సందర్భం
డిసెంబర్ 26వ తేదీ వచ్చిందంటే విషాద ఛాయలు ఆవ రిస్తాయి. సునామీ (2004 Tsunami) మన దేశపు సముద్రపు తీరప్రాంతాన్ని 2004 డిసెంబర్ 26 నాడు ఎంత గట్టి దెబ్బ కొట్టిందో... ఆ క్రమంలో చోటుచేసుకున్న అన్ని దృశ్యాలూ నా కళ్లముందు ప్రత్యక్షమవుతాయి.
నేను కెనడియన్ హైకమిషన్ ఢిల్లీ కార్యాలయంలో సీనియర్ సలహాదారునిగా పనిచేసి 2015లో పదవీ విరమణ చేశాను. నా ఉద్యోగ బాధ్యతల్లో ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన పని ఒక కీలక భాగం. విశాలమైన మన దేశంలో ఏడాదంతా ప్రకృతి వైపరీత్యాలు పలురూపాల్లో (వరదలు, కరువు, అకాల వర్షాలు, భూకంపాలు, తుఫానులు, అడవి కార్చిచ్చులు, (Wild Fire) వేడి–చలిగాలులతో చావులు) జీవజాలాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ప్రాణనష్టంతో పాటు మౌలిక వసతుల్ని నాశనంచేసి... సవాళ్లను ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగాలకు వదిలేసి వెనుదిరిగి పోతాయి.
ప్రకృతి వైపరీత్యాలతో నా బంధం 1999 అక్టోబర్ 29 నాడు ఒరిస్సాలో వచ్చిన సూపర్ సైక్లోన్‌తో (Super Cyclone) మొదలయ్యింది. అదొక పెద్ద విషాదం. ఇరవై వేలకి పైగా జనాన్ని పొట్టన పెట్టుకొంది. ఆ తర్వాత రెండు సంవత్సరాలకే అంటే 2001 జనవరి 26న (రిపబ్లిక్ డే) గుజరాత్‌లోని భుజ్ ప్రాంతాన్ని కుదిపిన బలమైన భూకంపం వచ్చింది. ఉద్యోగ రీత్యా ఫీల్డ్ విజిట్ కోసం వెళ్ళాను. వందశాతం నెలకొరిగిన గ్రామాలను చూసి చలించిపోయాను.
విధ్వంసపు తీవ్రతని కళ్ళారా చూశాక, జీవితంలో మొదటిసారిగా నాకు నోట మాటరాలేదు. బాంబుల దాడికి సంపూర్ణంగా నాశనమైన గ్రామాల మధ్యలో నడుస్తున్న భావన. కూలిన ఇండ్లు, విసిరి పడేసినట్టుగా ఇంటి సామాన్లు, పిల్లల వస్తువులు, చెల్లాచెదురుగా పడి ఉన్న దేవుళ్ళ పటాలు, పెళ్లి ఫోటోలు... ఎనభై సెకండ్ల భూకంపానికి చిన్నా భిన్నమైన జన జీవన దృశ్యాలు! నాలోని రచయిత ఏదైనా రాద్దాం (కథో, నవలో...) అనే ఆలోచనల్లో పడి ఓ వైపు సామగ్రినంతా చక్కగా అమర్చి పెట్టుకొన్నాను. కథలో మరణమృదంగం ఇమడలేదు. బలమైన వస్తువు కదా... నవల రాద్దాం అంటే సమయం దొరకలేదు.
గుజరాత్ భూకంపపు (Gujarat Earthquake) ప్రాజెక్టుల్ని పూర్తిచేసి కాస్త ఊపిరి పీల్చుకొంటున్నామో లేదో, 2004 డిసెంబర్ రానే వచ్చింది. సునామీతో మనదేశపు తూర్పుతీర ప్రాంతాన్ని చావుదెబ్బ కొట్టింది. మన దేశంతో సహా పదమూడు దేశాల్లో మహా బీభ త్సాన్ని వదిలి వెళ్లింది సముద్రం. మనదేశంలో ఇరవై వేలకి పైగా చనిపోయారంటారు. కానీ అంత కంటే ఎక్కువే అని అనధికారికంగా చెబుతుంటారు. జనవరి (2005) మొదటి వారంలో ఫీల్డ్ విజిట్ మొదలు పెట్టి రెండువారాలు మూడు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ) దెబ్బ తిన్న ప్రదేశాల్ని చూస్తూ తిరిగాను.
ఎన్నో కష్టాల కోర్చి అంకిత భావంతో పనిచేస్తున్న స్వచ్ఛంద సేవాసంస్థలను కలిశాను. ప్రభావితులైన వారి స్థితి ఏంటి? తక్షణ అవసరాలేమిటి? ఎవరు ఎలాటి సహాయ కార్యక్రమాలను చేపట్టారు? దాతలు సహాయాన్నందించడానికి ఎలా ముందుకు వస్తు న్నారు వంటి విషయాలపై ఒక అవగాహన కోసం ఎందరినో కలిశాను. మూడు రాష్ట్రాలూ పుస్తకాల్లో దొరకని జ్ఞానపు గనుల్ని నా ముందుకు తెచ్చాయి. 2009 వరకు కెనడా దేశం ఆర్థిక సహాయాన్నిచ్చిన ప్రాజె క్టులు పూర్తయ్యాయి.
చదవండి: బాలికా విద్యపై ఇంకా వివక్షా?
ప్రాజెక్టు పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ నాలోని రచయిత ఏం రాయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే ఊపు అందుకొంటున్న ‘నానీల’ ప్రక్రియ పట్ల ఆకర్షితుడనై, ‘సునామీ నానీలు’ అనే 45 పేజీల పుస్తకాన్ని వంద నానీలతో ప్రచురించి సునామీ వచ్చి సంవత్సరం పూర్తికాకముందే ప్రచురించాను. నాకు గొప్ప తృప్తినిచ్చింది. తరువాత ఇది ఇంగ్లీష్, హిందీ భాషల్లోకి అనువదింపబడి రెండు భాషల సాహితీ ప్రియులకీ చేరింది. ఈ చిరు పుస్తకాల అమ్మకాలతో వచ్చిన డబ్బుని (రూ. 37,000) రెండు స్వచ్ఛంద సేవా సంస్థలకు విరాళంగా ఇచ్చాను.
చదవండి: ఒక దేశం ఒక ఎన్నికపై... ఒక మాట!
ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఫైళ్లని మూసేశాము. మళ్ళీ ఆ ప్రదేశాల్ని తిరిగి చూసే అవకాశాలు రావు. అయిదేళ్లుగా తరచుగా వెళ్లి తిరిగిన ప్రాజెక్టు ప్రాంతాల్లో ఇరవై సంవత్సరాల్లో చాలా మార్పులు తప్పక వచ్చి ఉంటాయి. అప్పటి పిల్లలు యువకులైపోయుంటారు. మధ్య వయస్కులు అరవై దాటి వృద్ధాప్యంలోకి అడుగు పెట్టి ఉంటారు. పిల్లల్ని కోల్పోయిన తల్లులు మళ్ళీ పిల్లల్ని కని ఉంటారు. వారందరి మోహాలపై నవ్వుల్ని చూసే అవకాశం రాదు. రానే రాదు. అందరూ సునామీ తమకి మిగిల్చిన విషాదాన్ని పీడకలగా భావించి ఆశావాదంతో నెమ్మదిగా నిలదొక్కుకొంటూ, కాలక్రమేణా ముందుకు దూసుకుపోయి ఉంటారని ఊహించుకొంటూ ప్రతి డిసెంబర్ చివరివారం గడుపుతుంటాను.
- డాక్టర్ టి. సంపత్ కుమార్
ఢిల్లీలోని కెనడియన్ హైకమిషన్‌లో మాజీ సీనియర్ సలహాదారు
(2004 నాటి సునామీకి రేపటితో ఇరవై ఏళ్లు)
Comments
Please login to add a commentAdd a comment