mental disorders
-
కిన్‌సుగీ.. ఫెయిల్యూర్స్‌ని అంగీకరించే ఒక సక్సెస్ స్టోరీ!
శోభనా సమర్థ్.. ఒకప్పటి బాలీవుడ్ నటి, దర్శకురాలు, నిర్మాత. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ యాక్ట్రెస్ కాజోల్‌కి అమ్మమ్మ. ఒకసారి కాజోల్.. వాళ్లమ్మమ్మ బుగ్గలు పట్టుకుని ‘అమ్మమ్మా.. ఎంతందంగా ఉంటావే!’ అంటూ ముద్దు చేసిందట. ‘కారణమేంటో తెలుసా?’ అని అడిగిందట అమ్మమ్మ. ‘తెలీదు.. చెప్పూ’ అందట కాజోల్. ‘వికారంగా ఉన్న ఈ ముక్కే’ అందట అమ్మమ్మ తన ముక్కును చూపిస్తూ. అవాక్కయిందట మనవరాలు. ‘ఈ చిన్న ఇంపర్ఫెక్షనే లేకపోతే నేనసలు అందంగా కనిపించేదాన్నే కాను’ అందట చిన్నగా తలెగరేస్తూ! ఆ ఆత్మవిశ్వాసానికి అబ్బురపడుతూ కాజోల్.. వాళ్లమ్మమ్మ మొహంలోకి పరిశీలనగా చూసిందట మొదటిసారి. నిజమే ఆవిడ చెప్పినట్టుగా ఆమె మొహానికి ముక్కే మైనస్ అని గ్రహించిదట కాజోల్. ‘అలా ఎలా మేనేజ్ చేశావ్ అమ్మమ్మా’ అని అడిగిందట ఆశ్చర్యపోతూ! ‘మేనేజ్ చేయలేదు. యాక్సెప్ట్ చేశా. నా ముక్కును. ఇంపర్ఫెక్షన్ మేక్ యూ మోస్ట్ బ్యూటిఫుల్ అని నమ్మాను.అంతే నా అందంలో ముక్కూ అమరింది. నా అభినయంలో పార్ట్ అయింది’ అని చెప్పిందట. అక్కడితో ఆ సీన్ ఎండ్ అవలేదు. మనవరాలి తెరంగేట్రానికి బోలెడు స్ఫూర్తినిచ్చింది. అమ్మమ్మ మాటనే ఆచరణలో పెట్టి.. ఇంపర్ఫెక్షన్ని పర్ఫెక్ట్గా యాక్సెప్ట్ చేసే వారసత్వాన్ని పంచింది. ఎలాగంటే.. కాజోల్ రెండు కనుబొమలు కలుసుకుంటాయి. జీవితంలో దీన్ని దురదృష్టానికి ముడిపెడితే.. స్క్రీన్ మీద లుక్స్‌కి లంకె పెట్టారు. యూనీబ్రోతో స్క్రీన్ అపియరెన్స్ బాలేదు.. థ్రెడింగ్ చేయించుకో అని కాజోల్ ఆప్తుల నుంచి దర్శకనిర్మాతల దాకా అందరి దగ్గర్నుంచీ ఒత్తిడి వచ్చింది ఆమెకు. కానీ అమ్మమ్మ చెప్పిన మాటను మరచిపోలేదు కాజోల్. ఆచరణలో పెట్టింది. వేషాలు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు కానీ థ్రెడింగ్ ముచ్చటే లేదు అని తెగేసి చెప్పింది. సణుగుతునే వేషాలు ఇచ్చారు. హిట్ అయింది. ఆ యూనిబ్రో ఆమె యూనిక్ స్టయిల్ అయింది. తర్వాత ఎందరో అమ్మాయిలు ఆ స్టయిల్‌ను ఫాలో అయ్యేలా చేసింది. శారీరక లోపాన్ని అందంగా మలచుకోవడం అంటే ఇదే! ∙∙ ఒక అజేయుడి గురించీ చెప్పాలి. బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకోసారి గుర్తు చేసుకుందాం. అతను ఈతగాడు. పేరు మైఖేల్ ఫెల్ప్స్. అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెడ్డీ) బాధితుడు. ఈతలో ఎవరూ పోటీపడలేనంత ముందుకు వెళ్లాడు. విషయం ఏంటంటే చిన్నప్పుడు అంటే మైఖేల్‌కి ఏడేళ్లున్నప్పుడు మొహానికి తడి తిగిలితే చాలు చిరాకుపడిపోయేవాడట. వాళ్లమ్మ డెబ్బీ ఫెల్ప్స్ అబ్బాయిని స్విమ్మింగ్ పూల్‌లోకి తోస్తే మొహానికి తడి అంటకుండా ఈదడం నేర్చుకున్నాడట. కానీ దేనిమీదా ఏకాగ్రత ఉండేది కాదు. ఇల్లు పీకి పందిరేయడంలో దిట్ట. స్కూల్ నుంచీ మైఖేల్ మీద బోలెడు కంప్లయిట్స్ వచ్చేవి.. బాబు దేని మీద ఫోకస్ చేయట్లేదు అంటూ! అసలు వీడి ప్రాబ్లం ఏంటీ అని వాళ్లమ్మ.. కొడుకును డాక్టర్ దగ్గరకు తీసుకెళితే.. అప్పుడు తేలింది మైఖేల్‌కి ఏడీహెచ్‌డీ ప్రాబ్లం ఉందని! ఆనాటికి అతని వయసు 9 ఏళ్లు. చదువంటే ఇష్టపడేవాడు కాదు. కొడుకు సమస్య ఏంటో అమ్మకు తెలిసింది. ఏది చేయలేడో దాన్ని వదిలేసింది. చేయగల దాని మీద దృష్టి పెట్టింది. అప్పుడు గ్రహించింది.. స్విమ్మింగ్ పూల్‌లో గంటలు గంటలు ఈతకొట్టగలడని. ఫోకస్ లేని ఆ మైండ్‌ని దార్లో పెట్టేది నీళ్లే అని అర్థమైంది ఆమెకు. పిల్లాడికున్న ఏడీహెచ్‌డీని జయించడానికి ఈతను మించిన ఆయుధం లేదని ఫిక్స్ అయిపోయింది. ఫలితం..ఒలింపిక్స్‌లో 28 పతకాలు (అందులో 23 బంగారు పతకాలే), 7 వరల్డ్ రికార్డులు. మానసిక లోపాన్ని జయించడం అంటే ఇదే! ∙∙ వీటిని గెలుపు గాథలుగా వివరించ లేదు. లోపాలను గ్రహించి.. వాస్తవాన్ని అంగీకరించి.. వాటిని తమకు అనుకూలంగా మలచుకుని వాటితోనే జీవితాన్ని ఆస్వాదించి ఆనందంగా సాగిన వ్యక్తులను పరిచయం చేశాం. అనుభవంలోకి వచ్చిన పరిస్థితులను ఒప్పుకోవడానికి చాలా శక్తి కావాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? మనలో ఉన్న ఇతర పాజిటివ్ కోణాల నుంచి! ఎప్పుడైతే మనలోని మైనస్‌నే ప్రపంచం చూస్తూ పాయింట్ అవుట్ చేస్తుందో అప్పుడు మనకు ఈ స్ట్రెంత్ అవసరం అవుతుంది. ఆ మైనస్‌ను మెదడు అట్టడుగుపొరల్లోకి నెట్టేసి.. అట్టడుగున ఉన్న ప్లస్‌ని బయటకు తెచ్చి ప్రపంచం ఫోకస్‌ను ఆ పాజిటివ్ పాయింట్ మీదకు మరల్చాలంటే ముందు మైనస్‌ను అంగీకరించగలగాలి గౌరవంగా! ఇదే ఇంపర్ఫెక్షన్ని శక్తిగా మలచుకోవడమంటే! దీన్నే జపాన్‌లో కిన్‌సుగీ అంటారు. వైఫల్యంతో సఫలమవడమెలాగో నేర్పించడమే దాని తత్వం. ఫ్యాట్ లుక్‌తోనే హిట్స్ ఇచ్చి ట్రెండ్‌సెట్ చేసింది! జీరో సైజ్ ట్రెండ్‌గా ఉన్న బాలీవుడ్లో తన ఫ్యాట్ లుక్‌తోనే హిట్స్ ఇచ్చి ఆ ట్రెండ్‌ని మార్చేసింది విద్యాబాలన్. ‘లావు కదా.. మోడరన్ డ్రెసెస్ అంతగా సెట్ కావు ఆమెకు’ అంటూ పెదవి విరుస్తున్న ఇండస్ట్రీలో చీరల్లోనే కనిపిస్తూ నటననే కాదు గ్లామర్‌నూ పండించింది. వాస్తవానికి బ్యూటీ ఎక్స్‌పర్ట్‌ల అభిప్రాయం ప్రకారం విద్యాబాలన్.. ఇంపర్ఫెక్షన్ల పుట్ట. హార్మోన్ అసమతుల్యత వల్ల ఆమెకు సమస్యలు వచ్చాయి. వాటిని బహిరంగంగానే చెప్పింది. తను ఎలా ఉందో అలాగే స్క్రీన్ మీద కనిపిస్తోంది.. మేకప్తోగానీ.. సర్జరీలతోగానీ కరెక్షన్స్‌కు వెళ్లకుండా! ఫర్ఫెక్షన్కి కొలమానం లేదు పర్ఫెక్షన్ అనేదానికి ప్రామాణికం లేదు. ఒకరికి పర్ఫెక్ట్గా అనిపించింది మరొకరికి అనిపించకపోవచ్చు. అందుకే ఎవరి ప్రమాణాలనో ప్రామాణికంగా తీసుకుని పర్ఫెక్షన్ అనే మాయలో పడను. నా శరీరాకృతి విషయంలో చాలా విమర్శలనే ఎదుర్కొన్నాను. నా మీద నాకు ప్రేమ ఎక్కువే. ఆత్మవిశ్వాసమూ అంతకంటే ఎక్కువే. అందుకే నన్ను నేను కాన్ఫిడెంట్‌గా క్యారీ చేసి విమర్శించిన వాళ్లచేతే గ్లామర్ క్వీన్‌గా మెప్పు పొందాను అని అంటోంది ఇలియానా. వాల్ట్ డిస్నీ.. అతని కెరీర్ మొదట్లో ‘క్రియేటివిటీ లేదు.. పాడు లేదు.. నువ్వు పనికిరావు పో’ అన్నారట. ఆరోజు అతను ఆ మాటను పట్టించుకుని కుంగిపోయుంటే ఈ రోజు ప్రతి తరంలోని పిల్లలు సంతోషంతో పరవళ్లు తొక్కే మిక్కీ మౌస్, డొనాల్డ్ డక్ క్యారెక్టర్స్ పుట్టేవే కావు. కేట్ బాస్వర్త్ ఈ అమెరికన్ నటికి జన్యపరమైన కారణాల వల్ల ఒక కనుపాప తేనె రంగులో, ఇంకో కనుపాప నీలం రంగులో ఉంటాయి. ఆ లోపాన్నే గ్లామర్ ప్రపంచంలో తన ప్రత్యేకతగా చాటుకుంది. ‘ద గోల్డెన్ గర్ల్ ఆఫ్ వెల్నెస్’ కాన్‌డీస్ కూమై గురించి నాలుగు మాటలు.. ‘కిన్‌సుగీ వెల్నెస్ ద జపనీస్ ఆర్ట్ ఆఫ్ నరిషింగ్ మైండ్, బాడీ అండ్ స్పిరిట్’ రచయిత కాన్‌డీస్ కూమై స్వస్థలం అమెరికాలోని కాలిఫోర్నియా. తల్లి జపాన్ దేశస్థురాలు. తండ్రి అమెరికాలో స్థిరపడిన పోలండ్ దేశస్థుడు. ఈ నేపథ్యం వల్ల అమెరికాలో కూమై చాలా వివక్షనే ఎదుర్కొంది. కిన్‌సుగీని ప్రాక్టీస్ చేయడం వల్లే తట్టుకుని నిలబడగలిగాను అని చెబుతుంది. కూమై.. షెఫ్‌గా చాలా ప్రసిద్ధి. మాజీ మోడల్, రచయిత, జర్నలిస్ట్, ఆర్ట్ డైరెక్టర్, పాడ్‌కాస్ట్ హోస్ట్, ఫొటోగ్రాఫర్ కూడా! ప్రముఖ ఎల్ మ్యాగజైన్ ఆమెకు ‘ద గోల్డెన్ గర్ల్ ఆఫ్ వెల్నెస్’ అనే బిరుదునిచ్చింది పూర్వాపరాల్లోకి వెళితే.. నిజానికి కిన్‌సుగీ అనేది ఒక కళ. ఆర్ట్ ఆఫ్ రిపేర్. కిన్‌సుగీ అంటే గోల్డెన్ రిపేర్ లేదా గోల్డెన్ జాయినరీ. పగిలిపోయిన పింగాణీ పాత్రలను బంగారు లేదా వెండి వర్ణంతో అతికించే కళ. పగిలిపోయినవాటిని అతికిస్తే అవి మునుపటి రూపానికి రావు. ఆ పగుళ్లు సన్నగా.. ఎగుడు దిగుడుగా కనిపిస్తాయి. కాబట్టి ఆ అతుకును బంగారం, వెండి లేదా ప్లాటినం ద్రావకాలతో అద్దుతారు. దాంతో ఆ పాటరీ ఆ అతుకులతోనే అందంగా.. ఆకర్షణీయంగా.. ప్రత్యేకంగా కనిపిస్తుంది. కిన్‌సుగీని జలపాతాలు.. నదులు.. మైదానాలతో పోలుస్తారు. ఎందుకంటే అవి రకరకాల రూపాల్లోకి ఒదుగుతూ అందంగా కనిపిస్తుంటాయి కదా! ఈ కళ.. ‘మొత్తైనై’ అంటే ‘అయ్యో వృథా అయిపోయిందే’.. ‘ముషిన్’ అంటే ‘మార్పును అంగీకరించడం’ అనే భావనల్లోంచి పుట్టింది అని చెబుతారు. అందుకే మూలం కన్నా కొత్తగా.. అరుదైన అందమైన దాన్నిగా మలచే కళగా కిన్‌సుగీ విరాజిల్లుతోంది. ఈ కళ ఎప్పుడు మొదలైంది? 15వ శతాబ్దంలో మొదలైంది. అషికాగా యోషిమాసా అనే సైనికాధికారి చైనా నుంచి పింగాణీ టీ పాత్రను తెప్పించుకున్నాడు. అందంగా ఉండే ఆ పాత్ర అంటే అతనికి ఎంతో ఇష్టం. ఒకసారి అది అతని చేతిలోంచి జారి కిందపడి పగిలిపోయింది. దాన్ని అతికించివ్వమని చైనాకు పంపాడు. అతికించి చైనీయులు తిరిగి పంపారు. అష్టవంకరలు కనిపించేలా అతికించిన ఆ పాత్రను చూసి ఏడ్చినంత పనిచేశాడట అషికాగా యోషిమాసా. తమ దగ్గరున్న కళాకారులను పిలిచి.. ఆ టీ పాత్రను చూపిస్తూ.. ‘మీరేం చేస్తారో తెలియదు.. ఈ అతుకులకు కొత్తందం తీసుకురావాలి’ అని ఆజ్ఞాపించాడట. చిత్తమంటూ వాళ్లు చిత్తగించి.. రకరకాల ప్రయోగాలు చేసి.. చివరకు బంగారు ద్రావకంతో ఆ పగుళ్లను అద్దారు. అంతే ఆ పాత్ర ప్రత్యేక అందాన్ని సంతరించుకుంది. దాన్ని చూసిన అషికాగా యోషిమాసా మొహంలో ఆనందం పరచుకుంది. అప్పటి నుంచి ఆ అద్దకం ఆర్ట్‌గా మారింది. తర్వాత కాలంలో ఆ కళను జీవితానికీ అన్వయించుకోవడం మొదలుపెట్టారు జపనీయులు. అనుభవంలోకి వచ్చిన పరిస్థితులు.. బాధలను విశ్లేషించుకోసాగారు. ఆ విశ్లేషణ వాళ్లను వాస్తవాన్నించి పారిపోకుండా.. అంగీకరించి ముందుకు కదిలే స్థైర్యాన్నిచ్చింది. అలా భయంలోంచి ధైర్యానికి సాగుతున్న ఆ ప్రయాణంలో దాగున్న ఆనందాన్ని పట్టుకున్నారు వాళ్లు. ఆస్వాదించడం ప్రారంభించారు. దాంతో సమస్యలను చూసే వాళ్ల దృష్టికోణమే మారిపోయింది. ఇది కదా బతకడం అంటే అనే గ్రహింపుకి వచ్చేశారు. అదిగో అప్పుడే కిన్‌సుగీ ఓ తత్వంగానూ మారి స్థిరపడింది. లోపాలను స్వీకరించి.. వాటిని అందంగా మలచుకుని ఆత్మవిశ్వాసంతో సాగిపోవడమే ఈ జీవన కళ ఉద్దేశం. లోపాలు వరాలు ఎవరమైనా పర్ఫెక్షన్ కోసమే పాకులాడుతాం. అహాన్ని సంతృప్తిపరచుకోవడానికో.. కీర్తి కోసమో.. ఆరోగ్యం విషయంలోనో ఆ పర్ఫెక్షన్ని సాధించాలనుకుంటాం. జీవితంలో ఉత్కృష్టమైన వాటి గురించే కథలుగా చెప్పుకుంటాం. కానీ వైఫల్యాలను చెప్పుకోం. బలహీనతలను బయటపెట్టుకోం. తప్పులను దాచేస్తాం. బంధాలు.. అనుబంధాల్లోని అరమరికలను ఒప్పుకోం. ఎవరూ ఎందులోనూ పర్ఫెక్ట్ కాదు అనే నిజం తెలిసినా నిర్లక్ష్యం చేస్తాం. అసలు తప్పులు చేయడంలో.. తప్పుగా ప్రవర్తించడంలోనే అందరం ఎక్స్పర్ట్స్మి. ప్రశంసించాల్సింది ప్రతిభను కాదు. బలహీనతలను.. గాయాల తాలూకు మచ్చలను.. పొరపాట్లను చూపించుకునేందుకు చేస్తున్న ధైర్యాన్ని మెచ్చుకోవాలి. కానీ ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తాం. ఎదుటి వాళ్లను చూసి ప్రమాణాలను ఏర్పరచుకుంటాం. ప్రతికూల ఫలితాలకు భయపడతాం. మంచి, చెడు ఏ అనుభవమైనా అక్కరకొచ్చేదే. ఏదీ వృథా కాదు. కాస్త మనసుపెడితే లోపాలు.. వైఫల్యాలు వరాలుగా తోస్తాయి. ఫెయిల్యూర్స్ మన ఆత్మస్థైర్యాన్ని వెలికితీస్తాయి.. మరింత శక్తిమంతంగా నిలబెడతాయి. పింగాణీ పాత్ర పగులుకు ఎలాగైతే బంగారు ద్రావకంతో మెరుగులు పెడతారో అలాగన్నమాట. అందుకే లోపాలు వరాలు అంటున్నది. ఫెయిల్యూర్‌తో వక్తిత్వవికాసం జరుగుతుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ విజయాన్ని మించిన కిక్‌నిస్తుంది. దాన్ని ఆస్వాదించాలి.. అనుభవించాలి అని చెబుతుంది ఆర్ట్ ఆఫ్ హీలింగ్.. కిన్‌సుగీ. పర్ఫెక్షన్ వెంట పరుగులు పెట్టిన చాలామంది కిన్‌సుగీని లోతుగా అధ్యయనం చేశారు. ఆ అధ్యయనం.. తమ పరుగుకు అర్థంలేదని తేల్చింది. దాంతో ఆ పరుగును ఆపి కిన్‌సుగీని ప్రాక్టీస్ చేయసాగారు. వాళ్లలో కాన్‌డీస్ కూమై ఒకరు. న్యూయార్క్వాసి అయిన ఆమె కిన్‌సుగీ మీద ఆసక్తితో జపాన్ వెళ్లి అక్కడ కొన్నాళ్లుండి కిన్‌సుగీని ఔపోసన పట్టింది. ‘కిన్‌సుగీ వెల్నెస్ ద జపనీస్ ఆర్ట్ ఆఫ్ నరిషింగ్ మైండ్, బాడీ అండ్ స్పిరిట్’ అనే పుస్తకం రాసింది. అందులో.. ఒత్తిడిలేకుండా జీవితాన్ని హాయిగా ఆస్వాదించే టెక్నిక్స్ కొన్నింటిని విశదపరచింది. అవేంటో చూద్దాం.. వాబి సాబి జపాన్ భాషలో వాబి అంటే ఏకాంతం.. లేదా ఒంటరితనం. సాబి అంటే వెళ్లే సమయం. ఈ రెండూ కలసి.. మనలోని మంచి, చెడులను మనమెట్లా అంగీకరించాలి.. వాటితో మన జీవితాన్ని ఎలా పరిపుష్టం చేసుకోవాలో చెబుతాయి. ఒక్కమాటలో.. వాబి సాబి అంటే మన లోపాల్లోని అందాన్ని ఆస్వాంచమని అర్థం. జీవితమంతా పర్ఫెక్ట్ ఫ్రేమ్‌లో సాగడం అసాధ్యం. మన బలహీనతలను తెలుసుకోవడం అంటే మన శక్తిసామర్థ్యాలను సెలబ్రేట్ చేసుకోవడమే. ఈ సానుకూల దృక్ఫథమే జీవితాన్ని సరళం చేస్తుంది. జీవితాన్ని ప్రేమించేలా చేస్తుంది. మన మీద మనకు నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచుతుంది. ఇదే వాబి సాబి సారాంశం. గామన్ .. అంటే స్థితప్రజ్ఞత. తుఫాను వచ్చినా.. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నా సంయమనం కోల్పోకుండా.. ప్రశాంత చిత్తంతో ఉండడం. ఆవేశం ఆవహించకుండా చూసుకోవడం. దైనందిన జీవితంలో ఎదురయ్యే ఒత్తిడికి మనం స్పందించే తీరుతోనే దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. పొద్దస్తమానం ప్రతికూల పరిస్థితుల గురించి ఆలోచించకుండా సానుకూల పరిస్థితుల మీద దృష్టి పెట్టడం మంచిదని వివరిస్తుంది గామన్. యూయిమారు వ్యక్తిగత సంబంధాలు, పరస్పర సహాయసహకారాలు ఎంత అవసరమో చెబుతుంది. మన అనుబంధాల్లోని గాఢత మీదే మనకు దొరికే సహానుభూతి ఆధారపడి ఉంటుంది. మన ఆప్తులు, సన్నిహితుల పట్ల మనం శ్రద్ధ కనబరిస్తే వాళ్లూ మన పట్ల శ్రద్ధ కనబరుస్తారు అంటుంది కిన్సుగీలో భాగమైన యూయిమారు. సింపుల్‌గా ఇచ్చిపుచ్చుకోవడమే! యొషోకు.. అంటే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ, సౌండ్ బాడీ త్రూ సౌండ్ మైండ్ .. అన్నమాట. మెదడు నిరంతరం ఆరోగ్యకరమైన ఆలోచనలు చేస్తుంటేనే దాన్ని కలిగిన శరీరం ఆరోగ్యంగా.. దృఢంగా ఉంటుందనేది యొషోకు మంత్రం. ఏరకమైన ఆహారం తీసుకుంటున్నామనే దాని మీదే మైండ్, బాడీ కనెక్షన్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి సాత్వికమైన పౌష్టికాహారాన్ని తీసుకుంటే అదే స్థాయిలో మెదడు ఆలోచనలు అద్భుతంగా సాగుతాయి. శరీరమూ అంతే పాజిటివ్‌నెస్‌తో స్పందిస్తుంది. కన్షా.. అంటే మన అహాన్ని వీడడం.. అనుభవాలను మళ్లీ పేర్చుకోవడం! జీవితంలోని మంచి, చెడులు.. రెండింటినీ సమంగా స్వీకరించి, రెండింటికీ సమంగా కృతజ్ఞత తెలపాలంటుంది కన్షా. కిన్సుగీలో అత్యంత ప్రధానమైన అంశం ఇదే! కృతజ్ఞత ప్రాక్టీస్ చేయడం అంటే వర్తమానంలో బతకడం. లేని వాటి గురించి ఆలోచించకపోవడం.. కోరుకోకపోవడం! వీటితో మన మెదడుకు కేవలం సానుకూలతలనే చూడమనే సంకేతాలను ఇవ్వడం. ప్రతి చర్యకు ఓ కారణం ఉంటుంది. ఎలాంటి సమస్యకైనా ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ కారణం.. ఆ ఉద్దేశం మనల్ని మరింత శక్తిమంతంగా.. ఉన్నతంగా తీర్చిదిద్దాలి! ఇలా పుస్తకంలోనే కాదు జీవితంలోనూ అనుసరిస్తున్న ఈ కిన్‌సుగీ వెల్నెస్ టెక్నిక్స్ గురించి కూమై పాడ్కాస్ట్నూ నిర్వహిస్తోంది. ఆ శ్రవణమాధ్యమానికి ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాకమైన శ్రోతలున్నారు. చివరగా.. అదృష్టాదృష్టాలనే మాట లేకుండా.. బలాలు బలహీనతలతో సహా ఉన్నదున్నట్లుగా జీవితాన్ని అంగీకరించడం.. సుఖదుఃఖాలను సమంగా తీసుకోవడం.. అడ్డంకులను శక్తికి కొలమానంగా భావించడం, ఓటమిలోంచి గెలుపుకి దారి వేసుకోవడమనే తత్వాన్ని ఒంటబట్టించుకోవడమంటే సాధుపుంగవులుగా మరడమని కాదు. చేతుల్లో లేని వాటిని .. సరిచేయలేని వాటిని మెదడులో మోసే పనిపెట్టుకోవద్దని. చేయగలిగే వాటి మీదే మెదడు పెట్టమని. పోటీలు, పోల్చుకోవడాలు, ఒత్తిళ్లు, అంచనాలు, విఫలయత్నాలు, అసంతృప్తులు, కలలు, కల్లలు వంటివన్నీ ఆ ప్రాక్టీస్‌ని మన దరి చేరనీయకపోవచ్చు. భయం మన లోపాలను భూతద్దంలో చూపిస్తుండొచ్చు. ఆ భూతద్దాన్ని బ్రేక్ చేస్తే భయం అర్థం కోల్పోతుంది. అప్పుడు గెలుపు.. ఒటమి రెండూ సమంగా కనపడతాయి. బతుకు విలువ తెలుస్తుంది. మనకు కావల్సింది ఆ భూతద్దాన్ని పగలగొట్టే పరికరం. అదే ఈ కిన్‌సుగీ. బ్రేక్ చేసి ప్రాక్టీస్ చేయడమే ఆలస్యం! (చదవండి: నిండు గర్భిణి మళయాళ టీవీ నటి మృతి..ఆ టైంలో కూడా గుండె సమస్యలు వస్తాయా?) -
ఒంటరితనం వేధిస్తుందా? మానసిక ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలి?
రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్) జోడెద్దులా పల్లెల్లో సవారీ చేస్తుండగా.. ఇప్పుడు మానసిక రుగ్మతలూ వెంటాడుతున్నాయి. నిన్నా మొన్నటిదాకా పట్టణాలు, నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ పోకడ తాజాగా గ్రామీణ ప్రాంతాలకూ తాకడం ప్రమాదకర సంకేతాలు ఇస్తున్నట్టే అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలి కాలంలో మానసిక ఇబ్బందులతో వస్తున్న వారు ఎక్కువయ్యారని వైద్యులు తెలియజేస్తున్నారు. మెంటల్ హెల్త్ ప్రోగ్రాం స్క్రీనింగ్ పరీక్షల్లో తేలిందని వారు పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో రకరకాల మానసిక రుగ్మతలతో ఇబ్బంది పడుతున్న వారు వేలాదిమంది ఉన్నట్టు బయటపడింది. స్క్రిజోఫ్రీనియా, డిప్రెషన్, మూడ్ డిజార్డర్స్ వంటి మానసిక జబ్బులతో సతమతమవుతున్నారు. సగటున చూస్తే పురుషుల్లోనే ఎక్కువ మంది బాధితులున్నట్టు వెల్లడైంది. స్కిజోఫ్రీనియా..యాంగ్జైటీలే ఎక్కువగా.. స్కిజోఫ్రీనియా (మనో వైకల్యం), యాంగ్జైటీ (ఆందోళన) ఎక్కువ మందిలో ఉన్నాయి. ప్రతి దానికీ డీలా పడిపోవడం, ఏమవుతుందోనని భయం, ఆందోళన వంటి జబ్బులతో సతమతమవుతున్నారు. వైద్యుల వద్దకు చికిత్సకు వెళ్లాలంటే కూడా ఆత్మన్యూనతగా భావిస్తున్నారు. ఇలాంటి మానసిక వ్యాధులు దీర్ఘకాలికంగా ఉండటంతో వృత్తిపరంగానూ ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇండోనేషియలో స్కిజోఫ్రెనియా కేసులు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇక మనదేశంలో సుమారు 3 మిలియన్ల కంటే ఎక్కువమంది స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్నారు. పనిఒత్తిడి, చిన్నచిన్న విషయాలకే ఆందోళన చెందడం వంటివన్నీ మానిసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. మానసిక రుగ్మతలకు ప్రధాన కారణాలు ► ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్నకుటుంబాలు రావడంతో వేధిస్తున్న ఒంటరితనం. ► ఆరు సంవత్సరాల వయసు నుంచే సామాజిక మాధ్యమాల ప్రభావం ఎక్కువగా ఉండటం. ► మద్యం, ఇతర మత్తుపదార్థాల వినియోగంతో యువకుల్లో మానసిక రుగ్మతలు పెరగడం. ► ప్రైవేటు లేదా కార్పొరేట్ విద్యాసంస్థల్లో విపరీతమైన ఒత్తిడి. ► సాఫ్ట్వేర్, బ్యాంకింగ్ వంటి ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరగడం. ► వ్యాయామం లేకపోవడం వల్ల చిన్న వయసులోనే జీవనశైలి జబ్బులకు గురవడం. ► ఇటీవలి కాలంలో స్మార్ట్ ఫోన్ల ప్రభావంతో చిన్నారుల్లో మానసిక ఎదుగుదల సరిగా లేకపోవడం. ఒత్తిడిని అధిగమిద్దాం ఇలా.. మనుషులు పలు కారణాలతో అనేక రకాల ఒత్తిడులకు గురవుతుంటారు. అవి శారీరక, మానసిక ఒత్తిడి అని రెండు రకాలుంటాయి. ఆరోగ్యం కాపాడుకుంటే శారీరక ఒత్తిడిని జయించవచ్చు. మిత ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం, నిత్యం యోగా చేయడం, వృత్తిపరమైన శిక్షణతో మానసిక ఒత్తిడిని అధిగమించొచ్చు. వ్యాపారంలో సరైన లాభాలు రాకపోవడం, అధిక పని, పదోన్నతి లేని ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. చేసే పనిని ప్రేమించాలి. వృత్తిపరంగా గెలుపు, ఓటములు ఉంటాయి. ఓటమిని సవాల్‌గా స్వీకరించి విశ్లేశించుకుని ముందుకెళ్లాలి. స్ఫూర్తిదాయక వ్యక్తుల మధ్య గడపడం, మంచి పుస్తకాలు చదవడం, అనవసర ఆలోచనలు, చికాకులను దూరం పెట్టడం ద్వారా సంతోషమైన జీవితాన్ని గడపాలి. -
సీటు రానివారికి టెలీ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: యూపీఎస్సీ, నీట్, జేఈఈ వంటి ప్రముఖ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో తక్కువ మార్కులొచ్చి ఎంబీబీఎస్, ఐఐటీ వంటి వాటిల్లో సీటు రాని వారికి మానసిక చికిత్స అందజేసేందుకు 24 గంటల టెలీ కౌన్సెలింగ్‌ను ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. ఆయా పరీక్షలు రాసి కొద్ది మార్కులతో సీట్లు కోల్పోతున్నవారు అనేకమంది ఉంటున్నారు. వీరిలో కొందరు మానసిక కుంగుబాటుకు గురవుతున్నారు. కొందరు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘మానసిక ఆరోగ్యం.. వర్తమాన పరిస్థితుల్లో దాని నిర్వహణ’అనే అంశంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఓ నివేదిక తయారు చేసి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు అందజేసింది. వివరాలిలా ఉన్నాయి.. ఆత్మహత్యలు 10 శాతానికి తగ్గాలి పాఠశాలల్లోనూ మానసికంగా కుంగిపోయే విద్యార్థుల కోసం కౌన్సిలర్లను నియమించాలి. ప్రస్తుతం జరుగుతున్న ఆత్మహత్యల సంఖ్యను 2030 నాటికి 10 శాతానికి తగ్గించాలి. కేంద్రీకృత సెంట్రల్ మెంటల్ హెల్త్ అథారిటీ, స్టేట్ మెంటల్ హెల్త్ అథారిటీలను ఏర్పాటు చేయాలి. జైళ్లల్లోనూ మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. మానసిక ఆరోగ్య, సమస్యలను ఆరోగ్య బీమాలో చేర్చాలి. దేశంలో 47 మానసిక చికిత్సాలయాలున్నాయి. అయితే 2017లో ఏర్పాటైన మానసిక ఆరోగ్య చట్టానికి అనుగుణంగా అవి లేవు. ఆ మేరకు వాటిని తీర్చిదిద్దాలి. ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ మెంటల్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. మానసిక చికిత్సకు సంబంధించిన 17 రకాల మందులను ధరల నియంత్రణ పరిధిలోకి తీసుకొచ్చారు. అవన్నీ మెడికల్ కాలేజీలు, జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో ఉన్నాయి. వాటిల్లో కనీసం 13 మందులను ప్రాథమిక ఆసుపత్రి స్థాయికి తీసుకురావాలి. పోలియో చుక్కల ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు సినీ తారలు, క్రీడాకారుల వంటి ప్రముఖులతో ప్రచారం చేస్తారు. అలాగే మానసిక సమస్యలకు సంబంధించి కూడా ఆయా రంగాల ప్రముఖులను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించి అవగాహన పెంచాలి. నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలు.. స్వయం ఉపాధి పొందుతున్నవారిలోనే ఎక్కువగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. తర్వాత వేతన జీవులు, నిరుద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, ప్రైవేట్ రంగం, రైతుల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. 2021లో స్వయం ఉపాధికి చెందిన వారి లో 20,237 మంది ఆత్మహత్య చేసుకు న్నారు. వేతన జీవులు 15,870, నిరుద్యోగులు 13,714, విద్యార్థులు 13,089, వ్యా పారస్తులు 12,055, ప్రైవేట్‌రంగ ఉద్యోగులు 11,439, రైతులు 5,318, కూలీలు 5,563 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కోవిడ్ తర్వాత మానసిక సమస్యలు 28% పెరిగాయి. 2017లో 1.29 లక్షల మంది ఆత్మహత్య చేసుకుంటే, 2021లో 1.64 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆల్కహాల్ వల్ల 4.7 శాతం మంది, పొగాకు వల్ల 20.9 శాతం మంది మానసిక సమస్యలకు గురవుతున్నారు. డిప్రెషన్, ఉద్వేగాలు, ఇతరత్రా కారణాలతో 10.9 శాతం మందికి సమస్యలు వస్తున్నాయి. తీవ్రమైన స్కిజోఫ్రేనియా వంటి సమస్యలతో 1.4 శాతం, యాంగ్జయిటీతో 3.2 శాతం, స్ట్రెస్‌తో 3.7 శాతం, ఇతరత్రా ఏదో ఒక మానసిక సమస్యతో 13.7 శాతం బాధపడుతున్నారు. దేశంలో లక్ష జనాభాకు 0.75 మంది మానసిక చికిత్స నిపుణులు ఉన్నారు. అంటే 1.34 లక్షల మంది జనాభాకు ఒక మానసిక చికిత్స నిపుణుడు మాత్రమే ఉన్నారు. ప్రపంచ సగటు 1.7గా ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో లక్షకు 8.6 మంది మానసిక నిపుణులు ఉన్నారు. . ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్న బడ్జెట్లో రెండు శాతమే మానసిక ఆరోగ్యంపై ఖర్చు చేస్తున్నారు. దీన్ని 10 శాతానికి పెంచాలని ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇక మానసిక రోగుల్లో 85 శాతం మందికి తగిన వైద్యం అందడం లేదు. మానసిక చికిత్సలను ఆయుర్వేద, యోగా పరిధిలోకి తీసుకురావాలి. జిల్లా కేంద్రంగా మానసిక వైద్యం ఉండాలి. మానసిక రోగుల్లో అవగాహన పెంచాలి జిల్లాకొక యువ స్పందన కార్యక్రమం పెట్టి 20 మందిని రిక్రూట్ చేసుకొని ప్రజల్లో మానసిక రోగాలపై అవగాహన పెంచాలి. బ్రిక్స్ దేశాల్లోని దక్షిణాఫ్రికాలో 35.8 శాతం మంది మానసిక సమస్యలున్నవారే. మన దేశంలో 30.1 శాతం మంది ఏదో ఒక మానసిక సమస్యలతో ఉన్నారు. – డాక్టర్ కిరణ్ మాదల,ఐఎంఏ, సైంటిఫిక్ కమిటీ కన్వీనర్ -
దురలవాట్లకు బానిసలుగా చేసే యాంగ్జైటీ.. తేలికగా అధిగమించండిలా..!
యాంగ్జైటీ అందరిలోనూ ఉంటుంది. ఆఫీస్‌లో అధికారులు నిర్ణయించిన లక్ష్యాలు సాధించలేమేమో అని, చేపట్టిన ఫలానా పని విజయవంతమవుతుందో లేదో అని, ఏదైనా కొత్త ప్రదేశంలో నెగ్గుకువస్తామా అని... ఇలా ప్రతి విషయంలోనూ అందరిలోనూ ఈ యాంగై్జటీ కలుగుతుంది. అయితే అందరిలోనూ కలిగే ఈ భావోద్వేగాలనూ, ఉద్విగ్నతలను కొంతమంది తేలిగ్గా అదుపు చేసుకుంటారుగానీ... మరికొందరు అంత తేలిగ్గా అధిగమించలేరు. దాంతో యాంగై్జటీ వల్ల కలుగుతున్న ఉద్విగ్న స్థితిని ఎలా అదుపు చేయాలో తెలియక కొందరు ఆ స్థితిని అధిగమించడం కోసం తొలుత సిగరెట్‌ను ఆశ్రయిస్తారు. ఆ తర్వాత మరొక దురలవాటైన మద్యం. ఇంకొందరు ఎప్పుడూ పొగాకు నములుతూ ఉండే జర్దా, ఖైనీ, పాన్‌మసాలా వంటివాటికి అలవాటు పడి నోటి క్యాన్సర్లు, గొంతు క్యాన్సర్లకు గురవుతుంటారు. కొందరు పాత అలవాట్లు వదులుకునేందుకు కొత్త అలవాట్ల బాట పడుతుంటారు. ఇది మరీ ప్రమాదం. ఇది డ్రగ్స్ వంటి ప్రమాదకరమైన అలవాట్లకు దారి తీస్తుంది. అలా పొగాకు నమలడం, పొగతాగడం, మద్యంతో పాటు మరికొద్దిమందిలో మాదకద్రవ్యాల వంటి దురలవాట్లకు బానిసలై తమ కాలేయాలూ, మూత్రపిండాలను పాడుచేసుకుంటారు. యాంగ్జైటీని అధిగమించలేకపోగా... చివరకు లివరూ, కిడ్నీలు దెబ్బతింటాయి. ఆరోగ్యమంతా పాడైపోతుంది. అందుకే యాంగై్జటీకి లోనయ్యేవారు, దాన్ని అధిగమించడానికి అన్నిటికంటే మంచిదీ, తేలికైన మార్గం పుస్తకాలతో పరిచయం. పుస్తకాలు ఎక్కువగా చదవడం వల్ల... అనేక పరిస్థితులతో మానసికంగా పరిచయం కావడం వల్ల తాము ఎదుర్కొన్న పరిస్థితి పెద్దగా కొత్తగా అనిపించదు. దాంతో యాంగై్జటీ తగ్గడానికి అవకాశాలు ఎక్కువ. అదేగాక... యోగా, ధాన్యం, మంచి మంచి హాబీల వంటి తేలిక మార్గాలతోనూ అధిగమించవచ్చు. -
మానసిక రుగ్మతలను ముందే గుర్తించాలి
సాక్షి, హైదరాబాద్: మానసిక రుగ్మతలను ముందే గుర్తించి చికిత్స అందిస్తే తీవ్ర పరిణామాలను నివారించగలమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ విభాగం 7వ వార్షిక సదస్సును శనివారం ఆమె రాజ్‌భవన్ నుంచి వర్చువల్‌గా ప్రారం భించి మాట్లాడారు. దేశంలో ప్రతీ ఆరుగురిలో ఒకరు మానసిక సమస్యలతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్–19 తర్వాత ఈ రుగ్మతలు ఎక్కువయ్యాయని తెలిపారు. మానసిక సమస్యల వల్ల దేశం 2012–30 మధ్య కాలం లో 1.3 ట్రిలియన్ డాలర్లను నష్టపోనుందని గవర్నర్ ఓ సర్వేను ఉటంకించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మానసిక సమస్యల పట్ల అందరూ అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. మానసిక రుగ్మతలతో బాధపడే వ్యక్తులను చిన్నచూపు చూడవద్దని, వారిపట్ల వివక్ష ప్రదర్శించవద్దని కోరారు. మానసిక సమస్యల గురించి కొందరు ప్రముఖులు బహిరంగంగా మాట్లాడి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని గవర్నర్ అభినందించారు. -
మతి చెడగొడుతున్న సెల్‌ఫోన్
సాక్షి, అమరావతి: ‘‘దేశవ్యాప్తంగా మానసిక జబ్బుల తీవ్రత పెరుగుతోంది. ఇది వర్తమానానికే కాదు భవిష్యత్‌కూ పెద్ద ప్రమాదమే. సెల్‌ఫోన్ పుణ్యమా అని మెదడు ఉచ్చులో ఇరుక్కుంది. సెల్ఫోన్లో ఏది కనిపిస్తోందో అదే నిజమనుకుంటున్నారు. దీంతో యువత ఆలోచనలు ఎదగకుండా ఆగిపోతున్నాయి. ఎప్పుడైతే భవిష్యత్ ఆగిపోయిందని తెలుసుకున్నారో.. అక్కడ్నుంచే మానసిక ఆందోళనలు మొదలవుతున్నాయి. ఇవి క్రమంగా మానసిక జబ్బులుగా మారి జీవితాన్ని కుచించుకుపోయేలా చేస్తున్నాయి’’ అని అంటున్నారు.. ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, నిమ్హాన్స్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్–బెంగళూరు) మాజీ ప్రొఫెసర్, కేంద్ర ప్రభుత్వంలో పాతికేళ్లపాటు మానసిక జబ్బులపై సేవలందించిన డా.కె.వి.కిషోర్ కుమార్. విజయవాడ వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. మానసిక జబ్బులకు కారణాలనేకం.. 15 నుంచి 45 ఏళ్లలోపు వారు ఎక్కువగా మానసిక జబ్బుల బారిన పడుతున్నారు. వంశపారంపర్యం, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, మద్యం అలవాటే వీటికి కారణం. ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తిస్తే 90 శాతం మందిని సాధారణ స్థితికి తేవచ్చు. ఉమ్మడి కుటుంబాలన్నీ చిన్న కుటుంబాలుగా మారి మానసిక ప్రగతికి బ్రేకులు వేశాయి. చిన్న కుటుంబాల్లో పిల్లలకు తల్లిదండ్రులు ప్రేరణ కావడం లేదు. తోటి స్నేహితులే ప్రేరణగా నిలుస్తున్నారు. వారు మంచివారైతే వీరూ మంచివారవుతున్నారు.. లేదంటే చెడిపోతున్నారు. ఏటా లక్షల్లో పెరుగుతున్నారు.. ప్రపంచవ్యాప్తంగా వ్యాధులకు చేస్తున్న వ్యయంలో 12.5 శాతం మానసిక జబ్బులకే అవుతోంది. మన దేశంలో మానసిక రోగుల కోసం 20 వేల పడకలుంటే.. అందులో 5 వేల మంది పాతికేళ్ల నుంచి అక్కడే ఉంటున్నారు. ఏటా లక్షల్లో రోగులు పెరుగుతున్నారు. చిన్నతనం నుంచే పిల్లల పెరుగుదల, పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రవర్తన, వాతావరణం ఇవన్నీ కీలకం. నాలుగేళ్ల వయసులోనే సెల్‌ఫోన్ వాడకం గురించి తెలుసుకున్న పిల్లలను చూసి తల్లిదండ్రులు.. మా పిల్లలు చాలా గొప్ప అనుకుంటే ఎవరూ ఏమీ చేయలేరు. సెల్ఫోన్ల బారిన 25 ఏళ్ల లోపు యువత వయసు, మనసు, కెరీర్‌పరంగా ఎదిగే క్రమంలో సరిగ్గా 25 ఏళ్లలోపు యువతను సెల్ఫోన్లు నాశనం చేస్తున్నాయి. వారి విలువైన సమయాన్ని హరిస్తున్నాయి. ఆలోచించే సమయాన్ని లాగేసుకుంటున్నాయి. చాలా జాగ్రత్తగా ఉంటే తప్ప వీటి నుంచి బయటపడటం కష్టం. దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా 13.5 శాతం మంది వివిధ మానసిక జబ్బులతో బాధపడుతున్నారు. వీరిలో వెయ్యికి 10 మంది తీవ్ర మానసిక జబ్బులతో కుంగిపోతున్నారు. దీంతో ఒక్కో రోగి వల్ల వారింట్లో నలుగురు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఏ రాష్ట్రంలోనూ ఇంత గొప్పగా లేదు మానసిక జబ్బులతో బాధపడుతూ ఇంట్లో లేకుండా ఆస్పత్రుల్లోనూ, వీధుల్లోనూ ఉంటున్న చాలామందికి చికిత్స చేసి తిరిగి ఇంటికి తేవడమే.. హోం అగైన్. దీనికోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత గొప్పగా మానసిక వ్యాధుల నియంత్రణకు కృషి చేస్తున్నారు. ఈ క్రతువులో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నేను కూడా బనియాన్ ఎన్జీవో సంస్థ ద్వారా కృషి చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఆస్పత్రుల నెట్వర్క్ చాలా బాగుంది. ఐదేళ్లు కష్టపడితే రాష్ట్రంలో 90 శాతం వ్యాధులను నియంత్రించొచ్చు. దీనివల్ల ఆర్థిక భారమూ తగ్గుతుంది. చదవండి: టీచర్ అవతారమెత్తిన కలెక్టర్ నివాస్ చిన్నారులను చెరబట్టాడు.. కోరిక తీర్చుకుని.. -
నొప్పిలేని మరణం ఎలా?
ముంబై/పట్నా: బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణించే సమయంలో తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడినట్లు ముంబై పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ తెలిపారు. ఆత్మహత్యకు ముందు ‘నొప్పి లేకుండా ఎలా చనిపోవాలి? మెంటల్ డిజార్డర్ అంటే ఏమిటి?’ అనే అంశాలపై గూగుల్‌లో పదే పదే సెర్చ్ చేశాడని చెప్పారు. మాజీ మేనేజర్ దిశా షాలియన్ మరణంతో తనకు సంబంధం ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలతో సుశాంత్ కలత చెందాడని వివరించారు. అతడు మరణించిన వెంటనే కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 56 మంది సాక్షుల స్టేట్మెంట్ను రికార్డు చేసినట్లు వెల్లడించారు. విచారణలో భాగంగా ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడి ప్రస్తావన రాలేదన్నారు. సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి ఆయన స్నేహితురాలు రియా చక్రవర్తి ఖాతాలోకి నేరుగా నగదు బదిలీ అయినట్లు ఇంకా తేలలేదన్నారు. సుశాంత్ ఆత్మహత్యపై విచారణ నిమిత్తం బిహార్ ఐపీఎస్ అధికారి ఆదివారం ముంబై చేరుకున్నారు. అయితే ముంబై పోలీసులు ఆయనను బలవంతంగా క్వారంటైన్‌కు పంపించారు. ఈ ఘటనను బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఖండించారు. -
60 ఏళ్ల వయసు దాటిందా..జాగ్రత్త!
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 60 ఏళ్ల వయసు దాటిన వారు మరింత జాగ్రత్తగా ఉండాలని కేంద్రసామాజిక, న్యాయసేవా మంత్రిత్వ శాఖ అధికారులు సూచిస్తున్నారు. 60 ఏళ్లు దాటిన వారు ఎవరూ బయటకు రాకూడదని, అదే విధంగా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారు ఇంట్లో తమ గదిని వదిలి బయటకు అసలు రావద్దని చెప్పారు. ఈ మేరకు సామాజిక, న్యాయసేవ మంత్రిత్వ శాఖ ప్రత్యేక మార్గదర్శకాలను జారీచేసింది. ► 60 ఏళ్ల వయసు దాటి, శ్వాసకోశ, కిడ్నీ, గుండె జబ్బులు, మధుమేహం, హైపర్ టెన్షన్, క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి కరోనా వైరస్ రిస్కు ఎక్కువగా ఉంటుందని గ్రహించాలి ► వీళ్లందరూ ఇంటికి వచ్చే అతిథులను కలవకూడదు ► భౌతిక దూరం పాటిస్తూ..యోగా లాంటి వ్యాయామాలు చేయాలి ► వ్యక్తిగత శుభ్రత బాగా పాటించాలి ► వేడి ఆహారం తీసుకోవడంతో పాటు అందులో పోషకాలు ఉండేలా చూసుకోవాలి ► దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులకు ఫోన్ చేయాలి ► నీళ్లు ఎక్కువగా తాగాలి మానసిక రుగ్మతలు ఉంటే 08046110007 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చెయ్యాలి వీళ్లు ఏమి చేయకూడదంటే.. ► కరోనా వైరస్ లక్షణాలున్న వారిని కలవకూడదు ► ఎవరితోనూ కరచాలనం చేయకుండా ఉండాలి ► జనసమ్మర్థం ఉన్న ప్రాంతాలకు వెళ్లకూడదు ► హారర్ సినిమాలు, బ్రేకింగ్ న్యూస్‌లు చూడకూడదు ► పొగాకు, మద్యం సేవించే అలవాటు ఉంటే తక్షణమే మానేయాలి. -
డాన్స్ డాక్టర్
సంగీతంతో అనారోగ్యాలను నయం చేయవచ్చని అంటుంటారు. మరి నాట్యంతో? సినిమాల్లో అయితే.. చచ్చుపడిపోయిన కాళ్లకు తిరిగి స్పర్శ తెప్పిస్తారు. నిజ జీవితంలో ఈ ప్రశ్నకు సమాధానమే.. ఈ మహిళా డాన్సర్. ఆమె తన నాట్యంతో మానసిక రుగ్మతలను తొలగించే వైద్యాన్ని అందిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా అనుభవించే బాధలకు నృత్య భంగిమలతో చికిత్స చేస్తున్నారు. ఇలా ఎంతోమంది జబ్బులను నయం చేస్తున్న ఆ డాన్స్ డాక్టరే.. ముంబైకి చెందిన రెనెల్ స్నెల్లెక్స్. రెనెల్ స్నెల్లెక్స్ స్కూల్లో చదువుకునే రోజుల్లో ఓ చిత్రమైన విద్యార్థిని. ఎవరితోనూ మాట్లాడేది కాదు. ముభావంగా ఉండేది. నవ్వుతూ, తుళ్లుతూ ఉండాల్సిన వయసులో ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతూ ఉండేది. దీంతో అందరూ రెనెల్‌కు దూరంగా ఉండేవారు. అలా రోజులు గడుపుతూనే కష్టపడి చదివి ఎట్టకేలకు ఓ ఉద్యోగంలో చేరింది రెనెల్. కొన్నేళ్ల తర్వాత ఆ ఉద్యోగం మానేసి, డ్యాన్స్ క్లాస్‌లో చేరింది. అదే ఆమె జీవితంలో మలుపు. అప్పటివరకూ ఎప్పుడు చూసినా కోపంగా కనిపించే ఆమె ముఖంలో తొలిసారి చిరునవ్వు నర్తించడం మొదలైంది. ప్రతి ఒక్కరినీ నవ్వుతూ పలకరించడం ప్రారంభించింది. ఈ మార్పు గమనించి.. ఆమె గురించి తెలిసిన వాళ్లంతా ఆశ్చర్యపోయారు. వాస్తవానికి బాల్యంలో జరిగిన ఓ ఘటనే రెనెల్ వింత ప్రవర్తనకు కారణమని అప్పట్లో ఎవరికీ తెలియదు. బరువైన బాధగా బాల్యం! పదేళ్ల వయసులోనే రెనెల్ లైంగిక వేధింపులకు గురైంది. అయితే దాని గురించి ఎవరితోనూ చెప్పుకోలేకపోయింది. అలా.. తీపి గుర్తుగా ఉండాల్సిన ఆమె బాల్యం ఓ బరువైన బాధగా మారింది. ఉద్యోగంలో చేరాక సైతం ఆ బాధ ఆమెను వదిలిపెట్టలేదు. చనిపోయేదాకా అనుభవించక తప్పదని అనుకునేది. అయితే అనుకోకుండా 2011లో డాన్స్ థెరపీ క్లాస్ గురించి తెలియడంతో అందులో చేరారు రెనెల్. ఈ నిర్ణయం ఆమె జీవితానికి ఆనందం తెచ్చిపెట్టింది. ఆ క్రమంలో డాన్సునే వృత్తిగా ఎంచుకొని, డాన్స్ థెరపీలో డిప్లొమా చేశారు. ఆ తర్వాత ముంబైలో టాటా మోటార్స్ సంస్థతో భాగస్వామ్యం పొంది ‘డాన్స్ మూమెంట్ థెరపీ’ (డీఎమ్‌టీ) సంస్థను ప్రారంభించారు. ఇందులో వివిధ మానసిక రోగాలతో బాధపడేవారికి డాన్స్‌తో వైద్యం చేస్తున్నారు. అంతేకాదు, ప్రత్యేకించి గృహహింస, అత్యాచార సమస్యలను ఎదుర్కొన్న మహిళలు, అక్రమ రవాణాకు చిక్కుకున్న బాలికలను ఆదుకోవడం కోసం కోల్‌కత్తాలోని ఓ స్వచ్ఛంద సంస్థతోనూ కలసి పనిచేస్తున్నారు రెనెల్. ఇప్పటివరకు సుమారు 20 వేల మంది బాధితులకు సాంత్వన చేకూర్చి తిరిగి వారిని మామూలు మనుషులను చేయగలిగారు. రెనెల్ చేసిన ఈ కృషి గురించి ‘ఎమ్జీ చేంజ్ మేకర్స్ సీజన్ 2’లో ప్రసారం అవడంతో దేశంలోని పలు నగరాలకు ఈ డీఎమ్‌టీ సంస్థలు విస్తరించాయి. ఈ విషయమై రెనెల్ మాట్లాడుతూ. ‘‘మనసుకు తగిలిన గాయాలు ఎంత కఠినంగా ఉంటాయో నాకు తెలుసు. అందుకే నా జీవితాన్ని గాయపడినవారికి నయం చేయడానికే అంకితం చేశా..’’ అని అన్నారు. – దీపిక కొండి, సాక్షి స్కూల్ ఎడిషన్ -
పల్లెల వాకిట్లో మానసిక చీకట్లు!
సాక్షి, అమరావతి: ప్రశాంతతకు నిలయాలైన పల్లెల్లో ఇప్పుడు మానసిక అశాంతి అలజడి సృష్టిస్తోందనడానికి పై రెండు కేసులు ఉదాహరణలు. రక్తపోటు, మధుమేహానికి తోడు తాజాగా మానసిక సమస్యలూ ఇప్పుడు గ్రామసీమల్లో చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు పట్టణాలు, నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ పోకడ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ పాకుతోందని.. ఇది ప్రమాదకర సంకేతమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. నగరాలు, పట్టణాల్లోని ఆధునిక జీవనశైలి పల్లెలపైనా పెనుప్రభావం చూపుతున్నాయంటున్నారు. సాధారణంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు జ్వరాలు వంటి చిన్నచిన్న సమస్యలకు వస్తుంటారు. కానీ, గత కొంతకాలంగా మానసిక సమస్యలతో వస్తున్న వారు ఎక్కువగా ఉంటుండడంతో ప్రభుత్వాస్పత్రుల్లో ఇటీవల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో గ్రామీణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు విస్తుపోయేలా ఉన్నాయి. రకరకాల మానసిక రుగ్మతలున్న వారు వేలాది మంది ఉన్నట్లు బయటపడింది. వీటిలో స్క్రీజోఫీనియా, డిప్రెషన్ (కుంగుబాటు), తనలో తాను మాట్లాడుకోవడం, ఎక్కువగా మాట్లాడడం, అకస్మాత్తుగా తీవ్రంగా స్పందించడం (మానిక్ డిజార్డర్స్) వంటి మానసిక రోగాలతో సతమతమవుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. రాష్ట్రంలో ఇలా బాధపడుతున్న వారిలో ప్రకాశం జిల్లా వాసులు అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానంలో అనంతపురం, నెల్లూరు, విశాఖ, ప.గోదావరి జిల్లాల పల్లెవాసులు ఉన్నారు. సగటున చూస్తే పురుషుల్లోనే ఈ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇదిలా ఉంటే.. వీరికి సరైన వైద్యం అందించేందుకు అవసరమైన క్లినికల్ సైకియాట్రిస్టులు రాష్ట్రంలో కరువయ్యారు. దేశవ్యాప్తంగా వీరు 5,500 మంది ఉంటే రాష్ట్రంలో కేవలం 150 మంది మాత్రమే ఉన్నారు. 2 దశాబ్దాల్లో పెనుమార్పులు కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడం, సామాజిక మాధ్యమాల వలలో పడిపోవడంవల్ల ఒంటరితనం బాగా పెరిగిపోతోంది. దీంతో మానసిక ఒత్తిడికి లోనై తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రెండు దశాబ్దాల కిందట ఈ పరిస్థితి లేదు. యువకుల్లో మద్యం, మత్తు మందు వినియోగం పెరగడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. దీనివల్ల బలవన్మరణాలు ఎక్కువవుతున్నాయి. మెంటల్ హెల్త్‌ను కాపాడుకోవాలంటే ప్రత్యేక యంత్రాంగాన్ని తయారు చేసుకోవాల్సి ఉంది. – డా. ఇండ్ల రామసుబ్బారెడ్డి, మానసిక వైద్య నిపుణులు, విజయవాడ తల్లిదండ్రుల తీరూ కారణమే తల్లిదండ్రుల పెంపకం కూడా సరిగ్గాలేక పెడదారి పడుతున్న వారూ ఉన్నారు. సెల్‌ఫోన్‌ను బాగా వాడే చిన్నారిని చూసి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. ఇది సరికాదు. పిల్లలు ఏ దారిలో వెళ్లాలో తల్లిదండ్రులే తికమక పెడుతున్నారు. చదువు నుంచి స్థిరపడే వరకూ ఇదే పరిస్థితి ఉంది. వీటన్నింటికీ మించి మన విద్యావిధానం వల్ల పిల్లలపై ఎంత ఒత్తిడి ఉందో అందరికీ తెలిసిందే. – డా. మురళీకృష్ణ, ప్రొఫెసర్ ఆఫ్ సైకియాట్రీ, గుంటూరు ప్రభుత్వాసుపత్రి ►ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన వెంకట సుబ్బయ్యకు 38 ఏళ్లు. ఓ కిరాణాషాపులో పనిచేస్తాడు. పిల్లల చదువులకు తన సంపాదన ఏమాత్రం సరిపోకపోవడంతో తీవ్రంగా మథనపడుతున్నాడు. ఒక్కోసారి తనలో తానే గొణుక్కోవడం, ఎవరితో మాట్లాడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుండడంతో కుటుంబ సభ్యులు అతన్ని దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఇదొక రకమైన మానసిక జబ్బు అని, దీనిని ప్రాథమిక దశలో గుర్తిస్తే మెరుగైన ఫలితం ఉండేదని డాక్టర్లు అభిప్రాయపడ్డారు. ►శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన 33 ఏళ్ల మనోహర్ ఇంట్లో ఎప్పుడెలా వ్యవహరిస్తాడో తెలీదు. ఒక్కోసారి బాగా ఉంటాడు. మరోసారి అకస్మాత్తుగా తీవ్రంగా స్పందిస్తాడు. ఇంట్లోని వారు అతన్ని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. కుటుంబ సమాచారం అంతా డాక్టర్ తెలుసుకుని మానసిక జబ్బుల్లో ఒకటైన స్క్రిజోఫీనియాతో రోగి బాధపడుతున్నాడని చెప్పారు. భార్యతో సరిగ్గా పొసగకపోవడం ప్రధాన కారణంగా ఆయన తేల్చారు. మానసిక రుగ్మతలకు వైద్యులు చెబుతున్న కారణాలు.. ►కుటుంబ వ్యవస్థ చిన్నదిగా మారడం.. చదువులు, ఉద్యోగాల పేరిట పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉండటం.. ►మద్యం వినియోగంతో పెరుగుతున్న సమస్యలు గ్రామాల్లో ఆరేళ్ల నుంచి 45 ఏళ్లలోపు వారిపై సామాజిక మాధ్యమాలు, మితిమీరిన సినిమాలు, టీవీల ప్రభావం ఎక్కువగా ఉండటం.. ఉద్యోగాల్లోనూ ఒత్తిడి కారణంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు.. విడిపోవడం కారణంగా మానసిక ఆందోళన పెరగడం.. ఈ ప్రభావం గ్రామాల్లో ఉండే తల్లిదండ్రులపై పడడం.. ఉద్యోగరీత్యా గ్రామీణ యువకులు విదేశాలకు వెళ్లడంవల్ల సొంతూళ్ల్లలోని తల్లిదండ్రుల్లో మానసిక ఆందోళన.. ఆధునిక జీవనశైలి కారణంగా యుక్త వయసులోనే మానసిక సమస్యలకు గురవడం.. -
మానసిక రుగ్మతల్లో.. ఆంధ్రప్రదేశ్ టాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మానసిక వ్యాధులతో బాధపడుతున్నవారి సంఖ్య ఏటా భారీగా పెరుగుతోంది. పట్టణాలకే పరిమితమైన మానసిక ఆందోళనలు, ఒత్తిళ్లు ఇప్పుడు పల్లెల్లోనూ కనిపిస్తున్నాయి. ఆర్థిక, సామాజిక, కుటుంబ కారణాలతో మానసిక రుగ్మతలతో బాధపడుతున్నవారి సంఖ్య భారీగా పెరుగుతున్నా అందుకు తగిన వైద్యం మాత్రం అందడం లేదు. తగిన సంఖ్యలో మానసిక వైద్య నిపుణులు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది బాధితులు ఆర్ఎంపీ డాక్టర్ల వద్దకు వెళుతుండటం.. వారు మోతాదుకు మించిన మందులు ఇస్తుండటంతో తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయి. ఏ ప్రభుత్వాస్పత్రిలోనూ సైకియాట్రీ నిపుణులు లేరు. అటు ప్రైవేటు రంగంలోనూ మానసిక వైద్య నిపుణులు తక్కువగానే ఉన్నారు. దీర్ఘకాలిక మానసిక సమస్యలకు సరైన వైద్యం లేకపోవడం, కౌన్సెలింగ్ ఇచ్చేవారు లేకపోవడంతో ఆత్మహత్యల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏపీలో 50 లక్షల మందికి పైగా బాధితులు దేశంలో మానసిక రుగ్మతలతో బాధపడే రోగులు ఎక్కువ సంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారని వైద్య నిపుణులు చెబుతుండటం అందరినీ కలవరపరుస్తోంది. ఏటా ప్రతి వేయి మందిలో 102 నుంచి 104 మంది కొత్త రోగులు ఏదో ఒక మానసిక సమస్యతో వైద్యుల వద్దకు వెళ్తున్నట్టు వివిధ సర్వేల్లో వెల్లడైంది. రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మందికి పైగానే మానసిక సమస్యలతో బాధపడుతున్నారని తేలింది. స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) దేశంలో మానసిక రుగ్మతల విషయంలో రాష్ట్రంలో ఆందోళన చెందే విధంగా పరిస్థితి ఉన్నట్టు వెల్లడించింది. ఆత్మహత్యలు చేసుకుంటున్నవారిలో 80 శాతం మందికి సరైన కౌన్సెలింగ్ లేకపోవడం, వారి మానసిక స్థితికి తగ్గట్టు సకాలంలో వైద్యం అందించలేకపోవడం వల్లే మృతి చెందుతున్నట్టు తేలింది. ఇలా మానసిక ఆందోళనకు గురవుతున్న వారి వయసు 16 నుంచి 44 ఏళ్ల మధ్య లోపే ఉండటం విస్మయం కలిగిస్తోందని గుంటూరుకు చెందిన ఓ మానసిక వైద్యుడు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మానసిక వ్యాధులకు సంబంధించి విశాఖపట్నంలో మాత్రమే ప్రభుత్వ మానసిక చికిత్సాలయం ఉంది. గతేడాది అక్కడ కొత్తగా నమోదైన ఔట్పేషెంట్ల సంఖ్య 49 వేలకు పైగా ఉందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అంచనా వేయొచ్చు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ ఏర్పాటు ఎక్కడ? 2017లో కేంద్ర ప్రభుత్వం ‘మెంటల్ హెల్త్ యాక్ట్’ చట్టాన్ని రూపొందించింది. దీన్ని అన్ని రాష్ట్రాలు విధిగా అమలు చేయాలని చెప్పింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాలకు నిధులు కూడా మంజూరు చేసింది. ప్రతి జిల్లాలో మానసిక వైద్యుడు, మనస్తత్వ నిపుణులతోపాటు ప్రత్యేక సిబ్బందిని నియమించి పేషెంట్ల రిజిస్ట్రీని నమోదు చేయాలని సూచించింది. మానసిక రోగులకు గుర్తింపు లేని వైద్యులు ఎవరైనా వైద్యం చేసినట్టు ఫిర్యాదులొస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దీనికి ప్రత్యేక కమిటీని నియమించాలని ఆదేశించింది. మానసిక రోగుల పట్ల వివక్ష చూపించకూడదని, వారికి తక్షణమే వైద్యసేవలు అందించాలని, చికిత్సా విధానాలు సంబంధిత అథారిటీకి చెప్పాలని కూడా తెలిపింది. దీనికోసం విశాఖపట్నంలో రూ.30 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ ఏర్పాటు చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఏర్పాటు చేయలేదు. కేంద్రం పలుసార్లు సూచించినా మానసిక వైద్యానికి ఎలాంటి మార్గదర్శకాలూ రూపొందించకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. మానసిక రుగ్మతల లక్షణాలివే.. - ఎదుటివారితో పోల్చుకుంటూ వారికంటే తక్కువగా ఉన్నామని బాధపడటం - ఆర్థిక, కుటుంబ కారణాలతో తీవ్ర మానసిక ఆందోళనకు గురవడం - తనకేమైనా ఆపద వస్తుందేమోనని ముందుగానే భయపడి ఒత్తిడికి గురవడం - ప్రతి చిన్న విషయానికి ఆందోళనకు లోనవడం - జనంలో ఇమడలేక, ఒంటరిగా ఉండలేక ఒత్తిడికి గురవడం - చదువులతో ఒత్తిడికి గురై విద్యార్థులు మానసిక ఆందోళనతో ఉండటం - జీవితంలో అనుకున్నంతగా ఎదగలేకపోతున్నామని ఆందోళనకు గురవడం త్వరలోనే మార్గదర్శకాలు ఇప్పటికే కేంద్రం నుంచి మార్గదర్శకాలు వచ్చాయి. వాటిని త్వరలోనే అమలు చేస్తాం. వీటికి అనుగుణంగా వైద్యం అందిస్తాం. రాష్ట్రంలో మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న మాట వాస్తవమే. –డా.కె.బాబ్జీ, వైద్యవిద్యా సంచాలకులు -
వారసత్వంగా సంక్రమించే మానసిక వ్యాధులు
సాక్షి,న్యూఢిల్లీ: శారీరక అనారోగ్యాలు, వ్యాధులూ జన్యుకారకమని నిర్ధారణ అయినా చివరికి మానసిక అస్వస్థతలు సైతం ఒక తరం నుంచి మరొక తరానికి సంక్రమిస్తాయని తాజా అథ్యయనం వెల్లడించింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఫిన్లాండ్ నుంచి ఖాళీ చేసిన అప్పటి పిల్లల సంతానం ముఖ్యంగా కుమార్తెలు వారి తల్లులు అనుభవించిన మానసిక అలజడులు, వ్యాధులను ఎదుర్కొంటున్నట్టు ఈ అథ్యయనం పేర్కొంది. అప్పటి భయానక వాతావరణం ప్రస్తుతం లేకున్నా వారు మానసిక వ్యాధుల బారిన పడటానికి జన్యుపరమైన అంశాలే కారణమని తేలింది. తరాల తరబడి మానసిక అస్వస్థతల రిస్క్ ఎందుకు పొంచిఉంటుందనే దానిపై స్వీడన్‌కు చెందిన ఉపసల యూనివర్సిటీ, ఫిన్లాండ్లోని హెల్సింకి వర్సిటీ పరిశోధకులు నిగ్గుతేల్చే పనిలో పడ్డారు.స్ర్తీలు గర్భవతులుగా ఉన్న సమయంలో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటే వారి సంతానంపై అవి ప్రతికూల ప్రబావం చూపుతాయని అమెరికాకు చెందిన ప్రొఫెసర్ స్టీఫెన్ గిల్మన్ చెప్పారు. యుద్ధ సమయంలో కుటుంబ సభ్యుల నుంచి విడిపోయిన తల్లుల సంతానం ముఖ్యంగా కుమార్తెల ఆరోగ్యంపై దీర్ఘకాలం ప్రభావం చూపుతుందని తమ అథ్యయనంలో వెల్లడైందని జామా సైకియాట్రీ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అథ్యయనం పేర్కొంది. -
ఆ పోస్టులు వ్యాధులను తెలుపుతాయి!
లండన్: ఫేస్బుక్లో మనం పెట్టే స్టేటస్, కొట్టే లైకులు, ఫొటోలు మానసిక వ్యాధులను కనుగొనడంలో సాయపడే అవకాశం ఉందట. సామాజిక అనుసంధాన వెబ్సైట్లను ఉపయోగించేవారిపై చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. దీని ద్వారా మనం డిప్రెషన్, స్క్రీజోఫ్రేనియా వంటి మానసిక వ్యాధుల గురించి తెలుసుకోవచ్చు. ఫేస్బుక్ ద్వారా తెలిసిన సమాచారం.. ఆ వ్యక్తి ప్రవర్తన ద్వారా తెలుసుకున్న సమాచారం కంటే మరింత వాస్తవికంగా ఉందన్నారు. అంతేకాకుండా వ్యకిగతంగా ప్రశ్నలు అడిగినప్పుడు సరైన సమాచారం రాబట్టడం, అతని ప్రవర్తనను అంచనా వేయడం కొంచెం కష్టమేనని తెలిపారు. సోషల్ మీడియాలో వారు వాడిన పదజాలం, వెల్లడించిన భావోద్వేగాలు, లేవనెత్తిన అంశాల ద్వారా మరిన్ని అంశాలను తెలుసుకోవచ్చు. ఫేస్బుక్లో రోజుకు 35 కోట్ల ఫొటోలు అప్లోడ్ అవుతున్నాయని, ముఖకవళికలను గమనించే యాంత్రిక చిత్రాల విశ్లేషణ ఈ ప్రక్రియను మరింత సులభతరం చేస్తుందన్నారు. -
మానసిక రుగ్మతలు అందుకేనట!
వాషింగ్టన్: నగర జీవనానికి అలవాటుపడిన మనిషి ప్రకృతిని ఆస్వాదించడం దాదాపు మరచాడనే చెప్పాలి. అయితే ప్రకృతిలోని పచ్చదనం, తాజా గాలి దొరక్కపోవటంతో నగరవాసులు తీవ్రమైన మానసిక వ్యాధుల బారిన పడుతున్నాడని తాజా అధ్యయనంలో తేలింది. సహజ వాతావరణానికి దూరమౌతున్న కొద్దీ.. మానసిక వ్యాదులు పెరుగుతున్నాయని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధనకు సంబంధించిన ఫలితాలను 'జర్నల్ సైన్స్'లో ప్రచురించారు. మానసికపరమైన రుగ్మతలు, ఒత్తిడిని తగ్గించుకోవాలంటే నగరవాసికి సహజ వాతావరణం కావాల్సిందేనని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ పీటర్ ఖాన్ తెలిపారు. ముఖ్యంగా పట్టణాల్లో విస్తరించిన పరిశ్రమలు ప్రజలకు సహజ వాతావరణాన్ని దూరం చేస్తున్నాయని తెలిపారు. మానసిక రుగ్మతల నుంచి దూరంగా ఉండాలంటే పట్టణవాసులు తమ రోజువారి జీవితంలో కాస్తయినా సహజ వాతావరణంలోకి వెళ్లాల్సిందే అని పరిశోధకులు తెలిపారు. -
'దేశంలో 5 కోట్ల మంది మానసిక రోగులు'
మన దేశంలో దాదాపు 5 కోట్ల మంది డిప్రెషన్, యాంగ్జయిటీ లాంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. గత సంవత్సరం ఏడు వేల మందికి పైగా ఇలాంటి సమస్యలతోనే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. 2005లో అయితే కోటి - రెండు కోట్ల మంది మాత్రమే స్కిజోఫ్రేనియా, బైపోలార్ డిజార్డర్ లాంటి మానసిక సమస్యలతో బాధపడేవారని జాతీయ మాక్రో ఎకనమిక్స్ కమిషన్ తెలిపింది. ఈ విషయాలను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నద్దా లోక్‌సభకు తెలిపారు. మానసిక సమస్యలతో ఆత్మహత్యలు చేసుకున్నవాళ్లు 2012లో 7,769 మంది, 2013లో 8,006 మంది, 2014లో 7,104 మంది ఉన్నారు. దేశంలో మొత్తం 3,800 మంది సైకియాట్రిస్టులు, 898 మంది క్లినికల్ సైకాలజిస్టులు, 850 మంది సైకియాట్రిక్ సోషల్ వర్కర్లు, 1,500 మంది సైకియాట్రిక్ నర్సులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే 3 ఆరోగ్య సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వరంలో నడిచేవి 40 ఆస్పత్రులు, వివిధ వైద్యకళాశాలల్లో 398 మానసిక వైద్య విభాగాలు ఉన్నాయి. వీటన్నింటిలో మానసిక రోగులకు చికిత్సలు అందిస్తున్నారు.