
సబ్జా గింజల గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వేసవి రాగానే పొద్దున్నే కాసిని సబ్జా గింజలను చెంబెడు నీళ్లులో నానబెట్టుకుని, మధ్యాన్నం కాగానే, ఆ నీటిలో కాస్త పంచదార కలుపుకుని తాగడం ఇంచుమించు అందరికీ అనుభవమే. వేసవి ఎండలు ముదురుతున్నాయి కాబట్టి సబ్జాగింజలను, వాటి ఉపయోగాలనూ మరోసారి గుర్తు చేసుకుందాం.
►సబ్జాగింజలకు కాస్త తడి తగిలితే చాలు, దానిని పీల్చుకుని అవి ఉబ్బిపోతాయి. దీంతో వాటి బరువు పదింతలు పెరిగిపోతుంది.. అందుకే వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే త్వరగా కడుపునిండిన భావన కలుగుతుంది. దాంతో అప్రయత్నంగానే తక్కువ తింటాం.
►సబ్జా గింజల్లో ఔషధగుణాలెన్నో ఉన్నాయి. వాటితోపాటు శరీర ఉష్ణోగ్రతను తగ్గించి మల, మూత్ర సమస్యల్ని నివారించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.
►వంటిమీద ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ గింజల్ని నూరి కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెతో కలిపి గాయాలు, పుండ్లపై రాసుకుంటే సరి, పుళ్లు తొందరగా తగ్గుతాయి. గాయాలు తొందరగా మానుతాయి.
►తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఈ గింజల్ని నీళ్లలో కలుపుకొని అవి ఉబ్బిన తర్వాత తాగి చూడండి, సమస్య తగ్గిపోవడమే కాదు.. మానసిక ప్రశాంతత కూడా మీ సొంతమవుతుంది.
►రక్తాన్ని శుద్ధి చేయడంలో, శరీరంలోని మలినాలను తొలగించడంలోనూ దీని తరువాతే ఏదైనా..!
►శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు గ్లాసుడు గోరువెచ్చని నీటిలో అల్లం రసం, తేనె, నానబెట్టిన సబ్జా గింజలనూ కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యసమస్యలు తగ్గుముఖం పట్టడంతోపాటు శ్వాస బాగా ఆడుతుంది.
►ఆటలు ఎక్కువగా ఆడటం వల్ల క్రీడాకారులకు శరీరంలో నీటిశాతం తగ్గి బాగా నీరసించిపోతారు. అలాంటప్పుడు రోజూ సబ్జా గింజలను తీసుకుంటే శరీరంలో తేమను పోనీయకుండా నిలిపి ఉంచుతాయి.
►గొంతులో మంట, ఆస్తమా, తీవ్రమైన జ్వరం, తలనొప్పి.. లాంటి సమస్యలతో బాధపడేటప్పుడు కాసిని సబ్జా గింజల్ని నీళ్లలో నానబెట్టి నేరుగా తినేస్తే సరి.. ఎలాంటి చిరాకునైనా ఇట్టే తగ్గిస్తాయి.
►వీటిలో ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్లు సాల్మన్ చేపల్లో కంటే ఎక్కువగా ఉంటాయి. ఈ ఒమేగా–3 ఆమ్లాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్, హృదయ సంబంధిత సమస్యలు రావు.
►బ్యాక్టీరియా సంబంధిత సమస్యలని నివారించే మంచి యాంటీబయోటిక్‌లా కూడా పనిచేస్తాయి ఈ గింజలు.
►మజ్జిగ, కొబ్బరినీళ్లు, ఇతర పండ్ల రసాలతో కలిపి కూడా ఈ గింజల్ని కలిపి తీసుకోవచ్చు.
►ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఈ గింజలను ఒక గ్లాసు నీటిలో వేసుకుని తాగితే మంచి ఫలితముంటుంది.
మహిళలకు తప్పకుండా కావాల్సిన ఫోలేట్‌తో పాటు అందాన్ని ఇనుమడింపచేసే విటమిన్ ‘ఇ’ కూడా ఇందులో లభిస్తుంది.. కాసిని సబ్జా గింజలు తీసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టి ఇంతవరకూ తీసుకోనివారు ఇప్పటినుంచి సబ్జాగింజలను నానబెట్టి తాగడం అలవాటు చేసుకోవడం మంచిది కదా!
Comments
Please login to add a commentAdd a comment