న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పార్టీ(Congress Party) కోర్టుకెక్కింది. ఎన్నికల నిర్వహణ నిబంధనల్లో ఒక రూల్‌కు ఇటీవల ఈసీ సవరణ చేసింది. అయితే.. ఈ చర్యతో ఎన్నికల ప్రక్రియ సమగ్రత క్షీణిస్తోందంటూ కాంగ్రెస్ సర్వోన్నత న్యాయస్థానంలో మంగళవారం ఓ రిట్ పిటిషన్ వేసింది.
ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేందుకు గతంలో అనుమతి ఉండేది. అయితే ఈసీ ఈ మధ్యే ఈ రూల్‌కు సవరణ చేసింది. కొత్త రూల్ ప్రకారం.. ఇక నుంచి పోలింగ్‌కు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ను, వెబ్‌కాస్టింగ్ రికార్డులను, అభ్యర్థులకు చెందిన వీడియో రికార్డులను తనిఖీ చేయకుండా నిషేధం విధించింది.
కొత్త సవరణతో(Amendments) ఎలక్ట్రానిక్ రికార్డులు మినహా ఇతర పత్రాలు, డాక్యుమెంట్లు తనిఖీకి అందుబాటులో ఉంటాయి. పోలింగ్ బూత్‌లలోని సీసీ టీవీ కెమెరాల తనిఖీవల్ల ఓటర్ల గోప్యతకు భంగం కలుగుతోందని, అందుకే నిషేధం విధించామని ఈసీ వర్గాలు వెల్లడించాయి. పైగా ఫుటేజ్‌ను వినియోగించుకుని కృత్రిమ మేధ(Artificial Intelligence) ద్వారా నకిలీ వీడియోలను తయారు చేస్తున్నారని తెలిపాయి. రూల్ 93కి సవరణ తర్వాతా అభ్యర్థులకు ఎలక్ట్రానిక్ రికార్డులు అందుబాటులో ఉంటాయని, కానీ ఇతరులు తనిఖీ చేయడానికి అనుమతి ఉండదని స్పష్టత ఇచ్చింది.
ఎన్నికల సంఘం(Election Commission) సిఫార్సు మేరకే.. ఎన్నికల నిర్వహణ నిబంధనలు-1961లోని రూల్ 93(2)(ఏ)ను కేంద్ర న్యాయశాఖ సవరించింది. ఈ సవరణకు ఓ కోర్టు కేసు కారణమని ఈసీతోపాటు న్యాయశాఖ వేర్వేరుగా గత శుక్రవారం వివరణ ఇచ్చాయి. ఇక..
అయితే ఈ పరిణామంపై కాంగ్రెస్(Congress Party) మండిపడింది. ఎన్నికల్లో పారదర్శకతకు ఇది విఘాతమని స్పష్టం చేసింది. ఎన్నికల నిబంధనను మార్చడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పారదర్శకతకు ఈసీ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించింది. ఈ సవరణను న్యాయపరంగా సవాలు చేస్తామని ఇంతకు ముందే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ స్పష్టం చేశారు. కోర్టు తీర్పును పాటించాల్సిన ఈసీ.. అందుకు విరుద్ధంగా నిబంధనలకు సవరణ చేయడం విడ్డూరమని ఆ సందర్భంలో ఆయన వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: ముంచెత్తిన మంచులో వాహనాలు
Comments
Please login to add a commentAdd a comment