పల్లెల వాకిట్లో మానసిక చీకట్లు! | Mental Disorders Spread To Villages | Sakshi
Sakshi News home page

పల్లెల వాకిట్లో మానసిక చీకట్లు!

Published Mon, Oct 21 2019 4:24 AM | Last Updated on Mon, Oct 21 2019 4:24 AM

Mental Disorders Spread To Villages - Sakshi

సాక్షి, అమరావతి: ప్రశాంతతకు నిలయాలైన పల్లెల్లో ఇప్పుడు మానసిక అశాంతి అలజడి సృష్టిస్తోందనడానికి పై రెండు కేసులు ఉదాహరణలు. రక్తపోటు, మధుమేహానికి తోడు తాజాగా మానసిక సమస్యలూ ఇప్పుడు గ్రామసీమల్లో చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు పట్టణాలు, నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ పోకడ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ పాకుతోందని.. ఇది ప్రమాదకర సంకేతమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. నగరాలు, పట్టణాల్లోని ఆధునిక జీవనశైలి పల్లెలపైనా పెనుప్రభావం చూపుతున్నాయంటున్నారు. సాధారణంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు జ్వరాలు వంటి చిన్నచిన్న సమస్యలకు వస్తుంటారు. కానీ, గత కొంతకాలంగా మానసిక సమస్యలతో వస్తున్న వారు ఎక్కువగా ఉంటుండడంతో ప్రభుత్వాస్పత్రుల్లో ఇటీవల స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. ఇందులో గ్రామీణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు విస్తుపోయేలా ఉన్నాయి.

రకరకాల మానసిక రుగ్మతలున్న వారు వేలాది మంది ఉన్నట్లు బయటపడింది. వీటిలో స్క్రీజోఫీనియా, డిప్రెషన్‌ (కుంగుబాటు), తనలో తాను మాట్లాడుకోవడం, ఎక్కువగా మాట్లాడడం, అకస్మాత్తుగా తీవ్రంగా స్పందించడం (మానిక్‌ డిజార్డర్స్‌) వంటి మానసిక రోగాలతో సతమతమవుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. రాష్ట్రంలో ఇలా బాధపడుతున్న వారిలో ప్రకాశం జిల్లా వాసులు అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానంలో అనంతపురం, నెల్లూరు, విశాఖ, ప.గోదావరి జిల్లాల పల్లెవాసులు ఉన్నారు. సగటున చూస్తే పురుషుల్లోనే ఈ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇదిలా ఉంటే.. వీరికి సరైన వైద్యం అందించేందుకు అవసరమైన క్లినికల్‌ సైకియాట్రిస్టులు రాష్ట్రంలో కరువయ్యారు. దేశవ్యాప్తంగా వీరు 5,500 మంది ఉంటే రాష్ట్రంలో కేవలం 150 మంది మాత్రమే ఉన్నారు.

 2 దశాబ్దాల్లో పెనుమార్పులు
కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడం, సామాజిక మాధ్యమాల వలలో పడిపోవడంవల్ల ఒంటరితనం బాగా పెరిగిపోతోంది. దీంతో మానసిక ఒత్తిడికి లోనై తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రెండు దశాబ్దాల కిందట ఈ పరిస్థితి లేదు. యువకుల్లో మద్యం, మత్తు మందు వినియోగం పెరగడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. దీనివల్ల బలవన్మరణాలు ఎక్కువవుతున్నాయి. మెంటల్‌ హెల్త్‌ను కాపాడుకోవాలంటే ప్రత్యేక యంత్రాంగాన్ని తయారు చేసుకోవాల్సి ఉంది.
– డా. ఇండ్ల రామసుబ్బారెడ్డి, మానసిక
వైద్య నిపుణులు, విజయవాడ

తల్లిదండ్రుల తీరూ కారణమే
తల్లిదండ్రుల పెంపకం కూడా సరిగ్గాలేక పెడదారి పడుతున్న వారూ ఉన్నారు.  సెల్‌ఫోన్‌ను బాగా వాడే చిన్నారిని చూసి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. ఇది సరికాదు. పిల్లలు ఏ దారిలో వెళ్లాలో తల్లిదండ్రులే తికమక పెడుతున్నారు. చదువు నుంచి స్థిరపడే వరకూ ఇదే పరిస్థితి ఉంది. వీటన్నింటికీ మించి మన విద్యావిధానం వల్ల పిల్లలపై ఎంత ఒత్తిడి ఉందో అందరికీ తెలిసిందే.
– డా. మురళీకృష్ణ, ప్రొఫెసర్‌ ఆఫ్‌
సైకియాట్రీ, గుంటూరు ప్రభుత్వాసుపత్రి

►ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన వెంకట సుబ్బయ్యకు 38 ఏళ్లు. ఓ కిరాణాషాపులో పనిచేస్తాడు. పిల్లల చదువులకు తన సంపాదన ఏమాత్రం సరిపోకపోవడంతో తీవ్రంగా మథనపడుతున్నాడు. ఒక్కోసారి తనలో తానే గొణుక్కోవడం, ఎవరితో మాట్లాడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుండడంతో కుటుంబ సభ్యులు అతన్ని దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఇదొక రకమైన మానసిక జబ్బు అని, దీనిని ప్రాథమిక దశలో గుర్తిస్తే మెరుగైన ఫలితం ఉండేదని డాక్టర్లు అభిప్రాయపడ్డారు.

►శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన 33 ఏళ్ల మనోహర్‌ ఇంట్లో ఎప్పుడెలా వ్యవహరిస్తాడో తెలీదు. ఒక్కోసారి బాగా ఉంటాడు. మరోసారి అకస్మాత్తుగా తీవ్రంగా స్పందిస్తాడు. ఇంట్లోని వారు అతన్ని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. కుటుంబ సమాచారం అంతా డాక్టర్‌ తెలుసుకుని మానసిక జబ్బుల్లో ఒకటైన స్క్రిజోఫీనియాతో రోగి బాధపడుతున్నాడని చెప్పారు. భార్యతో సరిగ్గా పొసగకపోవడం ప్రధాన కారణంగా ఆయన తేల్చారు.

మానసిక రుగ్మతలకు వైద్యులు చెబుతున్న కారణాలు..
►కుటుంబ వ్యవస్థ చిన్నదిగా మారడం.. చదువులు, ఉద్యోగాల పేరిట పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉండటం..

►మద్యం వినియోగంతో పెరుగుతున్న సమస్యలు

గ్రామాల్లో ఆరేళ్ల నుంచి 45 ఏళ్లలోపు వారిపై సామాజిక మాధ్యమాలు, మితిమీరిన సినిమాలు, టీవీల  ప్రభావం ఎక్కువగా ఉండటం..

ఉద్యోగాల్లోనూ ఒత్తిడి కారణంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు.. విడిపోవడం కారణంగా మానసిక ఆందోళన పెరగడం.. ఈ ప్రభావం గ్రామాల్లో ఉండే తల్లిదండ్రులపై పడడం..

ఉద్యోగరీత్యా గ్రామీణ యువకులు విదేశాలకు వెళ్లడంవల్ల సొంతూళ్ల్లలోని తల్లిదండ్రుల్లో మానసిక ఆందోళన..

ఆధునిక జీవనశైలి కారణంగా యుక్త వయసులోనే మానసిక సమస్యలకు గురవడం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement