Panic Attacks
-
ఆ అమ్మ సునామీకి జన్మనిచ్చింది!
ఎప్పుడూ చూసే సముద్రమే ఆ రోజు కొత్తగా ఉంది. భయంగా ఉంది. ఎప్పుడూ నవ్వుతూ పలకరించే సముద్రం విలయ విధ్వంసానికి సిద్ధంగా ఉంది. ఆరోజు... ఏ రోజూ మరచిపోలేని రోజు. సునామీ విశ్వరూపాన్ని చూపిన రోజు. ఇరవై సంవత్సరాల తరువాత కూడా... నిన్ననే జరిగినట్లు వెన్నులో చలిపుట్టించే రోజు...అండమాన్ నికోబార్‌లోని హట్ బే దీవిలో భీకర అలల ధాటికి నమిత రాయ్ ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నది. అప్పుడు నమిత వయసు పాతిక సంవత్సరాలు. దిక్కుతోచని పరిస్థితుల్లో పాములకు ప్రసిద్ధి చెందిన అడవిలో ఆశ్రయం పొందారు. ఎటు నుంచి ఏ విషసర్పం వచ్చి ప్రాణం తీస్తుందో తెలియని భయానక పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లోనే ఆ పాముల అడవిలోనే పండంటి పిల్లాడికి జన్మనిచ్చింది నమిత.ఆ పిల్లాడికి ‘సునామీ’ అని పేరు పెట్టారు. రెండు దశాబ్దాల తరువాత మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్లింది నమిత రాయ్...‘ఆ చీకటి రోజును గుర్తు చేసుకుంటే ఇప్పటికీ ఒంట్లో వణుకు పుడుతుంది. అప్పుడు నేను గర్భవతిని. రోజువారీ పనులతో బిజీగా ఉన్నాను. ఉన్నట్టుండి భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. మా తీరం నుండి మైళ్ళ దూరంలో సముద్రం తగ్గుముఖం పట్టడం చూసి షాక్ అయ్యాను. కొన్ని సెకనుల తరువాత మా దీవి వైపు భారీ సముద్రపు అలలు దూసుకొస్తున్నాయి, ఆ తర్వాత బలమైన ప్రకంపనలు వచ్చాయి. ప్రజలు కేకలు వేస్తూ గుట్ట వైపు పరుగెత్తడం చూశాను. పానిక్ ఎటాక్ వచ్చి స్పృహ తప్పి పడిపోయాను.కొన్ని గంటల తరువాత స్పృహలోకి వచ్చాను. కొండ అడవిలో వేలాది మంది స్థానికుల మధ్య నేను ఉన్నాను. నా భర్త, పెద్ద కొడుకును చూడగానే ప్రాణం లేచి వచ్చింది. మా ద్వీపంలోని చాలాప్రాంతాలు రాక్షస అలల తాకిడికి నాశనం అయ్యాయి. ఆస్తి అనేది లేకుండా పోయింది.ఒకరోజు రాత్రి పదకొండు గంటల తరువాత నాకు పురిటినొప్పులు వచ్చాయి. కానీ చుట్టుపక్కల డాక్టర్లు ఎవరూ లేరు. నేను ఒక బండరాయిపై పడుకొని సహాయం కోసం ఏడ్చాను. నా భర్త ఎంత ప్రయత్నించినా వైద్యసహాయం అందలేదు. అడవిలో ఆశ్రయం పొందిన కొందరు మహిళలను నా భర్త వేడుకున్నాడు. వారి సాయంతో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సునామీకి జన్మనిచ్చాను.తిండి లేదు. సముద్రానికి భయపడి అడవి నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో నా బిడ్డ బతుకుతాడా అనే బాధ మొదలైంది. కొబ్బరి నీళ్లే ఆహారమయ్యాయి. లాల్ టిక్రీ హిల్స్‌లో నాలుగు రాత్రులు గడిపిన మమ్మల్ని రక్షణ సిబ్బంది కాపాడారు. చికిత్స కోసం నన్ను పోర్ట్ బ్లెయిర్‌లోని జీబీ పంత్ ఆసుపత్రికి ఓడలో తీసుకువెళ్లారు. హట్ బే నుంచి పోర్ట్ బ్లెయిర్‌కు 117 కిలోమీటర్ల దూరం. సుమారు ఎనిమిది గంటల సమయం పట్టింది’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది నమిత.కోవిడ్ మహమ్మారి సమయంలో భర్త లక్ష్మీ నారాయణ మరణించడంతో ఇద్దరు కుమారులు సౌరభ్, సునామీలతో కలిసి పశ్చిమబెంగాల్లోని హుగ్లీలో నివసిస్తుంది నమితా రాయ్.నమిత పెద్ద కుమారుడు సౌరభ్ ఒక ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు సునామీ ‘ఓషనోగ్రాఫర్’ కావాలనుకుంటున్నాడు.‘మా అమ్మే నాకు సర్వస్వం. ఆమె ధైర్యశాలి. నాన్న చనిపోయాక మమ్మల్ని పోషించడానికి చాలా కష్టపడింది. ఫుడ్ డెలివరీ సర్వీసును నిర్వహించింది. దానికి సునామీ కిచెన్ అని సగర్వంగా పేరు పెట్టింది’ అంటున్నాడు సునామీ రాయ్.‘2004లో సమర్థవంతమైన హెచ్చరిక వ్యవస్థ లేకపోవడంతో పెద్ద ఎత్తున విధ్వంసం,ప్రాణ నష్టం జరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1.400కు పైగా హెచ్చరిక కేంద్రాలు(వార్నింగ్ స్టేషన్స్) ఉన్నాయి. సునామీ నాటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు మేము సర్వసన్నద్ధంగా ఉన్నాం’ అంటున్నారు అండామన్ నికోబార్ దీవుల అడ్మినిస్ట్రేషన్ సీనియర్ అధికారులు. -
జీవితాన్నే మార్చేసిన ఒక లిఫ్ట్ ఇన్సిడెంట్
నా వయసు 24 సంవత్సరాలు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ని. నా పనిలో బాగా రాణిస్తున్న తరుణంలో ఒకరోజు లిఫ్ట్‌లో 15 నిమిషాలు ఒక్కదాన్ని స్ట్రక్ అయ్యాను. అపుడు నాకు విపరీతంగా చెమటలు పట్టి, గుండె ఆగిపోతుందేమో అన్నంత వేగంగా కొట్టుకుని, ఒళ్ళంతా చల్లబడి, ఊపిరి ఆడనంత పరిస్థితి. ఆ సమయంలో ఇక చనిపోతానేమో అనేంత భయం వేసింది. ఇది జరిగి ఒక సంవత్సరం అయినప్పటికీ, దీని తర్వాత నేను లిఫ్ట్ ఎక్కడం మానేసి మెట్లే ఎక్కడం కాకుండా, ఫ్లైట్ ట్రావెల్‌ని కూడా అవాయిడ్ చేస్తున్నాను. మరల అలాంటి ఎటాక్ వస్తుందేమో అన్న భయం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంది. అనేక సార్లు వచ్చిన ప్రమోషన్ అవకాశాన్ని కూడా ఈ ట్రావెల్ ఫోబియా వల్ల వదులుకున్నాను. నాకు సహాయం చేయండి. – నందిని, కాకినాడనందినీగారూ! మీకున్న ఈ సమస్యను ప్యానిక్ ఎటాక్ అంటారు. ఇటువంటి సమస్య తరచూ వస్తున్నా లేదా వస్తాయనే భయంతో మీరు లిఫ్ట్, ఫ్లైట్ వంటివి అవాయిడ్ చేస్తుండటాన్ని ప్యానిక్ డిజార్డర్ అంటారు. ఇది చాలా సాధారణ మానసిక కండిషన్. కొంతమంది బాగా జనం ఉన్న ప్రదేశాలలో మరికొంత మంది తలుపులు అన్ని మూసేసిన గదిలో ఉన్నా ఇలా అనేక సందర్భాల్లో ప్యానిక్ అటాక్ రావచ్చు. వీటిని నిర్లక్ష్యం చేసినట్లయితే అకారణంగా కూడా ఈ అటాక్ వచ్చే అవకాశం ఉంది. ప్యానిక్ అటాక్‌ని ట్రీట్ చేయడానికి ‘కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’ ‘మైండ్‌ఫుల్‌నెస్ ట్రెయినింగ్’ ‘రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్’తో పాటు కొన్ని రకాల మంచి మందుల ద్వారా చికిత్స చేయవచ్చు. మీ జీవితంలో ఇబ్బంది వల్ల మీరు ఎంతో కోల్పోతున్నట్లు తెలుస్తుంది. కనుక మీరు తొందరలో మంచి మానసిక వైద్యుణ్ణి కలిసి దీని నుండి విముక్తి పొందాలని, మీ పూర్తి సామర్థ్యాన్ని తిరిగి సాధించాలని ఆశిస్తున్నాను. డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com(చదవండి: పట్టు చీరలకు కేరాఫ్ అడ్రస్ ఆ ఊరు..!) -
సాఫ్ట్వేర్ జాబ్.. రూ.3 కోట్లు వేతనం - అయినా వదిలేశాడు! కారణం తెలిస్తే..
ఆధునిక కాలంలో చాలామంది గూగుల్, మెటా వంటి బడా కంపెనీలలో ఉద్యోగం చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. అయితే ఒక ఉద్యోగి మాత్రం కొన్ని కారణాల వల్ల కోట్లు వేతనం వచ్చే మెటా సంస్థలో ఉద్యోగాన్ని వదిలేసినట్లు సమాచారం. దీనికి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటాలో ఏడాదికి రూ. 3 కోట్లు వేతనాన్ని పొందే 28 సంవత్సరాల సాఫ్ట్వేర్ ఉద్యోగి 'ఎరిక్ యు' (Eric You) వర్క్ తరువాత కూడా అదే ఆలోచనలతో ఉండటం వల్ల పానిక్ అటాక్స్ ఎదుర్కోవాల్సి వచ్చిందని, దీంతో జాబ్ వదిలేయాల్సి వచ్చినట్లు తెలిపాడు. నిజానికి వర్క్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. కానీ ఆ పని ఒత్తిడి అలాగే ఉండేది. వీకెండ్ సమయంలో పని చేసినా కూడా బాస్ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కారణాల వల్ల ఆఫీసులోనే మొదటి సారి పానిక్ అటాక్ వచ్చినట్లు తెలిపాడు. ఇదీ చదవండి: మామకు తగ్గ మేనల్లుడు.. అర్జున్ కొఠారి ఆస్తులు ఇన్ని కోట్లా? 2019 నవంబర్ సమయంలో వర్క్ ఫ్రమ్ చేస్తున్నప్పుడు కూడా పానిక్ అటాక్ వచ్చిందని, ఆ తరువాత పలుమార్లు ఈ అటాక్ వెంటాడుతూనే ఉండటం వల్ల జాబ్ వదిలి, రియల్ ఎస్టేట్‌లో పనిచేస్తున్నట్లు వెల్లడించాడు. -
గుండెపోటుతో చనిపోతాననే భయం.. ఎందుకిలా? సమస్య ఏమిటంటే..
Panic Attacks: సంతోష్ పేరుకు తగ్గట్టే నిత్యం సంతోషంగా ఉంటాడు. కొన్ని సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో ఉంటూ బాగా సంపాదించాడు. తనకంటూ సొంతకారు కొనుక్కున్నాక, సొంత ఇల్లు కట్టుకున్నాకే నిత్యను పెళ్లి చేసుకున్నాడు. జీవితం సాఫీగా సాగిపోతోంది. ఒకరోజు కారులో సైట్‌కు వెళ్తున్న సమయంలో గుండె పట్టేసినట్లనిపించింది. లైట్‌గా తీసుకున్నాడు. మరో నెల తర్వాత నిద్రపోతుండగా అదే రిపీట్ అయ్యింది. వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి డాక్టర్‌ను కలిశాడు. ఆయన అన్ని పరీక్షలు చేశాక ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని నిర్ధారించాడు. కానీ మరో నెల తర్వాత బిజినెస్ మీటింగ్‌లో ఉండగా అదే పరిస్థితి రిపీట్ అయ్యింది. గుండెపోటు వచ్చిందేమోనని తీవ్రంగా భయపడ్డాడు, వణికిపోయాడు. మళ్లీ హాస్పిటల్‌కు వెళ్లి అన్ని పరీక్షలూ చేయించుకున్నాడు. ఎలాంటి సమస్యా లేదన్నారు. కానీ గుండెపోటుతో చనిపోతాననే భయం ఏ మాత్రం తగ్గలేదు. ఎప్పుడు ఏమవుతుందోనని వణికిపోతున్నాడు. ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేకపోయినా ఇలా అకస్మాత్తుగా భయాందోళనలతో మనసు, శరీరం అతలాకుతలం కావడాన్ని పానిక్ అటాక్స్ అంటారు. కారణాలు తెలియవు.. ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు మనం పోరాడతాం లేదా పారిపోతాం. అది శరీరపు సహజ స్పందన. అలాంటి సందర్భాల్లో గుండె వేగంగా కొట్టుకుంటుంది, శ్వాస వేగవంతమవుతుంది. పానిక్ అటాక్స్‌లో కూడా అలాంటి ప్రతిచర్యలే జరుగుతాయి. స్పష్టమైన ప్రమాదం లేకున్నా అలా ఎటాక్స్ ఎందుకు వస్తాయో కారణాలు తెలియవు. కానీ జీన్స్, ఒత్తిడి, ఒత్తిడి వల్ల తీవ్ర ప్రతికూల భావోద్వేగాలకు గురయ్యే స్వభావం, మెదడులోని భాగాల పనితీరులో మార్పులు కారకాలుగా గుర్తించారు. పానిక్ అటాక్స్ లక్షణాలు.. ►పానిక్ అటాక్స్కు గుండె వేగంగా కొట్టుకోవడం ఒక్కటే కాదు ఇంకా అనేక లక్షణాలున్నాయి. ►ఒళ్లంతా వణుకుతుంది, చెమటలు పడతాయి. ►శ్వాస వేగవంతమవుతుంది లేదా ఆగిపోయినట్లనిపిస్తుంది. ►ఒళ్లంతా వేడి సెగలు, వేడి ఆవిరులు వస్తాయి. ►తలనొప్పి, తల తిరగడం, మైకం లేదా మూర్ఛపోవచ్చు. ►మరణభయం వెంటాడుతుంది. ►ఈ అటాక్స్ జీవితంలోని ప్రతి అంశాన్నీ ప్రభావితం చేస్తాయి. ►డ్రైవింగ్ చేయాలన్నా, ఇల్లు వదిలి వెళ్లాలన్నా భయం వెంటాడుతుంది. ►తరచూ హాస్పిటళ్ల చుట్టూ తిరగడం పెరుగుతుంది. ►పదిమందిలో కలవడాన్ని నిలిపేస్తారు. దీనివల్ల పనిలో సమస్యలు ఎదురవుతాయి. ►డిప్రెషన్, యాంగ్జయిటీ లాంటి మానసిక రుగ్మతలూ రావచ్చు. ►ఆత్మహత్య ఆలోచనలు పెరిగే ప్రమాదం ఉంది. ►భయాన్ని అధిగమించేందుకు మద్యం వినియోగం పెరుగుతుంది. ►మొత్తంమీద జీవితం దుర్భరంగా మారుతుంది. తరచూ వస్తుంటే డిజార్డర్ ►పానిక్ అటాక్స్ తరచుగా వస్తుంటే దాన్ని పానిక్ డిజార్డర్ అంటారు. ఈ డిజార్డర్ ఉన్నవారికి ఒకసారి అటాక్ రాగానే, మరొక అటాక్ వస్తుందేమోననే ఆందోళన నెల లేదా అంతకంటే ఎక్కువకాలం కొనసాగుతుంది. ►గుండెపోటు వస్తుందేమోననే భయాందోళనలు తీవ్రంగా ఉంటాయి. అందువల్ల అటాక్స్కు కారణమని భావించే పరిస్థితులను పూర్తిగా అవాయిడ్ చేస్తారు. ప్రవర్తనలో ముఖ్యమైన మార్పులు కనిపిస్తాయి. ఈ లక్షణాలు తరచుగా టీనేజ్ చివరిలో లేదా యుక్తవయస్సులో ప్రారంభమవుతాయి.ఇవి పురుషుల కంటే స్త్రీలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఎవరికి వస్తుందంటే.. ►కుటుంబంలో ఎవరికైనా పానిక్ డిజార్డర్ ఉన్నప్పుడు ►తీవ్ర అనారోగ్యం, ప్రియమైన వ్యక్తి మరణం, శారీరక, లైంగిక వేధింపులు, సీరియస్ యాక్సిడెంట్ లాంటి తీవ్ర ఒత్తిడి కలిగించే సంఘటనలు ►విడాకులు లేదా బిడ్డను కనడం వంటి మేజర్ మార్పులు ►ధూమపానం లేదా అధిక కెఫీన్ తీసుకోవడం ఏం చేయాలి? ►రోజూ వ్యాయామం చేస్తూ శారీరకంగా చురుకుగా ఉండండి ►పగటిపూట మగతగా అనిపించకుండా తగినంత నిద్రపోండి ►మీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, డీప్ బ్రీతింగ్, జాకబ్సన్ రిలాక్సేషన్ లాంటివి ప్రాక్టీస్ చేయండి ►కాఫీ, మద్యం, ధూమపానం, డ్రగ్స్ మీ పానిక్ అటాక్స్‌ను ప్రేరేపిస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండండి ►యాంగ్జయిటీ, పానిక్ డిజార్డర్ ఉన్న వ్యక్తులతో ఏర్పడిన సపోర్ట్ గ్రూపులో చేరండి ►అప్పటికీ మీ భయాందోళనలు తగ్గకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌ను కలవండి ►మీకు వచ్చే అటాక్స్ ప్రాణాంతకం కాదని తెలుసుకోవడానికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ సహాయపడుతుంది ►థెరపీ వల్ల మీకు కొన్ని వారాల్లోనే రిలీఫ్ రావచ్చు. ►రిలీఫ్ వచ్చేసిందని థెరపీ ఆపేయకుండా సైకాలజిస్ట్ చెప్పిన ప్రొటోకాల్‌కు కట్టుబడి ఉండండి. ►మీ డిజార్డర్ నుంచి పూర్తిగా బయటపడేందుకు కొన్ని నెలలు పట్టవచ్చు ►మీ డిజార్డర్ తీవ్రంగా ఉన్నప్పుడు సైకియాట్రిస్ట్‌ను కలసి, ఆయన ఇచ్చిన మందులను క్రమం తప్పకుండా తీసుకోండి. -సైకాలజిస్ట్ విశేష్ చదవండి: Overcome OCD: పదే పదే అవే చెడు ఆలోచనలు.. తల్లి, చెల్లి పట్ల కూడా! ఆఖరికి గుడికి వెళ్లినా.. ఏం చేయాలి? -
విద్యుత్ చౌర్యంపై కేసుల నమోదు
ఏసీలు ఉన్న ఇంటికి దొడ్డిదారిలో.. నాలుగు మండలాల్లో దాడులు చేసిన విద్యుత్ విజిలెన్స్ సిబ్బంది 193 కేసులు నమోదు, రూ.20 లక్షల జరిమాన తిరుపతి రూరల్: విద్యుత్ చౌర్యంపై ఆ శాఖ విజిలెన్స్ విభాగం ఆకస్మిక దాడులు చేసింది. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన 38 మంది విద్యుత్ విజిలెన్స్, ఏపీటీఎస్ ఇన్స్పెక్టర్లు, వివిధ బృందాలుగా ఏర్పడి చిత్తూరు రూరల్, పెద్దమండ్యం, బంగారుపాళెం, ఏర్పేడు మండలాల్లో మంగళవారం విస్తృత తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో మీటర్‌కు సంబంధం లేకుండా వివిధ రూపాల్లో విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న మొత్తం 193 మందిపై కేసులు నమోదు చేసినట్లు సదరన్ డిస్కం విజిలెన్స్ సూపరింటెండింగ్ ఇంజనీరు వి.రవి తెలిపారు. మొత్తం రూ.20 లక్షలను జరిమాన విధించామన్నారు. ముఖ్యంగా పెద్దమండ్యం మండలం కనిచెర్లలోని చైతన్య స్కూల్‌కు మీటర్‌ను బైపాస్ చేసి దొంగచాటుగా విద్యుత్‌ను వినియోగిస్తున్నట్లు గుర్తించామని, ఆ స్కూల్‌కు రూ.85 వేలు జరిమాన విధించామన్నారు. అలాగే బంగారుపాళెం మండలం సంక్రాంతిపల్లిలో దేవేంద్ర బ్రిక్స్ ఫ్యాక్టరీకి రూ.40 వేలు, పెద్దమండ్యం మండలం కనిచెర్లలో పాపన్నకు చెందిన ఎస్వీఎస్ బేకరీలో మీటర్ బైపాస్ చేసి విద్యుత్‌ను చౌర్యం చేయడంతో రూ.70 వేలు, పైపల్లి మండలం నెల్లిశెట్టిపల్లిలో ఎస్ఆర్ కృష్ణ అనే వ్యక్తికి రూ.88 వేలు, ఇటుకబట్టీకి నేరుగా కొక్కీలు వేసుకుని విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న బంగారుపాళెం మండలం ముంగరమడుగులో దండు రాజశేఖర్‌కి రూ.88 వేలు జరిమాన విధించినట్లు తెలిపారు. జిల్లాలో గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ నెలాఖారు నాటికి 2,914 కేసులు నమోదు చేసి రూ.2.07 కోట్లను జరిమానగా విధించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో విద్యుత్ చౌర్యం ఎక్కువగా పీలేరు, మదనపల్లి, చిత్తూరు రూరల్, పుత్తూరు, తిరుపతి రూరల్ డివిజన్ల పరిధిలో ఉన్నట్లు ఆరోపణలు రావడంతో విజిలెన్స్ జేఎండీ ఉమాపతి ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. విద్యుత్ చౌర్యం చట్టరీత్యా నేరమని, ప్రతి ఒక్కరూ మీటరు ద్వారానే విద్యుత్ వినియోగించుకోవవాలని కోరారు. -
నోట్లరద్దుతో ‘నల్ల’ సంపన్నుడికి గుండెపోటు!
కార్డియాలజిస్ట్‌లు, సైక్రియార్టిస్టులను సంపంద్రిస్తున్న బడాబాబులు ఆయన ఇంట్లో కట్టలకొద్దీ నగదు ఉంది. నిన్నటివరకు నిశ్చింతగా నెత్తిమీద తడిగుడ్డ వేసుకొని పడుకున్న ఆయనలో ఒక్కసారిగా పెద్దనోట్ల రద్దు ప్రకంపనలు రేపింది. తన నల్ల సందప ఏమైపోతుందోనన్న గుండెదడ. నిద్రపట్టదు. ఒళ్లంతా చెమటలు. శ్వాస ఆడటంలో ఇబ్బంది. ఇది ఇటీవల ముంబైకి చెందిన 55 ఏళ్ల బడా వ్యాపారవేత్త ఒకరు ఎదుర్కొన్న అనుభవం. ఆయన వెంటవెంటనే రెండుసార్లు కార్డియాలజిస్ట్ (హృద్రోగ డాక్టర్)ను కలిశారు. ఆ వెంటనే కెమ్ (కేఈఎం) ఆస్పత్రికి చెందిన సైక్రియార్టిస్ట్ వద్దకు వెళ్లి విస్తారమైన పరీక్షలు జరుపుకొన్నారు. ఒక్కసారిగా ప్రధాని మోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో దేశంలోని చాలామంది నల్లధన కుబేరుల్లో భయం కమ్ముకొని ఈ రకమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని సైక్రియార్టిస్టులు, హృద్రోగ నిపుణులు చెప్తున్నారు. పెద్దనోట్ల రద్దు దేశంలో పెను ప్రకంపనలను సృష్టించిన సంగతి తెలిసిందే. దీనివల్ల నిరుపేద, మధ్యతరగతి ప్రజలు బ్యాంకుల ముందు కరెన్సీ మార్చుకోవడానికి నానా కష్టాలు పడుతుండగా.. నల్లధన సంపన్నులు మరోరకమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని మానసిక వైద్య నిపుణులు చెప్తున్నారు. తాజాగా ముంబైలోని తార్దేవ్ ప్రాంతానికి చెందిన ఓ నల్లసంపన్నుడు ఎదుర్కొన్న పరిస్థితిని ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు. కట్టలుకొద్ది వెల్లడించని నగదు కలిగిన సదరు వ్యక్తి విపరీతమైన మానసిక భయాందోళనకు లోనయ్యాడని, దీంతో మూడురోజులుగా నిద్రకు దూరమైన అతనికి గుండెపోటు కూడా వచ్చిందని కేమ్ ఆస్పత్రి సైక్రియార్టిస్ట్ డాక్టర్ సాగర్ ముందాదా తెలిపారు. దీంతో సదరు వ్యాపారికి యాంటి డిప్రెషన్ ప్రిస్ర్కిప్షన్ ఇచ్చినట్టు ఆయన వివరించారు. ఇలాంటి కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని, హృద్రోగ సమస్యలు, మానసిక భయాందోళనలతో ఇటీవల తమను కలుస్తున్న వారిలో ఎక్కువమంది బిల్డర్లు, వ్యాపారులు ఉంటున్నారని సైక్రియార్టిస్టులు చెప్తున్నారు. -
ఇసుక క్వారీలపై అధికారుల ఆకస్మిక దాడులు
వర్ధన్నపేట టౌన్ : ఇన్నాళ్లు ఆకేరువాగు ఒడ్డున యథేచ్ఛగా ఇసుక క్వారీలను నిర్వహిస్తున్న వారిని చూసీచూడనట్లు వదిలేసిన అధికారులు బుధవారం ఏడు క్వారీలపై ఆకస్మిక దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. వరంగల్ ఆర్డీఓ వెంకటమాధవరావు ఆధ్వర్యంలో వరంగల్, హన్మకొండ, రాయపర్తి తహసీల్దార్లు రాజ్‌కుమార్, రవి, మూర్తితోపాటు వర్ధన్నపేట సీఐ ఆదినారాయణ, రాయపర్తి, జఫర్గడ్ ఎస్సైలు శ్రీధర్, సంపత్, ప్రొబేషనరీ ఎస్సై వెంకటకృష్ణ సిబ్బంది ఈ దాడులు నిర్వహించారు. దాడుల్లో వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఆకేరు వాగు ఒడ్డున గాడిపెల్లి రాజేశ్వర్‌రావుకు చెందిన యంత్రసామగ్రి సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇల్లంద శివారులో కమ్మగోని ప్రభాకర్, సోల్తి రాజబాబు, సోల్తి రాంబాబు, సోల్తి ఉప్పలయ్య, తాళ్లపెల్లి సాంబరాజు ఇసుక క్వారీలు నిర్వహిస్తూ, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుకను విక్రయిస్తున్నారని వర్ధన్నపేట తహసీల్దార్ కనకయ్య స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఏడుగురిపై దొంగతనం కేసు నమోదు చేశారు. దాడులు జరుగుతున్నపుడు చిక్కిన మూడు ట్రాక్టర్ల ను సీజ్ చేసి, యజమానులపై దొంగతనం కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. -
ఇసుక క్వారీలపై అధికారుల ఆకస్మిక దాడులు
వర్ధన్నపేట టౌన్ : ఇన్నాళ్లు ఆకేరువాగు ఒడ్డున యథేచ్ఛగా ఇసుక క్వారీలను నిర్వహిస్తున్న వారిని చూసీచూడనట్లు వదిలేసిన అధికారులు బుధవారం ఏడు క్వారీలపై ఆకస్మిక దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. వరంగల్ ఆర్డీఓ వెంకటమాధవరావు ఆధ్వర్యంలో వరంగల్, హన్మకొండ, రాయపర్తి తహసీల్దార్లు రాజ్‌కుమార్, రవి, మూర్తితోపాటు వర్ధన్నపేట సీఐ ఆదినారాయణ, రాయపర్తి, జఫర్గడ్ ఎస్సైలు శ్రీధర్, సంపత్, ప్రొబేషనరీ ఎస్సై వెంకటకృష్ణ సిబ్బంది ఈ దాడులు నిర్వహించారు. దాడుల్లో వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఆకేరు వాగు ఒడ్డున గాడిపెల్లి రాజేశ్వర్‌రావుకు చెందిన యంత్రసామగ్రి సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇల్లంద శివారులో కమ్మగోని ప్రభాకర్, సోల్తి రాజబాబు, సోల్తి రాంబాబు, సోల్తి ఉప్పలయ్య, తాళ్లపెల్లి సాంబరాజు ఇసుక క్వారీలు నిర్వహిస్తూ, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుకను విక్రయిస్తున్నారని వర్ధన్నపేట తహసీల్దార్ కనకయ్య స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఏడుగురిపై దొంగతనం కేసు నమోదు చేశారు. దాడులు జరుగుతున్నపుడు చిక్కిన మూడు ట్రాక్టర్ల ను సీజ్ చేసి, యజమానులపై దొంగతనం కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.