ఢిల్లీ: పాకిస్థాన్ భూభాగంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడులపై భారత్ స్పందించింది. అది ఆ రెండు దేశాలకు సంబంధించిన అంశమని చెబుతూనే.. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని, ఆ రెండు దేశాల చర్యలు స్వీయరక్షణలో భాగమై ఉంటాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇది ఇరాన్, పాక్‌కు సంబంధించిన అంశం. భారతదేశానికి సంబంధించినంతవరకు.. ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోం. అయితే.. ఆ రెండు దేశాలు తమ ఆత్మరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను మేము అర్థం చేసుకున్నాం అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియాకు తెలిపారు.
ఇరాక్, సిరియా సరిహద్దుల్లో క్షిపణులతో విరుచుకుపడుతున్న ఇరాన్.. ఆ మరుసటి రోజే పాక్ భూభాగంపై దాడులు జరిపింది. అగ్రరాజ్యం అమెరికా సహా పలు పాశ్చాత్య దేశాలు ఈ క్షిపణి దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇరాన్‌ను తప్పుబడుతున్నాయి. అయితే భారత్ మాత్రం ఇలా భిన్న స్వరం వినిపించడం గమనార్హం.
ఇదిలా ఉంటే.. జైష్ అల్ ఉగ్ర సంస్థను లక్ష్యంగా చేసుకునే బెలూచిస్థాన్‌లోని ఆ సంస్థ స్థావరాలపై డ్రోన్స్, మిస్సైల్స్‌ను ప్రయోగించినట్లు ఇరాన్ చెబుతోంది. కిందటి నెలలో15వ తేదీన ఇరాన్ సిస్తాన్-బెలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌పై జైష్ అల్ విరుచుకుపడింది. ఈ దాడిలో 11 మంది పోలీసులు మరణించారు. ప్రతీకారంగానే ఆ ఉగ్ర సంస్థను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఈ సర్జికల్ స్ట్రైక్ నిర్వహించినట్లు స్పష్టం అవుతోంది.
‘‘పొరుగు దేశం పాక్ మాకు ఎప్పటికీ మిత్రదేశమే. ఆ దేశ సార్వభౌమత్వాన్ని మేం గౌరవిస్తాం. అలాగని.. మా దేశ భద్రత విషయంలో మాత్రం రాజీపడబోం. కేవలం పాక్ భూభాగంలో ఉన్న ఉగ్రవాదుల్నే మేం లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపాం అని ఇరాన్ రక్షణ విభాగం ప్రకటించింది.
మరోవైపు పాక్ మాత్రం ఆ దాడులపై తీవ్రంగా స్పందించింది. ఈ దాడిలో ఇద్దరు పిల్లలు మరణించారని ప్రకటించి.. ఇరాన్‌ను తీవ్రంగా హెచ్చరించింది. ఈ వ్యవహారం ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఇరాన్ దౌత్యవేత్తను బహిష్కరించిన పాక్.. తెహ్రాన్(ఇరాన్ రాజధాని)లోని తమ రాయబారిని వెనక్కి వచ్చేయాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment