సముద్రంపై భూమి.. ఆ భూమిపై అడవి!
ఒకప్పుడు భూమి మొత్తం పచ్చగా ఉండేదట. మనిషిలో స్వార్థం పెరుగుతున్న కొద్దీ చెట్టూ చేమ కొట్టుకుపోయి.. కాంక్రీట్ జనారణ్యాలు వచ్చేశాయన్నమాట. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏమయ్యేదో ఊహించుకోలేంగానీ... తాజా ట్రెండ్ ఏమింటే.. ఎక్కడ వీలైతే అక్కడ ఎన్ని వీలైతే అన్ని చెట్లు నాటేయడం. ఫొటోలు చూస్తే ఈ విషయం మరింత స్పష్టంగా తెలుస్తుంది.
ఇంతకీ పచ్చగా ధగధగలాడిపోతున్న ఈ భవనాల కథేమిటని ఆలోచిస్తున్నారా? చాలా సింపుల్. మలేషియా, సింగపూర్ సరిహద్దుల్లో కట్టబోతున్నారీ భారీ నగరాన్ని. విశేషాలేమిటో తెలుసా? పచ్చదనం గురించి తరువాత మాట్లాడుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది దాదాపు 24 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న ఈ నగరం మొత్తం సముద్రాన్ని పూడ్చడం ద్వారా అభివృద్ధి చేసిన భూమిపై నిర్మాణమవుతుంది.
నివాస గృహాలతోపాటు కార్యాలయ సముదాయాలు, పార్కులు, హోటళ్లు, షాపింగ్‌మాల్స్, అంతర్జాతీయ పాఠశాల వంటి హంగులన్నీ ఇక్కడే ఏర్పాటవుతాయి. మొత్తం ఏడు లక్షల మందికి నివాసం కల్పించేలా ఈ ఫారెస్ట్ సిటీ నిర్మాణం జరుగుతోంది. నగరం నడిబొడ్డున రెయిన్ ఫారెస్ట్ వ్యాలీ పేరుతో ఓ భారీసైజు పార్కు ఏర్పాటవుతుంది. చుట్టూ జలపాతంతో కూడిన ఈ పార్కులో పంచభూతాలను తలపిస్తూ ఐదు దిక్కులకు రహదారులుంటాయి.
ల్యాబొరేటరీ ఫర్ విజనరీ ఆర్కిటెక్చర్ (లావా) సంస్థ సిద్ధం చేసిన ఈ డిజైన్ ఇప్పటికే అంతర్జాతీయ డిజైన్ పోటీల్లో విజయం సాధించింది కూడా. సాధారణ నగరాలతో పోలిస్తే దీంట్లో పచ్చదనం ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుందన్నది ఫొటోలు చూస్తేనే అర్థమైపోతుంది. ఇంకో విశేషం ఏమిటంటే... ఈ నగరంలో వీలైనంత వరకూ వాహన సంచారం మొత్తం భూగర్భంలోనే సాగిపోతుంది. రహదారుల్లో ఎక్కువ భాగం పాదచారులకు అనుకూలంగా సిద్ధం చేస్తారు. పక్కనే కొంచెం ఎత్తైన మార్గంలో రైల్వేలైన్ ఉంటుంది. -సాక్షి నాలెడ్జ్ సెంటర్