
అనంతపురం నగరంలో బీకాం చదువుతున్న ఓ యువకుడికి వారం రోజుల క్రితం మతి మరుపు సమస్య వచ్చింది. తల్లిదండ్రులు అతడిని సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లగా.. తీవ్ర మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టు గుర్తించారు. మొబైల్ ఫోన్‌కు బానిసై అన్నీ మరచిపోయాడని తెలిపారు.
ఇటీవల గుంతకల్లుకు చెందిన ఓ యువతి మూడు దఫాలు ఆత్మహత్యాయత్నం చేసింది. వైద్యుడి వద్దకు ఆమెను తీసుకెళ్లగా.. మానసికంగా కుంగిపోయి ఉందని ఆయన తెలిపారు. చదువులో ఒత్తిడి భరించలేక ఇలా అయిందని చెప్పారు. వీరిద్దరే కాదు.. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారి సంఖ్య ఉమ్మడి జిల్లాలో ఇటీవల భారీగా పెరిగింది.
గత కొన్ని నెలలుగా వివిధ ప్రాంతాల్లో ఎన్‌హెచ్‌ఎం (జాతీయ హెల్త్ మిషన్) అధికారులు చేపట్టిన పరిశీలనలో ‘మతి’పోయే విషయాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి అనంతపురం జిల్లా గత కొన్ని సంవత్సరాలుగా జబ్బులకు అడ్డాగా మారుతున్నట్టు తేలింది.
ఇప్పటికే మధుమేహం, రక్తపోటు బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా మూడో యముడు అన్నట్టు మానసిక రుగ్మతలు తీవ్రంగా వేధిస్తున్నాయి. దశాబ్దం క్రితం వరకూ పట్టణాలకే పరిమితమైన మానసిక రుగ్మతలు పల్లెటూళ్లకూ పాకాయి. ఈ జబ్బు బారిన పడుతున్న వారు తీవ్ర నిరాశ నిస్పృహల్లో కూరుకుపోతున్నారు.
15 వేల మంది బాధితులు..
బీపీ, మధుమేహం కంటే కూడా మానసిక రుగ్మతను అత్యంత ప్రమాదంగా పరిగణిస్తారు. అలాంటి తీవ్ర మానసిక రుగ్మత బాధితులు ఉమ్మడి జిల్లాలో 15 వేల మంది ఉన్నట్టు అంచనా. మరో లక్ష మంది వరకూ సాధారణ, మోస్తరు మానసిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు.
ప్రభావం తక్కువగా ఉన్నప్పుడే కౌన్సెలింగ్ లేదా మందులు ఇప్పిస్తే తీవ్ర రుగ్మతగా మారే అవకాశం ఉండదు. కానీ బాధితులకు అవగాహన లేకపోవడం వల్ల వ్యాధి ముదిరే వరకూ వైద్యులను సంప్రదించకపోవడం గమనార్హం.
15 వేల మందికి మందులే లేవు..
గతంలో ‘వైఎస్సార్ ఆరోగ్య సురక్ష’, ఏఎన్‌ఎంల ఇంటింటి సర్వే, 104 వాహనాల్లో పరీక్షలు తదితర కార్యక్రమాల వల్ల వ్యాధుల బాధితులను వేగంగా గుర్తించేవారు. ఇంటి వద్దే ఉచితంగా మందులిచ్చే వారు. అయితే, గత ఆరు మాసాల నుంచి మెంటల్ హెల్త్ పేషెంట్లకు ఒక్క మాత్ర కూడా అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని బాధితులు మందులు వాడక, జబ్బు ముదిరి పూర్తి మానసిక వైకల్యానికి గురవుతున్నారు.
రుగ్మతలకు కారణాలివే..
మితిమీరిన ఒత్తిడి కారణంగా చాలామంది మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు.
మొబైల్ ఫోన్‌లకు బానిస కావడంతో ప్రపంచమే అదే అనుకుని దాని మత్తులోకి వెళ్లిపోతున్నారు.
సామాజిక మాధ్యమాల్లో వస్తున్న రకరకాల రీల్స్, న్యూస్ చూస్తూ తమలో తామే ఊహించుకుని మానసికంగా కుంగిపోతున్నారు.
కొంతమంది విద్యార్థులు చదువుల ఒత్తిడి కారణంగా డిప్రెషన్‌లోకి జారుకుంటున్నారు.
రకరకాల బెట్టింగ్‌లు, ఆర్థిక కారణాలతో తీవ్ర మానసిక రోగానికి గురవుతున్నారు.
ఇటీవల కాలంలో లోన్‌యాప్‌ల ఒత్తిళ్లతో మానసిక స్థైర్యం కోల్పోతున్నారు.
చాలా మందికి అవగాహన లేదు
వ్యాధి ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడే గుర్తిస్తే నయం చేసుకోవచ్చు. కానీ చాలామందిలో అవగాహన లేక జబ్బు ముదిరే వరకూ జాగ్రత్త పడటం లేదు. ఆల్కహాల్, డ్రగ్స్‌కు బానిసలవుతూ మానసికంగా ఇబ్బంది పడుతున్న వారు ఇటీవల ఎక్కువయ్యారు. – డా.విశ్వనాథరెడ్డి, మానసిక వైద్య నిపుణులు, ఎన్‌హెచ్‌ఎం
(చదవండి: ప్రధాని మోదీకి మఖానా దండతో స్వాగతం..! 300 రోజులు ఆ సూపర్ ఫుడ్‌తో..)
Comments
Please login to add a commentAdd a comment