
ఢిల్లీ: దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి భారత్ విషం చిమ్మే ప్రయత్నం చేసింది. ఇటీవల బలూచిస్థాన్ తిరుగుబాటుదారులు రైలును హైజాక్ చేయడంలో, వారిని రెచ్చగొట్టడంతో భారత్ పాత్ర ఉంది పాకిస్థాన్ ఆరోపించింది. అంతేకాకుండా పొరుగుదేశాల్లో అస్థిరతకు భారత్ కృషి చేస్తోందని ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది. ఈ క్రమంలో ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో ప్రపంచం మొత్తానికి తెలుసు అంటూ విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.
ఇటీవల బలుచిస్తాన్‌లో ప్యాసింజర్ రైలు హైజాక్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు భారత్ కారణమంటూ తాజాగా పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి షఫ్‌ఖత్ అలీఖాన్ వ్యాఖ్యలు చేశారు. భారత్ తమ దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా హత్యాకాండకు పాల్పడుతోందన్నారు. భారత మీడియా బీఎల్‌ఏను కీర్తిస్తోంది. ఇది అధికారికంగా కాకపోయినా ఒక విధంగా ప్రసారం చేస్తోంది అంటూ ఇష్టానుసారం ఆరోపణలు గుప్పించారు.
ఈ నేపథ్యంలో షఫ్‌ఖత్ అలీఖాన్ వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘పాక్ విదేశీ విధానంలో ఎలాంటి మార్పు లేదు. పాకిస్థాన్ నిరాధార ఆరోపణలు చేస్తోంది. వారు ఇతరుల వైపు వేళ్లు చూపించే బదులు తమ అంతర్గత సమస్యలపై దృష్టిసారిస్తే బాగుంటుంది. ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో ప్రపంచం మొత్తానికి తెలుసు. ముందు అవ్వన్నీ చూసుకోవాలి’ అంటూ హితవు పలికారు.
Our response to media queries on the remarks made by the Pakistan side ⬇️
🔗 https://t.co/8rUoE8JY6A pic.twitter.com/2LPzACbvbf— Randhir Jaiswal (@MEAIndia) March 14, 2025
ఇదిలాఉండగా.. ఇటీవల పాక్‌లోని బలోచిస్థాన్‌లో ప్రయాణికుల రైలును వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 400 మంది ప్రయాణిస్తున్న ఈ రైలుపై మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. రైలు మార్గంలో 17 సొరంగాలు ఉండగా.. 8వ సొరంగం వద్ద మిలిటెంట్లు ట్రాక్‌ను పేల్చి జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఇప్పటికే బలోచ్ మిలిటెంట్లు 33 మందిని చంపేసినట్లు పాకిస్థాన్ సైన్యం ప్రకటించింది. 21 మంది ప్రయాణికులతో సహా నలుగురు సైనికులు వారి చేతిలో హతమయ్యారని తెలిపింది.