పేదరికం అంచునకు చేరుకున్న పాకిస్తాన్‌ను ఇప్పుడు నల్లధనం సమస్య వెంటాడుతోంది. పాకిస్తాన్‌లో నల్లధనం విపరీతంగా పెరిగిపోవడంతో దానిని అరికట్టడం ప్రభుత్వానికి అసాధ్యంగా మారింది. పాకిస్తాన్‌లో నల్లధనం సమాంతర ఆర్థిక వ్యవస్థను సృష్టించింది.
గరిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం
పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంది. పలువురు రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, ఆర్మీ జనరల్స్, ప్రభుత్వంతో భాగస్వామ్యం కలిగిన పోలీసు అధికారులు తమ ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నారని తేలింది. అటువంటి పరిస్థితిలో పాకిస్తాన్‌లో నల్లధనం నియంత్రణ కోసం ప్రభుత్వం చేస్తున్న దాడులు కూడా విఫలం అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కఠిన చర్యలు తీసుకుంటే ప్రభుత్వమే పడిపోయే ప్రమాదం ఉంది. పాక్‌లో ఇప్పుడున్న పరిస్థితుల్లో నల్లధనంపై మాట్లాడేందుకు ఏ పార్టీ నేతలు కూడా సిద్ధంగా లేరని సమాచారం.
పెద్ద నోట్ల రద్దుకు మద్దతు
పాకిస్తాన్‌లో నల్లధనాన్ని అరికట్టేందుకు భారత్ మాదిరిగా పెద్ద నోట్లను రద్దు చేయాలని అక్కడి ఆర్ధిక నిపుణులు కోరుతున్నారు. పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా భారతదేశం ఒక ఉదాహరణగా నిలిచిందని పాక్ పత్రిక ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది. ఇది మొదట్లో ఆర్థిక వ్యవస్థకు అనేక సవాళ్లను విసిరింది. కానీ తరువాతి కాలంలో ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించింది. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లను నియంత్రణలో ఉంచిందని ఆ పత్రిక పేర్కొంది. నగదు నిల్వలను అరికట్టేందుకు పాకిస్తాన్‌లో రూ.5000 నోటును దశలవారీగా రద్దు చేస్తారా అనే చర్చ ముమ్మరంగా జరుగుతోంది. అయితే దీనిపై పాక్ అధికారులు ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తున్నారు.
పాకిస్తాన్‌లోనే అతిపెద్ద నోటు
దక్షిణాసియా దేశాల్లో 5000 రూపాయల నోటు కేవలం పాకిస్తాన్‌లో మాత్రమే ఉంది. ఇంత భారీ విలువ కలిగిన నోటు మరే ఇతర ఆసియా దేశంలోనూ లేదు. నగదు నిల్వలకు ఇంత భారీ విలువ కలిగిన కరెన్సీ నోట్లు ప్రధాన కారణమని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ గత ఏడాదిలో నగదు ప్రవాహం గణనీయంగా పెరిగింది. పాకిస్తాన్ మొత్తంమీద భౌతిక నగదు మారకం 29 శాతం వరకూ ఉంటుంది.
పాకిస్తాన్‌లో జీడీపీలో 40 శాతం నల్లధనం
పాకిస్తాన్‌లో నల్లధనంతో ఏర్పడిన ఆర్థిక వ్యవస్థ 341.5 బిలియన్ డాలర్లుగా ఉందని అంచనా. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఐపీఎస్‌ఓఎస్ తెలిపిన వివరాల ప్రకారం, పాకిస్తాన్‌లోని షాడో ఆర్థిక వ్యవస్థ అక్కడి జీడీపీలో 40 శాతం మేరకు ఉంది. పాకిస్తాన్ జీడీపీలో ప్రతి సంవత్సరం 6 శాతం మాయమవుతున్నది. అంటే పెద్దమొత్తంలో నగదు లెక్కలకు అందకుండా పోతున్నది. ఇదే పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం దిశగా నెట్టివేస్తున్నది ఆర్థిక నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: జైలు గోడ దూకి నేపాలీ యువతి పరార్..!
Comments
Please login to add a commentAdd a comment