నోట్లరద్దుతో ‘నల్ల’ సంపన్నుడికి గుండెపోటు!
- కార్డియాలజిస్ట్‌లు, సైక్రియార్టిస్టులను సంపంద్రిస్తున్న బడాబాబులు
ఆయన ఇంట్లో కట్టలకొద్దీ నగదు ఉంది. నిన్నటివరకు నిశ్చింతగా నెత్తిమీద తడిగుడ్డ వేసుకొని పడుకున్న ఆయనలో ఒక్కసారిగా పెద్దనోట్ల రద్దు ప్రకంపనలు రేపింది. తన నల్ల సందప ఏమైపోతుందోనన్న గుండెదడ. నిద్రపట్టదు. ఒళ్లంతా చెమటలు. శ్వాస ఆడటంలో ఇబ్బంది. ఇది ఇటీవల ముంబైకి చెందిన 55 ఏళ్ల బడా వ్యాపారవేత్త ఒకరు ఎదుర్కొన్న అనుభవం. ఆయన వెంటవెంటనే రెండుసార్లు కార్డియాలజిస్ట్ (హృద్రోగ డాక్టర్)ను కలిశారు. ఆ వెంటనే కెమ్ (కేఈఎం) ఆస్పత్రికి చెందిన సైక్రియార్టిస్ట్ వద్దకు వెళ్లి విస్తారమైన పరీక్షలు జరుపుకొన్నారు. ఒక్కసారిగా ప్రధాని మోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో దేశంలోని చాలామంది నల్లధన కుబేరుల్లో భయం కమ్ముకొని ఈ రకమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని సైక్రియార్టిస్టులు, హృద్రోగ నిపుణులు చెప్తున్నారు.
పెద్దనోట్ల రద్దు దేశంలో పెను ప్రకంపనలను సృష్టించిన సంగతి తెలిసిందే. దీనివల్ల నిరుపేద, మధ్యతరగతి ప్రజలు బ్యాంకుల ముందు కరెన్సీ మార్చుకోవడానికి నానా కష్టాలు పడుతుండగా.. నల్లధన సంపన్నులు మరోరకమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని మానసిక వైద్య నిపుణులు చెప్తున్నారు. తాజాగా ముంబైలోని తార్‌దేవ్ ప్రాంతానికి చెందిన ఓ నల్లసంపన్నుడు ఎదుర్కొన్న పరిస్థితిని ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు.
కట్టలుకొద్ది వెల్లడించని నగదు కలిగిన సదరు వ్యక్తి విపరీతమైన మానసిక భయాందోళనకు లోనయ్యాడని, దీంతో మూడురోజులుగా నిద్రకు దూరమైన అతనికి గుండెపోటు కూడా వచ్చిందని కేమ్ ఆస్పత్రి సైక్రియార్టిస్ట్ డాక్టర్ సాగర్ ముందాదా తెలిపారు. దీంతో సదరు వ్యాపారికి యాంటి డిప్రెషన్ ప్రిస్ర్కిప్షన్ ఇచ్చినట్టు ఆయన వివరించారు. ఇలాంటి కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని, హృద్రోగ సమస్యలు, మానసిక భయాందోళనలతో ఇటీవల తమను కలుస్తున్న వారిలో ఎక్కువమంది బిల్డర్లు, వ్యాపారులు ఉంటున్నారని సైక్రియార్టిస్టులు చెప్తున్నారు.