సముద్రం సునామీగా ముంచెత్తి దాదాపు 6 వేల మందిని పొట్టనబెట్టుకుంది. అంతటి ప్రళయం నుంచి అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడినవాళ్లు కొందరే. అందులో రెండేళ్ల ఓ పసిప్రాణం కూడా ఉంది. పసికందుగా ఆమెను తన చేతుల్లోకి తీసుకున్న ఆ ఐఏఎస్ అధికారి.. ఇప్పుడు తండ్రి స్థానంలో ఆమెపై అక్షింతలు జల్లి దీవించి భావోద్వేగానికి లోనయ్యారు. హృదయాన్ని హత్తుకునే ఈ ఘటనలోకి వెళ్తే..
డిసెంబర్ 26, 2004 ముంచెత్తిన సునామీలో తమిళనాడుకు జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం భారీగానే. నాగపట్టణంలో సహాయక చర్యలు పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వం స్ట్రిక్ట్ ఆఫీసర్‌గా పేరున్న రాధాకృష్ణన్‌కు అప్పగించింది. అప్పుడు ఆయన తంజావూరు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో.. డిసెంబర్ 28వ తేదీన కీచన్‌కుప్పం ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్న బృందాలకు.. శిథిలాల కింద ఓ పసికందు ఏడుపులు వినిపించాయి. దాదాపు రెండేళ్ల వయసున్న చిన్నారిని సురక్షితంగా బయటకు తీసి.. ఆస్పత్రికి తరలించారు. అదృష్టం కొద్దీ ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ఆ సునామీ నుంచి బయటపడిన అతిచిన్న వయస్కురాలు కూడా ఆమెనే!. అయితే ఆమె తల్లిదండ్రులు ఏమయ్యారో తెలియదు. అలాంటప్పడు చిన్నారి సంరక్షణ బాధ్యతలు ఎలా? అని అధికారులు ఆలోచన చేశారు.
ఈలోపు.. విషయం తెలిసిన అప్పటి జిల్లా కలెక్టర్ రాధాకృష్ణన్-కృతిక దంపతులు ముందుకు వచ్చారు. ఆ చిన్నారికి మీనా అని పేరు పెట్టి.. అన్నై సత్య ప్రభుత్వ వసతి గృహంలో చేర్పించారు. అప్పటి నుంచి ఆమె సంరక్షణ మొత్తం ఆ జంటే చూసుకుంటూ వచ్చింది. ఈలోపు రాధాకృష్ణన్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యింది. అయితే మరో ప్రాంతానికి బదిలీ అయినప్పటికీ.. రాధాకృష్ణన్ జంట మీనా సంరక్షణ బాధ్యతను మరిచిపోలేదు. వీలు చిక్కినప్పుడల్లా ఆమె దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. అదే ఆశ్రమంలో సౌమ్య ఆమెకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యింది. అలా.. ఏళ్లు గడిచిపోయాయి.
సాధారణంగా 18 ఏళ్లు నిండిన తర్వాత.. వాళ్లకు ఆశ్రమంలో కొనసాగడానికి వీలు ఉండదు. ఆశ్రమంలో సౌమ్య, మీనాలకు మాత్రమే ఈ ఇబ్బంది ఎదురైంది. విషయం తెలిసి.. రాధాకృష్ణన్ ముందుకొచ్చారు. మీనా, సౌమ్య బాధ్యతలకు దాతల సహకారం తీసుకున్నారు. అలా.. వాళ్లిద్దరూ ఉన్నత చదువులు పూర్తి చేసుకున్నారు. అలా వాళ్లిద్దరికీ తండ్రికాని తండ్రిగా మారిపోయారు.
రెండేళ్ల కిందట.. సౌమ్య ఓ టెక్నీషియన్‌ను వివాహం చేసుకుంది. ఆ వివాహానికి సౌమ్య తరఫున పెద్దగా రాధాకృష్ణన్ హాజరై ఆశీర్వదించారు. కిందటి ఏడాది సౌమ్య ఓ బిడ్డకు జన్మనిస్తే.. ఇంటికి పిలిపించుకుని మరీ మనవరాలిని దీవించారు. ఇక మీనా వయసు ఇప్పుడు 23 ఏళ్లు. నర్సింగ్ పూర్తి చేసుకుంది. మీనాను వివాహం చేసుకునేందుకు మణిమరన్ అనే బ్యాంక్ ఉద్యోగి ముందుకు వచ్చాడు. విషయం తెలిసి రాధాకృష్ణన్ సంతోషించారు.
ఫిబ్రవరి 2వ తేదీన నాగపట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో మీనా-మణిమరన్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వివాహ వేడుకకు సౌమ్య తన భర్త, కూతురితో హాజరైంది. ప్రస్తుతం రాధాకృష్ణన్ ప్రభుత్వంలో అదనపు చీఫ్ సెక్రటరీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దత్త పుత్రిక వివాహానికి స్వయంగా హాజరై తండ్రి స్థానంలో ఉండి తన బాధ్యతను నిర్వర్తించారు.
ఆశ్రమంలో సౌమ్య-మీనాలు గడిపిన రోజులను, వాళ్ల స్నేహాన్ని, ఆశ్రమ నిర్వహణకు సహకరించిన సూర్యకళను ఆయన గుర్తు చేసుకున్నారు. అన్నింటికి మించి.. 2018లో గాజా తుపాన్ సమీక్ష కోసం వెళ్లినప్పుడు మీనా తనను ‘‘నాన్నా..’’ అని పిలవడాన్ని గుర్తు చేసుకుని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఆ వివరాలను ఆయనే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment