భాగ్య నగర కీర్తి ‘కెరటం’.. ఇంకాయిస్‌ | 20 years since the Indian Ocean tsunami | Sakshi
Sakshi News home page

భాగ్య నగర కీర్తి ‘కెరటం’.. ఇంకాయిస్‌

Dec 26 2024 5:03 AM | Updated on Dec 26 2024 5:03 AM

20 years since the Indian Ocean tsunami

క్షణాల్లో మహాసముద్రవిపత్తులను పసిగడుతున్న ‘ఇంకాయిస్‌’ 

28 దేశాలకుసునామీ హెచ్చరికలుమన రాష్ట్రం నుంచే.. 

హిందూ మహా సముద్రసునామీకి నేటితో 20 ఏళ్లు 

నేడు ‘ఇంకాయిస్‌’లోసునామీ మృతులకు నివాళి

హిందూ మహాసముద్రంతో అనుబంధం ఉన్న 28 దేశాలకు సునామీ హెచ్చరికలు మన భాగ్యనగరం నుంచే వెళ్తుంటాయి. సముద్రాల్లో ఏర్పడే భూప్రకంపనల నుంచి సునామీ రాక, సముద్రపు అలల ఎత్తు, వేగం, వాటి తీవ్రత ఏమేర ఉంటుందో క్షణాల్లో భారత్‌తోపాటు ఆయా దేశాలకు చేరవేసే విజ్ఞాన వాహిని భాగ్యనగర సొంతం. నగర కీర్తి కెరటంగా ‘ఇంకాయిస్‌’ (భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం) పరిఢవిల్లుతోంది.

సనత్‌నగర్‌ (హైదరాబాద్‌): ప్రపంచంలో మూడు దేశాల్లో సునామీ హెచ్చరిక కేంద్రాలు ఉంటే అందులో హైదరాబాద్‌లోని ఇంకాయిస్‌ ఒకటి. మిగతా రెండు ఇండోనేసియా,ఆ్రస్టేలియాలో ఉన్నాయి. 2004 హిందూమహాసముద్ర సునామీ 20వ వార్షికోత్సవాన్ని గురువారం ప్రగతినగర్‌లోని ఓషన్‌ వ్యాలీలో గల ఇంకాయిస్‌లోజరపనున్నారు. దీనికి కేంద్ర భూవిజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ సహాయమంత్రి డాక్టర్‌ జితేంద్రసింగ్‌ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. నాటి సునామీలో ప్రాణాలు విడిచిన వారికి నివాళులు అర్పించనున్నారు.
ఈ సందర్భంగా ఇంకాయిస్‌ అందిస్తున్నసేవలపై ప్రత్యేక కథనం.

తొలుత మత్స్యకారుల సేవల కోసం..
1999లో మత్స్యకారులకు సేవలు అందించేందుకు పొటెన్షియల్‌ ఫిషింగ్‌ జోన్‌ (పీఎఫ్‌జెడ్‌)గా ఇంకాయిస్‌ ఆవిర్భవించింది. సముద్రంలో చేపలు ఎక్కువగా లభ్యమయ్యే ప్రాంతాలను గుర్తించి సమాచారాన్ని వారికి చేరవేసే కేంద్రంగానే ఉండేది. ఆ తరువాత కొద్దికాలానికి సముద్రంలో వాయు దిశ, అలల వేగం, వాటి ఎత్తు, ఉష్ణోగ్రత వివరాలను అందిస్తూ ఓషియన్‌ స్టేట్‌ ఫోర్‌కాస్ట్‌ సేవలకు అంకురార్పణ చేసింది. 2004కు ముందు వరకు సునామీ అంటే భారత్‌కు పరిచయం లేని పదం. 

2004లో వచ్చిన సునామీతో 2,40,000 మందికి పైగా చనిపోయిన విషయం తెలిసిందే. 14 దేశాలపై సునామీ ప్రభావం పడింది. ఆ సమయంలోనే సునామీ అంటే ఏంటో అందరికీ తెలిసింది. అప్పటివరకు సునామీ వస్తుందన్న ముందస్తు సమాచారం ఇచ్చే కేంద్రం ప్రపంచదేశాల్లో ఎక్కడా లేదు. దీంతో భారత ప్రభుత్వం కూడా తేరుకుని సునామీ హెచ్చరిక కేంద్రం ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. 

ఆ మేరకు అప్పటికే ఇంకాయిస్‌ ద్వారా మహాసముద్ర సమాచార సేవలు అందుతుండటంతో దీనికి అనుబంధంగానే సునామీ హెచ్చరిక కేంద్రం నెలకొల్పింది. 2005లో ప్రక్రియ ప్రారంభించి 2007లో పూర్తిస్థాయిలో హిందూ మహాసముద్ర సునామీ ముందస్తు హెచ్చరిక కేంద్రంగా అవతరించింది.

సునామీలు ఎలా ఏర్పడతాయంటే..? 
సముద్రంలో భూకంపాలు, అగ్ని పర్వతాలు బద్దలవ్వడం, కొండచరియలు విరిగిపడటం వంటి కారణాలతో సునామీలు ఉత్పన్నమవుతాయి. అయితే ఎక్కువ శాతం భూకంపాల ద్వారానే సునామీలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. భూకంప తీవ్రత 6.5 కంటే ఎక్కువ ఉంటే సునామీ వచ్చే ప్రమాదం ఉంది. 

సునామీ సమయంలో సముద్రం మధ్య భాగంలో వాయువేగం గంటకు 800 కి.మీ., కెరటాల ఎత్తు ఒక మీటరు కంటే తక్కువగా ఉంటాయి. అదే తీరప్రాంతాన్ని తాకే సమయంలో వాయువేగం గంటకు 30 కి.మీ.కు పడిపోయి అలల ఎత్తు మాత్రం 30 మీటర్లకు పెరిగిపోతుంది. 

అందుకే సునామీ వచ్చే ప్రాంతంలో ఎత్తైన ప్రదేశంలో ఉండాలని నిపుణులు హెచ్చరిస్తారు. తీరాన్ని తాకుతున్న కొద్దీ అలల ఎత్తు పెరుగుతుంది. సునామీ రాకను సామాన్య ప్రజలు కూడా గుర్తించవచ్చు. ఆ సమయంలో సముద్రం వెనుకకు వెళ్లిపోతుంది. అలల శబ్ద తరంగాల్లో మార్పు గమనించవచ్చు.  

ఇంకాయిస్‌ ఎలా గుర్తిస్తుందంటే.. 
సునామీకి ముందు మొదట సముద్రంలో భూమి కంపిస్తుంది. అలా భూప్రకంపనలు జరిగిన 5–6 నిమిషాలకు ఇంకాయిస్‌కు సమాచారం అందుతుంది. సముద్ర భూభాగంలో అమర్చిన సిస్మో మీటర్ల ఆధారంగా శాటిలైట్‌ ద్వారా భూప్రకంపనలు జరిగిన సమాచారం ఇంకాయిస్‌కు చేరుతుంది. ఆ తరువాత భూకంపం ప్రభావంతో సునామీ వచ్చే అవకాశం ఉందా? లేదా? అనే దానిపై దృష్టిసారిస్తారు. 

సముద్ర జలాలకు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఏర్పాటుచేసిన ‘సునామీ బోయ్‌ నెట్‌వర్క్‌’ పరికరాల ఆధారంగా కెరటాల ఎత్తు, వాయు దిశను పరిశీలించి సునామీని గుర్తిస్తారు. సాధారణ రోజుల్లో బోయ్‌ నెట్‌వర్క్‌ పరికరాలు శాటిలైట్‌ ద్వారా 15 నిమిషాలకో మారు అలలు, సముద్ర స్థితిగతులకు సంబంధించిన సమాచారం ఇంకాయిస్‌కు చేరవేస్తుంది.

అదే సునామీ వస్తుందంటే నిమిషానికోమారు సందేశం పంపుతుంది. దాని ఆధారంగా సునామీని పసిగడతారు. ఒక్కో బోయ్‌ నెట్‌వర్క్‌ పరికరం రూ.6 కోట్ల వరకు ఉంటుంది.  

నిమిషాల్లో సమాచారం...
ఇంకాయిస్‌ సేకరించిన సమాచారాన్ని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉండే విపత్తు నిర్వహణ కేంద్రాలకు, భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖకు వెబ్‌సైట్, మెయిల్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా కేవలం పది నిమిషాల లోపే చేరవేస్తుంది. మూడుస్థాయిల్లో ఇంకాయిస్‌ సమాచారం అందిస్తోంది. వార్నింగ్, అలర్ట్, వాచ్‌ స్థాయిల్లో సందేశం పంపుతుంది. వార్నింగ్‌ అని సందేశం పంపారంటే తీవ్రత అధికంగా ఉన్నట్లు అర్ధం. సాధారణంగా భూ ప్రకంపనలు జరిగిన తరువాత సునామీ తీరాన్ని చేరుకోవడానికి రెండు గంటలు పడుతుంది.

ఆ లోపు సునామీ ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే అవకాశం ఉంటుంది. ఒక్క అండమాన్‌ దగ్గర సునామీ ఏర్పడితే మాత్రం 20 నిమిషాల వ్యవధిలోనే తీరాన్ని దాటే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యునెస్కో ఆదేశాల మేరకు 2011 నుంచి సునామీకి సంబంధించిన సమాచారాన్ని హిందూ మహాసముద్రానికి అనుబంధంగా ఉన్న 28 దేశాలకు ఇంకాయిస్‌ చేరవేస్తుంది. ఆయా దేశాల ప్రభుత్వాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement