మీ అమ్మాయికి మంచిమార్కులు వస్తాయి! | Your child will get good marks | Sakshi
Sakshi News home page

మీ అమ్మాయికి మంచిమార్కులు వస్తాయి!

Published Wed, Jan 16 2019 11:34 PM | Last Updated on Thu, Jan 17 2019 12:47 PM

Your child will get good marks - Sakshi

కొండ ఎక్కాలంటే ఏం చెయ్యాలి?దేవుణ్ని మనసులో పెట్టుకోవాలి.అప్పుడు మెట్లు కనిపించవు. దీవెనలే కనిపిస్తాయి. జీవితంలో పిల్లలకు కష్టాలు.. కష్టమైన మెట్లు.ప్రతిసారీ తోడుగా మనం ఉండలేం. కానీ.. లక్ష్యసాధనలో ఆనందాన్ని వాళ్లకు చూపగలిగితే పరీక్షలు కనబడవు. మంచి మార్కులే కనిపిస్తాయి. 

సైకియాట్రిస్ట్‌ దగ్గర ఆ అమ్మాయి కూచుని ఉంది.పదహారేళ్లు ఉంటాయి. తోడుగా అమ్మా నాన్నా ఉన్నారు.‘ఏంటి ప్రాబ్లమ్‌?’ అడిగాడు సైకియాట్రిస్ట్‌.‘బాగా చదువుతుంది డాక్టర్‌. ఎమ్‌సెట్‌లో మెడిసిన్‌ ర్యాంక్‌ కొట్టాలని లక్ష్యం. కాలేజీలో స్లిప్‌ టెస్ట్‌లు, వీక్లీ టెస్టుల్లో తనే ఫస్ట్‌ ఉంటుంది. తనకో మంచి ఫ్రెండ్‌ కూడా ఉంది. ఆ అమ్మాయి కూడా బ్రైట్‌ స్టూడెంటే. కాని ఈ మధ్య ఒకటి రెండు టెస్టుల్లో ర్యాంకులు రాలేదు. దాంతో విపరీతంగా ఏడ్వడం మొదలెట్టింది. కాన్ఫిడెన్స్‌ పోయింది. అది పక్కన పెట్టండి. ర్యాంకులు తనఫ్రెండ్‌కు వచ్చాయట. పాపం ఆ అమ్మాయిని శతృవుగా చూస్తోంది. దూరం పెడుతోంది. అంతా గందరగోళంగా తయారైంది బిహేవియర్‌.

మీరే హెల్ప్‌ చేయాలి’సైకియాట్రిస్ట్‌ ఆ అమ్మాయివైపు చూశాడు. ‘ఏమ్మా... ఏంటి నీ సమస్య’ఆ అమ్మాయి వెక్కివెక్కి ఏడ్వడం మొదలెట్టింది.‘నా పని అయిపోయింది డాక్టర్‌. ఇక నాకు ర్యాంకులు రావు. నేను మెడిసిన్‌ చేయనట్టే. రెండు మూడు టెస్టుల్లో నాకు మంచి మార్కులు రాలేదంటే ఇక ఎప్పటికీ రావనేగా అర్థం’...సైకియాట్రిస్ట్‌ ‘ఏం పిల్లలో’ అన్నట్టుగా నిశ్వాస విడిచాడు.‘సరే అయితే నీకు ఇంకో అమ్మాయి కథ చెబుతా. నా పేషెంటే. అది విని నీకేం అనిపించిందో చెప్పు’ అన్నాడు. సైకియాట్రిస్ట్‌ చెప్పడం మొదలుపెట్టాడు. ∙∙ ఇది నీలవేణి కథ.నీలవేణిది విజయవాడ దగ్గర చిన్న పల్లెటూరు. చిన్నప్పుడు అందరిలాగే ఆడుతూ పాడుతూ ఉండేది. అమ్మా నాన్నలతో హాయిగా ఉండేది. కాని ఆ అమ్మాయికి ఎనిమిదేళ్ల వయసు వచ్చినప్పుడు సడన్‌గా ఒక ప్రమాదంలో అమ్మా నాన్నా చనిపోయారు. చిన్న పిల్ల. ఏమీ తెలియని వయసు.

లాలించే అమ్మ ఆడించే నాన్న ఇక కనపడరు అనంటే ఆ వయసులో ఎంత భయంగా ఉంటుంది. ఎంత భీతిల్లేలా ఉంటుంది. కాని నీలవేణి అంత దుఃఖాన్ని తట్టుకొని నిలబడింది. అమ్మా నాన్నలు లేకపోయినా అమ్మమ్మ, తాతయ్య ఉన్నారనుకుంది. అమ్మమ్మ, తాతయ్యలు కూడా ఆ పాపను అంతే ప్రేమగా చూసుకున్నారు. నీలవేణికి చదువు పెద్దగా రాలేదు. కాని నీలవేణికి జీవితంలో ఏదైనా సాధించాలని పట్టుదల. చదువు రాలేదని ఆ అమ్మాయి కుంగిపోలేదు. నిరాశ పడలేదు. ఆ అమ్మాయిది గట్టి వొళ్లు. చరుగ్గా ఉంటుంది. అందుకని ఆటల్లోకి వెళ్లింది. లాంగ్‌జంప్‌ తన ఫేవరెట్‌ గేమ్‌. పల్లెటూరి స్కూల్లో లాంగ్‌జంప్‌లో రాణిస్తున్న నీలవేణిని హైస్కూల్లో ఒకరిద్దరు టీచర్లు ఎంకరేజ్‌ చేశారు. జిల్లాస్థాయి ప్లేయర్‌ అయ్యింది. ఊళ్లో గుర్తింపు పొందింది.

అందరూ మెచ్చుకునేవారు.∙∙ ‘చూశావా? నీలవేణి ఎక్కడా కుంగిపోకుండా ఎలా సెకండ్‌ చాన్స్‌ తీసుకొని పైకి వచ్చిందో’ అన్నాడు సైకియాట్రిస్ట్‌.ర్యాంకు రాని అమ్మాయి తల ఊపింది.‘కథ ఇంకా అయిపోలేదు’ అన్నాడు సైకియాట్రిస్ట్‌.∙∙ నీలవేణి కథ కొనసాగింపు.నీలవేణి ఆ ఊళ్లోనే ఉన్న జూనియర్‌కాలేజీలో చేరింది. అలాంటి కాలేజీల్లో చదువు సరిగ్గా రాకపోయినా ఆటల్లో రాణించే మగపిల్లలు ఉంటారు. అలాంటి అబ్బాయే రాజు. అతడు లాంగ్‌జంప్‌ కోసం వచ్చే నీలవేణిలోని టాలెంట్‌ను గమనించాడు. అదే కాలేజ్‌లో ఉన్న ఫిజికల్‌ డైరెక్టర్‌తో కలిసి నీలవేణిని ఎంకరేజ్‌ చేయడం మొదలెట్టాడు. లాంగ్‌జంప్‌తో పాటు హైజంప్, పోల్‌జంప్, రన్నింగ్‌... అన్నింటిలోనూ నీలవేణి పార్టిసిపేట్‌ చేసేలా చేశాడు. నీలవేణి ఇప్పుడు స్టేట్‌లెవల్‌ అడపాదడపా నేషనల్‌ లెవల్‌ మెడల్స్‌ సాధించడం మొదలెట్టింది.

ఇక భవిష్యత్తంతా నీలవేణిదే అనిపించే సమయం. సరిగ్గా ఆ సమయంలో ఊహించని సంఘటన. విజయవాడలో ఒక స్పోర్ట్స్‌ మీట్‌కు హాజరయ్యి తిరిగి ఊరికి వస్తుండగా రాజు, నీలవేణి ప్రయాణిస్తున్న షేర్‌ ఆటోను వెనుక నుంచి లారీ గుద్దింది. రాజు ఎడమ వైపున పొదల్లో పడగా నీలవేణి కుడివైపు రోడ్డు మధ్యలో పడింది. అప్పుడే వేగంగా వస్తున్న కారు ఆ అమ్మాయి కాళ్లను తొక్కేసింది.∙∙ వింటున్న అమ్మాయి ఉలిక్కి పడి చూసింది.సైకియాట్రిస్ట్‌ ఆ అమ్మాయి వైపు చూస్తూ నీలవేణి కథ కొనసాగించాడు. ∙∙ ఏ కాళ్లతోనైతే నీలవేణి ఇంత గుర్తింపు తెచ్చుకుందో ఏ కాళ్లతోనైతే తన భవిష్యత్తును నిర్మించుకుందో ఆ కాళ్లు తీసేయక తప్పదు అని డాక్టర్లు నిర్ణయించి నీలవేణి స్పృహలో లేని సమయంలో కాళ్లు తీసేశారు. స్పృహలోకి వచ్చాక పేషెంట్‌ షాక్‌లోకి వెళ్లకుండా బ్యాండేజీలతోనే కృత్రిమ రూపాన్ని చుట్టి కాళ్లు ఉన్నాయన్న భ్రాంతి సృష్టించారు.

ఆరువారాల వరకు నీలవేణికి తనకు కాళ్లు లేవన్న సంగతే తెలియదు. ఒకరోజు తెలిసింది. భూమి ఆకాశాలు చీకటితో నిండిపోయాయన్న భావన వచ్చింది. అలాంటి స్థితి వస్తే ఎవరైనా కుంగిపోతారు. నీలవేణి కూడా కుంగిపోయింది. కాని ఆ ప్రమాదం కంటే పెద్ద దెబ్బ రాజు తీశాడు. అంతవరకూ పలకరించే కుర్రాడు, అంతవరకూ తోడు నిలుస్తాడనుకున్న స్నేహితుడు తప్పించుకు తిరగడం ప్రారంభించాడు. ఇటు ఆ దెబ్బ అటు ఈ దెబ్బ... నీలవేణి తట్టుకొని నిలబడగలదా?కాని నిలబడింది. జీవితం అంటే అనూహ్యంగా ఉంటుందని, కాని మనం జీవితానికి లొంగ కుండా ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉండాలని నమ్మింది.

అందుకోసం ఆత్మస్థయిర్యం కోసం సైకియాట్రిస్ట్‌ దగ్గర కౌన్సిలింగ్‌ తీసుకుంది.నూరేళ్ల జీవితంలో ఇవాళ్టి ఘటనలు, రేపటి ఘటనలే మొత్తం జీవితం కాబోవని ఎన్నో అవకాశాలు ఊహించని మలుపులు మున్ముందు ప్రతి ఒక్కరికీ ఎప్పుడూ ఉంటాయని సైకియాట్రిస్ట్‌ చెప్పిన మాటలను మనసులోకి తీసుకుంది.ఆమె గురించి తెలిసిన వాళ్లందరూ ఆమెకు సాయం చేశారు. విదేశాల నుంచి కృత్రిమ కాళ్లు తెప్పించారు. ఆటల్లో పాల్గొనే వీలున్న ఆ కృత్రిమకాళ్లతో నీలవేణి మళ్లీ ప్రాక్టీసు మొదలెట్టింది. మొదట్లో కొంచెం కష్టమైంది. ఆ తర్వాత వీలైంది. నీలవేణి క్షణం కూడా ఆలస్యం చేయకుండా నిపుణుల పర్యవేక్షణలో తిరిగి ప్రాక్టీసు మొదలెట్టింది.కాళ్లు బాగుంటే ఆమెకు ఒలింపిక్స్‌లో పాల్గొనాలనే కోరిక ఉండేది.కాళ్లు పోయాక కూడా ఒలింపిక్స్‌లో పాల్గొనగలిగింది.

కాకపోతే పారా ఒలింపిక్స్‌లో. ఆరు మెడల్స్‌ వచ్చాయి కూడా. ∙∙ సైకియాట్రిస్ట్‌ చెప్పడం ఆపి తన సెల్‌ఫోన్‌లో నుంచి నీలవేణి ఫొటో చూపించాడు. మెడలో మెడల్స్‌తో నవ్వుతూ ఉన్న నీలవేణి.‘కథ ఇంకా అయిపోలేదు. నీలవేణిని విడిచిపెట్టి వెళ్లిన రాజు తిరిగి వచ్చాడు. క్షమించమని కోరుకున్నాడు. ఇక ఎప్పటికీ నీలవేణి తోడు విడువనని చెప్పాడు. సాధారణంగా ఇంకో అమ్మాయి అయితే అతణ్ణి అసహ్యించుకునేది. కాని నీలవేణి మాత్రం– దివ్యాంగులను ఎలాగైతే ఎక్కువ ప్రేమతో చూడాలో తప్పు చేసినవారిని కూడా ఎక్కువ ప్రేమతో చూసి వారిని మంచి మార్గంలో పెట్టాలి అని అతణ్ణి యాక్సెప్ట్‌ చేసింది. ఇప్పుడు చెప్పు.

నీ సమస్య ఒక సమస్యా. నీ పని అయిపోయినట్టేనా? నీలవేణిలాంటి వాళ్లను చూసి మనం ఎప్పుడూ పోరాడుతూ ఉండాలని సాటి స్నేహితులను వదిలిపెట్టకుండా ముందుకు వెళ్లాలని అనిపించడం లేదా’ అన్నాడు సైకియాట్రిస్ట్‌.మార్కులు రాని అమ్మాయి సిగ్గుపడుతూ తల ఆడించింది.నిటారుగా కూర్చుంది. ‘ఇంకో సిట్టింగ్‌’... అని తల్లి అంటూ ఉంటే ‘అక్కర్లేదు’ అని ఆ అమ్మాయే చెప్పింది.లేచి నిలబడుతూ ‘థ్యాంక్స్‌ అంకుల్‌. నీలవేణికి కూడా నా థ్యాంక్స్‌ చెప్పండి’ అంది కొంచెం నవ్వుతూ.సైకియాట్రిస్ట్‌ కూడా నవ్వుతూ తర్వాతి పేషెంట్‌ కోసం బెల్‌ నొక్కాడు.

కథనం: సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్‌: డాక్టర్‌ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement