స్పైన్‌ బాగుంటేనే విన్‌... | Doctor Advice On Back Bone Pain Problems | Sakshi
Sakshi News home page

స్పైన్‌ బాగుంటేనే విన్‌...

Published Thu, Oct 21 2021 9:40 PM | Last Updated on Thu, Oct 21 2021 9:44 PM

Doctor Advice On Back Bone Pain Problems - Sakshi

ఇటీవలి కాలంలో బ్యాక్‌ ప్రాబ్లెమ్స్‌ లేదా వెన్నెముక సంబంధ సమస్యలు బాగా పెరిగాయి. మరీ ముఖ్యంగా కరోనా సమయంలో లాక్డవున్‌ కారణంగా అత్యధిక సమయం ఇంట్లోనే ఉండడం, టీవీ లేదా కంప్యూటర్‌ల ముందు అధిక సమయం గడపడం వంటివి వెన్నుముక సమస్యలను మరింతగా పెంచాయి. అప్పటికే శారీరక శ్రమ లేక స్పైన్‌ బాధితులు పెరుగుతున్న క్రమంలో కరోనా తర్వాత  వయసులకు అతీతంగా ఈ సమస్య విజృంభిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో  డా.రావ్స్‌ హాస్పిటల్‌(గుంటూరు)కు చెందిన న్యూరోసర్జన్‌ డా.మోహనరావు పాటిబండ్ల దీనికి సంబంధించి పలు విశేషాలను, సూచనలను అందించారు. 

స్పైన్‌ లేదా వెన్నెముక అనేది మన శరీరపు భంగిమకు, అవయవాల సమన్వయానికి మన రోజువారీ కార్యకలాపాలకు అత్యవసరమైన మద్ధతును అందిస్తుంది. చాలా వరకూ వెన్నెముక సంబంధ సమస్యలు పెరిగితే అవి కదలికల్ని నిరోధిస్తూ రోజువారీ కార్యకలాపాలను క్లిష్టతరం చేస్తాయి. కాబట్టి...  వెన్నెముక ఆరోగ్యం సవ్యంగా ఉండేలా చేసే ఆరోగ్యకరమైన అలవాట్లు పై అవగాహన పెంచుకుంటూ  జాగ్రత్తపడాలి.

ఆరోగ్యకరమైన బరువు కొనసాగించడం, శారీరక చురుకుదనం లోపించకుండా చూసుకోవడం, వ్యాయామాలు, శరీరాన్ని సాగదీసే స్ట్రెచ్‌ ఎక్సర్‌సైజ్‌లు, సరైన విధంగా వంగిలేచే మెళకువలు, బరువులు ఎత్తడం... వీటన్నింటితో పాటు తగినంత విశ్రాంతి కూడా తప్పనిసరి.

గత 2–3 దశాబ్ధాల క్రితం ఎటువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలూ, పరికరాలూ అందుబాటులో లేవు. అందువల్ల అప్పట్లో శస్త్ర చికిత్సల నుంచి సరైన ఫలితాలు రాలేదు. 
అయితే ఇప్పటికీ స్పైన్‌ సంబంధ వ్యాధులపైనా చికిత్సలపైనా ముఖ్యంగా శస్త్ర చికిత్సలపై కూడా రోగుల్లో చాలా అపోహలున్నాయి. వాటిని ముందుగా తొలగించుకోవాలి. 

ఇప్పుడు వెన్నెముక సంబంధ సమస్యల గురించి వైద్యరంగం మరింత చక్కగా అర్ధం చేసుకోవడం జరిగింది. తద్వారా మరింత చక్కని  చికిత్స వీలవుతుంది.

సంప్రదాయ పద్ధతిలో కొన్నింటికి చికిత్స సరిపోతుంటే కొన్నింటికి మాత్రం తప్పనిసరిగా శస్త్ర చికిత్స చేయవలసి రావచ్చునని గుర్తించాలి. 

వెన్నెముక చికిత్సల్లో అత్యాధునిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం వల్ల మరింత మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. 

మినిమల్లీ ఇన్వాసివ్‌ స్పైన్‌ సర్జరీ (ఎమ్‌ఐఎస్‌ఎస్‌)... అనేది ఈ రంగంలో ఒక కీలక మైలురాయి. ఈ శస్త్ర చికిత్సలో ఒక ట్యూబ్యులర్‌ రిట్రాక్టర్‌ సహాయంతో స్పైన్‌లోని సమస్యాత్మక ప్రాంతాన్ని చేరుకుంటారు. మైక్రోస్కోప్, ఎండోస్కోప్‌ వంటివి ఉపయోగిస్తారు. ల్యూంబర్‌ డిసెక్టమీ, ల్యామినెక్టొమీ, స్పైనల్‌ ఫ్యూజన్‌ వంటి కొన్ని రకాల వెన్నుముక చికిత్సల్లో దీన్ని ఉపయోగించవచ్చు 

ఇందులో చర్మాన్ని అతి స్వల్పంగా మాత్రమే కోత పెట్టడం ద్వారా శస్త్ర చికిత్స చేయడం జరగుతుంది. అంతేకాకుండా అతి తక్కువ రోజులు మాత్రమే ఆసుపత్రిలో ఉండేందుకు,  చికిత్సానంతరం తక్కువ నొప్పి, గాయం త్వరగా మానడం... వంటివి సాధ్యమవుతాయి.

–డా.మోహన్‌రావు పాటిబండ్ల, న్యూరో సర్జన్‌
డా.రావ్స్‌ హాస్పిటల్‌


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement