ఆ అమ్మ సునామీకి జన్మనిచ్చింది! | woman recalls son Tsunami birth in snake-filled jungle | Sakshi
Sakshi News home page

ఆ అమ్మ సునామీకి జన్మనిచ్చింది!

Published Sat, Jan 4 2025 5:19 AM | Last Updated on Sat, Jan 4 2025 5:19 AM

woman recalls son Tsunami birth in snake-filled jungle

కల్లోల కాలం

ఎప్పుడూ చూసే సముద్రమే ఆ రోజు కొత్తగా ఉంది. భయంగా ఉంది. ఎప్పుడూ నవ్వుతూ పలకరించే సముద్రం విలయ విధ్వంసానికి సిద్ధంగా ఉంది. ఆరోజు... ఏ రోజూ మరచిపోలేని రోజు. సునామీ విశ్వరూపాన్ని చూపిన రోజు. ఇరవై సంవత్సరాల తరువాత కూడా...  నిన్ననే జరిగినట్లు వెన్నులో చలిపుట్టించే రోజు...

అండమాన్‌ నికోబార్‌లోని హట్‌ బే దీవిలో భీకర అలల ధాటికి నమిత రాయ్‌ ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నది. అప్పుడు నమిత వయసు పాతిక సంవత్సరాలు. దిక్కుతోచని పరిస్థితుల్లో పాములకు ప్రసిద్ధి చెందిన అడవిలో ఆశ్రయం పొందారు. ఎటు నుంచి ఏ విషసర్పం వచ్చి ప్రాణం తీస్తుందో తెలియని భయానక పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లోనే ఆ పాముల అడవిలోనే పండంటి పిల్లాడికి జన్మనిచ్చింది నమిత.

ఆ పిల్లాడికి ‘సునామీ’ అని పేరు పెట్టారు. రెండు దశాబ్దాల తరువాత మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్లింది నమిత రాయ్‌...‘ఆ చీకటి రోజును గుర్తు చేసుకుంటే ఇప్పటికీ ఒంట్లో వణుకు పుడుతుంది. అప్పుడు నేను గర్భవతిని. రోజువారీ పనులతో బిజీగా ఉన్నాను. ఉన్నట్టుండి భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. 

మా తీరం నుండి మైళ్ళ దూరంలో సముద్రం తగ్గుముఖం పట్టడం చూసి షాక్‌ అయ్యాను. కొన్ని సెకనుల తరువాత మా దీవి వైపు భారీ సముద్రపు అలలు దూసుకొస్తున్నాయి, ఆ తర్వాత బలమైన ప్రకంపనలు వచ్చాయి. ప్రజలు కేకలు వేస్తూ గుట్ట వైపు పరుగెత్తడం చూశాను. పానిక్‌ ఎటాక్‌ వచ్చి స్పృహ తప్పి పడిపోయాను.

కొన్ని గంటల తరువాత స్పృహలోకి వచ్చాను. కొండ అడవిలో వేలాది మంది స్థానికుల మధ్య నేను ఉన్నాను. నా భర్త, పెద్ద కొడుకును చూడగానే ప్రాణం లేచి వచ్చింది. మా ద్వీపంలోని చాలాప్రాంతాలు రాక్షస అలల తాకిడికి నాశనం అయ్యాయి. ఆస్తి అనేది లేకుండా పోయింది.

ఒకరోజు రాత్రి పదకొండు గంటల తరువాత నాకు పురిటినొప్పులు వచ్చాయి. కానీ చుట్టుపక్కల డాక్టర్లు ఎవరూ లేరు. నేను ఒక బండరాయిపై పడుకొని సహాయం కోసం ఏడ్చాను. నా భర్త ఎంత ప్రయత్నించినా వైద్యసహాయం అందలేదు. అడవిలో ఆశ్రయం పొందిన కొందరు మహిళలను నా భర్త వేడుకున్నాడు. వారి సాయంతో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సునామీకి జన్మనిచ్చాను.

తిండి లేదు. సముద్రానికి భయపడి అడవి నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో నా బిడ్డ బతుకుతాడా అనే బాధ మొదలైంది. కొబ్బరి నీళ్లే ఆహారమయ్యాయి. లాల్‌ టిక్రీ హిల్స్‌లో నాలుగు రాత్రులు గడిపిన మమ్మల్ని రక్షణ సిబ్బంది కాపాడారు. చికిత్స కోసం నన్ను పోర్ట్‌ బ్లెయిర్‌లోని జీబీ పంత్‌ ఆసుపత్రికి ఓడలో తీసుకువెళ్లారు. హట్‌ బే నుంచి పోర్ట్‌ బ్లెయిర్‌కు 117 కిలోమీటర్‌ల దూరం. సుమారు ఎనిమిది గంటల సమయం పట్టింది’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది నమిత.

కోవిడ్‌ మహమ్మారి సమయంలో భర్త లక్ష్మీ నారాయణ మరణించడంతో ఇద్దరు కుమారులు సౌరభ్, సునామీలతో కలిసి పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీలో నివసిస్తుంది నమితా రాయ్‌.

నమిత పెద్ద కుమారుడు సౌరభ్‌ ఒక ప్రైవేట్‌ షిప్పింగ్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు సునామీ ‘ఓషనోగ్రాఫర్‌’ కావాలనుకుంటున్నాడు.
‘మా అమ్మే నాకు సర్వస్వం. ఆమె ధైర్యశాలి. నాన్న చనిపోయాక మమ్మల్ని పోషించడానికి చాలా కష్టపడింది. ఫుడ్‌ డెలివరీ సర్వీసును నిర్వహించింది. దానికి సునామీ కిచెన్‌ అని సగర్వంగా పేరు పెట్టింది’ అంటున్నాడు సునామీ రాయ్‌.

‘2004లో సమర్థవంతమైన హెచ్చరిక వ్యవస్థ లేకపోవడంతో పెద్ద ఎత్తున విధ్వంసం,ప్రాణ నష్టం జరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1.400కు పైగా హెచ్చరిక కేంద్రాలు(వార్నింగ్‌ స్టేషన్స్‌) ఉన్నాయి. సునామీ నాటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు మేము సర్వసన్నద్ధంగా ఉన్నాం’ అంటున్నారు అండామన్‌ నికోబార్‌ దీవుల అడ్మినిస్ట్రేషన్‌ సీనియర్‌ అధికారులు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement