
16న సుప్రీంలో కంచ గచ్చిబౌలి కేసు నేపథ్యంలో న్యాయనిపుణులతో భేటీ కోసమే..!
సాక్షి, న్యూఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూముల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలపై ఎలా స్పందించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. గత విచారణలో భాగంగా కంచ గచ్చిబౌలిలో వెంటనే పనులు ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సుప్రీంకోర్టు ఆదేశించింది. తమ ఆదేశాల విషయంలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా సీఎస్ వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
అలాగే ఆ భూములను సందర్శించి ఈ నెల 16లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌తోపాటు మరో 10 మంది అధికారులతో కలిసి శనివారం ఢిల్లీ చేరుకున్న సీఎస్ శాంతికుమారి ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సుమారు ఐదు గంటలపాటు అధికారులతో సమాలోచనలు చేశారు.
సుప్రీంకోర్టుకు సమర్పించాల్సిన నివేదికపై సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సహా మరికొందరు న్యాయవాదులతో ఆమె ప్రత్యేకంగా సమావేశమైనట్లు సమాచారం. నివేదికలో పొందుపర్చాల్సిన అంశాలేమిటి? క్షేత్రస్థాయిలో ఏం జరిగింది? ప్రభుత్వం నివేదిక సమర్పించాక న్యాయస్థానం ఎలా స్పందిస్తుంది? వంటి విషయాలపై న్యాయవాదుల సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. అనంతరం ఢిల్లీ పర్యటన ముగించుకొని ఆదివారం సాయంత్రం ఆమె హైదరాబాద్‌కు తిరిగి వెళ్లారు.