న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ.. ఎన్నికల ప్రచార జోరు ఊపందుకుంది. ఓపక్క ఇంటింటి ప్రచారాలు, ర్యాలీలు, బహిరంగ సభల మైకుల గోలతో రాజధాని మారుమోగిపోతోంది. మరోపక్క సోషల్ మీడియాలో పార్టీల పోస్టర్ వార్‌లు ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ రిలీజ్ చేసిన ఓ పోస్టర్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.
నిజాయితీలేని వ్యక్తులందరినీ నిజాయితీపరుడైన కేజ్రీవాల్ మించిపోయారు అంటూ ట్యాగ్‌లైన్ ఉంచింది. ఆ పోస్టర్‌లో బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా, యూపీ సీఎం యోగి, ఢిల్లీ బీజేపీ లీడర్లు ఉన్నారు. అయితే.. రాహుల్ గాంధీ ఫొటోను సైతం ఉంచడంతో అది చర్చనీయాంశమైంది. ఆప్ సర్కార్‌పై, ఆ పార్టీ కన్వీనర్‌పై అరవింద్ కేజ్రీవాల్‌పై రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీ గురువారం ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. షీలా దీక్షిత్ హయాంలోనే ఢిల్లీ గణనీయంగా అభివృద్ధి చెందిందని అన్నారు. అయితే.. కేజ్రీవాల్ పాలనలో జరిగిన అభివృద్ధికి ఆమె హయాంలో జరిగిన పనులకు అసలు పొంతనే లేదని అన్నారు. అంతకు ముందు సైతం ఆయన కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కేజ్రీవాల్ కూడా మోదీ తరహాలోనే తప్పుడు వాగ్దానాలు ఇస్తున్నారని విమర్శించారు. కాలుష్య నివారణ, రాజధాని ద్రవ్యోల్బణం లాంటి విషయాల్లో ఆయన విఫలమయ్యారని మండిపడ్డారు. అలాగే.. దళితులను, గిరిజనుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్ కీలక నేతలు సైతం ఆప్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు సంధిస్తున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్.. కేజ్రీవాల్‌ను దేశ వ్యతిరేక శక్తిగా అభివర్ణించారు. దీంతో.. ఆయన ఫొటోను కూడా తాజా పోస్టర్‌లో ఉంచారు. ఇక న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్‌పై పోటీకి దిగిన సందీప్ దీక్షిత్ (షీలా దీక్షిత్ కొడుకు) ఫొటోను కూడా ఉంచారు.]
మరోవైపు.. బీజేపీ కూడా సోషల్ మీడియాలో ఆప్‌దా(డిజాస్టర్) సిరీస్ భాగంగా వరుస పోస్టర్లను వదులుతోంది. గూండాలు, నేరస్తులైన ‘‘ఆప్-దా గ్యాంగ్’’కు ఢిల్లీ ప్రజలు సరైన గుణపాఠం నేర్పబోతున్నారంటూ తాజాగా మరో పోస్టర్ వదిలింది.
ఇండియా కూటమిలో భాగమైన ఆప్ కాంగ్రెస్‌ల మధ్య పోటీ రాజకీయ చర్చకు దారి తీసింది. హర్యానా, ఢిల్లీ.. ఇలా వరుసగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీల మధ్య పోటీ తప్పడం లేదు. ఇండియా కూటమి జాతీయ రాజకీయాల వరకు.. అదీ లోక్‌సభ ఎన్నికలకే పరిమితమని కూటమి పార్టీలు స్పష్టత ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే.. పోటీకి సై అంటున్న ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
నిజాయితీ కూడిన పాలనకు మరోసారి అవకాశం ఇవ్వాలంటూ కేజ్రీవాల్ ఫొటోతో ఆప్ ప్రచారం చేసుకుంటోంది. ఢిల్లీ విషయంలో జాతీయ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని చెబుతోంది. ఢిల్లీ రాజకీయాల్లో కాంగ్రెస్‌కు చోటు అక్కర్లేదని ఆప్ వాదిస్తోంది. అయితే దానికి కాంగ్రెస్ కూడా అంతే ధీటుగా బదులిస్తోంది.
మొత్తం 70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఒకే విడతలో ఫిబ్రవరి 5న ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే తేదీన ఫలితాలను ప్రకటించనుంది. ఢిల్లీలో మొత్తం 1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2.08 లక్షల మంది తొలి ఓటర్లు ఉన్నారు. 13,033 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అన్ని కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. 85 ఏళ్లు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment