పెళ్లి చెడగొట్టాను...
కనువిప్పు
వయసు వేడిలో తెలిసో తెలియకో తప్పులు చేస్తుంటాం. ‘నేను చేసింది తప్పు’ అని గ్రహించి కొందరు ఆలస్యంగానైనా తప్పు సరిదిద్దుకుంటారు. కొందరు మాత్రం ఏవో కారణాల వల్ల తప్పు సరిదిద్దుకోక...జీవితాంతం పశ్చాత్తాపంతో కుమిలిపోతుంటారు. చేసిన తప్పును సరిదిద్దుకోవడం వల్ల నేను కుమిలిపోవాల్సిన అవసరం రాలేదు.
అసలు ఏం జరిగిందంటే...
డిగ్రీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయితో నాకు తరచుగా గొడవ అయ్యేది. ఒకసారి నా గురించి వాళ్ల అన్నయ్యకు చెప్పడంతో నా దగ్గరకు వచ్చి బెదిరించే ప్రయత్నాలేవో చేశాడు. అప్పుడు నేను అన్నాను-
‘‘మీ చెల్లి గురించి, నా గురించి కాలేజీలో ఎంక్వైరీ చేయండి. ఎవరు ఎలాంటి వాళ్లో తెలుస్తుంది’’ అన్నాను ఆవేశంగా. ‘‘మా చెల్లి చేసిన తప్పేమిటి?’’ అన్నాడు ఆయన.
‘‘తన ఫ్రెండ్స్‌తో కలిసి అందరినీ కామెంట్ చేస్తుంది’’ అని చెప్పాను. ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ‘‘గొడవలు పడకండి. స్నేహంగా ఉండండి’’ అని మాత్రం చెప్పాడు.
రెండు రోజుల తరువాత మళ్లీ మామూలే. నేను నల్లగా ఉంటాను. నన్ను చూసినప్పుడల్లా ‘తారు డబ్బా’ అని ఎటువైపో చూస్తూ అరిచేది. అలా ఆ అమ్మాయి మీద ద్వేషం పెరిగింది. ఆమె పెళ్లి కుదిరిందనే విషయం తెలిసి కాబోయే వరుడికి పెద్ద ఉత్తరం రాశాను. ‘‘నీకు కాబోయే భార్య నేను ప్రేమించుకున్నాం’’ అనేది దాని సారాంశం. దీంతో పెళ్లి క్యాన్సిల్ అయింది. అమ్మాయి వాళ్ల నాన్న ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆ విషయం తెలిసి ‘‘నేను మనిషినా?’’ అని నన్ను నేను తిట్టుకున్నాను. అప్పటికప్పుడు అమ్మాయి వాళ్ల ఇంటికి వెళ్లి ‘‘తప్పు చేశాను. క్షమించండి. ఇదే విషయం ఆ అబ్బాయితో కూడా చెబుతాను. కోపంతో రాశాను. అందులో ఎలాంటి నిజమూ లేదు. మీరు ఎలాంటి శిక్ష విధించినా భరిస్తాను’’ అన్నాను. నిజానికి వాళ్లు నన్ను ఎముకల్లో సున్నం లేకుండా కొట్టినా భరించాలని సిద్ధపడ్డాను. కానీ వాళ్లు నన్ను క్షమించారు. పశ్చాత్తాపంతో నా మనసుకు ప్రశాంతంగా అనిపించింది.
- కెఎన్‌వి, వరంగల్