
పొరుగుదేశం పాకిస్తాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్(Jaffer Express) హైజాక్ ఘటన ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఈ నేపద్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య రైల్వే సంబంధాలపై చర్చ జరుగుతోంది. దేశవిభజన జరిగాక రైల్వే విషయంలో ఏం జరిగింది? ఆ సమయంలో భారత్, పాక్‌లకు ఏమేమి దక్కాయనే అంశంపై పలువురు ఆసక్తి చూపిస్తున్నారు.
1947లో భారత్‌కు స్వాతంత్ర్యం సిద్ధించాక దేశం విభజనతో పాటు రైల్వేలను కూడా విభజించారు. నాడు మన దేశంలో రైల్వే నెట్‌వర్క్(Railway network) చాలా తక్కువగా ఉండేది. విభజన తర్వాత పాకిస్తాన్‌కు కొన్ని రైళ్లు, ఉద్యోగులు, కొంత నగదు అప్పజెప్పారు. భారతదేశంలో రైల్వేలను ప్రవేశపెట్టిన ఘనత బ్రిటిష్ వారికే దక్కుతుంది. భారతీయ రైల్వేలు 1845 మే 8న ప్రారంభమయ్యాయి. అయితే రైల్వే లైన్ వేసే పని 1848లో ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ప్రణాళిక, భూసేకరణ తదితర పనులకు మూడేళ్లు పట్టాయి.
1853లో బొంబాయి (ఇప్పుడు ముంబై)- థానే మధ్య దాదాపు 34 కి.మీ.ల మొదటి ట్రాక్ నిర్మించారు. ఈ ట్రాక్‌పై మొదటి రైలు 1853, ఏప్రిల్ 16న నడిచింది. 1947లో దేశ విభజన జరిగినప్పుడు 11 వేల కి.మీ.లకు పైగా పొడవైన రైల్వే లైన్ పాకిస్తాన్ వైపునకు వెళ్ళింది. దీని కారణంగా రైల్వే పెట్టుబడి మూలధనంలో దాదాపు రూ. 150 కోట్లు పాకిస్తాన్ వాటాలోకి వచ్చాయి. విభజన సమయంలో పాకిస్తాన్‌కు పలు రైళ్లు అప్పగించారు. రైల్వే డివిజన్ వర్క్‌షాప్(Railway Division Workshop) కూడా పాకిస్తాన్‌కు దక్కింది. అయితే రైల్వే వర్క్‌షాప్‌ను రెండు దేశాలు ఉపయోగించుకోవాలని నాడు నిర్ణయం తీసుకున్నారు.
ఈ వర్క్‌షాప్‌ను రెండు దేశాలు చాలా కాలం పాటు ఉపయోగించుకున్నాయి. రైల్వే కార్మికులను కూడా రెండు దేశాల మధ్య విభజించారు. రైళ్లను నడపడం నుండి రైల్వేలను నిర్వహించడం వరకు ఇరు దేశాల మధ్య విభజన జరిగింది. దేశ విభజన సమయంలో, దాదాపు 1.26 లక్షల మంది రైల్వే కార్మికులు పాకిస్తాన్ నుండి భారతదేశానికి రావాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో భారతదేశంలోనే దాదాపు లక్ష మంది రైల్వే కార్మికులు పనిచేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన చాలా ఏళ్ల వరకూ కూడా రెండు దేశాల మధ్య ఒక రైలు నడిచింది. దాని పేరు సంఝౌతా ఎక్స్‌ప్రెస్. ఈ రైలు 1976 జూలై 22న ప్రారంభమైంది. దీనిని సిమ్లా ఒప్పందం కింద నడిపారు. ఈ రైలు నాడు పంజాబ్‌లోని అట్టారి నుండి పాకిస్తాన్‌లోని లాహోర్ వరకు నడిచేది. అయితే రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన నేపధ్యంలో 2019, ఫిబ్రవరి 28న ఈ రైలును రద్దు చేశారు.
ఇది కూడా చదవండి: బలవంతంగా రంగులు పోస్తే.. వైరల్ వీడియోలు