ఏసీలు ఉన్న ఇంటికి దొడ్డిదారిలో..
నాలుగు మండలాల్లో దాడులు చేసిన విద్యుత్ విజిలెన్స్ సిబ్బంది
193 కేసులు నమోదు, రూ.20 లక్షల జరిమాన
తిరుపతి రూరల్: విద్యుత్ చౌర్యంపై ఆ శాఖ విజిలెన్స్ విభాగం ఆకస్మిక దాడులు చేసింది. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన 38 మంది విద్యుత్ విజిలెన్స్, ఏపీటీఎస్ ఇన్‌స్పెక్టర్లు, వివిధ బృందాలుగా ఏర్పడి చిత్తూరు రూరల్, పెద్దమండ్యం, బంగారుపాళెం, ఏర్పేడు మండలాల్లో మంగళవారం విస్తృత తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో మీటర్‌కు సంబంధం లేకుండా వివిధ రూపాల్లో విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న మొత్తం 193 మందిపై కేసులు నమోదు చేసినట్లు సదరన్ డిస్కం విజిలెన్స్ సూపరింటెండింగ్ ఇంజనీరు వి.రవి తెలిపారు. మొత్తం రూ.20 లక్షలను జరిమాన విధించామన్నారు. ముఖ్యంగా పెద్దమండ్యం మండలం కనిచెర్లలోని చైతన్య స్కూల్‌కు మీటర్‌ను బైపాస్ చేసి దొంగచాటుగా విద్యుత్‌ను వినియోగిస్తున్నట్లు గుర్తించామని, ఆ స్కూల్‌కు రూ.85 వేలు జరిమాన విధించామన్నారు. అలాగే బంగారుపాళెం మండలం సంక్రాంతిపల్లిలో దేవేంద్ర బ్రిక్స్ ఫ్యాక్టరీకి రూ.40 వేలు, పెద్దమండ్యం మండలం కనిచెర్లలో పాపన్నకు చెందిన ఎస్‌వీఎస్ బేకరీలో మీటర్ బైపాస్ చేసి విద్యుత్‌ను చౌర్యం చేయడంతో రూ.70 వేలు, పైపల్లి మండలం నెల్లిశెట్టిపల్లిలో ఎస్‌ఆర్ కృష్ణ అనే వ్యక్తికి రూ.88 వేలు, ఇటుకబట్టీకి నేరుగా కొక్కీలు వేసుకుని విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న బంగారుపాళెం మండలం ముంగరమడుగులో దండు రాజశేఖర్‌కి రూ.88 వేలు జరిమాన విధించినట్లు తెలిపారు.
జిల్లాలో గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ నెలాఖారు నాటికి 2,914 కేసులు నమోదు చేసి రూ.2.07 కోట్లను జరిమానగా విధించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో విద్యుత్ చౌర్యం ఎక్కువగా పీలేరు, మదనపల్లి, చిత్తూరు రూరల్, పుత్తూరు, తిరుపతి రూరల్ డివిజన్ల పరిధిలో ఉన్నట్లు ఆరోపణలు రావడంతో విజిలెన్స్ జేఎండీ ఉమాపతి ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. విద్యుత్ చౌర్యం చట్టరీత్యా నేరమని, ప్రతి ఒక్కరూ మీటరు ద్వారానే విద్యుత్ వినియోగించుకోవవాలని కోరారు.
విద్యుత్ చౌర్యంపై కేసుల నమోదు
Published Wed, Jan 25 2017 10:38 PM | Last Updated on Wed, Sep 5 2018 1:46 PM
Advertisement