అటవీ భూముల రక్షణకు చర్యలు
హాలియా : అటవీ ప్రాంతంలో తమ భూములకు ఆశాఖ అధికారులు హద్దులు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అటవీశాఖకు చెందిన భూములను రైతులు ఆక్రమించుకుని సేద్యం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ భూములను సైతం అటవీశాఖ తమ పరిధిలోనికి తీసుకుని హద్దులు ఏర్పాటు చేస్తోంది. నల్లమల్ల అటవీ ప్రాంతంలో భాగంగా మల్లప్పాయ అటవీప్రాంతం వరకు వన్యప్రాణులను రక్షించేందుకు ప్రత్యేంగా సైన్‌బోర్డులను ఏర్పాటు చేయడమే కాకుండా సంబంధిత గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రంగుండ్ల గ్రామపంచాయితీ పరిధిలో గల బోనూతల తిరుమలనాథస్వామి (తిరుమలయ్యగట్టు) ఆలయం నుంచి తమ పరిథిలో గల భూములకు ట్రెంచ్ (గాతు తీయడం) కొడుతున్నారు. అంతేకాకుండా వీటిపై హరితహారంలో భాగంగా మొక్కలను నాటుతున్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ జోన్‌లో భాగంగా గరికనేటితండా వరకు పనులను చేపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అటవీ భూముల్లో ఉన్న నిర్మాణాలు, ఆక్రమణలు తమ పరిధిలోకి తీసుకుంటున్నట్లు అటవీ అధికారులు పేర్కొన్నారు. సాగర్–హాలియా ప్రధాన రహదారి పొట్టిచెల్మ వద్ద అలవీ భూములకు రక్షణ గోడలు ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా ఎటువంటి ఆక్రమణలు చేయరాదంటూ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.
ఆక్రమణలకు గురికాకుండా బోర్డులను ఏర్పాటు చేస్తున్నాం..– అన్నపూర్ణమ్మ అటవీ బీట్ అధికారి
అటవీ ప్రాంతంలో భూములు ఆక్రమణలకు గురికాకుండా హద్దులతో కూడిన బోర్డులను ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాకుండా వన్యప్రాణుల రక్షణ కోసం ప్రజల్లో అవగాహన కలిగేందుకు ప్రయత్నిస్తూనే అటవీ ప్రాంత రక్షణ కోసం ట్రెంచ్‌లను కొట్టడం జరుగుతుంది. దీంతో భూములను ఆక్రమించే అవకాశం ఉండదు. ఇప్పటికే హద్దులతో కూడిన సిమెంట్ దిమ్మెలను నిర్మించాం.