్తున్నారు. పెప్పర్మెంట్ ఆయిల్, లావండర్ ఆయిల్ తలకు అప్లై చేసుకోవడంతో ఉపశమనం దొరుకుతుంది. మెగ్నీషియమ్, రైబోఫ్లేవిన్ (బి2 విటమిన్) అధికంగా ఉన్న పదార్థాలు (గోధుమ వంటి ధాన్యాలు– పండ్లు, ఆకుకూరల్లో ఇవి అధికం) తీసుకోవడం ద్వారా కూడా ఉపశమనం దొరకుతుంది. క్లస్టర్ హెడేక్ : ఇది కాస్త అరుదుగా కనిపించే తలనొప్పి. కంటి పాపల వెనక బాగా తీవ్రమైన నొప్పి వచ్చి, రెండు మూడు గంటలు బాధిస్తుంది. ఒక్కోసారి ఇది మాటిమాటికీ తిరగబెడుతూ కొద్దిరోజుల పాటు వస్తుంటుంది. రోజూ ఒకే వేళకు వస్తుంటుంది. ఏడాదిలో 8–10 వారాల పాటు వస్తుంటుంది. ఒకసారి అలా వచ్చాక మళ్లీ ఏడాది పాటు రాదు. కానీ ఆ మరుసటి ఏడాది కూడా మొదటిసారి వచ్చినట్లే మళ్లీ 8–10 వారాల పాటు అదే వేళకు వస్తూ ఉంటుంది. చికిత్స : దీనికి తక్షణ చికిత్సగా ఆక్సిజన్‌ను అందిస్తారు లేదా ట్రిప్టాన్ మందులను ముక్కుద్వారా పీల్చేలా చేసి మొదట నొప్పిని తగ్గిస్తారు. దీర్ఘకాలికంగా ఈ తరహా తలనొప్పి రాకుండా చికిత్స అందించాల్సి ఉంటుంది. ప్రైమరీ కాఫ్ అండ్ లాఫ్ హెడేక్ : తీవ్రంగా దగ్గడం లేదా గట్టిగా చాలాసేపు నవ్వడం లేదా గట్టిగా తుమ్మడం వంటి చర్యల వల్ల అకస్మాత్తుగా వచ్చే తలనొప్పి ఇది. ఒక్కోసారి గుండె నుంచి మెడ ద్వారా తలలోకి రక్తాన్ని తీసుకెళ్లే కెరోటిడ్ ఆర్టరీ అనే మంచి రక్తనాళం సన్నబడటం వల్ల కూడా ఈ తరహా తలనొప్పి రావచ్చు. ప్రైమరీ స్టాబింగ్ హెడేక్: తలలో కత్తితో పొడిచినట్లుగా ఉండే తలనొప్పిని ఈ పేరుతో పిలుస్తారు. హిప్నిక్ హెడేక్ : నిద్రలోనే మొదలై నిద్రలేచాక కూడా దాదాపు 15–30 నిమిషాల పాటు ఉంటుంది. సాధారణంగా 60 ఏళ్లు దాటిన వారిలో అందునా మరీ ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. నిద్రకు ఉపక్రమించే ముందు ఒక కాఫీ తాగడం లేదా లిథియమ్ మాత్రలు వంటివి ఈ తరహా తలనొప్పికి చికిత్స. ఇతర తలనొప్పులు : ఇవేగాక న్యూ డైలీ పర్సిస్టింగ్ హెడేక్, ప్రైమరీ థండర్‌క్లాప్ హెడేక్, క్లస్టర్ హెడేక్స్లో ఒక రకమైన ప్రైమరీ పారాక్సిస్మల్ హెమిక్రేనియా వంటి చాలా రకాల తలనొప్పుల కూడా ఉన్నాయి. కొన్నిసార్లు పంటినొప్పి, చెవినొప్పి, గొంతునొప్పి, కళ్లు నొప్పిగా ఉండటం వంటి కారణాలు కూడా తలనొప్పికి దారితీస్తాయి. తలనొప్పి వచ్చినప్పుడు అంతగా ఆందోళన పడకూడదు. అయితే మాటిమాటికీ తలనొప్పి వస్తుంటే మాత్రం డాక్టర్‌ను కలిసి కారణాన్ని కనుగొని, తగిన చికిత్స తీసుకోవాలి. చికిత్సకు ఎప్పుడు వెళ్లాలంటే... జీవితంలో మొట్టమొదటి సారే తీవ్రంగా భరించలేనంత తలనొప్పి వచ్చినప్పుడు. అది మొదలుకావడమే తలబద్ధలైపోతూ భరించశక్యం కానప్పుడు. ∙సమయం గడుస్తున్నకొద్దీ ఏమాత్రం ఉపశమనం లేకుండా దాని తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నప్పుడు ∙తలనొప్పితో పాటు జ్వరం/నీరసం/ఫిట్స్ / చేయి–కాలు బలహీనత వచ్చి కళ్లు మసకబారుతుంటే ∙పైకి లేస్తున్నప్పుడు లేదా ఏదైనా వస్తువును ఎత్తుతున్నప్పుడు లేదా ముందుకు వంగుతున్నప్పుడు తలనొప్పి రావడం. ∙నిద్రలో తలనొప్పి వచ్చి నిద్రాభంగం అవుతున్నప్పుడు పైన పేర్కొన్న అంశాలు కనిపిస్తున్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించి సీటీ స్కాన్/ఎమ్మారై స్కాన్ అవసరాన్ని బట్టి మెదడు నుంచి నీరు తీసి చేసే సీఎస్ఎఫ్ (సెరిబ్రోస్పినల్ ఫ్లుయిడ్) పరీక్ష వంటివి చేయాలి. 2. సెకండరీ తలనొప్పులు వీటిలో కొన్ని ప్రధానమైనవి. మెనింజైటిస్ : ఇది మెదడు పొరల్లో ఒకదానికి వచ్చే ఇన్ఫెక్షన్. ఇందులో కనిపించే లక్షణాలు... తలనొప్పితో పాటు జ్వరం, వాంతులు, మెడ బిగుసుకుపోవటం, వెలుగు చూడటానికి ఇబ్బందిగా ఉండటం లేదా శబ్దాలు వినడానికి ఇబ్బందిగా ఉండటం. మెనింజైటిస్ సమస్యను సీఎస్ఎఫ్ (మెదడులోని ద్రవం – సెరిబ్రోస్పినల్ ఫ్లుయిడ్)ను పరీక్షించడం ద్వారా నిర్ధారణ చేయవచ్చు. బ్రెయిన్ ట్యూమర్ : మెదడులో గడ్డలు ఏర్పడటం వల్ల తలనొప్పి వస్తుంది. మెదడులోని గడ్డ పెరుగుతున్న కొద్దీ నొప్పి కూడా పెరుగుతూ పోతుంది. వారాల తరబడి కొనసాగుతుంది.నిద్రలేవగానే నొప్పి ఎక్కువగా ఉంటుంది. తలనొప్పితో పాటు వాంతులు ఉంటాయి. ఒక్కోసారి ఫిట్స్ కూడా రావచ్చు. ముందుకు ఒంగినప్పుడు తలనొప్పి ఎక్కువగా ఉంటుంది లేదా ఏదైనా వస్తువులను ఎత్తినప్పుడు తలనొప్పి పెరుగుతుంది. ఇంట్రాక్రేనియల్ హేమరేజ్ తలనొప్పులు: తల (పుర్రె)లో అంతర్గత రక్తస్రావం కావడం వల్ల వచ్చే తలనొప్పి ఇది. అకస్మాత్తుగా తలనొప్పి వచ్చి శరీరంలోని ఏదైనా అవయవం బలహీనంగా కావడం లేదా చచ్చుబడిపోయినట్లుగా కావడం జరుగుతుంది. ఒక్కోసారి మాట ముద్దముద్దగా రావడం వంటి మార్పులు కనిపించవచ్చు. దీన్ని సీటీ స్కాన్ పరీక్షతో సమస్యను నిర్ధారణ చేయవచ్చు. టెంపోరల్ ఆర్టిరైటిస్: ఇది 60 ఏళ్ల వారిలో కనిపించే తలనొప్పి. ఆ వయసు వారిలో మొదటిసారి కనిపించే తలనొప్పి ఇది. దీనితో పాటు జ్వరం, బరువు తగ్గడం, దవడ నొప్పి, ఏదైనా నములుతున్నప్పుడు నొప్పి పెరగడం, రాత్రిళ్లు నొప్పి ఎక్కువగా ఉండటం, కణతల వద్ద నొక్కినప్పుడు నొప్పి ఎక్కువగా ఉండటం వంటివి ఇందులో లక్షణాలు. రక్తపరీక్ష చేయించినప్పుడు ఈఎస్ఆర్ చాలా ఎక్కువగా ఉంటుంది, టెంపొరల్ ఆర్టరీ బయాప్సీ ద్వారా దీన్ని నిర్ధారణ చేస్తారు. గ్లకోమా హెడేక్: కంటిగుడ్డులో ఒత్తిడి పెరగడం వల్ల వచ్చే తలనొప్పి ఇది. ఇందులో తలనొప్పితో పాటు వికారం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. ఇది నెమ్మదిగా చూపును హరించి వేస్తుంది. కాబట్టి తలనొప్పి కనిపించగానే డాక్టర్‌ను సంప్రదించాలి. ఇవే గాక... సర్వైకల్ నర్వ్స్ ఒత్తిడికి లోనైనప్పుడు, పక్క మీద తలగడ సరిగా లేనప్పుడు కూడా తలనొప్పులు వస్తుంటాయి. ఇలా ఇతరత్రా కారణాలతో వచ్చే తలనొప్పులు చాలా ఎక్కువగానే ఉన్నాయి. సాధారణ నివారణ తరచూ తలనొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించేలోపు ఈ జాగ్రత్తలు తీసుకోండి... ∙కంప్యూటర్ వర్క్ చేసే వారు కంటికి ఒత్తిడి కలగకుండా యాంటీ గ్లేయర్ గ్లాసెస్ ధరించాలి. అలాగే ప్రతి గంటకు ఒకసారి అయిదు నిమిషాల పాటు రిలాక్స్ అవాలి ∙పిల్లల్లో తలనొప్పులు వస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ఐ సైట్ వల్ల తలనొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. తలనొప్పితో పాటు తల తిరగడం, వాంతుల కావడం వంటివి జరిగితే వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించాలి. ∙రోజూ ప్రశాంతంగా కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలపాటు నిద్ర పోవాలి. కొన్ని సందర్భాల్లో నిద్ర మరీ ఎక్కువైనా తలనొప్పి వస్తుంది. కాబట్టి వ్యక్తిగతంగా ఎవరికి సరిపడినంతగా వారు నిద్రపోవడం మంచిది. ∙మనకు సరిపడని పదార్థాలు తీసుకోవడం ఆపేయాలి. ∙ఆల్కహాల్, పొగతాగడం వంటి దురలవాట్లను తప్పనిసరిగా మానేయాలి. 3. క్రేనియల్ న్యూరాల్జియా మన తలలోని పుర్రెను క్రేనియమ్ అంటారు. ఇందులో కీలకమైన 12 నరాలు ఉంటాయి. వీటిని క్రేనియల్ నర్వ్స్ అంటారు. ఇవి ఉద్వేగానికి లేదా ఉద్రిక్తతకు లోను కావడం వల్ల వచ్చే తలనొప్పులను క్రేనియల్ న్యూరాల్జియా అంటారు. న్యూరా.. అంటే నరం అని అర్థం. అలాగే ఆల్జియా అంటే నొప్పి. కాబట్టే తరహా తలనొప్పులను క్రేనియల్ న్యూరాల్జియాగా వ్యవహరిస్తుంటారు. ఆక్సిపెటల్ న్యూరాల్జియా: తీక్షణమైన కాంతిని చూసినప్పుడు తలలోని వెనుక భాగంలో (ఆక్సిపెటల్ అనే ప్రాంతంలో) ఉండే నరాలు ఉద్రిక్తతకు గురై తలనొప్పి రావచ్చు. ఇలా వచ్చే తలనొప్పిని ఆక్సిపెటల్ న్యూరాల్జియా అంటారు. ట్రైజెమినల్ న్యూరాల్జియా : నుదుటి నుంచి చెంప, దవడ వరకు అంటే దాదాపు పూర్తి ముఖానికి వెళ్లే తలనరాలలో ప్రధానమైనది ఈ ట్రైజెమినల్ నర్వ్. ఇది తీవ్రంగా ఉద్రిక్తం చెందినప్పుడు ఏ పదార్థాన్ని కూడా నమలలేనంత / తినలేనంత తీవ్రమైన నొప్పి వస్తుంది. కనీసం మాట్లాడటం కూడా సాధ్యం కాదు. ప్రముఖ బాలివుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇటీవల ఈ నొప్పితో బాధపడ్డాడు. ఈ తరహా తలనొప్పిని ముందుగా మందులతో తగ్గిస్తారు. 95 శాతం కేసుల్లో మందులతోనే తగ్గుతుంది. అయితే మందులతో తగ్గనప్పుడు చిన్న శస్త్రచికిత్స లేదా రేడియో శస్త్రచికిత్స ద్వారా ఈ నొప్పిని శాశ్వతంగా తగ్గించవచ్చు. ఒక ముఖ్య సూచన : కొంతమంది హైబీపీ వల్ల తలనొప్పి వస్తుందని అపోహ పడుతుంటారు. తలనొప్పి రావాలంటే బీపీ 210 / 110 ఉన్నప్పుడు మాత్రమే తలనొప్పి వస్తుంది. అప్పుడే ఇంత హైబీపీ తలనొప్పికి కారణమవుతుంది. డా. బి. చంద్రశేఖర్‌రెడ్డి సీనియర్ న్యూరాలజిస్ట్ సిటీ న్యూరో సెంటర్, హైదరాబాద్ -
తీవ్రమైన తలనొప్పి, నడుమునొప్పి బాధిస్తున్నాయి!
న్యూరో కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను. ఇంట్లో పనులు చేసుకుని, పిల్లలను రెడీ చేసి, నా ఉద్యోగానికి వెళ్తాను. అయితే కొంతకాలం నుంచి నాకు నడుమునొప్పి, తలనొప్పితో పాటు తల తిరుగుతోంది. క్యాబ్‌లో ఆఫీసుకు వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు వాంతులు అవుతున్నాయి. ప్రయాణం వల్ల ఇలా జరుగుతోందేమో అనుకున్నాను. మా ఇంటి దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్లి కొన్ని టాబ్లెట్లు వాడాను. కానీ ఎలాంటి మార్పు లేదు. న్యూరో నిపుణుడిని కలవమని మా స్నేహితులు కొందరు సలహా ఇచ్చారు. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. – ఒక సోదరి, హైదరాబాద్ మీరు చెబుతున్న తలనొప్పి, నడుమునొప్పులకు చాలా కారణాలు ఉంటాయి. ముందుగా తలనొప్పి విషయానికి వస్తే... ఆహారం తినే వేళల్లో మార్పులు ఉన్నా, తినే వేళకు కాకుండా ఆలస్యంగా తింటూ ఉన్నా తలనొప్పి సమస్య తలెత్తుతుంది. అలాగే ఇంట్లో లేదా ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీకు తలనొప్పి ఒకవైపు మాత్రమే వస్తుంటే అది మైగ్రేన్ కావచ్చు. సైనసైటిస్ వల్ల కూడా రావచ్చు. మీకు తలనొప్పి చాలాకాలం నుంచి ఉందా లేదా కొద్దికాలంగానే వస్తుందా అన్న విషయం మీ లేఖలో ప్రస్తావించలేదు. అయితే మీకు రెగ్యులర్‌గా వాంతులు కావడంతో పాటు కళ్లు తిరగడం, ఒళ్లు తూలడం, నీరసం, శరీరం నిస్సత్తువకు లోనుకావడం వంటి లక్షణాలకు గురవుతున్నారా అన్న విషయం ఒకసారి పరిశీలించుకోండి. ఒకవేళ పైన తెలిపిన ఆరోగ్య సమస్యలతో మీరు సతమతమవుతుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయకండి. వెంటనే తగిన పరీక్షలు చేయించుకొని, మీ లక్షణాలకు కారణం ఏమిటో తెలుసుకోవాల్సి ఉంటుంది. మీరు తక్షణం మీకు దగ్గర్లో ఉన్న న్యూనో ఫిజీషియన్‌ను కలవండి. మీ వైద్య పరీక్షల్లో వచ్చిన రిజల్ట్స్‌ను ఆధారంగా మీకు చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇక మీ నడుము నొప్పి విషయానికి వస్తే... ఇంట్లోనే కాకుండా ఆఫీసులో కూడా పనిభారం ఎక్కువగా ఉండటం లేదా గంటల తరబడి ఒకే దగ్గర కదలకుండా, ఒకే భంగిమలో కూర్చొని ఉండటం (అంటే ఒంటి మీద ఒత్తిడి పడకుండా ఉండే ఆఫీస్ ఎర్గనమిక్స్ భంగిమలో కాకుండా తప్పుడు పద్ధతుల్లో కూర్చోవడం) వంటివి జరుగుతున్నప్పుడు నడుము నొప్పి రావచ్చు. దీన్ని నిర్లక్ష్యం చస్తే అది స్పాండిలోసిస్‌గా మారే ప్రమాదం ఉంది. కాబట్టి మీ తలనొప్పి, నడుమునొప్పి విషయంలో వాస్తవ కారణాలన తెలుసుకొని, తగిన చికిత్స తీసుకునేందుకు వెంటనే న్యూరో నిపుణులను కలిసి, తగిన చికిత్స తీసుకొండి. డా‘‘ఎస్. శ్రీకాంత్, న్యూరో సర్జన్, మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్స్ మాదాపూర్, హైదరాబాద్ -
భయం లేదు... సమస్య తగ్గుతుంది!
బాబు వయుస్సు పదకొండేళ్లు. ఈ వయసులో మలవిసర్జన సమయంలో వాడికి ఉన్న సమస్యతో నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఉదయం మలవిసర్జనకు వెళ్లినా సరే... స్కూల్ నుంచి వచ్చాక చూస్తే అండర్వేర్లో కొద్దిగా మల విసర్జన అయి కనిపిస్తుంది. స్కూల్ నుంచి వచ్చాక దుర్వాసన బాగా అనిపిస్తుంటే అప్పుడు నిక్కర్ చూస్తే మలం అంటుకుని కనిపిస్తుంటుంది. మనం చెబితే గానీ నిక్కర్ మార్చడు. ఈ వయసులో వాడికి ఉన్న సమస్యతో నన్ను కుంగదీస్తోంది. మా అబ్బాయి విషయంలో తగిన పరిష్కారం చెప్పండి. - సుమ, నెల్లూరు మీ బాబుకు ఉన్న కండిషన్‌ను ఎంకోప్రెసిస్ అంటారు. ఇది చాలా సాధారణమైన సవుస్య. చాలావుంది బయటకు చెప్పుకోకపోవచ్చు గానీ... దాదాపు 10% వుంది పిల్లల్లో ఈ సవుస్య ఉంటుంది. వుగపిల్లల్లో మరీ ఎక్కువ. ఇది మీ అబ్బారుు కావాలని చేస్తున్నది కాదు. దీర్ఘకాలిక వులబద్ధకం (క్రానిక్ కాన్స్టిపేషన్) వల్ల క్రవుక్రవుంగా బవెల్ మీద నియుంత్రణ పోవడంతో ఇలా జరుగుతుంది. దాంతోపాటు వురికొన్ని అనటామికల్ (హిర్స్ప్రింగ్స్ డిసీజ్, యూనల్ స్ఫింక్టర్ డిస్ఫంక్షన్ వంటి) సవుస్యలు ఉన్నప్పుడు కూడా ఇది ఉంటుంది. పిల్లల్లో ఈ సవుస్యలు ఉన్నాయేమో తెలుసుకోడానికి ఎక్స్‌రే, యూనల్ వ్యూనోమెట్రీ వంటి కొన్ని పరీక్షలు అవసరం. ఏంకోప్రెసిస్ ఉన్న పిల్లలకు సావూజిక, ఉద్వేగభరిత (సోషల్, ఎమోషనల్) సవుస్యలు ఉంటారుు. వాళ్లలో సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గి ఆత్మన్యూనతా భావం పెరుగుతుంది. వాళ్లను వుందలించడం, వివుర్శించడం, తిట్టడం వంటివి చేస్తే సవుస్య వురింత జటిలం అయ్యే అవకాశం ఉంది. అలాంటి పిల్లలకు క్రవుం తప్పకుండా నిర్ణీత వేళల్లో వుల విసర్జనకు వెళ్లడం అలవాటు చేయూలి. అరుుతే ఆ ప్రక్రియులో వాళ్లను వురీ ఒత్తిడి చేయువద్దు. ఆ పిల్లల్లో వులబద్ధకం (కాన్స్టిపేషన్) చాలా ఎక్కువగా ఉండి మలం మలద్వారం వద్ద గట్టిగా ఉండలా వూరితే, అలాంటి పిల్లలను ఆసుపత్రిలో చేర్చి ఎనీవూ ద్వారా అంతా క్లీన్ చేరుుంచాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లలకు రెగ్యులర్ బవెల్ హ్యాబిట్ ట్రైనింగ్ వల్ల ప్రయోజనం ఉంటుంది. దాంతో పాటు పిల్లలు సాఫీగా విసర్జన చేసేలా లాక్సెటివ్స్ ఇవ్వడం వంటివి చేయూలి. నీరు ఎక్కువగా తాగించాలి. ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్నవాటిని ఇవ్వండి. నిరాశ పడాల్సిన అవసరం లేదు. బాబు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య దానంతట అదే తగ్గుతుంది. మైగ్రేన్‌కి మంచి మందులున్నాయి! నా వయసు 28 ఏళ్లు. తరచూ తలనొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించాను. మైగ్రేన్ అని చెప్పారు. మందులు వాడితే తగ్గుతుందని అన్నారు. అయితే మళ్లీ తిరగబెట్టవచ్చని ఆందోళనగా ఉంది. హోమియోలో అయితే శాశ్వత పరిష్కారం ఉందని ఒక స్నేహితురాలు సలహా ఇచ్చింది. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - రవళి, విజయవాడ మైగ్రేన్ అనేది మెదడులో ఉండే రక్తనాళాలకు సంబంధించిన సమస్య. దీనిలో మెదడు చుట్టూ ఉండే రక్తనాళాల పరిమాణం వ్యాకోచించడం వల్ల నరాలపై ఒత్తిడి పడుతుంది. అప్పుడు ఆ నరాల నుంచి రసాయనాలు విడుదల అవుతాయి. వీటివల్ల నొప్పి, వాపు వస్తాయి. రక్తనాళాల పరిమాణం విస్తరించిన కొద్దీ నొప్పి ఎక్కువ అవుతుంది. కారణాలు: మానసిక ఒత్తిడి నిద్రలేమి ఉపవాసం హార్మోన్ల సమస్యలు అధిక వెలుతురు వాసనలు మత్తు పదార్థాలు, పొగాకు, పొగతాగడం, కాఫీ మహిళల్లో బహిష్టు ముందర లక్షణాలు రావచ్చు. లక్షణాలు: తలనొప్పి అధికంగా, తలను ముక్కలు చేస్తున్నట్లుగా ఉండి ఒకవైపు లేదా రెండు వైపులా ఉండవచ్చు నొప్పి సాధారణంగా నుదురు, కళ్ల చుట్టూ, తల వెనక భాగంలో రావచ్చు తలనొప్పి ఒక పక్క నుంచి మరో పక్కకు మారవచ్చు రోజువారీ పనులు చేస్తుంటే నొప్పి ఎక్కువగా ఉంటుంది వికారం, వాంతులు, విరేచనాలు, ముఖం పాలిపోవడం, కాళ్లూచేతులు చల్లబడటం, వెలుతురు తట్టుకోలేకపోవడం, శబ్దం వినకలేకపోవడం వంటి లక్షణాలు తరచూ మైగ్రేన్ నొప్పిలో ఉంటాయి నిద్రలేమి, చిరాకు, నీరసం, ఉత్సాహాన్ని కోల్పోవడం, ఆవలింతలు, తీపి ఇంకా కారపు పదార్థాలను ఎక్కువగా ఇష్టపడటం వంటి లక్షణాలను కూడా గమనించవచ్చు మైగ్రేన్ సమస్యలో తలనొప్పికి ముందు కొన్ని లక్షణాలను గమనించవచ్చు. వీటినే మైగ్రేన్ ఆరా అంటారు. ఆరా లక్షణాలు... కళ్ల ముందు మెరుపులు, ప్రకాశవంతమైన వెలుగులు కనిపించడం. ఈ మెరుపులు మధ్యలో మొదలై చివరలకు వెళ్లినట్లుగా ఉంటాయి. మైగ్రేన్ ఉన్న వారిలో కళ్లు తిరగడం, తలతిరగడం, వస్తువులు రెండుగా కనిపించడం వంటి లక్షణాలు ఉండవచ్చు. కొందరిలో పక్షవాతం వచ్చినట్లుగా ఉండటం, చూపు ఒకవైపు సరిగా కనిపించకపోవడం వంటి లక్షణాలు సైతం ఉంటాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఎక్కువ శబ్దం లేని, వెలుతురు లేని గదిలో విశ్రాంతి తీసుకోవడం తగినంత నిద్ర మద్యం, పొగతాగే అలవాట్లు మానుకోవాలి కొవ్వుపదార్థాలు, మాంసం, పప్పుదినుసులు, తలనొప్పి ఉన్నప్పుడు తగ్గించాలి తగినంత నీరు తాగాలి జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి, రోజూ వ్యాయామం చేయాలి మానసిక ఒత్తిడికి వీలైనంతవరకు దూరంగా ఉండాలి. చికిత్స: ఈ సమస్యకు హోమియోలో సాంగ్వినేరియా, బ్రయోనియా, ఐరస్ వెర్స్, నేట్రమ్మూర్, పల్సటిల్లా, నక్స్ వామికా, సెపియా, లాకెసిస్, స్పైజీలియా వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. చీలమండ బెణికింది.. నొప్పి తగ్గేదెలా? ఆర్నెల్ల క్రితం నా కాలు స్లిప్ అయ్యి, నా చీలమండ బెణికింది (ట్విస్ట్ అయ్యింది). అప్పుడు ప్లాస్టర్ కాస్ట్ వేశారు. కానీ ఇప్పటికీ నాకు ఆ ప్రాంతంలో తరచూ నొప్పి తిరగబెడుతూ ఉంది. చీలమండ వద్ద వాపు, నొప్పి కనిపిస్తున్నాయి. ఇంతకాలం గడిచాక కూడా నొప్పి ఎందుకు వస్తోంది? - సునీత, ఏలూరు మీ కాలు బెణికినప్పుడు చీలమండ వద్ద ఉన్న లిగమెంట్లు గాయపడి (స్ప్రెయిన్ అయి) ఉండవచ్చు. మీరు ప్లాస్టర్ కాస్ట్ వేయించుకున్నానని చెబుతున్నారు. కాబట్టి ఆ సమయంలో మీ లిగమెంట్లు ఉన్న పరిణామం కంటే కాస్త తగ్గి పొట్టిగా మారే అవకాశం ఉంది. పైగా అవి తమ సాగే గుణాన్ని (ఎలాస్టిసిటీని) కోల్పోయి, తాము ఉండాల్సిన స్థానాన్ని తప్పి ఉండవచ్చు. ఆ తర్వాత కాలు ఏ కొద్దిపాటి మడతపడ్డా పాత గాయాలు మళ్లీ రేగి, లిగమెంట్లు మళ్లీ దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. దాంతో నొప్పి, వాపు వస్తాయి. మీరు మీ కాలి చీలమండకు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయిస్తూ, మీ లిగమెంట్లు మళ్లీ మామూలు దశకు వచ్చేలా చేసుకోవాల్సిన అవసరం ఉంది. నా వయసు 25 ఏళ్లు. ఇటీవల జరిగిన ఒక యాక్సిడెంట్లో నేను బైక్‌పైనుంచి కింద పడ్డాను. అప్పట్నుంచి నా మోకాలు కొద్దిగా వాచింది. ఒక్కోసారి ఎంత నొప్పి ఉంటోందంటే దానిపై అస్సలు భారం వేయలేకపోతున్నాను. డాక్టర్గారికి చూపిస్తే ఎక్స్‌రే తీసి ఫ్రాక్చర్ ఏదీ లేదని చెప్పారు. అయినప్పటికీ నొప్పి మాత్రం తగ్గడం లేదు. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - ఆదర్శ్, హైదరాబాద్ ఫ్రాక్చర్ లేనప్పటికీ మీకు బహుశా మోకాలిలో ఉన్న కీలకమైన లిగమెంట్లు చీరుకుపోయి ఉండవచ్చు. ఇలాంటి గాయాలు బైక్ యాక్సిడెంట్లలో చాలా సాధారణంగా జరుగుతుంటాయి. లిగమెంట్లు చీరుకుపోవడం వంటి గాయాలు ఎక్స్-రేలో కనిపించవచ్చు. దీనికోసం ఎమ్మారై స్కాన్ అవసరం. ఇలాంటి గాయాలకు చాలా త్వరగా చికిత్స అందించాలి. ఉద్దేశపూర్వకంగా కాకపోయినా... ఎలాంటి ఫ్రాక్చర్ లేదనే అపోహతో చికిత్స ఆలస్యం చేసినట్లయితే మీలాంటి యువకుల్లో భవిష్యత్తులో అది మరింత సమస్యాత్మకంగా పరిణమించవచ్చు. మీరు వీలైనంత త్వరగా ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించండి. నా వయసు 67 ఏళ్లు. నాకు గత రెండేళ్లుగా మోకాళ్లలో నొప్పి ఉంది. ఇటీవల ఇది చాలా ఎక్కువైంది. ఇప్పుడు నడవడం కూడా కష్టమవుతోంది. తగిన సలహా ఇవ్వండి. - నాగేశ్వరి, గుంటూరు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు ఆస్టియోఆర్థరైటిస్ సమస్య ఉన్నట్లుగా తెలుస్తోంది. వయసు పెరుగుతున్న కొద్దీ సమస్య తీవ్రమవుతూ పోతుంది. ముందుగా మీరు మీ దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి ఎక్స్-రే తీయించుకోండి. ఈ సమస్యకు తొలిదశలో నొప్పి నివారణ మందులు, కాండ్రోప్రొటెక్టివ్ డ్రగ్స్ అనే మందులు వాడతారు. ఫిజియోథెరపీ వ్యాయామాలూ సూచిస్తాం. అప్పటికీ నొప్పి తగ్గకపోతే మోకాళ్ల కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స (టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ) అవసరమవుతుంది. -
ప్రేయసి కౌగిలితో.. తగ్గే తలనొప్పి
బాగా తలనొప్పిగా ఉందా.. తల పగిలిపోతోందా.. వెంటనే పారాసిటమాల్ టాబ్లెట్ ఒకటి వేసుకుంటే తగ్గిపోతుందని ఇన్నాళ్లూ మనకు తెలుసు. కానీ అసలు టాబ్లెట్లతో పని లేకుండానే తలనొప్పి తగ్గే మంచి మార్గం ఒకటి ఉంది తెలుసా.. అదే మంచి కౌగిలి. మనను బాగా ప్రేమించేవాళ్లు ఆప్యాయంగా ఒక్కసారి కౌగలించుకుంటే.. తలనొప్పి, చికాకు అన్నీ ఎక్కడికక్కడే మాయమైపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యక్తుల మధ్య ఉండే బంధాలు, అనుబంధాలు మన నొప్పులను తగ్గించడానికి చాలా ఉపయోగపడతాయని, దీన్నే 'లవ్ ఇన్డ్యూస్డ్ అనల్జేసియా' అంటారని చెబుతున్నారు. అయితే.. ఎవరుపడితే వాళ్లు పట్టుకుంటే మాత్రం ఇలాంటి నొప్పులు తగ్గవట. ఎందుకంటే, వాళ్ల పట్ల మనకు ఎలాంటి ఫీలింగులు ఉండవని చెప్పారు. నొప్పులను మర్చిపోయేలా మెదడుకు సిగ్నల్ పంపాలంటే అవతలివాళ్లు మనల్ని బాగా ప్రేమించేవాళ్లు అయి ఉండాలని తెలిపారు. బ్రిటన్ వాసులు ఇలాంటి తలనొప్పులు వచ్చినప్పుడు మెడికల్ షాపు వద్దకు వెళ్లి నేరుగా కొనుగోలు చేసే మందుల విలువ దాదాపు ఏడాదికి 4071 కోట్ల రూపాయలు ఉంటుందట. అయితే ఇలా మందులు వాడటం వల్ల దుష్ప్రభావాలు ఉంటాయని, ప్రత్యామ్నాయం ఏంటన్న ఆలోచనలు బాగా పెరిగాయి. అందులో భాగంగానే శాస్త్రవేత్తలు ఈ 'కౌగిలి' మందును కనిపెట్టారు. ఇందుకోసం ఇజ్రాయెల్‌లోని హైఫా యూనివర్సిటీ పరిశోధకులు కొందరు వాలంటీర్లను తీసుకుని వాళ్లతో ప్రయోగాలు చేశారు. కొద్దిగా నొప్పి ఉన్నప్పుడు వేర్వేరు వ్యక్తులను ముట్టుకోవడం, తర్వాత వాళ్లు ప్రేమించేవాళ్లతో కౌగిలి ఇప్పించడం లాంటివి చేశారు. అప్పుడే వాళ్లకు నొప్పి నుంచి మంచి ఉపశమనం లభించినట్లు తేలింది. 2011లో అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో కూడా ఇలాంటి పరిశోధన ఒకటి జరిగింది. ప్రేమికుడు లేదా ప్రేయసి ఫొటోవైపు తదేకంగా చూసినా కూడా నొప్పి 44 శాతం తగ్గుతుందని అప్పట్లో చెప్పారు. -
సైనసైటిస్ అంటువ్యాధి కాదు
ఈఎన్టీ కౌన్సెలింగ్ నా వయసు 38 ఏళ్లు. చాలాకాలంగా సైనసైటిస్ సమస్య ఉంది. ఇటీవల నాకు చాలా ఎక్కువగా తలనొప్పి వస్తోంది. ఇది నాకు ఎవరి నుంచైనా వ్యాపించిందేమో అనిపిస్తోంది. ఇది వాస్తవమేనా? నాకు తగిన సలహా ఇవ్వండి. - విజయ్‌కుమార్, నల్లగొండ మీరు చెప్పిన అంశాలను బట్టి మీకు దీర్ఘకాలిక సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తెలుస్తోంది. మీరు, మీ ఫ్రెండ్స్ అనుకుంటున్నట్లుగానే సైనస్ ఇన్ఫెక్షన్ పట్ల మనలో చాలా అపోహలు ఉన్నాయి. వాటి గురించి ఉన్న కొన్ని అపోహలూ, వాస్తవాల గురించి ఒక చిన్న పట్టిక ఇది... అపోహ: సైనసైటిస్‌తో పాటు తలనొప్పి తప్పక వస్తుంటుంది. వాస్తవం: నిజానికి చాలా తక్కువ సందర్భాల్లోనే సైనసైటిస్‌తో పాటు తలనొప్పి వస్తుంటుంది. అయితే చాలామంది సైనసైటిస్ ఉన్నవారికి వచ్చేవారికి మైగ్రేన్ తలనొప్పి తప్పక వస్తుందనుకుంటారు. నిజానికి మైగ్రేన్, టెన్షన్ తలనొప్పి ఈ రెండూ వేరు. సైనస్ సమస్య ఉన్నవారికి తప్పక మైగ్రేన్ వస్తుందనేది ఒక తప్పుడు అభిప్రాయమే. సైనస్ లేకపోయినా మైగ్రేన్ లేదా టెన్షన్ వల్ల వచ్చే తలనొప్పులు కనిపించవచ్చు. అపోహ: సైనస్ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వాస్తవం: నిజానికి సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్నవారికి కలిగే జలుబు వంటి కండిషన్ వల్ల మీకు ఈ అపోహ ఏర్పడి ఉండవచ్చు. కానీ సైనస్ ఇన్ఫెక్షన్ ఎంతమాత్రమూ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే సాంక్రమిక వ్యాధి కాదు. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. అయితే సాధారణ జలుబు (కామన్ కోల్డ్) వైరస్ వల్ల వస్తుంది కాబట్టి ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంటుంది. అపోహ: సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్న ప్రతివారూ తప్పక యాంటీబయాటిక్స్ వాడాలి. వాస్తవం: సైనస్ ఇన్ఫెక్షన్స్ అన్నీ బ్యాక్టీరియా వల్ల కాకపోవచ్చు. కేవలం సైనస్లలో బ్యాక్టీరియా చేరినప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి. ఒకవేళ సైనస్లలో వైరల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే, వాటికి యాంటీబయాటిక్స్ వాడినా ప్రయోజనం ఉండదు. కాబట్టి సైనస్ ఇన్ఫెక్షన్ ఏ రకానికి చెందినది అన్న అంశాన్ని బట్టే మందులూ వాడాల్సి ఉంటుంది. మీది నిర్దిష్టంగా ఏ సమస్య అన్నది కనుగొని, దానికి తగినట్లుగా మందులు తీసుకుంటే, మంచి ఫలితం ఉంటుంది. మీరు వెంటనే ఈఎన్టీ నిపుణులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. - డా॥శ్రీనివాస్ కిశోర్ సీనియర్ ఈఎన్టీ, హెడ్ అండ్ నెక్ సర్జన్, స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
ఎందుకిలా తరచూ తలనొప్పి..?
న్యూరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 33 ఏళ్లు. ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్ ఉద్యోగం చేస్తున్నాను. గత కొన్ని రోజుల నుంచి తీవ్రంగా తలనొప్పి వస్తోంది. క్లాస్‌రూమ్‌లో పిల్లల గోల, పని ఒత్తిడితో తరచూ తలనొప్పి వస్తున్నదేమోనని కుటుంబసభ్యులు అంటున్నారు. ఇంటి దగ్గర డాక్టర్‌ను సంప్రదించి కొన్ని మందులు వాడాను. కొంత ఉపశమనం ఉన్నప్పటికీ మళ్లీ తలనొప్పి తీవ్రంగా వస్తోంది. ఇంత ఎక్కువగా తలనొప్పి రాకూడదని ఒకసారి స్పెషలిస్ట్ డాక్టర్‌ను కలవమని ఫ్రెండ్స్ సలహా ఇస్తున్నారు. అసలు నాకు తలనొప్పి ఎందుకు వస్తోంది? నేనేవరిని సంప్రదించాలి? పరిష్కారం చూపండి. - వీణ, వైజాగ్ తలనొప్పికి చాలా కారణాలు ఉంటాయి. ప్రధానంగా అధిక రక్తపోటు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, రక్తప్రసరణలో మార్పులు, మెదడులో కణుతులు లాంటి అనేక కారణాలతో తలనొప్పి తీవ్రంగా రావచ్చు. మీరనుకుంటున్నట్లు వృత్తిరీత్యా వచ్చే తలనొప్పులు కూడా ఉంటాయి. అయితే మీకు ఒకవైపు తలనొప్పి వస్తోందా లేక రెండువైపులా వస్తోందా అన్నది మీ లేఖలో వివరించలేదు. అలాగే మీకు తలనొప్పి వచ్చినప్పుడు తుమ్ములు రావడం, ముక్కు నుంచి నీరు కారడం లాంటి లక్షణాలు ఉన్నాయా అన్న అంశం కూడా తెలుపలేదు. ఒకవేళ మీరు తలనొప్పితో బాధపడుతున్నప్పుడు పైన తెలిపిన లక్షణాలు కూడా ఉంటే మీకు మైగ్రేన్ ఉన్నట్లు భావించవచ్చు. ఎందుకంటే స్త్రీలతో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మీ ఉద్యోగాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే, పని ఒత్తిడితో మీ తలలోని రక్తనాళాలు ఒత్తిడి గురికావడం వల్ల కూడా మీకీ మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంది. అలాకాకుండా కేవలం తీవ్రమైన తలనొప్పితో తరచూ బాధపడుతుంటే మాత్రం విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. మీరు వెంటనే నిపుణులైన న్యూరాలజీ స్పెషలిస్ట్‌ను కలవండి. మీ తలనొప్పికి కారణాన్ని తెలుసుకోవడానికి రక్తపరీక్ష, సీటీ స్కాన్ లాంటి కొన్ని పరీక్షలు నిర్వహిస్తారు. మీ అసలు కారణాన్ని తెలుసుకొని దాన్ని బట్టి చికిత్స చేస్తారు. ఒకవేళ మీకు మరింకేదైనా క్లిష్టమైన సమస్య ఉన్నా ఇప్పుడు వైద్యరంగంలో వచ్చిన అధునాతనమైన పురోగతి వల్ల మీకు మరింత మెరుగైన చికిత్సలూ అందుబాటులో ఉన్నాయి. మీరు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకుంటూ, మీ జీవనశైలిలో కొన్ని ఆరోగ్యకరమైన మార్పులు చేసుకుంటే మీ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ కుటుంబపరంగా, వృత్తిపరంగా ఏమైనా ఒత్తిళ్లు ఉంటే వాటి నుంచి బయటపడేందుకు తగిన ప్రయత్నాలు చేయండి. డాక్టర్ జి.రాజశేఖర్‌రెడ్డి సీనియర్ న్యూరో ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, సోమాజీగూడ, హైదరాబాద్ బ్రాంకైటిస్ తగ్గుతుందా..? హోమియో కౌన్సెలింగ్ నా వయసు 32 ఏళ్లు. కొంతకాలంగా కఫం, దగ్గుతో బాధపడుతున్నాను. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటోంది. డాక్టర్ సంప్రదిస్తే బ్రాంకైటిస్ అన్నారు. మందులు వాడుతున్నప్పుడు ఉపశమనం ఉంటోంది. హోమియో ద్వారా సంపూర్ణంగా నయం చేసే అవకాశం ఉందా? సలహా ఇవ్వండి. - నిరంజన్, మదనపల్లి శ్వాసనాళాల్లోకి ప్రవేశించి మార్గం ట్రాకియా రెండుగా చీలి ఉంటుంది. వీటిని ‘బ్రాంకై’ అంటారు. ఇవి మళ్లీ అతి సన్నటి భాగాలుగా విభజితమై ఉంటాయి. వీటిని బ్రాంకియోల్స్ అంటారు. ఇవి ఆల్వియోలై అనే అతి సూక్ష్మమైన గాలిగదుల్లోకి ప్రవేశిస్తాయి. ఊపిరితిత్తుల్లోకి చేరే శ్వాసనాళాల లోపలి భాగంలో శ్లేష్మపు పొర ఉంటుంది. ఏ కారణం చేతనైనా వీటిలో వాపునకు గురికావడాన్ని బ్రాంకైటిస్ అంటారు. వారం నుంచి మూడు వారాల పాటు బ్రాంకైటిస్ లక్షణాలు ఉంటే ఆ స్థితిని అక్యూట్ బ్రాంకైటిస్ అని, ఏడాదిలో మూడు నెలల పాటు దగ్గు, తెమడ ఉంటే క్రానిక్ బ్రాంకైటిస్ అని అంటారు. పొగతాగడం, వాతావరణంలో మార్పులు, కాలుష్యం, ఇన్ఫెక్షన్స్ వంటి అనేక కారణాల వల్ల బ్రాంకైటిస్ వస్తుంది. జన్యుసంబంధమైన అంశాలు, సిస్టిక్ ఫైబ్రోసిస్, గుండెజబ్బులు, రోగనిరోధక శక్తి లోపించడం వంటి ఇతర కారణాలతోనూ బ్రాంకైటిస్ వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు : కఫంతో కూడిన దగ్గు; కఫం తెలుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉండి కొన్ని సందర్భాంల్లో రక్తంతో కూడిన తెమడ పడుతుండవచ్చు. ఆయాసం, శ్వాస తీసుకునే సమయంలో పల్లికూతల వంటి శబ్దాలు వినిపించడం; నీరసం, గొంతునొప్పి, కండరాల నొప్పి, ముక్కుదిబ్బడ, తలనొప్పి, దీర్ఘకాలంగా దగ్గు వల్ల ఛాతీనొప్పి, జ్వరం వంటి లక్షణాలనూ గమనించవచ్చు. చికిత్స : అన్ని దశలలోని బ్రాంకైటిస్ సమస్యకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. జెనెటిక్ వైద్య విధానం ద్వారా దీర్ఘకాలికంగా వచ్చే దగ్గు, తెమ వంటి లక్షణాలను తగ్గించడమే గాకుండా శ్వాసనాళంలోని ఇన్ఫ్లమేషన్ లేదా వాపును తగ్గించడం జరుగుతుంది. హోమియో మందుల ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగుపరచి బ్రాంకైటిస్‌ను మళ్లీ రాకుండా చేయడం సాధ్యమవుతుంది. రోగి మానసిక, శారీరక లక్షణాలను మాత్రమే కాకుండా వ్యక్తిగత ఆరోగ్య చరిత్ర, అనువంశీకంగా ఉండే లక్షణాల వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని వైద్యచికిత్స అందించడం ద్వారా కేవలం రోగ లక్షణాలను మాత్రమే కాకుండా వ్యాధిని సంపూర్ణంగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
ఉదయం వేళలో ఎక్కువగా తలనొప్పి..!
న్యూరో కౌన్సెలింగ్ మా బాబు వయసు 12 ఏళ్లు. ఈమధ్య వాడికి ఉదయం పూట తీవ్రమైన తలనొప్పి వస్తోంది. దాంతోపాటు వాంతులు కూడా అవుతున్నాయి. రోజురోజూకూ నొప్పి పెరుగుతోంది. ఇంటి దగ్గర డాక్టర్‌కు సంప్రదిస్తే మందులు రాసిచ్చారు. వాడాము. కానీ ఏమాత్రం తగ్గలేదు. దీంతో స్పెషలిస్ట్‌ను కలిశాం. పిల్లాడికి బ్రెయిన్ ట్యూమర్ ఉందేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మాకు విపరీతమైన బెంగ పట్టుకుంది. బ్రెయిన్ సీటీ చేయించమని సలహా ఇచ్చారు. రిపోర్ట్స్ బట్టి నిర్ధారణకు రాగలమని అంటున్నారు. అసలు బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు వస్తుంది? అది నయం చేయలేని వ్యాధా? ఒకవేళ మా బాబుకు బ్రెయిన్ ట్యూమర్ అని తేలితే వాడి భవిష్యత్తు ఏమిటి? దయచేసి మాకు తగిన సలహా ఇవ్వండి. - జయలక్ష్మి, సోమాజీగూడ మీరు చెబుతున్న లక్షణాలు కొంచెం ఆందోళనకరంగానే ఉన్నాయి. మీరు ఎంతమాత్రమూ ఆలస్యం చేయకుండా బ్రెయిన్ సీటీ తీయించుకని డాక్టర్‌ను కలవండి. ఈమధ్యకాలంలో బ్రెయిన్ ట్యూమర్ అనేది పిల్లల్లో కూడా చలా ఎక్కువగా మనకు కనపడుతోంది. ఈ ట్యూమర్ కణజాలం మెదడులో అసాధారణంగా పెరుగుతూ దాని పనితీరును అడ్డుకుంటుంది. దానివల్ల మెదడుపై ఒత్తిడి పెరిగి అది తలనొప్పి రూపంలో బయటపడుతుంది. క్రమేణా మెదడుపై ఒత్తిడి తీవ్రమవుతున్న కొద్దీ తలనొప్పి భరించలేనంతగా పెరుగుతుంది. అంతేకాకుండా దీనికి వాంతులు కూడా తోడవుతాయి. బ్రెయిన్ ట్యూమర్ బారిన పడ్డవాల్లకు మీరు చెప్పిన లక్షణాలు ఉదయం పూట ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలాంటి సమయంలో వెంటనే డాక్టర్‌ను సంప్రదిస్తే వారు తగిన పరీక్షలు చేయించి, బాబుకు అందించాల్సిన చికిత్స విషయంలో తగిన నిర్ధారణకు రాగలుగుతారు. మీరు ఆందోళన చెందుతున్నట్లుగా బ్రెయిన్ ట్యూమర్ అనేది అంత భయపడాల్సిన వ్యాధి కాదు. కాకపోతే మెదడులో ట్యూమర్ ఉన్న స్థానం, దాని పరిమాణం అనే అంశాలను బట్టి చికిత్స, ఫలితాలు ఉంటాయి. అన్ని ట్యూమర్లూ ప్రాణాంతకమైనవి కావు. క్యాన్సర్ కారకాలు కావు. మీ అబ్బాయికి ట్యూమర్ మొదటి దశలోనే ఉంటే, దానిని సమూలంగా తొలగించవచ్చు. ఇప్పుడు అందుబాటులో ఉన్న అత్యాధునిక బ్రెయిన్ సర్జరీ ప్రక్రియలతో, నిపుణులైన న్యూరో సర్జన్ ఆధ్వర్యంలో శస్త్రచికిత్స జరిగితే మీ బాబుకు వచ్చిన సమస్యనూ పూర్తిగా నయం చేయవచ్చు. మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. - డాక్టర్ పి.రంగనాథమ్ సీనియర్ న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ కిడ్నీ కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. నాకు ఏ విధమైన ఇబ్బందులూ లేవు. కానీ జ్వరం వచ్చినప్పుడు ఒకసారి డాక్టర్‌కు చూపించుకుంటే బీపీ 170 / 120 అని చెప్పి, మందులు వాడాలన్నారు. మందులు వాడకపోతే భవిష్యత్తులో కిడ్నీ సమస్య వచ్చే అవకాశం ఉందా? - రవిందర్, పాల్వంచ ఈ వయసులో ఏ కారణం లేకుండా బీపీ రావడం చాలా అరుదు. ముఫ్ఫై ఏళ్లలోపు బీపీ ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు కిడ్నీ సమస్య ఏమైనా ఉందేమోనని చూడాలి. మీరు ముందుగా యూరిన్ టెస్ట్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్, క్రియాటినిన్‌తో పాటు కొన్ని ఇతర పరీక్షలు చేయించుకోండి. ఏ లక్షణాలూ లేనప్పటికీ బీపీ నియంత్రణలో ఉండటానికి మందులు వాడాలి. లేకపోతే భవిష్యత్తులో కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంది. మందులు వాడటమే కాకుండా, ఆహారంలో ఉప్పు తగ్గించడం వంటి జీవనశైలికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా ఒక గంటకు తగ్గకుండా వాకింగ్ చేయాలి. బరువు ఎక్కువగా ఉన్నట్లయితే, మీ ఎత్తుకు తగినట్లుగా దాన్ని నియంత్రించుకోవాలి. పొగతాగే అలవాటు ఉంటే తప్పనిసరిగా మానేయాలి. నా వయసు 32 ఏళ్లు. గత ఐదేళ్ల నుంచి అప్పుడప్పుడు మూత్రం ఎర్రగా వస్తోంది. ప్రతిసారి రెండు మూడు రోజుల తర్వాత తగ్గిపోతోంది. నొప్పి ఏమీ లేదు. ఇలా రావడం వల్ల భవిష్యత్తులో నాకు ఏదైనా సమస్య వస్తుందా? ఈ లక్షణాలు కనిపిస్తున్నాయంటే కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా? - అప్పారావు, నరసన్నపేట మీరు చెప్పినట్లుగా మూత్రంలో చాలాసార్లు రక్తం పోతూ ఉంటే, ఏ కారణం వల్ల అలా జరుగుతోందన్న విషయాన్ని తెలుసుకుని, దానికి అనుగుణంగా చికిత్స తీసుకోవాలి. ఇలా జరగడానికి కిడ్నీలో రాళ్లు గానీ, ఇన్ఫెక్షన్ గానీ, లేదా కిడ్నీ సమస్యగానీ ఉండటం కారణం కావచ్చు. ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్‌తో పాటు మూత్రపరీక్ష చేయించుకోండి. కిడ్నీలో రాళ్లుగానీ, ఇన్ఫెక్షన్గానీ లేకుండా ఇలా రక్తం పోతూ ఉంటే మూత్రంలో ప్రోటీన్ పోతుందేమో అని పరీక్ష చేయించుకోవాలి. రక్తంతో పాటు ప్రోటీన్లు కూడా మూత్రంతో పాటు పోతూ ఉంటే, కిడ్నీ బయాప్సీ చేయించుకొని, ఆ రిపోర్టులను బట్టి కిడ్నీలు దెబ్బతినకుండా మందులు వాడాల్సి ఉంటుంది. - డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ పల్మునాలజీ కౌన్సెలింగ్ మా అబ్బాయి వయసు 12 ఏళ్లు. అతడు ఎప్పుడూ పొడి దగ్గుతో బాధపడుతున్నాడు. గత రెండు నెలలుగా కొద్దిపాటి జ్వరం ఉంటోంది. వాడికి శ్వాస సరిగా ఆడటం లేదు. మాకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడినా సమస్య తగ్గడం లేదు. మావాడి సమస్యకు పరిష్కారం చెప్పండి. - సీతారామయ్య, కొత్తగూడెం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ అబ్బాయి కాఫ్ వేరియంట్ ఆస్తమాతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఇది ఆస్తమాలోనే ఒక రకం. ఇది వచ్చిన వారిలో తెమడ వంటివి పడకుండా పొడిదగ్గు వస్తూ ఉంటుంది. పిల్లికూతలు లాంటి లక్షణాలు కూడా మొదట్లో ఉండవు. దీన్నే ‘క్రానిక్ కాఫ్’ (దీర్ఘకాలిక దగ్గు) అని కూడా అంటారు. రాత్రీ పగలూ తేడా లేకుండా దాదాపు రెండు నెలలపాటు దగ్గుతుంటారు. దాంతో రాత్రివేళ నిద్ర కూడా పట్టదు. ఈ రోగులు తమకు సరిపడని ఘాటైన వాసనలు, దుమ్ము, ధూళి వంటి వాటికి ఎక్స్పోజ్ అయితే ఆ అలర్జెన్స్ ఆస్తమాను మరింతగా ప్రేరేపిస్తాయి. కాఫ్ వేరియెంట్ ఆస్తమా సమస్య ఎవరికైనా, ఏ వయసులోనైనా రావచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇది ఎక్కువ. ఇది ఆ తర్వాత సాధారణ ఆస్తమాకు దారితీస్తుంది. అంటే శ్వాస అందకపోవడం, పిల్లికూతలు వంటి లక్షణాలు తర్వాతి దశలో కనిపిస్తాయి. సాధారణ ఆస్తమా లాగే కాఫ్ వేరియెంట్ ఆస్తమాకు కూడా కారణాలు అంతగా తెలియవు. కాకపోతే సరిపడని పదార్థాలు, చల్లగాలి దీనికి కారణాలుగా భావిస్తుంటారు. కొందరిలో అధిక రక్తపోటు, గుండెజబ్బులు, హార్ట్‌ఫెయిల్యూర్, మైగ్రేన్, గుండెదడ (పాల్పిటేషన్స్) వంటి జబ్బులకు వాడే మందులైన బీటా-బ్లాకర్స్ తీసుకున్న తర్వాత ‘కాఫ్ వేరియెంట్ ఆస్తమా’ మొదలు కావచ్చు. కొందరిలో గ్లకోమా వంటి కంటిజబ్బులకు వాడే చుక్కల మందులోనూ బీటా బ్లాకర్స్ ఉండి, అవి కూడా ఆస్తమాను ప్రేరేపిస్తాయని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. కొందరిలో ఆస్పిరిన్ సరిపడకపోవడం వల్ల కూడా దగ్గుతో కూడిన ఆస్తమా రావచ్చు. కాఫ్ వేరియెంట్ ఆస్తమాలో కేవలం దగ్గు తప్ప ఇతర లక్షణాలేమీ కనిపించకపోవడం వల్ల దీని నిర్ధారణ ఒకింత కష్టమే. ఎందుకంటే కాఫ్ వేరియెంట్ ఆస్తమా విషయంలో సాధారణ పరీక్షలైన ఛాతీఎక్స్‌రే, స్పైరోమెట్రీ వంటి పరీక్షలూ నార్మల్‌గానే ఉంటాయి. మీరు వెంటనే మీకు దగ్గర్లో ఉన్న ఛాతీ నిపుణుడిని కలవండి. వారు కొన్ని వైద్య పరీక్షలు చేయించి, వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత తగిన చికిత్స సూచిస్తారు. - డా. రమణ ప్రసాద్ ..కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ మా చిరునామా: వైద్యసలహా కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్- 34. ఈ మెయిల్: asksakshidoctor@gmail.com నిర్వహణ: యాసీన్