Psychiatrists
-
డాక్టర్.. C/O గూగుల్
సాక్షి, అమరావతి: ఒత్తిడి, ఆందోళన, అనవసర భయాలు వంటి మానసిక సమస్యలతో బాధపడే వారికి మానసిక వైద్యులను సంప్రదించాలంటే భయం, బెరుకు ఉంటాయి. ఎవరైనా చూస్తే పిచ్చోళ్ల కింద లెక్క కడతారనే అపోహలతో చాలా మంది ఆ సమస్యలను నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో ఇలా భావించే వారిసంఖ్య తగ్గుతోంది. మానసిక సమస్యలపై నిర్భయంగా వైద్యులను సంప్రదించే వారు పెరుగుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే 2024లో మానసిక వైద్యుల సమాచారం కోసం ఇంటర్నెట్లో శోధించిన వారి సంఖ్య 41 శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా అక్షరాస్యులు ఎక్కువగా ఉండే మెట్రో నగరాల్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జనవరి–అక్టోబర్ నెలల మధ్య మానసిక వైద్యుల కోసం అన్వేషిoచిన వారి సంఖ్య కోల్‌కతాలో 43 శాతం, ముంబై 36, కోజికోడ్ (క్యాలికట్)లో 29 శాతం చొప్పున పెరిగింది. ఈ అంశం జస్ట్ డయల్ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. హెల్త్ కేర్ సెర్చ్‌లలో మెట్రో నగరాల్లో మొత్తంగా 15 శాతం వృద్ధి కనిపించింది. ఢిల్లీలో 20, హైదరాబాద్ 17, చెన్నై వంటి నగరాల్లో 16 శాతం పెరుగుదల నమోదైంది. ఆరోగ్య సమస్యలపై 23 శాతం పెరిగిన అన్వేషణ ఆరోగ్య సంరక్షణ నిపుణుల కోసం ఇంటర్నెట్లో అన్వేషించిన వారి సంఖ్య ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 23 శాతం పెరిగినట్టు తేలింది. ఆధునిక జీవన శైలి నేపథ్యంలో మధ్య వయసు్కల్లోనూ ఎముకలు, కీళ్ల నొప్పుల సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. దేశం మొత్తం ఆర్థోపెడిక్ సెర్చ్‌లు 38 శాతం పెరిగినట్టు వెల్లడైంది. అత్యధికంగా లక్నోలో 37, ఢిల్లీలో 36 శాతం చొప్పున పెరిగినట్టు తేలింది. బెంగళూరు, పాట్నా నగరాల్లో 32 శాతం వృద్ధి చోటు చేసుకుంది. గైనకాలజిస్ట్‌ల కోసం శోధనలు 28 శాతం పెరిగాయి. ఈ తరహా వృద్ధి హైదరాబాద్‌లో 31 శాతం, పూణేలో 33, ముంబైలో 29 శాతం నమోదైంది. కాగా, దేశ వ్యాప్తంగా ఆయుర్వేద వైద్య సేవల వైపు మొగ్గు చూపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 18 శాతం ఆయుర్వేద వైద్యుల కోసం శోధనలు పెరిగాయి. ఢిల్లీలో 29 శాతం, ముంబైలో 21 శాతం చొప్పున వృద్ధి నమోదైంది. సంప్రదాయ వైద్య పద్ధతులపై పెరుగుతున్న ఆసక్తిని ఈ పెరుగుదల సూచిస్తోంది. అవగాహన పెరిగిందిగతంలో ప్రజలు మానసిక సమస్యలపై వైద్యులను సంప్రదించాలంటేనే ఎంతో భయపడేవాళ్లు. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం మానసిక ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన పెరిగింది. గతంలో మాదిరిగా భూత వైద్యం, మంత్ర, తంత్రాలను నమ్మే పరిస్థితులు పోతున్నాయి. ప్రస్తుతం రోజు రోజుకు ప్రజల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. కేవలం పిచ్చే కాకుండా ఆందోళన, అసహనం, భావోద్వేగ సమస్యలన్నీ మానసిక అనారోగ్యం కిందకే వస్తాయి. ఇలాంటి ఇబ్బందులున్న వారు బయటకు చెప్పుకుంటే ఏమవుతుందోనని భయపడాల్సిన అవసరం లేదు. తమ సమస్యలను కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పంచుకోవాలి. ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స, కౌన్సెలింగ్ పొందాలి. – డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, మానసిక వైద్యనిపుణులు, విజయవాడ -
ఒత్తిడిని చిత్తు చేస్తే విజయం మీదే!
సరిపడా నిద్రా అవసరమే... విద్యార్థులు/పోటీ పరీక్షల అభ్యర్థులు ఉన్న సమయాన్ని పాఠ్యాంశాల వారీగా పక్కాగా విభజించుకోవడంలోనే సగం విజయం సిద్ధిస్తుంది. ముఖ్యమైన ఆయా సబ్జెక్టులు, టాపిక్‌ను గుర్తించి, వాటిని ప్రాధాన్య క్రమంలో చదవాలి. ఒంటరిగా కాకుండా కొంత మంది విద్యార్థులు బృందంగా చర్చించుకుంటూ సన్నద్ధం అవ్వడం మేలు. రోజుకు కనీసం 6–7 గంటలు తప్పనిసరిగా పడుకోవాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మార్కులు, ర్యాంక్‌ల కోసం పదే పదే వారితో మాట్లాడడం మంచిది కాదు. సబ్జెక్ట్ మీద పట్టు సాధించేలా విద్యార్థుల్లో చైతన్యం తీసుకుని రావాలి. ఇంట్లో పిల్లలు చదువుకోవడానికి ప్రశాంత వాతావరణం తయారు చేయాలి. – డాక్టర్ కె.వి.రావిురెడ్డి, సూపరింటెండెంట్, ప్రభుత్వ మానసిక ఆస్పత్రి, విశాఖపట్నం మొబైల్, స్ట్రీట్ ఫుడ్స్‌కు గుడ్‌బై చెప్పాలి కరోనా అనంతరం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గతంలోను పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడి ఎదుర్కొనే ఘటనలు ఉండేవి. అయితే అప్పట్లో చిట్కాలు, మందులతో సమస్యకు పరిష్కారం లభించేది. కరోనా అనంతరం అకడమిక్ కార్యకలాపాల్లోను మొబైల్ ఫోన్ వినియోగం పెరిగింది. దీంతో పిల్లల్లో సెల్‌ఫోన్ వాడకం గణనీయంగా పెరిగింది. ఈ పరిస్థితి వల్ల పరీక్షల సమయంలో ఏకాగ్రతకు భంగం వాటిల్లుతుంది. పరీక్షల సమయంలో మొబైల్‌కు దూరంగా ఉండడం మేలు. కొద్దిసేపు సేదతీరడం కోసం పిల్లలకు సెల్ఫోన్లు ఇస్తుంటారు. అలా చేయద్దు. వాకింగ్, రన్నింగ్, ఇతర క్రీడల వైపు మళ్లించడం వల్ల శారీరక శ్రమ కలిగి, ఆరోగ్యంగా ఉంటారు. ఇక.. స్ట్రీట్ ఫుడ్స్‌కు గుడ్‌బై చెప్పాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు కల్పించుకుని, తేలికగా జీర్ణం అయ్యే ఆహారాన్ని పెట్టాలి. దీని వల్ల త్వరగా నిద్రపోవడానికి వీలుంటుంది. – డాక్టర్ వెంకట కిరణ్, అసోసియేట్ ప్రొఫెసర్, గుంటూరు జీజీహెచ్ టెలీమెడిసన్ కాల్ సెంటర్ మానసిక ఒత్తిడికి గురయ్యే విద్యార్థులు వైద్య శాఖ ఏర్పాటు చేసిన టెలీమెడిసన్ కాల్ సెంటర్‌ను సంప్రదించి సలహాలు, సూచనలు పొందవచ్చు. 14416/180089114416 నెంబర్లకు ఫోన్ చేసి కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చు. ఇక్కడ సుశిక్షితులైన కౌన్సెలర్లు అందుబాటులో ఉంటారు. విద్యార్థులు, ఇతర ప్రజలు మానసిక ఒత్తిడి, ఇతర సమస్యలు ఉన్న వారు ఉచితంగా కాల్‌సెంటర్ సేవలు పొందవచ్చు. -
మనసుకూ జబ్బులొస్తాయి!
మన దేశ జనాభాలో దాదాపు రెండు కోట్ల మందికి పైగా పలురకాల మానసిక వ్యాధులతో బాధపడుతున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో మానసిక వైద్యుల సంఖ్య చాలా తక్కువే. అర్హత పొందిన మానసిక వైద్యులు కేవలం పదివేల మంది మాత్రమే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వీరి సంఖ్య నాలుగు వందల లోపే! శరీరంలో ఏదైనా భాగా నికి జబ్బు చేస్తే, వెంటనే ఆయా స్పెషలిస్టుల దగ్గరికి వెళ్తాము. కానీ ఒక వ్యక్తి వింతగా ప్రవర్తించినా, మాట్లాడినా, కుంగిపోయినా, అది కూడా ఒక జబ్బేననీ, దానికి కూడా శాస్త్రీయమైన చికిత్స ఉందనీ, వైద్యనిపుణులు కూడా ఉన్నారనీ ఇప్పటికీ చాలామందికి తెలి యదు. ఒకవేళ తెల్సినా, మానసిక డాక్టరు దగ్గరికి వెళ్తే పిచ్చిపట్టిందని చులకనగా చూస్తారనే భయంతో తొలి దశలోనే చికిత్స చేయించుకోక, ముదర పెట్టుకుంటారు. ఇంతేకాకుండా, దయ్యం, గాలి సోకిందనో, చేతబడి చేశారనో, మందు పెట్టారనో అపోహలతో, మూఢనమ్మకాలతో నాటు వైద్యులు, మంత్రవైద్యులతో వైద్యం చేయించుకొని వ్యాధి బాగా ముదిరిన తర్వాత డాక్టర్ల దగ్గరకి వెళ్తుంటారు. ఇతర శరీర భాగాల్లాగా కాకుండా మనసనేది కంటికి కనబడని ఒక ప్రత్యేకమైన అవయవం. మనసనేది మెదడు లోని అంతర్భాగమేనని శాస్త్రీయంగా నిర్ధారించిన విష యమే! మెదడు ‘హార్డ్‌వేర్’ అయితే మనసు ‘సాఫ్ట్వేర్’.‘కంప్యూటర్లో సాఫ్ట్వేర్ కనబడకపోయినా, దాని పనితీరు తెలిసినట్లే, మనసనేది కనబడకపోయినా, దాని ప్రవర్తన, ఆలోచనాతీరు, భావోద్వేగాలు, నిర్ణయాత్మక శక్తి లాంటి వన్నీ బయటికి తెలుస్తూనే ఉంటాయి. శరీరానికి, మనసుకు అవినాభావ సంబంధ ముంది. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మనసు ప్రశాంతంగా ఉంటే, శారీరక జబ్బులు కూడా మనల్ని ఇబ్బంది పెట్టవు. మానసిక వ్యాధులు వచ్చే ముఖ్య కారణాల్లో వారసత్వంగా వచ్చేవి, మెదడు లోపాలు, మద్యం, మత్తు, మందుల అలవాటు, సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే మానసిక స్థైర్యం లేకపోవడం, తల్లితండ్రుల పెంపకంలో లోపాలు ముఖ్య మైనవి. మానసిక వ్యాధులంటే కేవలం ‘పిచ్చి’ అనే అపోహ చాలామందికి ఉంది. వందల రకాల మానసిక వ్యాధుల్లో ‘పిచ్చి’ (ఉన్మాదం) కేవలం ఒక రకమే! ఆందోళన, టెన్షన్, నిద్రలేమి, దిగులు, మనోవేదన, లేనిపోని భయాలు, అతిశుభ్రత లాంటి చాద స్తాలు, మద్యపానం, డ్రగ్స్‌కు బానిసలు కావడం, ఆత్మహత్యా ప్రయత్నాలు, మన స్పర్ధలతో దంపతులు సర్దుకుపోలేకపోవడం, లైంగిక సమస్యలు. భ్రమలు,భ్రాంతులు, అకారణంగా ఇతరులను అనుమానించడం, దయ్యం–గాలిసోకినట్లు ఊగి పోవడం, ఇంకా చిన్నపిల్లల్లో వచ్చే ఆటిజవ్ు, హైపరాక్టివిటీ, మొండితనం, అతికోపంతో తిట్టడం, కొట్టడం లాంటి పలురకాల లక్షణాలన్నీ మానసిక రుగ్మతలే నంటే చాలా మందికి ఆశ్చర్యం కలుగవచ్చు. మానసిక వైద్యులు కేవలం నిద్రమాత్రలే ఇస్తారనే అపోహ ప్రజల్లో ఉంది. అది పూర్తిగా తప్పు. నిద్ర రావడమనేది ఆ మందుల ఫలితాల్లో ఒక లక్షణమే తప్ప అవి నిద్రమాత్రలు కాదు. ఆ యా జబ్బుల్లో ఉన్న మూల కారణాలను సరి చేసి, ఆ వ్యక్తిని మానసిక ఆరోగ్యవంతుడిని చేస్తాయి. ఒకప్పటి కరెంటు చికిత్సతో పాటు, ఇటీవలే వచ్చిన ఆర్టీఎమ్ఎస్ అనే మేగ్నటిక్ చికిత్స కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కౌన్సెలింగ్ పద్ధతుల్లో, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, మైండ్‌ఫుల్‌నెస్ థెరపీ, డీబీటీ, సీఆర్టీ, వర్చువల్ రియాలిటీ థెరపీ లాంటి ఆధునిక చికిత్సా పద్ధతులు కూడా ఇపుడు అందుబాటులోకి వచ్చాయి. ఎవరికి ఎలాంటి చికిత్స అవసరమన్నది అర్హత గల మానసిక వైద్య నిపుణులే నిర్ణయిస్తారు. ఎంబీబీఎస్ తర్వాత మానసిక వైద్యశాస్త్రంలో మూడేళ్ళు ఎమ్డీ లేదా డీఎన్బీ కోర్సు చేసిన వారినే ‘సైకియాట్రిస్టు’ లంటారు. రోగ నిర్ధారణకు తగిన పరీక్షలు చేసి మందులతోపాటు కౌన్సిలింగ్ చేసే శిక్షణ సైకియాట్రిస్టులకే ఉంటుంది. ‘సైకాల జిస్టు’లంటే సైకాలజీలో ఎమ్మెస్సీ లేదా ఎమ్‌ఫిల్ క్లినికల్ సైకాలజీ చేసినవారు. వీరు మానసిక రోగులకు కౌన్సెలింగ్‌తో పాటు తెలివితేటల నిర్ధారణ, వ్యక్తిత్వ నిర్ధారణ లాంటి మానసిక పరీక్షలు మాత్రమే చేస్తారు. రోగనిర్ధారణ,మందులు ఇవ్వడం లాంటివి వీరు చేయకూడదు. మానసిక రోగుల సంక్షేమం కొరకు, కేంద్రప్రభుత్వం 2017లో ‘మెంటల్ హెల్త్‌కేర్ యాక్ట్’ అనే ఒక కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర స్థాయిలో ‘స్టేట్ మెంటల్ హెల్త్ అధారిటీ’నీ, జిల్లా స్థాయిలో ‘రివ్యూ బోర్డ్స్’ను ఏర్పాటు చేశారు. దేశంలో మానసిక వైద్యం అవసరమైన ప్రతి వ్యక్తికీ చికిత్స చేయించి, ఆ ఖర్చు భరించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలదేనని ఈ చట్టంలో పేర్కొన్నారు. అలాగే ఆదరణ, కూడు, గూడు లేకుండా వీధుల్లో తిరిగే అనాథ మానసిక రోగులను కూడా చేరదీసి వైద్యం చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే! ప్రతి సంవత్సరం అక్టోబర్ పదవ తేదీన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా జరుపుకొంటూ, ప్రజల్లో మానసిక ఆరోగ్యంపై మరింత అవగాహన కల్పించే ప్రయత్నాన్ని మానసిక నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నాయి. ఈ సంవత్సరం ‘వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్’ పిలుపు ఇచ్చిన సందర్భంగా, సమాజంలో మానసిక అనారోగ్యంపై, మూఢనమ్మకాలపై పోరాడ దామని అందరం ఈ సందర్భంగా ప్రతిన బూనుదాం! డా‘‘ ఇండ్ల రామసుబ్బారెడ్డి వ్యాసకర్త ప్రముఖ సైకియాట్రిస్ట్ (రేపు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం) -
ఆత్మహత్యలను ఆపలేమా?
ప్రపంచంలో జరిగే మొత్తం ఆత్మహత్య లలో 20 శాతం మన దేశంలోనే జరుగుతున్నాయి. ప్రతి ఏటా సుమారు 2 లక్షల మంది మన దేశంలో ఆత్మహత్యలతో మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 10 లక్షల మందికి పైగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు మన దేశంలో మధ్య వయస్కులు, వృద్ధులు ఆత్మహత్యలు చేసుకొంటే, ఇటీవలి కాలంలో యువత, విద్యార్థులు ఈ దారుణానికి పాల్పడుతున్నారు. కారణాల విషయానికి వస్తే, కుటుంబ సమస్యలు, భార్యా భర్తల మనస్పర్థలు, బలహీన పడుతున్న కుటుంబ బంధాలు మూడింట ఒక వంతు కారణమైతే, డిప్రెషన్, మద్యానికి బానిస కావడం, స్కిజోఫ్రీనియా, దూకుడు, ఆవేశ మనస్తత్వాలు, కేన్సర్, ఎయిడ్స్ లాంటి శారీరక, మాన సిక సమస్యలు కూడా ఆత్మహత్యలకు కారణ భూత మవుతున్నాయి. స్త్రీల కంటే పురుషులే అధికంగా (4:1) ఆత్మ హత్యలతో మరణిస్తుంటే, ఆత్మహత్యా ప్రయత్నాలు చేయడంలో మాత్రం స్త్రీలదే పైచేయిగా ఉంది. ఎక్కువ ఆత్మహత్యలు ఉదయం 5 గంటల నుండి 10 గంటల మధ్యే ఎక్కువగా జరగడానికి ముఖ్య కారణం మన శరీరంలో ‘కార్టిసాల్’ అనే స్ట్రెస్ హార్మోన్ ఆ సమయంలో అధికంగా ఉత్పత్తి కావడమే! వారసత్వంగా జీన్స్ ప్రభావం వల్ల కూడా కొన్ని కుటుంబాల్లో పలువురు ఆత్మ హత్యలకు పాల్పడటం శాస్త్రీయంగా కూడా రుజువైంది. కోవిడ్ సమయంలో మునుపటి కంటే 10 శాతం ఆత్మహత్యలు పెరిగాయి. అయితే ఇదే సమయంలో పరీక్షలు లేక పోవడం వల్ల విద్యార్థుల ఆత్మహత్యలు 25 శాతం తగ్గిపోవడ మనేది ఆలోచించదగ్గ విషయం! మూడీగా, డల్‌గా, దిగులుగా ఉండటం; కన్నీళ్ళు పెట్టు కోవడం, తిండి, నిద్ర లేకపోవడం, డైరీలో సూసైడ్ నోట్ రాయడం, అప్పగింతలు పెట్టడం, వేదాంత ధోరణితో మాట్లా డటం, విషాద గీతాలు ఎక్కువగా వినడం, వీలునామా రాయడం, మద్యం, మత్తు మందులు అధికంగా తీసుకోవడం వంటి లక్షణాలు ఆత్మహత్య ఆలోచనను మనకు పట్టిస్తాయి. నివారణ చర్యలకొస్తే, ప్రాణాంతకమైన పురుగు మందు లను నిషేధించడం, మద్యాన్ని సాధ్యమైనంత తక్కువ అందు బాటులో ఉండేలా చూడటం కాకుండా 20 ఏళ్ల లోపు వారికి మద్యం విక్రయాలు నిషేధించడం, హాస్టళ్లలో సీలింగ్ ఫ్యాన్ల బదులు, గోడ ఫ్యాన్లు వాడటం వల్ల కూడా ఆత్మహత్యలను చాలా వరకు నియంత్రించవచ్చు. అలాగే పేదలకు నగదు బదిలీ చేయడం ద్వారానూ ఆత్మహత్యలను నివారించవచ్చు. బ్రెజిల్లో 60 శాతం, ఇండోనేషియాలో 20 శాతం ఆత్మహత్యలు ఈ నగదు బదిలీ వల్ల తగ్గుముఖం పట్టినట్లు నిర్థారణ అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇటీవల ఆత్మహత్యల శాతం తగ్గడానికి ఒక ముఖ్య కారణం ‘నగదు బదిలీ’ పథకాలేనని కూడా చెప్పవచ్చు. మనదేశంలో మొట్టమొదటిసారిగా తమిళనాడు ప్రభుత్వం 18 ఏళ్ల కిందట ప్రవేశపెట్టిన పరీక్షల ఫలితాలు వెలువడిన నెల లోపలే సప్లిమెంటరీ పరీక్షలు పెట్టడమనే విధానం వల్ల విద్యార్ధుల ఆత్మహత్యలు ఆ రాష్ట్రంలో గణనీయంగా తగ్గిపోయాయి. ఈ విధానాన్ని ఇప్పుడు పలు రాష్ట్రాలు అమలు చేయడం ఒక మంచి పరిణామం. ఆత్మహత్యకు పాల్పడే వారికి ‘ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్’ ఇవ్వాలి. అంటే, వారి బాధలను ఓపిగ్గా వినడం, సానుభూతి చూపించడం, ధైర్యం చెప్పడం, ఓదార్చడం, నీకు మేమున్నాం అనే భరోసా కల్పించడం ద్వారా ఆత్మహత్య ప్రయత్నాలను చాలా వరకు తగ్గించవచ్చు. ప్రభుత్వం ‘జాతీయ ఆత్మహత్య నివారణ’ పథకాన్ని తీసుకురావాలి. ఇందులో మానసిక నిపుణులనూ, ఉపాధ్యా యులనూ, స్వచ్ఛంద సంస్థలనూ భాగస్వాములను చేసి సమా జంలో ఆత్మహత్యల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రతి పట్టణంలో ఒక ‘సూసైడ్ హెల్ప్‌లైన్’ ఏర్పాటు చేసి అలాంటి తలంపులున్న వారికి తక్షణ సాంత్వన కల్పించే ఏర్పాటు చేయగల్గితే ఈ ఆత్మహత్యా నివారణ దినోత్స వానికి సార్థకత లభించినట్లవుతుంది. డా‘‘ ఇండ్ల రామసుబ్బారెడ్డి వ్యాసకర్త ప్రముఖ మానసిక వైద్యులు, రచయిత మొబైల్: 93481 14948 (సెప్టెంబర్ 10 ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం) -
చిన్న చిన్న విషయాలను కూడా మరిచిపోతున్నారా?.. కారణం ఇదే కావచ్చు..!
సాక్షి, కర్నూలు జిల్లా : అల్జీమర్స్ ఈ పేరు చాలా మందికి తెలియదు. వయస్సు పైబడిన వారిలో మతిమరుపు అంటే.. ఓ అదా అంటారు. ఈ సమస్య ఉన్న వారు ఆ రోజు జరిగే చిన్న చిన్న విషయాలు మరిచిపోతుంటారు గానీ ఎప్పుడో చిన్నప్పుడు జరిగినవి గుర్తుకు తెచ్చుకుని మరీ చెబుతుంటారు. ఇలాంటి వ్యాధితో బాధపడే వారు ఒకరుంటే ఆ కుటుంబం మొత్తం పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఒంట్లో సత్తువ క్షీణించి, జ్ఞాపకశక్తి నశించిన మనుషులను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ అల్జీమర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. చదవండి: వీరి సంపాదన నెలకు రూ.90 వేలకుపైనే.. భవిష్యత్తు స్కిల్ వర్కర్లదే..! కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల మానసిక విభాగం, ఇతర ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లలో సైకియాట్రిస్ట్‌ల వద్దకు వచ్చే వారిలో ప్రస్తుతం 10 శాతానికి పైగా అల్జీమర్స్‌తో బాధపడే వారు ఉంటున్నారు. ఇలాంటి వారికి అడ్మిషన్ అవసరం ఉండదు. ఓపీలో మందులు, కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తారు. అయితే డిమెన్షియాతో బాధపడే వారికి మందులతో పాటు ఒక్కోసారి అడ్మిషన్ అవసరం అవుతుంది. కొన్నిరోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స ఇచ్చాక ఇంటికి పంపిస్తారు. పెరుగుతున్న బాధితుల సంఖ్య అల్జీమర్స్ దాదాపు 60 నుంచి 80 శాతం మతిమరుపు జబ్బులకు కారణం అవుతుంది. ఇది వారి కుటుంబసభ్యులపైనా ప్రభావం చూపుతుంది. సాధారణంగా అల్జీమర్స్ 65 సంవత్సరాలు పైబడిన వారికి వస్తుంది. ఇటీవల 65 ఏళ్లలోపు వారూ దీని బారిన పడుతున్నారు. ఈ జబ్బు ఆలోచనా విధానం, ప్రవర్తనపై ప్రభావం చూపుతుంది. అల్జీమర్స్‌తో బాధపడే వారి సంఖ్యలో చైనా, అమెరికా తర్వాత మూడో స్థానంలో భారత్ ఉంది. 65 ఏళ్లు పైబడిన వారిలో 5 శాతం మందికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉండగా వయసుపెరిగే కొద్దీ 80 ఏళ్ల వయస్సు వారిలో 20 శాతం మందికి వచ్చేందుకు అవకాశం ఉంది. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. అల్జీమర్స్ లక్షణాలు కళ్లద్దాలను, ఇంటి తాళాలను ఎక్కడో భద్రంగా పెట్టి మరిచిపోతారు. కుటుంబసభ్యుల పేర్లు కూడా మరిచిపోతుంటారు. మాట్లాడేటప్పుడు పదాల కోసం తడుముకుంటారు. కొద్దినిమిషాల కిందటే జరిపిన సంభాషణను కూడా మరిచిపోతుంటారు. అడిగిపవే పదేపదే అడగడం, ఎక్కువసేపు నిద్ర, మెలకువగా ఉన్నా పనులపై ఆసక్తి చూపరు. బయటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి చేరుకోవడానికి నానా తంటాలు పడతారు. అల్జీమర్స్‌కు కారణాలు ♦మతిమరుపు జబ్బు వారసత్వంగా సంక్రమించే అవకాశం ఎక్కువ. 60 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా వస్తుంది. ♦మెదడులో ‘అసిటైల్ కోలిన్’ అనే రసాయన ద్రవం తగ్గడం, సాధారణ ప్రొటీన్లు మెదడు కణజాలంలో చేరడం వల్ల సంక్రమిస్తుంది ♦దీర్ఘకాలంగా ఆల్కహాల్ లాంటి మత్తు పదార్థాలు తీసుకోవడం, అకారణంగా నిద్రమాత్రలు వాడడం వల్ల కూడా వస్తుంది ♦సంవత్సరాల కొద్దీ మానసిక ఒత్తిడి, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, అదుపులో లేని బీపీ, షుగర్ వల్ల సమస్య తీవ్రం అయ్యే అవకాశం ఉంది. మతిమరుపులన్నీ అల్జీమర్స్ కాదు మతిమరుపు లక్షణాలు పలు రకాల ఆరోగ్య సమస్యలు, వ్యాధుల వల్ల కూడా రావచ్చు. మతిమరుపు మాత్రమే అల్జీమర్స్ కాదు. ఈ వ్యాధి ఉన్నదీ లేనిదీ నిర్ధారించుకోవడానికి వ్యాధి లక్షణాలు పరిశీలించడమే గాక కొన్ని నిర్థిష్టమైన పరీక్షలు కూడా నిర్వహిస్తాం. రోగి ఏకాగ్రత స్థాయిని, గ్రహింపు శక్తిని, జ్ఞాపక శక్తిని తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తాం. జన్యుపరమైన, వైద్యపరమైన కారణాలను కనుగొనేందుకు బ్రెయిన్ ఇమేజింగ్, రక్తపరీక్షలు వంటివి నిర్వహించాల్సి వస్తుంది. అవసరమైన పరీక్షలన్నీ నిర్వహించిన తర్వాతనే రోగికి అల్జీమర్స్ వ్యాధిపై ఒక నిర్ధారణకు వచ్చి తగిన చికిత్స అందిస్తాం. ఈ వ్యాధితో బాధపడే వారిని చిన్నచూపు చూడకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. – డాక్టర్ నిషాంత్‌రెడ్డి, న్యూరాలజిస్టు, కర్నూలు కచ్చితమైన వైద్యం లేదు అల్జీమర్స్‌కు కచ్చితమైన, పూర్తిగా నయం చేసే వైద్యం ఇంతవరకు అందుబాటులో లేదు. వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు కొన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. అల్జీమర్స్‌తో బాధపడే వారితో పాటు కుటుంబసభ్యులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా జబ్బున పడ్డ వారిని ఎలా నియంత్రించాలో కుటుంబసభ్యులు శిక్షణ తీసుకోవాలి. మెదడును పదును పెట్టే కొన్ని రకాల వ్యాయామాలు చేయడం, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం, సరైన పోషకాహార అలవాట్లు పాటించాలి. – డాక్టర్ కె.నాగిరెడ్డి, మానసిక వైద్య నిపుణులు, కర్నూలు -
దారి తప్పుతున్న యువత.. ప్రమాదంలో భవిత
‘రాయచోటికి చెందిన ఐదుగురు యువకులు పగలు కూలి పనులు చేస్తూ రాత్రులలో చోరీలు చేసేవారు. చెడు వ్యసనాలకు బానిసలు కావడంతో వచ్చే కూలీ డబ్బులు సరిపోక కనిపించిన వస్తువు ఎంత విలువైనది అనేది కాకుండా అన్నింటినీ చోరీ చేసేవారు. ఆటోలకు ఉన్న బ్యాటరీలు, సెల్ఫోన్లు, బంగారు ఆభరణాలు వంటివి దోచుకెళ్లి జల్సాలు చేసుకునేవారు. ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యారు’. ‘మదనపల్లె టూటౌన్ పరిధిలో తాళం వేసిన ఇళ్లల్లోకి చొరబడి చోరీ చేసే ముఠాను పోలీసులు వలవేసి పట్టుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.20 లక్షల విలువ చేసే బంగారు, వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అందరూ పాతికేళ్ల వయస్సు కుర్రాళ్లే. వీరు టెన్త్, ఇంటర్ చదివి విలాసాలకు అలవాటు పడి నేరస్తులుగా మారారు’. ‘మదనపల్లె మండలానికి చెందిన వారంతా ఇంటర్, డిగ్రీ చదువుతూ ఖర్చులకు డబ్బులు లేక రాత్రి పూట రహదారుల్లో తిరుగుతూ దోపిడీలకు పాల్పడేవారు. మారణాయుధాలతో వాహనదారులను బెదిరించి నగదు, బంగారు ఆభరణాలను దోపిడీ చేసేవారు. ఎట్టకేలకు పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు’. ‘అతడు విద్యావంతుడు. విలాసాలకు అలవాటు పడి మదనపల్లె పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాలు చోరీ చేసేవాడు. ఇతని వయస్సు కేవలం 25 ఏళ్లే. బైకు చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు’. ‘చెడు అలవాట్లకు బానిసలై.. గంజాయి సేకరించి విక్రయిస్తున్న ఐదుగురు యువకులను మదనపల్లె పట్టణ పోలీసులు అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు’. ‘మదనపల్లెకు చెందిన నలుగురు యువకులు కలిసి కార్లను బాడుగకు తీసుకువచ్చి కుదవకుపెట్టి, మళ్లీ అదే కార్లను చోరీ చేసేవారు. వీరిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు’. సాక్షి, మదనపల్లె సిటీ: అన్నమయ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. పిల్లలపై పెద్దల పర్యవేక్షణ కొరవడటం, వారితో తగినంత సమయం గడపలేకపోవడం వంటివి ఈ తరహా ప్రవర్తనకు కారణమవుతున్నాయి. అరచేతిలో ఇమిడిన సాంకేతిక ఆయుధం సెల్‌ఫోన్ దీనికి మరింత ఆజ్యం పోస్తోంది. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పిల్లలే ప్రపంచంగా కష్టపడుతున్న తల్లిదండ్రులు వారితో మనసు విప్పి మెలిగితేనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని పోలీసు అధికారులు, మానసిక వైద్య నిపుణులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అనర్థాలపై యువకులకు అవగాహన నేరాల వల్ల జరిగే అనర్థాల గురించి యువకులకు అవగాహన కల్పిస్తాం. ఇప్పటికే పలు చోట్ల అవగాహన సదస్సులు నిర్వహించాం. యువత మంచి మార్గంలో నడవాలి. బిడ్డలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి. వారిని వదిలేస్తే చెడుదారుల్లో తిరుగుతూ నేరాలకు పాల్పడతారు. – రవిమనోహరాచారి, డీఎస్పీ, మదనపల్లె. నైతిక విలువలు ప్రధానం పిల్లలకు మార్కులు కాదు. బిహేవియర్ క్వాలిటీస్ ప్రధానం. నైతిక విలువలు బోధించే పెద్దలు ఇంట్లో లేకపోవడం కూడా ఇబ్బందులకు కారణమవుతోంది. నీతి శతకాలు, పురాణగాథలు చిన్నారులకు సన్మార్గంలో నడిపించడానికి ఎంతో ఉపకరిస్తాయి. – జల్లా లలితమ్మ, బాలల హక్కుల ఐక్య వేదిక అధ్యక్షురాలు విలువలు నేర్పించాలి పిల్లలకు చిన్నప్పటి నుంచే విలువలు నేర్పించాలి. దీని బాధ్యత తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు తీసుకోవాలి. పిల్లలు అధిక సమయం పాఠశాలల్లోనే గడుపుతారు. వారికి నీతి కథలు, మంచి, చెడు గురించి సూక్తులు బోధించాలి. – ఎస్.మహమ్మద్ అయూబ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, రాయచోటి. సమాజం పెను సవాళ్లను ఎదుర్కొంటోంది యువత వ్యసనాలకు లోనై నేరమార్గం వైపు అడుగులు వేస్తున్నారు. మద్యం, మత్తు మందులు, సిగరెట్లను స్టేటస్ సింబల్‌గా, హీరోయిజంగా భావిస్తున్నారు. చదువులకు క్రమంగా దూరమై కొత్తదనం కోరుకుంటూ నేరపూరిత వాతావరణంలోకి జారిపోతున్నారు. విలువలు, సామాజిక బాధ్యతతో కూడిన ప్రవర్తనను నేర్పేందుకు తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. – డాక్టర్ రాధిక, మానసిక వైద్యనిపుణురాలు, మదనపల్లె -
Lifestyle Diseases: లైఫ్ స్టైల్ మార్చుకో గురూ!
సాక్షి, అమరావతి: జీవనశైలి జబ్బులను నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన అవసరం యువతకు ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. తాజా గణాంకాలను బట్టి చూస్తే మధుమేహం, హైపర్ టెన్షన్, క్యాన్సర్, పెరాలసిస్, గుండె జబ్బులు వంటివి ఎక్కువగా నమోదవుతున్నాయి. అన్నిటికంటే మానసిక జబ్బులు యువతపై ముప్పేట దాడి చేస్తున్నాయి. గతంతో పోలిస్తే.. ఇలాంటి జీవనశైలి జబ్బులకు బోధనాస్పత్రుల్లో మెరుగైన వైద్యం లభిస్తున్నా.. కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. 2021 జనవరి నుంచి బోధనాస్పత్రుల్లో నమోదవుతున్న ఔట్ పేషెంట్ సేవల తీరును ఎప్పటికప్పుడు హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (హెచ్ఎంఐఎస్) పోర్టల్‌కు అనుసంధానిస్తున్నారు. దీనివల్ల ఏ ప్రాంతంలో ఎంతమేరకు జీవనశైలి జబ్బులు నమోదవుతున్నాయనేది తెలుస్తుంది. అలా మన రాష్ట్రంలో గడచిన 5 నెలల్లోనే (ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకూ) 1.30 లక్షల మందికి పైగా ఔట్ పేషెంట్లు జీవనశైలి జబ్బులతో చికిత్సకు వచ్చారని తేలింది. ఇవి కేవలం 11 బోధనాస్పత్రుల్లో నమోదైన కేసులు మాత్రమే. పీహెచ్‌సీలు మొదలుకొని జిల్లా ఆస్పత్రుల వరకూ నమోదైన కేసులు అదనం. ఒత్తిడితో చిత్తవుతున్నారు ఉద్యోగాలు, చదువుల్లో గతంతో పోలిస్తే యువతలో ఎక్కువ మంది ఒత్తిడికి లోనవుతున్నారు. ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకూ అత్యధికంగా 51 వేల మందికి పైగా బాధితులు మానసిక జబ్బుల కారణంగా ఔట్ పేషెంట్ సేవల కోసం ప్రభుత్వ పెద్దాస్పత్రులకు వచ్చినట్టు హెచ్‌ఎంఐఎస్‌లో నమోదైంది. కొంతవరకూ కోవిడ్ కూడా ఒత్తిడికి కారణమని నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బులు, మధుమేహం, హైపర్ టెన్షన్ వంటి ప్రధాన జబ్బులు రాకుండా కాపాడుకోవడమనేది ఆ వ్యక్తుల చేతుల్లోనే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. రోజువారీ కార్యక్రమాలను బట్టే ఇవి ఆధారపడి ఉంటాయని పేర్కొంటున్నారు. వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి వల్ల 35 ఏళ్లలోపు యువకులకు కూడా హార్ట్ స్ట్రోక్‌లు పెరిగినట్టు స్పష్టమవుతోంది. డయాబెటిక్ బాధితుల సంఖ్య పెరగడానికి కూడా వ్యాయామం లేకపోవడమే కారణమని వెల్లడైంది. ఎన్సీడీ జబ్బులపై ప్రత్యేక దృష్టి రాష్ట్ర ప్రభుత్వం జీవనశైలి జబ్బులపై దృష్టి సారించింది. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. మధుమేహం, గుండెపోటు వంటి జబ్బులను ప్రాథమిక దశలో కనుక్కునేందుకు స్పెషలిస్టు డాక్టర్లను నియమిస్తున్నారు. మానసిక జబ్బులకు మన రాష్ట్రంలో విశాఖపట్నంలో మాత్రమే ఆస్పత్రి ఉంది. కొత్తగా కడపలో 100 పడకలతో మానసిక ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ చేసి వారికి అవగాహన కల్పించేందుకు కసరత్తు జరుగుతోంది. కోరికలు పెద్దవి.. ఆదాయం చిన్నది చిన్న వయసులోనే కోరికలు చాలా పెద్దవిగా ఉండటం.. దానికి తగ్గట్టు ఆదాయం లేకపోవడం వల్ల చాలామంది మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఇక చదువుల్లో ఒత్తిడి ఎక్కువవుతోంది. మా దగ్గరకు ఎక్కువగా 35 ఏళ్లలోపు వారే ఈ జబ్బులతో వస్తున్నారు. యువకుల్లో వచ్చే మానసిక రుగ్మతలకు తల్లిదండ్రుల పెంపకం కూడా ప్రభావం చూపిస్తుంది. –డాక్టర్ వెంకటరాముడు, మానసిక వైద్య నిపుణులు, ప్రభుత్వ ఆస్పత్రి, కడప పట్టణీకరణ ప్రమాదంగా మారింది జనజీవనంలో పట్టణీకరణ ప్రతికూల మార్పులు తెస్తోంది. ముఖ్యంగా ఆహారంలో తీవ్రమైన మార్పులు తెచ్చింది. దీనికితోడు వారిని ఒత్తిడి గుండెజబ్బుల వైపు నెడుతోంది. శారీరక వ్యాయామం, కూరగాయలతో కూడిన మంచి ఆహారం ద్వారా గుండెపోటును నివారించుకోవచ్చు. ముఖ్యంగా యువతలో మార్పు రావాలి. 90 శాతం మంది యువత వ్యాయామం లేక సతమతమవుతున్నారు. లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే నష్టం కొనితెచ్చుకున్నట్టే. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, హృద్రోగ నిపుణులు, కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి -
లాంగ్ కోవిడ్‌తో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గుతుందంటున్న వైద్యులు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ బారినపడి కోలుకున్నాక కూడా కొందరిలో అనారోగ్య సమస్యలు చాలాకాలం బాధిస్తున్నాయి. లాంగ్ కోవిడ్ సమస్య ఉత్పన్నమవుతోంది. కరోనాతో తీవ్రంగా జబ్బుపడి, ఐసీయూ, వెంటిలేటర్ వరకు వెళ్లిన బాధితులపైనే లాంగ్ కోవిడ్ ఎక్కువ ప్రభావం ఉన్నట్టు తొలుత భావించినా.. పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. కోవిడ్ సీరియస్‌గా మారని వారు, చికిత్స కోసం ఆస్పత్రులదాకా వెళ్లాల్సిన అవసరం పడనివారిలోనూ లాంగ్ కోవిడ్ సమస్యలు కనిపిస్తున్నాయని వివరిస్తున్నారు. వయసుతోగానీ, వ్యాధి తీవ్రతతోగానీ సంబంధం లేకుండా ‘బ్రెయిన్ ఫాగింగ్ (మెదడు మొద్దుబారిపోవడం)’, ఇతర మానసిక సమస్యల బారిన పడుతున్నారని పేర్కొంటున్నారు. ఈ అంశంపై యూకేకు చెందిన ఫ్లోరే ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్స్, మెంటల్ హెల్త్ న్యూరాలజిస్ట్, క్లినికల్ డైరెక్టర్ ట్రేవర్ కిల్పాట్రిక్, ప్రొఫెసర్ స్టీవెన్ పెట్రో పరిశోధన చేశారు. ఇన్‌ఫ్లూయెంజా సహా ఊపిరితిత్తులతో ముడిపడిన వైరస్‌లకు.. మెదడు సరిగా పని చేయకపోవడానికి మధ్య లంకె ఉన్నట్టుగా తమ అధ్యయనంలో తేలిందని వివరించారు. 1918 నాటి స్పానిష్ ఫ్లూకు సంబంధించి డిమెన్షియా, కాగ్నిటివ్ డిక్లైన్, నిద్రలేమి సమస్యలు, 2002 నాటి సార్స్, 2012 లో వచ్చిన మెర్స్ కేసుల్లో యాంగ్జయిటీ, డిప్రెషన్, చురుకుగా వ్యవహరించడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు. సార్స్, మెర్స్ నుంచి కోలుకున్నవారిలో 20 శాతం మంది జ్ఞాపకశక్తితో ఇబ్బందులు, అలసట, నీరసం, కుంగుబాటు, ఆం దోళన సమస్యలు ఎదుర్కొన్నారని వివరించారు. (corona leak: అప్పుడే అనుమానం వచ్చింది! మాట మార్చిన డబ్ల్యుహెచ్ఓ సైంటిస్ట్) ముక్కు నుంచి మెదడుకు.. కోవిడ్ పేషెంట్లలో ముక్కును మెదడుతో కలిపే నరాల ద్వారా వైరస్ మెదడుకు చేరుకుంటోందని అంచనా వేసినట్టు పరిశోధకులు తెలిపారు. మెదడులోని ‘లింబిక్ సిస్టమ్’ను ముక్కులోని సెన్సరీ సెల్స్ కలుపుతాయని.. భావోద్వేగాలు, నేర్చుకోవడం, జ్ఞాపకశక్తి వంటి వాటిని లింబిక్ సిస్టమ్ నిర్వర్తిస్తుందని వివరించారు. కరోనా బారిన పడక ముందు, తర్వాత మెదడుకు సంబంధించిన స్కానింగ్‌లను పరిశీలిస్తే.. లింబిక్ సిస్టమ్‌లోని కొన్నిభాగాలు కుంచించుకుపోయినట్టు బయటపడిందని తెలిపారు. మొత్తంగా కొవిడ్ నేరుగా మెదడుపై ప్రభావం చూపుతోందని స్పష్టమైందని వెల్లడించారు. కాగా.. ఈ పరిశోధన, మెదడుపై కరోనా ప్రభావానికి సంబంధించి రాష్ట్రానికి చెందిన సీనియర్ న్యూరాలజిస్ట్ బి.చంద్రశేఖర్‌రెడ్డి, సైకియాట్రిస్ట్ నిశాంత్ వేమన తమ అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. (corona virus: పండుగ ఊరేగింపులపై నిషేధం!) ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గుతున్నాయి లాంగ్ కోవిడ్ బారినపడ్డవారిలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు వస్తున్నాయి. ఏదైనా విషయాన్ని వెంటనే గుర్తు తెచ్చుకోలేకపోవడం, మర్చిపోవడం, ఆందోళన, కుంగుబాటు వంటివి కనిపిస్తున్నాయి. ఇది ‘బ్రెయిన్ ఫాగింగ్’కు దారితీసి.. మరిన్ని సమస్యలకు కారణమవుతోంది. నిద్ర సరిగా పట్టకపోవడం, గొంతు కండరాల సమస్య, గురక (ఓఏఎస్) వంటివి కూడా వస్తున్నాయి. కరోనా వచి్చనపుడు సరైన పోషకాహారం తీసుకోకపోవడం, దీర్ఘకాలం బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోవడం, బరువు పెరగడం, మానసిక ఆందోళనలకు లోనవడం కారణంగా లాంగ్ కోవిడ్ సమస్యలు పెరుగుతున్నాయి. నాడీ వ్యవస్థపై కరోనా ప్రభావం తక్కువే అయినా.. కొవిడ్ వ్యాక్సిన్‌తో కొందరిలో నరాల పైపొర దెబ్బతిని జీబీ సిండ్రోమ్ అనే వ్యాధి వస్తోంది. 90 శాతం మంది లాంగ్ కోవిడ్ సమస్యల నుంచి 6 నెలలలోగా కోలుకుంటున్నారు. మిగతావారు 9 నెలల నుంచి ఏడాదిలో కోలుకుంటున్నారు. – డాక్టర్ బి చంద్రశేఖర్‌రెడ్డి, న్యూరాలజిస్ట్, చైర్మన్ ఏపీ కొవిడ్ టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ లాంగ్ కొవిడ్ సమస్య పెరిగింది కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన వారితోపాటు ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం రానివారు, స్వల్ప లక్షణాలతో కోలుకున్నవారు కూడా లాంగ్ కోవిడ్ సమస్యతో వైద్యుల వద్దకు వస్తున్నారు. నీరసం, నిస్సత్తువ, అయోమయంగా కనిపించడం, చురుకుదనం లేకపోవడం, త్వరగా అలసిపోవడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జ్ఞాపకశక్తి కోల్పోవడం, యాంగ్జయిటీ, డిప్రెషన్‌కు గురైన వారికి కూడా మేం చికిత్స ఇస్తున్నాం. చాలా మంది త్వరగానే కోలుకుంటున్నారు. వంద మందికి కోవిడ్ వస్తే.. అందులో 30 శాతం మంది వివిధ రకాల లాంగ్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారని ఇది వరకే వెల్లడైంది. జూన్‌లో లాంగ్ కోవిడ్ బాధితులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇప్పటికీ బాధితులు వస్తూనే ఉన్నారు. – డాక్టర్ నిశాంత్ వేమన, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, సన్‌షైన్ ఆస్పత్రి -
సంతోషంగా ఉండటం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: సంతోషం.. మానవ జీవితంలో ఓ ముఖ్యమైన సానుకూల భావన. సంతోషంగా ఉండే వ్యక్తులు మంచి మానవ సంబంధాలు కలిగి ఉంటారు. ఇతరులతో పోల్చుకుంటే వీరికి ఎక్కువగా సామాజిక మద్దతు లభిస్తుంది. అలాగే ఆనందంగా ఉండేవారు తక్కువ ఒత్తిళ్లకు గురవుతారు. అధిక సృజనాత్మకతను, మరింత ఉదారతను కలిగి ఉంటారు. మంచి ఆరోగ్యంతో ఇతరులతో పోల్చుకుంటే ఎక్కువ కాలం జీవిస్తారని మానసిక నిపుణులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసలు సంతోషంగా ఉన్నామనే భావనే జీవితంలో అనేక ప్రయత్నాలను, చొరవల్ని విజయపథం వైపు నడిపిస్తుందని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భయం, ఆందోళన, వైరాగ్యం నుంచి బయటపడి సాధ్యమైనంతగా సంతోషంతో జీవించడానికి ప్రయత్నించాలని సూచిస్తున్నారు. మనుషులపై సంతోషం, సంతృప్తి, అసంతృప్తి వంటి అంశాలు చూపే ప్రభావం, వాటితో ముడిపడిన విషయాలపై సైకియాట్రిస్ట్‌లు డాక్టర్ ఎమ్మెస్ రెడ్డి, డాక్టర్ నిషాంత్ వేమన, సీనియర్ సైకాలజిస్ట్ సి.వీరేందర్‌ల వివరణ వారి మాటల్లోనే... ఆరోగ్యం, విద్య అత్యంత కీలకం ఆస్తులున్నా ఆనందంగా ఉండలేరు. అదే సమయంలో ఏమీలేని వారు కూడా ఉన్నదాంట్లోనే సంతోషంగా గడుపుతుంటారు. సంతోషంగా ఉండడానికి ఆరోగ్యం, విద్య అనేవి చాలా ప్రధానమైనవి. నెలకు రూ. కోటి సంపాదించే వారికి, నెలకు రూ.లక్ష సంపాదించే వారికి హ్యాపీనెస్లో పెద్దగా తేడాలుండవు. అత్యంత సంపన్నులుగా ఉన్న వారు సైతం ఆరోగ్యం సరిగా లేకపోతే, సరిగా నడవలేకపోతే, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలుంటే సంతోషంగా ఉండలేరు. అదే సమయంలో కుటుంబంతో, ఒక వర్గంతో, సామాజిక సంస్థలతో మంచి సంబంధాలు కలిగి ఉండేవారు ఆనందంగా ఉంటారు. సంబందిత కార్యకలాపాలు ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తాయి. కానీ ప్రస్తుతం పూర్తిస్థాయిలో సొసైటీ, ఇతరుల అంచనాలను చేరుకోకపోవడంతో అసంతృప్తి ఏర్పడుతుంది. నేటి యువతరంతో పాటు కాలేజీ విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా గడుపుతూ ఫేస్‌బుక్‌లోనో, ఇన్స్ట్రాగామ్లోనో తాము పెట్టే పోస్టులకు తగిన లైకింగ్లు రాలేదనో, తమకంటే ఇతరులు అందంగా ఉన్నారనో ఇలా అసంతృప్తికి గురవుతున్నారు. మనకు కావాల్సినవన్నీ సమకూరుతున్నా, పెద్దగా సమస్యలు లేకపోయినా ఇంకేదో కావాలని కోరుకుంటూ అది దొరకకపోతే నిరాశ, నిస్పృహలకు గురవుతున్న వారు కూడా ఉన్నారు. – డాక్టర్ నిషాంత్ వేమన, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, సన్‌షైన్ ఆసుపత్రి సమాజమూ సంతోషపడేలా చేయాలి జీవితంలో ఏది ముఖ్యమనే ప్రశ్నకు సంతోషంగా ఉండడమేననే సమాధానమే వస్తుంది. ప్రపంచంలో ఎవరు కూడా నాకు ఆనందంగా ఉండడం ఇష్టం లేదని చెప్పే పరిస్థితి లేదు. ప్రతిఒక్కరూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. అయితే ఆనందం కానీ సంతోషం కాని ఎలా వస్తుందనేది ముఖ్యం. అసలు సంతోషమంటే ఏమిటి? మనసులో కలిగే ఓ మధుర భావన, ఒక కదలిక. ప్రత్యేక ఆహార పదార్థాలు, నచ్చిన సువాసనలు, అందమై దృశ్యాలు, వినసొంపైన సంగీతం, తదితరాలు మంచి అనుభూతిని కలిగించడంతో పాటు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే మనం నిర్దేశించుకున్న లక్ష్యాలు, అంచనాలు చేరుకుంటే, ఏదైనా విషయంలో విజయం సాధిస్తే అది సంతోషాన్ని కలిగిస్తుంది. అయితే ఇవి ఒక్కొక్కరి అలవాట్లు, పద్ధతులు, ఆలోచనా ధోరణులు, పెరిగిన వాతావరణం తదితర ప్రభావాలకు అనుగుణంగా మారిపోతుంటాయి. అయితే వ్యక్తిగత స్థాయి హ్యాపీనెస్ కంటే కూడా సమూహ సమిష్టి ఆనందం ఉన్నత స్థాయిలో నిలుపుతుంది. సంతోషం, సంతృప్తి్త, ఆనందం అనేవి కేవలం మనకు మాత్రమే పరిమితం చేసుకోకుండా విశాల సమాజానికి, వర్గానికి కలిగేలా చేయడం ద్వారా జీవితానికి ఒక సార్థకత, అర్థం ఏర్పడుతుంది. అదే సమయంలో అçపరిమితమైన ఆశలు, ఆశయాలు, నెరవేర్చుకోలేని కోరికలతో సతమతమవుతుండటం కూడా మంచిది కాదు. కోరికలను నియంత్రించుకుంటే అంచనాలు తగ్గి ఆనందంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. – డాక్టర్ ఎమ్మెస్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, డైరెక్డర్, ఆశా హాస్పిటల్స్ అవసరాలు పూర్తి చేసుకోవడంలోనే ఆనందం ప్రముఖ అమెరికా సైకాలజిస్ట్ అబ్రహాం మాస్లో 1970లలో చేసిన సైద్ధాంతీకరణ ప్రకారం.. మనిషి జీవితం ప్రధానంగా ఐదు ముఖ్యమైన అవసరాలను పూర్తి చేసుకోవడంలోనే ముగుస్తుంది. ఆహారం, నీళ్లు, శృంగారం, నిద్ర వంటి శారీరక అవసరాలు.. శారీరక భద్రత, ఉద్యోగ, కుటుంబం, ఆరోగ్యం, ఆస్తుల భద్రత.. ప్రేమ, తనదనే భావన, లైంగిక పరమైన దగ్గరితనం.. ఆత్మగౌరవం, విశ్వాసం, ఇతరులను గౌరవించడం.. స్వీయ వాస్తవికత (సెల్ఫ్ యాక్చువలైజేషన్), నైతికత..వీటిలోనే సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే అంశాలు ముడివడి ఉన్నట్టుగా మాస్లో సూత్రీకరించాడు. ప్రపంచంలో అత్యధిక శాతం మంది శారీరకంగా ఆకలి, సెక్స్, ఆహారం తదితరాల లభ్యతకు సంబంధించిన అవకాశాలు, సామాజికంగా తెలిసిన వారితో ప్రేమ, స్నేహసంబంధాలు, బంధుత్వాలు ఏర్పాటు చేసుకోవడం వంటి వాటి సాధనతోనే సంతోషపడి సంతృప్తి పడతారు. ఎప్పుడైతే ఈ రెండు తీరతాయో అప్పుడు ఒక వర్గానికో, ఒక గ్రూపుకో నాయకత్వం వహించాలని కోరుకుంటారు. లీడర్‌గా ఒకస్థాయికి చేరుకున్నాక ఇతరులకు మంచిచేయడం, ఇతరుల కోసం కృషి చేయడంలో సంతోషం, ఆనందం పొందడం జరుగుతుంది. ప్రస్తుత సమాజం చాలా వేగంగా మారడం, ఇందులో.. అందంగా కనిపించేందుకు ఎక్కువగా ప్రయత్నం, ఆలోచించగలగడం వంటివి జరుగుతున్నాయి. అందువల్లే తమ ముందుతరంతో పోల్చితే యంగర్ జనరేషన్ తెలివిగా, నూతనంగా ఆలోచిస్తుంటుంది. కొత్త పోకడలతో సృజనాత్మకంగా ఆలోచించే ప్రయత్నం చేస్తుంటుంది. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ చదవండి: Fathers Day: నాన్న ఎవ్రీడే వారియర్.. -
టీకా తీసుకుంటే 'పాజిటివ్' రాదు
సాక్షి, అమరావతి: కోవిడ్ టీకా వేసుకుంటే కరోనా పాజిటివ్ వస్తుందని రెండ్రోజులుగా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం తీవ్రంగా ఖండించింది. కోవాగ్జిన్, కోవిషీల్డ్ రెండు వ్యాక్సిన్లలో ఏ ఒక్కటీ ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్‌కు దారితీయవని, వ్యాక్సిన్ వేసుకుంటే పాజిటివ్ రాదని ఏపీ కమాండ్ కంట్రోల్ అధికారులు ప్రకటించారు. ఇలాంటివి కేవలం పుకార్లు మాత్రమేనని, వీటిని నమ్మద్దని పేర్కొన్నారు. ప్రతి చిన్న విషయానికీ ప్రజల్లో కంగారు కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు ప్రతి చిన్న విషయానికి కంగారు పడుతున్నట్టు వైద్యుల పరిశీలనలో వెల్లడైంది. జబ్బు తీవ్రత 20 శాతమైతే.. కంగారు వల్ల తలెత్తే మానసిక కుంగుబాటు ప్రభావం 80 శాతం ప్రతికూలంగా పనిచేస్తోందని వైద్యులు చెబుతున్నారు. ప్రతి దానికీ ఆందోళన చెందటం సరికాదని, అప్రమత్తంగా ఉంటే చాలని స్పష్టం చేస్తున్నారు. చాలా కేసుల్లో 40 ఏళ్ల యువతలోనే ఆందోళన కనిపిస్తోందని, వాళ్లు మానసికంగా ఎంతగా ఇబ్బంది పడుతున్నారో దీనివల్ల అర్థమవుతోందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. మానసిక కుంగుబాటు కారణంగా కరోనా నుంచి కోలుకోవడానికి అధిక సమయం పడుతోందని, కరోనా ఆందోళన పడాల్సిన జబ్బు కాదని స్పష్టం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తల ఆధారంగా.. చాలామంది సామాజిక మాధ్యమాల్లో వచ్చే హెల్త్ టిప్స్‌ను పాటిస్తున్నారు. డాక్టరు సలహా లేకుండా, తీవ్రత తెలియకుండా ఇలా చేయడం వల్ల తీవ్ర నష్టం కలుగుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. కోవిడ్ లక్షణాలున్నా.. కోవిడ్ పాజిటివ్ ఉన్నా దీనికి స్టాండర్డ్ ట్రీట్మెంట్ ప్రొటోకాల్ ఉందని, దీనిని పాటించకుండా సోషల్ మీడియాలో వచ్చిన వాటిని అనుసరించటం సరికాదని చెబుతున్నారు. కొంతమంది గూగుల్‌లో సెర్చ్ చేసి మరీ వివరాలు సేకరించి పాటిస్తున్నారని, ఏమాత్రం అనుసరణీయం కాదని నిపుణులు పదే పదే చెబుతున్నారు. -
భయం వద్దు.. మనోబలమే మందు
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ గురించి మితిమీరిన ఆలోచనలు, ఆందోళనతో కొంతమంది మానసిక రుగ్మతకు గురవుతున్నారు. భవిష్యత్ ఏమిటోనని బెంబేలు పడిపోతూ కొత్త ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. లాక్ డౌన్‌తో ఖాళీ సమయం ఎక్కువగా ఉండి ప్రజలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాను అనుసరిస్తున్నారు. కొంతమంది కరోనా వైరస్‌పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు. అశాస్త్రీయమైన సమాచారం ఎక్కువగా వస్తుండటంతో ఆందోళన తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది. ఈ విషయానికి సంబంధించి కొన్ని రోజులుగా మానసిక వైద్యులకు పెద్ద సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయని తెలుస్తోంది. వారి సలహాలు తీసుకుంటూ కొందరు తమ మానసిక పరిస్థితిని అదుపులో ఉంచుకుంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంపై తగిన అవగాహన కలిగి ఉండి, లాక్డౌన్ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మన చేతుల్లో లేని విషయాల గురించి ఆందోళన చెందకుండా లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మానసిక వైద్యుడు డా.ఇండ్ల విశాల్ సూచిస్తున్నారు. - ఇంట్లోనైనా కనీస వ్యాయామం చేయాలి. కుటుంబ సభ్యులు అందరూ కలసి కాసేపు వ్యాయామంగానీ యోగాగానీ చేస్తే మరీ మంచిది. - ఈ ఖాళీ సమయంలో కొత్త అంశాలు నేర్చుకునేందుకు ప్రాధాన్యమివ్వాలి. వంట చేయడం మానసిక ఉల్లాసాన్ని ఇస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. - పిల్లలు, కుటుంబసభ్యులతో కలసి ఇంటిపట్టునే ఉండి చెస్ లాంటి ఆటలు ఆడుకోవచ్చు. పెద్దలు తాము బాల్యంలో ఆడిన ఆటలను పిల్లలతో ఆడిపించాలి. - పాత ఫొటో ఆల్బమ్‌లు చూసి నాటి మధురస్మృతులను నెమరువేసుకోవచ్చు. బిజీ లైఫ్‌లో చాలా కాలంగా మాట్లాడలేకపోయిన దూరప్రాంతాల్లోని కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఫోన్లో మాట్లాడి అనుబంధాలను బలోపేతం చేసుకోవచ్చు. - టీవీల్లో మంచి సినిమాలు చూడటం, సంగీతాన్ని ఆస్వాదించడం వంటి వాటితో మానసిక ఉల్లాసం పొందవచ్చు. అవగాహన.. సమయం సద్వినియోగంతోనే పునరుత్తేజం కరోనా వైరస్ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ వైరస్ పట్లగానీ లాక్డౌన్ పరిస్థితి గురించి గానీ మితిమీరిన ఆందోళన చెందితే కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రస్తుతం దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని లాక్డౌన్ ఎత్తివేసే నాటికి పునరుత్తేజితులు కావచ్చు. పనిలో మరింత సమర్థంగా రాణించేందుకు సిద్ధంకావచ్చు.’ – డా.ఇండ్ల విశాల్, మానసిక వైద్య నిపుణుడు, విజయవాడ రుగ్మతల లక్షణాలు ఇవీ.. తీవ్ర ఆందోళనకు గురి అవుతున్న వారి లక్షణాలు ఇలా ఉంటాయని మానసిక వైద్యులు చెబుతున్నారు. - ఆరోగ్యంగా ఉన్నా సరే జ్వరం వచ్చినట్లు భ్రమ, గొంతు బొంగురు పోయినట్టు భావన. మళ్లీ అంతలోనే మాములుగా అనిపించడం. ఒళ్లు వేడెక్కిందేమోనని మాటిమాటికీ చూసుకోవడం, ఇంట్లో వాళ్లను కూడా తన చెయ్యి పట్టుకుని చూడమని కోరడం.. ఇలాంటి లక్షణాలను హైపర్‌కాండ్రియాసిస్ అంటారని మానసిక వైద్యులు చెబుతున్నారు. - పరిస్థితి అంతా బాగున్నా సరే.. అవసరం లేకున్నా సరే.. పక్కవారిని అనుసరిస్తూ పరిస్థితిని జఠిలం చేసుకుంటూ ఉంటారు. దీన్నే ‘సోషల్ కంటేజియన్’ అని అంటారు. నెలకు సరిపడా సరుకులు ఇంట్లో ఉన్నా.. అతి జాగ్రత్తతో మళ్లీ మార్కెట్‌కు వెళ్లి సరుకులు తెస్తుంటారు. ఇరుగు పొరుగు వాళ్లు మార్కెట్‌కు వెళ్తున్నారు కదా.. మనం కూడా వెళ్లి మరిన్ని సరుకులు తెచ్చేసుకుందాం అని వారిని అనుసరిస్తారు. - తమ, కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిపై మితిమీరిన ఆందోళనతో కొత్త సమస్యలు తెచ్చుకుంటారు. లాక్ డౌన్ ఎన్నాళ్లు ఉంటుందో, ఇంకా పొడిగిస్తారేమో, ఉద్యోగ భద్రతపై ఆందోళనతో తీవ్రంగా సతమతమవుతుంటారు. తమ చేతుల్లోలేని విషయం గురించి ఎక్కువగా ఆలోచించడంతో కుంగుబాటుకు గురి అవుతారు. ఈ కుంగుబాటు నుంచి బయటపడటానికి చాలా సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. -
ఆమెకు నేనంటే ఇష్టం, ఇదేం అభిమానం?!
‘‘ఆమె కళ్లు నన్నే చూస్తున్నాయి. ఆ చిరునవ్వులు నా కోసమే. ఆమెకు నేనంటే ఎంతో ఇష్టం. అందుకే నాకు నచ్చే ఫొటోలనే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తోంది. ఆమె తప్ప మరో ప్రపంచం లేదు. మరికొద్ది రోజుల్లో మేం కలుసుకోబోతున్నాం...’’ ఏ ప్రేమికుడి హృదయ స్పందనో, మరే భగ్నప్రేమికుడి విషాదగాథో కాదిది. ఏడాదిగా ఓ మానసిక జబ్బుతో బాధపడుతున్న ఇంజనీరింగ్ విద్యార్థి నిశాంత్ (పేరు మార్చాం) దైన్యస్థితి ఇది. బేగంపేట్‌కు చెందిన నిశాంత్ బాగా చదివేవాడు. తన అభిరుచికి అనుగుణంగానే ఇంజనీరింగ్‌లో చేరాడు. కానీ అతడు ఒక వర్ధమాన నటి (ఒక ప్రముఖ నటుడి కూతురు)పై ఆకర్షితుడయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టే పోస్టింగ్‌లు, ఒకట్రెండు రిప్లైలు చూసి పడిపోయాడు. ఆమెను అభిమానించాడు. ఆమెపెట్టే ప్రతి పోస్టింగ్ తనకోసమే అనుకున్నాడు. నిజానికి వారి మధ్య ఎలాంటి పరిచయం లేదు. ఒకట్రెండు సినిమాల్లో ఆమెను చూసి, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టింగ్‌లు, రిప్లైలకు ఆకర్షితుడయ్యాడు. ఇప్పుడు ఆమే అతడి ప్రపంచమైంది. తన గది ఆమె చిత్రాలతో నిండిపోయింది. ఇంజనీరింగ్ మూడో సంవత్సరం మధ్యలో ఆగిపోయింది. నిశాంత్ ‘సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్’ వ్యాధితో బాధపడుతున్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. – సాక్షి, హైదరాబాద్ నిశాంత్ మాత్రమే కాదు. నచ్చిన సినిమా హీరోలను, హీరోయిన్లను, రాజకీయ నాయకులను, ప్రముఖులను అభిమానించడమనే లక్షణం కొంతమందిలో క్రమంగా మానసిక జబ్బుగా మారుతున్నట్లు మానసిక వైద్యనిపుణులు చెబుతున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్‌మీడియాలు ఇందుకు వేదికలవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో 18–35 ఏళ్లలోపు వయసున్న కొంతమంది యువతలో ఈ తరహా సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ ఆందోళన కలిగిస్తోందని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ సంహిత తెలిపారు. ఇదేం అభిమానం?! ఒకరిపై ఒకరు అభిమానం కలిగి ఉండడం, నచ్చిన హీరో, హీరోయిన్లను అభిమానించడంలో తప్పు లేదు. కానీ ఇటీవల ఈ అభిమానం నచ్చిన వాళ్లను ఆరాధ్యదైవంగా భావించే స్థితికి వెళ్తోంది. సికింద్రాబాద్‌కు చెందిన డిగ్రీ చదివే అమ్మాయి సోషల్ మీడియాలో విరాట్‌కోహ్లీ చిత్రాలను, పోస్టింగ్‌లను చూసి ఆకర్షితురాలైంది. ఒకటి, రెండు రిప్లైలతో విరాట్ ప్రపంచంగా బతికేస్తోంది. ఆరు నెలల క్రితం క్రికెట్ అంటే ఏంటో తెలియని ఆ అమ్మాయి ఇప్పుడు టీవీకి అతుక్కుపోయి మ్యాచ్‌లు చూస్తోంది. కాలేజీకి వెళ్లడం మానేసింది. తల్లిదండ్రులు ఎందుకలా చేస్తున్నావని నిలదీశారు. ‘విరాట్‌కు తానంటే ఇష్టమని, ఆయన పోస్టింగ్‌లన్నీ తనకోసమేనని’ చెప్పింది.ఆ తల్లిదండ్రులకు కాళ్ల కింద భూమి కదిలినంత పనైంది. నగరానికే చెందిన మరో యువకుడు తాను, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి సొంత అన్నదమ్ములమని, కానీ తనను ఆ కుటుంబం నుంచి వేరు చేశారని ఆందోళన చెందుతున్నాడు. ఆ యువకుడు చిరంజీవి ముఖకవళికలను కలిగి ఉన్నట్లుగా భావించడమే ఇందుకు కారణం. ఆజ్యం పోస్తోన్న సోషల్ మీడియా ఒక స్వచ్ఛంద సంస్థ అంచనా మేరకు ప్రపంచవ్యాప్తంగా మూడో వంతు యువత ఈ జాఢ్యానికి గురవుతున్నారు. ఫిల్మ్హబ్లుగా మారిన హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్’ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతి 3 వేల మందిలో కనీసం 30 – 40 శాతం మంది దీనిబారిన పడుతున్నట్లు మానస ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ సంహిత తెలిపారు. ‘‘60 శాతం యువత ఇప్పుడు సోషల్ మీడియాకు బానిసగా మారారు. కెరీర్‌ను పాడుచేసుకుంటున్నారు. ఐడెంటిటీ క్రైసిస్‌తో బాధపడుతూ మానసిక రోగులుగా మారుతున్నారు. ఇలాంటి లక్షణాలను తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తొలిదశలోనే గుర్తిస్తే తక్కువ ప్రమాదంతో బయటపడవచ్చు’’ అని ఆమె సూచించారు. అభిమానం.. మూడు దశలు - మొదటిది సోషల్ లెవల్. ఈ స్థాయిలో ‘బాగుంది’ అనే మెచ్చుకోలు మాత్రమే ఉంటుంది. - రెండోది పర్సనల్ లెవెల్. ఈ దశలో తమకు నచ్చిన సెలబ్రిటీతో ఒక బంధాన్ని ఏర్పర్చుకుంటారు. - మూడోది పాథలాజికల్ లేదా సైకోటిక్ దశ. ఈ దశలో తమ అభిమాన సెలబ్రిటీని పూజిస్తారు. ఆ సెలబ్రిటీయే వారి ప్రపంచమవుతుంది. నిరంతరం వారి ధ్యాసే ఉంటుంది. వారి కోసం టాటూలు వేసుకుంటారు. చెవికి రింగులు కుట్టించుకుంటారు. ఆ సెలబ్రిటీ ప్రతి కదలిక తమ కోసమేనని భావించి మమేకమైపోతారు. వాస్తవ పరిస్థితి నుంచి ఒక ఊహా ప్రపంచం (ఫాంటసీ)లోకి వెళ్లిపోతారు. ఈ దశలో మెదడులోని డొపమైన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ‘‘ఈ ఫాంటసీతో పాటు, డిప్రెషన్, యాంగై్జటీ వంటి లక్షణాలు కూడా పెరుగుతాయి’’ అని ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ సంగిశెట్టి సతీష్ తెలిపారు. -
నాకు తెలియాలి
‘ఇమాజినేటివ్ కన్ఫ్యూజన్’ అనే మాట వైద్యంలో ఉంటుంది. ఇంట్లో మనకు తెలిసినదానిని బట్టి ‘ధోరణి’ ‘తిక్క’ ‘పెత్తనం’, ‘ఓవరాక్షన్’ లాంటి పదాలు వాడతాం. మన కుటుంబ సభ్యులు కొందరు మన గురించి అతిగా స్పందిస్తుంటారు. దాని వల్ల సమస్యలు వస్తాయి. వారిని పట్టించుకోవాలి. వైద్య నిపుణుల సహాయం తీసుకోవాలి. అది అమ్మ గురించి కావచ్చు.నాన్న గురించి కావచ్చు. రాజు ఆ ఇంటి పెద్ద కొడుకు. పెళ్లి చేసుకోనంటున్నాడు. అతనికి ఇరవై అయిదు వచ్చేశాయి. రెండో కొడుకు ఇరవై మూడేళ్ల వయసులో క్యూలో ఉన్నాడు. ఆ ఇద్దరూ మంచి వయసులో ఉత్సాహంతో కొండలను కూడా పిండి కొట్టగల ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఉన్నారు కూడా. కాని వారి మనసులో ఏదో వెలితి. ఏదో అసంతృప్తి. నిరాశ. తల్లిదండ్రులు పెద్ద కొడుకును సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకువచ్చారు. ‘డాక్టర్.. వీడు పెళ్లి చేసుకునేలా చూడండి’ అని కోరారు. ఆ వయసు కుర్రాళ్లకు ఉండే సమస్యలు తెలుసుకుందామని సైకియాట్రిస్ట్ అతనితో మాట కలిపాడు. ‘ఏంటి నీ సమస్య రాజూ?’ ‘నాకేం సమస్య సార్. నాకు ఏ సమస్యా లేదు. సమస్యల్లా మా అమ్మా నాన్నలదే. వాళ్లు సంతోషంగా ఉన్నట్టు నేను ఊహ తెలిసినప్పటి నుంచి చూళ్లేదు. ఎప్పుడూ ఏదో ఒక కీచులాటే. వాళ్లను చూసి చూసి నాకు పెళ్లి చేసుకోవాలనిపించడం లేదు’ అన్నాడు. అయితే సమస్య ఇక్కడ లేదని రెండో కొడుకును పిలిచాడు. ‘ఏంటి ప్రాబ్లమ్’ ‘ఏం చెప్పమంటారు సార్. నాకూ మా అన్నకూ గొడవలు వచ్చేస్తున్నాయి ఈ మధ్య. దానికి కారణం మా అమ్మానాన్నలు. ఏదో పనికి మాలిన విషయానికి వాళ్లిద్దరు వాదులాడుకుంటారు. మేము ఇంట్లో ఉంటాము కదా. తెలియకుండానే ఒకరు అమ్మ పక్షం, ఒకరు నాన్న పక్షం అయిపోతున్నాం. వాళ్లు కాసేపు తిట్టుకొని మామూలైపోతారు. నేనూ అన్నయ్య తగాదా కంటిన్యూ చేస్తూ మనస్పర్థలు పెంచుకుంటూ ఉన్నాం’. ఇప్పుడు సైకియాట్రిస్ట్ తల్లిని పిలిచాడు. ‘డాక్టర్.. వారి కోసం అనుక్షణం ఆలోచించే తల్లిని. భార్యను. వారి బాగోగులు చూసుకోవడం నా తప్పా?’ అని అడిగింది ఆమె. ఆమెలో ఏ లోపమూ కనిపించలేదు. తండ్రిని పిలిపించాడు.‘సార్.. నా భార్యకు వంక పెట్టడానికి లేదు. ఆమె తన జీవితం మొత్తాన్ని నా కోసం మా ఇద్దరు అబ్బాయిల కోసం వెచ్చించింది. కష్టపడింది. అయితే–’ అని ఆగాడు.‘అయితే?’ ‘ఆ కష్టం కొంచెం ఎక్కువయ్యింది సార్. ప్రతి దాంట్లో ఆమె ఇన్వాల్వ్ అవుతుంది. మాకు ఒక మోస్తారు వ్యాపారం ఉంది. నేనూ మా ఇద్దరబ్బాయిలు చూసుకుంటాం. బయట సవాలక్ష ఉంటాయి. అవి అన్నీ ఆమెకు తెలియడం ఎందుకు చెప్పండి? అంటే ఆమె నుంచి దాచే విషయాలని కాదు. ఆమెకు చెప్పాల్సింది ఆమెకు చెప్తాం. కాని ఆమె వినదు. ఎప్పుడూ ఏదో ఒక ఆందోళనే. నేను ఏం చేస్తున్నానో, పెద్దాడు ఏం చేస్తున్నాడో, చిన్నాడు ఏం చేస్తున్నాడో... బిజినెస్ సరిగ్గా జరుగుతున్నదో లేదో, కలెక్షన్స్ అవుతున్నాయో లేదో, సేల్స్ ఎలా ఉన్నాయో అన్నీ కావాలంటే ఎలా? పని చేసి ఇంటికి రాగానే ఏదో ఒక వివరం అడుగుతుంది. నాకు చెప్పే ఓపిక ఉండదు. దాంతో తగాదా. ఆమెను మేం బాగా చూసుకుంటున్నాం. హాయిగా ఉండొచ్చు కదా. మమ్మల్ని బాధ పెడుతోంది’ అన్నాడతను. తీగలాగితే డొంక కదిలినట్టు సమస్య తల్లిలో ఉందని సైకియాట్రిస్ట్‌కు అర్థమైంది. సత్యవతికి చిన్నప్పటి నుంచి ఊహాజనితమైన భయాలు ఉన్నాయి. ఏదో ఒక నష్టం జరుగుతుందేమో తనకు అనే భయం అది. ఆమె బాల్యంలో తెలిసిన వారి కుటుంబాల్లో అకాల మరణాలు చూసింది. అనుకోని విషాదాలు చూసింది. జీవితం అంటే ఏదో ఒక ప్రమాదం అనుక్షణం పొంచి ఉంటుందనే భయం ఆమెలో స్థిరపడింది. ఆమెకు భర్త, పిల్లలే లోకం. వీరికి ఏ ఆపద వచ్చి పడుతుందో అని ఆమె భయం.భర్త షాప్‌కు వెళ్లగానే ఫోన్ చేస్తుంది. ఆ తర్వాత షాప్‌లో పని చేసే వర్కర్లకు చేస్తుంది. ఆ తర్వాత పెద్ద కొడుక్కు చేస్తుంది. ఆ తర్వాత చిన్న కొడుక్కు చేస్తుంది. ఏదో ఇప్పుడిప్పుడు కృష్ణారామా అంటూ వ్యాపారం సెటిల్ అయ్యింది.. కొడుకులు అందివచ్చారు... ఈ సంతోషానికి ఏదైనా విఘాతం జరిగితే అని ఆమెకు ఒకటే రంధి.భర్త, కొడుకులు ఈ ధోరణితో విసిగిపోతున్నారు. దీనిని పెత్తనం అనుకుంటున్నారు. చాదస్తం అనుకుంటున్నారు. ‘మీకున్న ఇబ్బందిని ఇమాజినేటివ్ కన్ఫ్యూజన్ అంటారమ్మా’ అన్నాడు డాక్టర్ ఆమెతో. ‘మీరే సమస్యను ఊహించుకుని, దానిలో చిక్కుకుని, మీరే పరిష్కారం కోసం ఆందోళన పడటం దీని లక్షణం’ అన్నాడాయన. ‘భర్త గురించి పిల్లల గురించి ఆందోళన పడటం తప్పా డాక్టర్?’ అందామె. ‘తప్పు కాదమ్మా. కాకపోతే నువ్వు ఎక్కువ ఆందోళన పడుతున్నావు. నీకు బాగా వ్యతిరేక స్వభావం ఏర్పడింది. రేప్పొద్దున తెల్లారదేమో అనే భయం నీకు లేదు. కాని రేప్పొద్దున ఏ నష్టం వస్తుందోననే భయం మాత్రం ఉంది. తెల్లారి తీరుతుంది అని మనసుకు తెలిసినట్టుగా నావాళ్లకు ఏమీ కాదు అని మనసుకు ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు? హైదరాబాద్‌లో దాదాపు కోటిమంది జనాభా ఉన్నారు. మనం పేపర్ తీస్తే రోజుకు అయిదో పదో దుర్ఘటనలు వ్యక్తుల మరణాలు నష్టాలు చూస్తాం. అంటే కోటి మందిలో కోటి మందీ ప్రమాదంలో లేనట్టే కదా దీని అర్థం. అందరికీ అన్నీ నష్టాలే జరిగితే ఇన్ని వేల సంవత్సరాల్లో మానవులు ఎప్పుడో హరించుకుపోయి ఉండేవారు’ అన్నాడాయన. ఆమె కాస్త తెరిపిన పడింది. ‘నీ భర్తను, పిల్లలను చూసుకోవడానికి నువ్వు కాకుండా ప్రభుత్వము, అధికారులు, పోలీసులు, సైన్యము, సమాజమూ, ఇరుగు పొరుగు, నువ్వు నమ్మేటట్టయితే దైవము ఇంత మంది ఉంటారు. కాబట్టి నిశ్చింతగా ఉండి వాళ్లకు ఎంత అవసరమో అంత సపోర్ట్ చేయి. నువ్వు సొంతంగా నీకిష్టమైన వ్యాపకం పెట్టుకో. ఫ్రెండ్స్‌ని కలువు. ఇంకేమైనా పనులు చేయి. సంతోషంగా ఉండి కుటుంబాన్ని సంతోషంలో పెట్టు. మీ ఇంటికి న్యూస్‌పేపర్ వస్తే అందులో రెండో మూడో విషయాలు నువ్వు చదువుతావు. అచ్చయిన ప్రతి వార్తా చదవవు కదా... నీ భర్త, పిల్లలు బయట జరిగే ప్రతి వ్యవహారం నీతో ఎందుకు చెప్పాలి చెప్పు? ఒకటి రెండు అవసరమైనవి చెప్తారు. నువ్వే కాదమ్మా... చాలా ఇళ్లల్లో నీలా తల్లులో తండ్రులో అన్నయ్యలో అనవసర ఆందోళన వల్ల అనవసర జోక్యం చేసుకుని అశాంతికి కారణమవుతున్నారు. కొంచెం సర్దుబాటు చేసుకుంటే ఇదంతా సమస్యే కాదు’ అని వివరించాడు. ఇంత వివరించాక ఆమెలో మార్పు రాకుండా ఉంటుందా? ఆమెకే కాదు, ఎవరిలోనైనా రావాల్సిందే. – కథనం: సాక్షి ఫీచర్స్ డెస్క్ ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
పల్లెల వాకిట్లో మానసిక చీకట్లు!
సాక్షి, అమరావతి: ప్రశాంతతకు నిలయాలైన పల్లెల్లో ఇప్పుడు మానసిక అశాంతి అలజడి సృష్టిస్తోందనడానికి పై రెండు కేసులు ఉదాహరణలు. రక్తపోటు, మధుమేహానికి తోడు తాజాగా మానసిక సమస్యలూ ఇప్పుడు గ్రామసీమల్లో చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు పట్టణాలు, నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ పోకడ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ పాకుతోందని.. ఇది ప్రమాదకర సంకేతమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. నగరాలు, పట్టణాల్లోని ఆధునిక జీవనశైలి పల్లెలపైనా పెనుప్రభావం చూపుతున్నాయంటున్నారు. సాధారణంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు జ్వరాలు వంటి చిన్నచిన్న సమస్యలకు వస్తుంటారు. కానీ, గత కొంతకాలంగా మానసిక సమస్యలతో వస్తున్న వారు ఎక్కువగా ఉంటుండడంతో ప్రభుత్వాస్పత్రుల్లో ఇటీవల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో గ్రామీణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు విస్తుపోయేలా ఉన్నాయి. రకరకాల మానసిక రుగ్మతలున్న వారు వేలాది మంది ఉన్నట్లు బయటపడింది. వీటిలో స్క్రీజోఫీనియా, డిప్రెషన్ (కుంగుబాటు), తనలో తాను మాట్లాడుకోవడం, ఎక్కువగా మాట్లాడడం, అకస్మాత్తుగా తీవ్రంగా స్పందించడం (మానిక్ డిజార్డర్స్) వంటి మానసిక రోగాలతో సతమతమవుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. రాష్ట్రంలో ఇలా బాధపడుతున్న వారిలో ప్రకాశం జిల్లా వాసులు అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానంలో అనంతపురం, నెల్లూరు, విశాఖ, ప.గోదావరి జిల్లాల పల్లెవాసులు ఉన్నారు. సగటున చూస్తే పురుషుల్లోనే ఈ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇదిలా ఉంటే.. వీరికి సరైన వైద్యం అందించేందుకు అవసరమైన క్లినికల్ సైకియాట్రిస్టులు రాష్ట్రంలో కరువయ్యారు. దేశవ్యాప్తంగా వీరు 5,500 మంది ఉంటే రాష్ట్రంలో కేవలం 150 మంది మాత్రమే ఉన్నారు. 2 దశాబ్దాల్లో పెనుమార్పులు కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడం, సామాజిక మాధ్యమాల వలలో పడిపోవడంవల్ల ఒంటరితనం బాగా పెరిగిపోతోంది. దీంతో మానసిక ఒత్తిడికి లోనై తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రెండు దశాబ్దాల కిందట ఈ పరిస్థితి లేదు. యువకుల్లో మద్యం, మత్తు మందు వినియోగం పెరగడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. దీనివల్ల బలవన్మరణాలు ఎక్కువవుతున్నాయి. మెంటల్ హెల్త్‌ను కాపాడుకోవాలంటే ప్రత్యేక యంత్రాంగాన్ని తయారు చేసుకోవాల్సి ఉంది. – డా. ఇండ్ల రామసుబ్బారెడ్డి, మానసిక వైద్య నిపుణులు, విజయవాడ తల్లిదండ్రుల తీరూ కారణమే తల్లిదండ్రుల పెంపకం కూడా సరిగ్గాలేక పెడదారి పడుతున్న వారూ ఉన్నారు. సెల్‌ఫోన్‌ను బాగా వాడే చిన్నారిని చూసి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. ఇది సరికాదు. పిల్లలు ఏ దారిలో వెళ్లాలో తల్లిదండ్రులే తికమక పెడుతున్నారు. చదువు నుంచి స్థిరపడే వరకూ ఇదే పరిస్థితి ఉంది. వీటన్నింటికీ మించి మన విద్యావిధానం వల్ల పిల్లలపై ఎంత ఒత్తిడి ఉందో అందరికీ తెలిసిందే. – డా. మురళీకృష్ణ, ప్రొఫెసర్ ఆఫ్ సైకియాట్రీ, గుంటూరు ప్రభుత్వాసుపత్రి ►ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన వెంకట సుబ్బయ్యకు 38 ఏళ్లు. ఓ కిరాణాషాపులో పనిచేస్తాడు. పిల్లల చదువులకు తన సంపాదన ఏమాత్రం సరిపోకపోవడంతో తీవ్రంగా మథనపడుతున్నాడు. ఒక్కోసారి తనలో తానే గొణుక్కోవడం, ఎవరితో మాట్లాడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుండడంతో కుటుంబ సభ్యులు అతన్ని దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఇదొక రకమైన మానసిక జబ్బు అని, దీనిని ప్రాథమిక దశలో గుర్తిస్తే మెరుగైన ఫలితం ఉండేదని డాక్టర్లు అభిప్రాయపడ్డారు. ►శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన 33 ఏళ్ల మనోహర్ ఇంట్లో ఎప్పుడెలా వ్యవహరిస్తాడో తెలీదు. ఒక్కోసారి బాగా ఉంటాడు. మరోసారి అకస్మాత్తుగా తీవ్రంగా స్పందిస్తాడు. ఇంట్లోని వారు అతన్ని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. కుటుంబ సమాచారం అంతా డాక్టర్ తెలుసుకుని మానసిక జబ్బుల్లో ఒకటైన స్క్రిజోఫీనియాతో రోగి బాధపడుతున్నాడని చెప్పారు. భార్యతో సరిగ్గా పొసగకపోవడం ప్రధాన కారణంగా ఆయన తేల్చారు. మానసిక రుగ్మతలకు వైద్యులు చెబుతున్న కారణాలు.. ►కుటుంబ వ్యవస్థ చిన్నదిగా మారడం.. చదువులు, ఉద్యోగాల పేరిట పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉండటం.. ►మద్యం వినియోగంతో పెరుగుతున్న సమస్యలు గ్రామాల్లో ఆరేళ్ల నుంచి 45 ఏళ్లలోపు వారిపై సామాజిక మాధ్యమాలు, మితిమీరిన సినిమాలు, టీవీల ప్రభావం ఎక్కువగా ఉండటం.. ఉద్యోగాల్లోనూ ఒత్తిడి కారణంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు.. విడిపోవడం కారణంగా మానసిక ఆందోళన పెరగడం.. ఈ ప్రభావం గ్రామాల్లో ఉండే తల్లిదండ్రులపై పడడం.. ఉద్యోగరీత్యా గ్రామీణ యువకులు విదేశాలకు వెళ్లడంవల్ల సొంతూళ్ల్లలోని తల్లిదండ్రుల్లో మానసిక ఆందోళన.. ఆధునిక జీవనశైలి కారణంగా యుక్త వయసులోనే మానసిక సమస్యలకు గురవడం.. -
చేతికి రాని పెద్దకొడుకు
అమ్మాయి ఉంటే పెళ్లయ్యిందా అని అడుగుతారు. అబ్బాయి ఉంటే ఏం చేస్తున్నాడు అని ఆరా తీస్తారు. సమాజ నిర్దేశాలను ఎవరూ తప్పించుకోలేరు. పుట్టిన కొడుకు ఎదగాలి. ఎదిగినవాడు తన కాళ్ల మీద తాను నిలబడాలి. పెళ్లి కాని అమ్మాయి గుండెల మీద కుంపటి అనే రోజులు పోయాయి. చేతికి రాని కొడుకు స్ట్రగుల్ అయ్యే రోజులు పెరిగాయి. అలా స్ట్రగులవుతున్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చేయాలి? ఆ కొడుకు ఏం తెలుసుకోవాలి? చాలారోజుల తర్వాత ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారు. టీలు, కాఫీలు అయ్యాయి. తండ్రి, తల్లి చాలా ఉత్సాహంగా వారికి మర్యాదలు చేశారు. ఇంట్లో చిన్నకొడుకు సోడా బుడ్డీ కళ్లద్దాలతో బి.టెక్ పుస్తకాలు చదువుతూ కనిపించడం ఫ్రెండ్స్‌కు నచ్చింది. ‘బి.టెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు మావాడు. మంచి మార్కులు తెస్తున్నాడు’ అని తండ్రి గర్వంగా చెప్పాడు. వాళ్లు మెచ్చుకున్నారు. ‘మీ పెద్దబ్బాయికి ఆల్రెడీ బి.టెక్ అయిపోయిందిగా. ఇప్పుడేం చేస్తున్నాడు?’ అడిగారు ఎవరో. తండ్రి, తల్లి కొంచెం తొట్రుపడ్డారు. ‘వాడా... వస్తాడుగా.. మీరే అడగండి. వాడిది కొంచెం సపరేట్ ట్రాక్ లేండి’ అనేసి టాపిక్ మార్చేసింది తల్లి. వాళ్లు ఉన్నంతసేపు పెద్దకొడుకు ఇంటికి రాడని ఆ తండ్రికీ తల్లికీ తెలుసు. పెళ్లి జరుగుతోంది బంధువుల ఇంట. తండ్రి, తల్లి, చిన్నకొడుకు వచ్చారు. ‘మీ పెద్దాడు రాలేదా? వాడిదసలే తాత పోలిక. వాణ్ణి చూస్తే వాళ్ల తాతను చూసినట్టే ఉంటుంది. వాడు రాకపోతే ఎలారా? అంత కొంపలు మునిగే పని ఏం చేస్తున్నాడు వాడు’ ఎవరో ముసలామె నిలదీసింది. ‘నువ్విలా అడుగుతావనే వాడు రావడం లేదు’ విసుక్కున్నాడు తండ్రి. ముసలామె అయోమయంగా చూసింది. వాళ్లు ముగ్గురూ అక్కడి నుంచి తప్పించుకుని భోజనాల వైపు అడుగులు వేశారు. బి.టెక్‌లో పెద్దకొడుక్కు మంచి మార్కులే వచ్చాయి. ‘ఏం చేస్తావు?’ అని అడిగారు తండ్రి, తల్లి. ‘బిజినెస్ చేస్తా. చదివింది చాలు’ అన్నాడు పెద్ద కొడుకు. ‘ఏ బిజినెస్సు’ అడిగారు. ‘ఆలోచించి చెప్తా’ అన్నాడు పెద్ద కొడుకు. వాళ్లది ఎగువ మధ్యతరగతి కుటుంబం. ఓ మోస్తరు బిజినెస్ ఉంది. అందరు డైరెక్టర్ల ముందు ఏదో సినిమాలోలా సూటేసుకుని ఉన్న కొడుకును చైర్మన్ సీట్లో కూచోబెట్టేంత స్థాయి వ్యాపారం కాదు అది. తండ్రికే అది చాలా తక్కువ. సరే, కొడుకు ఆలోచనలు ఎలా ఉన్నాయో ఏదో ఒకటి చేస్తాడులే అని ఊరుకున్నారు. మూడు నెలలు గడిచిపోయాయి. ఆరునెలలు గడిచిపోయాయి. సంవత్సరం గడిచిపోయింది. తండ్రికీ తల్లికీ మెల్లగా టెన్షన్ మొదలైంది. వీడు ఏం చేద్దామని? కొడుకును అడిగితే ట్రై చేస్తున్నానుగా అంటాడు. రోజూ ఉదయాన్నే లేస్తాడు. కొంతమంది ఫ్రెండ్స్‌కు ఫోన్ చేస్తాడు. ఖర్చులకు డబ్బులు అడుగుతాడు. అవి తీసుకుని బయటకు వెళ్లి రాత్రికి తిరిగి వస్తాడు. అలాగని దుర్వ్యసనాలు ఉన్నాయా అంటే లేవు. తిరిగే వాళ్లు కూడా తనలా చదువుకున్నవాళ్లే. మంచి స్నేహితులే. కాని ఏదీ జరగడం లేదు. ‘ఇలా ఎన్నాళ్లు. ఏదో ఒకటి త్వరగా మొదలెట్టాలి నువ్వు’ అన్నాడు తండ్రి ఒకరోజు. కొడుక్కు చాలా కోపం వచ్చింది. ‘ఏం నేను తెస్తేనే తినాలా? నేను మీకు బరువైపోయానా? ఏదైనా సంపాదించి తేవడానికే నన్ను కన్నారా? బయట ఎలా ఉందో మీకేం తెలుసు. నేనేమీ తాగి తందనాలు ఆడటం లేదు. మీకిష్టం లేకపోతే చెప్పండి ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్లిపోతా’ అన్నాడు. తల్లిదండ్రులు హడలిపోయారు. ‘ఇప్పుడు మేమన్నామనిరా’ అంది తల్లి. ‘నాకంతా తెలుసు. మీ దృష్టిలో కొడుకంటే ఏ.టి.ఎం మిషన్. కనేది అందుకే. పెంచేది అందుకే. చదువు చెప్పించేది అందుకే. వాడు ఎంత త్వరగా సంపాదించి తెస్తాడా అని కాచుకుని ఉంటారు మీరు. మీ సుఖాల కోసం మీరు కన్న మేము భస్మమైపోయినా మీకు బాధ లేదు’ అన్నాడు. వాళ్లు మరి మాట్లాడలేదు. ఎటుపోయి ఎటు వస్తుందో అనుకున్నారు. అలాగని ఊరికే కూడా ఉండలేకపోయారు. కొడుక్కు కౌన్సెలింగ్ అవసరమని సైకియాట్రిస్ట్ దగ్గరకు సలహాకు వచ్చారు.‘వాడికి ఎలా చెప్పాలో తెలియడం లేదు డాక్టర్. వాడు సంపాదించి తేవాల్సిందిపోయి ఎదురు ఖర్చు పెట్టిస్తున్నాడు. ఏం చేయాలనేది క్లారిటీ లేదు. అసలు వాడు బిజినెస్‌కు పనికొస్తాడో రాడో కూడా తెలియడం లేదు. ఏమన్నా అంటే అలగడమో ఇంట్లోనుంచి వెళ్లిపోవడమో లేదా మరో అఘాయిత్యం చేస్తాడనో భయపడి చస్తున్నాం’ అన్నారు వాళ్లు లేడీ సైకియాట్రిస్ట్‌తో. ఆ మరుసటి రోజు ఆ అబ్బాయితో ఆమె మాట్లాడింది. దాని వల్ల ఆమెకు అర్థమైనది ఇది: తల్లి, తండ్రి మంచివాళ్లు. ఇద్దరు కొడుకులను మంచిగా పెంచారు. మంచి స్కూళ్లలో చదివించారు. కాని వారికి కష్టం అంటే తెలియనివ్వలేదు. దగ్గరగా ఉండే స్కూల్లో వేశారు. స్పోర్ట్స్‌లో దెబ్బలు తగులుతాయని కల్చరల్ యాక్టివిటీస్‌ని ప్రిఫరెన్స్‌గా పెట్టారు. టీచర్ ఏదైనా అంటే వెంటనే వెళ్లి పోట్లాట పెట్టుకునేవారు. ర్యాష్‌గా ఉండే ఫ్రెండ్స్‌తో కలవనిచ్చేవారు కాదు. తాము పడ్డ కష్టాలు పిల్లలు అసలు పడకూడదు అన్నట్టు ఎండ తగలకుండా పెంచారు. పెద్దకొడుక్కు బిజినెస్ చేయాలని గట్టిగా ఉంది. కాని రంగంలో దిగాక అందులోని సవాళ్లు, ప్రతిబంధకాలు, ఎదురు దెబ్బలు తెలిసొచ్చి హడలిపోయి ప్రయత్నమే చేయడం లేదు. బ్యాంక్ లోన్లు, పర్మిషన్లు, ఆఫీసర్ల చుట్టూ తిరగడాలు, ఎస్టాబ్లిష్మెంట్... ఇవన్నీ గుర్తుకొచ్చి హడలిపోతున్నారు. బుర్ర ఉన్నా ధైర్యం లేక బెంబేలెత్తుతున్నాడు. ఆ గిల్ట్ని దాచుకోవడానికి ఎదురు తిరుగుతున్నాడు. అందరి నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. ఇది అతడికి కష్టంగా ఉంది. కన్నవారికి నొప్పిగా ఉంది. దీనిని మార్చాల్సిన బాధ్యత సైకియాట్రిస్ట్ మీద పడింది. ‘చూడు బాబూ. ప్రస్తుతం నీ మానసిక స్థితి తొలి రోజు స్కూలుకెళ్లే పిల్లాడిలా ఉంది. స్కూలుకెళ్లడానికి ఆ రోజు భయంతో ఏడ్చిన నువ్వు ఆ తర్వాత స్కూల్‌ని ఎంజాయ్ చేసి ఉంటావ్. ఇప్పుడు నీ నిర్ణయం అమలుకు భయపడే నువ్వు రేపు ఆ పనిని ఎంజాయ్ చేయడం మొదలెడతావ్. దానిని ఎదుర్కొనే శక్తి నీకు వస్తుంది. ఆ సామర్థ్యాలకు సరిపడా చదువు చదివావు. మీ కుటుంబంలో వ్యాపారం ఉంది కాబట్టి కొద్దోగొప్పో మెళకువలు నీకు తెలిసే ఉంటాయి. ముందు ప్రయత్నం మొదలుపెట్టు. ఫెయిల్ అయితే అవుతావు. కాని నెక్ట్స్దాంట్లో సక్సెస్ అవుతావు. అదీ ఫెయిలయ్యిందనుకో. ఏదో ఒక ఉద్యోగంలో చేరుతావు. అలా అని అడుగు వేయాలి. తల్లిదండ్రుల దగ్గర రోజూ ఖర్చులకు డబ్బు అడగడానికి నువ్వు చిన్నపిల్లాడివి కాదు. నీ కోసం నీ తమ్ముడి కోసం వాళ్లు ఖర్చు చేయాల్సింది చేసేశారు. ఇక వాళ్లకంటూ ఏదైనా దాచుకోని. లేదా మీకోసం దాచి పెట్టని. రేపు నీకు పెళ్లయితే నువ్వు ఒక కుటుంబాన్ని లీడ్ చేయాలి. అప్పుడు ఎవరిని డబ్బు అడుగుతావు? నీ తల్లిదండ్రులో భార్యో ఇవ్వాలా నీకు? పని చేసేది డబ్బు సంపాదించడానికి మాత్రమే కాదు.మనకు మనం ఒక అర్థవంతమైన జీవితం ఇచ్చుకోవడానికి. తప్పించుకుంటూ ఉంటే ఇంటి గడప దాటలేవు. ధైర్యం చేస్తే ప్రపంచం చుట్టి రావచ్చు’ అంది. కొడుక్కు కొంచెం కొంచెం తన పరిస్థితి అర్థమయ్యింది. సైకియాట్రిస్ట్ తల్లిదండ్రులను పిలిచి వారికీ చెప్పింది. ‘చూడండీ... పిల్లలని డేంజర్లో పడేయడం వేరు. రిస్క్‌కు దూరంగా ఉంచడం వేరు. రిస్క్ లేకుండా లైఫ్ లేదు. పిల్లల్ని కనడంలోనే తల్లికి చాలా రిస్క్ ఉంది. అలాగని తల్లి ఆ రిస్క్‌ను తప్పించుకుంటోందా? ట్రాఫిక్‌లో సైకిల్ నడపొద్దు, లైసెన్స్ ఉన్నా హైవే మీద కారు నడపొద్దు, చెల్లించే స్తోమత ఉన్నా లోన్ తీసుకోవద్దు, చేయగలిగే సత్తా ఉన్నా ఫలానా పని చేయొద్దు అని పిల్లల్ని వెనక్కు లాగితే పిల్లలు ఇలాగే తయారవుతారు.వారిని రిస్క్ తీసుకోనివ్వాలి. ఆ సమయంలో మీరు వారికి సపోర్ట్‌గా నిలవాలి. మీవాడు మొదలెట్టాలనుకుంటున్న బిజినెస్‌లో మీరూ సపోర్ట్‌గా నిలబడండి. మేమున్నాం అన్న ధైర్యం ఇవ్వండి. కిందా మీదా పడనివ్వండి. ఓవర్ కాన్షియస్గా ఉండొద్దు’ అంది. కొడుకు కొంత మారాడు. తల్లిదండ్రులూ మారారు. కొన్నాళ్లకు స్ట్రగుల్ ముగిసింది. పెద్దకొడుకు ఇప్పుడు ఆ ఇంటికి ఇరుభుజాలు ఇచ్చేంత బరువు మోయగలిగేలా ఎదిగాడు. – కథనం: సాక్షి ఫీచర్స్ డెస్క్ ఇన్పుట్స్: డా. పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్ ►‘నాకంతా తెలుసు. మీ దృష్టిలో కొడుకంటే ఎ.టి.ఎం మిషన్. కనేది అందుకే. పెంచేది అందుకే. చదువు చెప్పించేది అందుకే. వాడు ఎంత త్వరగా సంపాదించి తెస్తాడా అని కాచుకుని ఉంటారు మీరు. మీ సుఖాల కోసం మీరు కన్న మేము భస్మమైపోయినా మీకు బాధ లేదు’ అన్నాడు. -
భార్య.. భర్త.. ఒక కొడుకు
భార్యాభర్తలకు పుట్టిన బిడ్డకువాళ్లు అమ్మానాన్నలు కాకపోతే..ఆ బిడ్డ ఏమౌతాడు? ఏమైపోతాడు?!అమ్మానాన్నలకు పుట్టిన అవగుణం అవుతాడు.అమ్మ బ్యాడీ, నాన్న బ్యాడీ అని చెప్పుకునే చాడీకి.. ప్రతిరూపం అవుతాడు. అమ్మానాన్నలూ.. ఈ కథనం చదవండి.భార్యాభర్తల్లా ఉండిపోకండి. స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. స్కూల్ ఫోనంటే ఈ మధ్య టెన్షన్ వస్తోంది దివ్యకు.‘హలో’‘మీరొకసారి స్కూల్‌కి అర్జెంట్‌గా రావాలండీ’‘ఏమైంది టీచర్’‘మీ బాబు పక్కనున్న అబ్బాయి చేయి కొరికేశాడు. రక్తం వచ్చేంత గట్టిగా’దివ్య హడావిడిగా ఆఫీసు నుంచి స్కూల్‌కు పరిగెత్తింది. వెళ్లేసరికి అశ్విన్ ప్రిన్సిపాల్ రూమ్ బయట అటూ ఇటూ గెంతుతూ కనిపించాడు. ఆ స్కూల్లో కొట్టరు. కాని అరిచినా పట్టించుకోని పద్ధతిలో లెక్కలేనట్టుగా గెంతుతున్నాడు.‘చూడండి. ఇది మూడో కంప్లయింట్. మీరు సింగిల్ పేరెంట్ అని సానుభూతితో సహిస్తున్నాను. మీ బాబును తీసుకెళ్లండి. ఒక వారం స్కూల్‌కు పంపొద్దు. వాణ్ణి సెట్ చేశాకే తిరిగి పంపండి. అప్పుడు కూడా బిహేవియర్ మారకపోతే డిస్మిస్ చేయాల్సి ఉంటుంది. అయామ్ సారీ’ అంది ప్రిన్సిపాల్.దివ్య అశ్విన్ దగ్గరకు వెళ్లింది.‘ఏం చేశావురా’‘ఏం చేయలేదు’‘ఎందుకు కొరికావు’‘ఊరికే. కోపం వచ్చింది... కొరికాను’భరించలేని నిస్సహాయత కమ్ముకొస్తుంటే వాణ్ణి జబ్బపట్టి విసురుగా ఇంటికి తీసుకొచ్చింది.అశ్విన్ ఇప్పుడు ఒకటో క్లాసు. ఆరేళ్ల పిల్లాడు. మూడేళ్లు నిండగానే నర్సరీలో వేసింది. ఎల్.కె.జి., యు.కె.జి ఆ స్కూల్లోనే చదివాడు. ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్‌కు వచ్చాడు. ఎప్పుడూ కంప్లయింట్ లేదు. కాని మూడు నెలలుగా వాడి ప్రవర్తన చాలా వింతగా ఉంది. ఇంట్లో కూడా బాగా అల్లరి చేస్తున్నాడు. వస్తువులు పడేస్తున్నాడు. టీవీ వాల్యూమ్ పెంచేస్తున్నాడు. అరిస్తే అన్నం మానేసి మంకుపట్టు పడుతున్నాడు. ఎంత ప్రయత్నించినా తినడు. ఆ కోపంతో కొట్టాల్సి వస్తోంది. కొడితే ఇంకాస్త గట్టిగా పట్టు పడుతున్నాడు. ఇది చాలా భయంకరమైన హింసగా ఉంది దివ్యకు. అమ్మా నాన్నలతో కలిసి ఉంటోంది దివ్య. ముగ్గురికీ అశ్విన్ తప్పితే మరొకరు లేరు. ముగ్గురూ వాణ్ణి బాగా చూసుకోవాలనే అనుకుంటారు. చూసుకుంటున్నారు. కాని వాడి ప్రవర్తన ఇంత ఘోరంగా ఎందుకు మారిందో అర్థం కావడం లేదు.‘సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకు వెళదామా అమ్మా’ అన్నాడు తండ్రి ఎందుకైనా మంచిదని.అదే మేలైన పనిగా దివ్యకు కూడా అనిపించింది.లేడీ సైకియాట్రిస్ట్ గదిలో అశ్విన్ కుదురులేకుండా ఉన్నాడు. కూచోమంటే కూచోవడం లేదు. ఒక మూలన ఆర్టిఫీషియల్ మొక్క ఉంటే వెళ్లి దాని ఆకులు పీకుతున్నాడు. సోఫా ఉంటే ఎగిరి దుముకుతున్నాడు.‘ఈ మధ్య మీ ఇంట్లో ఏవైనా గొడవలు అయ్యాయా’‘లేదు డాక్టర్’ అంది దివ్య.‘మీ ఇంటికి ఎవరైనా వచ్చారా?’‘లేదండీ’‘మీరు కొత్త ప్రాంతం వెళ్లారా?’‘ఊహూ. కాని బాబు వాళ్ల నాన్నను కలవడానికి రెండు రోజులు వెళ్లి వచ్చాడు’లేడీ సైకియాట్రిస్ట్ తల పంకించింది.‘నాన్నా.. ఇలా రా... మనం మాట్లాడుకుందామా’ అని అనునయంగా అశ్విన్‌ను పిలిచి వాణ్ణి మాటల్లో దింపింది.దివ్య, మల్లిక్‌లకు ఎనిమిదేళ్లక్రితం పెళ్లయ్యింది. పెద్దలు కుదిర్చిన పెళ్లే. కాని రెండు మూడు నెలలకే వారికి కుదరదని అర్థమైంది. ఇద్దరి స్వభావాలు వేరు వేరు. ఇద్దరి ధోరణులూ వేరువేరు. కొట్లాటలు తిట్లాటలు తొందరగా మొదలయ్యాయి. కాని ఈలోపే ఆమె గర్భం దాల్చడం, అశ్విన్‌కు జన్మనివ్వడం కూడా జరిగింది. కాని వాడికి ఒక సంవత్సరం వచ్చేసరికి ఇద్దరూ ఎవరి సొంతిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. మల్లిక్ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంటే దివ్య తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. అశ్విన్ తల్లి దగ్గరే ఉండక తప్పలేదు. మరో రెండేళ్లకు కోర్టు విడాకులు మంజూరు చేస్తూ కూడా అదే మాట చెప్పింది. అయితే కొడుకును అప్పుడప్పుడు చూసుకునే హక్కును తండ్రికి కల్పించింది. అశ్విన్ చాలా చురుకైన పిల్లవాడు. ముద్దుగా కూడా ఉంటాడు. మరీ పసివాడుగా ఉండగా తండ్రి వచ్చి తీసుకువెళ్లడం, తల్లితో తండ్రి లేకుండా కలిసి ఉండటం వాడికి ఏమాత్రం అర్థం అయ్యే వీలు లేదు. కాని ఆరేళ్లు వచ్చేసరికి వాడికి కొద్దికొద్దిగా అర్థమవసాగింది. వాడిని అన్నింటి కంటే ఎక్కువగా బాధిస్తున్న విషయం తల్లి చెప్పే తండ్రి చెడు. తండ్రి చెప్పే తల్లి చెడు.ఇంట్లో ఉంటే తల్లి, అమ్మమ్మ, తాతయ్యలు నిత్యం తండ్రిని తిడుతూనే ఉంటారు.‘మీ నాన్న దుర్మార్గుడురా. చూడు మీ అమ్మను ఎలా కష్టాల్లోకి నెట్టాడో’ అని చిన్న పిల్లాడని కూడా చూడకుండా వాడితో అనడం మొదలెట్టారు.‘నాన్నతో ఎక్కువ క్లోజ్ కాకు నాన్నా. అసలే బ్యాడ్ డాడీ’ అని తల్లి చెప్పి మరీ కొడుకును తండ్రి దగ్గరకు పంపేది.అక్కడకు వెళితే తండ్రి తల్లి మీద కోపం వెళ్లగక్కేవాడు. బూతులు మాట్లాడేవాడు.‘మీ అమ్మను చంపేసేవాణ్ణి. నీ కోసం వదిలిపెట్టాను’ వరకు అతను మతిలేని మాటలు మాట్లాడేవాడు.‘మీ అమ్మ మీ నాన్న జీవితాన్ని నాశనం చేసింది. వాడు ఏ సంతోషం లేకుండా బాధలు పడుతున్నాడు’ అని తాత, నానమ్మ అనేవారు.ఏదో సరదాగా ఆడుకోవడానికి వచ్చే అశ్విన్‌కు ఇవన్నీ ఆ పసిప్రాయంలో తీవ్ర ప్రభావాన్ని ఏర్పరిచాయి. తండ్రి దగ్గర ఉన్నప్పుడు తల్లి దుర్మార్గురాలిగా, తల్లి దగ్గర ఉన్నప్పుడు తండ్రి దుష్టుడుగా వాడికి అనిపించసాగారు. వాడికి ఇద్దరూ కావాలనిపించేది. కాని ఇద్దరూ దూరమైపోతారేమోనన్న భయం కూడా కలిగింది.దీని వల్ల వాడి ప్రవర్తన మారింది. లోలోపల నలుగుతూ హింస పడుతున్నాడు. తెలియకుండా సమస్యలు తెచ్చి పెడుతున్నాడు.సైకియాట్రిస్ట్‌కు అంతా అర్థం అయ్యింది.సెకండ్ సిట్టింగ్‌లో దివ్యను, మల్లిక్‌ను కలిపి కూచోబెట్టింది.‘చూడండి... విడాకులు పొందినవారు పిల్లల విషయంలో పాటించాల్సిన మొదటి సూత్రం గతాన్ని తవ్వకపోవడం. ఒకరి గురించి మరొకరు పిల్లలకు చెడు చెప్పకపోవడం. మీరు విడాకులు తీసుకున్నా ఒకరి మీద ఒకరు కోపం పోగొట్టుకోలేదు. ఆ ద్వేషాన్ని పిల్లాడికి నూరిపోయాలని చూశారు. వాణ్ణి తమ వైపుకు తిప్పుకోవాలని ఎవరికి వారు ప్రయత్నించారు. కాని దాని వల్ల వాడు చాలా డిస్ట్రబ్ అవుతున్నాడు. అయ్యాడు. ఇంకా మీరిలాగే ప్రయత్నిస్తే వాడు దేనికీ పనికి రాకుండా పోతాడు. ఒకటి గుర్తు పెట్టుకోండి... విడాకులు మిమ్మల్ని భార్యాభర్తలు కాకుండా చేయగలవు కాని తల్లిదండ్రులుగా కాకుండా మాన్పలేవు. ఈ జన్మకు అశ్విన్‌కు మీరే తల్లిదండ్రులు. వాడికి మీ ఇద్దరి సపోర్టూ కావాలి. మీతో మాట్లాడిన దానిని బట్టి మీ ఇద్దరూ మీ వ్యక్తిగత జీవితాల్లో మంచివారనీ ఇద్దరి హృదయాల్లో మీ బాబు జీవితం బాగుండాలనే తపన ఉందని నేను గమనించాను. కనుక మీరిరువురూ మీ గతాన్ని, ఒకరిపై మరొకరికి ఉన్న అభ్యంతరాలని మర్చిపోండి. ఒకవేళ ఉన్నా వాటిని బాబుకు చెప్పకండి. బాబు మీతో ఉంటూ తనకు తానే మీ గురించి తెలుసుకునేలా ప్రయత్నించండి. మీరు మారితే వాడూ మారతాడు. వాడు మారితే మీ సమస్య తీరుతుంది’ అంది. ఇద్దరూ తలాడించారు.‘మరో విషయం. ఈ సంగతి మీ మీ తల్లిదండ్రులకు గట్టిగా చెప్పండి. వారు మీ పిల్లాడితో గడపబోయే జీవితం కంటే మీరిరువురూ గడపబోయే జీవితం పెద్దది. కనుక వారిని కూడా మార్చాల్సిన బాధ్యత మీ ఇద్దరిదే’ అందామె.ఆరునెలలు గడిచిపోయాయి.అశ్విన్ తల్లి దగ్గరే ఉంటూ అప్పుడప్పుడు తండ్రిని కలిసి వస్తున్నాడు. ఇక్కడ ఉన్నప్పుడు అతని ప్రస్తావన రాకుండా; అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రస్తావన రాకుండా అశ్విన్ సంతోషంగా ఉండేలా వాడికి తమ ప్రేమ అర్థమయ్యేలాగా ఇరుపక్షాలు ప్రయత్నించాయి.అశ్విన్ నెమ్మదిగా కుదురుకున్నాడు.ఫస్ట్ క్లాస్‌లో క్లాస్ టాపర్‌గా వచ్చాడు.యానివర్సరీ డే నాడు గ్రాడ్యుయేషన్ డ్రస్ వేసుకొని ఫస్ట్ క్లాస్ పాసైన డిగ్రీని చేత్తో పట్టుకుని వాడు నవ్వుతూ దిగిన ఫొటో ఇప్పుడు రెండు ఇళ్లలోనూ గోడ మీద సంతోషంగా వేళ్లాడుతూ ఉంది. కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్ ఒకటి గుర్తు పెట్టుకోండి... విడాకులు మిమ్మల్ని భార్యాభర్తలు కాకుండా చేయగలవు కాని తల్లిదండ్రులుగా కాకుండా మాన్పలేవు. ఈ జన్మకు అశ్విన్‌కు మీరే తల్లిదండ్రులు. వాడికి మీ ఇద్దరి సపోర్టూ కావాలి. కనుక మీరిరువురూ మీ గతాన్ని, ఒకరిపై మరొకరికి ఉన్న అభ్యంతరాలని మర్చిపోండి. -
భర్త గారూ... తెలుసా మీకు?
భర్త గారికి బజారు తెలుసు. ఆఫీసు తెలుసు. బ్యాంక్ తెలుసు. కరెన్సీ తెలుసు. రాజకీయాలు తెలుసు. ఫ్రెండ్స్‌తో పైలాపచ్చీసు తెలుసు. భర్త గారికి అన్నీ తెలుసు.ఒక్క భార్య మనసు తప్ప. అందులో ఏముంది? అతడు ఆ మనసును చీకటి గుహగా మార్చాడా? లేదా వెలుతురు గుమ్మంలా మలిచాడా? వైద్యం చేయాల్సిన వైద్యుడు మెడిసిన్ పేరు ఒక క్షణం మర్చిపోతే పర్వాలేదు. గుర్తు తెచ్చుకొని రాయవచ్చు. కాని బాధలో ఉన్న స్త్రీ తాను ఏ కారణం చేత బాధలో ఉందో పూర్తిగా మర్చిపోతే ఎలా వైద్యం చేయాలి? మనిషికి మరుపొక స్వర్గం అన్నాడు సినీ కవి. అన్నీ గుర్తుండటం కష్టం కావచ్చు కాని అన్నీ మర్చిపోవడం మాత్రం చాలా కష్టం. భరించరానంత కష్టం.ఆమెకు అరవై ఏళ్లు ఉంటాయి. రాతి బొమ్మకు ప్రాణం వచ్చినట్టు ఉంటుంది. కదలమంటే కదులుతుంది. కూర్చోమంటే కూర్చుంటుంది. కొన్ని చిన్న చిన్న పనులు చేసుకుంటుంది. ఫోన్ వచ్చిందని చెప్పి అందిస్తే అవతలి మనిషిని గుర్తుపట్టి మాట్లాడుతుంది. కాని నిజమైన ప్రాణం లేనట్టే ఉంటుంది. పెద్ద కొడుకు గుంటూరులో ఉన్నాడు. కూతురు హైదరాబాద్‌లోనే స్థిరపడి ఉంది. ఇంట్లో దిగులు లేని జీవితం. భర్త, తను, సొంత ఇల్లు.కాని ఆమె నవ్వడం లేదు. పోనీ ఏడవడమూ లేదు. అసలు ఆమెకు ఏదీ గుర్తుండటం లేదు.సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకువచ్చారు.సైకియాట్రిస్ట్ అడిగిన మొదటి ప్రశ్న– ‘ఈమె ఈ కండిషన్లో ఉన్నప్పుడు తోడుగా రావలసింది భర్త కదా. ఆయనెక్కడ?’తల్లిని తీసుకొచ్చిన కొడుకు, కూతురు బదులు చెప్పారు– ‘అసలు సమస్య ఆయనే అయితే ఆయనను తోడు పెట్టుకుని రావడం ఎందుకు డాక్టర్?’ హిట్లర్లు జర్మనీలో పుట్టారనీ అక్కడే చచ్చిపోయారని అందరూ అనుకుంటూ ఉంటారు. కాని చాలా ఇళ్లల్లో హిట్లర్లు ఉంటారు. వాళ్లు భర్తలుగా, తండ్రులుగా తిరుగుతూ ఉంటారు. రమణరావు అలాంటి హిట్లర్. కాని ఆ సంగతి అతనికి తెలియదు. మిలట్రీలో నలభై ఏళ్లు పని చేశాడు. డిసిప్లిన్‌గా కుటుంబం ఉండాలని అనుకున్నాడు. డిసిప్లిన్‌లో ఉంచానని భావించాడు. తాను గాలాడే గదిలో ఉంచానని అతడనుకున్నాడు. అది జైలు గది కదా అని కుటుంబం అనుకుంది. కాని ఆ మాట బంధువులు చెప్పలేరు. కడుపున పుట్టిన పిల్లలు చెప్పలేరు. మరీ ముఖ్యంగా కట్టుకున్న భార్య చెప్పుకోలేదు.సైకియాట్రిస్ట్ కోరిక మేరకు రమణరావు వచ్చాడు. 65 ఏళ్లు ఉంటాయి. చక్కగా టక్ చేసి ఉన్నాడు. మంచిగా కనపడుతున్నాడు.‘నేను నా జీవితమంతా నా కుటుంబం కోసం కష్టపడ్డాను. వాళ్లకు ఏ లోటూ రానివ్వలేదు. కాని నా భార్య ఇలా తయారైందంటే నా దురదృష్టం’ అన్నాడు.‘మీ భార్యకు తీవ్రమైన డిప్రెషన్ ఉంది. ఆమె దురదృష్టం ఏమిటంటే దానికి తోడు డిమెన్షియా (మతిమరుపు) కూడా వచ్చింది. ఆమెను బాధించే విషయాలు ఏమిటో ఆమె బయటకు చెప్తేనే డిప్రెషన్ తగ్గుతుంది. కాని అవి ఆమెకు గుర్తులేవు. కనుక వాటిని చెప్పాల్సింది మీరే’ అన్నాడు డాక్టర్.రమణరావు సాలోచనగా చూశాడు.‘ఆమెను బాధించే విషయాలు నాకేమీ తెలియవు డాక్టర్. నాకేం కావాలో ఏం నచ్చుతాయో చెప్పేవాణ్ణి. వాటిని బట్టి ఆమె నడుచుకునేది’ అన్నాడు. కొంచెం ముందుకు వాలుతూ ‘మీరు నన్ను చెడ్డవాణ్ణని అనుకుంటున్నారా? అలా అయితే నా మనసుకు కష్టంగా ఉంటుంది’ అన్నాడు.‘లేదు లేదు. మీరు మంచివారే కావచ్చు. మీ భార్యకు తప్ప’ అన్నాడు సైకియాట్రిస్ట్. సైకియాట్రిస్ట్ ఆమెతోనే మళ్లీ ఒకరోజు కూర్చున్నాడు.‘మీ పెళ్లి గుర్తుందా అమ్మా’ అడిగాడు.తలాడించింది.‘పెళ్లి తర్వాత?’ఎటో చూసింది.‘పెళ్లికి ముందు?’ మళ్లీ ఎటో చూసింది.‘మీ చిన్నప్పుడు?’ఆమె ముఖంలో చిన్న కాంతి వచ్చింది.ఆమె ఊరు కర్నూలు దగ్గర ఒక పల్లె. అది తల్లిగారి ఊరు. పినతల్లులు మేనమామలు అక్కడే ఉన్నారు. చాలా మంది బంధువులు అక్కడే ఉన్నారు. వాళ్లందరి మధ్య ఆమె బాల్యం అక్కడ సాగింది. వాళ్లందరూ కనిపిస్తూ ఉంటే ఆమెకు చాలా సంతోషంగా ఉండేది. పెళ్లయ్యాక ఢిల్లీలో కాపురం పెడితే మూడు నెలలు ఢిల్లీలో ఏమిటోగా అయిపోయింది. తల్లిగారి ఊరికి వచ్చి తనవాళ్లను చూసుకుంటేనే ధైర్యం వచ్చి తిరిగి ఢిల్లీలో కాపురానికి సిద్ధపడింది. ఈ వివరాలన్నీ ఆమె కూడదీసుకుంటూ చెప్పగలిగింది. ఆ తర్వాత సైకియాట్రిస్ట్ ఆమెను బయట కూచోబెట్టి పిల్లలను పిలిచాడు.‘మీ అమ్మ ఆ ఊరు వెళ్లి ఎంతకాలం అయ్యింది?’‘ముప్పై సంవత్సరాలు డాక్టర్’‘ముప్పై ఏళ్లా?’‘అవును. అక్కడ ఒక పెళ్లికి వెళితే మా నాన్నకు సరిగా మర్యాదలు జరగలేదట. ఇంక ఈ ఊరికే రాను అని శపథం చేశాడు. ఆయన దానికి గట్టిగా కట్టుబడ్డాడా లేదా మాకు తెలియదు. కాని ఆయననుమేముగాని మా అమ్మగాని కనీసం అడగను కూడా అడగని దూరంతో ఉంచాడు’ అన్నాడు కొడుకు.‘అన్నయ్య పెళ్లిలో కాని నా పెళ్లిలోకాని అమ్మ మాట ఏమీ చెల్లుబాటు కాలేదు. అసలు అమ్మను అభిప్రాయం కూడా అడగలేదు. నాన్న భయానికి అమ్మ మూగమొద్దులాగా ఉండటం వల్ల వదిన ఆమెను లెక్క చేయలేదు. అమ్మ ఇలా కావడానికి వదిన కారణం అని నాన్న అనుకుంటున్నారు తప్ప తనే కారణం అనుకోవడం లేదు’ అంది కూతురు.‘అర్థమైంది. మీ నాన్న కాదు అన్న విషయాలన్నీ గుర్తుకొచ్చి అవి బాధిస్తూ ఉండేకన్నా అన్నింటినీ మర్చిపోయి సుఖంగా ఉండటం మేలని బలవంతంగా మీ అమ్మ మతిమరుపు తెచ్చుకుంది. సరే. ముందు మీరొక పని చేయండి. వెంటనే మీ అమ్మను ఆమె ఊరికి తీసుకెళ్లండి. మీ నాన్నతో నేను కూడా చెప్తాను’ అన్నాడు సైకియాట్రిస్ట్. ఆమె ఆ ఊరు వెళ్లిందట. పొలిమేరల్లో అడుగు పెడుతూనే నవ్వేసిందట. బంధువుల పేర్లు ఒక్కొక్కటే చెప్తూ ఆ ఇళ్లకు పరుగు తీసిందట. అమ్మమ్మ ఇంటి అరుగు మీద తృప్తిగా కూలబడిందట. ఆ ఇంటి మంచినీరు తాగి అదే పెద్ద మందన్నట్టు కుదుట పడిందట. మేనమామలను కలిసింది. పిన్నమ్మలను కలిసింది. ఒకరిద్దరు స్నేహితురాళ్లను కలిసింది. అన్నింటి కంటే ముఖ్యం మర్చిపోయిన ఆమె జ్ఞాపకాలన్నింటినీ కలిసింది.ఆశ్చర్యం ఏమిటంటే ఆ ఊళ్లో ఉన్నప్పుడు అన్నీ గుర్తున్నాయి. ఇంటికి రాగానే మళ్లీ యథావిధిగా మారిపోయింది.సైకియాట్రిస్ట్ ఆమె భర్తను పిలిచి చెప్పాడు.‘రమణరావుగారూ. మీ భార్యకు డిమెన్షియా ఉందని అనుకున్నాను. కాని అది ‘సూడో డిమెన్షియా’ అని ఈ ఘటన వల్ల తెలిసొచ్చింది. అంటే అబద్ధపు మతిమరుపు అన్నమాట. మీరు ఆమెను అర్థం చేసుకోకపోవడం వల్ల, ఆమె ఇష్టాలను, కోరికలను, విన్నపాలను పూర్తి స్థాయిగా అణిచేయడం వల్ల ఆ నొప్పిని తాళలేక ఆమె మతిమరుపును తెచ్చుకుంది. మిమ్మల్ని ప్రేమించి ఇష్టపడి మీతో ఇన్నాళ్లుసహజీవనం చేసిన మీ భార్యకు ఇంత క్షోభ కలిగిస్తున్నారని మీకు తెలుసా?’ఎందుకనో ఆ పెద్దమనిషి పట్టనట్టుగా ఏడ్చాడు. చాలాసేపు ఏడ్చాడు.‘నాకు తెలియదు డాక్టర్. ఆ ఊళ్లో వాళ్లమ్మ బిహేవియర్‌ను పిల్లలు నాకు చెప్పాకనే తెలిసింది. నేనేదో భార్యను అదుపులో పెట్టుకున్నానని అనుకున్నాను తప్ప ఇలా మానసికంగా నాశనం చేశానని అనుకోలేదు’ అన్నాడు. మొత్తం ఆరు నెలలు పట్టింది ఆమె పూర్తిగా కోలుకోవడానికి.రమణరావు మిలట్రీని ఇంటి కాంపౌండ్‌వాల్ బయటపెట్టి ఇంట్లో తనొక మామూలు మనిషిగా మారాడు. సాధారణ భార్యాభర్తలు ఎలా ఉంటారో తాము అలా ఉండే ప్రయత్నం చేశాడు. పిల్లలు ఆయన దగ్గర చనువు పెంచుకున్నారు. ఆయనా పుస్తకాల్లో చదివిన జోకులు గుర్తు పెట్టుకుని మరీ భార్యకు చెప్పి నవ్విస్తున్నాడు.ఒకరు చెప్పి ఒకరు వినే కాపురంలో జబ్బులొస్తాయి.ఇద్దరూ విని చెప్పుకునే కాపురంలో ఇదిగో ఇలా నవ్వులు పూస్తాయి. – కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
మీ అమ్మాయికి మంచిమార్కులు వస్తాయి!
కొండ ఎక్కాలంటే ఏం చెయ్యాలి?దేవుణ్ని మనసులో పెట్టుకోవాలి.అప్పుడు మెట్లు కనిపించవు. దీవెనలే కనిపిస్తాయి. జీవితంలో పిల్లలకు కష్టాలు.. కష్టమైన మెట్లు.ప్రతిసారీ తోడుగా మనం ఉండలేం. కానీ.. లక్ష్యసాధనలో ఆనందాన్ని వాళ్లకు చూపగలిగితే పరీక్షలు కనబడవు. మంచి మార్కులే కనిపిస్తాయి. సైకియాట్రిస్ట్ దగ్గర ఆ అమ్మాయి కూచుని ఉంది.పదహారేళ్లు ఉంటాయి. తోడుగా అమ్మా నాన్నా ఉన్నారు.‘ఏంటి ప్రాబ్లమ్?’ అడిగాడు సైకియాట్రిస్ట్.‘బాగా చదువుతుంది డాక్టర్. ఎమ్సెట్లో మెడిసిన్ ర్యాంక్ కొట్టాలని లక్ష్యం. కాలేజీలో స్లిప్ టెస్ట్‌లు, వీక్లీ టెస్టుల్లో తనే ఫస్ట్ ఉంటుంది. తనకో మంచి ఫ్రెండ్ కూడా ఉంది. ఆ అమ్మాయి కూడా బ్రైట్ స్టూడెంటే. కాని ఈ మధ్య ఒకటి రెండు టెస్టుల్లో ర్యాంకులు రాలేదు. దాంతో విపరీతంగా ఏడ్వడం మొదలెట్టింది. కాన్ఫిడెన్స్ పోయింది. అది పక్కన పెట్టండి. ర్యాంకులు తనఫ్రెండ్కు వచ్చాయట. పాపం ఆ అమ్మాయిని శతృవుగా చూస్తోంది. దూరం పెడుతోంది. అంతా గందరగోళంగా తయారైంది బిహేవియర్. మీరే హెల్ప్ చేయాలి’సైకియాట్రిస్ట్ ఆ అమ్మాయివైపు చూశాడు. ‘ఏమ్మా... ఏంటి నీ సమస్య’ఆ అమ్మాయి వెక్కివెక్కి ఏడ్వడం మొదలెట్టింది.‘నా పని అయిపోయింది డాక్టర్. ఇక నాకు ర్యాంకులు రావు. నేను మెడిసిన్ చేయనట్టే. రెండు మూడు టెస్టుల్లో నాకు మంచి మార్కులు రాలేదంటే ఇక ఎప్పటికీ రావనేగా అర్థం’...సైకియాట్రిస్ట్ ‘ఏం పిల్లలో’ అన్నట్టుగా నిశ్వాస విడిచాడు.‘సరే అయితే నీకు ఇంకో అమ్మాయి కథ చెబుతా. నా పేషెంటే. అది విని నీకేం అనిపించిందో చెప్పు’ అన్నాడు. సైకియాట్రిస్ట్ చెప్పడం మొదలుపెట్టాడు. ∙∙ ఇది నీలవేణి కథ.నీలవేణిది విజయవాడ దగ్గర చిన్న పల్లెటూరు. చిన్నప్పుడు అందరిలాగే ఆడుతూ పాడుతూ ఉండేది. అమ్మా నాన్నలతో హాయిగా ఉండేది. కాని ఆ అమ్మాయికి ఎనిమిదేళ్ల వయసు వచ్చినప్పుడు సడన్‌గా ఒక ప్రమాదంలో అమ్మా నాన్నా చనిపోయారు. చిన్న పిల్ల. ఏమీ తెలియని వయసు. లాలించే అమ్మ ఆడించే నాన్న ఇక కనపడరు అనంటే ఆ వయసులో ఎంత భయంగా ఉంటుంది. ఎంత భీతిల్లేలా ఉంటుంది. కాని నీలవేణి అంత దుఃఖాన్ని తట్టుకొని నిలబడింది. అమ్మా నాన్నలు లేకపోయినా అమ్మమ్మ, తాతయ్య ఉన్నారనుకుంది. అమ్మమ్మ, తాతయ్యలు కూడా ఆ పాపను అంతే ప్రేమగా చూసుకున్నారు. నీలవేణికి చదువు పెద్దగా రాలేదు. కాని నీలవేణికి జీవితంలో ఏదైనా సాధించాలని పట్టుదల. చదువు రాలేదని ఆ అమ్మాయి కుంగిపోలేదు. నిరాశ పడలేదు. ఆ అమ్మాయిది గట్టి వొళ్లు. చరుగ్గా ఉంటుంది. అందుకని ఆటల్లోకి వెళ్లింది. లాంగ్‌జంప్ తన ఫేవరెట్ గేమ్. పల్లెటూరి స్కూల్లో లాంగ్‌జంప్‌లో రాణిస్తున్న నీలవేణిని హైస్కూల్లో ఒకరిద్దరు టీచర్లు ఎంకరేజ్ చేశారు. జిల్లాస్థాయి ప్లేయర్ అయ్యింది. ఊళ్లో గుర్తింపు పొందింది. అందరూ మెచ్చుకునేవారు.∙∙ ‘చూశావా? నీలవేణి ఎక్కడా కుంగిపోకుండా ఎలా సెకండ్ చాన్స్ తీసుకొని పైకి వచ్చిందో’ అన్నాడు సైకియాట్రిస్ట్.ర్యాంకు రాని అమ్మాయి తల ఊపింది.‘కథ ఇంకా అయిపోలేదు’ అన్నాడు సైకియాట్రిస్ట్.∙∙ నీలవేణి కథ కొనసాగింపు.నీలవేణి ఆ ఊళ్లోనే ఉన్న జూనియర్‌కాలేజీలో చేరింది. అలాంటి కాలేజీల్లో చదువు సరిగ్గా రాకపోయినా ఆటల్లో రాణించే మగపిల్లలు ఉంటారు. అలాంటి అబ్బాయే రాజు. అతడు లాంగ్‌జంప్ కోసం వచ్చే నీలవేణిలోని టాలెంట్‌ను గమనించాడు. అదే కాలేజ్‌లో ఉన్న ఫిజికల్ డైరెక్టర్‌తో కలిసి నీలవేణిని ఎంకరేజ్ చేయడం మొదలెట్టాడు. లాంగ్‌జంప్‌తో పాటు హైజంప్, పోల్జంప్, రన్నింగ్... అన్నింటిలోనూ నీలవేణి పార్టిసిపేట్ చేసేలా చేశాడు. నీలవేణి ఇప్పుడు స్టేట్‌లెవల్ అడపాదడపా నేషనల్ లెవల్ మెడల్స్ సాధించడం మొదలెట్టింది. ఇక భవిష్యత్తంతా నీలవేణిదే అనిపించే సమయం. సరిగ్గా ఆ సమయంలో ఊహించని సంఘటన. విజయవాడలో ఒక స్పోర్ట్స్ మీట్‌కు హాజరయ్యి తిరిగి ఊరికి వస్తుండగా రాజు, నీలవేణి ప్రయాణిస్తున్న షేర్ ఆటోను వెనుక నుంచి లారీ గుద్దింది. రాజు ఎడమ వైపున పొదల్లో పడగా నీలవేణి కుడివైపు రోడ్డు మధ్యలో పడింది. అప్పుడే వేగంగా వస్తున్న కారు ఆ అమ్మాయి కాళ్లను తొక్కేసింది.∙∙ వింటున్న అమ్మాయి ఉలిక్కి పడి చూసింది.సైకియాట్రిస్ట్ ఆ అమ్మాయి వైపు చూస్తూ నీలవేణి కథ కొనసాగించాడు. ∙∙ ఏ కాళ్లతోనైతే నీలవేణి ఇంత గుర్తింపు తెచ్చుకుందో ఏ కాళ్లతోనైతే తన భవిష్యత్తును నిర్మించుకుందో ఆ కాళ్లు తీసేయక తప్పదు అని డాక్టర్లు నిర్ణయించి నీలవేణి స్పృహలో లేని సమయంలో కాళ్లు తీసేశారు. స్పృహలోకి వచ్చాక పేషెంట్ షాక్‌లోకి వెళ్లకుండా బ్యాండేజీలతోనే కృత్రిమ రూపాన్ని చుట్టి కాళ్లు ఉన్నాయన్న భ్రాంతి సృష్టించారు. ఆరువారాల వరకు నీలవేణికి తనకు కాళ్లు లేవన్న సంగతే తెలియదు. ఒకరోజు తెలిసింది. భూమి ఆకాశాలు చీకటితో నిండిపోయాయన్న భావన వచ్చింది. అలాంటి స్థితి వస్తే ఎవరైనా కుంగిపోతారు. నీలవేణి కూడా కుంగిపోయింది. కాని ఆ ప్రమాదం కంటే పెద్ద దెబ్బ రాజు తీశాడు. అంతవరకూ పలకరించే కుర్రాడు, అంతవరకూ తోడు నిలుస్తాడనుకున్న స్నేహితుడు తప్పించుకు తిరగడం ప్రారంభించాడు. ఇటు ఆ దెబ్బ అటు ఈ దెబ్బ... నీలవేణి తట్టుకొని నిలబడగలదా?కాని నిలబడింది. జీవితం అంటే అనూహ్యంగా ఉంటుందని, కాని మనం జీవితానికి లొంగ కుండా ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉండాలని నమ్మింది. అందుకోసం ఆత్మస్థయిర్యం కోసం సైకియాట్రిస్ట్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంది.నూరేళ్ల జీవితంలో ఇవాళ్టి ఘటనలు, రేపటి ఘటనలే మొత్తం జీవితం కాబోవని ఎన్నో అవకాశాలు ఊహించని మలుపులు మున్ముందు ప్రతి ఒక్కరికీ ఎప్పుడూ ఉంటాయని సైకియాట్రిస్ట్ చెప్పిన మాటలను మనసులోకి తీసుకుంది.ఆమె గురించి తెలిసిన వాళ్లందరూ ఆమెకు సాయం చేశారు. విదేశాల నుంచి కృత్రిమ కాళ్లు తెప్పించారు. ఆటల్లో పాల్గొనే వీలున్న ఆ కృత్రిమకాళ్లతో నీలవేణి మళ్లీ ప్రాక్టీసు మొదలెట్టింది. మొదట్లో కొంచెం కష్టమైంది. ఆ తర్వాత వీలైంది. నీలవేణి క్షణం కూడా ఆలస్యం చేయకుండా నిపుణుల పర్యవేక్షణలో తిరిగి ప్రాక్టీసు మొదలెట్టింది.కాళ్లు బాగుంటే ఆమెకు ఒలింపిక్స్‌లో పాల్గొనాలనే కోరిక ఉండేది.కాళ్లు పోయాక కూడా ఒలింపిక్స్‌లో పాల్గొనగలిగింది. కాకపోతే పారా ఒలింపిక్స్‌లో. ఆరు మెడల్స్ వచ్చాయి కూడా. ∙∙ సైకియాట్రిస్ట్ చెప్పడం ఆపి తన సెల్ఫోన్లో నుంచి నీలవేణి ఫొటో చూపించాడు. మెడలో మెడల్స్‌తో నవ్వుతూ ఉన్న నీలవేణి.‘కథ ఇంకా అయిపోలేదు. నీలవేణిని విడిచిపెట్టి వెళ్లిన రాజు తిరిగి వచ్చాడు. క్షమించమని కోరుకున్నాడు. ఇక ఎప్పటికీ నీలవేణి తోడు విడువనని చెప్పాడు. సాధారణంగా ఇంకో అమ్మాయి అయితే అతణ్ణి అసహ్యించుకునేది. కాని నీలవేణి మాత్రం– దివ్యాంగులను ఎలాగైతే ఎక్కువ ప్రేమతో చూడాలో తప్పు చేసినవారిని కూడా ఎక్కువ ప్రేమతో చూసి వారిని మంచి మార్గంలో పెట్టాలి అని అతణ్ణి యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు చెప్పు. నీ సమస్య ఒక సమస్యా. నీ పని అయిపోయినట్టేనా? నీలవేణిలాంటి వాళ్లను చూసి మనం ఎప్పుడూ పోరాడుతూ ఉండాలని సాటి స్నేహితులను వదిలిపెట్టకుండా ముందుకు వెళ్లాలని అనిపించడం లేదా’ అన్నాడు సైకియాట్రిస్ట్.మార్కులు రాని అమ్మాయి సిగ్గుపడుతూ తల ఆడించింది.నిటారుగా కూర్చుంది. ‘ఇంకో సిట్టింగ్’... అని తల్లి అంటూ ఉంటే ‘అక్కర్లేదు’ అని ఆ అమ్మాయే చెప్పింది.లేచి నిలబడుతూ ‘థ్యాంక్స్ అంకుల్. నీలవేణికి కూడా నా థ్యాంక్స్ చెప్పండి’ అంది కొంచెం నవ్వుతూ.సైకియాట్రిస్ట్ కూడా నవ్వుతూ తర్వాతి పేషెంట్ కోసం బెల్ నొక్కాడు. కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
ఆమె నా కన్నతల్లి కాదు.. అందుకేనేమో!
ఆడపిల్లకు ప్రమాదం, నష్టం జరిగడానికి వీలైన అన్ని పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఆ రెండుమూడు రోజులు గడిపింది. ప్రమాదం, నష్టం జరిగాయా? తెలియదు. కాని ఇంటికి రాగానే తల్లితో యుద్ధాలు. తల్లికి కూతురితో యుద్ధాలు. ‘పదహారేళ్లంటే నీకేం తెలుసు. లోకం ఎలా ఉంటుందో తెలుసా? బయట ఎంత ప్రమాదమో తెలుసా? మనుషులు ఎన్ని రకాలుగా ఉంటారో తెలుసా? అసలు ఏం తెలుసని ఇంట్లో నుంచి పారిపోయావ్? పైగా ఆడపిల్లవి’ ‘మాట్లాడవేం?’‘అవన్నీ నాకు తెలుసో లేదో తెలియదు. కాని ఒక్కటి మాత్రం బాగా తెలుసు’‘ఏంటది’‘మా అమ్మకు నేనంటే ఇష్టం లేదు. అందుకే నాకు మా అమ్మంటే ఇష్టం లేదు’ఆ జవాబుకు కన్సల్టేషన్ రూమ్‌లో నిశ్శబ్దం అలముకుందిఆ అమ్మాయికి అచ్చంగా పదహారేళ్లుంటాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ బై.పి.సి ఇష్టమని చేరింది. కాని చదవదు. కాలేజ్‌కని వెళుతుంది. కాని వెళ్లదు. మాట విన్నట్టే కనిపిస్తుంది కాని వినదు. హుషారుగా ఉన్నట్టు అభినయిస్తుంది కాని నిజంగా హుషారుగా ఉండదు.‘నాకు చాలా బెంగ’ అని మెసేజ్ పెట్టింది ఫేస్బుక్లో కనిపించిన హైస్కూల్నాటి ఫ్రెండ్‌కి.‘నాకూ బెంగే’ అని కుర్రాడు అన్నాడు.‘మనిద్దరం కష్టసుఖాలు చెప్పుకుందామా?’ అని టైప్ చేసింది.‘అందుకేగా నీతో ఫ్రెండ్షిప్ చేస్తోంది’ అన్నాడు వాడు.ఆ అమ్మాయి తన తొలి కష్టం చెప్పుకుంది.‘మా అమ్మంటే నాకు ఇష్టం లేదు’‘నాకు మా నాన్నంటే ఇష్టం లేదు. ఎప్పుడూ తిడుతుంటాడు’ అన్నాడు వాడు.ఇలా కొన్నాళ్లు మాటలు నడిచాయి. ఇద్దరూ పెనుకష్టాల్లో ఉన్నారని ఆ కష్టాలకు ఇళ్లే కారణమని ఇళ్లలో నుంచి పారిపోతే పూర్తి కష్టాలు పోతాయని ఇద్దరూ అనుకుని పారిపోయారు.వైజాగ్ వెళ్లారు. అక్కడ ఏం చేయాలో తోచలేదు. అరకుకు వెళ్లి సాయంత్రం ఆ చీకటిని, తెలియని ముఖాలని చూసి బెంబేలెత్తారు. ఆ తర్వాత విజయవాడ వెళ్లారు. అక్కడి బస్ స్టేషన్లో ఆ అమ్మాయిని వదిలి ఇప్పుడే వస్తానని వాడు పారిపోయాడు. భయాన్ని తట్టుకోలేక ఇల్లు చేరాడని తర్వాత తెలిసింది. మొండి అమ్మాయి ఇంకో రోజు బెజవాడలోనిబస్టాండ్లో, రైల్వేస్టేషన్లో తిరిగి ఇల్లు చేరింది.ఆడపిల్లకు ప్రమాదం, నష్టం జరగడానికి వీలైన అన్ని పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఆ రెండుమూడు రోజులు గడిపింది. ప్రమాదం, నష్టం జరిగాయా?తెలియదు. కాని ఇంటికి రాగానే తల్లితో యుద్ధాలు. తల్లికి కూతురితో యుద్ధాలు. ఇలా ఎంతకాలం అని భార్యనూ, కూతురిని సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకొచ్చాడు తండ్రి. ముందు ఎవరూ లేకుండా చేసి కూతురితో మాట్లాడాడు సైకియాట్రిస్ట్.‘ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నాను మా అమ్మ నాతో బాగుండదు. చీటికి మాటికి కోప్పడుతుంటుంది. కరెక్ట్ చేయాలని చూస్తుంటుంది. చూశారుగా నన్ను. కొంచెం పొట్టి. మా అమ్మా నాన్నల పక్కన ఎలుకపిల్లలా ఉంటాను వాళ్ల పర్సనాల్టీస్కి. అసలే కాన్ఫిడెన్స్ లేదు. చదువులో స్లో. ఫ్రెండ్స్ కూడా ఎక్కువ మంది నాతో కలవాలని అనుకోరు. ఇవన్నీ మా అమ్మకు డిస్శాటిస్ఫాక్షన్ అనుకుంటాను. అందుకని నాకు రిస్కీ ఫ్రెండ్షిప్స్ చేయడం అలవాటైంది. పక్కింటి అంకుల్‌తో, ఆటో అంకుల్‌తో, ఫేస్బుక్లో తెలియనివారితో ఇట్టే ఫ్రెండ్షిప్ చేస్తాను. తర్వాత వాళ్ల బిహేవియర్‌కి ఫ్రస్ట్రేట్ అవుతాను. ఒక ఫ్రెండ్‌తో ఇంట్లో నుంచి పారిపోతే వాడు కూడా నన్ను వదిలి పారిపోయాడు. నేను కోపంగా ఉంటానని మా అమ్మ అంటుంది. కాని మా అమ్మే కోపంగా ఉంటుంది. కాని సడన్‌గా ఒక డౌట్ వచ్చింది. ఏ తల్లీ సొంత బిడ్డతో ఇలా వ్యవహరించదు కదా... కొంపదీసి నేను ఈమెకు పుట్టలేదా? అని. అప్పుడు తెలిసింది...’‘ఏమని’‘నేను ఆమెకు పుట్టలేదు. మా పేరెంట్స్ నన్ను అడాప్ట్ చేసుకున్నారని. నాకు ఎనిమిదేళ్లప్పుడు ఆ సంగతి చెప్పారట..నాకు అర్థం కాలేదు... వాళ్లు ఆ సంగతి రిపీట్ చేయలేదు. టీనేజ్లోనే సరిగ్గా అర్థమైంది. ఇక ఇంట్లో ఎందుకుండాలి అనుకున్నాను’ ఆ అమ్మాయికి ఏడుపు తన్నుకొచ్చింది.సైకియాట్రిస్ట్ ఆ అమ్మాయిని మనసారా ఏడవనిచ్చాడు. ఇప్పుడు ఎవరూ లేకుండా సైకియాట్రిస్ట్ ఆ అమ్మాయి తల్లితో మాట్లాడాడు.‘డాక్టర్... మాది కలిగిన కుటుంబమే. కాని చిన్నప్పటి నుంచి సంతోషం లేదు. మా నాన్న డ్రంకర్డ్. అమ్మను నిత్యం బాధించేవాడు.వేధించేవాడు. అనుమానించేవాడు. భయంకరమైన గొడవలను చిన్నప్పటి నుంచే చూస్తూ పెరిగాను. అలాంటి జీవితం నా సంతానానికి రాకూడదనుకున్నాను. పెళ్లితో అయినా నా జీవితం బాగుపడుతుందని ఆశించాను. నా అదృష్టం నా భర్త చాలా మంచివాడు. దురదృష్టం నా అత్తమామలు తగువులమారి స్వభావం ఉన్నవారు. 18 ఏళ్లకు పెళ్లయితే చిన్నదాన్నని కూడా చూడకుండా అన్ని పనులూ నా నెత్తినేసి సుఖం లేకుండా చేశారు. దానికి తోడు పిల్లలు పుట్టలేదు. ఏమిటా దురదృష్టం అని డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. చిన్నప్పటి డిప్రెషన్ ఇప్పటి డిప్రెషన్ అంతా కలిసి పేషెంట్‌లాగా మారాను’‘తర్వాత?’ సైకియాట్రిస్ట్ అడిగాడు.‘అప్పుడు మావారే సర్దిచెప్పి అడాప్ట్ చేసుకుందామనుకున్నారు. అనాథ శిశుశరణాలయం నుంచి ఎనిమిది నెలల పాపను దత్తత తీసుకున్నాం. నాకు పిల్లలు ఇష్టమే. ఎన్నో కలలు కన్నాను పెంపకం విషయంలో. కాని పాప మా ఇద్దరికీ ఏ మాత్రం పొంతన లేని ఎత్తుతో పెరిగింది. తెలివితేటలు లేవు. దానికి తోడు ప్రవర్తన కూడా ఏమిటోగా ఉంది. దానిని కంట్రోల్ చేయబోయి దానిపట్ల గయ్యాళిగా మారాను. నేను ఎంత ప్రేమిద్దామనుకున్నా ఎందుకు నా బతుకు ఇలా అయ్యిందా అనే నెగెటివ్ ఆలోచన. నా జీవితం నరకంగా మారింది. నా భర్తతో కూతురితో ఆనందంగా నేను ఎలా గడపాలి?’... ఆమె కళ్లు ధారలు కట్టాయి.మనసును కుదుటపర్చడంలో కన్నీళ్లకు మించిన మందు లేదు.సైకియాట్రిస్ట్ ఆమెను కూడా గుండె తేటపడే వరకు ఏడ్వనిచ్చాడు. ఇప్పుడు గదిలో ముగ్గరూ ఉన్నారు. తల్లి కూతురు తండ్రి.సైకియాట్రిస్ట్ మాట్లాడటం మొదలుపెట్టాడు.‘చూడండి... చీకటి అంటే వెలుతురు లేకపోవడం కాదు. ఇంకా రాకపోవడం. ఇంకా చెప్పాలంటే ఉన్న వెలుతురును చూడకపోవడం. మీరిద్దరూ జీవితంలో నెగెటివిటీని చూడటానికే అలవాటు పడి జీవితం పట్ల రోత పుట్టించుకున్నారు. (తల్లివైపు చూస్తూ) బాల్యంలో మీరు తల్లిదండ్రుల కొట్లాటలు చూశారు. కాని మీరొక కలిగిన కుటుంబంలో పుట్టారని ఏ పోలియో బాధో అనారోగ్య సమస్యో దేవుడు మీకు ఇవ్వలేదని చదువు అబ్బని తెలివితక్కువతనం ఇవ్వలేదని సంతోషపడలేదు. పెళ్లయ్యాక వేధించే అత్తామామలను చూసి శోకించారు తప్ప ఒక్క లోపం లేని భర్త దొరికాడని ఆనందించలేదు. ముఖ్యంగా మీకు పిల్లలు పుట్టరు అని డాక్టర్లు తేల్చినా లోపం మీదేనని చెప్పినా మిమ్మల్ని పన్నెత్తు మాట అనని భర్తను చూసి జీవితాంతం సంతోషంగా బతకొచ్చని మీరు అనుకోలేదు. దత్తతకు కుమార్తె దొరికితే దానికీ సంతోషపడలేదు. కళకళలాడే ఆడపిల్ల అనుకోక రూపం గురించి, ర్యాంకుల గురించి బాధ పడ్డారు. ఒక్కసారైనా మీరు మీకు ఏమేమి ఉన్నాయో లిస్టు రాసుకుంటే అవి లేనివాళ్లు కోట్లమంది కనిపించి ఉండేవారు. మీ దృష్టి రుణాత్మకం కావడంతో వచ్చిన సమస్య ఇది’ అన్నాడు సైకియాట్రిస్ట్.ఆ తర్వాత కూతురి వైపు చూశాడు.‘చూడమ్మా... ఎందరో పిల్లలు అడాప్ట్ చేసుకునే తల్లిదండ్రులు లేక బాధపడుతుంటే మంచి తల్లిదండ్రులను నీకు దేవుడు ఇచ్చాడని నువ్వు కొంచెం కూడా సంతోషపడటం లేదు. తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతగా లేవు. అమ్మ వేధిస్తుంది అంటున్నావే తప్ప నాన్న నిన్ను ప్రాణం కంటే మిన్నగా చూసుకుంటున్నాడని మాటవరసకు కూడా అనలేదు. సొంత ఇల్లు, కారు, మంచి కాలేజీ ఇవి ఎంతమందికి ఉన్నాయి. అమ్మ సమస్య ఏమిటో తెలుసుకోకుండా అమ్మ మీద డిమాండ్స్ పెట్టి ఆమెను బాధపెట్టావు. మీది అన్నీ ఉండి ఎక్కువైన బాధ. అసలు ఒక కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు హాయిగా జీవనం సాగించే పరిస్థితుల్లో ఉన్నారన్న దానికి మించిన అదృష్టం ఏముంది? మీరు యుద్ధాలు జరిగే నేల మీద, భూకంపాలు వచ్చే చోట, కరువు తాండవించే చోట లేరని కర్ఫ్యూ మధ్య లేరని అప్పుల్లో లేరని తెలుసుకుంటే పోల్చి చూసుకుంటే మీ జీవితం ఎంత వరప్రసాదమో తెలుస్తుంది. అసలు ముందు మీకు ఉన్న గొప్ప పాజిటివ్ విషయాలేమిటో చెప్తూ వెళతాను. నెగెటివ్ విషయాలు వాటికవే దూదిపింజల్లా తేలిపోతాయి’ అన్నాడు సైకియాట్రిస్ట్.సెషన్స్ మొదలయ్యాయి.కొన్నాళ్లకు విడివిడిగా ఉన్న ఆ ముగ్గురు ఒక కుటుంబంగా బతకడం నేర్చుకున్నారు. ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
వాట్శాపం.. పెనుభూతం
అనుమానం పెనుభూతం అంటారు. వాట్సాప్ ఇప్పుడు శాపంలా, భూతంలా తయారైంది!భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తెస్తోంది. వీళ్ల అపోహల్ని, అపార్థాల్నీ చూస్తుంటే..పెళ్లి ముందా... అనుమానం ముందా.. అనే డౌట్ వస్తోంది.ఏది ముందైనా.. నమ్మకం వాటికి ముందుంటే...దంపతులను ఈ వాట్సాప్‌లు శపించలేవు.భూతాలై ఆలూమగల అనురాగాన్ని కబళించలేవు. ఇదే ఈవారం మైండ్ స్టోరీ. ‘డాక్టర్ ఇదీ కేసు’ అన్నాడు భార్యాభర్తలు వారిరువురూ. ఆమె పేరు సంధ్య. అతడి పేరు విజయ్. పదేళ్లయ్యింది పెళ్లయ్యి. ఆమె ఇంట్లో ఉంటుంది. అతడు ఆఫీసుకు వెళతాడు. వాళ్లకో పాప. మూడో క్లాస్ చదువుతోంది. సంధ్య ఉదయాన్నే లేచి పాపను నిద్రలేపి స్కూల్‌కు రెడీ చేస్తుంది. విజయ్ ఈలోపు కొంచెం టీ పెట్టుకొని తాగి పాపను స్కూల్ బస్‌లో చేరవేస్తాడు. పాప వెళ్లిపోయాక విజయ్ రెడీ అయ్యేంత సేపు వాళ్లు గతంలో బాగా కబుర్లు చెప్పుకునేవారు. విజయ్ బాగా నవ్విస్తాడు. సంధ్య బాగా నవ్వుతుంది. బ్రేక్‌ఫాస్ట్ చేసే సమయంలో ఈ పక్క ఫ్లాట్ వాళ్ల మీదో ఆ పక్క ఫ్లాట్ వాళ్ల మీదో ఏవో జోకులు నడుస్తాయి. ఆ తర్వాత అతను ఆఫీసుకు వెళ్లిపోతాడు. ఆమె ఇంటి పనుల్లో పడుతుంది. అయితే ఈ మధ్య బ్రేక్‌ఫాస్ట్ కబుర్లు నడవడం లేదు.ఆ సమయంలో ఇద్దరూ ఫోన్ చూసుకుంటూ ఉంటారు.అపార్ట్మెంట్లో ఉన్న 70 ఫ్లాట్లలోని ఆడవాళ్లందరూ ఒక గ్రూప్ పెట్టుకున్నారు. సంధ్య ఆ గ్రూప్‌లో బిజీగా ఉంటుంది. అది కాకుండా సంధ్య వాళ్ల పుట్టింటి గ్రూప్ ఒకటి ఉంది. ఆ తర్వాత కాలేజీ ఫ్రెండ్స్ గ్రూప్ ఒకటి ఉంది. ఇవి కాకుండా తెలిసినవాళ్లతో పిచ్చాపాటి చాటింగ్ కూడా ఉంటుంది.విజయ్ కూడా వాట్సాప్‌లో తక్కువ తినలేదు. ఆఫీస్ గ్రూప్ ఒకటి తప్పనిసరి. ఇది కాకుండా అతడికి చేపలు పట్టడం సరదా. రెండు మూడు వారాలకు ఒక గ్రూప్‌తో కలిసి చుట్టుపక్కల చెరువులకు, ఒక్కోసారి చాలా దూరం వెళ్లి నదుల ఒడ్డున చేపలు పడుతుంటాడు. అదో గ్రూప్ ఉంది. జోకుల గ్రూపులు కొన్ని ఉన్నాయి. ఆయుర్వేదం గ్రూప్ ఒకటి.ఈ గ్రూపుల్లోని బ్లింక్లతోటే కాలం గడుస్తూ ఉంది.కాలం అలాగే గడిచినా సమస్యలేమీ లేకపోవు.కానీ ఈలోపు ఉన్నట్టుండి ఒకరోజు సంధ్య స్నేహితురాలు భార్గవి సంధ్య ఇంటికి వచ్చింది. సమస్య అక్కణ్ణుంచే మొదలైంది. ‘ఓ... ఎంత బాగుందో మీ ఇల్లు’ అంది భార్గవి సంధ్య ఇంటిని చూస్తూ.‘ఇందులో నా టేస్ట్ కన్నా మా ఆయన టేస్టే ఎక్కువ’ అంది సంధ్య గర్వంగా.‘అబ్బో.. అంత మంచి టేస్ట్ ఉన్న మీ ఆయన్ను పరిచయం చేసుకోవాల్సిందే’ అంది భార్గవి.అది సాయంత్రం వేళ కావడం, ఆ రోజు విజయ్ అనుకోకుండా తొందరగా ఇల్లు చేరడంతో భార్గవికి విజయ్‌ని పరిచయం చేసింది సంధ్య.‘ఓ... మీరు కూడా గులాబీ టీమేనా?’ అన్నాడు నమస్తే పెడుతూ విజయ్.భార్గవి ఉలిక్కి పడింది.‘లె..లె..లేదే’‘మాకు తెలుసులేండీ. సంధ్య చెప్పింది. గులాబీ సినిమా చూసి ముక్కు మొహం తెలియనివారికి ఫోన్ చేసి ప్రేమిస్తున్నామంటూ ఏడిపించేవారంట గదా మీ ఫ్రెండ్సంతా. మీరా టీమ్‌లో లేరా?’‘నిజానికి ఆ అల్లరి మొదలెట్టిందే ఈ పిల్ల’ అంది సంధ్య.‘ఆ రోజుల్లో అంటే మీ అల్లరి నడిచింది. ఇప్పుడైతే ఏ నంబర్ నుంచి చేస్తున్నారో క్షణాల్లో తెలిసిపోతుంది’ నవ్వుతూ అన్నాడు విజయ్.‘తెలియని వాళ్లతో ఎందుకండీ. తెలిసినవాళ్లతోనే బోల్డన్ని కబుర్లు చెప్పుకోవచ్చు ఇప్పుడు. అన్నీ ఫ్రీ సిమ్‌లు. వైఫైలు. వాట్సాప్‌లు’ భార్గవి కూడా నవ్వింది.వాళ్లు ఈ ఊరు కొత్తగా వచ్చారట. దొరక్క దొరక్క సంధ్య దొరకడంతో తరచూ రాకపోకలు సాగాయి. సంధ్య ఊరికే ఉండకుండా ‘ఒక్కోసారి ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోతుంటాను. ఎందుకైనా మంచిది మా వారి నంబర్ కూడా పెట్టుకో’ అని విజయ్ నంబర్ ఇచ్చింది.‘మీ ఫ్రెండ్ మెసేజ్ పెట్టింది. బావగారూ ఇవాళ సంధ్య దోసకాయ కూర చేసిందట. మీకు పస్తే. దానికా కూర చేయడం రాదు’ అని నవ్వాడు విజయ్.‘దానికి వంకాయ కూర చేయడం కూడా రాదు. నాకు వంకలు పెడుతుందా’ సంధ్య కూడా నవ్వింది.‘మీ ఫ్రెండ్ బర్త్ డే విషెస్ చెప్పింది. పార్టీ కావాలట’‘దాందేముంది పచ్చిమిరపకాయ పులుసు రెడీగా ఉందని చెప్పండి’ సంధ్య జోక్‌గా అంది.వెంటనే భార్గవి వాట్సాప్ అకౌంట్లో విజయ్ పచ్చిమిరపకాయల గంప ఫొటో పెట్టి స్మైలీ పెట్టాడు. ఒకరోజు విజయ్ ఫోన్‌ను క్యాజువల్‌గా చూస్తూ ఉంది సంధ్య. ఫోల్డర్లో భార్గవి ఫొటో కనిపించింది. ఆశ్చర్యపోయింది. భార్గవి ఫొటో విజయ్ ఫోన్లో ఎందుకు ఉన్నట్టు?‘భార్గవి ఫొటో ఉందేంటి?’‘నీకు పెట్టబోయి నాకు పెట్టిందట. డిలీట్ చేసేలోపే నా ఫోల్డర్లో పడిపోయినట్టుంది’ అన్నాడు విజయ్ క్యాజువల్‌గా.సంధ్యకు కూడా గుర్తొచ్చింది అదే ఫొటోను తనకు కూడా పెట్టింది భార్గవి. కానీ ఎందుకో చిన్న అనుమానం.చిన్నదా?ఆ రోజు నుంచి సంధ్య గూఢచర్యం పెరిగింది. విజయ్ స్నానానికి వెళ్లినప్పుడు, వాకింగ్‌కు వెళ్లినప్పుడు, లేదా పాపను తీసుకుని కిందకు వెళ్లినప్పుడు ఫోన్ చెక్ చేసేది. వాట్సాప్‌లో భార్గవి అకౌంట్ ఓపెన్ చేసి చూసేది. గుడ్ మార్నింగ్ అని, నమస్తే అని, హ్యాపీ శాటర్డే అని ఇలాంటి మెసేజ్‌లు ఉండేవి. ఒక్కోసారి చాట్ క్లియర్ చేసినట్టుగా క్లీన్‌గా ఏ మెసేజ్ కనిపించేది కాదు. అంటే మాట్లాడుకుని చాట్ డిలీట్ చేశారా? అసలు వాళ్లు మాట్లాడుకునే ఉండకపోవచ్చు కదా అని ఆమె అనుకునేది కాదు. విజయ్ సైకియాట్రిస్ట్‌తో సంధ్యను తీసుకొచ్చి.తల ఒంచుకుని కూచున్న సంధ్య వెంటనే తల ఎత్తి ‘డాక్టర్ వాళ్లిద్దరికీ సంబంధం ఉంది. అది బయటపడకుండా ఉండటానికి నాకు పిచ్చి అనే ముద్ర వేసి మీ దగ్గరకు తీసుకొచ్చాడు ఈ దుర్మార్గుడు’ అంది.‘కొత్త ఫోన్ చాలా బాగుందండీ. థ్యాంక్యూ’‘నీ కోసమే కొన్నానోయ్. వాట్సాప్‌లో మాట్లాడుకోవచ్చుగా’‘అవును. అన్నింటికీ ఫోన్ చేయడం ఎందుకూ?’‘ఇక అన్నం పెడతావా?’‘అన్నం పెడతాను. దానికి ముందు హగ్ కూడా ఇస్తాను’ఆమె నవ్వేసింది. అతడు దగ్గరకు తీసుకున్నాడు. రాను రాను సంధ్యకు ఈ అనుమానం ముదిరింది.ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడల్లా తన ఫోన్లో వాట్సప్‌కు వెళ్లేది. అందులో విజయ్ అకౌంట్ చూసేది. లాస్ట్ సీన్ టైమ్‌కు, భార్గవి అకౌంట్లోని లాస్ట్ సీన్ టైమ్‌కు పొంతన లేకపోతే సంతృప్తిగా ఊపిరి పీల్చుకునేది. అవి రెండూ దగ్గర దగ్గరగా ఉంటే కలవర పడేది.ఇంకా ఘోరమైన విషయం ఎప్పుడు మొదలైందంటే ఒకరోజు విజయ్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఆన్లైన్లో ఉన్నట్టుగా కనిపించింది. వెంటనే భార్గవి అకౌంట్ కూడా ఓపెన్ చేసింది. అదీ ఆన్లైన్ అని చూపిస్తూ ఉంది. ఒకేటైమ్‌లో ఆన్లైన్లో ఉన్నారంటే వీళ్లిద్దరూ చాటింగ్‌లో ఉన్నట్టేగా?ఆ క్షణమే ఆమె స్పృహ తప్పి పడిపోయింది.‘డాక్టర్ ఇదీ కేసు’ అన్నాడు విజయ్ సైకియాట్రిస్ట్‌తో సంధ్యను తీసుకొచ్చి.తల ఒంచుకుని కూచున్న సంధ్య వెంటనే తల ఎత్తి ‘డాక్టర్ వాళ్లిద్దరికీ సంబంధం ఉంది. అది బయటపడకుండా ఉండటానికి నాకు పిచ్చి అనే ముద్ర వేసి మీ దగ్గరకు తీసుకొచ్చాడు ఈ దుర్మార్గుడు’ అంది.‘మీరు బయటకెళ్లండి’ అన్నాడు విజయ్‌తో.ఆ తర్వాత సంధ్యతో మాట్లాడటం మొదలెట్టాడు. ‘చూడమ్మా... నీ భర్త సంగతి తర్వాత ఆలోచిద్దాం.. ముందు నువ్వు నీ స్నేహితురాలిని అవమానిస్తున్నావని అనుకోవడం లేదా? ఆమె నిన్ను అక్కగా నీ భర్తను బావగారిలా భావించి గౌరవిస్తుంటే నువ్వు అవమానిస్తావా? ఈ సంగతి ఆమెకు తెలిస్తే ఎంత బాధ పడుతుంది? ఇక నీ భర్త ఇన్నాళ్లలో ఎప్పుడూ అలా బిహేవ్ చేయలేదు. పరిచయం చేసింది నువ్వే. పలకరించేలా చేసిందీ నువ్వే. వాళ్లలా మాట్లాడుకుంటే కలవరపడుతున్నదీ నువ్వే. మనిషి కంటే ఎక్కువగా యంత్రాన్ని నమ్ముకుంటే వచ్చే ప్రమాదాలు ఇవి. వాట్సాప్ ఆన్ చేసి వేరే పనుల్లో పడినా ఆన్లైన్ అనే చూపిస్తుంది. ఆఫీస్ మెసేజుల్లో ఉన్నా ఆన్లైనే అని చూపిస్తుంది. అసలు మీ మధ్య ఫోన్ ఎప్పుడు వచ్చిందో అప్పుడే దూరం పెరిగి ఆ ఖాళీలో చేరవలసిన చెత్తంతా చేరుతోంది. టెక్నాలజీని ఎంత వాడుకోవాలో అంతే వాడుకోవాలి. ముందు మీరు చేయవలసిన పని ఏమిటంటే ఫ్రెండ్స్ పేరుతో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవడం. అందులో మీరూ మీ వారు భార్గవి భార్గవి భర్త ఉండండి. అక్కడ మాట్లాడుకోండి. మీ నలుగురూ కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయడమే నేను ప్రిస్క్రైబ్ చేయగల మెడిసిన్. ఆ మెడిసిన్‌ను తీసుకుంటావా?’సంధ్య తెరిపిన పడ్డట్టు చూసి లేచింది.బహుశా వాళ్ల భోజనంలో ఏమేమి వండాలన్న చర్చ కొత్త గ్రూప్‌లో నలుగురి మధ్య నవ్వులతో సాగుతుండవచ్చు. – ఇన్పుట్స్: కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
నవ్వు ముఖం
‘‘నాకు తెలిసిన వ్యక్తి ఒకరు నన్ను ఫాలో అవుతున్నారు డాక్టర్’’ చెప్పింది అన్విత. ‘‘ఇందులో మీ సమస్యేమిటీ?’’ అడిగాడు డాక్టర్ తరుణ్. సైకియాట్రిస్ట్ ఎదురుగా కూర్చొని ఉంది అన్విత. ‘‘చెప్పండి’’ అన్నాడు సైకియాట్రిస్ట్ గట్టిగా గుండె లోపలికి గాలి పీల్చుకుని.అన్వితకు పాతికేళ్ల వరకు ఉంటాయి. పెళ్లి కాలేదు కాబట్టి పద్దెనిమిదేళ్ల అమ్మాయిలా ఉంది. ఆయన ఎందుకంత గాఢంగా గుండె లోపలికి గాలి పీల్చుకోవలసి వచ్చిందో ఆమెకు అర్థం కాలేదు. బీపీ చెక్ చేసే డాక్టర్లా ఈ సైకియాట్రిస్ట్‌లు దేహం లోపలి విపత్తుల్ని, విలయాలను సంకేతపరిచే ఫీలింగ్స్ ఏవో అప్పుడప్పుడూ పెడుతుండటం గురించి ఆమెకు తెలుసు. ఇప్పుడీ సైకియాట్రిస్ట్ కూడా ఏ కారణమూ లేకుండానే అదే విధమైన ఫీలింగ్‌ని ఎక్స్‌ప్రెస్ చెయ్యడానికి గుండె లోపలికి గాలిని పీల్చుకొని ఉండి ఉండొచ్చని ఆమె అనుకుంది. ‘‘మీవన్నీ అనవసర భయాలు’’ అన్నాడు డాక్టర్ తరుణ్.ఆ నగరంలో పేరున్న సైకియాట్రిస్ట్ అతను. మనిషి డాక్టర్లా ఉండడు. దెయ్యాలు పట్టేవాడిలానో, దెయ్యాల పనిపట్టేవాడిలానో ఉంటాడు. కానీ నవ్వు ముఖం. దెయ్యాల భయం ఉన్నవారికి అతడిని చూస్తే మందు చీటీ రాయకుండానే ధైర్యం వచ్చేస్తుంది. ‘దెయ్యాల్ని మించినవాyì దగ్గరికే వచ్చాం’ అన్న దగ్గరి భావం ఏదో అతడి పట్ల కలుగుతుంది రోగికి. అయితే అలాంటి భావం అన్వితకు కలిగినట్లు లేదు. ‘‘ముందసలు మిమ్మల్ని మీరు ఒక రోగి అనుకోవడం మానండి’’ అన్నాడు డాక్టర్ తరుణŠ . అతడికో అలవాటుంది. వచ్చినవాళ్లు ఏ సమస్యతో వచ్చారో తెలుసుకోడానికి ముందే.. ‘మీవన్నీ అనవసర భయాలు, ముందసలు మిమ్మల్ని మీరు ఒక రోగి అనుకోవడం మానండి’’ అంటుంటాడు. ఇప్పుడు అన్వితతోనూ ఆ రెండు మాటలు అన్నాడు. అన్విత ఆశ్చర్యంగా చూసింది.‘‘నన్ను నేను రోగి అనుకోవడం లేదు డాక్టర్. భయపడుతున్నానంతే. ఆ భయమే రోగం అని మీరు అంటే కనుక.. ‘అప్పుడు.. ధైర్యం కూడా రోగమే అవ్వాలి కదా డాక్టర్’ అని నేను మిమ్మల్ని ప్రశ్నించడానికి సంకోచించను’’ అంది అన్విత. ఆ మాటకు నివ్వెరపోబోయి ఆగాడు డాక్టర్ తరుణ్. ‘‘మీ లాజిక్ బాగుంది. మీరు ఫిలాసఫీ స్టూడెంట్ అయి ఉంటారని నాకు నమ్మబుద్ధేస్తోంది’’ అన్నాడు. ‘‘నమ్మబుద్ధి కావడం ఏంటి డాక్టర్?’’ అని ప్రశ్నించింది అన్విత విస్మయంగా. ‘‘నా ఉద్దేశం.. మీరు ఫిలాసఫీ స్టూడెంట్‌నని నాతో చెప్పుకున్నారనీ, మీరు ఫిలాసఫీ స్టూడెంట్‌లా నాకు అనిపించకపోయినప్పటికీ.. మీరు ఫిలాసఫీ స్టూడెంట్ అని నాకు నమ్మబుద్ధేస్తోందని చెప్పడం కాదు మిస్ అన్వితా’’ అన్నాడు తరుణ్. ‘‘మరి!’’ అంది అన్విత.‘‘మీరు ఫిలాసఫీ స్టూడెంట్ అయి ఉండడం అన్న నా ఫీలింగ్‌ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతే.’’ ‘‘ఓకే.. డాక్టర్. నా సమస్య భయమూ కాదు, ధైర్యమూ కాదు. జస్ట్ సమస్య. ఆ సమస్యను నేను మానసిక ఆరోగ్యమనీ, మానసిక అనారోగ్యమనీ అనుకోవడం లేదు. దానర్థం చికిత్స కోసం నేను మీ దగ్గరకు రాలేదని కాదు. నేనూ మీతో కొన్ని ఫీలింగ్స్‌ని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను’’ అంది. చెప్పమన్నట్లు చూశాడు తరుణ్. ‘‘నాకు తెలిసిన వ్యక్తి ఒకరు నన్ను ఫాలో అవుతున్నారు డాక్టర్’’ చెప్పింది అన్విత. ‘‘ఇందులో మీ సమస్యేమిటీ?’’ అడిగాడు డాక్టర్ తరుణ్. అన్విత అందంగా ఉంటుంది. తెలిసిన వ్యక్తులే కాదు, తెలియని వ్యక్తులకు కూడా ఆమెను ఫాలో అవ్వాలని అనిపించడానికి అవకాశాలు లేకపోలేదు. ‘‘ఒకప్పుడు నేనతన్ని ప్రేమించాను. ఇప్పుడు ప్రేమించే స్థితిలో లేను. తను మాత్రం నన్నింకా ప్రేమిస్తూనే ఉన్నాడు’’‘‘చివరిసారి మిమ్మల్ని ఎప్పుడు ఫాలో అయ్యాడు?’’ అడిగాడు తరుణ్. ‘‘చివరిసారి, మొదటిసారి అనేం లేదు డాక్టర్. ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నప్పుడు కూడా నన్ను ఫాలో అయ్యాడు’’ చెప్పింది అన్విత. ‘‘ఫాలో అయి ఏం చేస్తాడు?’’‘‘నువ్వంటే ఇష్టం అంటాడు. నువ్వు లేందే బతకలేనంటాడు. నీతో పాటు వచ్చేస్తానంటాడు’’‘‘హెడ్డేక్గా తయారయ్యాడంటారు. అంతేనా?’’అన్నాడు తరుణ్. ‘‘లేదు లేదు. అలాంటిదేం లేదు’’ ‘‘మరేంటి’’? ‘‘మా నాన్న నాకు వేరే సంబంధం తెచ్చారు. మా ఇద్దరికీ ఉన్న ప్రేమబంధం గురించి చెప్పాను. ‘వాణ్ణి చంపేస్తాను’ అని పెద్దగా అరిచారు. ‘వద్దు నాన్నా.. నా ప్రేమను చంపుకుంటాను. అతన్ని చంపకు’ అని నాన్న కాళ్లు పట్టుకున్నాను. నాన్న కన్నీళ్లు పెట్టుకున్నాడు. నన్ను దగ్గరకు తీసుకున్నాడు. ‘నా మాట విను. నీ జీవితం బాగుంటుంది’ అన్నాడు. నాన్నకు నేనంటే ప్రాణం. నాన్న మాట వింటే నా జీవితం బాగుంటుందా, బాగుండదా అని నేను ఆలోచించలేదు. నాన్న మాట వినదలచుకున్నాను. నాన్న కోసం.. అతనిపై నాకున్న ప్రేమను చంపుకోడానికి నేను తయారైపోయాను కానీ, నాపై ఉన్న ప్రేమను చంపుకోడానికి అతను సిద్ధంగా ఉంటాడా అని ఆలోచించలేకపోయాను’’ అంది అన్విత. డాక్టర్ తరుణ్ మౌనంగా వింటున్నాడు. ఈ అమ్మాయి తన సమస్యను ఎక్కడికి తెచ్చి ఆపుతుందా అని అతడు ఎదురుచూస్తున్నాడు. ‘‘అతను నాకు సమస్య కాదు డాక్టర్. నేనే అతనికి సమస్యగా మారానేమోనని సందేహంగా ఉంది’’ అంది అన్విత.తరుణ్ నివ్వెరపోయాడు. మనసులోని విషయం గ్రహించినట్లే మాట్లాడింది అనుకున్నాడు. ‘‘అతన్ని చూడాలని అనిపించినప్పుడు అతనికి కనిపించకుండా దూరం నుంచి చూడొచ్చు. కానీ నేను అతన్ని చూస్తున్నప్పుడు అతను నన్ను చూడాలన్న కోరిక అతనికి నేను కంటపడేలా చేస్తోంది. ఆవెంటనే అతను నా వెంటపడుతున్నాడు’’ చెప్పింది అన్విత. ‘‘ఇందులో మీకొచ్చిన సమస్యేమీ కనిపించడం లేదు అన్వితా. అతను మిమ్మల్ని ఫాలో అవడం మీకూ సంతోషమే కదా. నిజానికి మీరే అతన్ని మీ వెంటపడేలా చేసుకుంటున్నారు’’ అని నవ్వాడు తరుణ్. ‘‘నా భయం కూడా అదే డాక్టర్. నా సంతోషం కోసం అతన్నేమైనా నేను దుఃఖంలో ముంచేస్తున్నానా అని. ఆ ఫీలింగ్‌ని షేర్ చేసుకోడానికే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను’’ అంది అన్విత. ‘‘కానీ.. నాదొక సందేహం అన్వితా. మీ నాన్నతో అన్నారు కదా. అతనిపై మీకున్న ప్రేమను చంపుకుంటానని. మళ్లీ ఇదేమిటి?’’ అన్నాడు తరుణ్. ‘‘అవును డాక్టర్.అయితే ప్రేమను చంపుకోవడం కష్టమని నాకు తర్వాత తెలిసింది’’. ‘‘తర్వాత అంటే?’’‘‘ఆత్మలు మనుషుల మీద ప్రేమను చంపుకోలేక ఆ మనుషుల చుట్టూ తిరుగుతున్నట్లే.. ఆత్మలు కనిపించినప్పుడుమనుషులూ ఆత్మల మీద ప్రేమను చంపుకోలేక ఆ ఆత్మ చుట్టూ తిరుగుతారని నాకు తెలిశాక’’.. చెప్పింది అన్విత.డాక్టర్ తరుణ్‌ది నవ్వు ముఖం.అన్విత అలా చెప్పాక.. ముఖం మాత్రమే మిగిలింది. - మాధవ్ శింగరాజు -
అదిగో కొండ... ఇదిగో లోయ
వీళ్లు కెరటం అంత స్ట్రాంగ్ అనుకుంటాంగానీ అంతకంటే వీక్ అయిపోతుంటారు. ఉవ్వెత్తున లేస్తారు... ఠప్పున పడిపోతారు. ఇంతలోనే ఉత్సాహం... అంతలోనే ఉత్పాతం. రూపాయి నాణేన్ని టేబుల్ మీద తిప్పితే ఒకసారి బొమ్మ... ఒకసారి బొరుసు కనిపించినట్టే వీళ్లలో సంతోషం... విచారం కొంత వ్యవధిలో తిరుగాడుతూ ఉంటాయి. ఏ ఉద్వేగమూ కొంతకాలం స్థిరంగా ఉండకపోవడంతో చుట్టూ ఉన్నవాళ్లందరిలోనూ అపరిమితమైన ఒత్తిడి. వాళ్లకే కాదు చుట్టూ ఉన్న మనందరికీ కూడా! అందుకే అందరమూ‘బైపోలార్ డిజార్డర్’పై అవగాహన పెంచుకోవడం కోసమే ఈ ప్రత్యేక కథనం. సినిమాల్లోనైనా అందరూ ‘రోలర్ కోస్టర్’ను చూసే ఉంటారు కదా. దాని మీదికెక్కిన వారు అకస్మాత్తుగా పైపైకి వెళ్తుంటారు. అంతలోనే లోయలోకి దూకినట్టుగా కిందికి వేగంగా దిగిపోతుంటారు. ఒక చోట గిరా గిరా గిరా గిరికీలు కొడతారు. ‘బైపోలార్’ వ్యాధిలోనూ అంతే. మెదడులో మన మూడ్స్ కాస్తా రోలర్ కోస్టర్ ఎక్కి... అవి గబగబా మారిపోతే... మనిషి గింగిరాలు తిరుగుతాడు. అలా మూడ్స్ మాటిమాటికీ మారిపోతున్నప్పుడు ఆ మనిషి కాసేపు అపరిమితమైన సంతోషాలూ, అంతులేని ఉత్సాహాలూ కనబరుస్తూ... అవి కాస్తా తగ్గిపోయాక తీవ్రమైన నిరాశలో, నిస్పృహలో, అంతులేని కుంగుబాటులో మునిగిపోయే జబ్బే ఈ బైపోలార్ డిజార్డర్. ఇందులో చాలా ఉత్సాహంగా ఉండే దశను ‘మేనిక్’ ఫేజ్‌గా చెబుతారు. అలాగే తీవ్రంగా కుంగిపోయే దశను ‘డిప్రెసివ్ స్టేట్ లేదా ఎపిసోడ్’ అంటారు. రమేశ్ ఆ రోజు చాలా సంతోషంగా ఉన్నాడు. ఒక ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నాడు. ‘‘ఐఏఎస్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదురా. కావల్సిందల్లా జస్ట్... మంచి కాన్సంట్రేషన్. కాస్త హార్డ్‌వర్క్. ఇవేమీ కొత్తవి కావు. నేను టెన్త్ నుంచి చేస్తున్నవే. కాబట్టి చేసేస్తా. ఒక్క ఏడాది నాది కాదనుకుంటా. చేసేస్తా. నాక్కొన్ని యాంబిషన్స్ ఉన్నాయి. నేను డిఫరెంట్ అని చూపించాలి. ఆ తర్వాత ఒకరోజు ఆఫీస్‌కు సైకిల్ మీద రావాలి. ‘సార్ పెద్ద ఆఫీసర్ అయినా నిరాడంబరుడు. ఆయనకు ఏమాత్రం గర్వం లేద’ని జనమంతా అనుకోవాలి. మరోరోజు మనమెవరో తెలియకుండా సినిమాహాల్కు వెళ్లాలి. ఇంట్రవెల్ సమయంలో మెరుపు తనిఖీలు చేసి అందరినీ అదరగొట్టాలి. అలా మనమేంటో మన తడాఖా ఏమిటో చూపించి జనాలకు మేలు చేయాలి’’ అంటూ అంతులేని ఉత్సాహంతో అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడుతూ పోతున్నాడు. చాలా సంతోషంగా ఉన్నాడు. ఏదైనా సాధించడం తనకు పెద్ద కష్టం కాదని చెబుతున్నాడు. కొన్ని నెలల తర్వాత మళ్లీ రమేశ్‌ను చూస్తే... అతడు మునుపటి రమేశేనా అనుకునేలా ఉన్నాడు. చాలా విచారంగా, చాలా నిరాశగా కనిపించాడు. ‘‘అదేంట్రా మొన్న అంత హుషారుగా ఉన్నావు. ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతానన్నావు?’’ అని అడిగితే... అమ్మో... ఏదో అనుకున్నా గానీ... ఆ సిలబస్ చూశాక బెంబేలెత్తిపోయారా. అయ్యబాబోయ్... అది ఏడాది కాదు కదా... మూడేళ్లైనా పూర్తి కాదేమోరా. కొందరు మూడు అటెంప్ట్స్, నాలుగు అటెంప్ట్స్ చేస్తారంటే అందుకేనేమోరా. నేను కనీసం క్లర్క్ అయినా అవుతానంటావా’’ అంటూ బేలగా మాట్లాడాడు. ‘‘అసలు జీవితంలో దేనికైనా పనికి వస్తానంటావా’’ అంటూ నిరాశపడ్డాడు. మనిషిని చూస్తే తీవ్రమైన డిప్రెషన్లో కనిపించాడు. ఒకరోజు రమేశ్ వాళ్లమ్మను పలకరిస్తే... ‘‘ఏమిటో బాబు ఒక్కోసారి చాలా హుషారుగా ఉంటాడు. మళ్లీ కొన్నిసార్లు నిరాశలో మునిగిపోతాడు. ఒక్కోసారి రాత్రిళ్లు ‘ఛీ... ఎందుకు నాకీ బతుకు’ అంటూ ఏడుస్తుంటాడు కూడా’’ అంటూ వాపోయింది ఆ తల్లి. అందరూ కలిసి బుజ్జగించి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే... డాక్టర్ కొన్ని పరీక్షలు చేసి ఇలా చెప్పాడు ‘‘అమ్మా... రమేశ్ ఒక మానసికవ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి పేరు... బైపోలార్ డిజార్డర్’’. లక్షణాలు : బైపోలార్ డిజార్డర్ రోగులు తమ మేనిక్ ఫేజ్ అయిన ‘ఉత్సాహ దశ’లో దేన్నీ లెక్క చేయని తెంపరితనంతో ఉంటారు. ∙సాధారణం కంటే ఎక్కువ ఉత్సాహంతో ఉంటారు ∙ఒక్కోసారి సిల్లీగానూ, విచిత్రంగానూ అనిపించే పనులు చేస్తుంటారు ∙ఇతరులకు సహాయం చేయాలనే భావన బలంగా ఉంటుంది. ఒక్కోసారి ఎంతదూరమైనా వెళ్లి మేలు చేస్తారు ∙అంతులేని తెగువ చూపుతూ పోరాటాలకూ దిగే అవకాశం ఉంది ∙ఆలోచనలు పరంపరగా ఎడతెరిపి లేకుండా వస్తుంటాయి ∙ఒక ఉత్సాహపూరిత సంతోష దశలో చాలాసేపు ఉంటారు. దీన్నే ‘యుఫోరియా’ అంటారు. ∙డ్రగ్స్ లేదా ఆల్కహాల్ తీసుకోవాలన్న కోరిక ఎక్కువ ∙ఎలాంటి జంకూ లేకుండా సాహసాలకు పాల్పడవచ్చు ∙డబ్బును లెక్కలేకుండా ఖర్చు చేస్తారు ∙కొందరిలో సెక్స్ పట్ల అపరిమితమైన ఆసక్తి పెరుగుతుంది. ఈ హుషారులో సురక్షితం కాని సెక్స్ కార్యకలాపాలకూ ఒడిగడతారు. డిప్రెసివ్ ఎపిసోడ్లో: ∙చాలా విచారంగా, ఏమాత్రం ఉత్సాహం లేకుండా ఉంటారు ∙నిరాశాపూరితంగా మాట్లాడతారు ∙దుర్బలంగా ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు ∙నిద్ర పరమైన సమస్యలు. కొందరిలో అస్సలు నిద్రపట్టదు... లేదా మరికొందరు అదేపనిగా నిద్రపోతుంటారు ∙అంతకు ముందు సంతోషాన్నిచ్చిన అనేక కార్యకలాపాల మీద ఉత్సాహాన్ని కనబరచరు ∙దేని మీదా దృష్టి కేంద్రీకరించలేరు ∙చాలా ముఖ్యమైన విషయాలూ మరచిపోతారు ∙తింటే చాలా తక్కువగా తింటారు లేదా చాలా ఎక్కువగా తినేస్తుంటారు ∙ఎప్పుడూ అలసట, నీరసంగా కనిపిస్తుంటారు ∙కొన్నిసార్లు భ్రాంతులకు గురవుతుంటారు ∙తీవ్రమైన అపరాధభావంతో ఉంటారు ∙ మాటిమాటికీ చావులు లేదా ఆత్మహత్యల గురించి ప్రస్తావన తెస్తుంటారు ∙ఈ రోగులు అందరితోనూ సామాజిక సంబంధాలు నెరపలేరు. వీళ్ల ప్రవర్తన కారణంగా సాధారణంగా అవి దెబ్బతింటుంటాయి. రకాలు / తీవ్రత : బైపోలార్ డిజార్డర్‌లో బైపోలార్–ఐ, బైపోలార్–ఐఐ అన్న ప్రధానమైన రెండురకాలతో పాటు మరికొన్ని రకాలూ ఉంటాయి. ఇక తీవ్రత విషయానికి వస్తే... కొందరిలో మేనిక్ దశ చాలా తీవ్రంగా ఉంటుంది. వాళ్లను హాస్పిటల్లో ఉంచి చికిత్స చేయించాల్సి రావచ్చు. ఇక కొందరిలో మేనిక్ దశ అంత తీవ్రంగా ఉండదు. ఆ కండిషన్‌ను ‘హైపోమేనిక్’ స్టేజ్‌గా పేర్కొంటారు. వీళ్లకు హాస్పిటల్లో ఉంచి చికిత్స చేయించాల్సిన అవసరం లేదు. కానీ... వాళ్ల నిరాశ, నిస్పృహలతో భవిష్యత్తు గురించిన దిగులుతో కుంగుబాటు ఉంటుంది. అందువల్ల చికిత్స చేయించాలి. లేకపోతే... వ్యాధి ముదిరి సమస్మాత్యకంగా మారే అవకాశం ఉంటుంది. నిర్ధారణ : రోగుల్లో కనిపించే బైపోలార్ లక్షణాలను బట్టి ప్రాథమికంగా దీన్ని నిర్ధారణ చేస్తారు. అలాగే వారికి పర్సనాలిటీ డిజార్డర్స్, స్కీజోఫ్రీనియా వంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా అని డాక్టర్లు పరీక్షిస్తారు. ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో కొన్ని రక్తపరీక్షలు, ఎమ్మారై వంటివి కూడా చేయించాల్సి రావచ్చు. చిన్నప్పుడు ఏవైనా తీవ్రమైన మానసిక వేదనకు గానీ అబ్యూజ్‌కు గానీ గురయ్యారా చూస్తారు. కుటుంబ చరిత్రను పరిశీలిస్తారు. నిర్ధారణ (డయాగ్నోజ్) ప్రక్రియలో ఇలా ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. చికిత్స : చికిత్సలో రకరకాల ప్రక్రియలు అవలంబించినప్పటికీ ప్రధానంగా మందులే ఎక్కువగా పనిచేస్తాయి. ఎందుకంటే ఇది సైకోటిక్ డిజార్డర్ కిందికి వస్తుంది. కౌన్సెలింగ్ ప్రక్రియ సైకోటిక్ డిజార్డర్స్‌లో పనిచేయదు. అందుకే ప్రధానంగా మందులే వాడుతారు. దీనికి మూడు రకాల మందులు వాడాల్సి వస్తుంది. అవి... 1) మూడ్‌ను బాగుచేసే మూడ్ స్టెబిలైజర్స్, 2) మానసికసమస్యలకు ఇచ్చే యాంటీసైకోటిక్ డ్రగ్స్, 3) యాంటీడిప్రెసెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. పీరియాడిక్ టేబుల్లో మూడో ఎలిమెంట్ అయిన లిథియమ్ మనిషి భావోద్వేగాల హెచ్చుతగ్గులను ఎలా నియంత్రిస్తుందన్నది ఇప్పటికీ ఒక అద్భుతం. ఎందరో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నంత వ్యాధి తీవ్రత ఉన్నవారిలోనూ ఈ లిథియమ్ అద్భుతంగా పనిచేసి, ఎన్నో మరణాలను నివారించిందీ... నివారిస్తుంది. బైపోలార్ డిజార్డర్‌లోని మందులన్నింటినీ సమస్య తీవ్రతను బట్టి తగిన మోతాదులో సైకియాట్రిస్ట్‌లు మాత్రమే ఇవ్వాల్సినవి. కాబట్టి ఒకసారి తీసుకున్న వారు సొంతంగా వాడటం ఎంతమాత్రమూ సరికాదు. అలాగే మందులు వాడుతున్నప్పుడు అకస్మాత్తుగా ఆపేయడమూ మంచిది కాదు. దానివల్ల బైపోలార్ డిజార్డర్ తిరగబెట్టడంతో పాటు... తర్వాతి దశల్లో అదుపు చేయడం కొంత కష్టమవుతుంది కూడా. కొన్నిసార్లు కరెంట్ షాక్ ఇచ్చే ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ కూడా అవసరం కావచ్చు. అయితే ఇది ఎంతమాత్రమూ ప్రమాదకరం కాదు. ఇక నిద్రసమస్యలు ఉన్న కొందరురోగుల్లో స్లీప్ మెడికేషన్ కూడా అవసరం కావచ్చు. బైపోలార్ డిజార్డర్ ఉన్న సెలబ్రిటీలు ∙ప్రముఖ సింగర్ యో యో హనీసింగ్ బైపోలార్ డిజార్డర్‌తో బాధపడ్డాడు. చికిత్స తీసుకుని ఇప్పుడు పూర్తిగా దాని నుంచి విముక్తయ్యాడు. ∙ప్రఖ్యాత హాలివుడ్ నటి మార్లిన్‌మన్రో కూడా తీవ్రమైన మూడ్ స్వింగ్స్‌తో బాధపడుతుండేవారనీ, బైపోలార్ జబ్బువల్లనే ఇలా జరిగేదని అంటారు. ∙హెవీవెయిట్ బాక్సర్ మైక్టైసన్లో బైపోలార్ డిజార్డర్‌ను డయాగ్నైజ్ చేశారు. ∙ప్రఖ్యాత రచయిత్రి వర్జీనియా వూల్ఫ్‌కు ‘బైపోలార్ డిజార్డర్’ ఒక మేలు చేసింది. ఆమెలోని ఆ ఉత్సాహం ఆమెను ఆల్ టైమ్ బెస్ట్ రైటర్‌ను చేసింది. డిప్రెషన్లోకి కూరుకుపోవడంతో అదే జబ్బు ఆమె ఆత్మహత్యను ప్రేరేపించింది. ∙రెండుసార్లు అకాడమీ అవార్డుకు నామినేట్ అయిన యాక్షన్ హీరో మెల్ గిబ్సన్... తాను ఈ సమస్యతో బాధపడ్డట్లు వెల్లడించారు. అతడి వ్యక్తిగత జీవితం కారణంగా చాలాసార్లు వార్తల్లో నిలిచారు. 2006లో ఒకసారి డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిపోయి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ∙ప్రఖ్యాత రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత అయిన ఎర్నెస్ట్ హెమ్మింగ్వే కూడా తన జీవితకాలంలో మేనిక్ డిప్రెసివ్ బిహేవియర్ చూపేవాడు. ఆయనకు షాక్‌థెరపీ కూడా ఇచ్చారు. అయితే ఎప్పుడూ చావు ఆలోచనలతో బాధపడే హెమ్మింగ్వే 1961లో తుపాకీతో కాల్చుకుని మరణించాడు. ∙అకాడమీ అవార్డు, గోల్డెన్ గ్లోబు అవార్డులు గెలుచుకున్న ప్రముఖ నటి క్యాథరిన్ జెటా జోన్స్ కూడా ఈ వ్యాధి బారిన పడ్డారు. తన భర్త మైకెల్ డగ్లస్‌కు నాలుక క్యాన్సర్ రావడంతో ఆమె మొదట తీవ్రమైన డిప్రెషన్‌కు లోనై, ఆ తర్వాత బైపోలార్ డిజార్డర్ బారిన పడ్డారు. ∙రెండోప్రపంచయుద్ధ సమయంలో బ్రిటన్‌కు ప్రధానిగా ఉన్న ప్రపంచ ప్రఖ్యాత రాజకీయవేత్త విన్స్టన్ చర్చిల్ కూడా బైపోలార్ డిజార్డర్ బాధితుడే. యుద్ధసమయంలో తన సైనికులను తన ఉద్వేగభరిత ప్రసంగాల ద్వారా తీవ్రంగా ఉత్తేజితులను చేసేవాడు. యుద్ధం తర్వాత డిప్రెషన్‌కూ, ఆత్మహత్యాపూరితమైన ఆలోచనలకు, నిద్రలేమికి గురయ్యాడు. కారణాలు : ‘బైపోలార్ డిజార్డర్’కు కారణాలు నిర్దిష్టంగా ఉండవు. ఇవి రోగి నుంచి రోగికి మారుతుంటాయి. వీటిని జన్యుపరమైనవి, వాతావరణపరమైనవి, న్యూరలాజిక్గా చెప్పవచ్చు. జన్యుపరమైన కారణాలతో: రోగి కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉన్నప్పుడు... ఇతర కుటుంబ సభ్యుల్లోనూ అవి కనిపించే అవకాశాలు ఎక్కువ. వంశపారంపర్యంగా ‘బైపోలార్ డిజార్డర్’ను ప్రేరేపించే జన్యువు కారణంగా ఇది కనిపించవచ్చని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే అంతమాత్రాన తల్లిదండ్రుల్లోనో లేదా సోదరుల్లోనో ఉంటే ఇది తప్పక కనిపించాలనేమీ లేదు. పర్యావరణ / బాహ్య వాతావరణ పరమైన కారణాలతో : ఇక్కడ వాతావరణం అంటే పూర్తిగా పర్యావరణ కారణాలైన ఏ కాలుష్యమనో, ఇంకేదో అనో కాదు. బాహ్య అంశాలను ‘ఎన్విరాన్మెంటల్’ కారణాలుగా చెబుతారు. ఉదాహరణకు చిన్నప్పుడు తీవ్రమైన మనోవేదనకు గురి కావడం ∙ఏదైనా మనోవేదన లేదా ఇతరత్రా వ్యాధితో బాధపడాల్సి రావడం ∙ఏదైనా పెద్ద వినాశం తర్వాత కనిపించే తీవ్రమైన ఒత్తిడి అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటివి చాలా సుదీర్ఘకాలం పాటు కొనసాగడం... లాంటి బయటి కారణాలన్నింటినీ ‘ఎన్విరాన్మెంటల్’ కారణాలుగా చెప్పవచ్చు. అయితే వీటి వల్ల నేరుగా జబ్బు రాకపోయినా... ఇలాంటి వారికి జబ్బు వచ్చినప్పుడు తీవ్రత ఎక్కువవుతుంది. న్యూరలాజికల్ : నాడీపరమైన కారణాలతో కొందిరలో బైపోలార్ డిజార్డర్ కనిపించవచ్చు. ఉదాహరణకు పక్షవాతం వచ్చిన కొద్దిమందిలో లేదా ఏదైనా ప్రమాదంలో మెదడు దెబ్బతినడం వంటివి సంభవించిప్పుడు, నరాలపై ఉండే మైలీన్షీత్ అనే పొర దెబ్బతినడం వంటివి సంభవించే మల్టిపుల్ స్కి›్లరోసిస్ వంటికేసుల్లో, చాలా అరుదుగా మెదడులోని టెంపోరల్ లోబ్ అనే భాగంలోని లోపాల వల్ల వచ్చే మూర్ఛ (టెంపోరల్ లోబ్ ఎపిలెప్సీ) వ్యాధి ఉన్నవారిలో ‘బైపోలార్ డిజార్డర్’ కనిపించే అవకాశాలుంటాయి. ఇక మెదడులోని ప్రధానమైన న్యూరోట్రాన్స్మిటర్ అయిన డోపమైన్ స్రావాలు రోగుల మూడ్స్లోని మార్పులకు కారణమవుతాయి. వాళ్ల డిప్రెసివ్ దశలో సెరటోనిన్ అనే రసాయనం తాలూకు అనుబంధ రసాయనమైన ‘5–హైడ్రాక్సీ ఇండోల్ ఎసిటిక్ యాసిడ్’ పాళ్లు కూడా తగ్గుతాయి. బైపోలార్ డిజార్డర్ – ఇతర వ్యాధులు కొన్నిసార్లు బైపోలార్ డిజార్డర్... ఇతర వ్యాధులతో కలిసి కనిపించవచ్చు. ఇది ఉన్నవారిలో యాంగై్జటీ డిజార్డర్, ఈటింగ్ డిజార్డర్ వంటి మానసిక సమస్యలు ఉండవచ్చు. ఇది ఉన్నవారిలో థైరాయిడ్ సమస్యలు, మైగ్రేన్ తలనొప్పులు, గుండెజబ్బులు, డయాబెటిస్, ఒబేసిటీ లేదా ఇతరత్రా సమస్యలు కలగలిసి ఉండే అవకాశాలు ఎక్కువ. నివారణ పిల్లలు చిన్నప్పుడు తీవ్రమైన మనోవేదనకు గురయ్యే సందర్భాల్లో, ఆ కారణాన్ని బట్టి వారికి తగినంత మానసిక సాంత్వ ననివ్వడం ద్వారా పెద్దయ్యాక వారిలో బైపోలార్ డిజార్డర్ రాకుండా నివారించవచ్చు. మంచి మానవసంబంధాలను నెరపడం, అందరితో కలిసి ఉంటూ సామాజిక బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం ద్వారా చాలా సందర్భాల్లో బైపోలార్ డిజార్డర్స్ నివారితమయ్యే అవకాశాలు ఎక్కువే. డాక్టర్ శ్రీనివాస్ ఎస్‌ఆర్‌ఆర్‌వై ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీ, కాకతీయ మెడికల్ కాలేజ్, వరంగల్ -
మంచేదో.. చెడేదో? చెప్పేవారు కరువయ్యారు..
లండన్ : పెరుగుతున్న పాశ్చాత్య పోకడలు ఉమ్మడి కుటుంబాలను కనుమరుగు చేస్తున్నాయి. దీంతో ఇంట్లో పెద్దవారు లేకుండా పోతున్నారు. మంచేదో? చెడేదో? కూడా చెప్పేవారు కరువయ్యారు. దీంతో సమస్యలూ పెరిగిపోతున్నాయి. ఫలితంగా సైకియాట్రిస్టుల దగ్గరికి వచ్చేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ అవసరాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు కౌన్సెలింగ్ ఇచ్చే ఓ రోబోను తయారుచేశారు. ఈ రోబో.. అచ్చంగా ఓ అనుభవమున్న కౌన్సెలర్‌గా వ్యవహరిస్తుందని, తన వద్దకు వచ్చే క్లయింట్ల సమస్యను చక్కగా పరిష్కరిస్తుందని చెబుతున్నారు. ప్రయోగాత్మకంగా పరీక్షించగా... సంతృప్తికరమైన ఫలితాలు కూడా వచ్చాయని చెబుతున్నారు యూకేలోని ప్లైమౌత్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ముఖ్యంగా మార్పు కోరుకుంటూ తన వద్దకు వచ్చేవారికి ఈ రోబో మోటివేషనల్ ఇంటర్వ్యూ చేస్తుందని, దీనివల్ల క్లయింట్లలో మార్పును స్పష్టంగా గమనించామంటున్నారు. అంతేకాకుండా ఈ రోబోతో కౌన్సెలింగ్ పూర్తిచేసుకున్నవారి ఫిజికల్ యాక్టివిటీ, లక్ష్యాన్ని సాధించాలన్న తపన, నిర్ణయాలలో స్పష్టత వంటివి పెరిగినట్లు గుర్తించామని చెప్పారు. -
నోట్లరద్దుతో ‘నల్ల’ సంపన్నుడికి గుండెపోటు!
కార్డియాలజిస్ట్‌లు, సైక్రియార్టిస్టులను సంపంద్రిస్తున్న బడాబాబులు ఆయన ఇంట్లో కట్టలకొద్దీ నగదు ఉంది. నిన్నటివరకు నిశ్చింతగా నెత్తిమీద తడిగుడ్డ వేసుకొని పడుకున్న ఆయనలో ఒక్కసారిగా పెద్దనోట్ల రద్దు ప్రకంపనలు రేపింది. తన నల్ల సందప ఏమైపోతుందోనన్న గుండెదడ. నిద్రపట్టదు. ఒళ్లంతా చెమటలు. శ్వాస ఆడటంలో ఇబ్బంది. ఇది ఇటీవల ముంబైకి చెందిన 55 ఏళ్ల బడా వ్యాపారవేత్త ఒకరు ఎదుర్కొన్న అనుభవం. ఆయన వెంటవెంటనే రెండుసార్లు కార్డియాలజిస్ట్ (హృద్రోగ డాక్టర్)ను కలిశారు. ఆ వెంటనే కెమ్ (కేఈఎం) ఆస్పత్రికి చెందిన సైక్రియార్టిస్ట్ వద్దకు వెళ్లి విస్తారమైన పరీక్షలు జరుపుకొన్నారు. ఒక్కసారిగా ప్రధాని మోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో దేశంలోని చాలామంది నల్లధన కుబేరుల్లో భయం కమ్ముకొని ఈ రకమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని సైక్రియార్టిస్టులు, హృద్రోగ నిపుణులు చెప్తున్నారు. పెద్దనోట్ల రద్దు దేశంలో పెను ప్రకంపనలను సృష్టించిన సంగతి తెలిసిందే. దీనివల్ల నిరుపేద, మధ్యతరగతి ప్రజలు బ్యాంకుల ముందు కరెన్సీ మార్చుకోవడానికి నానా కష్టాలు పడుతుండగా.. నల్లధన సంపన్నులు మరోరకమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని మానసిక వైద్య నిపుణులు చెప్తున్నారు. తాజాగా ముంబైలోని తార్దేవ్ ప్రాంతానికి చెందిన ఓ నల్లసంపన్నుడు ఎదుర్కొన్న పరిస్థితిని ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు. కట్టలుకొద్ది వెల్లడించని నగదు కలిగిన సదరు వ్యక్తి విపరీతమైన మానసిక భయాందోళనకు లోనయ్యాడని, దీంతో మూడురోజులుగా నిద్రకు దూరమైన అతనికి గుండెపోటు కూడా వచ్చిందని కేమ్ ఆస్పత్రి సైక్రియార్టిస్ట్ డాక్టర్ సాగర్ ముందాదా తెలిపారు. దీంతో సదరు వ్యాపారికి యాంటి డిప్రెషన్ ప్రిస్ర్కిప్షన్ ఇచ్చినట్టు ఆయన వివరించారు. ఇలాంటి కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని, హృద్రోగ సమస్యలు, మానసిక భయాందోళనలతో ఇటీవల తమను కలుస్తున్న వారిలో ఎక్కువమంది బిల్డర్లు, వ్యాపారులు ఉంటున్నారని సైక్రియార్టిస్టులు చెప్తున్నారు. -
బాయ్‌ఫ్రెండ్‌ని కలవడం తప్పా?!
జీవన గమనం నేను బీటెక్ పూర్తిచేశాను. సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ చేయాలని ఉంది. కానీ ఇంటర్వ్యూలకు వెళ్లాలంటే భయంగా ఉంది. ఎందుకంటే నాకు నత్తి. సరిగ్గా మాట్లాడలేను. సైకియాట్రిస్టులు నత్తిని పోగొడతారని విన్నాను. నిజమేనా? - లక్ష్మి, బెంగళూరు నత్తికీ ఉద్యోగానికీ సంబంధం లేదు. కొన్ని ఇంటర్వ్యూ కమిటీలలో నేను మెంబర్ని. మీకు సదరు సాఫ్ట్‌వేర్‌లో ప్రవేశం ఉందన్న నమ్మకం ఇంటర్వ్యూ కమిటీకి కలిగిస్తే, (మీరు అప్లై చేసిన ఉద్యోగానికీ, నత్తికీ సంబంధం లేకపోతే) ఎవరూ మీ వైకల్యం గురించి పట్టించుకోరు. ఇహ మీ నిజ జీవితంలో సమస్య గురించి: నత్తి రెండు రకాలు. శారీరకంగా వచ్చినది, మానసికంగా వచ్చినది. శారీ రకమైన నత్తిని పోగొట్టడానికి నాకు తెలిసి, మందులేమీ లేవు. మానసికమైన నత్తిని సైకాలజిస్టులు పోగొట్టే వీలుంది. మీరు సైకియాట్రిస్టులు అనే పదం వాడారు. మానసిక రోగాల్ని ‘మందుల ద్వారా’ తగ్గించేవారు సైకియాట్రిస్టులు. మానసిక ఇబ్బందులని ‘మాటల ద్వారా’ తొలగించే వారు సైకాలజిస్టులు. మీ అవసరం సైకా లజిస్టులతో ఉన్నది. నెమ్మదిగా, సున్ని తంగా, ఆవేశపడకుండా మాట్లాడే టెక్నిక్స్ నేర్పి, ధైర్యం కలిగించి, మాట్లాడటాన్ని ఒక పద్ధతిలో పెట్టటం ద్వారా వారు నత్తిని పోగొడతారు. ప్రయత్నించండి. నేను ఓ స్కూల్లో టీచర్ని. ఓరోజు మార్కెట్‌కి వెళ్లినప్పుడు తొమ్మిదో తరగతి విద్యార్థిని అక్కడ తారస పడింది. తను నాకు చాలా నచ్చింది. తనని అలానే చూస్తూ ఉండి పోయాను. తనూ అంతే. మెల్లగా నాకు తనంటే ఇష్టం ఏర్పడింది. వాళ్ల నాన్న మొబైల్ నంబర్‌కి మెసేజ్ చేస్తే, రిప్లై ఇచ్చింది. రెండు నెలల తర్వాత నేను ఉద్యోగానికి రాజీనామా చేసి కాంపిటీటివ్ పరీక్షలకు కోచింగ్ తీసుకోవడం మొదలు పెట్టాను. ఓరోజు ఆ అమ్మాయి ఫ్రెండ్ కనబడితే నాకు ఆ అమ్మాయంటే ఇష్టమని తనతో చెప్పాను. తను వెళ్లి ఏం చెప్పిందో కానీ ఆ రోజు నుంచీ ఆ అమ్మాయి నాతో మాట్లాడటం మానేసింది. మెసేజ్ ఇస్తే రిప్లై ఇవ్వదు. ఎందుకలా మారిపోయిందో అర్థం కావడం లేదు. నేను చదువు మీద మనసు పెట్టలేకపోతున్నాను. ఓ విద్యార్థిని పట్ల ఇలాంటి భావాలు కలిగివుండటం తప్పే. కానీ తనంటే నాకు ఇష్టం. ఏం చేయను? - ఓ సోదరుడు తొమ్మిదో తరగతి అమ్మాయంటే సాధారణంగా మైనరయ్యుంటుంది. అటువంటివారితో సంబంధం మిమ్మల్ని కటకటాల వెనక్కి పంపించే ప్రమాదం ఉంది. వాళ్ల నాన్నగారి ఫోనుకి మీరు మెసేజులు పంపుతున్నారు. అది మరీ ప్రమాదం. ఎన్నో సందర్భాల్లో గ్రామస్థులు టీచర్లకి దేహశుద్ధి చేయటం మీరు చదివే ఉంటారు. ఆ అమ్మాయి మీకు మెసేజ్ రిప్లై ఇవ్వటంలో కేవలం స్నేహభావమో లేక మీరు పెద్దవారనే గురుభావమో ఉండి ఉండొచ్చు. ఎప్పుడైతే మీరు ప్రేమను ప్రకటించారో ఆ చిన్న అమ్మాయి తన గూడులోకి వెళ్లిపోయింది. పదిహేనేళ్ల అమ్మాయి ఆ విధంగా ప్రవర్తించటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇక తనంటే మీకు చాలా ఇష్టం అన్నారు. మొదటి ప్రేమలో ఇటువంటి ఆకర్షణలు చాలా బలంగా ఉంటాయి. ప్రేమలో పడితే చదువు ఎక్కక పోవటం సహజమే. కాబట్టి కొంతకాలం ఆ ఆలోచనల్ని పక్కన పెట్టండి. దీనికి మీకు నిర్వాణ యోగ ప్రక్రియ ఉపయోగ పడుతుంది. దాని గురించి వివరంగా నా ‘విజయ రహస్యాలు’ అనే పుస్తకంలో ఇచ్చాను. ప్రాక్టీసు చేయండి. ముందే చెప్పినట్టు కొంత కాలం కేవలం చదువు మీదే ఏకాగ్రత నిలిపితే మీ భవిష్యత్తుకి మంచిది. ప్రేమ ముఖ్యమే. కానీ భవిష్యత్తు దానికన్నా ముఖ్యం కదా! నా స్నేహితురాలికి ఇటీవలే పెళ్లయ్యింది. ఆమెకి ఓ చిన్ననాటి స్నేహితుడున్నాడు. ఇద్దరిదీ మంచి స్నేహం. దానికి నేనే సాక్షిని. కానీ తన భర్త ఈ స్నేహాన్ని ఒప్పుకోవడం లేదు. అతణ్ని కలుసుకోవద్దని ఆంక్ష పెట్టాడు. తను బాధ పడుతోంది. ఏం చేయమంటారు? - శ్రీ సత్య, నంద్యాల ప్రతి సమస్యకీ కొన్ని పరిష్కారాలు ఉంటాయి. వాటిలో ఏది మంచిదో మనమే నిర్ణయించుకోవాలి. ఈ పరిస్థితిలో మీ స్నేహితురాలు - అయితే భర్తని లెక్క చేయకుండా స్నేహితుణ్ని కలుసుకోవచ్చు. నొప్పింపక తానొవ్వక రీతిలో భర్త పరో క్షంలో అతణ్ని కలుసుకోవచ్చు. గతంలో పిక్నిక్కి వెళ్లినప్పుడు, ఇద్దరూ ఒకే గదిలో రాత్రంతా ఉన్నప్పుడు స్నేహితుడి ప్రవర్తన, అతడి పవిత్ర వ్యక్తిత్వం గురించి భర్తకి వివరించవచ్చు (కానీ ఇది విడా కులకి దారితీసే ప్రమాదం ఉంది). అతడి భార్యని తన భర్తకి చెల్లిగా పరిచయం చేస్తూ ఆమెను నోరారా వదినా అని పిలుస్తూ, మొత్తం ఫ్యామిలీని ఫ్రెండ్స్‌గా చేసుకోవచ్చు. పడక సత్యాగ్రహం లాంటి పద్ధతుల ద్వారా భర్తని దారిలోకి తెచ్చుకో వచ్చు. భర్త కోసం ఇష్టం లేకపోయినానో లేక మనస్ఫూర్తిగానో పాత స్నేహానికి బై చెప్పవచ్చు. నిరంతరం నిరాశతో బాధ పడటం కంటే పై వాటిలో ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకోవడం మేలు.