అందులో ఏముంది | LAND MISSING IN VIJAYANAGRAM | Sakshi
Sakshi News home page

అందులో ఏముంది

Published Fri, Feb 24 2017 7:39 PM | Last Updated on Tue, Sep 5 2017 4:30 AM

LAND MISSING IN VIJAYANAGRAM

► బహిర్గతం కాని రీ సర్వే నివేది
► లీజుకిచ్చిన ఏరియాలో రిజర్వుఫారెస్టు ఉందన్న డీఎఫ్‌ఓ
► ఇంతలోనే ఏసీబీకి పట్టుబడ్డ వైనం
► ఆ దెబ్బతో తవ్వకాల జోలికెళ్లని ఇతర అధికారులు
► అందులో వేలు పెడితే టార్గెట్‌ అయిపోతామన్న భయం
► అడ్డూ అదుపూ లేకుండా సాగిపోతున్న తవ్వకాలు
 
బడేదేవర కొండపైగల అనుమానిత రిజర్వు ఫారెస్టు ఏరియాలో  మైనింగ్‌ జరుగుతూనే ఉంది. మైనింగ్‌ మెటీరియల్‌ను రవాణా చేసుకునేందుకు ఏకంగా రహదారులూ వేసేస్తున్నారు. లీజు భూమిలో రిజర్వు ఫారెస్టు ఏరియా ఉందన్న అనుమానంతో నిగ్గు తేల్చేందుకు వేసిన రీసర్వే కమిటీ నివేదిక నెలలు గడుస్తున్నా అధికారులు బయటపెట్టడం లేదు. దాని జోలికెళ్లినందువల్లే డీఎఫ్‌ఓ ఏసీబీకి పట్టుబడ్డారన్న  క్రియేట్‌ చేశారు. అటు వైపు వెళ్లేందుకు ఏ ఒక్క అధికారి సాహసించకుండా లేనిపోని భయాందోళన కల్పిస్తున్నారు. అధికార పార్టీ నేతలే పరోక్షంగా అక్రమ మైనింగ్‌కు వత్తాసు పలుకుతున్నారు.
 
విజయనగరం :పార్వతీపురం మండలం కోరి రెవెన్యూ పరిధిలో గల బడేదేవరకొండ భూముల్లోని 41ఎకరాలను చెన్నైకి చెందిన ఎంఎస్‌పీ గ్రానైట్‌ సంస్థకు ప్రభుత్వం లీజుకిచ్చింది. క్వారీ నిర్వహణకు 20సంవత్సరాల పాటు లీజుపొందామంటూ ఎంఎస్‌పీ సంస్థ తవ్వకాలు చేపడుతోంది. గిరిజనులు దేవతగా పూజించే బడిదేవర కొండను మైనింగ్‌ కోసం ఎలా లీజుకిచ్చారని, సంగంవలస రెవెన్యూ పరిధిలోని రిజర్వు ఫారెస్టు భూముల్లో తవ్వకాలకు ఎలా అనుమతి ఇస్తారని, వేలాది ఎకరాలకు సాగునీరందించే కొండ వాగులు ధ్వంసమవుతాయని, తమ పొలాల పరిస్థితేంటని 12గ్రామాల గిరిజనులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఉద్యమం కాస్తా తీవ్రమైంది. వైఎస్సార్‌సీపీ, వామపక్షాలు గిరిజనులకు అండగా నిలిచి, పెద్ద ఎత్తున పోరాటం చేశాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది సెప్టెంబర్‌ 29వ తేదీన జరిగిన జెడ్పీ సమావేశంలో రగడ చోటు చేసుకుంది. ఈ వ్యవహారం జిల్లా పరిషత్‌ను కుదిపేసింది. రిజర్వు ఫారెస్టు ఏరియాలో అక్రమ మైనింగ్‌ జరుగుతోందని ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తారు. మైనింగ్‌ చేసేందుకు రిజర్వు ఫారెస్టు ఏరియాలో అనుమతులెలా ఇచ్చారని అధికారుల్ని నిలదీశారు. దీంతో రీసర్వే చేసేందుకు కమిటీని వేశారు. 

యథేచ్ఛగా మైనింగ్‌
ఎక్కడైతే రిజర్వు ఫారెస్టు ఉందని గిరిజనులు, అటవీశాఖాధికారులు గగ్గోలు పెడుతున్నారో అక్కడ యథేచ్ఛగా మైనింగ్‌ జరిగిపోతోంది. రీసర్వే నివేదికపై స్పష్టత ఇచ్చేవరకు అక్కడ మైనింగ్‌ నిలిపివేయాల్సి ఉన్నా ఎవరూ అడ్డుకోవడంలేదు. ఎప్పుడైతే డీఎఫ్‌ఓ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారో అప్పటి నుంచి అటువైపు ఏ అధికారీ వెళ్లడం లేదు. అటు వెళితే టార్గెట్‌ అయిపోతామేమో, పట్టించేస్తారేమో అన్న భయం అధికారులకు పట్టుకుంది. దీంతో అక్కడ అడ్డగోలుగా మైనింగ్‌ జరిగిపోతోంది. 

అటు రీసర్వే... ఇటు డీఎఫ్‌ఓపై ఏసీబీ దాడి
బడేదేవరకొండపై వేసిన రీసర్వే కమిటీ సభ్యులైన మైనింగ్‌ ఏడీ, పార్వతీపురం ఆర్డీవో, సర్వే అధికారి, డీఎఫ్‌ఓ అనుమానిత రిజర్వు ఫారెస్టు ఏరియాలో  క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. దానితో పాటు రికార్డులు కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. విచారణలో ఏమి నిర్ధారించారో చెప్పాల్సిన సమయంలో కమిటీలో సభ్యుడైన డీఎఫ్‌ఓ రమణమూర్తి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. అనుకూల నివేదిక ఇచ్చేందుకు లంచం అడిగారని చెప్పి బడేదేవరకొండ మైనింగ్‌ కంపెనీ యజమాని రాజధానికి చెందిన ఏసీబీ అధికారులను ఆశ్రయించడం, వ్యూహాత్మకంగా డీఎఫ్‌ఓను పట్టించడం జరిగిపోయింది. లీజుపొందిన మైనింగ్‌ ఏరియాలో రిజర్వు ఫారెస్టు ఉందని విచారణ నివేదికలో స్పష్టంగా పేర్కొన్న తర్వాత లంచం ఎందుకు అడుగుతానని ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సమయంలో డీఎఫ్‌ఓ రమణమూర్తి తన వాదన విన్పించారు. తద్వారా ఇక్కడ ఏసీబీ దాడి వెనుక ఏదో రాజకీయం జరిగిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. చెన్నైకు చెందిన ఎంఎస్‌పీ సంస్థకు అనుమతులు రావడం వెనక సీఎంకు సన్నిహితంగా ఉన్న రాజ్యసభ సభ్యుడి జోక్యం ఉందని, ప్రభుత్వ స్థాయిలో ఆయన చేసిన లాబీయింగ్‌తోనే ఈ అనుమతులొచ్చాయని, రీసర్వేలో ఆ భూములు రిజర్వు ఫారెస్టులోకి రావంటూ రిపోర్టు ఇచ్చేలా డీఎఫ్‌ఓపై ఒత్తిళ్లు చేశారని, ఈ క్రమంలో ఏసీబీ అధికారులకు పట్టించారనే వాదనలు ఉన్నాయి. 

బయటకు రాని సర్వే నివేదిక
రీసర్వే కమిటీ వేసి దాదాపు ఆరు నెలలైంది. అటు రికార్డులు, ఇటు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయింది. కానీ రీసర్వేలో ఏమిటి నిర్ధారించారో బయటకు రాలేదు. నివేదికను గుట్టుగానే ఉంచుతున్నారు. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సమయంలోనే డీఎఫ్‌ఓ రమణమూర్తి బాహాటంగానే తన అభిప్రాయాన్ని వెల్లడించారు. లీజు పొందిన ఏరియాలో రిజర్వు ఫారెస్టు ఉందని ఏసీబీ అధికారుల ముందే స్పష్టంగా చెప్పారు. అక్కడే చెప్పారంటే రీసర్వే నివేదికలో స్పష్టంగా చెప్పి ఉంటారనేది సుస్పష్టం. ఇక, మిగతా వారి అభిప్రాయమేంటో ఇప్పటికే చెప్పి ఉంటారు. కానీ, వారేం చెప్పారో అన్నది నేటికీ బయటపెట్టడం లేదు. అసలు రిజర్వు ఫారెస్టు ఉందా? లేదా? అనేది ప్రశ్నగానే ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement