ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఓ భక్తుడు నిబంధనలను అతిక్రమించి సెల్‌ఫోన్‌తో దుర్గగుడిలోకి ప్రవేశించాడు. అమ్మవారిని ఫొటో తీసేందుకు ప్రయతి్నంచాడు. దీనిని గుర్తించిన ఆలయ అధికారులు ఆ భక్తుడి నుంచి సెల్‌ఫోన్ లాక్కుని హుండీలో వేసిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వారం క్రితం కూడా ఓ భక్తుడు అమ్మవారి మూలవిరాట్‌ను సెల్ ఫోన్‌తో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన సంగతి విదితమే.
ఆదివారం నుంచి భక్తులు ఎవరూ సెల్‌ఫోన్‌తో ఆలయంలోకి ప్రవేశించకుండా ఆలయ అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోని మైక్ ప్రచార కేంద్రం నుంచి పదే పదే సెల్‌ఫోన్లతో ఆలయంలోకి ప్రవేశించవద్దని సూచనలు చేస్తూనే ఉన్నారు. అయితే సోమవారం రాత్రి ఓ భక్తుడు తన ఖరీదైన సెల్‌ఫోన్‌తో ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారిని ఫొటో తీసేందుకు ప్రయతి్నంచాడు.
ఇంతలో అక్కడే ఉన్న సెక్యూరిటీ, ఆలయ సిబ్బంది వెంటనే గమనించి కేకలు వేయడంతో ఆ భక్తుడు సెల్‌ఫోన్ తీసుకుని రావిచెట్టు వైపు పరుగు తీశాడు. ఆ భక్తుడికి పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది విషయాన్ని ఆలయ ఈఓ రామరావు దృష్టికి తీసుకెళ్లారు. ఈఓ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఆ భక్తుడి నుంచి సెల్‌ఫోన్ తీసుకుని ఆలయంలో ఉన్న హుండీలో వేశారు. హుండీ కానుకల లెక్కింపు సమయంలో సెల్‌ఫోన్‌ను బయటకు తీస్తారని, అప్పుడు దానిని ఏమి చేయాలో ఆలోచిస్తామని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment