ప్రతీకాత్మక చిత్రం
ప్రపంచంలో జరిగే మొత్తం ఆత్మహత్య లలో 20 శాతం మన దేశంలోనే జరుగుతున్నాయి. ప్రతి ఏటా సుమారు 2 లక్షల మంది మన దేశంలో ఆత్మహత్యలతో మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 10 లక్షల మందికి పైగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు మన దేశంలో మధ్య వయస్కులు, వృద్ధులు ఆత్మహత్యలు చేసుకొంటే, ఇటీవలి కాలంలో యువత, విద్యార్థులు ఈ దారుణానికి పాల్పడుతున్నారు.
కారణాల విషయానికి వస్తే, కుటుంబ సమస్యలు, భార్యా భర్తల మనస్పర్థలు, బలహీన పడుతున్న కుటుంబ బంధాలు మూడింట ఒక వంతు కారణమైతే, డిప్రెషన్, మద్యానికి బానిస కావడం, స్కిజోఫ్రీనియా, దూకుడు, ఆవేశ మనస్తత్వాలు, కేన్సర్, ఎయిడ్స్ లాంటి శారీరక, మాన సిక సమస్యలు కూడా ఆత్మహత్యలకు కారణ భూత మవుతున్నాయి. స్త్రీల కంటే పురుషులే అధికంగా (4:1) ఆత్మ హత్యలతో మరణిస్తుంటే, ఆత్మహత్యా ప్రయత్నాలు చేయడంలో మాత్రం స్త్రీలదే పైచేయిగా ఉంది.
ఎక్కువ ఆత్మహత్యలు ఉదయం 5 గంటల నుండి 10 గంటల మధ్యే ఎక్కువగా జరగడానికి ముఖ్య కారణం మన శరీరంలో ‘కార్టిసాల్’ అనే స్ట్రెస్ హార్మోన్ ఆ సమయంలో అధికంగా ఉత్పత్తి కావడమే! వారసత్వంగా జీన్స్ ప్రభావం వల్ల కూడా కొన్ని కుటుంబాల్లో పలువురు ఆత్మ హత్యలకు పాల్పడటం శాస్త్రీయంగా కూడా రుజువైంది.
కోవిడ్ సమయంలో మునుపటి కంటే 10 శాతం ఆత్మహత్యలు పెరిగాయి. అయితే ఇదే సమయంలో పరీక్షలు లేక పోవడం వల్ల విద్యార్థుల ఆత్మహత్యలు 25 శాతం తగ్గిపోవడ మనేది ఆలోచించదగ్గ విషయం!
మూడీగా, డల్‌గా, దిగులుగా ఉండటం; కన్నీళ్ళు పెట్టు కోవడం, తిండి, నిద్ర లేకపోవడం, డైరీలో సూసైడ్ నోట్ రాయడం, అప్పగింతలు పెట్టడం, వేదాంత ధోరణితో మాట్లా డటం, విషాద గీతాలు ఎక్కువగా వినడం, వీలునామా రాయడం, మద్యం, మత్తు మందులు అధికంగా తీసుకోవడం వంటి లక్షణాలు ఆత్మహత్య ఆలోచనను మనకు పట్టిస్తాయి.
నివారణ చర్యలకొస్తే, ప్రాణాంతకమైన పురుగు మందు లను నిషేధించడం, మద్యాన్ని సాధ్యమైనంత తక్కువ అందు బాటులో ఉండేలా చూడటం కాకుండా 20 ఏళ్ల లోపు వారికి మద్యం విక్రయాలు నిషేధించడం, హాస్టళ్లలో సీలింగ్ ఫ్యాన్ల బదులు, గోడ ఫ్యాన్లు వాడటం వల్ల కూడా ఆత్మహత్యలను చాలా వరకు నియంత్రించవచ్చు.
అలాగే పేదలకు నగదు బదిలీ చేయడం ద్వారానూ ఆత్మహత్యలను నివారించవచ్చు. బ్రెజిల్‌లో 60 శాతం, ఇండోనేషియాలో 20 శాతం ఆత్మహత్యలు ఈ నగదు బదిలీ వల్ల తగ్గుముఖం పట్టినట్లు నిర్థారణ అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇటీవల ఆత్మహత్యల శాతం తగ్గడానికి ఒక ముఖ్య కారణం ‘నగదు బదిలీ’ పథకాలేనని కూడా చెప్పవచ్చు.
మనదేశంలో మొట్టమొదటిసారిగా తమిళనాడు ప్రభుత్వం 18 ఏళ్ల కిందట ప్రవేశపెట్టిన పరీక్షల ఫలితాలు వెలువడిన నెల లోపలే సప్లిమెంటరీ పరీక్షలు పెట్టడమనే విధానం వల్ల విద్యార్ధుల ఆత్మహత్యలు ఆ రాష్ట్రంలో గణనీయంగా తగ్గిపోయాయి. ఈ విధానాన్ని ఇప్పుడు పలు రాష్ట్రాలు అమలు చేయడం ఒక మంచి పరిణామం.
ఆత్మహత్యకు పాల్పడే వారికి ‘ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్’ ఇవ్వాలి. అంటే, వారి బాధలను ఓపిగ్గా వినడం, సానుభూతి చూపించడం, ధైర్యం చెప్పడం, ఓదార్చడం, నీకు మేమున్నాం అనే భరోసా కల్పించడం ద్వారా ఆత్మహత్య ప్రయత్నాలను చాలా వరకు తగ్గించవచ్చు. ప్రభుత్వం ‘జాతీయ ఆత్మహత్య నివారణ’ పథకాన్ని తీసుకురావాలి.
ఇందులో మానసిక నిపుణులనూ, ఉపాధ్యా యులనూ, స్వచ్ఛంద సంస్థలనూ భాగస్వాములను చేసి సమా జంలో ఆత్మహత్యల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రతి పట్టణంలో ఒక ‘సూసైడ్ హెల్ప్‌లైన్’ ఏర్పాటు చేసి అలాంటి తలంపులున్న వారికి తక్షణ సాంత్వన కల్పించే ఏర్పాటు చేయగల్గితే ఈ ఆత్మహత్యా నివారణ దినోత్స వానికి సార్థకత లభించినట్లవుతుంది.
డా‘‘ ఇండ్ల రామసుబ్బారెడ్డి
వ్యాసకర్త ప్రముఖ మానసిక వైద్యులు, రచయిత
మొబైల్: 93481 14948
(సెప్టెంబర్ 10 ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం)
Comments
Please login to add a commentAdd a comment