మతి చెడగొడుతున్న సెల్‌ఫోన్‌ | Doctor KV Kishore Kumar Praises Andhra Pradesh Home Again Program | Sakshi
Sakshi News home page

మతి చెడగొడుతున్న సెల్‌ఫోన్‌

Published Fri, Mar 19 2021 5:43 PM | Last Updated on Fri, Mar 19 2021 7:07 PM

Doctor KV Kishore Kumar Praises Andhra Pradesh Home Again Program - Sakshi

సాక్షి, అమరావతి: ‘‘దేశవ్యాప్తంగా మానసిక జబ్బుల తీవ్రత పెరుగుతోంది. ఇది వర్తమానానికే కాదు భవిష్యత్‌కూ పెద్ద ప్రమాదమే. సెల్‌ఫోన్‌ పుణ్యమా అని మెదడు ఉచ్చులో ఇరుక్కుంది. సెల్‌ఫోన్‌లో ఏది కనిపిస్తోందో అదే నిజమనుకుంటున్నారు. దీంతో యువత ఆలోచనలు ఎదగకుండా ఆగిపోతున్నాయి. ఎప్పుడైతే భవిష్యత్‌ ఆగిపోయిందని తెలుసుకున్నారో.. అక్కడ్నుంచే మానసిక ఆందోళనలు మొదలవుతున్నాయి. ఇవి క్రమంగా మానసిక జబ్బులుగా మారి జీవితాన్ని కుచించుకుపోయేలా చేస్తున్నాయి’’ అని అంటున్నారు.. ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, నిమ్‌హాన్స్‌ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌–బెంగళూరు) మాజీ ప్రొఫెసర్, కేంద్ర ప్రభుత్వంలో పాతికేళ్లపాటు మానసిక జబ్బులపై సేవలందించిన డా.కె.వి.కిషోర్‌ కుమార్‌. విజయవాడ వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..

మానసిక జబ్బులకు కారణాలనేకం.. 
15 నుంచి 45 ఏళ్లలోపు వారు ఎక్కువగా మానసిక జబ్బుల బారిన పడుతున్నారు. వంశపారంపర్యం, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, మద్యం అలవాటే వీటికి కారణం. ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తిస్తే 90 శాతం మందిని సాధారణ స్థితికి తేవచ్చు. ఉమ్మడి కుటుంబాలన్నీ చిన్న కుటుంబాలుగా మారి మానసిక ప్రగతికి బ్రేకులు వేశాయి. చిన్న కుటుంబాల్లో పిల్లలకు తల్లిదండ్రులు ప్రేరణ కావడం లేదు. తోటి స్నేహితులే ప్రేరణగా నిలుస్తున్నారు. వారు మంచివారైతే వీరూ మంచివారవుతున్నారు.. లేదంటే చెడిపోతున్నారు.

ఏటా లక్షల్లో పెరుగుతున్నారు.. 
ప్రపంచవ్యాప్తంగా వ్యాధులకు చేస్తున్న వ్యయంలో 12.5 శాతం మానసిక జబ్బులకే అవుతోంది. మన దేశంలో మానసిక రోగుల కోసం 20 వేల పడకలుంటే.. అందులో 5 వేల మంది పాతికేళ్ల నుంచి అక్కడే ఉంటున్నారు. ఏటా లక్షల్లో రోగులు పెరుగుతున్నారు. చిన్నతనం నుంచే పిల్లల పెరుగుదల, పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రవర్తన, వాతావరణం ఇవన్నీ కీలకం. నాలుగేళ్ల వయసులోనే సెల్‌ఫోన్‌ వాడకం గురించి తెలుసుకున్న పిల్లలను చూసి తల్లిదండ్రులు.. మా పిల్లలు చాలా గొప్ప అనుకుంటే ఎవరూ ఏమీ చేయలేరు.

సెల్‌ఫోన్ల బారిన 25 ఏళ్ల లోపు యువత
వయసు, మనసు, కెరీర్‌పరంగా ఎదిగే క్రమంలో సరిగ్గా 25 ఏళ్లలోపు యువతను సెల్‌ఫోన్లు నాశనం చేస్తున్నాయి. వారి విలువైన సమయాన్ని హరిస్తున్నాయి. ఆలోచించే సమయాన్ని లాగేసుకుంటున్నాయి. చాలా జాగ్రత్తగా ఉంటే తప్ప వీటి నుంచి బయటపడటం కష్టం. దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా 13.5 శాతం మంది వివిధ మానసిక జబ్బులతో బాధపడుతున్నారు. వీరిలో వెయ్యికి 10 మంది తీవ్ర మానసిక జబ్బులతో కుంగిపోతున్నారు. దీంతో ఒక్కో రోగి వల్ల వారింట్లో నలుగురు ఇబ్బంది పడాల్సి వస్తోంది. 

ఏ రాష్ట్రంలోనూ ఇంత గొప్పగా లేదు
మానసిక జబ్బులతో బాధపడుతూ ఇంట్లో లేకుండా ఆస్పత్రుల్లోనూ, వీధుల్లోనూ ఉంటున్న చాలామందికి చికిత్స చేసి తిరిగి ఇంటికి తేవడమే.. హోం అగైన్‌. దీనికోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత గొప్పగా మానసిక వ్యాధుల నియంత్రణకు కృషి చేస్తున్నారు. ఈ క్రతువులో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నేను కూడా బనియాన్‌ ఎన్జీవో సంస్థ ద్వారా కృషి చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఆస్పత్రుల నెట్‌వర్క్‌ చాలా బాగుంది. ఐదేళ్లు కష్టపడితే రాష్ట్రంలో 90 శాతం వ్యాధులను నియంత్రించొచ్చు. దీనివల్ల ఆర్థిక భారమూ తగ్గుతుంది.

చదవండి:
టీచర్‌ అవతారమెత్తిన కలెక్టర్‌ నివాస్‌

చిన్నారులను చెరబట్టాడు.. కోరిక తీర్చుకుని..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement