ముసద్దిలాల్‌ జ్యువెల్లర్స్‌పై మరో కేసు | Another case against Musaddilal Jewelers | Sakshi
Sakshi News home page

ముసద్దిలాల్‌ జ్యువెల్లర్స్‌పై మరో కేసు

Published Mon, Jul 22 2019 2:13 AM | Last Updated on Mon, Jul 22 2019 2:13 AM

Another case against Musaddilal Jewelers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెద్ద నోట్ల రద్దు సమయంలో తప్పుడు ఇన్వాయిస్‌లతో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే విషయంలో అడ్డంగా దొరికిపోయిన ముసద్దిలాల్‌ జ్యువెల్లర్స్‌పై తాజాగా మరో కేసు నమోదైంది. తమకు రూ.75 కోట్లు రుణం తీసుకుని ఎగ్గొట్టారన్న ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు (ఐవోబీ) ఫిర్యాదుతో సీబీఐ చీటింగ్‌ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముసద్దిలాల్‌ జ్యువెల్లర్స్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తోపాటు కంపెనీ డైరెక్టర్లు మోహన్‌లాల్‌ గుప్తా, ప్రశాంత్‌ గుప్తాలను నిందితులుగా చేర్చింది. పంజగుట్ట కేంద్రంగా నడుస్తోన్న ముసద్దిలాల్‌ జ్యువెల్లర్స్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 2009 అక్టోబర్‌లో ఐఎన్జీ వైశ్యా బ్యాంక్‌ నుంచి రూ.55 కోట్లు రుణం తీసుకుంది.

ఈ క్రమంలో తమ రుణాన్ని ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు(ఐఓబీ)కు మార్చాలంటూ ముసద్దిలాల్‌ జ్యువెల్లర్స్‌ ఐఎన్జీ వైశ్యా బ్యాంకుకు విన్నవించుకుంది. బ్యాలెన్స్‌ షీట్‌ సరిగానే నిర్వహించడంతో సంతృప్తి చెందిన ఐఎన్జీ వైశ్యా బ్యాంకు 2013 మార్చిలో ఆ రుణాన్ని ఐవోబీ బ్యాంకుకు మార్చారు. ఆ తర్వాత బ్యాంకు వద్ద మరికొంత రుణం తీసుకున్నారు. అది కాస్తా రూ.82 కోట్లకు చేరింది. రానురాను రుణాన్ని తిరిగి చెల్లించడంలో ముసద్దిలాల్‌ జ్యువెల్లర్స్‌ విఫలమవుతూ వచ్చింది. దీంతో 2014 మార్చిలో ఖాతాలను బ్యాంకు స్తంభింపజేసింది.

2016లో జరిగిన ఆడిట్‌ తనిఖీల్లో వారు తీసుకున్న రుణంలో రూ.58 కోట్ల రూపాయలను ఇతర కంపెనీలకు మళ్లించినట్లుగా గుర్తించారు. దీంతో తమ వద్ద తీసుకున్న రుణాన్ని ఉద్దేశపూర్వకంగా మళ్లించి తమకు రూ.75 కోట్లు ఎగ్గొట్టారని బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. దీంతో ఐవోబీ బ్యాంకు చీఫ్‌ రీజనల్‌ మేనేజర్‌ రవిచంద్రన్‌ సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీబీఐ బెంగళూరు శాఖ ముసద్దిలాల్‌ జ్యువెల్లర్స్‌తోపాటు కంపెనీ డైరెక్టర్లు మోహన్‌లాల్‌ గుప్తా, ప్రశాంత్‌ గుప్తాలపై ఐపీసీ 120, 406, 420, 468, 471 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement