తలనొప్పి వేధిస్తోందా?..నివారించవచ్చు ఇలా.. | Doctor Advice To Revent Severe Headache | Sakshi
Sakshi News home page

తలనొప్పి వేధిస్తోందా?..నివారించవచ్చు ఇలా..

Published Sat, Feb 12 2022 10:44 PM | Last Updated on Sat, Feb 12 2022 10:45 PM

Doctor Advice To Revent Severe Headache - Sakshi

వెర్రి వేయి విధాలు అన్నట్లు తలనొప్పుల్లో 200కి పైగా రకాలున్నాయట. వీటిలో వెంటనే తగ్గిపోయే సాధారణ తలనొప్పులతోబాటు కొన్ని ప్రాణాంతకమైన తలనొప్పులూ ఉన్నాయి. తల, మెడ భాగాల్లోని తొమ్మిది సున్నితమైన ప్రాంతాలు లేదా తలలోని రక్త నాళాలు ఒత్తిడికి లోనుకావడం లేదా వాపు వల్ల తలనొప్పి వస్తుందని వైద్యులు చెబుతారు. అయితే, తరచు తలనొప్పి వస్తున్నట్లయితే దానిని నిర్లక్ష్యం చేయకూడదు. తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే.. తలనొప్పి ఎన్నో రకాల సమస్యలతో ముడిపడి ఉంటుంది కాబట్టి.

ఏ తలనొప్పో ఎలా గుర్తించాలి..?
∙తలనొప్పి ఓ వైపు మాత్రమే ఉంటే అది ‘మైగ్రేన్‌’. ఎక్కువ ఎండలో నిల్చున్నా లేదా పెద్ద శబ్దం విన్నా ఈ తరహా తల నొప్పి ఎక్కువ అవుతుంది. ∙తల లోపల ఎక్కువ ఒత్తిడి అనిపించినా, తల చుట్టూ ఏదో చుట్టేసినట్టుగా అనిపించినా అది మానసిక ఒత్తిడి వల్ల వచ్చినట్టే. సహజంగా ఇది ప్రమాదకరమైన తలనొప్పి కాదని భావించవచ్చు. ∙నుదుటి వెనుక, కళ్ల మధ్య, కంటి దిగువన, తల వెనుక నొప్పి వస్తే అది సైనస్‌ తల నొప్పి. సాధారణంగా సైనస్‌ తల నొప్పులు దీర్ఘకాలంగా ఉంటాయి. ∙తలనొప్పితోపాటు కళ్లు ఎర్రబడడం, వాయడం, కళ్ల నుంచి నీళ్లు రావడం వంటివి జరిగితే అది ‘క్లస్టర్‌ తల నొప్పి’. ∙కొన్నిరకాల ఆహార పదార్థాలు తీసుకున్నా లేదా కొన్ని రకాల వాసనలు పీల్చినా తలనొప్పి వస్తే అది ‘అలెర్జీ తల నొప్పి’. ∙జెనెటిక్‌ కారణాలతోపాటు, పరిసరాలూ వాతావరణ పరిస్థితులూ కూడా తలనొప్పికి కారణం కావచ్చు.  

వయసు, జాతి, వర్గ, వర్ణ లింగ భేదం లేకుండా అందరినీ పట్టి పీడించే అతి సాధారణ  సమస్య తలనొప్పి. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో దీనిబారిన పడకుండా వుండరు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం ప్రపంచ జనాభాలో సగం మంది కనీసం సంవత్సరానికొకసారయినా తలనొప్పితో బాధపడుతూ వుంటారంటే, తలనొప్పి ఎంత సాధారణ సమస్యో అర్థం అవుతుంది. అలాగని కేవలం సాధారణ సమస్యగా కూడా దీనిని తీసిపారేయడానికి వీలు లేదు. తలనొప్పికి సాధారణమైన, ప్రమాదంలేని కారణాలతోబాటు అసాధారణమైన, ప్రమాదకరమైన జబ్బులు కూడా కారణం కావచ్చు. తలనొప్పి రకరకాల కారణాల వల్ల వస్తుంది. ముందు కారణాలు తెలుసుకోవాలి. తర్వాత అది సాధారణ సమస్యా, అసాధారణ సమస్యా అన్నది నిర్ధారించుకుంటే, దాని నివారణోపాయాలు తెలుసుకోవచ్చు. తలనొప్పి గురించి, దానికి ఉపశమన చర్యల గురించి చెప్పుకుందాం...

సాధారణ తలనొప్పుల నుంచి ఉపశమనం కోసం...
∙ఒక గ్లాసు వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే తలనొప్పి తగ్గుతుంది. ∙గోరు వెచ్చని ఆవుపాలు సైతం తలనొప్పి నివారణిగా పనిచేస్తుందట. ∙తలనొప్పిని తగ్గించడంలో యూకలిప్టస్‌ ఆయిల్‌ బాగా పనిచేస్తుంది. ∙కప్పు పాలలో కొద్దిగా రాతి ఉప్పును కలిపి ఆ పాలు తాగితే తలనొప్పి తగ్గుతుంది. ∙మంచి గంధపు చెక్క ఉంటే, దానిని సాన మీద అరగతీసి నుదుటి మీద పట్టు వేసుకుంటే కొద్దిసేపటిలోనే తలనొప్పి మాయమవుతుంది. గంధపు చెక్క, సాన లేకపోతే ఇంటిలో రెడీగా ఉన్న చందనం పొడిని పేస్టులా చేసుకుని నుదుటికి, కణతల మీద పట్టు వేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. ∙చిన్న అల్లం ముక్క, యాలకులు దంచి వేసిన టీ లేదా కొద్దిగా స్ట్రాంగ్‌ కాఫీని తాగడం  ∙చిన్న అల్లం ముక్కను పై పొట్టు తీసి దానిని మెల్లగా నమిలినా తలనొప్పి తగ్గుతుంది.

∙డార్క్‌ చాకొలేట్‌ లేదా మామూలు చాకొలేట్‌ చప్పరించినా తలనొప్పి ఉపశమిస్తుంది. ∙వెలుతురు తక్కువగా... ఏకాంతంగా ఉండే గదిలో కాసేపు విశ్రాంతి తీసుకోవడం కూడా సత్ఫలితాలనిస్తుంది. ∙కొద్దిగా వెల్లుల్లిని తీసుకుని నీటితో కలిపి పేస్టులా చేయండి. ఆ మిశ్రమాన్ని ఒక టేబుల్‌ స్పూన్‌ తీసుకుంటే చాలు తలనొప్పి తగ్గుతుంది. ∙తలనొప్పిని తగ్గించడంలో కొబ్బరి నూనె చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని కాస్త మాడు మీద వేసుకుని మర్దనా చేసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ∙విటమిన్‌–ఇ, ఈ, బి 12, కాల్షియం ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. తలనొప్పిగా ఉన్నప్పుడు మసాలా ఫుడ్‌ను అస్సలు తీసుకోవద్దు. ∙మంచి నిద్ర, వ్యాయామం తలనొప్పిని దరిచేరకుండా చూడడంలో కీలకపాత్ర వహిస్తాయి. 

తలనొప్పి తెప్పించే ఆహారం...
∙కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల తల నొప్పి రావడమో లేదా తల నొప్పి ఎక్కువవడమో జరగొచ్చని అంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా.. కొంతమందికి ఆర్టిఫిషియల్‌ స్వీటెనర్స్, చాక్లెట్స్, కెఫిన్, ఫ్రాసెస్డ్‌ ఫుడ్, ప్యాకేజ్డ్‌ ఫుడ్, ఐస్‌ క్రీమ్స్‌ వంటివి కొంత మందిలో తల నొప్పికి కారణమవుతుంటాయి.

తలనొప్పి తగ్గించే ఆహారం...
∙జీడిపప్పు, పిస్తా, బాదం పప్పులు వంటివి పెయిన్‌ కిల్లర్స్‌గా పని చేస్తాయి. తల నొప్పిని తగ్గిస్తాయి. ∙మైగ్రేన్‌తో బాధపడేవారు క్రమం తప్పకుండా పుదీనా తీసుకుంటే మంచిది. అల్లంలో కూడా మైగ్రేన్‌ తల నొప్పిని తగ్గించే లక్షణం ఉంది.∙చెర్రీస్‌ తింటే తల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇది పనిభారం ఎక్కువ కావడం వల్ల వచ్చే తలనొప్పి విషయంలో బాగా పని చేస్తుంది. ∙కొన్నిసార్లు డీహైడ్రేషన్‌ వల్ల కూడా తల నొప్పులు వస్తాయి. అందుకే నీటి శాతం ఎక్కువగా ఉండే కీరా దోస వంటివి ఆహారంలో చేర్చుకుంటే మంచిది. ∙అరటి పండ్లు, కొద్ది మొత్తంలో కాఫీ, బ్రకోలీ, పాలకూర వంటివి తలనొప్పిని నివారిస్తాయి. కొన్ని రకాల ఆసనాల వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా తల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. 

∙ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే సంరక్షణగా క్యాప్‌ పెట్టుకుంటే మంచిది. ∙తల స్నానం చేసిన వెంటనే పూర్తిగా ఆరబెట్టకపోతే తల నొప్పి వచ్చే అవకాశాలెక్కువ. అందుకే స్నానం చేసిన తర్వాత కచ్చితంగా హెయిర్‌ డ్రైర్‌తో లేదా ఫ్యాన్‌ కింద కూర్చుని కురులను ఆరబెట్టుకోవాలి. ∙కంప్యూటర్‌ను చూస్తూ వర్క్‌ చేసే వారికి తరచూ తల నొప్పి వస్తుంటుంది. అందుకే మధ్య మధ్యలో పనికి విరామం ఇవ్వాలి. స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌ని తక్కువగా పెట్టుకోవాలి. ∙కంటి నిండా నిద్ర లేకపోతే తల నొప్పి ఖాయం. అందుకే.. రోజుకు కనీసం 8 గంటల నిద్ర ఉండాలి.

ఇతర సమస్యల వల్ల వచ్చే తలనొప్పి
∙నేత్ర వ్యాధుల వల్ల దృష్టి దోషాలూ, ట్యూమర్లూ, అక్యూట్‌ కంజెస్టివ్‌ గ్లాకోమా ∙చెవిలో గుల్లలూ, వాపులూ, చీముగడ్డలు ∙‘సైనసైటిస్‌ ‘లో వచ్చే ‘సైనస్‌ హెడేక్‌’ నుదురు దగ్గర,ముక్కు మొదట, దవడ ఎముకల దగ్గర నొప్పి అనిపిస్తుంది, ముందుకు వంగినా దగ్గినా తుమ్మినా ఎక్కువ అవుతుంది. ∙జీర్ణాశయ సమస్య లు, వాంతులు, విరేచనాలు, హై బీపీ. ∙బ్రెయిన్‌ ట్యూమర్, ఇతర కాన్సర్లలో తలనొప్పినే ప్రధాన లక్షణంగా గుర్తిస్తారు. ∙చిన్న పిల్లలలో అంటే 10–20 మధ్య వయసు వారిలో మెదడు లో చేరిన పురుగుల గుడ్లు తలనొప్పికీ, ఫిట్స్‌కీ కారణం కావచ్చు. ∙మెనింజైటిస్, ఎన్‌ సెఫలైటిస్‌ వీటిలో తీవ్రమైన తలనొప్పి వుంటుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement