బీఎన్‌ఎం నేత హకీం బలూచ్(కర్టెసీ: ఏఎన్‌ఐ)
లండన్: పాకిస్తాన్ ఆర్మీ ‘డెత్‌స్క్వాడ్’ నుంచి బలూచిస్తాన్ ప్రజలను రక్షించాలని ది బలూచ్ నేషనల్ మూమెంట్(బీఎన్‌ఎం) అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. పాక్ సైన్యం ఆగడాల నుంచి తమను కాపాడాలని ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియర్ సహా భారత్, అమెరికాలకు మొరపెట్టుకుంది. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని మక్రాన్ ప్రాంతంలో ఇటీవల కొంతమంది దుండగులు మాలిక్ నాజ్ అనే మహిళను కాల్చి చంపారు. అదే విధంగా ఆమె నాలుగేళ్ల కొడుకు బ్రంశ్‌ను తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనపై బలూచిస్తాన్ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. డెత్‌స్క్వాడ్ చీఫ్ సమీర్ సబ్జల్‌ను వెంటనే అరెస్టు చేయాలంటూ వందలాది మంది పురుషులు, మహిళలు ఒక్కచోట చేరి నినదించారు.(పాక్‌లో హిందూ యువతులపై అకృత్యాలు)
కిడ్నాప్.. లైంగిక దాడి
ఈ నేపథ్యంలో బీఎన్‌ఎం(యూకే) అధ్యక్షుడు హకీం బలూచ్ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ..‘‘పాకిస్తాన్, పాకిస్తాన్ సైన్యం, ఐఎస్‌ఐ మనస్తత్వం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఓ గాయం చల్లారిన తర్వాత ప్రజలు తమ పనుల్లో పడిన వెంటనే మళ్లీ ఇంకో ఘటనకు పాల్పడతారు. పాక్ డెత్ స్క్వాడ్ ఆగడాలకు అంతులేకుండా పోయింది. బలూచిస్తాన్‌లో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమైపోయాయి. రెండు వారాల క్రితం అవరన్‌లో ఓ బాలుడిని కిడ్నాప్ చేసి అతడిపై దారుణంగా లైంగికదాడికి పాల్పడ్డారు. అయితే తాజా ఘటనలో కాస్త ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి వారి హక్కుల కోసం పోరాడుతున్నారు. స్వేచ్ఛగా, ఆత్మగౌరవంతో బతికేందుకు ఉద్యమిస్తున్నారు’’ అని చెప్పుకొచ్చారు.(పాకిస్తాన్‌కు సాయం నిలిపివేయండి: అల్తాఫ్)
మీ మద్దతు కావాలి
ఇక ఈ పోరాటం ముందుకు సాగాలన్నా.. తమ ఉద్యమం నీరుగారిపోకుండా ఉండాలన్నా ప్రస్తుత పరిస్థితుల్లో తమకు అంతర్జాతీయ సమాజం మద్దతు తప్పనిసరి అని హకీం వ్యాఖ్యానించారు. ‘‘ప్రపంచాన్ని.. ముఖ్యంగా ఐరాస, అగ్రరాజ్యం అమెరికా, యూకే, ఈయూ.. వాటితో పాటు పొరుగు దేశాలైన భారత్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ సహా ఇతర దేశాల మద్దతు కోరుతున్నాం’’అంటూ పాకిస్తాన్ ఆర్మీ ఆగాడాలు ప్రశ్నించాలని విజ్ఞప్తి చేశారు. ఇక పాకిస్తాన్‌కు స్థానిక నాయకులే మద్దతు ఇస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో.. ప్రభుత్వం ఇచ్చే లంచాలకు అలవాటు పడి సొంత ప్రజలకే అన్యాయం చేస్తున్నారంటూ హకీం మండిపడ్డారు. పాకిస్తాన్ ఆర్మీ అధికారం ప్రదర్శిస్తూ.. బలూచ్ ప్రజలను అణచివేస్తూ అకృత్యాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. కాగా పాకిస్తాన్ కబంధ హస్తాల నుంచి స్వాతంత్ర్యం పొందేందుకు బలూచిస్తాన్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఎన్‌ఎంను స్థాపించి ప్రజా గళాన్ని వినిపించిన గులాం మహ్మద్ బలూచ్ 2009లో దారుణ హత్యకు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment