ఆమెకు నేనంటే ఇష్టం, ఇదేం అభిమానం?! | Adorable Feeling Of Youth On Celebrities | Sakshi
Sakshi News home page

ఆ నవ్వులు నా కోసమే!

Published Thu, Jan 23 2020 3:23 AM | Last Updated on Thu, Jan 23 2020 9:30 AM

Adorable Feeling Of Youth On Celebrities - Sakshi

‘‘ఆమె కళ్లు నన్నే చూస్తున్నాయి. ఆ చిరునవ్వులు నా కోసమే. ఆమెకు నేనంటే ఎంతో ఇష్టం. అందుకే నాకు నచ్చే ఫొటోలనే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తోంది. ఆమె తప్ప మరో ప్రపంచం లేదు. మరికొద్ది రోజుల్లో మేం కలుసుకోబోతున్నాం...’’ ఏ ప్రేమికుడి హృదయ స్పందనో, మరే భగ్నప్రేమికుడి విషాదగాథో కాదిది. ఏడాదిగా ఓ మానసిక జబ్బుతో బాధపడుతున్న ఇంజనీరింగ్‌ విద్యార్థి నిశాంత్‌  (పేరు మార్చాం) దైన్యస్థితి ఇది.  

బేగంపేట్‌కు చెందిన నిశాంత్‌ బాగా చదివేవాడు. తన అభిరుచికి అనుగుణంగానే ఇంజనీరింగ్‌లో చేరాడు. కానీ అతడు ఒక వర్ధమాన నటి (ఒక ప్రముఖ నటుడి కూతురు)పై ఆకర్షితుడయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టే పోస్టింగ్‌లు, ఒకట్రెండు రిప్లైలు చూసి పడిపోయాడు. ఆమెను  అభిమానించాడు. ఆమెపెట్టే ప్రతి పోస్టింగ్‌ తనకోసమే అనుకున్నాడు. నిజానికి వారి మధ్య ఎలాంటి పరిచయం లేదు. ఒకట్రెండు సినిమాల్లో ఆమెను చూసి, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టింగ్‌లు, రిప్లైలకు ఆకర్షితుడయ్యాడు. ఇప్పుడు ఆమే అతడి ప్రపంచమైంది. తన గది ఆమె చిత్రాలతో నిండిపోయింది. ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరం మధ్యలో ఆగిపోయింది. నిశాంత్‌ ‘సెలబ్రిటీ వర్షిప్‌ సిండ్రోమ్‌’ వ్యాధితో బాధపడుతున్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. 
– సాక్షి, హైదరాబాద్‌

నిశాంత్‌ మాత్రమే కాదు. నచ్చిన సినిమా హీరోలను, హీరోయిన్లను, రాజకీయ నాయకులను, ప్రముఖులను అభిమానించడమనే లక్షణం కొంతమందిలో క్రమంగా మానసిక జబ్బుగా మారుతున్నట్లు మానసిక వైద్యనిపుణులు చెబుతున్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌మీడియాలు ఇందుకు వేదికలవుతున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 18–35 ఏళ్లలోపు వయసున్న కొంతమంది యువతలో ఈ తరహా సెలబ్రిటీ వర్షిప్‌ సిండ్రోమ్‌ ఆందోళన కలిగిస్తోందని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్‌ సంహిత తెలిపారు. 

ఇదేం అభిమానం?!
ఒకరిపై ఒకరు అభిమానం కలిగి ఉండడం, నచ్చిన హీరో, హీరోయిన్లను అభిమానించడంలో తప్పు లేదు. కానీ ఇటీవల ఈ అభిమానం నచ్చిన వాళ్లను ఆరాధ్యదైవంగా భావించే స్థితికి వెళ్తోంది. సికింద్రాబాద్‌కు చెందిన డిగ్రీ చదివే అమ్మాయి సోషల్‌ మీడియాలో విరాట్‌కోహ్లీ చిత్రాలను, పోస్టింగ్‌లను చూసి ఆకర్షితురాలైంది. ఒకటి, రెండు రిప్లైలతో విరాట్‌ ప్రపంచంగా బతికేస్తోంది. ఆరు నెలల క్రితం క్రికెట్‌ అంటే ఏంటో తెలియని ఆ అమ్మాయి ఇప్పుడు టీవీకి అతుక్కుపోయి మ్యాచ్‌లు చూస్తోంది. కాలేజీకి వెళ్లడం మానేసింది. తల్లిదండ్రులు ఎందుకలా చేస్తున్నావని నిలదీశారు. ‘విరాట్‌కు తానంటే ఇష్టమని, ఆయన పోస్టింగ్‌లన్నీ తనకోసమేనని’ చెప్పింది.ఆ తల్లిదండ్రులకు కాళ్ల కింద భూమి కదిలినంత పనైంది. నగరానికే చెందిన మరో యువకుడు తాను, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి సొంత అన్నదమ్ములమని, కానీ తనను ఆ కుటుంబం నుంచి వేరు చేశారని ఆందోళన చెందుతున్నాడు. ఆ యువకుడు చిరంజీవి ముఖకవళికలను కలిగి ఉన్నట్లుగా భావించడమే ఇందుకు కారణం.

ఆజ్యం పోస్తోన్న సోషల్‌ మీడియా
ఒక స్వచ్ఛంద సంస్థ అంచనా మేరకు ప్రపంచవ్యాప్తంగా మూడో వంతు యువత ఈ జాఢ్యానికి గురవుతున్నారు. ఫిల్మ్‌హబ్‌లుగా మారిన  హైదరాబాద్‌ వంటి నగరాల్లో ఈ సెలబ్రిటీ వర్షిప్‌ సిండ్రోమ్‌’ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతి 3 వేల మందిలో కనీసం 30 – 40 శాతం మంది  దీనిబారిన పడుతున్నట్లు మానస ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ సంహిత తెలిపారు. ‘‘60 శాతం యువత ఇప్పుడు సోషల్‌ మీడియాకు బానిసగా మారారు. కెరీర్‌ను పాడుచేసుకుంటున్నారు. ఐడెంటిటీ క్రైసిస్‌తో బాధపడుతూ మానసిక రోగులుగా మారుతున్నారు. ఇలాంటి లక్షణాలను తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తొలిదశలోనే గుర్తిస్తే తక్కువ ప్రమాదంతో బయటపడవచ్చు’’ అని ఆమె సూచించారు. 

అభిమానం.. మూడు దశలు
- మొదటిది సోషల్‌ లెవల్‌. ఈ స్థాయిలో ‘బాగుంది’ అనే మెచ్చుకోలు మాత్రమే ఉంటుంది. 
- రెండోది పర్సనల్‌ లెవెల్‌. ఈ దశలో తమకు నచ్చిన సెలబ్రిటీతో ఒక బంధాన్ని ఏర్పర్చుకుంటారు. 
మూడోది పాథలాజికల్‌ లేదా సైకోటిక్‌ దశ. ఈ దశలో తమ అభిమాన సెలబ్రిటీని పూజిస్తారు. ఆ సెలబ్రిటీయే వారి ప్రపంచమవుతుంది. నిరంతరం వారి ధ్యాసే ఉంటుంది. వారి కోసం టాటూలు వేసుకుంటారు. చెవికి రింగులు కుట్టించుకుంటారు. ఆ సెలబ్రిటీ ప్రతి కదలిక తమ కోసమేనని భావించి మమేకమైపోతారు. వాస్తవ పరిస్థితి నుంచి ఒక ఊహా ప్రపంచం (ఫాంటసీ)లోకి వెళ్లిపోతారు. ఈ దశలో మెదడులోని డొపమైన్‌ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ‘‘ఈ ఫాంటసీతో పాటు, డిప్రెషన్, యాంగై్జటీ వంటి లక్షణాలు కూడా పెరుగుతాయి’’ అని ప్రముఖ సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ సంగిశెట్టి సతీష్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement