Carolina Reaper
-
నీ పిచ్చి పాడుగాను.. బతుకుదామనేనా!
కెనడా: ఎంత కారం ఇష్టపడేవారైనా మోతాదుకు మించి నోటికి కారం తగిలితే అబ్బా..మంట మంట అని అరుస్తారు. అటువంటిది కెనడాకు చెందిన మైక్ జాక్ ప్రపచంలోనే అత్యంత కారం కలిగిన ‘కరోలినా రీపర్’ మిరపకాయలను మూడింటిని అవలీలగా తినేసి ఔరా అనిపించాడు. రీపర్ మిరపకాయ చిన్న ముక్క తినాలన్నా చాలా మంది భయపడుతుంటారు. మైక్ మాత్రం 10 సెకన్లలో మూడు మిరపకాయలు నమిలి మింగేసాడు. దీంతో ఇప్పటివరకు గిన్నిస్ వర్ల్డ్ రికార్డ్స్‌లో ఉన్న రికార్డులను అధిగమించి కొత్త రికార్డును నెలకొల్పాడు. ఒక్కో మిరపకాయ దాదాపు 5 గ్రాముల బరువు ఉంటుంది. ఆరేళ్ల తర్వాత అత్యంత కారంతో కూడిన మిరప కాయ తిని మైక్ రికార్డు బద్దలు కొట్టాడని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకటించింది. అయితే మైక్ భవిష్యత్తులో 8 రీపర్ మిరపకాయలు తిని రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ ఇతడి స్టంట్ చూసిన జనాలు.. నీ పిచ్చి పాడుగాను.. బతుకుదామనేనా అంటూ కామెంట్ చేస్తున్నారు. -
కరోలినా.. చాలా డేంజర్ గురూ..
కరోలినా రాపర్.. ఎంతటివారినైనా ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించగల ఘనాపాటి.. ఎవరబ్బా ఈ కరోలినా అనుకుంటున్నారా.. మీరనకుంటున్నట్లు కరోలినా మనిషి కాదు.. ఒక మిరపకాయ. బ్యాడ్మింటన్‌లో ఆ కరోలినా మారిన్ రికార్డులు సృష్టిస్తే.. ఈ కరోలినా రాపర్ ప్రపంచంలోనే అతి ఘాటైన మిరపకాయగా గిన్నిస్ బుక్ రికార్డుకెక్కింది. స్పైసీ ఫుడ్ లవర్స్ పోటీ పెట్టుకుని మరీ వీటిని లాగించేస్తుంటారు. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అంటారు కదా. న్యూయార్క్‌కు చెందిన యువకుడి విషయంలోనూ ఇదే జరిగింది. పోటీలో భాగంగా ఒకే ఒక కరోలినా రాపర్‌ని తిన్నాడు 34 ఏళ్ల యువకుడు. అంతే ఒక్క నిమిషంలోనే తీవ్రమైన తలనొప్పితో కుప్పకూలాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు పోటీ నిర్వాహకులు. తలనొప్పితో పాటు మెడ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. క్రమంగా ధమనులు కూడా అస్తిరపడటంతో వైద్యులు అతడి మెదడును స్కాన్ చేశారు. మిరపకాయ తినడం వల్లే రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడినట్లు గుర్తించారు. ఐదువారాల పాటు చికిత్స పొందిన అనంతరం అతడి ఆరోగ్యం కుదుటపడింది. పోటీలో గెలవలేకపోయిన ఆ యువకుడు.. కరోలినా రాపర్ తిని ఆస్పత్రిపాలైన మొదటి వ్యక్తిగా రికార్డుకెక్కాడు. కారం ఎక్కువగా తింటే ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతాయని.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని బీఎంజే జర్నల్ తన నివేదికలో పేర్కొంది. ఒక్క కరోలినా రాపర్ 1.5 మిలియన్ల స్వావిల్లే హీట్ స్కేల్(ఘాటును కొలిచే ప్రమాణాలు) కలిగి ఉంటుందని పరిశోధనలో తేలింది. ఇంత ఘాటైన మిరపకాయల వలన రివర్సబుల్ సెరెబ్రల్ వాసొకన్సిట్రిక్షన్ సిండ్రోమ్ (తీవ్రమైన తలనొప్పి) అనే వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
‘పెప్పర్ స్ప్రే’ కన్నా ఘాటు గురూ..
లండన్: ఈ మిరపకాయను ముట్టుకుంటే చేయి భగ్గుమంటుంది. ఎందుకంటే ఇది అంత ఘాటు. అందుకని చేతికి గ్లౌజులు లేకుండా ఈ మిరపకాయను ముట్టుకోవద్దంటూ కస్టమర్లను బ్రిటన్‌లోని టెస్కో షాపులు హెచ్చరిస్తున్నాయి. ప్రపంచంలోనేఅత్యంత ఘాటైన ఎర్ర మిరపకాయగా ‘గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సు’లోకి ఎక్కిన ఈ మిరపకాయను మంగళవారం నాడే బ్రిటన్ మార్కెట్లోకి వచ్చింది. ‘కరోలినా రీపర్’ వెరైటీగా పిలిచే ఈ మిరపకాయ వినియోగదారులకు అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి. భారత సైనికులు హ్యాండ్ గ్రెనేడ్లో ఉపయోగించే ‘గోస్ట్ చిల్లీ’ ఘాటు స్కోవిల్లీ స్కేల్‌పై పది లక్షల యూనిట్లు వుంటే కరోలినా రీపర్గా పిలుస్తున్న ఈ చిల్లీ అదే స్కేలుపై 25 లక్షల యూనిట్లు ఉందంట. మిరపకాయ లాంటి ఘాటైన పదార్థాలను కొలిచేందుకు ఉపయోగించే స్కేల్‌ను స్కోవిల్లీ అంటారు. ఆడవాళ్ల భద్రత కోసం ఇప్పుడు మార్కెట్లో దొరకుతున్న ‘పెప్పర్ స్ప్రే’ కన్నా దీని ఘాటు ఎక్కువ. పెప్పర్ స్ప్రే స్కోవిల్లీ స్కేల్‌పై 20 లక్షల యూనిట్లు ఉంటుంది. అల్లర్ల సమయంలో విధ్వంసానికి పాల్పడుతున్న మూకలను చెదరగొట్టడానికి భద్రతా బలగాలు ఉపయోగించే టియర్ గ్యాస్ టిన్ల (భాష్పవాయు గోళాలు)తో పోలిస్తే వాటికన్నా సగం ఘాటు ఉంటుంది. స్కోవిల్లీ స్కేల్‌పై టియర్ గ్యాస్ గరిష్టంగా 50 లక్షల యూనిట్లు ఉంటుంది. దాని వల్ల కళ్లు కూడా పోతాయి. ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయగా గతంలో రికార్డు సృష్టించిన ‘జలపెనో’ వెరైటీకన్నా ఈ కరోలినా రీపర్ 400 రెట్లు ఘాటైనదని దీన్ని పండించిన ఇటలీ రైతు సాల్వటోర్ జె నోవీస్ చెబుతున్నారు. బ్లడ్ఫోర్డ్షైర్కు సమీపంలోని బ్లునామ్ గ్రామంలోని ఏడెకరాల్లో పలు వెరైటీల మిరపకాయలను పండిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి కార్పొరేట్ ఉద్యోగం చేసిన ఆయన మిరప పంటపైనున్న మమకారంతో ఉద్యోగం వదిలేసి ఈ పంట మీదనే దృష్టిని కేంద్రీకరించారు. ఈ కరోలినా రీపర్‌ను కొరకగలిగితే పండులాంటి రుచి తగులుతుందని జెనోవీస్ చెబుతుండగా, కూరల్లో ఈ మిరపకాయను వేసుకుంటే తినేముందు తీసి పారేయండి, గానీ తినకండి అని విక్రయిస్తున్న టెస్కో షాపులు సలహాయిస్తున్నాయి. ఒక్క రోజులోనే మిరపకాయల స్టాకంతా దేశవ్యాప్తంగా బుక్కయిపోయిందట.