
ఇస్లామాబాద్: సంచలనం సృష్టించిన రైలు హైజాక్ ఉదంతానికి తెర దించినట్టు పాకిస్తాన్ బుధవారం ప్రకటించింది. క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను మంగళవారం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) చెరబట్టడం, పలువురు ప్రయాణికులను కాల్చి చంపి 215 మందిని బందీలను చేసుకోవడం తెలిసిందే. జైళ్లలో ఉన్న తమ నేతలను 48 గంటల్లోగా వదిలేయకపోతే బందీలందరినీ చంపేస్తామని అల్టిమేటం కూడా జారీ చేసింది. ప్రయాణికులందరినీ సైనిక ఆపరేషన్ ద్వారా బుధవారం సాయంత్రానికల్లా బీఎల్‌ఏ చెర నుంచి విడిపించినట్టు ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ ప్రకటించారు.
ఈ సందర్బంగా ‘ఘటనా స్థలిలో ఉన్న 33 మంది మిలిటెంట్లను ఆర్మీ స్నైపర్లు హతమార్చారు. ఆ క్రమంలో నలుగురు సైనికులను కోల్పోయాం. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మిలిటెంట్లు రైలును హైజాక్ చేశారు. ఆ క్రమంలో 27 మంది ప్రయాణికులను పొట్టన పెట్టుకున్నారు’ అని చెప్పారు. ట్రైన్‌తో పాటు ఘటనా స్థలిని బాంబ్ డిస్పోజల్ బృందాలు జాగ్రత్తగా జల్లెడ పడుతున్నాయన్నారు. దాడికి కారకులను, వారిని పెంచి పోషిస్తున్న వారిని వెంటాడి వేటాడతామని ప్రకటించారు.
భిన్న వాదనలు
ఆపరేషన్ విజయవంతమైందన్న ప్రకటనపై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. వేర్పాటువాదులు ఆత్మాహుతి బాంబులుగా ఇప్పటికీ ప్రయాణికుల మధ్య నక్కారని చెబుతున్నారు. మహిళలు, చిన్నారులను మానవ కవచాలుగా వాడుకున్నట్టు మీడియా పేర్కొంది. 50 మంది వేర్పాటువాదులను హతమార్చి 190 మంది ప్రయాణికులను కాపాడినట్టు పాక్ సర్కారు కూడా బుధవారం సాయంత్రం పేర్కొంది. ఇందుకు ప్రతీకారంగా 50 మందికి పైగా బందీలను చంపేసినట్టు బీఎల్‌ఏ ప్రకటించింది. ‘ఇప్పటిదాకా 100 మందికి పైగా బందీలను కాల్చేశాం. ఇంకో 150 మంది బందీలుగానే ఉన్నారు. డెడ్‌లైన్లో కొన్ని గంటల్లో ముగియనుంది. ఆలోపు మా నేతలందరినీ వదిలేయకుంటే గంటకు కొందరు చొప్పున బందీలను చంపేస్తాం’ అని ఒక ప్రకటనలో హెచ్చరించింది.

ప్రత్యక్ష నరకమే..
హైజాక్ నుంచి క్షేమంగా బయటపడ్డ ప్రయాణికులు తాము అనుభవించిన నరకాన్ని తలచుకుంటూ ఇప్పటికీ వణికిపోతున్నారు. వేర్పాటువాదుల చెరనుంచి బయటపడ్డాక వారంతా రాత్రిపూట వణికించే చలిలో 4 గంటల పాటు నడిచి సమీపంలోని రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. వృద్ధులు, పిల్లలు, రోగులను మిగతావారు భుజాలపై మోసుకెళ్లారు. సెలవుపై ఇళ్లకు వెళ్తున్న సైనికులను తమ కళ్లముందే కాల్చి పొట్టన పెట్టుకున్నారని హమీద్ అనే ప్రయాణికుడు బీబీసీకి వెల్లడించాడు. ‘బోగీల్లోకి చొరబడటంతోనే ప్రయాణికుల గుర్తింపు కార్డులను చెక్ చేశారు. పిల్లలు, మహిళలు, పౌరులను వేరు చేశారు. సైనికులందరినీ మరోవైపు తరలించారు. ఆ క్రమంలో ముగ్గురు సైనికులను మేం చూస్తుండగానే కాల్చేసి బిగ్గరగా నినాదాలు చేశారు. నేను హృద్రోగినని వేడుకోవడంతో వదిలేశారు’ అని చెప్పాడు. ‘భారీ బాంబు పేలుళ్లు, కాల్పుల మోతలను జీవితంలో మర్చిపోలేను. ఏం జరుగుతుందోనని 50 నిమిషాలకు పైగా ఊపిరి బిగబట్టుకుని గడిపాం’ ఇషాక్ నూర్ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment