కరోలినా రాపర్.. ఎంతటివారినైనా ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించగల ఘనాపాటి.. ఎవరబ్బా ఈ కరోలినా అనుకుంటున్నారా.. మీరనకుంటున్నట్లు కరోలినా మనిషి కాదు.. ఒక మిరపకాయ. బ్యాడ్మింటన్‌లో ఆ కరోలినా మారిన్ రికార్డులు సృష్టిస్తే.. ఈ కరోలినా రాపర్ ప్రపంచంలోనే అతి ఘాటైన మిరపకాయగా గిన్నిస్ బుక్ రికార్డుకెక్కింది. స్పైసీ ఫుడ్ లవర్స్ పోటీ పెట్టుకుని మరీ వీటిని లాగించేస్తుంటారు. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అంటారు కదా. న్యూయార్క్‌కు చెందిన యువకుడి విషయంలోనూ ఇదే జరిగింది. పోటీలో భాగంగా ఒకే ఒక కరోలినా రాపర్‌ని తిన్నాడు 34 ఏళ్ల యువకుడు. అంతే ఒక్క నిమిషంలోనే తీవ్రమైన తలనొప్పితో కుప్పకూలాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు పోటీ నిర్వాహకులు.
తలనొప్పితో పాటు మెడ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. క్రమంగా ధమనులు కూడా అస్తిరపడటంతో వైద్యులు అతడి మెదడును స్కాన్ చేశారు. మిరపకాయ తినడం వల్లే రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడినట్లు గుర్తించారు. ఐదువారాల పాటు చికిత్స పొందిన అనంతరం అతడి ఆరోగ్యం కుదుటపడింది. పోటీలో గెలవలేకపోయిన ఆ యువకుడు.. కరోలినా రాపర్ తిని ఆస్పత్రిపాలైన మొదటి వ్యక్తిగా రికార్డుకెక్కాడు.
కారం ఎక్కువగా తింటే ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతాయని.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని బీఎంజే జర్నల్ తన నివేదికలో పేర్కొంది. ఒక్క కరోలినా రాపర్ 1.5 మిలియన్ల స్వావిల్లే హీట్ స్కేల్(ఘాటును కొలిచే ప్రమాణాలు) కలిగి ఉంటుందని పరిశోధనలో తేలింది. ఇంత ఘాటైన మిరపకాయల వలన రివర్సబుల్ సెరెబ్రల్ వాసొకన్సిట్రిక్షన్ సిండ్రోమ్ (తీవ్రమైన తలనొప్పి) అనే వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment