సాక్షి, ఢిల్లీ: ఇటీవల పార్లమెంట్ వద్ద బీజేపీ, కాంగ్రెస్ నిరసనల వేళ తోపులాట కారణంగా ఇద్దరు బీజేపీ ఎంపీలు గాయపడ్డారు. ఈ వ్యవహారంపై సీఐఎస్‌ఎఫ్(CISF) కీలక ప్రకటన చేసింది. ఆరోజున తమ వైపు నుంచి ఎలాంటి తప్పిదం జరగలేదని వెల్లడించింది. ఈ మేరకు సీఐఎస్‌ఎఫ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ శ్రీకాంత్ కిషోర్ తెలిపారు.
పార్లమెంట్ వద్ద తోపులాట వ్యవహారంపై సీఐఎస్‌ఎఫ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ శ్రీకాంత్ కిషోర్ క్లారిటీ ఇచ్చారు. ఈ ఘటనలో సీఐఎస్‌ఎఫ్ నుంచి ఎలాంటి తప్పిదం జరగలేదన్నారు. సెక్యూరిటీలో భాగంగా ఎలాంటి ఆయుధాల కూడా పార్లమెంట్ లోపలికి వెళ్లలేదు. ఈ ఘటనపై సీఐఎస్‌ఎఫ్ ఎలాంటి విచారణ జరపడం లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక, పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్ భద్రత బాధ్యతలు సీఐఎస్‌ఎఫ్ చేతుల్లోనే ఉన్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. ఇటీవల బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో పార్లమెంట్ వద్ద కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి మెట్లపై పడిపోయారు. దీంతో, ఆయనకు గాయమైంది. అనంతరం, వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే, తనను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul gandhi) తోసేయడం వల్లే గాయపడ్డినట్టు ఆరోపించారు. ఈ ఘటన సందర్బంగా మరో బీజేపీ ఎంపీ ముకేశ్ రాజ్‌పుత్ కూడా గాయపడ్డారు.
పరస్పరం పోలీసులకు ఫిర్యాదు
పార్లమెంటు ఘటనలపై బీజేపీ, కాంగ్రెస్ పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి. కాంగ్రెస్ ఎంపీలపై బీజేపీ బృందం డీసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా రాహుల్‌పై కేసు నమోదైంది. బీజేపీ ఎంపీలపై కాంగ్రెస్ బృందం ఏసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.
ఉభయ సభల్లోనూ వాగ్వాదం
అంతకుముందు.. అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పార్లమెంటు ఉభయ సభల్లో ఇండియా కూటమి ఎంపీలు ఆందోళనకు దిగారు. ఇరు సభల్లో ప్రతిపక్ష సభ్యులు అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment